పేజీలు

26, డిసెంబర్ 2020, శనివారం

సాటి వారిని ప్రసంశిస్తున్నావా?

దేవుని నడిపింపును బట్టి ఇంతకు ముందు మనం ఆత్మీయతలో అసూయ ఉందా? మరియు ఇతరుల మెప్పుకై ఆశిస్తున్నావా? అన్న అంశముల గురించి ధ్యానించుకున్నాం. అయితే వీటికి ఉన్న మరో కోణము ఇతరులను ప్రసంశించటంలో పక్షపాతం చూపిస్తున్నావా? లేదా నిర్లక్ష్యం వహిస్తున్నావా? సంఘము యొక్క క్షేమాభివృద్ధికై పరిశుద్దాత్మ దేవుడు సంఘములో ప్రతి విశ్వాసికి ఆత్మీయ వరములు అనుగ్రహిస్తాడు. వాటిని పొందుకున్న విశ్వాసులు దేవుడి మహిమను దొంగిలించకుండా సంఘము అభివృద్ధికై పాటుపడాలని   పరిచర్యలో దీనత్వం ఉందా? అన్న అంశం ద్వారా ధ్యానించుకున్నాము. కానీ పరిశుద్దాత్మ దేవుడు సాటి విశ్వాసులకు ఇచ్చే ఆత్మీయ వరములను నిర్లక్ష్యం చేయటం, వారి విశ్వాసమును మరియు ప్రభువు పట్ల వారి  పరిచర్యను చులకన చేయటం వాక్యానుసారము కాదు. 

2 దినవృత్తాంతములు 30: "22.  ​యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి." 

ఇశ్రాయేలుకు రాజయిన హిజ్కియా దేవుడయిన యెహోవాకు పస్కా పండుగ జరుపవలెనని తలచినప్పుడు అందరికి లేఖలు పంపాడు. తర్వాత దేవుని సేవలో ఉన్న లేవీయులను అతను ప్రసంశించాడు. అది వారు చేయవలసిన బాధ్యతే కదా అని నిర్లక్ష్యం వహించలేదు. అటువంటి ప్రితికరమయిన మాటలు సంఘములో ఉన్న పాస్టర్లతో మాట్లాడే స్థితిలో ఉన్నామా? లేదా "వారు చేయవలసిందే చేస్తున్నారు కదా" అని నిర్లక్ష్యం వహిస్తున్నామా? 

1 కొరింథీయులకు  16: "18. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మా నించుడి." 

పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమంటున్నారు! ఆయనకు సహాయం చేసిన వారిని సన్మానించుమని చెపుతున్నారు. మెచ్చుకోలు మాట ఆత్మను తృప్తి పరుస్తుంది, శ్రమను దూరం చేస్తుంది. అంతేకాకుండా రెట్టించిన ఉత్సాహముతో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది కనుకనే పౌలు గారు ఇలాంటి కార్యములు సూచిస్తున్నారు. దేవుడి మహిమను దొంగలించకూడదు అన్న నెపంతో ఇతరుల శ్రమను నిర్లక్ష్యం చేయటం సబబా? వారి ద్వారా దేవుడు తన కార్యములు చేస్తున్నాడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, "దేవుడు మిమల్ని ఇంత బాగా వాడుకుంటున్నందుకు చాల సంతోషం సోదరుడా లేదా సోదరి" అని చెప్పటం సరైన పని కాదంటారా? 

మన ప్రభువయినా యేసు క్రీస్తు ఎన్నో మారులు ఆయనకు తండ్రి అయినా దేవుడు ఇచ్చిన  మహా జ్ఞానమును బట్టి మత పెద్దల చేత శోదించబడ్డాడు. అయన చేయుచున్న పరిచర్యను బట్టి, అధికారముతో బోధించిన విధానమును బట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు. వారు తమకు ఉన్న బైబిల్ జ్ఞానమును బట్టి ఆత్మీయ గర్వముతో నిండియున్నారు. అంతే కాకుండా యేసు క్రీస్తు నేపథ్యమును బట్టి ఆయనను చాల తక్కువ అంచనా వేశారు. కనుకనే దేవుడు ఆయనకు ఇచ్చిన అధికారమును గుర్తించ లేకపోయారు. మనలో అటువంటి ఆత్మీయ గర్వము ఉందా? ఇతరుల నేపథ్యమును బట్టి ఎదుటి వారిని చులకనగా చూస్తున్నామా? ఎవరు ఊహించారు! చేపలు పట్టే వారు ప్రంపంచాన్ని ప్రభువు పేరిట మార్చేస్తారని. గాడిదను సైతం వాడుకున్న దేవునికి తనయందు విశ్వాసం ఉంచి, తన పరిచర్యలో వాడబడాలనే తపన కలిగిన వారిని  వాడుకోవటం అసాధ్యమా? 

మత్తయి 13: "55.  ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? 56. ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి."

యేసు క్రీస్తును నజరేతు వారు పై వచనములో ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి! "మన ముందు పెరిగిన వడ్లవాని కుమారునికి ఇంత జ్ఞానం ఎక్కడిది" అని అయన బోధను ఆటంక పరుస్తున్నారు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? సహోదరి, సహోదరుడా! ఎదుటి వారు నీకన్న చాల ఆలస్యంగా విశ్వాసములోకి రావచ్చు, లేదా వారు నీ అంత చదువుకోక పోవచ్చు, వారి ఆర్థిక స్థితి నీ అంత మెరుగుగా ఉండక పోవచ్చు, కానీ వారి ఆత్మీయ స్థితిని బట్టి, దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళికను బట్టి వారికి ఇస్తున్న జ్ఞానమును బట్టి, ఆత్మీయ వరములను బట్టి అభ్యంతరపడవద్దు.  వారిని ప్రోత్సహిస్తూ సంఘము క్షేమాభివృద్ధికి వారిని వాడుకోవటమే దేవునికి ఇష్టమయిన కార్యము. 

ముఖ్యముగా కొన్ని సంఘములలో సాటి సహోదరులు చెప్పే ప్రసంగమయిన, రాసిన పాటయినా, లేదా వారు పాడే పాటయినా ఏ ప్రోత్సాహానికి నోచుకోదు. లోకంలో చెప్పుకొనే సామెత "పొరుగింటి పుల్లకూర రుచి" అన్న మాదిరి, ఎవరో తెలియని వారు ఏమి చెప్పిన, ఏమి చేసిన అందులో అద్భుతాలు చూసే మనసు ఉంటుంది కానీ తోటి సహోదరుడు ఏమి చేసిన వంకలు వెతికి పక్కన పెడుతూ ఉంటారు. అటువంటి వారి నిమిత్తమై యేసయ్య ఏమన్నాడో క్రింది వచనంలో చూడండి!

మత్తయి 13: "57. అయితే యేసుప్రవక్త తన దేశము లోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. 58. వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు."

దేవుని పరిచారకుడు సొంత ఊరిలో, ఇంటిలో తప్ప ప్రతి చోట ఘనంగా చూడబడుతాడని. తరువాత ఏమి జరిగింది, వారి అవిశ్వాసమును బట్టి అయన అనేకమైన  అద్భుతములు చెయ్యలేదు. నీ అవిశ్వాసమును బట్టి అనగా సాటి సహోదరునికి, సహోదరికి ఉన్న జ్ఞానము దేవుడే ఇస్తున్నడని నమ్మకుండా, నీ గర్వమును బట్టి, అభ్యంతరపడితే నీ జీవితంలో కూడా  జరిగే అద్భుతములు ఆగిపోతాయేమో ఆలోచించుకో! వారు ఏమి చెప్పిన అద్భుతం అని పొగడవలసిన అవసరం లేదు! కానీ వారిని ప్రోత్సహిస్తూ సూచనలు ఇవ్వటం, ప్రభువులో వారిని బలపరుస్తుంది, సంఘముకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. 

మత్తయి 8: "10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను." 

పై వచనము చూడండి! యేసయ్య విశ్వాసము చూపించిన వారిని ఎంతగా ప్రశంసించేవాడో తెలుస్తుంది. తన దగ్గరికి వచ్చిన శతాధిపతినే కాకుండా, తమ విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన వారిని ఎల్లప్పుడూ అయన ప్రసంశించాడు. వారు స్వస్థత కోసం  విశ్వాసం చూపించారు కదా అని నిర్లక్ష్యం చెయ్యలేదు. వారిని మరింతగా బలపరచటానికి ఎల్లప్పుడు వారి విశ్వాసమును  ప్రసంశించాడు  యేసు ప్రభువు

మత్తయి  16: "17.  అందుకు యేసు సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు." 

చూడండి, "నీవు దైవ కుమారుడివి" అన్న పేతురును పై వచనములో యేసయ్య ఎలా ప్రసంశించాడో! ప్రియ సహోదరి, సహోదరులారా తోటి వారిని ప్రసంశించటంలో చొరవ చూపించండి. వారికి ఉన్న తలాంతులను బట్టి, పరిచర్యను బట్టి, విశ్వాస జీవితమును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కానీ "ఇక చాలులే" అని చులకనగా చూడకండి, నిర్లక్ష్యం చేయకండి, ప్రభువుకు వారి పట్ల ఉన్న ఉద్దేశ్యాలకు అడ్డుపడకండి. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

23, డిసెంబర్ 2020, బుధవారం

క్రిస్మస్ అంటే ఏమిటి? మూడవ భాగము

రెండవ భాగము కోసం ఇక్కడ నొక్కండి

దేవుని మహా కృపను బట్టి మొదటి భాగములో సాతాను ఎలా ఏర్పడ్డాడు, వాడు చేసే కార్యములు ఏమిటి! మనుష్యులను మోసగించి వారిని ఎలా  పాపము లోకి నెట్టి దేవునికి దూరం చేస్తున్నాడు తెలుకున్నాం.  రెండవ భాగంలో ఇశ్రాయేలు జనము ఎలా ఏర్పడ్డారు, యేసు క్రీస్తుకు ముందు ఉన్న జనము ఎలా పాపమునకు క్షమాపణ పొందారని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుకోవాల్సిన సంగతులు మానవ శరీరంలో భూమి మీదికి వచ్చిన  యేసు క్రీస్తు పాప రహితుడిగా ఎలా పరిగణింప బడ్డాడు? 

దేవుడు ఇశ్రాయేలు జనమును ఏర్పరచుకొని, ఆ జనముకు రెండవ రాజుగా ఏర్పరచిన దావీదు వంశమయిన యూదా నుండి యేసు క్రీస్తును లోకమునకు అనుగ్రహించాడు. 

మత్తయి 1: "17.  ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు."

పై వచనము అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు యేసు క్రీస్తు వంశావళిని పద్నాలుగు తరములని స్పష్టం చేస్తుంది. అలాగే ఇశ్రాయేలు జనము చరిత్రలో జరిగిన ప్రతి ప్రాముఖ్యమయిన సంఘటనకు ముందు, తర్వాత పద్నాలుగు తరములని తెలుస్తుంది. యేసు క్రీస్తు పూర్తీ వంశావళి అనగా ఆదాము నుండి, యేసయ్య తండ్రిగా చెప్పబడిన,  యోసేపు వరకు తెలుకోవటానికి లూకా సువార్త మూడవ అధ్యాయం 23 నుండి చివరి వచనం వరకు చూడవచ్చు.  అయితే దావీదు "తల్లి గర్భము నందే నేను పాపములో ఉన్నాను" అని రాసినప్పుడు, మానవ శరీరంలో తల్లి గర్భము నుండి ఏర్పడిన యేసయ్యకు పాపం ఎలా అంటలేదు? 

యేసు క్రీస్తుకు ముందు దేవుడు మోషే ద్వారా ధర్మ శాస్త్రమును రాయించి దానిని  పాటిస్తూన్న  వారిని నీతిమంతులుగా పరిగణించాడు. పాపం చేసిన వారికి ప్రాయశ్చిత్తంగా వారి తరపున బలులను అర్పించే ప్రధాన యాజకులను నియమించి,  వాటి రక్తం ద్వారా వారి పాపలకు ప్రాయశ్చిత్తమును అంగీకరించాడని రెండవ భాగంలో తెలుసుకున్నాం. అయినప్పటికి దారి తప్పిపోతున్న ప్రజలను నిత్యమూ హెచ్చరించటానికి తాను ఎన్నిక చేసుకున్న కొంతమంది భక్తులను తన ప్రవక్తలుగా ఏర్పరచుకొని, వారి ద్వారా ప్రజలతో మాట్లాడాడు. అటువంటి ప్రవక్తలలో యెషయా ఒక్కరు. మొదటి భాగంలో ఈయన రాసిన దేవుని వాక్యం నుండే మనం  సాతాను గురించి తెలుకున్నాం. యేసు క్రీస్తును గురించి ఏడు వందల సంవత్సరాలకు ముందే అయన పుట్టుకను గురించి ఈయన ప్రవచించాడు. 

యెషయా 7: "14 కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును."

యెషయా 9: "6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7.  ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును."

పై వచనములు  స్పష్టం చేస్తున్న సంగతి ఏమిటీ? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. మరియు అయన మీద రాజ్య భారము ఉంటుంది. అనగా అబ్రాహాముకు దేవుడు వాగ్దానము చేసిన విధంగా,  గలతీయులకు 3: "8.  దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను." ఆ శిశువు మీద, అనగా యేసు క్రీస్తు మీద విశ్వాసముంచిన ప్రతి వారు అబ్రాహాము సంతానముగా పరిగణింపబడుతారు. దావీదు రాజుగా ఉండి ఎలాగయితే ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడో, యేసు క్రీస్తు అధికారమును వారి జీవితాలలో అంగీకరించిన వారిని అనగా అయన యందు విశ్వాసముంచిన వారందిరికి తన నీతిని అనుగ్రహించి వారిని పాపమూ నుండి రక్షిస్తాడు. 

యేసు క్రీస్తును మరియ కన్యకగా ఉన్నపుడే గర్భము దాల్చిందని స్పష్టమయింది. దేవుని శక్తి ద్వారా మానవ ప్రమేయం లేకుండా అనగా యేసు తండ్రిగా పరిగణింపబడిన యోసేపు మరియను కూడక ముందే ఆమె గర్భవతిగా అయింది. దానిని బట్టి యేసయ్యకు జన్మతః పాపము లేదు. అయితే మానవ శరీరము పాపముతో నిండుకున్నదని నేర్చుకున్నాము కదా! మరి యేసయ్యకు అలాగయినా పాపం అంటుకోవాలి కదా? 

రోమీయులకు 8: "4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను."

పై వచనము ద్వారా అవగతమవుతున్న విషయం ఏమిటీ? దేవుడు తన కుమారుణ్ణి అనగా యేసు క్రీస్తును పాపపు శరీరాకారముతో అనగా మనవలె అన్నింటికీ శోధింపబడే లక్షణములు  ఉన్న శరీరము అనగా దేవుని వాక్యమునకు విరుద్ధంగా నడుచుకునే శరీరము పొందుకొనియు అయన పాపము లేని వాడిగా జీవించాడు.  అనగా ఆదాము నుండి పొందుకున్న శరీరము కాకుండా పరిశుద్దాత్మ శక్తితో అటువంటి లక్షణములు కలిగిన శరీరమును అయన పొందుకున్నాడు. కనుక ఆయనలో జన్మతః పాపం లేదు. మరి కర్మతః కలిగే పాపం సంగతి ఏమిటి? అనుదినము దేవుని మీద ఆధారపడుతూ, వాక్యాను సారముగా జీవిస్తూ, పరిశుద్దాత్మ నడిపింపు ద్వారా దానిని కూడా అయన జయించాడు. కనుకనే దేవుడు ఆయనను నిర్దోషిగా ఎంచి  పాపమునకు  బలిగా మార్చి, మానవాళి కంతటికీ ఒకేసారి ప్రాయశ్చిత్తము జరిగించాడు. 

రోమీయులకు 10: "9. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును." 

యేసు క్రీస్తు మానవాళికి ఇచ్చిన అయన నీతిని పొందుకోవటం ఎలాగో పై వచనములు తెలియజేస్తున్నాయి. ప్రతివారు నోటితో తమ పాపములు ఒప్పుకొని, యేసు క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపెనని హృదయమందు నమ్మిన చాలు, దేవుడు పాపము లేని యేసు క్రీస్తును బలిగా చేయటం  ద్వారా, మానవాళి కొరకు జరిగిన ప్రాయశ్చిత్తమును బట్టి, అయన నీతిని మనకు ఆపాదించి మన పాపముల నుండి మనలను రక్షిస్తాడు. అనగా  మరణము తర్వాత మన పాపములను బట్టి దేవుని తీర్పు ద్వారా మనకు కలిగే నరకము శిక్ష నుండి విడుదల దయచేసి పరలోకము అనగా అయన సన్నిదిని మనకు అనుగ్రహిస్తాడు. యేసు క్రీస్తు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో మన పాపములు రద్దు చెయ్యబడ్డాయి, కనుకనే మనకు పాప క్షమాపణ కలిగింది. 

కానీ పాపముతో నిండిన మన శరీరము పాపమును జయించటం సాధ్యమేనా? పాపమూ లేని యేసు క్రీస్తును మనం అనుసరించటం సాధ్యమేనా? మానవ శరీరములో ఉన్న యేసయ్య, మనవలెనే శోదించబడి వాటన్నింటిని జయించాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు పరిశుద్ధాత్మ  ద్వారా క్రింది వచనంలో ప్రస్తావించాడు. 

హెబ్రీయులకు 4: "15. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను." 

అయన తన శరీరమును నలుగ గొట్టుకొని అనగా తన సొంత చిత్తమును విసర్జించి దేవుని చిత్తమును నెరవేర్చాడు అనగా మనం వాక్యానుసారముగా జీవించటం, ఉద్దేశ్య పూర్వకమయిన పాపమును జయించే స్థితిలో మనలను ఉంచుతుంది. అంతే కాకుండా యేసు క్రీస్తు సిలువ మరణము పొందక మునుపు మరొక ఆదరణ కర్తను తన పట్ల విశ్వాసము ఉంచిన వారికి వాగ్దానము చేసి ఉన్నాడు. ఆయనే పరిశుద్దాత్మ. 

యోహాను 14: "26. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును."

పై వచనము ఈ పరిశుద్దాత్మ యేసు క్రీస్తు యొక్క బోధనలు గుర్తు చేస్తూ అయన వలెనే మనం జీవించు లాగున నిరంతరం తన నడిపింపును మనకు దయచేస్తాడని ఉటంకిస్తుంది. మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? 

లూకా 1: "35.  దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును."

లూకా 1: "38.  అందుకు మరియఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను." 

పై రెండు వచనములు చూడండి! పరిశుద్దాత్మ శక్తి తనను కమ్ముకొని గర్బవతివి అవుతావని మరియకు దూత చెప్పినప్పుడు ఆమె పూర్తిగా దేవుని చిత్తముకు లోబడింది, అనగా పరిశుద్ధాత్మకు తనను తానూ అప్పగించుకుంది. లోకమునకు భయపడలేదు, తనకు వచ్చే నిందలను పట్టించుకోలేదు. కనుకనే ఆ పరిశుద్దాత్మ శక్తి ద్వారా తన గర్భమందు యేసు క్రీస్తు శరీరమును లేదా  రూపమును పొందగలిగింది. యేసు క్రీస్తు వాగ్దానము చేసిన ఈ పరిశుద్దాత్మ దేవుడు మన గురించి కూడా విచారిస్తూ ఉంటాడు. క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించుకున్నది మొదలు ఈయన మనలను హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ క్రీస్తు స్వరూపంలోకి మనలను మారుస్తుంటాడు. ఈ పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడి మన చిత్తమును విసర్జించి, యేసు క్రీస్తు బోధనలు పూర్తిగా పాటించిన నాడు పరిశుద్దాత్మ దేవుడు క్రీస్తును అనగా అయన స్వరూపమును  మన హృదయాలలో ఏర్పరుస్తాడు. ఆనాడే మనకు నిజమయిన క్రిస్మస్. పరిశుద్ధ దేవుని నామములో మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

22, డిసెంబర్ 2020, మంగళవారం

క్రిస్మస్ అంటే ఏమిటి? రెండవ భాగము

మొదటి భాగము కోసం ఇక్కడ నొక్కండి

ఆదికాండము 3: "16.  ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. 17.  ఆయన ఆదాముతోనీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;"

ఆదాము, అవ్వలు సాతాను అబద్దాలను నమ్మి  దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుడు ఆ పాపమును బట్టి సర్పమును శపించి  అవ్వను శిక్షించాడు అదే విధంగా ఆదామును బట్టి భూమిని శపించాడు. ఆ తరుణంలో దేవుడు మానవాళి పట్ల తానూ నెరవేర్చబోయే వాగ్దానమును సెలవిచ్చి యున్నాడు. 

ఆదికాండము 3: "15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను."

పై వచనములో స్త్రీ సంతానము యేసు క్రీస్తును ఉద్దేశించి చెప్పిన మాటలు. ఇవే మాటలను అపొస్తలుడయినా పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో వివరించారు.

గలతీయులకు 4: "4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, 5. మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను." 

పై వచనము స్పష్టము చేస్తున్న విషయము ఏమిటీ? దేవుడు మానవాళికి వాగ్దానము చేసినట్లుగా తన కుమారుణ్ణి, యేసు క్రీస్తును, ఈ లోకమునకు పంపి ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. తద్వారా ఆయనను నమ్మిన వారందరికి అయన నీతి వర్తించేలాగున ఆయనను అనుగ్రహించాడు. ఈ విషయాలను మరింత బాగా స్పష్టం చేసే ముందు, మొదటి భాగములో చెప్పిన దేవుని నియమాలు ఏమిటి? వాటిని చూసే ముందు ఇశ్రాయేలు జనమును గురించి తెలుకోవటం అవసరం. 

గలతీయులకు 3: "6.  అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. 7. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. 8.  దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. 9. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు." 

పై వచనములో ఉన్న ఈ అబ్రాహాము గారు అప్పుడు ఉన్న ప్రజలకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి. విగ్రహారాధనను వ్యతిరేకించి తన విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించి అయన అనుగ్రహం పొందిన వాడు. సంతానము లేని తనకు దేవుడు ఇచ్చిన వాగ్దానము "నీ సంతానమును గొప్పగా విస్తరింపజేస్తానని, సముద్రములో ఇసుక రేణువులంతగా అయన సంతానము ఉంటుందని". తన వాగ్దానము ప్రకారము దేవుడు అబ్రాహాముకు ఇస్సాకు అనబడే కుమారుని అనుగ్రహించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు యాకోబు. ఈ యాకోబు దేవునితో పెనుగులాడి ఆశీర్వదింపబడ్డాడు. అందునుబట్టి దేవుని తో ఇశ్రాయేలు అని పిలవబడ్డాడు. 

ఆదికాండము 32: "28.  అప్పుడు ఆయననీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను." 

ఈ ఇశ్రాయేలుకు / యాకోబుకు పన్నెండుమంది కుమారులు, వారి ద్వారానే ఇశ్రాయేలు జనములో గోత్రాలు ఏర్పడ్డాయి. ఇశ్రాయేలు జనమును దాస్యము లో నుండి విడిపించిన తర్వాత దేవుడు కొన్ని గోత్రములకు విధులను సూచించాడు. అయితే వారిలో లేవియులు యాజకత్వము చేయాలనీ దేవుని నిర్ణయము. ఈ లేవీయులు దేవుని మందిరములో ఉంటూ ప్రజలు తెచ్చే పాప పరిహారములను వారి తరపున దేవునికి బలులుగా అర్పించేవారు. దేవుడు ప్రతి పాపమునకు ఎటువంటి బలి అర్పించాలన్న నిబంధనలు రాయించాడు. 

లేవీయకాండము 6: "6.  అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను. 7.  ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును." 

లేవీయకాండము 17: "11. ​రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును." 

హెబ్రీయులకు 9: "1. ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, పాపములకొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. 2. తానుకూడ బలహీనతచేత ఆవరింపబడియున్నందున అతడు ఏమియు తెలియనివారియెడలను త్రోవతప్పిన వారియెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. 3. ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు."

పై వచనములు స్పష్టం చేస్తున్నది ఏమిటి? రక్తము చిందితేనే పాపమునకు క్షమాపణ. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు జనములో లేవి వంశము నుండి ఒక ప్రధాన యాజకుడు తన పాపములను బట్టి ప్రాయశ్చిత్తము చేసుకొని తర్వాత ప్రజల పాపమూ నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేస్తాడు. తద్వారా వారి పాపములకు దేవుని యెదుట ప్రాయశ్చిత్తము చెల్లించి క్షమాపణ పొందారు అప్పటి ప్రజలు. 

హెబ్రీయులకు 2: "14. ......మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, 15. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను. 16. ఏల యనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు."

పై వచనంలో మరణ బలము గలవాడు అనగా అపవాది అంటే మొదటి భాగములో చెప్పుకున్న సాతాను. అనగా అహంకారము చేత దేవునికి లోబడక నరకమునకు అణగద్రొక్కబడ్డవాడు. వాడిని మరణము ద్వారా నశింపజేయటానికి, మరణ భయము చేత అనగా పాపమూ ద్వారా వచ్చే దాని చేత పీడింపబడుతున్న వారిని విడిపించుఁటకు అబ్రాహాము సంతానంగా అనగా మానవునిగా అవతరించాడు. ఆపై మరణము పొంది తానూ చేసిన శాసనము చెల్లుబాటు చేశాడు అని క్రింది వచనముల ద్వారా స్పష్టం అవుతుంది. 

హెబ్రీయులకు 9 : "16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?" 

మరియు  ప్రధాన యాజకులు చేసే ప్రాయశ్చిత్తము కంటే, పాపమూ లేని యేసు క్రీస్తు రక్తము ఒకేసారి మానవాళికి పాప క్షమాపణ  అనగా మరల, మరల అవే బలులు అవసరం లేనంతగా పాపమును రద్దు చేసిందని క్రింది వచనముల ద్వారా మనకు అవగతమవుతుంది. 

హెబ్రీయులకు 10: "10. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. 11.  మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. 12. ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, 13. అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను. 14. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

అయితే మొదటి భాగము లో మనం నేర్చుకున్న ముఖ్యమయిన అంశము, ప్రతి వాడు పాపం చేసియున్నాడు, తల్లి గర్భమందే మనలను పాపం ఆవరించిందని. ఆదాము అవ్వల ద్వారా మనం పొందుకున్న శరీరం పాపంతో నిండుకున్నదని తెలుసుకున్నాం.  మరి మనిషిగా పుట్టిన యేసు క్రీస్తు పాపంలేని వాడిగా ఎలా పరిగణింపబడ్డాడు? అయన కూడా మానవ శరీరంలోనే ఈ భూమి మీదికి వచ్చాడు కదా! వచ్చే భాగంలో దేవుని చిత్తను సారముగా తెలుసుకుందాం. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!

మూడవ భాగము కోసం ఇక్కడ నొక్కండి

19, డిసెంబర్ 2020, శనివారం

క్రిస్మస్ అంటే ఏమిటి? మొదటి భాగము

క్రైస్తవులు జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్. అనగా క్రైస్తవులకు ఆరాద్యుడయినా యేసయ్య ఈ లోకంలో పుట్టిన దినముగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ గురించి అనగా యేసయ్య పుట్టుకను గురించి బైబిల్ ఆధారముగా లోతుగా తెలుసుకుందాం. దేవుడు సర్వ సృష్టిని తన నోటి మాట చేత సృష్టించాడు అని పరిశుద్ధగ్రంథం బైబిల్ మనకు బోధిస్తోంది.  బైబిల్ లో మొదటి గ్రంథమయిన ఆదికాండములో క్రింది వచనములు చూడండి.

ఆదికాండము 1: "1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ......."
 
మొదటి వచనములో "దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను" అని ఉంది. రెండవ వచనమునకు వచ్చేసరికి "భూమి నిరాకారముగా ఉండెను" అని ఉంది! దేవుడు సృషించిన దానికి ఆకారము లేకుండా ఉంటుందా? అంటే మొదటి వచనమునకు మరియు రెండవ వచనమునకు మధ్యలో ఎదో జరిగింది. యేసు క్రీస్తును గురించి ప్రవచించిన యెషయా ప్రవక్త గ్రంథమును చూస్తే విషయం మనకు అవగతమవుతుంది. 

యెషయా 45: "18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను......."

పై వచనంలో చూస్తే దేవుడు దేనిని నిరాకారముగా చెయ్యడు. అయితే నివాసయోగ్యముగా  ఉన్న భూమి మరీ నిరాకారముగా ఎలా మారింది? క్రింది వచనములు చూడండి, దేవుడి సృష్టి నశించి పోవటం కనబడుతుంది. 

యెషయా 14: "12. తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? 13. నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును 14.  మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

దేవుడు సృష్టించి అధికారం ఇచ్చిన ప్రధాన దూత దేవుడి అధికారమునకు ఒప్పుకొనక అనగా అయన ఆజ్ఞలను అతిక్రమమించి, ఆయననే మించి పోవాలని గర్వపడిన  వానిని మరియు వాని అనుచరులను దేవుడు పాతాళమునకు అనగా నరకమునకు అణగదొక్కాడు. అటువంటి  వాడు దేవుని సృష్టిని నశింపజేశాడు, అంతే కాకుండా దేవుడు ప్రేమించి సృష్టించిన మానవాళిని ఆయనకు వ్యతిరేకంగా, అనగా ఆజ్ఞలను దిక్కరించేలా చేయటం, నిత్యమూ అపవిత్రపు తలంపులతో దేవునికి దూరంగా ఉంచటమె ఆ సాతాను పని. (ఈ సాతాను గురించి మరిన్ని  వివరాలకు యెహెజ్కేలు 28:13-15 లో చదవవచ్చు)  నిజానికి దేవుని ఉద్దేశ్యంలో మనం ఎల్లప్పుడూ ఏదెను వనములో ఆయనతో సహవాసం చేయాలనీ. 

కానీ ఈ సాతాను మొదటి మానవులయిన ఆదాము, అవ్వలను శోధించి దేవుని ఆజ్ఞలను దిక్కరింపజేసాడు. వారిని తనవలె పాపులుగా మార్చి ఏదెను వనమునకు  అనగా  దేవుని సన్నిధికి దూరం చేసాడు. సర్వ సృష్టిని నోటి మాటతో చేసిన శక్తి మంతుడయినా దేవుడు, మనుష్యులను మాత్రం తన స్వరూపంలో చేయడానికి మట్టిని పోగెసి ఎంతగానో శ్రమించి చేతితో మనలను నిర్మించి,  తన ఊపిరిని ఊదాడు. అటువంటి మనుష్యులను దేవుడు ఎందుకు ఏదెను వనము నుండి ఆదాము, అవ్వను ఎందుకు వెళ్ళ గొట్టాడు? 

యాకోబు 4: "17. కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును."

1 యోహాను 3: "4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము." 

పై రెండు వచనములు పాపమూ యొక్క నిర్వచనమును సూచిస్తున్నాయి. ఆదాము, అవ్వలు దేవుడు తినవద్దని చెప్పిన చెట్టు యొక్క ఫలములు తిని ఆయన ఆజ్ఞను ధిక్కరించారు. కనుకనే పాపం చేసిన వారిగా మారిపోయారు. ఎందుకు ఆ చెట్టును పెట్టాడు దేవుడు? వారు పాపంలో పడిపోవాలనా? స్వేచ్ఛగా ఉంటూ తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వారినే దేవుడు కోరుకున్నాడు. అంటే సొంత చిత్తమును మానుకొని దేవునికి లోబడి అయన మీద ప్రేమను చూపించటం. ఆదాము, అవ్వల విషయంలో చెట్టు ఫలములు తినే అవకాశం ఉన్న కూడా తినకుండా ఉండగలగటం, కానీ వారు దేవుడు చెప్పిన మాటలు నమ్మకుండా సాతానుకు లోబడి చెట్టు ఫలములు తిన్నారు. ఆజ్ఞ అతిక్రమము ద్వారా దేవుని మహిమను కోల్పోయారు. అందువలన ఆయన సన్నిధికి దూరం చేయబడ్డారు. తద్వారా పాపం వలన వచ్చే జీతము మరణమునకు పాత్రులుగా మారిపోయారు. మరణము తర్వాత ఏమి జరుగుతుంది? 

ప్రసంగి 12: "7.  మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును."

మత్తయి  10: "28.  మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి."

పై రెండు వచనములను బట్టి మరణము తర్వాత మంటితో చేసిన శరీరము మన్నుగా మారిపోతుంది. మరణము లేని ఆత్మ తీర్పుకు లోనవుతుంది. మనం చేసిన పాపములను బట్టి దేవుడు శిక్షావిధిని అమలు చేస్తాడు. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిన వచనము చూడండి! "ఆత్మను కూడా నరకములో నశింపజేయు వానికి భయపడుడి" అని హెచ్చరిస్తున్నాడు.  అదే విధముగా సాతాను గురించి యెషయా ప్రవక్త చెప్పిన వచనములో "తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?" (యెషయా 14:17) వారి నివాస స్థలము ఏమిటీ? దేవుని సన్నిధి అనగా పరలోకము. దేవుని బిడ్డలను  అనగా మనుష్యులను పాపమునకు బానిసలుగా చేసి అపవిత్రపు స్థితిలో ఉంచుతూ దేవుని సన్నిదికి దూరం చేస్తూ ఉన్నాడు. 

ఇంత చేస్తుంటే దేవుడు ఈ సాతానును నశింప చేయవచ్చు కదా? ఏదెను వనములో చెట్టు ఉన్నట్లే ఇప్పుడు సాతాను చూపించే లోక ఆశలు, ఆకర్షణలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అనగా అయన వాక్యానుసారముగా జీవించటమె మనం చేయవలసిన పని. అటుపై మరణం తరువాత నశించని ఆత్మ అయన తీర్పు చొప్పున పరలోకం అనగా అయన సన్నిధి చేరుకుంటుంది. పాటించని వారు నరకము చేరుకుంటారు. యేసయ్య చెప్పిన బోధనల ప్రకారం "అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏడుపు మరియు పండ్లు కొరుకుడు ఉంటాయి". యుగయుగములు ఆ నిత్య నరకాగ్నిలో బలి కావాల్సి ఉంటుంది. 

ఆదాము అవ్వల నుండి వచ్చిన మానవులుగా మనం కూడా పాపమూ నిండిన శరీరులుగా ఉన్నాము. కనుకనే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్దాత్మ ప్రేరణతో ఇలా రాసారు:

రోమీయులకు 3: "23. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు." 

ఏ భేదము లేదు ప్రతి వాడు పాపమూ చేసి దేవుడు ఇచ్చు మహిమను మరియు పవిత్రతను కోల్పోతున్నారు. మనలో జన్మతః పాపమూ, మరియు కర్మతః పాపమూ ఉంటున్నాయి. దావీదు రాసిన కీర్తనలో ఇదే విషయమును వివరించాడు. 

కీర్తనల గ్రంథము 51: "5.  నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను." 

తల్లి గర్భమునుండే మనలను పాపం అంటిపెట్టుకొని ఉంది. అంటువంటి మనుష్యులను దేవుడు విడనాడి నాడా? ఆదాము అవ్వలను ఏదెను వనములో నుండి వెళ్లగొట్టె ముందు జంతువులను చంపి వాటి చర్మముతో  వారికి వస్త్రములను చేసాడు. వారిని నిత్యమూ రక్షిస్తూ, ఫలించుమని ఇచ్చిన దీవెనలు నెరవేర్చాడు. మనసాక్షి ద్వారా తప్పొప్పుల విచక్షణను ఏర్పరచి తనకు దగ్గరగా నడవటానికి  అవకాశం ఇచ్చాడు. అంతే కాకుండా ప్రత్యక్షంగా మంచి చెడ్డలు బోధించాడు. 

ఆదికాండము 4: "6. యెహోవా కయీనుతోనీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి? 7.  నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను."

తరువాత పది ఆజ్ఞలు లేదా ధర్మ శాస్త్రమును ఇచ్చి తన మార్గములో నడిచే లాగున కట్టడలు చేసాడు. అయినప్పటికి మనుష్యులు అయన ఆజ్ఞలను ధిక్కరిస్తూ పాపములో పడి నశించిపోతుంటే, దేవుడు కొన్ని నిబంధనలు ఏర్పరచాడు. తద్వారా వారి పాపములకై చేసే ప్రాయశ్చిత్తము ద్వారా క్షమాపణ పొందే మార్గము చూపించాడు. దేవుడు చేసిన నిబంధనలు ఏమిటి? ఆ నిబంధనలు ఉన్నపుడు యేసయ్య ఎందుకు ఈ భూమి మీద పుట్టాడు? వచ్చే భాగంలో దేవుని చిత్తను సారముగా తెలుసుకుందాం. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!

రెండవ భాగము కోసం ఇక్కడ నొక్కండి