ఇలాంటి శీర్షిక (టైటిల్) పెట్టింది ఎక్కువ మందిని ఆకర్షించటానికి కాదు గాని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యను బట్టి దేవుడి వాక్యమును విపులీకరిస్తే బాగా అర్థం అవ్వటమే కాకుండా సందర్బోచితంగా ఉంటుందని ఈ ప్రయత్నం చేశాను. కరోనా నుండే కాదు మన దేవుడు ఎటువంటి ఆపదనుండి అయినా తనను విశ్వసించిన వారిని కాపాడే సామర్థ్యం కలిగినవాడు. ఆనాడు ఇశ్రాయేలు జనమును ఎన్ని అసాధ్యమయిన కార్యములచే కాపాడాడో బైబిల్ గ్రంథం మనకు తెలుపుతుంది. వాటికి సంబందించిన చారిత్రక అధారాలు మరియు భౌతికమయిన సాక్ష్యాలు ఎన్నో తవ్వకాలలో మరియు పరిశోధనల్లో బయటపడ్డాయి. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా, సజీవమయిన దేవుణ్ణి నమ్ముకున్న వారముగా మనం ఎలా ఉండాలి? అన్నింటికీ మన దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని ఏమి పట్టించుకోకుండా ప్రవర్తించాలా? అది విశ్వాసముగా పరిగణింపబడుతుందా? ఒక్కసారి వాక్యానుసారముగా తెలుకొనే ప్రయత్నం చేద్దాం.
సామెతలు 22: "3. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు."
నీతి వాక్యాలు ప్రభోదించే సామెతల గ్రంథం ఏమి చెపుతుంది పై వచనం ద్వారా! బుద్దిమంతుడు ప్రమాదము వస్తుందని తెలిసి దాక్కుంటాడు! అంతే కానీ నాకేం కాదు అని ఎదురెళ్లి ప్రమాదంలో పడడు అని చెపుతోంది. అది జ్ఞానం లేని వారు చేసే పని. కరోనా లాంటి ప్రమాదకరమయిన అంటూ వ్యాధి, మందులేని వ్యాధి మన మధ్య ఉందని తెలిసి కూడా, అవసరం ఉన్న లేక పోయిన ఇష్టం వచ్చినట్లు బయట తిరగటం, సామజిక బాధ్యత పాటించక పోవటం దేవునికి ఇష్టమయిన పని, లేదా మన విశ్వాసం చూపించుకోవటం అని మీరు అనుకుంటున్నారా?
యేసయ్యను సాతాను శోధించు సమయంలో వాడు ఆయనకు లేఖనములు చూయించి, దేవ దూతలు నిన్ను కాపాడుతారు అని ఎంతలా రెచ్చ గొట్టిన కూడా యేసయ్య కొండ మీది నుండి దూకేశాడా? అయన భూమి మీదికి వచ్చిన ఉద్దేశ్యము వేరు అని తెలిసినప్పటికీ, తానూ చనిపోయేది కొండ మీది నుండి దూకి కాదు అని తెలిసి కూడా ఎందుకు దూకలేదు? ప్రభువయినా దేవుణ్ణి నీవు శోధింప వలదని లేఖనములు ఉటంకించి సాతానును ఎదుర్కొన్నాడు. మరి మన కెందుకు ఇంతటి నిర్లక్ష్య ధోరణి? ఇది విశ్వాసమా? లేక సాతాను వలలో పడిపోవటమా?
తన శిష్యులను సువార్తకు పంపు సమయంలో యేసయ్య ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో ఒక్కసారి మత్తయి సువార్త 10 వ అధ్యాయంలో చదవండి! దేవుడయినా యేసయ్య శిష్యులకు ఎందుకు జాగ్రత్తలు చెప్పాడు? తాను వారితో ఉండనందుకు కాదు. నిజానికి అయన కూడా కొన్ని సార్లు తనకు ప్రమాదం ఉన్నదని తెలిసిన పట్టణములకు వెళ్ళకుండా తన సువార్త పరిచర్యను కొనసాగించాడు (యోహాను 7:1). దేనికి? యేసయ్య భయపడ్డడా? యేసయ్య కంటే మనం ధైర్యవంతులమా? తన ఘడియ వచ్చే వరకు తండ్రి అయినా దేవుణ్ణి శోధించలేక అయన ఆవిధంగా చేసాడు. అదే విధంగా శిష్యులకు కూడా జాగ్రత్తలు చెప్పాడు.
మత్తయి 10: "23. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; ..... "
పై వచనంలో చూడండి యేసయ్య తన శిష్యులకు ప్రమాదం ఉన్న చోటు నుండి పారిపోండి అని చెపుతున్నాడే గాని ఆక్కడే ఉండి ప్రభువా కాపాడు అని ప్రార్థించమని చెప్పలేదు. మరి మనం చేస్తున్నది ఏమిటి? ప్రమాదానికి ఎదురు వెళ్తున్నాం. జాగ్రత్తలు పాటించకుండా, అవసరం ఉన్న, లేకపోయినా అతి సాధారణంగా తిరిగేస్తున్నాం. ఎందుకు? మన దేవుడు సజీవుడు, ఆయనే మనలను కాపాడుతాడు, అంతేనా? ఇది విశ్వాసమా? లేక దేవుణ్ణి శోధించటమా?
తమ పరిధిలో ఉన్న జాగ్రత్తలు పాంటించి, పరిస్థితులను చక్కబెట్టుకొక దేవుణ్ణి శోధించు వారిని గురించి అపొస్తలుడయినా పౌలు ఏమంటున్నాడో ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూద్దాము.
1 కొరింథీయులకు 10: "9. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి."
ఇశ్రాయేలు వారు దేవుడు చేసిన అద్భుత కార్యములు మరచిపోయి అదేపనిగా తమకు నచ్చిన ఆహారము కోసము, ఏమాత్రం ఓర్పులేకుండా మోషేతో వాదనలు పెట్టుకున్నారు. దేవుడు చేసిన దీర్ఘకాలిక వాగ్దానాలు విడిచి పెట్టి అప్పటికప్పుడు తృప్తి పరచే కోరికలను జయించలేక దేవుణ్ణి శోధించినారు. కనుకనే దేవుని ఆగ్రహమునకు గురి అయినారు. దేవుడు మనలను కూడా ఇలాగె నశింపజేస్తాడా? దానిని నేను చెప్పలేను కానీ! ఏదయినా అనుకోనిది జరిగితే ఏమని ప్రార్థిస్తావు? "దేవా నేను ఏ జాగ్రత్తలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగాను, నాకు ఇప్పుడు కరోనా సోకింది, నువ్వే స్వస్థపరచు" అని ప్రార్థిస్తావా? లేక అల్పమయిన కోరికలను, ప్రలోబలను జయిస్తూ, ఓర్పుగా, కలిగినంతలో ఇంట్లో ఉంటూ, దేవుని సన్నిధిలో అనగా ప్రార్థిస్తూ, అయన వాక్యమును ధ్యానిస్తూ అయన నీకు ఇచ్చిన తలాంతులను మెరుగు పరచుకుంటూ గడుపుతావా! దేవుని సన్నిధికి మించిన ఆనందం ఇంకేదయినా ఉందంటే నీ విశ్వాసమును ఒక్కసారి పరీక్షించుకో.
ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటే మరీ దేవుడు చేసేది ఏమిటి? దీన్నిబట్టి దేవుడు మనలను కాపాడలేడు అని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవునికి అసాధ్యమయినది ఏది లేదు. అయన జ్ఞానము మనకు అంతుపట్టనిది. ఈ పరిస్థితులు మానవాళి మీదికి అయన ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. కానీ మన ఘడియ కానప్పుడు దేవుడు మనలను ఖచ్చితంగా కాపాడుతాడు. అయన నిన్న, నేడు మరియు రేపు కూడా ఏక రీతిగా ఉండేవాడు. యేసయ్యను కాపాడిన దేవుడే నిన్ను, నన్ను కూడా కాపాడు సామర్థ్యం కలిగినవాడు.
యోహాను 7: "30. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు."
యోహాను గారు రాసిన సువార్తలో ఏమంటున్నారు చూడండి. పరిసయ్యులు యేసయ్యను పట్టుకొని సంహరించాలనుకున్నప్పుడు అయన ఘడియ ఇంకా రాలేదు కనుక వారు ఆయనను పట్టుకోలేక పోయారు. ఒక్కసారి కాదు, రెండు మూడు సార్లు అదే దేవాలయము దగ్గర వారు ఆయనకు హాని పెట్టాలని చూసారు. కానీ దేవుడు దానిని అనుమతించలేదు. ఒక్కసారి రాళ్లతో కొట్టి చంపాలని చూసారు అయినా దేవుడు దానిని జరగనివ్వలేదు. యేసయ్య చనిపోవలసింది రాళ్ళతో కొట్టబడి కాదు గనుక.
లూకా 4: "29. ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి. 30. అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను."
లూకా గారు రాసిన సువార్తలో యేసయ్యను జనము పట్టణము నుండి బయటకు తీసుకొచ్చి, కొండ మీది నుండి తల క్రిందులుగా పడేయాలని చూశారు. కానీ అద్భుతంగా అయన జనముల మధ్య నుండి తప్పించుకున్నాడు. ఎలా సాధ్యం అయింది ఇది? అంత మంది జనం మధ్యలో నుండి ఒక మనిషి తప్పించుకోవటం సాధ్యమా? ఇది దేవుని కార్యం కాకపోతే మరీ ఏమిటి? దేవుడు నీ పట్ల, నా పట్ల అటువంటి ప్రణాళికలు, అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. ఐగుప్తు నుండి విడిపించబడిన ప్రతి ఇశ్రాయేలీయుడు కానాను చేరాలన్నది దేవుని ప్రణాళిక, అల్పమయిన కోరికలను జయించలేక నశించపోవటం వారి బుద్దిహీనత. ప్రియా సహోదరి, సహోదరుడా ప్రమాదం లేదన్న భ్రమలో ఉంటె ప్రమాదం వెళ్ళిపోదు. మన దరికి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంద్దాం. దేవుడి మీద భారం వేసి, విశ్వాసముతో ముందుకు సాగుదాం. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి