పేజీలు

30, అక్టోబర్ 2021, శనివారం

దేవుని మర్మమైన మార్గములు!

విశ్వాసులు అయిన మనము మన జ్ఞానమును బట్టి కొన్ని సంగతులు ఇలా జరగాలి, ఆలా జరగాలి అని అనుకుంటాము.  మన ఆలోచన ప్రకారం లేదా మనకు తెలిసినట్లుగా జరగనప్పుడు బాధపడటం అత్యంత సహజం. కానీ దేవుని మార్గములు అత్యంత మర్మమయినవి, మానవ జ్ఞానమునకు అందనివి. అనంత జ్ఞానము కలిగిన దేవుని, కార్యములు ఉన్నతమయినవి, ఆవి మనలను అభివృద్ధి చేయటానికే దేవుడు మన జీవితాలలో జరిగిస్తున్నాడు. కానీ మనలో కొంత మంది ముందస్తు ఆలోచనలతో, ఊహలతో ప్రార్థిస్తారు అటుపైన తమ ఆలోచనలకు, ఊహలకు విరుద్ధంగా పరిస్థితులు కలుగుతుంటే నిరాశపడి పోతారు. 

ఉదాహరణకు ఒక గణిత సమస్యకు రెండు మూడు రకాల విధానాల్లో సమాధానం కనుక్కొనే అవకాశం ఉండవచ్చు. విద్యార్థికి ఒక్క రకమయిన విధానామే తెలిసి ఉండవచ్చు. కానీ టీచర్ కు ఆ సబ్జెక్టు మీద ఉన్న జ్ఞానము ఎక్కువ గనుక మరి కొన్ని విధానాలు తెలిసి ఉండవచ్చు. అలాఅని విద్యార్థి టీచర్ ను నాకు తెలిసిన విధంగానే సమాధానం చెప్పమనటం అతని జ్ఞానమును అపి వేస్తుంది. ఆలాగే విశ్వాసి కూడా దేవుని మార్గములను ప్రతిఘటించటం, తాను అనుకున్నట్లుగా జరగాలను కోవటం కూడా అటువంటిదే. ఉదాహరణకు నీ జీవితంలో ఒక సమస్య  తీరాలంటే ఫలానా ఫలానా విషయాలు జరిగితే నా సమస్య తీరుతుందని నీ జ్ఞానమును బట్టి అలోచించి ప్రార్థిస్తుంటావు, కానీ వాటికి విరుద్ధంగా సంఘటనలు జరిగితే కంగారుపడి పోయి విశ్వాసంలో వీగిపోయే అవకాశం ఉంది కదా!  కానీ దేవుడు తన జ్ఞానము చొప్పున మరో విధంగా నీ సమస్యను తీరుస్తున్నాడు అని విశ్వసించాలి. 

ఎర్ర సముద్రం ఎదురుగా ఉండి, ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు మాత్రం ఊహించారా? సముద్రంలో ఆరిన నేలమీద నడుస్తామని. వారు పాటలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ యెరికో గోడల చుట్టూ తిరిగితే బలమైన ప్రాకారాలు కూలి పోయి ఆ దేశము తమ వశం అవుతుందని వారికీ మాత్రం తెలుసా! దేవుని మార్గములు ఆసాధారణమయినవి, ఎంతో అద్బుతమయినవి. అయన మహిమను నీ జీవితంలో నిరూపించి తద్వారా నీ విశ్వాసమును మరింత పెంచటమే అయన ఉద్దేశ్యం, ఆ విధంగా నిన్ను మరింత దగ్గరగా చేర్చుకోవటమే అయన కోరుకుంటున్నది. అంతలోనే అలిగి పోతావా? కాస్త ఆలస్యానికే కుంగిపోతావా? 

నువ్వు ఊహించినట్లుగా జరిగితే నీ విశ్వాసం బలపడుతుందా? దేవునికి మహిమ కలుగుతుందా? బైబిల్ నుండి ఒక్క సంఘటన చూద్దాం. సిరియా రాజ్యానికి సైన్యాధ్యక్షుడయిన నయమాను కుష్టు రోగంతో బాధపడుతు ఉండగా, దేవుని మహిమ ద్వారా ఇశ్రాయేలు పై విజయం పొందిన తర్వాత బానిసగా కొనిపోబడిన ఒక్క అమ్మాయి, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రవక్త ఎలీషాను దర్శిస్తే నయమాను కుష్టు నయం అవుతుందని అతని భార్యకు చెప్పుట ద్వారా, నయమాను ఎలీషాను కలుసుకుంటాడు. ఎలీషా తన మీద చేతులు ఉంచి ప్రార్థిస్తే తన కుష్టు నయం అవుతుందని నయమాను అనుకుంటాడు. కానీ ఎలీషా కనీసం తన గుడారంలో నుండి బయటకు రాకుండా తన అనుచరుడితో నయమానును యొర్దాను నదిలో ఏడు మార్లు మునిగి శుద్ధుడవు కమ్ము అని వర్తమానం పంపుతాడు. 

రాజులు 5: "11. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి,తన దేవుడైన యెహోవా నామ మునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. 12. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను."

ఈ వచనములలో నయమాను కోపగించుకొని వేళ్ళ నిశ్చయించుకోవటం చూడవచ్చు. తానూ అనుకున్నట్లు ఎలీషా తనను చూడటానికి బయటకు రాలేదు, మరియు తానూ ఊహించినట్లుగా తన మీద చేతులుంచి ప్రార్థించలేదు. నయమాను ఇశ్రాయేలును జయించిన పొగరుతో వచ్చాడు, బాగుపడితే ఎన్నో కానుకలు ఇస్తాను కదా అన్న గర్వపు ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుని మహిమ ద్వారా ఇశ్రాయేలును జయించాడని తనూ ఎరుగడు. నేను జయించిన దేశమే కదా అనుకుని ఇశ్రాయేలు నదులలో నీటిని సైతం తక్కువగా చూస్తున్నాడు, ఈ మునకలేవో ఎంతో శ్రేష్ఠమయిన మా దేశపు నదులలోనే వేసేవాణ్ణి కదా అనుకుంటున్నాడు కానీ ఇక్కడ దేవుడి కార్యం  ఉన్నదన్న విషయం గుర్తించలేక పోయాడు. 

రాజులు 5: "13. అయితే అతని దాసులలో ఒకడు వచ్చినాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయ కుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను." 

ఈ వచనములలో ఒక తెలివయిన దాసుని సలహాలు వినవచ్చు. ఆ ప్రవక్త ఏదయినా కష్టతరమయిన పని చెపితే చేసేవాడివి కదా? ఇంత చిన్న పని చేస్తే నీకు వచ్చే నష్టం ఏమిటి, అయన చెప్పినట్లు స్నానము చేసి కుష్టు నయం చేసుకోవచ్చు కదా అంటున్నాడు. నిజమే కదా, చాల సార్లు మనం కష్టమయినవి చేస్తేనే ఫలితాలు పొందుతాము అనుకుంటాము. కానీ కొలిమిలో ఉన్న ఇనుమును ఎంత బలంతో, ఏ విధంగా కొడితే అనుకున్న పరికరం తయారవుతుందో, కమ్మరికి మాత్రమే తెలుసు. ఎంత కష్టంతో కార్యం జరిగిస్తే నీ విశ్వాసం బలపడుతుందో, ఆయనకు మహిమ కలుగుతుందో దేవునికి మాత్రమే తెలుసు. ఇలాగె జరగాలి, ఆలా జరగటం లేదు అని కోపగించుకుంటే ఎలా? కొన్ని సార్లు సులభంగా అవుతుందన్నదనుకున్నది కూడా కష్ట తరంగా మారవచ్చు. అందులో దేవుని హస్తముందని గుర్తించాలి, వేచి చూడాలి. 

నయమాను ఎలీషా చెప్పిన విధంగా చేసి పసి వాడి మాదిరి చర్మమును పొందుకున్నాడు. అప్పుడు గాని  దేవుని మహాత్యమును గుర్తించలేదు. తానూ అనుకున్నట్లుగా ఎలీషా బయటకు వచ్చి తనను ఆహ్వానించి, చేతులుంచి ప్రార్థిస్తే తన గర్వం అణిగేదా? దేవుని యందు విశ్వాసం పెంచుకొనే వాడా? చక్రవర్తి సైన్యాధిపతిని కనుక నాకు గౌరవం ఇస్తున్నాడు, నేను కోరుకున్నట్లే ప్రార్థించాడు అనుకుని, తెచ్చిన కానుకలు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. 

రాజులు 5:  "15. అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును;...."

"17. అప్పుడుయెహో వాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా?"

చూడండి ఈ వచనములలో నయమాను ఎంతలా మారిపోయాడో తెలుస్తుంది. ఇశ్రాయేలును జయించాను కదా, ఏముంది దీని గొప్ప అనుకున్న వాడు కాస్త, ఇక్కడ ఉన్న దేవుడు మరెక్కడ లేడు అని సాక్ష్యం చెపుతున్నాడు. సైన్యాధిపతిగా, దర్పంతో వచ్చిన వాడు ఇప్పుడు నీ దాసుణ్ణి అని తనను తానూ తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ నీటిని సైతం చిన్నచూపు చూసిన వాడు ఇప్పుడు ఇక్కడ మట్టిని సైతం ఎంతో ఉన్నతమయినదిగా భావిస్తున్నాడు. ఏ ఇతర దేవుళ్లను ఇక మీదట పూజించనని చెపుతూ దేవునికి బలిపీఠం కట్టటానికి ఇశ్రాయేలు మట్టిని  మోసుకెళ్తున్నాడు.  

దేవుడు నయమాను అనుకున్నది అనుకున్నట్లు చేస్తే అతను దేవుని మహిమను అంతగా గుర్తించేవాడు కాదు కదా! తనను తానూ తగ్గించుకొని విశ్వాసంలో బలపడేవాడు కాదు కదా! నీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుడు నీ ద్వారా మహిమను పొందుకోవాలి, నీ విశ్వాసం మరింత బలపడాలి, నీ సాక్ష్యం నీ చుట్టూ ఉన్నవారికి దీవెనగా మారాలి. నయమానుతో పాటు వచ్చిన ఎంతమంది దేవుని వైపు తిరిగి ఉంటారు, తన సాక్ష్యం చూసిన తర్వాత. కనుక దేవుని మర్మమయిన మార్గములను అనుమానించకు, విశ్వాసం విడిచి, దేవుని ఆశీర్వాదాలు కోల్పోకు. నయమాను కోపంతో వెళ్ళిపోయి ఉంటె స్వస్థత పొందేవాడా? ఓర్పుతో ఎలీషా చెప్పినది పాటించాడు, మేలు పొందుకున్నాడు. దేవుని దగ్గరికి నీ ఆలోచనలతో రాకు, కేవలం విశ్వాసంతో రా. అయన దగ్గరికి సమస్యతో రా, పరిష్కారంతో మాత్రం కాదు. నువ్వు ఊహించని మార్గాలు ఆయనే తెరుస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. ఆలస్యం జరుగుతుందా, యొర్దాను నది దగ్గరికి వెళ్ళేదాకా అగు, జరుగబోయే అద్భుతం ముందుంది. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! 

16, అక్టోబర్ 2021, శనివారం

దేవుడంటే విసుగు కలిగిందా?

శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మందివిశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా ఆస్వాదించటం మొదలు పెడుతారు. ఒకనాడు దేవుడు చేసిన ఎన్నో మేలులను పూర్తిగా మర్చిపోతారు. ఒక తండ్రిలా, తల్లిలా తమను కాపాడుతూ, వారి అవసరాలను అద్భుత రీతిలో తీర్చిన అయన మహాత్యమును  విస్మరిస్తారు. 

మరి కొంత మంది ఒక్క పెద్ద  ఇబ్బంది రాగానే  "ఏంటి దేవుడు ఇలా చేసేసాడు, అసలు నన్నెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, పక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అన్యులు సైతం ఎంతో ఆనందందంగా ఉన్నారు, జీవముగల దేవుడని నమ్ముకుంటే ఇదేంటి! ప్రార్థన కూడా వినటం లేదు" అనుకుంటూ చిన్నగా దేవుడి నుండి దూరంగా  వెళ్ళి పోతారు. 

కానీ ఒక్క విషయం మర్చి పోతున్నాము! దేవుడు మన అవసరాలు తీరుస్తాడు కానీ, మన ఆడంబరాలు కాదు. అంటే దేవుడు మనలను దీవించాడా? ఎప్పుడు ఇలాగ గొఱ్ఱె తోకలాగే ఉంచుతాడా? ముమ్మాటికీ కాదు. దావీదు 23వ కీర్తనలో ఏమని రాసాడు? "నా గిన్నె నిండి పొర్లుచున్నది" అని. దాని అర్థం ఏమిటి? నన్ను సమృద్ధిగా దీవించావు అనే కదా! సమృద్ధి అంటే, లేమి లేకపోవటమే కానీ లెక్క లేనంత ఉండటం కాదు. ఆ లెక్కలేనితనం నిర్లక్ష్యం కలిగిస్తుంది,  గర్వం కలిగిస్తుంది, దేవుణ్ణే మరపిస్తుంది. 

మత్తయి  16: "26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?"

ఈ వచనంలో యేసయ్య ఎం అంటున్నాడు చూడండి!  ఎంత సంపద ఉన్న కూడా చివరకు రక్షణ కోల్పోతే ఏమిటి ప్రయోజనం. ఎవరు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు! వారిలో ఒక్కరు యేసయ్య, మరొకరు ధనము. రక్షణ ఇచ్చే యేసయ్య కావాలా? లోకంలో సుఖపెట్టే ధనం కావాలా? కొందరి విషయంలో ధనం మాత్రమే యజమాని కాదు గాని, వారికి కీర్తి ప్రతిష్టలు కావాలి. వారి గురించి రాత్రికి రాత్రి ఊరంతా, జిల్లా అంత, రాష్ట్రమంతా లేదా దేశమంతా తెలిసి పోవాలి. ఇది కూడా ఒక రకమయిన ఆడంబరమే. దేవుడు నిన్ను వాడుకుంటున్నది, నీ ద్వారా పది మందికి అయన ప్రేమను తెలుపాలని, అంతే కానీ నిన్ను పది మందిలో గొప్ప చేయటానికి కాదు. అవసరం అనుకుంటే ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. 

కీర్తనలు 73: "3. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని."

ఈ వచనములో కీర్తన కారుడు భక్తి హీనుల క్షేమం చూసినప్పుడు నేను ఈర్ష్యపడ్డాను, ఎందుకంటే వారు నా ముందు గర్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నాడు. కానీ దేవుడు వారికి సరయిన తీర్పు తిరుస్తాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నది, లోకంలో జీవించే  ఎనభై యేళ్ళ కోసమో లేదా వంద యేళ్ళ కోసమో కాదు. యుగయుగములు ఆయనతో జీవించటానికి అని తెలుసు కోవాలి. అదే 73వ కీర్తనలో 18, 19 వచనములు చూసినట్లయితే "18. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు 19.  క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

ఈ వచనముల ద్వారా అవగతమవుతున్నది ఏమిటి? దేవుణ్ణి ఎరుగని వారు ఇప్పుడు సుఖపడుతున్నట్లు కనపడవచ్చు, కానీ చివరకు వారు నశించి పోతారు. ధనవంతుడు, లాజరు ఉపమానంలో యేసయ్య ఏమని చెప్పాడు లూకా 16:19-31 వచనములు దయచేసి చదవండి. 

నువ్వు అనుకున్న పని జరగటం లేదా? నీ ప్రార్థన ఫలించటం లేదా? దేవుడు నీ చేయి విడువలేదు. కానీ  నిన్ను విశ్వాసంలో బలపరుస్తున్నాడు. సమస్య ఉంటేనే కదా సత్తువ పెరుగుతుంది? వ్యాయామం చేయటం అంటే ఏమిటి? బరువులు ఎత్తటం, పరుగులు పెట్టటం, తద్వారా శరీరానికి బలం కలిగించటం. మరి మన విశ్వాసం కూడా బల పడాలంటే శోధన అనే బరువును మోయాలి, ప్రార్థన అనే పట్టుదలతో, విశ్వాసపు పరుగును కొనసాగించాలి. సత్తువ అయిపోతుందా, నిరసపడి పోతున్నావా? అయితే అడుగు నీ దేవుణ్ణి, మొదలు పెట్టిన వాడు, వదిలి పేట్టడు. నిన్ను మధ్యలో దించటానికి ఎత్తుకోలేదు, తనతో జీవింప చేయటానికే నిన్ను రక్షించు కున్నాడు. కాస్త పాటి కష్టానికే చంక దిగుతానని మారాం చేస్తావా? వెలుగును విడిచి చీకటికి దాసోహం అంటావా? కాపరిని వదిలి మోస పోతావా? 

నీకు లేని వాటిని చూపించటమే సాతాను లక్షణం. తద్వారా జీవితంలో అసంతృప్తి, ఆత్మీయ జీవితంలో విసుగు. చూడలేని వాడిని అడిగితె తెలుస్తుంది కళ్ళు ఉన్న వాడి అదృష్టం, కాళ్ళు లేని వాడిని అడిగితె  తెలుస్తుంది  నడవలేని తన దురదృష్టం. ఎటువంటి స్థితి అయినా మార్చగల సమర్థుడు మన దేవుడు. అంతవరకు వేచి చూడటమే విశ్వాసం. విశ్వాసం లేని వాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. విశ్వాసం ద్వారా శోధన అనే కొలిమి నుండి శుద్ధ సువర్ణము వలే విలువ పెంచుకొని బయటకు రావాలి కానీ కాకి బంగారంల  విలువ లేకుండా మిగిలి పోకూడదు. విశ్వాసం కోల్పోయి  విసుగు పడుతూ దేవునికి దూరం అవుతున్నావా? 

మీకా 6: "3. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి. 4. ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని." 

ఈ వచనముల ద్వారా దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆయన ఇదివరకు చేసిన మేలులకు సమాధానం ఉందా నీ దగ్గర? అసాధ్యమే అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగించినప్పుడు, సంతోషంతో కన్నీళ్లు పెట్టి సాక్ష్యం పంచుకున్నావు. మరి ఇప్పుడు ఏమైంది ఆ విశ్వాసం? దేవుడు నీతోనే మాట్లడుతున్నాడు. అయన ప్రేమను చులకనగా చూడవద్దు. విశ్వాసం కోల్పోవద్దు, విసుగు పడవద్దు.  మన విశ్వాసం సన్నగిల్లుతుంటే సాతాను మన మీద తన ఆధిపత్యం పెంచుకుంటూ ఉంటాడు, తద్వారా మనలను పూర్తిగా నాశనం చేస్తాడు. పాపం అనే తన ప్రపంచంలో సుఖమనే మత్తులో మనలను బంధిస్తాడు. దేవుని మాటలు చేదుగా అనిపిస్తాయి, చేతకాని వారు  పాటించేవిగా గోచరిస్తాయి. 

మరి ఇటువంటి స్థితిని ఎలా అధిగమించాలి? ఈ విసుగు చెందే తత్వం ఎలా ఏర్పడుతుంది? చెట్టు వేళ్ళు ఎంత లోతుగా ఉంటె చెట్టు అంత పచ్చగా ఉంటుంది. కానీ మొక్క వేళ్ళు లోతుగా ఉండవు కనుక కాస్త ఎండ తగలగానే వాడి పోవటం మొదలు పెడుతుంది. విశ్వాసి జీవితం కూడా అటువంటిదే. దేవునితో లోతయిన సంబంధం కలిగి ఉండటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది,  తద్వారా ధైర్యం కలుగుతుంది. మరి దేవునితో లోతయిన సంబంధం ఎలా ఏర్పడుతుంది?

కీర్తనలు 1. "1. దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక 2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3. అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును." 

ఈ వచనములలో ఏమి చెప్పబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఎంతో మంది ఆలా చేయు ఇలా చేయు అని తమకు తోచిన సలహాలు ఇస్తుంటారు. తాము ఎలా బాగుపడింది, చిన్న చిన్న అబద్దాల ద్వారా, మోసాల ద్వారా డబ్బులు ఎలా సంపాదించింది చెపుతుంటారు. వాటిని పాటించక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే వారి పిచ్చి పరిహాసాలకు నవ్వకుండా, చతురతకు అబ్బురపడకుండా దేవుని వాక్యమును నిత్యమూ ధ్యానిస్తూ, అనగా పనులన్నీ మానేసి బైబిల్ చదవమాని కాదు గాని, ఎక్కడ ఉన్న, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞత  పూరితమయిన  సమయము దినమంతా గడుపుతూ ఉండేవారు నీటి కాలువల వద్ద నాటిన చెట్టువలె ఆకు వాడక ఉంటారు. మరియు తగిన సమయంలో ఫలం పొందుకుంటారు.  అంతే కాకుండా వారు చేసే దంతయు సఫల మవుతుంది. ఈ విధంగా దేవునితో లోతయిన సంబంధం విశ్వాసంతో కూడిన ధైర్యం కలిగిస్తుంది, తద్వారా ఈ విసుగు స్థానంలో శాంతి, సమాధానం, నెమ్మది మన జీవితాలలో చోటు చేసుకుంటాయి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !!