క్రైస్తవులు జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్. అనగా క్రైస్తవులకు ఆరాద్యుడయినా యేసయ్య ఈ లోకంలో పుట్టిన దినముగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ గురించి అనగా యేసయ్య పుట్టుకను గురించి బైబిల్ ఆధారముగా లోతుగా తెలుసుకుందాం. దేవుడు సర్వ సృష్టిని తన నోటి మాట చేత సృష్టించాడు అని పరిశుద్ధగ్రంథం బైబిల్ మనకు బోధిస్తోంది. బైబిల్ లో మొదటి గ్రంథమయిన ఆదికాండములో క్రింది వచనములు చూడండి.
ఆదికాండము 1: "1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ......."
మొదటి వచనములో "దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను" అని ఉంది. రెండవ వచనమునకు వచ్చేసరికి "భూమి నిరాకారముగా ఉండెను" అని ఉంది! దేవుడు సృషించిన దానికి ఆకారము లేకుండా ఉంటుందా? అంటే మొదటి వచనమునకు మరియు రెండవ వచనమునకు మధ్యలో ఎదో జరిగింది. యేసు క్రీస్తును గురించి ప్రవచించిన యెషయా ప్రవక్త గ్రంథమును చూస్తే విషయం మనకు అవగతమవుతుంది.
యెషయా 45: "18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను......."
పై వచనంలో చూస్తే దేవుడు దేనిని నిరాకారముగా చెయ్యడు. అయితే నివాసయోగ్యముగా ఉన్న భూమి మరీ నిరాకారముగా ఎలా మారింది? క్రింది వచనములు చూడండి, దేవుడి సృష్టి నశించి పోవటం కనబడుతుంది.
యెషయా 14: "12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? 13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును 14. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?"
దేవుడు సృష్టించి అధికారం ఇచ్చిన ప్రధాన దూత దేవుడి అధికారమునకు ఒప్పుకొనక అనగా అయన ఆజ్ఞలను అతిక్రమమించి, ఆయననే మించి పోవాలని గర్వపడిన వానిని మరియు వాని అనుచరులను దేవుడు పాతాళమునకు అనగా నరకమునకు అణగదొక్కాడు. అటువంటి వాడు దేవుని సృష్టిని నశింపజేశాడు, అంతే కాకుండా దేవుడు ప్రేమించి సృష్టించిన మానవాళిని ఆయనకు వ్యతిరేకంగా, అనగా ఆజ్ఞలను దిక్కరించేలా చేయటం, నిత్యమూ అపవిత్రపు తలంపులతో దేవునికి దూరంగా ఉంచటమె ఆ సాతాను పని. (ఈ సాతాను గురించి మరిన్ని వివరాలకు యెహెజ్కేలు 28:13-15 లో చదవవచ్చు) నిజానికి దేవుని ఉద్దేశ్యంలో మనం ఎల్లప్పుడూ ఏదెను వనములో ఆయనతో సహవాసం చేయాలనీ.
కానీ ఈ సాతాను మొదటి మానవులయిన ఆదాము, అవ్వలను శోధించి దేవుని ఆజ్ఞలను దిక్కరింపజేసాడు. వారిని తనవలె పాపులుగా మార్చి ఏదెను వనమునకు అనగా దేవుని సన్నిధికి దూరం చేసాడు. సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన శక్తి మంతుడయినా దేవుడు, మనుష్యులను మాత్రం తన స్వరూపంలో చేయడానికి మట్టిని పోగెసి ఎంతగానో శ్రమించి చేతితో మనలను నిర్మించి, తన ఊపిరిని ఊదాడు. అటువంటి మనుష్యులను దేవుడు ఎందుకు ఏదెను వనము నుండి ఆదాము, అవ్వను ఎందుకు వెళ్ళ గొట్టాడు?
యాకోబు 4: "17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును."
1 యోహాను 3: "4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము."
పై రెండు వచనములు పాపమూ యొక్క నిర్వచనమును సూచిస్తున్నాయి. ఆదాము, అవ్వలు దేవుడు తినవద్దని చెప్పిన చెట్టు యొక్క ఫలములు తిని ఆయన ఆజ్ఞను ధిక్కరించారు. కనుకనే పాపం చేసిన వారిగా మారిపోయారు. ఎందుకు ఆ చెట్టును పెట్టాడు దేవుడు? వారు పాపంలో పడిపోవాలనా? స్వేచ్ఛగా ఉంటూ తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వారినే దేవుడు కోరుకున్నాడు. అంటే సొంత చిత్తమును మానుకొని దేవునికి లోబడి అయన మీద ప్రేమను చూపించటం. ఆదాము, అవ్వల విషయంలో చెట్టు ఫలములు తినే అవకాశం ఉన్న కూడా తినకుండా ఉండగలగటం, కానీ వారు దేవుడు చెప్పిన మాటలు నమ్మకుండా సాతానుకు లోబడి చెట్టు ఫలములు తిన్నారు. ఆజ్ఞ అతిక్రమము ద్వారా దేవుని మహిమను కోల్పోయారు. అందువలన ఆయన సన్నిధికి దూరం చేయబడ్డారు. తద్వారా పాపం వలన వచ్చే జీతము మరణమునకు పాత్రులుగా మారిపోయారు. మరణము తర్వాత ఏమి జరుగుతుంది?
ప్రసంగి 12: "7. మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును."
మత్తయి 10: "28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి."
పై రెండు వచనములను బట్టి మరణము తర్వాత మంటితో చేసిన శరీరము మన్నుగా మారిపోతుంది. మరణము లేని ఆత్మ తీర్పుకు లోనవుతుంది. మనం చేసిన పాపములను బట్టి దేవుడు శిక్షావిధిని అమలు చేస్తాడు. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిన వచనము చూడండి! "ఆత్మను కూడా నరకములో నశింపజేయు వానికి భయపడుడి" అని హెచ్చరిస్తున్నాడు. అదే విధముగా సాతాను గురించి యెషయా ప్రవక్త చెప్పిన వచనములో "తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?" (యెషయా 14:17) వారి నివాస స్థలము ఏమిటీ? దేవుని సన్నిధి అనగా పరలోకము. దేవుని బిడ్డలను అనగా మనుష్యులను పాపమునకు బానిసలుగా చేసి అపవిత్రపు స్థితిలో ఉంచుతూ దేవుని సన్నిదికి దూరం చేస్తూ ఉన్నాడు.
ఇంత చేస్తుంటే దేవుడు ఈ సాతానును నశింప చేయవచ్చు కదా? ఏదెను వనములో చెట్టు ఉన్నట్లే ఇప్పుడు సాతాను చూపించే లోక ఆశలు, ఆకర్షణలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అనగా అయన వాక్యానుసారముగా జీవించటమె మనం చేయవలసిన పని. అటుపై మరణం తరువాత నశించని ఆత్మ అయన తీర్పు చొప్పున పరలోకం అనగా అయన సన్నిధి చేరుకుంటుంది. పాటించని వారు నరకము చేరుకుంటారు. యేసయ్య చెప్పిన బోధనల ప్రకారం "అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏడుపు మరియు పండ్లు కొరుకుడు ఉంటాయి". యుగయుగములు ఆ నిత్య నరకాగ్నిలో బలి కావాల్సి ఉంటుంది.
ఆదాము అవ్వల నుండి వచ్చిన మానవులుగా మనం కూడా పాపమూ నిండిన శరీరులుగా ఉన్నాము. కనుకనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్దాత్మ ప్రేరణతో ఇలా రాసారు:
రోమీయులకు 3: "23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు."
ఏ భేదము లేదు ప్రతి వాడు పాపమూ చేసి దేవుడు ఇచ్చు మహిమను మరియు పవిత్రతను కోల్పోతున్నారు. మనలో జన్మతః పాపమూ, మరియు కర్మతః పాపమూ ఉంటున్నాయి. దావీదు రాసిన కీర్తనలో ఇదే విషయమును వివరించాడు.
కీర్తనల గ్రంథము 51: "5. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను."
తల్లి గర్భమునుండే మనలను పాపం అంటిపెట్టుకొని ఉంది. అంటువంటి మనుష్యులను దేవుడు విడనాడి నాడా? ఆదాము అవ్వలను ఏదెను వనములో నుండి వెళ్లగొట్టె ముందు జంతువులను చంపి వాటి చర్మముతో వారికి వస్త్రములను చేసాడు. వారిని నిత్యమూ రక్షిస్తూ, ఫలించుమని ఇచ్చిన దీవెనలు నెరవేర్చాడు. మనసాక్షి ద్వారా తప్పొప్పుల విచక్షణను ఏర్పరచి తనకు దగ్గరగా నడవటానికి అవకాశం ఇచ్చాడు. అంతే కాకుండా ప్రత్యక్షంగా మంచి చెడ్డలు బోధించాడు.
ఆదికాండము 4: "6. యెహోవా కయీనుతోనీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి? 7. నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను."
తరువాత పది ఆజ్ఞలు లేదా ధర్మ శాస్త్రమును ఇచ్చి తన మార్గములో నడిచే లాగున కట్టడలు చేసాడు. అయినప్పటికి మనుష్యులు అయన ఆజ్ఞలను ధిక్కరిస్తూ పాపములో పడి నశించిపోతుంటే, దేవుడు కొన్ని నిబంధనలు ఏర్పరచాడు. తద్వారా వారి పాపములకై చేసే ప్రాయశ్చిత్తము ద్వారా క్షమాపణ పొందే మార్గము చూపించాడు. దేవుడు చేసిన నిబంధనలు ఏమిటి? ఆ నిబంధనలు ఉన్నపుడు యేసయ్య ఎందుకు ఈ భూమి మీద పుట్టాడు? వచ్చే భాగంలో దేవుని చిత్తను సారముగా తెలుసుకుందాం. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!
రెండవ భాగము కోసం ఇక్కడ నొక్కండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి