పేజీలు

5, ఫిబ్రవరి 2022, శనివారం

ఆత్మీయతకు సూచనలు ఆశీర్వాదాల?

 

ఆత్మీయంగా ఎదగటం అనగా దేవునిలో ఎదగటం! మనలో చాల మంది ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉంటారు. కొంతమందికి సమస్యగా ఉన్నది కొందరికి చాల అల్పమయినదిగా ఉండవచ్చు, కొందరికి అసలు సమస్యగానే ఉండక పోవచ్చు. వారి వారి నేపథ్యములను బట్టి, పరిస్థితులను బట్టి వారి సమస్యల తీవ్రత మారిపోతూ ఉంటుంది. 

సమస్యతో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, తనకున్న సర్వశక్తిని బట్టి దేవుడు మన సమస్యను తీర్చినప్పుడు, దేవుని మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, తద్వారా అన్ని ఆయనకు సాధ్యమే అని ఎరిగిన వారీగా ఆయనకు మరింతగా దగ్గరవుతాము. ఆ రకంగా విశ్వాసములో ఎదుగుతూ, అయన ప్రేమను ఎరిగి ఆ ప్రేమను పంచె వారీగా మారిపోతాము (నిజంగా పంచుతున్నామా?). అనగా వాక్యానుసారముగా బ్రతకటానికి ఇష్టపడేవారిగా మారిపోతాము (నిజంగా బ్రతుకుతున్నామా?). 

దేవుడు ఇచ్ఛే వాగ్దానాలను బట్టి మరింతగా మేలులు పొందుకోవటానికి ఆశపడుతూ ఉంటాము. అయితే ఇలాంటి మేలులు పొందుకోవటమే ఆత్మీయతకు అనగా దేవునికి చాల దగ్గరగా ఉన్నాం అనటానికి నిదర్శనం అని చాలామంది భ్రమపడుతూ, తాము అనుకున్నది జరగనప్పుడు దేవుని మీద అలగటానికి, ఆయనను ప్రశ్నించటానికి కూడా వెనుకాడటం లేదు!  చాల మంది తమ విశ్వాసమును కూడా కోల్పోతున్నారు.  

ఈనాడు ఎంతోమంది దైవ సేవకులు సైతం ప్రజల మానసిక బలహీనతలు ఎరిగి, వారికి లేనిపోని ఆశలు కల్పిస్తూ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సమస్యలు అన్ని తీరిపోతాయి అని అభివృద్ధిని కాంక్షించే బోధను మాత్రమే బోధిస్తున్నారు. కానీ ఆత్మీయ అభివృద్ధిని ఎవరు పట్టించుకోవటం లేదు. అసలు ఆశీర్వాదాలు పొందుకోవటమే ఆత్మీయ ఎదుగుదల, నువ్వు అనుకున్నది జరిగితినే దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు అన్న భ్రమలో సంఘమును ఉంచుతున్నారు. అదే నిజమయితే అపొస్తలులు అందరు అంబానీల? వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండలేదా? వారికీ ఎల్లప్పుడూ స్వాగత సత్కారాలే లభించాయా? 

ఆలోచించండి నా ప్రియా సహోదరి, సహోదరులారా! దేవుడు మనలను యాచించే స్థితిలో ఉంచడు! అయన ఎల్లప్పుడూ మనలను గమనిస్తూనే ఉంటాడు. ఉంటె ఎంత! ఊడిపోతే ఎంత! అనుకునే మన తల వెంట్రుకలు సైతం లెక్కించిన ఆయనకు, మన ఉద్యోగ విషయం తెలియదా? మన ఇంటి సమస్య పట్టదా? మన ఆరోగ్యం అవసరం లేదా? మన క్షేమం ఆయనకు సంభందం లేదా? 

ప్రసంగిలో చెప్పబడినట్లుగా ప్రతి దానికి ఒక సమయం ఉంది! ఆలస్యానికి ఎదో కారణం ఉంది. అది మన జ్ఞానమునకు అంతుపట్టదు. విశ్వాసము విడువక ఆయనకు మొఱ్ఱ పెట్టడమే మనం చేయవలసింది! తగు సమయంలో నీకు శ్రేష్ఠమయినది అయన దయచేస్తాడు. కానీ అనుకున్నది జరిగితినే ఆత్మీయ ఎదుగుదల అనగా దేవునికి చాల దగ్గరగా ఉన్నాం అనుకోవటం, మన ఆత్మీయతను తప్పుదారి పట్టిస్తుంది. 

మన సాక్ష్యములు కూడా అలాగే ఉంటాయి! అన్ని అద్భుతాలే ఉండాలి. ఎన్నో రకాల మలుపులు ఉండాలి, వినే వారికి మన మీద గొప్ప విశ్వాసులు అని అభిప్రాయం కలగాలి. దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తున్నాడు అని అందరికి తెలియాలి. తద్వారా సంఘంలో మన పట్ల గొప్ప విశ్వాసులు అని పేరు, గౌరవం! కానీ మన పాత స్వభావమును దేవుడు ఏలా మారుస్తున్నాడు, ఎన్ని ఆత్మఫలములు పొందుకున్నాము అన్న విషయాలు ప్రాధాన్యం లేనివిగా మారుతున్నాయి.  

దేవుడు చేసిన గొప్ప కార్యములు పంచుకోవటం తప్పుకాదు! కానీ దేవుడు మన జీవితాలలో చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి మనం ఆత్మీయంగా బలపడుతున్నాం అనుకోవటం మన ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. ఆశీర్వాదాలు పొందుకోవటమే దేవునికి దగ్గర ఉండటం అయితే! అదే మన ఆత్మీయతకు కొలమానము అయితే, యేసయ్య ఎందుకు "సూది బెజ్జములోంచి ఓంటే వెళుతుందేమో గాని ధనవంతుడు పరలోకం చేరలేడు" అని బోధించాడు! దేవుడు తన ప్రజలను దీవిస్తాడు, అవసరం అయినంత! తన ప్రజలకు ధనాన్ని ఇస్తాడు కానీ తనను మరచిపోనంత! 

సామెతలు 30: "8. వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 9. ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో."

సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం నుండి పై వచనం చూడండి! "ఎక్కువ పేదరికంలో నన్ను ఉంచకు, నేను దొంగగా మారిపోతానేమో! అలాగే ఎక్కువ ధనము నాకు ఇవ్వకు అహంకారముతో నిన్ను మరచిపోతానేమో" అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవునికి మనలను దూరం చేసే ఏ ఆశీర్వాదమైన మనకు దేనికి?  యేసయ్య (మత్తయి 16:26) "ఒక్కడు సర్వ లోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమిటి లాభము, ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వగలడు?" అని హెచ్చరించలేదా? 

అదే పనిగా లోకపరమయిన ఆశీర్వాదాల కోసం ఆశపడకండి, అవి పొందుకుంటేనే ఆత్మీయ ఎదుగుదల అని భ్రమపడకండి. దేవుణ్ణి నమ్మిన వారు, అయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ తోకగా ఉండరు. కీర్తనల గ్రంథంలో క్రింది వచనం చూడండి!

కీర్తనలు 37: "25. నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు."

ప్రభువునందు ప్రియులారా పై వచనం ఎంతగానో మనకు ధైర్యం నింపుతుంది కదా! దావీదు వృద్దుడిగా అయినప్పుడు అంటున్న మాట ఏమిటంటే, తన చిన్నతనం నుండి నీతిమంతులు అనగా దేవుని యందు విశ్వాసముంచి అయన ధర్మ శాస్త్రమును జరిగించు వారు అనగా అయన వాక్యానుసారముగా నడచుకొనే వారి పిల్లలు యాచన చేయటం చూడలేదట. అయ్యో మన భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగ మానుకోండి. అన్ని మన పరలోకపు తండ్రికి తెలియును. ఆలా అని చేతిలో ఉన్న పని మానేయటం కాదు సుమా!  పని చేయకపోవటం కూడా దేవుని వాక్యానికి విరుద్ధమే (2 థెస్సలొనీకయులకు 3:10). 

సహోదరి, సహోదరుడా ఒక్కసారి ఐగుప్తు నుండి బయలు దేరిన ఇశ్రాయేలు ప్రజల జీవితమును తరచి చూడు! వారి ప్రయాణం అంత అద్బుతములే! వారు పొందుకున్నవి అన్ని ఆశీర్వాదములే! కానీ వారి జీవితం దేవునికి ఎందుకు హేయముగా మారిపోయింది? ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్న, ఎన్ని అద్భుతములు చూసిన వారి ఆత్మీయ జీవితం ఎదుగలేదు. దేవుని యెడల విశ్వాసం పెంచుకోలేక పోయారు, కాస్త విశ్వాసాన్ని కూడా  కొనసాగించలేక పోయారు. ఐగుప్తులో తెగుళ్ళ  నుండి కాపాడటం, ఎర్ర సముద్రం రెండుగా చీలిపోవటం, ఆరిన నేల మీద సముద్రంలో నడవటం, ఫరో సైన్యం సముద్రంలో మునిగిపోవటం, ఆహారం అడిగినప్పుడు, దేవదూతలు తినే ఆహారం మన్నాను దేవుడు వారి కోసం కురిపించటం, ఇవ్వని అద్బుతములే. 

నిర్గమకాండము 16: "15.  ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియకఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 16. మోషేఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగాప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవ లెననెను. 17. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చు కొనిరి. 18. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. "

పై వచనం చదివితే ఏమి తెలుస్తుంది! దేవుడు ఇశ్రాయేలు వారిని పోషించటానికి వారు ఎన్నడూ చూడని దేవదూతల ఆహారం మన్నాను కురిపించాడు. వారిలో కొందరు కొలత తెలియక తక్కువ సమకూర్చుకున్న కూడా వారికి తక్కువ కాలేదు, ఎక్కువ తీసుకున్న వారికి ఎక్కువ కాలేదు. ఈ విధంగా వారి ప్రయాణం అంతటిలో ఎన్నో అద్భుత కార్యముల చేత వారిని నడిపించాడు మరియు పోషించాడు. అయినప్పటికి వారి కోరికలకు అంతే లేకుండా పోయింది, వారి సణుగుడు దేవుని ఆగ్రహానికి వారిని గురి చేసింది. దేవుడు ఎన్నోమార్లు అద్బుతములచే మన యొక్క అవసరతలు తీరుస్తాడు. తద్వారా మనం ఆత్మీయంగా ఎదిగాం అనుకోవటం మనలను మనం మోసం చేసుకోవటమే అవుతుంది. 

దేవుని చిత్తమును ఎరిగి, అయన స్వరూపంలోకి మారటమే నిజమయిన ఆత్మీయ ఎదుగుదల. మన ప్రాచీన స్వభావమును ఎంతగా తగ్గించుకుంటున్నాము, ఎన్నీ ఆత్మ ఫలములను (గలతీయులకు 5:22)  పొందుకొంటున్నాము. ఇవి మన ఆత్మీయతకు కొలమానాలు కావాలి. 

మన ముందు ఉన్న గొప్ప ఉదాహరణ,  మన రక్షకుడయినా యేసు క్రీస్తు ప్రభువు! అయన ఏనాడూ కూడా అద్భుతములు కోరుకోలేదు! అద్బుతముల ద్వారా ప్రజలను స్వస్థపరచి వారికి  దేవుని ప్రేమను పరిచయం చేసాడు. అదేవిధంగా తన పరిచర్యకు అవసరమయినప్పుడు మాత్రమే అద్భుతములను చూపించాడు. తనను శోధించి, సూచక క్రియ చూపుమన్న వారికి ఏ విధమయిన  సూచక క్రియను లేదా అద్బుతమును చూపలేదు. తన గొప్పకోసం కాకుండా కేవలం దేవుని చిత్తమును మాత్రమే అయన కోరుకున్నాడు. 

నలుపది దినములు ఉపవాసము ఉన్న ఆయనను సాతాను ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని ఆకలి తీర్చుకో అన్నప్పుడు అయన అద్భుతములు చేయలేదు. దేవుని నోట నుండి వచ్చే మాటలు తనను బ్రతికిస్తాయని సాతానును ఎదిరించాడు. ఇది దేవుని చిత్తమును నెరవేర్చటం. అద్భుతములు చేయటం, ప్రదర్శించటం యేసయ్య  ప్రథమ కర్తవ్యం కాదు కానీ  దేవుని ప్రేమను చూపటమే తండ్రి చిత్తము అని ఎరిగి అటువంటి జీవితమును అయన జీవించాడు, మన నుండి అదే కోరుతున్నాడు. 

మత్తయి 6: "33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును."

మత్తయి సువార్త కొండమీది ప్రసంగములో యేసయ్య ఏమన్నాడో పై వచనంలో చూడండి. దేవుని రాజ్యమును, నీతిని వెదకు వారికీ అన్నియు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యము అనగా పాపములను బట్టి పశ్చాత్తాపపడి, మారు మనసు పొందుకొవటం (మార్కు 1:15). మరియు దేవుని నీతి అనగా యేసు క్రీస్తు మొదటి రాకడకు ముందు అయితే ధర్మశాస్త్రమును పాటించటం. కానీ యేసు క్రీస్తు ధర్మ శాస్త్రమును నెరవేర్చాడు కనుక అయన యందు విశ్వాసమే దేవుని నీతి అని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టం చేస్తున్నారు. 

రోమీయులకు 3: "21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 22. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది."

యేసు క్రీస్తు నందు విశ్వాసము అనగా ఏమిటి? అయన బోధలు పాటిస్తూ, మనలను మనం తగ్గించుకొంటూ అయన రూపంలోకి మారిపోవటమే. యేసయ్య ఏనాడూ అద్భుతములు ప్రదర్శించలేదు, ధనమును ఎవరికీ ఇవ్వలేదు. అయన ఇచ్చింది పాప క్షమాపణ, కోరుకుంటున్నది మారు మనసు, పవిత్ర జీవితము. ఇవి మాత్రమే ఆత్మీయ జీవితానికి సాక్ష్యములు. 

1 తిమోతికి 6: "6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. 7.  మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. 8. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. 9. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును."

చివరగా పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో పై వచనము చూడండి! (ఆరవ అధ్యాయము పూర్తిగా చదవ వలెనని ప్రభువునందు మిమల్ని వేడుకుంటున్నాను)  సంతృప్తి కరమయిన జీవితము దైవ భక్తికి దోహదపడుతుంది. లోకంలోకి ఏమి తీసుకోని రాలేదు! ఏమి తీసుకోని పోలేము! ధనాపేక్ష మనలను శోధనలో పడవేస్తుంది! తద్వారా మన ఆత్మీయ జీవితం నశించిపోతుంది. న్యాయంగా సంపాదించుకోవటం తప్పు అని చెప్పటం లేదు! 

అబ్రాహాము, యోబు లాంటి గొప్ప భక్తులు ఎంతో ధనవంతులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. వారు ఆశీర్వాదాలు పొందుకోవటమే ఆత్మీయ జీవితం అనుకోలేదు. దేవుణ్ణి ప్రేమించటం, అయన ఆజ్ఞలు పాటిస్తూ, పవిత్రముగా జీవించటమే  ఆత్మీయ ఎదుగుదల అనుకున్నారు. ఆత్మఫలములే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలి కానీ ఆశీర్వాదాలు, అద్భుతాలు కాదు! 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో  మీ ముందుకు వస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

2 కామెంట్‌లు: