పేజీలు

20, ఏప్రిల్ 2024, శనివారం

విజయం వచ్చే సమయం!


చాల మంది విశ్వాసులు తమ జీవితాలలో ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ వాటి నుండి తప్పించుకోవటానికి దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు. నిత్యమూ తమ ప్రార్థనల్లో ఆ సమస్యల నుండి విడిపించమని దేవుణ్ణి బ్రతిమాలుకుంటారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలని దృఢమయిన విశ్వాసము చూపుతారు. ప్రతి నిత్యమూ ఆ వాగ్దానాలు ఎత్తి పడుతూ ప్రార్థిస్తూ ఉంటారు. విశ్వాసం చూపటం, దేవుని వాగ్దానాలు ఎత్తి పడుతూ ప్రార్థించటం దేవునికి ఎంతో ప్రితికరమయిన విషయమే. యేసు క్రీస్తు "ప్రయాస పడి భారము మోస్తున్న అందరు తన వద్దకు వస్తే, విశ్రాంతిని ఇస్తానని చెపుతున్నాడు" కదా. ఆ విశ్రాంతి కేవలము పాప భారము మాత్రమే కాదు, మన జీవితములో కలిగే ఇబ్బందులు మరియు సమస్యలు కూడా. ఎందుకంటే ఈ సమస్యలు మనలను భాదపెడుతూ మనలో నిరాశను, నిస్పృహను పెంపొందించి దేవునికి దూరముగా వెళ్ళి పోయి, హృదయములో కరుకుతనం నిండుకొన్న, ప్రేమ లేని వారిగా మార్చేస్తాయి. 

అందుకే క్రీస్తు తన వద్దకు రామ్మని పిలుపునిస్తున్నాడు. అయన వద్దకు రాగానే ధనవంతులు అయిపోతామా? అప్పుల భాదలు అన్ని తీరిపోతాయా? ఆరోగ్యం అంత భాగాయి పోతుందా? అది అయన చిత్తము ప్రకారం జరుగుతుంది. కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. రేపటి గురించిన భయము తొలగి పోతుంది. అందును బట్టి హృదయములో ప్రశాంతత, జీవితము పట్ల ఆశావహ దృక్పదము ఏర్పడుతాయి. దేవుని వాక్యం చెపుతున్నది ఏమిటి?  క్రీస్తు నందు నిరక్షణ ఉంచుమని. ఆ నిరీక్షణ అయన మీద ఆధారపడేలా చేస్తుంది. ఆయన మీద ఆధారపడిన ప్రజలను అయన త్రోసి పుచ్చే దేవుడు కాదు గాని, తన సమయమందు వారిని హెచ్చిస్తాడు, జయ జీవితం ఇస్తాడు. అది పాపమయిన, ఎటువంటి శరీర క్రియ అయినా మరియు ఏ విధమయిన సమస్య అయినా తీర్చగల సమర్థుడు. విశ్వాసమే అన్నింటికీ ఆధారము, క్రీస్తు విశ్వాసులకు అదే ఆయుధము. 

దేవుని ప్రవక్త అయినా సమూయేలు చేత ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడిన దావీదు రాజుగా మారటానికి ఎన్నో సమస్యల గుండా వెళ్లవలసి వచ్చింది. అంతే కాకుండా,  గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే గొల్యాతు వంటి బలాఢ్యుడిని ఓడించటానికి దావీదు ముందుకు దూకాడు. రాజయినా సౌలు మరియు సైన్యంలో ఉన్న తన అన్నలు, మిగతా వీరులు అందరు భయపడి వెనుకకడుగు వేస్తుంటే, దావీదు ఎంత మాత్రం భయపడలేదు.  ఎలాగూ నేను రాజుగా అభిషేకించ బడ్డాను, నాకెందుకు ఇప్పుడు గొల్యాతుతో యుద్ధము అని ఎంత మాత్రము ఆలోచించ లేదు. దేవుని నామానికి అవమానం జరుగుతుంటే తట్టుకోలేక పోయాడు. "దేవుడు రాజుగా చేస్తానంటే చేస్తాడు" అని గొప్ప విశ్వాసము చూపాడు. అసూయా పరుడయినా సౌలు అతణ్ణి చంపాలని  తరిమిన కూడా సౌలును ద్వేషించ లేదు. ఎటువంటి  కష్టాలు దావీదును కఠినుడిగా మార్చలేదు,  కేవలం దేవుని యందు నిరీక్షణ ఆయనకు అంతటి ధైర్యం ఇచ్చింది. కనుకనే అతను ఎక్కడ దేవుణ్ణి ప్రశ్నించ లేదు, అయన మీద ఆధారపడటం మానలేదు. 

మన విశ్వాసం అంతటి నిరీక్షణ కలిగి ఉందా? లేక ప్రార్థించి అలసిపోయి, నిరాశ, నిస్పృహతో నిండిపోయి మూగబోయిందా? "మనము నీటి కాలువల ఒడ్డున నాటబడి, ఆకూ వాడిపోక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె ఉన్నాము" అని దేవుని వాక్యం చెపుతోంది (కీర్తనలు 1:3). "ఆకూ వాడక" అనగా తగిన రీతిలో దేవుడు మనలను పోషిస్తునే ఉంటాడు, దానికి దిగులు లేదు.  "తన కాలమందు ఫలమిచ్చు" అంటే అయన చిత్తము ఎప్పుడు ఉంటె అప్పుడు లేదా అయన దృష్టిలో మనం ఎప్పుడు సిద్దపడి ఉంటె అప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితములో తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. మరి దిగులు దేనికి? విశ్వాసం కోల్పోయి విసిగిపోవటం దేనికి? నిరీక్షణలో దావీదు మనకు ఆదర్శం కావాలి. దావీదు కాలానికి పరిశుద్దాత్మ ఇవ్వబడలేదు, కానీ దేవుని హృదయాను సారుడిగా అయన పిలవబడ్డాడు. 

ఇప్పుడు మనకు పరిశుద్దాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు, మనలను నిత్యమూ నడిపిస్తూ ఉంటాడు, మన తరపున తండ్రికి విజ్ఞాపనలు చేస్తాడు అని దేవుని వాక్యం చెపుతోంది (రోమీయులకు 8:26)అలసి పోకుండా, వెను తిరగకుండా పందెంలో పరుగు పెట్టడమే మన పని, విజయం ఇచ్చేది మన దేవుడు మాత్రమే.అయితే  చాల సార్లు దేవుడు ఇచ్చిన విజయాలు మనలను తప్పు దోవ పట్టిస్తాయి. అంతవరకూ సమస్యలతో, లేమితో భాదపడిన వారికి, సమస్యలు తీరిపోయిన తర్వాత లేదా కలిమి కలిసి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం లేదా గర్వము చోటు చేసుకుంటుంది. ఇంతకూ ముందు తమ లాగా భాదపడే వారిని బట్టి చులకన భావం ఏర్పరచుకుంటారు. దేవుడు తమను దీవించిన విధానాన్ని మరచిపోయి, తోటి వారిని చేతకాని వారిగా జమకట్టి గర్వం ప్రదర్శిస్తారు. అంటువంటి వారిని దేవుడు తృణీకరించి తన కృపకు దూరం చేస్తాడు అని దేవుని వాక్యం చెపుతోంది (1 పేతురు 5:5)

2 సమూయేలు 8: "15. ​దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దావీదుకు  దేవుడు ఎన్నో గొప్ప విజయాలు అనుగ్రహించాడు. గొల్యాతును చంపటం దగ్గరి నుండి, ఫిలిష్తీయులను, ఎదోమీయులను, అమాలేకీయులను మరియు మోయాబీయులను కూడా ఓడించాడు అనగా దేవుడు ఆయనను వారి మీద గెలిపించాడు. అయినప్పటికీ తనలో గర్వం కలుగ లేదు. ప్రజలను తృణీకరించలేదు. మనలో కొంత మంది ఒక చిన్న పాపపు అలవాటు మీద విజయం రాగానే, దాన్ని చేస్తున్న వారిని చిన్న చూపు చూడటం మొదలవుతుంది. అది మనం ఎదో సాధించామన్న గర్వాన్ని సూచిస్తుంది. అది దేవుని ఘనతను మనం తీసుకోవటం అవుతుంది. అలాగే చాల మంది దేవుని కృపను బట్టి సంఘములో నాయకులుగా ఎన్నుకోబడవచ్చు లేదా ఆ విధముగా నడిపించ బడవచ్చు. అప్పుడు వారు తమకు నచ్చిన వారిని, తమకు అనుకూలముగా ఉండే వారిని ప్రోత్సహిస్తూ దేవుడు తలాంతులు ఇచ్చిన వారిని వెనుకకు నెడుతూ ఉంటారు. కానీ దావీదు పక్షపాతం లేకుండా నాయకులను ఎన్నుకున్నాడు, పదవులను కట్టబెట్టాడు అని దేవుని వాక్యం చెపుతోంది. 

అటువంటి పక్షపాతం చూపే వారిని దేవుడు తృణీకరిస్తాడు, వారు నడిపే సంఘము విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తుంది. అదే విధముగా కలిమి కలిగిన వారు కూడా లేమితో భాదపడే వారిని జాలిగా చూడటం లేదా తక్కువ చేసి చూడటం వారి ముందు తమ డబ్బు, దర్పము ప్రదర్శించటం చేస్తారు. ఎదుటి వారి సొమ్మును ఆశించటం ఎంత పాపమో, వారిని ఆశపడేలా చేయటం లేదా అసూయా పడేలా ప్రవర్తించటం కూడా పాపమే. ఒక స్త్రీని మోహించటం పాపం అయితే, మోహించ బడేలా వస్త్రధారణ చేసుకున్న స్త్రీ కూడా పాపం చేసినట్లే అవుతుంది. కనుకనే దేవుడు స్త్రీల అలంకరణను తన వాక్యం లో రాయించాడు (1 తిమోతి 1:9-10). కనుక మీకు కలిగిన కలిమికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, చేతనయితే సాటి వారికి సహాయం చెయ్యండి. కానీ గర్వం ప్రదర్శించి దేవుని కృపకు పేదవారు కాకండి.  ప్రతి ఒక్కరికి దేవుడు విజయం ఇస్తాడు కానీ ఆ విజయం వచ్చే సమయం ఎంతో క్లిష్టమయినది. దానినే సాతాను మన మీద వాడుకొని, తన లాగా గర్వపడేలా చేసి, దేవునికి దూరం చేస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్!!

1 కామెంట్‌: