పేజీలు

3, మార్చి 2024, ఆదివారం

దేవుని గద్దింపు!



దేవుడు మొదటి మానవులయిన ఆదాము, హవ్వలను తన స్వరూపములో చేసి, వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పటికి సంపూర్ణ స్వేచ్ఛను వారికి ఇచ్చాడు. అనగా వారి ఆలోచనలు వారికి ఉన్నాయి, తమ ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు. ఏదెను వనములో దేవుడు జ్ఞానము ఇచ్చే చెట్టు ఫలమును తినవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారు సాతాను మాటలు నమ్మి, దేవుని మాటలు పెడ చెవిన పెట్టి ఆ పండును తిన్నారు. ఇదంత వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండటం వలన జరిగింది. దేవుడు ఎందుకు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. మనం ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించటానికే! అదెలా అంటారా? ఉదాహరణకు ఒక్క సైంటిస్ట్ కు ఒక కొడుకు ఉన్నాడు, వాడికి ఎన్ని సార్లు చెప్పిన అల్లరి పనులు మానటం లేదు. బుద్ది చెప్పిన ప్రతిసారి తండ్రి మీద కోపం పెంచుకొని అతన్ని ద్వేషించటం మొదలు పెట్టాడు. 

ఆ పిల్లాడికి మాదిరి కరంగా ఉండాలని ఒక రోబో బొమ్మను తయారు చేశాడు అ సైంటిస్ట్. ఈ రోబో బొమ్మను అతను ఎలా తయారు చేసాడంటే, ఎప్పుడు కూడా అల్లరి చేయకుండా, చెప్పిన మాట వింటూ, ఐ లవ్ యు డాడీ అని చెప్పటమే ఆ రోబో యొక్క పని. దాన్ని చూసి కూడా వాడిలో ఏ మార్పు కలుగ లేదు. అయితే ఒక్క రోజు ఆ పిల్లాడికి ఒక సమస్య వచ్చింది, సహాయం కోసం తండ్రి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నడు. తండ్రి వాడిని ప్రేమతో దగ్గరకు తీసుకోని ఓదార్చి, వాడి సమస్యను తీర్చాడు. తండ్రి ప్రేమను గుర్తించిన అ పిల్లాడు ఒక్కసారిగా కరిగిపోయి ఐ లవ్ యు డాడి అని తన తండ్రిని హత్తుకున్నాడు. తండ్రి మనసు సంతోషంతో ఉప్పొంగి పోయింది! రోబో కూడా రోజు ఐ లవ్ యు డాడి అని చెపుతుంది! చెప్పిన మాట కూడా వింటుంది. కానీ పిల్లాడు ఐ లవ్ యూ చెప్పినప్పుడే ఎందుకు ఆనందించాడు తండ్రి?

రోబోకు స్వేచ్ఛ లేదు, సొంత ఆలోచన లేదు, ఎప్పుడు ఐ లవ్ యు చెప్పేలాగా తయారు చేయబడింది. కూమారునికి  మాత్రం సంపూర్ణ స్వేచ్ఛ ఉంది, సొంత ఆలోచనలున్నాయి. ఆ పిల్లాడు తండ్రి మాటను వినకుండా ఉండవచ్చు మరియు అతనికి ఐ లవ్ యు చెప్పకుండా కూడా ఉండవచ్చు. తన స్వేచ్ఛను వదులుకుని తండ్రి మాటను వినటం మొదలు పెట్టాడు, అల్లరి పనులు మానేసాడు అందుకే తండ్రి సంతోషించాడు. దేవుడు కూడా మన నుండి  అటువంటి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని మనకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఇక్కడ పిల్లాడు తన స్వేచ్ఛను వదులుకుంటున్నాడు కదా! మరి పిల్లాడి స్వేచ్ఛను హరించటం తండ్రికి ఇష్టమా? కానే కాదు! 

తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. తెలియక వారు చేసే తప్పులు వారి పురోగతిని అడ్డుకోకుండా వారి అల్లరికి అడ్డుకట్టలు వేస్తాడు. మన ఆత్మీయ జీవితం బాగుండాలని మన పరలోకపు తండ్రి కూడా మన పాపమునకు అడ్డుకట్టలు వేస్తాడు. ఏ మంచి లేని ఈ శరీరంలో ఉండి అయన ఆజ్ఞలు పాటిస్తూ పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు.  ప్రభువయినా యేసు క్రీస్తును నమ్ముకొన్న క్షణం నుండి, తన పరిశుద్దాత్మ నడిపింపును మనకు ఇస్తూ, తన ప్రేమ చొప్పున గద్దిస్తూ, ఆదరిస్తూ తనకు దగ్గరగా ఉండాలని నిత్యం మనలను ప్రేరేపిస్తున్నాడు. కానీ స్వేచ్ఛతో ఉన్న మనము ఆ గద్దింపును అంగీకరించకుండా, పాపం లో పడిపోతూ  మరింతగా దేవునికి దూరం అవుతున్నాము. 

మనం పాపం  చేసినప్పుడు దేవుడు మనలను మనుష్యులకు అప్పగిస్తాడు, లేదా సమస్యలను మన మీదికి అనుమతిస్తాడు. విశ్వాసులుగా ఉన్న మనకు కష్టాలు ఉండవు అని చెప్పటం లేదు! మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని బలపరిచే పరీక్షల్లాంటి సమస్యలు కొన్నయితే, తప్పిపోయినప్పుడు లేదా పాపంలో పడిపోయినప్పుడు వచ్చే సమస్యలు కొన్ని. విశ్వాసాన్ని బలపరిచే సమస్యలు లేదా శోధనలు మనం తట్టుకోలేనంతగా ఇవ్వడు దేవుడు, మరియు అయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కానీ పాపంలో  పడిపోయినప్పుడు లేదా మనలను క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు వచ్చే సమస్యలు లేదా శోధనలు తీవ్రంగా ఉంటాయి. మన నడక మారనంత వరకు దేవుడు మనలను నలుగ గొడుతూనే ఉంటాడు. దానిని గుర్తించి ఆయనకు మొరపెట్టిన నాడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకు ఉదాహరణగా యోనా జీవితమును చెప్పుకోవచ్చు. 

తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగా అయన మనలను దండిస్తాడు (ద్వితీయోపదేశకాండము 8: 5)దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను సామ్రాజ్యమునకు  అప్పగించే ముందు యిర్మీయా ప్రవక్త ద్వారా ఎన్నో మారులు వారిని, మరియు ఇశ్రాయేలు రాజులను హెచ్చరించాడు. కానీ శరీర క్రియలకు, విగ్రహారాధనకు అలవాటుపడిన వారు ఆ ప్రవక్తను బంధించి హింసించారు. అబద్ద ప్రవక్తల మాటలు నమ్మి దేవుని మాటలు పెడ చెవిన పెట్టారు. కనుకనే వారందరు బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు, వివిధ దేశాలకు చెదరిపోయారు. కానీ అంటువంటి సమయంలో కూడా దానియేలు వంటి గొప్ప విశ్వాసులు దేవునితో నడచి, ఘనతను పొందారు, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. 

యోబు 5: "17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. 18.  ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును. "

దేవుడు ఈ విధముగా అందర్నీ గద్దించడు. తన చిత్తములో ఉన్నవారిని మాత్రమే అనగా ఆయనను అంగీకరించినా వారిని మాత్రమే తన వారిగా చేసుకొని వారిని తన మార్గములో నడిపించటానికి శిక్షిస్తాడు, తద్వారా శిక్షణ ఇస్తాడు. దానిని అంగీకరించి మనలను మనం సరిచేసుకున్న నాడు ఆయనే మనకు తన శాంతిని ఇస్తాడు. అనగా మన గాయములకు కట్టుకడుతాడు. ఆ శిక్ష సమయములో మనం అయనతో సాగిపోవాలి, క్షమాపణ వేడుకోవాలి కానీ మనసును కఠినం చేసుకొని ఆయనకు మరింతగా దూరం కారాదు. 

దేవుడు తన వాక్కును ఎన్నో విధాలుగా మనకు వినిపిస్తాడు, కొన్ని సార్లు  గద్దింపు తో కూడిన మాటలు విన్నప్పుడు   మన  హృదయములను కఠినపరచుకొని ఆయనకు ఆగ్రహం తెప్పించిన వారివలె మారి పోకూడదు. మరియు పాపము వలన కలుగు భ్రమచేత ఎవరు కూడా కఠినపడి, పాపమూ పట్ల సున్నితత్వమును కోల్పోయి దేవుడు ఇచ్చే నిత్య  విశ్రాంతిని కోల్పోకుండా ఒక్కరి నొకరు సంఘముగా  బుద్ది చెప్పు కోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 3:13-14). పరిశుద్దాత్మ దేవుడు మనకు ఇచ్చే నడిపింపును గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకొందాము. దేవునికి మనం ఎంత దగ్గర అవుతుంటే అంతగా సాతాను తన శక్తియుక్తులతో మనలను పడదోయాలని చూస్తాడు. ఆదాము, హవ్వల వలే వాని మాటలకూ అనగా శోధనలకు లొంగక దేవుని నడిపింపును అంగికరించాలి. 

మత్తయి 16: "17.  అందుకు యేసు సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. 18. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

మత్తయి సువార్తలో పేతురు యేసయ్యను దేవుని కుమారుడవని చెప్పిన వెంటనే, యేసయ్య పేతురుతో దీనిని పరమునందున్న తండ్రే నీకు బయలుపరచాడు అని చెప్పి అతని విశ్వాసము వంటి బండ మీద తన సంఘమును కడుతానని అన్నాడు. అది జరిగిన కొద్దీ సమయానికి  యేసయ్య తన సిలువ మరణం గురించి, పునరుద్ధానము గురించి చెప్పగానే సాతాను పేతురును ప్రేరేపించి యేసయ్యను శోధించటం మొదలు పెట్టాడు. ఎందుకిలా? పేతురు దేవునికి చాల దగ్గరగా ఉన్నాడు! మరియు యేసయ్య ప్రణాళికలో ఉన్నాడు. అంతే కాకుండా యేసయ్య సిలువ మరణము తన పాపపు లోకమును జయిస్తుందని, మనుష్యులను పాపం నుండి రక్షిస్తుందని తెలిసి  పేతురు ద్వారా యేసయ్యను ఆపాలని చూస్తున్నాడు. 

మత్తయి 16: "23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపటం లేదు"

వెంటనే యేసయ్య పేతురును "సాతానా వెనుకకు పో! నీవు నాకు అభ్యంతర కారణమయినావు. నీవు మనుష్యుల సంగతులను తప్ప దేవుని సంగతులు తలంచటం లేదు" అన్నాడు. ఇక్కడ పేతురును యేసయ్య సాతానా అని అందరి ముందు గద్దించినప్పుడు ఎంతో  అవమానంగా భావించవచ్చు. మరియు తన మనసు కష్టపెట్టుకొని, కఠిన పరచుకొని  యేసయ్యను వదిలి పోవచ్చు. కానీ పేతురు యేసయ్య చెప్పిన బోధను అర్థం చేసుకొని, అయన గద్దింపుకు బాధపడలేదు, కనుకనే విశ్వాసములో కొనసాగాడు. ఆలా అని ఇక్కడ పేతురు గొప్పతనం ఏమి లేదు. ఎందుకంటే మనకు ఉన్న విశ్వాసము దేవుడు ఇచ్చిందే, ముందు అయన మనలను ప్రేమించాడు, కనుకనే మనం ఆయనను ప్రేమిస్తున్నాము. అయితే పేతురు యేసయ్య గద్దింపును అంగింకరించాడు, తనను తాను తగ్గించుకున్నాడు, విశ్వాసములో కొనసాగాడు.  అందుకే శిష్యులకు నాయకుడిగా యేసయ్య చేత ఎన్నుకోబడ్డాడు. 

అదే సందర్భంలో తనను వెంబడించే వారు తమను తాము తగ్గించుకొని, తమ సిలువను ఎత్తుకొని అనగా శ్రమలు అనుభవించటానికి సిద్ధపడాలని శిష్యులకు బోధించాడు యేసయ్య (మత్తయి 16: 24-25).  దేవుని కూమారుడయిన తానూ మనిషిగా సిలువ మీద పొందవలసిన మరణమును తెలియజేశాడు. అంతే కాకుండా తనను వెంబడించాలకున్న వారు తమను తాము ఉపేక్షించు కోవాలని వారికి బోధించాడు. అనగా తమ స్వేచ్ఛను వదులుకొని దేవుని కార్యములు జరిగించటము మరియు వాక్యానుసారముగా శరీర క్రియలు మాని పవిత్రముగా జీవించటము చెయ్యాలి. యేసు క్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం చేసింది అదే కదా! 

కీర్తనలు 95: "7.  రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. 8.  అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి." 

ప్రియాయమయిన సహోదరి, సహోదరుడా! మనలను సృష్టించిన దేవుని మాట అంగీకరించిన యెడల ఎంత మేలు అని గుర్తిద్దాము. ఇశ్రాయేలీయుల వలె హృదయమును కఠినపరచుకొనక అయన మాటలకు తల ఒగ్గటం మనలను విశ్వాసములో బలపరుస్తుంది మరియు ఆయనకు దగ్గరగా మనలను ఉంచుతుంది. దేవుడు మనకు స్వేచ్ఛను, సొంత ఆలోచనలు ఇచ్చింది, మనలను మనం కాదనుకుని ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని. కనుక  దేవుని గద్దింపును అంగీకరిద్దాం, మనలను మనం ఉపేక్షించుకుందాం, దేవుని ప్రణాళికలో కొనసాగుతూ ఆత్మీయంగా పురోగతి సాధిద్దాం.  

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగం కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

2 కామెంట్‌లు: