పేజీలు

7, నవంబర్ 2020, శనివారం

నీ కానుక దేవునికి ఇష్టమేనా?

దేవుడు మనకు చేసిన మేలులను బట్టి ఆయనకు  కృతఙ్ఞతగా మనకు కలిగిన దానిలోనుండి కొంత భాగము అనగా పదవ వంతు ఆయనకు సమర్పించమని దేవుని వాక్యము సెలవిస్తోంది. అయితే ఈ  సమర్పణ మొక్కుబడిగా, మరియు అసమ్మతితో కాకుండా మనస్పూర్తిగా సమర్పిస్తేనే అయన దాన్ని ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు అని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవుడు అతి పరిశుద్ధుడు, అయన సర్వమును సృష్టించిన సర్వాధికారి, సార్వభౌమాధికారం కలవాడు. ఆయనకు కొదువయినది ఏది లేదు, కానీ మన కృతజ్ఞతను, అయన పట్ల మనకున్న విశ్వాసమును, విధేయతను చాటుకోవడానికి మాత్రమే మనకు కలిగిన దానిలో శ్రేష్ఠమయిన వాటిని మాత్రమే సమర్పించాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు. అంతే కాదు, మనం పవిత్రంగా ఉన్నప్పుడే మన కానుకలు, మన సమర్పణలు దేవుని సన్నిధిని చేరుతాయి, అయనకు అంగీకారయోగ్యమవుతాయి. అధమమైన వాటిని, పొగరుబోతు తనంతో, మరియు హృదయము శుద్ధి లేకుండా ఇచ్చే కానుకలు ఆయన స్వీకరించడు ఎందుకంటే అవి అయన దృష్టిలో శ్రేష్ఠమయినవి కావు. శ్రేష్ఠమయిన సమర్పణ ఏమిటి? వాటికి ఆ శ్రేష్ఠత ఎలా వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు బైబిల్ గ్రంథం నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

బైబిల్ లో మొట్ట మొదటి కృతజ్ఞత సమర్పణ ఆదికాండము 4 వ అధ్యాయంలో రాయబడింది. అది ఆదాము, అవ్వ కుమారులయిన కయీను మరియు హేబెలు చేసిన సమర్పణ. క్రింది వచనములలో ఆ సంఘటనను మనం అధ్యాయనం చెయ్యవచ్చు. 

ఆదికాండము 4: "3.కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. 4. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; 5. కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా" 

దేవుని వాక్యము ఎంతో సున్నితమయినది, మరియు ఖచ్చితమయినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరు అన్నదమ్ములు దేవునికి తాము తెచ్చిన కృతజ్ఞత సమర్పణలు అనగా నేటి కాలంలో దశమ భాగములు  ఎటువంటివో  స్పష్టమవుతుంది. కయీను తనకు కలిగిన వాటిలో కొంత ఆర్పణగా తెచ్చాడు కానీ వాటి గురించి ఎటువంటి ప్రత్యేకత చెప్పబడలేదు. మొదటి పంట అనో లేదా శ్రేష్ఠమయిన పంట అనో ఇలా ఏలాంటి ప్రత్యేకత చెప్పబడలేదు. మరి హేబెలు అర్పణను చూస్తే అతను తోలి చూలున పుట్టిన వాటిలో క్రొవిన వాటిని తెచ్చాడు అని చెప్పబడింది. తొలుచూలున పుట్టినవి చాల బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అందులోంచి క్రొవిన వాటిని తెచ్చాడు, బలహీనమయినవి కావు. అతని సమర్పణ చూస్తే దేవుడంటే అతనికి ఉన్న భయభక్తులు, ఆయనకు శ్రేష్ఠమయిన వాటిని సమర్పించాలన్న తపన తెలుస్తుంది. కొంతమంది వివరణలు ఇచ్చినట్లుగా దేవునికి రక్తం అంటే ఇష్టం, అందుకే హేబెలు అర్పణ స్వీకరించాడని, లేదంటే భూమి శపించబడింది కాబట్టి అందులోంచి తెచ్చిన పంట దేవుడు అంగీకరించలేదని కాదు. దేవుడు చూసేది వారి యొక్క మనసును, అయన పట్ల వారికి ఉన్న శ్రద్ధాసక్తులు. ఒక వేళ పై వివరణలు నిజమయితే దేవుడు ఆ విషయాలు కయీనుతో చెప్పేవాడే కదా! కానీ దేవుడు కయీనుతో చెప్పిన మాటలు వింటే అతని సమర్పణ దేవుడు ఎందుకు స్వీకరించలేదో తెలుస్తుంది. 

ఆదికాండము 4: "6. యెహోవా కయీనుతోనీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి? 7.  నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను."

కయీను దేవునికి తెచ్చిన అర్పణ పట్ల అతనికి ఆసక్తి లేకపోవటమే కాదు! అతని ప్రవర్తన దేవుని దృష్టిలో సక్రమముగా లేదు. అతని క్రియలు సక్రమముగా లేకుండా పాపము వాకిట ఉన్నాడు, దాని పట్ల వాంఛ కలిగి ఉన్నాడు, దానిని ఏలుతున్నాడు. సోదరి, సోదరుడా మన అర్పణ దేవుడు వాటి విలువను బట్టి లెక్క వేయటం లేదు, వాటికి శ్రేష్ఠత అయన పట్ల మనకున్న  ఆసక్తిని బట్టి, మన పవిత్రతను బట్టి వస్తుంది.  

యేసు క్రీస్తుల వారు మార్కు సువార్తలో మనకు చూపిన ఒక సంఘటన ఈ విషయమును రూడి చేస్తుంది. 

మార్కు 12: "41. ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూ హము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచు చుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేష ముగా సొమ్ము వేయుచుండిరి. 42. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా 43. ఆయన తన శిష్యులను పిలిచికానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయ ముగా చెప్పుచున్నాను. 44. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను."

ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్న జనమును గమనిస్తూ ఉన్నాడు. చాల మంది ధనవంతులు తమకు కలిగిన దానిలో కొంత వేస్తూ తమ దర్పమును ప్రదర్శిస్తు గర్వపడుతున్నారు.  అది ఎంత మాత్రము వారికి ఆశీర్వాదము కాదు, దేవునికి ఆనందదాయకము కాదు. ఒక బీద విధవరాలు తనకు కలిగినదంతయు వేసింది. అది ఎంతో మొత్తము కాదు, కేవలం రెండు కాసులు మాత్రమె! కానీ అందరికన్న ఆమె ఎక్కువగా వేసిందని ప్రభువు సెలవిచ్చాడు. మనకు కలిగినదంతయు వేస్తేనే దేవుడు అంగీకరిస్తాడా? కానే కాదు! దేవుడు ఇక్కడ ఆమె హృదయమును చూశాడు, మనసారా ఇచ్చిన ఆమె కానుకను చూశాడు. అందుకే ఇతరుల ముందు డాంబికాలు ప్రదర్శించి తమకు కలిగిన దానిలో ఎదో చిన్న మొత్తం వేసిన ధనవంతులకంటే తానూ వేసిన ఆ రెండు కాసుల కానుక గొప్పదని యేసు ప్రభువు శిష్యులకు చెప్పాడు. 

మన కానుకలు అంగీకారయోగ్యం కావటానికి మరొక నియమం కూడా ఉంది. మత్తయి సువార్తలో యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో తెలియజేశారు. 

మత్తయి 5: "23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధ మేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల 24. అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము."

దేవుడు పాపులమయిన మనలను క్షమించి, యేసు క్రీస్తు ప్రభువు కార్చిన రక్తము ద్వారా మన పాపముల నుండి మనకు  విముక్తిని అనుగ్రహించాడు. అదే విధంగా మనం కూడా ఇతరులను క్షమించటమే కాకుండా, వారిని మనవలె ప్రేమించమని ఆయన వాక్యము సెలవిస్తోంది. మనం మన కానుకలు సమర్పించే ముందు తోటి సహోదరుడితో ఏదయినా తగువు ఉన్నట్లయితే వారికి క్షమాపణ చెప్పటమో లేదా వారితో ఆ తగువు తీర్చుకోవటమో చెయ్యాలి. అప్పుడే మన కానుకలు దేవునికి అంగీకారయోగ్యమవుతాయి. 

ఈ మధ్య కాలంలో దశమ భాగం గురించి వింత వింత బోధలు బయలు దేరాయి. ఆఖరికి లాటరీలు కూడా తీస్తామని, ఖరీదయిన కారులు ఇస్తామని కూడా చెపుతున్నారు. మీరు ఇంత శాతం ఇస్తే దేవుడు ఇంత శాతం మీకు తిరిగి ఇస్తాడని కూడా బోధిస్తున్నారు. ఇది వాక్యానుసారం కాదు. దేవుడు వడ్డీ వ్యాపారి కాదు, అయన బిసినెస్ మాన్ కాదు, రాజకీయ నాయకుడు కాదు పార్టీ ఫండ్ వసూలు చేయటానికి. మనకున్న సర్వం ఆయన ఇచ్చినదే అని గుర్తెరిగిన నాడు ఎంత ఇస్తే సరిపోతుంది అనిపిస్తుంది, సంతోషంగా ఇవ్వాలన్న భావన కలుగుతుంది. మనలను పోషించేవాడు ఆయనే అని నమ్మినప్పుడు, ఈ వ్యాపారపు ధోరణులు మాసిపోతాయి. ఇతర మతములలో ఉన్నట్లు వెండి తో గాని, బంగారముతో గాని మనకు పాప క్షమాపణ రాలేదు. కేవలం యేసు క్రీస్తుల వారి పవిత్ర రక్తము ద్వారా మనకు రక్షణ కలిగింది. అనవసరపు అభర్బాటాలకు పోకుండా మనకు కలిగిన దానిలో, అందరితో సమాధానంగా ఉంటూ, సత్క్రియలు చేస్తూ మనం ఎంత ఇచ్చిన దేవుడు అంగీకరిస్తాడు, తన చిత్తానుసారముగా ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి