పేజీలు

30, ఏప్రిల్ 2022, శనివారం

ప్రసంగం చెయ్యాలనుకుంటున్నావా?

 

బైబిల్ చదవటం మొదలు పెట్టిన తర్వాత ప్రతి విశ్వాసి ఆశపడే విషయం ఏమిటంటే, తనకు తెలిసిన మరియు అర్థం అయిన దేవుని మాటలు తోటి వారితో పంచుకోవాలని. తద్వారా వారికి ఆదరణ కలిగించటంతో పాటు వారి విశ్వాసమును బలపరచటం మరియు దేవుడు తమతో మాట్లాడిన పలుకులు సాక్ష్యముగా పంచుకోవటం జరుగుతుంది. పరిశుద్దాత్మ దేవుడు సంఘము క్షేమాభివృద్ధి దృష్ట్యా మనకు కొన్ని ఆత్మీయ వరములు అనుగ్రహిస్తాడు! ఇదివరకు మనం తెలుసుకున్నాం. వాటిలో ఒక్కటి, బోధ చేయటం లేదా ప్రసంగం చేయటం. అయితే దేవుని వాక్యములో చెప్పబడిన కొన్ని హెచ్చరికలు గమనించి బోధచేయటం మంచిది.

యాకోబు 3: "1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి."

ఈ వచనములో యాకోబు గారు ఏమంటున్నారు? బోధకులయినా వారికి తీర్పు కఠినముగా ఉంటుందని తెలుపబడింది.  ఎందుకు? పరిశుద్దాత్మ నడిపింపు లేకుండా, దేవుని పిలుపు లేకుండా బోధించినట్లయితే కేవలం తమకున్న లోక జ్ఞానమును బట్టి దేవుని మాటలు బోధించిన వారుగా మారిపోతారు. తద్వారా సాటి సహోదరులకు లేదా సంఘమునకు వాక్యమునకు విరుద్ధముగా బోధించి వారిని నశింపచేసిన వారు అవుతారు కనుక. 

సహోదరి, సహోదరుడా! యేసయ్య ప్రేమ నీలో నిజంగా ఉందా? నీ జీవితం అయన ఆశించినట్లుగా కొనసాగుతుందా? ప్రభువు అనుమతి నీకు ఉందా? లేక సంఘములో పెద్దలు ప్రోత్సహిస్తే నాలుగు మాటలు ఇంటర్నెట్ లో చూసి, వ్యాఖ్యానాలు చదివి మాత్రమే మాట్లాడుతున్నావా? ఇంటర్నెట్ లో సంచికలు చూడటం, వ్యాఖ్యానాలు చదవటం తప్పు అని చెప్పటం లేదు! కానీ నిశ్చయముగా వాటిని నమ్ముతున్నావా? దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? కనీసం జీవించటానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు చెప్పే విషయం మీద  పూర్తీ అవగాహనా పొందుకున్నావా? 

1 తిమోతి 1: "7. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి."

పౌలు గారు తిమోతి తో ఏమంటున్నారు గమనించండి! కొంతమంది దేవుని వాక్యము మీద పూర్తి అవగాహనా లేకుండా, వాటిని పూర్తిగా నమ్మక పోయినను బోధకులుగా మారిపోతున్నారు. తమ జ్ఞానము చొప్పున లోకపరమయిన ఉదాహారణలతో,  ఛలోక్తులతో ప్రసంగం చేస్తూ ఉంటారు! ప్రసంగంలో ఎన్ని లోకపరమయిన ఉదాహరణలు ఉంటె అంతగా ఆ బోధకుడు సిద్దపడి రాలేదు అని అర్థం! 

బైబిల్ బోధించటానికి బైబిల్ లో లేని ఉదాహరణలు, సంఘటనలు దేనికి? ఏదయినా విషయాన్నీ విశదీకరించటానికి ఉపయెగించటం తప్పు కాదు, కానీ సినిమాల ఉదాహరణలు సైతం ప్రసంగంలో ప్రస్తావించటం, విశ్వాసులకు ఎటువంటి సందేశాలు అందిస్తుంది? పాస్టర్ గారు సినిమా ఉదాహరణ చెప్పారు కాబట్టి, సినిమాలు చూడటం తప్పు కాదన్నమాట అని సంఘం అనుకొంటే తప్పు ఎవరిదీ? ఆ బోధకునికి తీర్పు ఎలా ఉంటుంది?

యేసు క్రీస్తు ప్రభువు "పరిసయ్యులు గ్రుడ్డి వారిగా ఉన్నారు, మరియు వారు ఇతరులకు త్రోవ చూపుతూ వారిని కూడా గ్రుడ్డి తనములో నడుపుతున్నారు, ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారని" అన్నాడు కదా (మత్తయి 15: 14). సొంత జ్ఞానమును బట్టి బోధించు వారు, సంఘమునకు ఆనుకూలంగా బోధించువారు అంటువంటి వారె. ఇటువంటి బోధ వలన సంఘములో  ఎంటువంటి అభివృద్ధి ఉండబోదు. ప్రతి ఆదివారం మందిరమునకు వస్తున్నాం, చాల భక్తిపరులుగా ఉన్నాం అన్న భ్రమలో విశ్వాసులను ఉంచుతున్నారు. 

దేవుని ప్రేమతో పాటు, అయన రోషమును కూడా బోధించాలి. పవిత్రత యొక్క ప్రాముఖ్యత, రక్షణ యొక్క విశిష్టత వివరించాలి మరియు మారు మనసు యొక్క ఆవిశ్యకతపై అవగాహనా పెంచాలి. లేదంటే సంఘము హితబోధను పట్టించుకోకుండా, కేవలం తమ చెవులకు ఇంపయినా విషయాలను మాత్రమే విని దేవునికి ఇష్టంలేని కార్యములలో ఇంకా కొనసాగే అవకాశం ఉంది (2  తిమోతికి 4:3) . 

యోహాను 3: "9. అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా 10.  యేసు ఇట్లనెనునీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?11.  మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

"తిరిగి జన్మించాలి" అన్న యేసయ్య మాటలను నీకొదేము అర్థం చేసుకోలేని సందర్భంలో  నీకొదేముతో  యేసయ్య  అన్న మాటలు ఈ వచనంలో చూడవచ్చు. బోధకుడైన నీకొదేము ఈ సంగతులన్నియు ఎరిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్దాత్మ ఈ సంగతులను ఏనాడో పాత నిబంధన గ్రంథంలో రాయించాడు  (యెహెజ్కేలు 11:19 మరియు యిర్మీయా 32:39-40). 

ఏది ఏమయినప్పటికీ  "మారుమనసు" మరియు "తిరిగి జన్మించటం" అన్న విషయాలు  ఇశ్రాయేలు వారికి యోహాను మరియు యేసయ్య వచ్చే వరకు తెలియలేదు. ఆనాటి ప్రసంగికుల నిర్లక్ష్యమో లేదా సంఘమును ఇబ్బంది పెడితే దశమ భాగాలు రావేమో అని భయపడటమో కానీ నిజమయిన దేవుని పలుకులు వారికి బోధింపబడలేదు. కనుక మన ప్రసంగం సంఘం బాధపడుతుందేమో అని కాకుండా దేవుడు తన విశ్వాసులను ఎలా కోరుకుంటున్నాడు అన్న విషయాలు ఖఛ్చితముగా సంఘమునకు వెల్లడి చేయబడాలి.

బోధ అనేది తల్లి, తండ్రుల నుండి సంక్రమించే ఆస్థి కాదు. దేవుని పిలుపు! ఎటువంటి అవగాహనా లేని చిన్న చిన్న పిల్లలతో కంఠస్థం చేయించి ప్రసంగాలు చేయిస్తున్నారు. ఏ అనుభవ జ్ఞానము లేని తమ పిల్లల చేత బలవంతంగా, సంఘము ముందు నిలబెట్టి, దేవుని వాక్యాలు వల్లే వేయిస్తున్నారు. ఆ సంఘము ఎటు వైపు వెళుతుంది? ప్రసంగం అంటే నాలుగు బైబిల్ వాక్యాలు గుర్తుంచుకొని  అర్థం చెప్పటం కాదు! దేవుని  మాటలు సంఘమునకు తెలపటం! విశ్వాసుల ఆత్మలకు ఆత్మీయ ఆహారం అందించటం. అంటువంటి భాద్యత నిర్వహించటానికి దేవుడు ఎవరిని పడితే వారిని ఎన్నుకుంటాడా? 

ఆనాడు దేవుడు హోషేయ ప్రవక్తను వేశ్యను వివాహం చేసుకొమ్మని ఎందుకు చెప్పాడు, తన ప్రజలు తన నుండి విడిపోయి ఇతర దేవతలతో వ్యభిచారం చేస్తున్నారు, దానిని బట్టి ఆ తండ్రి ఎంతటి భాధను అనుభవిస్తున్నాడో ఆ ప్రవక్తకు అర్థం కావటానికి, తద్వారా తన ప్రజలకు ఆ సంగతులు వివరించి వారిని తిరిగి తన దారికి చేర్చటానికి.  అటువంటి అనుభవాలు దేవుడు నీకు ఇచ్చాడా? నిజమయిన పోరాటలు చేసి, దేవుని కృపను పొంది విశ్వాసంలో బలపడ్డావా? నీ అనుభవ పూర్వకంగా బోధలు చేస్తున్నావా? కేవలం అర్థాలు తెలుసుకొని చెపుతున్నావా? పోరాటం లేని బోధకుడు కేవలం సంఘమును కట్టగలడు కానీ  ఆత్మలను దేవుని వైపు నడపలేడు. 

యిర్మీయా 15: "19. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెనునీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు"

ఈ వచనములలో ప్రవక్త అయినా యిర్మీయా తనకు వస్తున్న శ్రమలను బట్టి తనను తానూ నిందించుకొని, నిరాశను వెలిబుచ్చినప్పుడు, దేవుడు తనతో అంటున్న మాటలు చూడండి! నిరాశను వదిలి, శ్రమలను బట్టి దుఃఖపడక ఉంటె తన సన్నిధికి తిరిగి రప్పిస్తానని అంటున్నాడు. ఏవి నీచములో, ఏవి ఘనములో ఎరిగి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే తన నోటివలె ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఇతరులు నీలాగా మారాలి కానీ నీవు వారి వలె మారకూడదు. అనగా లోకమంతా చెడు వైపు నడచిన నీవు మాత్రం వారికి ఆదర్శంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు.

అంటువంటి ప్రవర్తన నీకు అలవడిందా? మంచి, చేడు  గుర్తించి లోకములో ప్రత్యేకించినట్లుగా ఉంటున్నావా? లేక నూటికి తొంబై తొమ్మిది మంది అలాగే ఉన్నారు నేను కూడా అలాగే ఉండాలి కాబోలు అని అలాగే జీవిస్తూ, ప్రసంగంలో కూడా అటువంటి ఉదాహరణలు, అంటువంటి ఛలోక్తులు కలుపుతున్నావా? సహోదరి సహోదరుడా! దేవుని నోటి వలె ఉండటం ఎంతో ధన్యమయిన విషయం. దానిని చులకనగా తీసుకోకండి. మన అర్హతను పరిశీలించండి, దేవుని పిలుపు కై కనిపెట్టండి. 

1 కొరింథీయులకు 2: "12. దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము."

పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పై వచనం చూడండి! దేవుని ఆత్మను పొందుకొని బోధించాము కానీ లౌకికాత్మ ద్వారా కాదు అని చెపుతున్నారు. లౌకికాత్మ అనగా లోక ప్రసిద్దమయిన వాటిని ప్రవచించటం. అంటువంటివి కాక దేవుని ఆత్మను పొందుకొని బోధించటం చెయ్యాలి. మనుష్యుల జ్ఞానము చొప్పున నేర్పయినా మాటలు కాకుండా, ఆత్మ సంభందమయిన సంగతులు ఆత్మ ద్వారానే బోధించాలి అలాగే ఆత్మతోనే సరిచూడాలి.

ప్రియమయిన సహోదరి, సహోదరులారా! బైబిల్ లో లేని పిట్ట కథలు, ఛలోక్తులు బోధించటం ఎంత మాత్రం సంఘము క్షేమమును జరిగించదు. తద్వారా విశ్వాసులకు ఆత్మీయ ఆహారం దొరకదు, వారు బలహినపడి నశించినచో తప్పు ఎవరిది?  దేవుని మీద ఆధారపడితే ఆశ్చర్యకరమయిన సంగతులు ఆయనే మనకు బయలు పరుస్తాడు (కీర్తనలు 119:18). కనుక  ప్రార్థించండి! దేవుని పలుకులు తెలుసుకోండి! ప్రసంగం ఆ విధముగా చేయండి.  

దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాముఅంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాకఆమెన్!!

3 కామెంట్‌లు: