
దేవుని మహా కృపనుబట్టి మనమందరము అయన చేత ఎన్నుకోబడి, అయన ఇచ్చిన విశ్వాసము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో కార్చిన పవిత్ర రక్తమును బట్టి మన పాపములన్ని రద్దవ్వటం చేత, అయన మరణము గెలిచి లేచిన విధమును బట్టి ఆయనలో నిరీక్షణ కలిగి ఉన్నాము. ఆయనతో సంబంధం కలిగి ఉన్న మనము తిరిగి లోకముతో సంబంధం కొనసాగించటం వాక్యమునకు విరుద్ధము. అనగా పూర్వ స్వభావమును విడిచి పాపమునకు దూరముగా ఉంటూ దేవునిపై విశ్వాసముతో వాక్యానుసారముగా మన జీవనం కొనసాగించాలి. దేవుడు తన యొక్క పరిశుద్దాత్మ మనకు దయచేసి, మనం పవిత్రులుగా ఉండులాగున మనకు తన యొక్క నడిపింపును అనుగ్రహిస్తాడు. అయితే దేవునికి మన పట్ల ఉన్న ప్రేమను బట్టి, మన బలహీనతలు ఎరిగిన వాడిగా నిత్యమూ తన క్షమాపణను మనకు దయచేస్తు ఉంటాడు. దానిని అలుసుగా తీసుకుని చాలామంది విశ్వాసులు తమ పూర్వ స్వభావమును పూర్తిగా వదిలేయకుండా మరల, మరల క్షమించమని ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడు నిజంగానే ప్రేమ స్వరూపుడు, అయనకు ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఇష్టంలేదు. మనకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షతను బట్టి, నడిపింపును బట్టి దేవుడు మనకు తన క్షమాపణను అనుగ్రహిస్తాడు. కానీ విశ్వాసులుగా చెప్పబడుతూ, తిరిగి పాపం వైపు అడుగులు వేయటం తగునా?
1 కొరింథీయులకు 2: "14. ప్రకృతి సంబందియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు"
అపొస్తలుడయినా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమంటున్నాడో చూడండి. అన్యజనులు దేవుని విషయములను నమ్మరు, ఎందుకంటే వారికి దేవుని ఆత్మ అనుగ్రహింపబడలేదు. ఈ వచనమును మరో విధంగా అర్థం చేసుకుంటే, అన్యులుగా పిలువబడుతున్న వారు దేవుని ఆత్మ విషయములను నమ్మక పోవటం వింత ఏమీకాదు. అవన్నీ కూడా అతనికి వెఱ్ఱితనముగా ఉన్నాయి. కానీ దేవుని వారలుగా, అయన వాక్యమును ఎరిగిన వారముగా ఉన్న మనము అటువంటి వెఱ్ఱితనములో పడిపోవటం దేవుని క్షమాపణను మనకు అనుగ్రహిస్తుందా? మరల మరల పాపముతో లేదా లోకముతో సంభందం మన రక్షణను ప్రతిబింబిస్తుందా? దేవుడు ఎంత కరుణ స్వరూపుడో అంతటి రోషము కలవాడు.
మత్తయి 6: "24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును......."
పై వచనంలో యేసు క్రీస్తు చెప్పినట్లుగా "ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఎవరో ఒకర్ని తృణీకరించవలసిందే." విశ్వాసులుగా ఉన్న మనము ఇద్దరు యాజమానులను అనగా లోకమును మరియు క్రీస్తును ఇద్దరిని ప్రేమించలేము. దానిని పవిత్రుడయిన, రోషముగల దేవుడు ఎంత మాత్రమూ ఒప్పుకోడు. ఇశ్రాయేలు జనము మొదలు నేటి వరకు ఈ ధ్వంద మనస్థితిని దేవుడు తీవ్రంగా పరిగణించాడు, ప్రతిసారి దానికి తగిన ఫలితములు వారికి జరిగించాడు. పాపముతో లేదా లోకముతో సంభందం మనకు కొనసాగుతున్న కొలది ఆత్మీయంగా మన ప్రయాణం కొనసాగుతుంది కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇశ్రాయేలు వారు అరణ్యములో నలుపది యేండ్లు ఏ ఫలితం లేకుండా ప్రయాణించారు తక్కువ వ్యవధిలో చేరావాల్సిన వాగ్దాన భూమిని చేరుకోలేక పోయారు. అటువంటి స్థితి మనకు కూడా రావచ్చు! అప్రమత్తులమై ఉండటం ఎంతయినా అవసరం.
ఫిలిప్పీయులకు 1: "9. మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెననియు, 10. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన 11. వారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను."
ఫిలిప్పి సంఘమునకు రాసిన ఈ లేఖలో పౌలు గారు విశ్వాసులమయిన మనము శ్రేష్ఠమయిన కార్యములు చేయుటయందు ఆసక్తిని కలిగి అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నారు. తద్వారా యేసు క్రీస్తు మనకు అనుగ్రహించిన నీతి ఫలములు పొందుకొని తీర్పు దినమందు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండవలెనని బ్రతిమాలుకొనుచున్నారు. దేవుని దృష్టికి శ్రేష్ఠమయిన పనులు అయన వాక్యానుసారముగా జీవిస్తూ లోకమును విసర్జించటమె.
1 రాజులు 18: "21. ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి."
ప్రవక్త అయినా ఏలీయా ప్రజలను హెచ్చరిస్తున్నాడు, రెండు తలంపులు కలిగి ఉండవలదని యెహోవా దేవుడయితే ఆయను అనుసరించుమని లేదా బయలు దేవుడయితే వాణ్ణి అనుసరించుమని అన్నప్పుడు, ఏ ఒక్కరు కూడా అతనికి వ్యతిరేకంగా సమాధానం చెప్పలేక పోయారు. అంటే యెహోవా నిజమయిన దేవుడని వారు ఎరిగి ఉన్నారు కనుకనే అతనికి సమాధానం చెప్పలేకపోయారు. యెహోవా నిజమయిన దేవుడని ఎరిగియు వారు అన్య దేవతలను పూజిస్తున్నారు, వారివలె మనం కూడా లోకముతో సంబంధం కలిగి ఉండటం సంజసమా? ఆ ప్రజలు సత్యమును ఎరిగియు దాన్ని పాటించటానికి ఇష్టపడలేదు కనుక దేవుని కనికరం వారి మీద ఉండబోదు. సత్యమును నమ్మక దుర్నీతియందు ఆసక్తిగల వారికి దేవుడే మోసము చేయు శక్తిని పంపుతున్నాడని లేఖనములు ప్రభోదిస్తున్నాయి.
2 థెస్సలొనీకయులకు 2: "11. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, 12. అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు."
పై వచనము దేవుని రోషమును సూచిస్తుంది. సత్యమును నమ్మక మరో విధంగా చెప్పలంటే దానిని పాటించక దుర్నీతియందు అనగా పాపమునందు ఆసక్తి కలిగియుండటం దేవునికి ఇష్టంలేని కార్యములు. అందునుబట్టి దేవుడు వారి మీదికి మోసము చేయు శక్తిని పంపుతున్నాడు. అనగా రక్షణలోనే ఉన్నాను అనే భావన కలిగి ఉండటం తప్ప నిజమయిన రక్షణ మననుండి దాటిపోయింది అని గుర్తించక పోవటమే.
ప్రకటన గ్రంథం 3: "16. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను."
తీర్పు దినమును మరియు పరలోక జీవితమును వర్ణించే ప్రకటన గ్రంథం లో పై వచనము చూడండి. దేవుడు ద్వంద మనస్కుల పట్ల ఎంత కఠినముగా ఉన్నాడో. నులి వెచ్చని స్థితి విశ్వాసులయిన మనకు ఎంత మాత్రము క్షేమకరం కాదు. దేవుడు అటువంటి వారి మీద ఉమ్మివేస్తానని చెపుతున్నాడు.
ప్రకటన గ్రంథం 2: "5. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును."
చివరగా మన స్థితిని గుర్తించి ఎక్కడ పడిపోయామో ఆ క్రియలన్ని మానేసి, తిరిగి మారు మనసు పొంది మరల మొదట చేస్తున్న క్రియలను అనగా దేవుని వాక్యానుసారమయిన క్రియలు చేస్తేనే దేవుడు తన రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. లేదంటే మనకు అనుగ్రహించిన అయన వెలుగును ఆర్పేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక సహోదరి, సహోదరుడా ఒక్కసారి రక్షింపబడితే చాలు, ఎన్ని మార్లయినా క్షమించమని అడిగితె చాలు అనుకోవద్దు. మరోసారి క్షమించమని అడిగే అవకాశం నీకు రాకపోవచ్చు. ఎందుకిలా జరుగుతుంది? ఎవరు చివరి వరకు కొసాగుతారో దేవునికి ఆ మాత్రం తెలియద! అన్న ప్రశ్న మనకు రావచ్చు. దేవుడు మనలను తన చేతిలో కీలు బొమ్మలుగా చెయ్యలేదు, అపరిమితమయిన స్వేచ్ఛను అనుగ్రహించాడు. తనను మనస్పూర్తిగా ఇష్టపడేవారినే అయన ఇష్టపడతాడు కానీ బలవంతంగా మరబొమ్మల వలె ఉన్నవారిని కాదు. మన క్రియలను బట్టి దేవుని ప్రణాళికలు మారిపోతూ ఉంటాయి తప్ప, అయన ఎన్నటికి మారని దేవుడు. కానీ మన పట్ల అయన ఎంతో వాత్సల్యత కలిగి ఉన్నవాడు, మనలో ఎవరు కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు, కనుకనే లేఖనములలో క్రింది వచనమును రాయించాడు.
విలాపవాక్యములు 3: "22. యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. 23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు."
మన పట్ల ఆయనకు ప్రతి దినము వాత్సల్యత కలుగుతున్నది కనుక మనం ఎప్పుడు పశ్చాత్తపపడి క్షమాపణ కోరుకుంటామా అని మన హృదయ ద్వారము నొద్ద నిలుచున్నాడు. సమయం మించి పోలేదు కనుక నీ స్థితిని గుర్తించు, క్షమాపణకు ప్రార్థించు, లోకమును శాశ్వతంగా విసర్జించు. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి