విశ్వాసులలో ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న మాట "దేవుని చిత్తము", మరీ దేవుని చిత్తము అంటే ఏమిటి? దాన్ని ఎలా తెలుసుకోవాలి? చిత్తము అనగా మనసు. అంటే దేవుని మనసు ఎరిగి నడచుకోవమే అయన చిత్తము నెరవేర్చటం. దేవుని మనసు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యంలో తెలుస్తుంది. అంటే వాక్యానుసారముగా జీవించటమే దేవుని చిత్తానుసారముగా జీవించటం. దేవుని చిత్తముకు లొంగిపోవటం, అయన చిత్తముకై నిరీక్షించటం, అయన చిత్తమును జరిగించటం దేవుని వారలుగా చెప్పబడుతున్న మననుండి దేవుడు ఎదురు చూస్తున్న లక్షణాలు. అటువంటి లక్షణాలు నిజంగా మనం పాటిస్తున్నామా? మనకు కష్టం కలిగించేది అయినా, నష్టం కలిగించేది అయినా దేవుని వాక్యానుసారం కానిదయితే దాన్ని చేయక పోవటమే దేవుని చిత్తము నేరవేర్చటం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితానికి మేలయినది ఎన్నుకోవటమే దేవుని చిత్తమును జరిగించే ప్రయత్నం చేయటం. దేవుడు మనతో సహవాసం చెయ్యాలని మనలను ఏర్పరచుకున్నాడు, కానీ మనకు తగినంత స్వేచ్ఛను ఇచ్చాడు, తనవలే మనం కూడా పరిశుద్ధముగా ఉండాలని తన ఆజ్ఞలను మనకు అనుగ్రహించాడు. అయన ఆజ్ఞలను పాటించటమే అయన చిత్తమును నెరవేర్చటం.
అందుకే యేసయ్య అంటాడు "తనను వెంబడించేవారు, తమను తాము తగ్గించుకొని తమ సిలువను ఎత్తుకొని సాగాలని". అనగా మన శరీరానుసారంగా బ్రతకటం మానేసి ప్రతి విషయంలో తగ్గించుకొని అయన వాక్యమును నెరవేర్చటమే అయన చిత్తము. సొంత చిత్తమును చంపేయటం, అన్ని వేళలో ప్రభువు చిత్తమును నెరవేర్చటం. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, మనలను కూడా తన స్వరూపంలో చేశాడు, కానీ మనం మన సొంత స్వభావాలు ఏర్పర్చుకుంటున్నాం, అది దేవుని చిత్తము కాదు.
రోమీయులకు 12: "1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి."
అపొస్తలుడయిన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12 వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడో! పరిశుద్ధముగా సజీవయాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి, అనగా శరీర ఆశలను వదులుకొని, అది కోపమయిన, ద్వేషమయిన, విసుగయినా, అసూయా అయినా ఇతరులను బాధించే ఒక్క పొల్లు మాటయినా పలుకక కేవలం దేవుని వాక్యానుసారంగా జీవించటం. లోకములో ఉన్న మర్యాదలు దేవుని వాక్యానుసారం కానివి ఎన్నో ఉన్నాయి, వాటిని పాటించక కేవలం దేవుని వాక్యానుసారముగా జీవించటం వలన మన మనసు నూతన పరచబడి అయన చిత్తమేదో మనకు తెలుస్తుంది. అనగా దేవునికి ఇష్టమయిన పనులనే మనం చేస్తాము, తద్వారా అయన చిత్తమును నెరవేర్చు వారాలుగా ఉంటాము.
సామెతలు 3: "5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము 6. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును."
ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన సొంత తెలివిని బట్టి కాకుండా దేవుని వాక్యానుసారముగా నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా మన ప్రవర్తన అంతటియందు దేవుని అధికారమును ఒప్పోకోవటమే, అప్పుడు దేవుడు మన త్రోవలను సరాళము చేస్తాడు. నువ్వు నష్టం అనుకున్నది, నీకు మేలుగా చేయగల సమర్థుడు మన దేవుడు. కనుక దేవుని చిత్తము అన్ని సమయములలో ఉన్నతమయినది. దావీదు దేవుని మనసును ఎరిగిన వాడని ఎందుకు పిలవబడ్డాడు? తనను చంపాలని వెంబడించిన సౌలు విషయంలో దావీదు ప్రవర్తనను తెలుసుకోవటానికి ఒక సంఘటన చూద్దాం.
సమూయేలు 24: "4. దావీదు జనులు అదిగోనీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతు నని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను. 5. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి 6. ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. 7. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను."
ఇక్కడ దావీదు జనము "దేవుడు సౌలును నీకు అప్పగించినాడు కనుక వెళ్ళి అతణ్ణి చంపుమని చెప్పుతున్నారు". కానీ దావీదు వారి మాటలు వినకుండా కేవలం అతని పై వస్త్రము నుండి కొంత పీలికను కోసివేసాడు. తర్వాత దానికి కూడా ఎంతగానో నొచ్చుకున్నాడు, దేవుని చేత అభిషేకించిన అతణ్ణి చంపటానికి వీలు లేదని తన జనమును అడ్డుకున్నాడు. దేవుని అధికారమును ఒప్పుకోవటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? పాపమూ పట్ల ఇంత సున్నితమయిన మనసు మనకు ఉందా? సర్వము అయన సమయములో జరిగిస్తాడని తన వాక్యానుసారముగా జీవించటమే దేవుని చిత్తము నెరవేర్చటము.
ఎల్ల వేళలా దేవుణ్ణి ఆనందింప చేయటమే దేవుని చిత్తమును నెరవేర్చటము. మానవ శరీరంలో ఉన్న దేవుని తనయుడు యేసు క్రీస్తు సిలువ శ్రమలకు ముందు "తండ్రి, నీ చిత్తమయితే ఈ గిన్నెను నా నుండి తొలగించుమని" ప్రార్థించాడు. కానీ చివరకు తండ్రి చిత్తముకు లొంగి ఘోరమయిన సిలువ మరణము పొందాడు. దేవుని శక్తితో మరణము గెలిచి లేచాడు. అందువల్లనే మనకు ఇప్పుడు పాపక్షమాపణ, నరకము నుండి విమోచన. దేవుని చిత్తము నెరవేర్చటం అంటే పూర్తిగా అయన మీద ఆధారపడటం.
దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో సంబంధం ఎలా పెంచుకోవాలి? రెండు విధములుగా మనం ఆయనతో సంబంధం పెంచుకోవాలి. ప్రార్థన మరియు అయన వాక్యమును ధ్యానించటం. ఈ రెండిటిని తూచా తప్పకుండా పాటిస్తే అయన చిత్తము ఏమిటో మనకు నిత్యమూ బయలుపడుతుంది. పైన చెప్పుకున్నట్లు నిత్యమూ మన మనసులు నూతన పరచబడి అయన జ్ఞానము మనకు అనుగ్రహింపబడి ఆయనను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకుంటాము. అవసరం అయినప్పుడు మాత్రమే ప్రార్థిస్తాను, పనిపడ్డప్పుడే పవిత్రంగా ఉంటాను మిగతా సమయం నా ఇష్టానుసారంగా ఉంటాను అంటే అయన చిత్తము తెలియదు. కేవలం మన ఘనత కోసం, లోకపరమయిన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాము. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి