పేజీలు

23, డిసెంబర్ 2020, బుధవారం

క్రిస్మస్ అంటే ఏమిటి? మూడవ భాగము

రెండవ భాగము కోసం ఇక్కడ నొక్కండి

దేవుని మహా కృపను బట్టి మొదటి భాగములో సాతాను ఎలా ఏర్పడ్డాడు, వాడు చేసే కార్యములు ఏమిటి! మనుష్యులను మోసగించి వారిని ఎలా  పాపము లోకి నెట్టి దేవునికి దూరం చేస్తున్నాడు తెలుకున్నాం.  రెండవ భాగంలో ఇశ్రాయేలు జనము ఎలా ఏర్పడ్డారు, యేసు క్రీస్తుకు ముందు ఉన్న జనము ఎలా పాపమునకు క్షమాపణ పొందారని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుకోవాల్సిన సంగతులు మానవ శరీరంలో భూమి మీదికి వచ్చిన  యేసు క్రీస్తు పాప రహితుడిగా ఎలా పరిగణింప బడ్డాడు? 

దేవుడు ఇశ్రాయేలు జనమును ఏర్పరచుకొని, ఆ జనముకు రెండవ రాజుగా ఏర్పరచిన దావీదు వంశమయిన యూదా నుండి యేసు క్రీస్తును లోకమునకు అనుగ్రహించాడు. 

మత్తయి 1: "17.  ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు."

పై వచనము అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు యేసు క్రీస్తు వంశావళిని పద్నాలుగు తరములని స్పష్టం చేస్తుంది. అలాగే ఇశ్రాయేలు జనము చరిత్రలో జరిగిన ప్రతి ప్రాముఖ్యమయిన సంఘటనకు ముందు, తర్వాత పద్నాలుగు తరములని తెలుస్తుంది. యేసు క్రీస్తు పూర్తీ వంశావళి అనగా ఆదాము నుండి, యేసయ్య తండ్రిగా చెప్పబడిన,  యోసేపు వరకు తెలుకోవటానికి లూకా సువార్త మూడవ అధ్యాయం 23 నుండి చివరి వచనం వరకు చూడవచ్చు.  అయితే దావీదు "తల్లి గర్భము నందే నేను పాపములో ఉన్నాను" అని రాసినప్పుడు, మానవ శరీరంలో తల్లి గర్భము నుండి ఏర్పడిన యేసయ్యకు పాపం ఎలా అంటలేదు? 

యేసు క్రీస్తుకు ముందు దేవుడు మోషే ద్వారా ధర్మ శాస్త్రమును రాయించి దానిని  పాటిస్తూన్న  వారిని నీతిమంతులుగా పరిగణించాడు. పాపం చేసిన వారికి ప్రాయశ్చిత్తంగా వారి తరపున బలులను అర్పించే ప్రధాన యాజకులను నియమించి,  వాటి రక్తం ద్వారా వారి పాపలకు ప్రాయశ్చిత్తమును అంగీకరించాడని రెండవ భాగంలో తెలుసుకున్నాం. అయినప్పటికి దారి తప్పిపోతున్న ప్రజలను నిత్యమూ హెచ్చరించటానికి తాను ఎన్నిక చేసుకున్న కొంతమంది భక్తులను తన ప్రవక్తలుగా ఏర్పరచుకొని, వారి ద్వారా ప్రజలతో మాట్లాడాడు. అటువంటి ప్రవక్తలలో యెషయా ఒక్కరు. మొదటి భాగంలో ఈయన రాసిన దేవుని వాక్యం నుండే మనం  సాతాను గురించి తెలుకున్నాం. యేసు క్రీస్తును గురించి ఏడు వందల సంవత్సరాలకు ముందే అయన పుట్టుకను గురించి ఈయన ప్రవచించాడు. 

యెషయా 7: "14 కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును."

యెషయా 9: "6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7.  ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును."

పై వచనములు  స్పష్టం చేస్తున్న సంగతి ఏమిటీ? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. మరియు అయన మీద రాజ్య భారము ఉంటుంది. అనగా అబ్రాహాముకు దేవుడు వాగ్దానము చేసిన విధంగా,  గలతీయులకు 3: "8.  దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను." ఆ శిశువు మీద, అనగా యేసు క్రీస్తు మీద విశ్వాసముంచిన ప్రతి వారు అబ్రాహాము సంతానముగా పరిగణింపబడుతారు. దావీదు రాజుగా ఉండి ఎలాగయితే ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడో, యేసు క్రీస్తు అధికారమును వారి జీవితాలలో అంగీకరించిన వారిని అనగా అయన యందు విశ్వాసముంచిన వారందిరికి తన నీతిని అనుగ్రహించి వారిని పాపమూ నుండి రక్షిస్తాడు. 

యేసు క్రీస్తును మరియ కన్యకగా ఉన్నపుడే గర్భము దాల్చిందని స్పష్టమయింది. దేవుని శక్తి ద్వారా మానవ ప్రమేయం లేకుండా అనగా యేసు తండ్రిగా పరిగణింపబడిన యోసేపు మరియను కూడక ముందే ఆమె గర్భవతిగా అయింది. దానిని బట్టి యేసయ్యకు జన్మతః పాపము లేదు. అయితే మానవ శరీరము పాపముతో నిండుకున్నదని నేర్చుకున్నాము కదా! మరి యేసయ్యకు అలాగయినా పాపం అంటుకోవాలి కదా? 

రోమీయులకు 8: "4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను."

పై వచనము ద్వారా అవగతమవుతున్న విషయం ఏమిటీ? దేవుడు తన కుమారుణ్ణి అనగా యేసు క్రీస్తును పాపపు శరీరాకారముతో అనగా మనవలె అన్నింటికీ శోధింపబడే లక్షణములు  ఉన్న శరీరము అనగా దేవుని వాక్యమునకు విరుద్ధంగా నడుచుకునే శరీరము పొందుకొనియు అయన పాపము లేని వాడిగా జీవించాడు.  అనగా ఆదాము నుండి పొందుకున్న శరీరము కాకుండా పరిశుద్దాత్మ శక్తితో అటువంటి లక్షణములు కలిగిన శరీరమును అయన పొందుకున్నాడు. కనుక ఆయనలో జన్మతః పాపం లేదు. మరి కర్మతః కలిగే పాపం సంగతి ఏమిటి? అనుదినము దేవుని మీద ఆధారపడుతూ, వాక్యాను సారముగా జీవిస్తూ, పరిశుద్దాత్మ నడిపింపు ద్వారా దానిని కూడా అయన జయించాడు. కనుకనే దేవుడు ఆయనను నిర్దోషిగా ఎంచి  పాపమునకు  బలిగా మార్చి, మానవాళి కంతటికీ ఒకేసారి ప్రాయశ్చిత్తము జరిగించాడు. 

రోమీయులకు 10: "9. అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 10. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును." 

యేసు క్రీస్తు మానవాళికి ఇచ్చిన అయన నీతిని పొందుకోవటం ఎలాగో పై వచనములు తెలియజేస్తున్నాయి. ప్రతివారు నోటితో తమ పాపములు ఒప్పుకొని, యేసు క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపెనని హృదయమందు నమ్మిన చాలు, దేవుడు పాపము లేని యేసు క్రీస్తును బలిగా చేయటం  ద్వారా, మానవాళి కొరకు జరిగిన ప్రాయశ్చిత్తమును బట్టి, అయన నీతిని మనకు ఆపాదించి మన పాపముల నుండి మనలను రక్షిస్తాడు. అనగా  మరణము తర్వాత మన పాపములను బట్టి దేవుని తీర్పు ద్వారా మనకు కలిగే నరకము శిక్ష నుండి విడుదల దయచేసి పరలోకము అనగా అయన సన్నిదిని మనకు అనుగ్రహిస్తాడు. యేసు క్రీస్తు సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో మన పాపములు రద్దు చెయ్యబడ్డాయి, కనుకనే మనకు పాప క్షమాపణ కలిగింది. 

కానీ పాపముతో నిండిన మన శరీరము పాపమును జయించటం సాధ్యమేనా? పాపమూ లేని యేసు క్రీస్తును మనం అనుసరించటం సాధ్యమేనా? మానవ శరీరములో ఉన్న యేసయ్య, మనవలెనే శోదించబడి వాటన్నింటిని జయించాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు పరిశుద్ధాత్మ  ద్వారా క్రింది వచనంలో ప్రస్తావించాడు. 

హెబ్రీయులకు 4: "15. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను." 

అయన తన శరీరమును నలుగ గొట్టుకొని అనగా తన సొంత చిత్తమును విసర్జించి దేవుని చిత్తమును నెరవేర్చాడు అనగా మనం వాక్యానుసారముగా జీవించటం, ఉద్దేశ్య పూర్వకమయిన పాపమును జయించే స్థితిలో మనలను ఉంచుతుంది. అంతే కాకుండా యేసు క్రీస్తు సిలువ మరణము పొందక మునుపు మరొక ఆదరణ కర్తను తన పట్ల విశ్వాసము ఉంచిన వారికి వాగ్దానము చేసి ఉన్నాడు. ఆయనే పరిశుద్దాత్మ. 

యోహాను 14: "26. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును."

పై వచనము ఈ పరిశుద్దాత్మ యేసు క్రీస్తు యొక్క బోధనలు గుర్తు చేస్తూ అయన వలెనే మనం జీవించు లాగున నిరంతరం తన నడిపింపును మనకు దయచేస్తాడని ఉటంకిస్తుంది. మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? 

లూకా 1: "35.  దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును."

లూకా 1: "38.  అందుకు మరియఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను." 

పై రెండు వచనములు చూడండి! పరిశుద్దాత్మ శక్తి తనను కమ్ముకొని గర్బవతివి అవుతావని మరియకు దూత చెప్పినప్పుడు ఆమె పూర్తిగా దేవుని చిత్తముకు లోబడింది, అనగా పరిశుద్ధాత్మకు తనను తానూ అప్పగించుకుంది. లోకమునకు భయపడలేదు, తనకు వచ్చే నిందలను పట్టించుకోలేదు. కనుకనే ఆ పరిశుద్దాత్మ శక్తి ద్వారా తన గర్భమందు యేసు క్రీస్తు శరీరమును లేదా  రూపమును పొందగలిగింది. యేసు క్రీస్తు వాగ్దానము చేసిన ఈ పరిశుద్దాత్మ దేవుడు మన గురించి కూడా విచారిస్తూ ఉంటాడు. క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించుకున్నది మొదలు ఈయన మనలను హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ క్రీస్తు స్వరూపంలోకి మనలను మారుస్తుంటాడు. ఈ పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడి మన చిత్తమును విసర్జించి, యేసు క్రీస్తు బోధనలు పూర్తిగా పాటించిన నాడు పరిశుద్దాత్మ దేవుడు క్రీస్తును అనగా అయన స్వరూపమును  మన హృదయాలలో ఏర్పరుస్తాడు. ఆనాడే మనకు నిజమయిన క్రిస్మస్. పరిశుద్ధ దేవుని నామములో మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి