పేజీలు

2, జనవరి 2021, శనివారం

దేవుని వాగ్దానము నెరవేరాలంటే?

ప్రభువు నామములో ప్రియ సహోదరి, సహోదరులయిన మీ అందరికి నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత కాలమంతా తన కృప రెక్కల క్రింద భద్రపరచి మనకు చాలిన దేవుడిగా ఉన్న మన ప్రభువు రక్షకుడు అయినా యేసు క్రీస్తు నామమునకు  కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువు నందు  విశ్వాసులయిన మనకు  నూతన సంవత్సరం అనగానే ఎంతో ఉత్సాహకారమయిన విషయం, వాగ్దానం తీసుకోవటం. అనగా ఆ సంవత్సరానికి దేవుడు మన జీవితములో నెరవేర్చే ప్రణాళికలు, మేలులు మరియు నడిపింపును తెలుసుకొని విశ్వసించి వాటిని నెరవేర్చుమని దేవుణ్ణి వేడుకోవటానికి అవకాశం పొందుకోవటం. దేవుడు ఎల్ల వేళల మన మేలునే కోరుకుంటాడు, నిత్యమూ తన కంటి పాపవలె మనలను కాపాడుతూ, తన ప్రణాళికలను తన యందు విశ్వాసము ఉంచిన  వారి జీవితాలలో నెరవేరుస్తూ ఉంటాడు. కనుక ప్రతి విశ్వాసి వాగ్దనము తీసుకోవటానికయినా డిసెంబర్ 31 న మందిరానికి వెళ్తుంటారు. వాగ్దానము తీసుకున్న తర్వాత వారం రోజులు ఉన్న ఉత్సాహం మళ్ళి వాళ్ళలో కనపడదు. కొందరయితే దాన్ని మరచిపోతారు కూడా. కానీ దేవుని వాగ్దానాల గురించి దైవ గ్రంథమయిన బైబిల్ ఏమి చెపుతోంది! 

సంఖ్యాకాండము 23: "19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?"

దేవుడు వాగ్దనాలు ఇచ్చి మరచిపోయే వాడు కాదు, మానవుల వలె సందర్భానుసారముగా అబద్దాలు పలికే వాడు కాదు, అయ్యో అనవసరంగా మాట ఇచ్చేసానే అని పశ్చాత్తాప పడేవాడు కాదు. ఒక్కసారి వాగ్దానము ఇస్తే దాన్ని నెరేవేర్చే సామర్థ్యం కలిగిన వాడు. మన దేవుడు సజీవుడు, శూన్యము నుండి సకలమును సృష్టించిన వాడు. కానీ మనకు ఇచ్చిన  వాగ్దానాలు నెరవేరుటలో జాప్యం దేనికి? దేవుడికి మనం అంటే ఇష్టంలేదు కాబోలు అనుకుంటారు చాల మంది. మనలో ఇంకా పాపం ఉంది కనుకనే దేవుడు మన పట్ల తన వాగ్దానాలు నెరవేర్చటం లేదు అనుకుంటారు మరి కొందరు. దేవుడు మనకు తండ్రి అని నమ్మిన నాడు, ఏ తండ్రి కూడా బిడ్డలలో ఉన్న లోపములను బట్టి వారికి మేలులు చేయటం అపి వేయడు. కానీ  వాగ్దానాలు నెరవేర్చటంలో పరలోకపు  తండ్రి (దేవుడు) విధానం లోకపరమయిన తండ్రులకు భిన్నము.  తన పిల్లలయిన మనము ఎల్ల వేళల పవిత్రులుగా జీవించాలని ఆశపడుతున్నాడు. మానవ శరీరంలో ఉన్న మనకు పాపం లేకుండా జీవించటం అసాధ్యమే అయిన బుద్ది పూర్వకమయిన  పాపములకు దూరంగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా జీవించటం తప్పనిసరిగా ఉండాలి. అనగా  పరిశుద్దాత్మ నడిపింపునకు లొంగి నడుచుకోవాలి.  

రోమీయులకు  8: "28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము."

రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడయినా పౌలు గారు పై వచనము ద్వారా ఏమి చెపుతున్నారు ఒక్కసారి అర్థం చేసుకుందాం! దేవుణ్ణి ప్రేమించు వారికీ అనగా అయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అనగా దేవుని చిత్తను సారముగా నడుచుకొను  వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటో వాక్యాను సారముగా తెలుసుకుందాం. 

1 యోహాను 5: "3. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు." 

యోహాను గారు తానూ రాసిన మొదటి పత్రికలో ప్రేమ గురించి చాల వివరంగా రాశారు. పై వచనములో అయన స్పష్టం చేస్తున్న విషయం ఏమిటి? దేవుని ఆజ్ఞలు పాటించటమే దేవుణ్ణి ప్రేమించటం. అనగా వాక్యాను సారముగా నడుచుకుంటూ అయన చిత్తమును కనిపెడుతూ ఉండటమే దేవుణ్ణి ప్రేమించటం. అలాగా దేవుణ్ణి ప్రేమించేవారికి అయన ఆజ్ఞలు కష్టతరం కాదు అని చెపుతున్నారు. ఎందుకంటే అయన మనకు ఇచ్చే విశ్వాసము ద్వారా లోకమును జయిస్తాము అనగా బుద్ది పూర్వకమయిన పాపమును జయిస్తాము. తద్వారా పవిత్రులుగా ఉండటానికి ప్రయత్నిస్తాము, అప్పుడు దేవుడు తన చిత్తానుసారముగా మన పట్ల తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. 

రెండవదిగా కొంత మంది విశ్వాసులు దేవుని వాగ్దానాలు పక్కన పెట్టి తమ జ్ఞానమును బట్టి కార్యములు చేయాలనీ చూస్తూ ఉంటారు. అటువంటి వారిని గురించి  దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? క్రింది వచనం చూడండి. 

సామెతలు 3: "5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము 6.  నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును."

మన సొంత జ్ఞానమును ఆధారము చేసుకోక, మన పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచాలి. మన ప్రవర్తన అంతటి యందు అయన అధికారమునకు ఒప్పుకొన్నప్పుడు దేవుడు మన త్రోవలను సరాళము చేస్తాడు, అనగా మన వాగ్దానాలు నెరవేరటానికి దారులు వేస్తాడు. మన ప్రవర్తన యందు అయన అధికారమును ఒప్పుకోవటం అంటే? మన తెలివిని ఉపయోగించి సొంత నిర్ణయాలు మానుకోవటం, పూర్తిగా దేవుని జ్ఞానమును బట్టి నడుచుకోవటం. దేవుని జ్ఞానం ఎలా వస్తుంది? ప్రార్థించటం ద్వారానే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరియు దేవుని యందు భయము కలిగి ఉండటమే జ్ఞానము. విశ్వాసులకు తండ్రి అయినా అబ్రాహాము గారి జీవితంలో దేవుడు సంతానమును వాగ్దానము చేసినప్పుడు ఏమి జరిగింది తెలుసు కదా?

అయన తన భార్య అయినా శారా మాటలకు తలోగ్గి తన దాసి ద్వారా కుమారుణ్ణి కన్నాడు. కానీ దేవుడు ఆ సంతానమును ఒప్పుకోలేదు. దేవుడు శారాకు సంతానం వాగ్దానము చేస్తే ఆమె తన వయసును దృష్టిలో ఉంచుకొని భర్తను దాసీ ద్వారా కుమారుణ్ణి కనుమని ప్రోత్సహించింది. ఇదంతా కూడా మన సొంత జ్ఞానమును బట్టి తీసుకొనే నిర్ణయాలు మరియు మన ప్రవర్తనయందు దేవుని అధికారమును ఒప్పుకోకపోవటం వలన వచ్చే పరిణామాలు. ఇక్కడ అబ్రాహాము గారు భార్య ప్రోత్సాహంతో తన శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నాడు. ఆమె జ్ఞానమును బట్టి నిర్ణయం తీసుకున్నాడు. కనుకనే దేవుడి అమోదము పొందని సంతానమును పొందాడు. కానీ అబ్రాహాము ఎన్నడూ కూడా తన విశ్వాసమును కోల్పోలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. మన విశ్వాసం ఎంత గొప్పది అయినప్పటికీ ఎదుటి వారి మాటలను బట్టి మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలని చూస్తుంటాము. ఆ అవసరం వచ్చినప్పుడు దేవుడే మనలను ప్రేరేపిస్తాడు, మనలను నడిపిస్తాడు (కీర్తనలు 32:8)

రోమీయులకు 4: "19. మరియు అతడు విశ్వాసమునందు బల హీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, 20.  అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక 21. దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను."

రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాసిన వచనం చూడండి! అబ్రాహాముకు  నూరేండ్ల వయసు వచ్చి మరియు భార్య శారా గర్భము పూర్తిగా శక్తి హీనమయిన తర్వాత కూడా అయన విశ్వాసం కోల్పోలేదు. ఇక్కడ అబ్రాహాము తన సొంత జ్ఞానమును వదిలేసాడు, తన ప్రవర్తన అంతటియందు దేవుని అధికారమును ఒప్పుకున్నాడు కనుకనే వారి సామర్థ్యమును బట్టి కాక తన శక్తి ద్వారా సంతానము దయచేసి దేవుడు తన వాగ్దానమును నెరవేర్చాడు. 

మూడవదిగా, దేవుని వాగ్దానాలన్నియు షరతులతో కూడుకున్నవి. అనగా ప్రతి వాగ్దానము నెరవేరటానికి ముందస్తుగా పాటించవలసిన ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు ప్రతి వాగ్దానమునకు ముందు వెనుక తన ప్రజలు పాటించవలసిన ఆజ్ఞలు తెలియజేసాడు. కనుక మనకు వచ్చిన వాగ్దనము యొక్క అధ్యాయమును జాగ్రత్తగా ధ్యానించి, దేవుడు ఎవరితో, ఏ సందర్భంలో ఆ వాగ్దానమును ఇచ్చాడు మరియు వారికి ఇవ్వబడిన ఆజ్ఞలు ఏమిటి? వాటిని వారు ఎలా పాటించారు తెలుసుకోవాలి. ఉదాహరణకు క్రింది వచనము చూడండి!

ద్వితీయోపదేశ కాండము 28: "8.  నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును."

ఈ వాగ్దనము తీసుకోని సంతోషపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి! కానీ అదే అధ్యాయం మొదటి వచనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు చూడండి!

ద్వితీయోపదేశ కాండము 28: "1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును."

దేవుడు వారికీ ఇచ్చే ఆజ్ఞలు పాటిస్తే ఈ వాగ్దనాలు నెరవేరుస్తాను అంటున్నాడు. పైన చెప్పుకున్నట్లుగా అయన ఇచ్చే ఆజ్ఞలు కష్టతరమయినవేమి కావు. కేవలం మనలను తన స్వరూపంలోకి, అనగా మన రక్షకుడయినా యేసు క్రీస్తు ప్రేమలోకి మార్చటానికే అని గుర్తెరిగిన వారుగా ఉండాలి. ఆయనే తన ఆజ్ఞలు మనకు జ్ఞాపకం చేస్తూ, తన పరిశుద్దాత్మ శక్తితో నడిపిస్తుంటాడు.ఇవన్నీ పాటించి దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు నెరవేర్చుకుందాం. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి