పేజీలు

10, జూన్ 2022, శుక్రవారం

ఆత్మీయతలో పాటల పాత్ర!

 

పరిశుద్దాత్మ మనకు అనుగ్రహించే అనేక తలాంతులలో  ప్రసిద్ధి చెందినది పాటలు రాసే తలాంతు! ఎంతో మంది భక్తులు దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుత కార్యములను కొనియాడుతూ స్తుతిగీతములు పాడినట్లుగా బైబిల్ లో మనం చూడవచ్చు. బైబిల్ లో కీర్తనలు అన్ని కూడా  భక్తులు దేవునికి తమ కృతజ్ఞతలు చెపుతూనో లేదా తమ ఆవేధన తెలుపుకుంటూనో రాసినవే! ఏ విధమయిన చదువు సంధ్యలు లేకపోయిన కూడా గొర్రెలు కాచుకొనే దావీదు ఎంతో మధురముగా సంగీతం వాయించేవాడు అని బైబిల్ చెపుతుంది. మరియు కీర్తనల గ్రంథం సింహభాగం అయన రాసిన పాటలే!  

ఆత్మీయ పరమయిన పాటలు రాయటానికి పెద్దగా చదువు, గొప్ప భాష జ్ఞానం ఉండవలసిన అవసరం లేదు! దేవుని పట్ల అమితమైన ప్రేమ, ఆరాధన భావం ఉంటే చాలు, తన చిత్తము చొప్పున పరిశుద్దాత్మ దేవుడు అయన నామ ఘనతార్ధం పాటలు రాసే తలాంతును  మనకు అనుగ్రహిస్తాడు. ఎన్నో గొప్ప  ప్రసంగాలు కలిగించగలిగిన ఆదరణ పరిశుద్దాత్మ ప్రేరితముగా రాసిన ఒక పాట కలిగిస్తుంది. సంగీతానికి మనసును ఆహ్లాదపరచే గుణం ఉంది! సౌలు మీదికి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సంగీతం వాయించుట ద్వారా సౌలు ఆదరణ పొందేవాడు అని  బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది (సమూయేలు 16:23).

ఇశ్రాయేలు జనము ఎర్ర సముద్రం దాటగానే మోషే మొదలగు వారు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తన పాడారు మరియు మిరియాము మొదలగువారు కూడా నాట్యమాడుతూ కీర్తన పాడారు (నిర్గమకాండము 15).  అంతే కాకుండా దేవుడు తమ జీవితాలలో అద్భుతాలు చేసిన ప్రతిసారి భక్తులు ఆయనను కీర్తిస్తూ పాటలు పాడారు అని బైబిల్ గ్రంథం చెపుతుంది. ఈ పాటలను గమనిస్తే, ఎక్కడ కూడా దేవుడు చేయని వాటిని, లేదా వారి జీవితంలో జరగని వాటిని, వారి ఇష్టానుసారం కవితాత్మక ధోరణిలో పాడలేదు. ఖచ్చితముగా దేవుని గొప్పతనమును, వారి జీవిత సాక్ష్యములను, దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడు అన్న వాస్తవాలు మాత్రమే పాటలుగా పాడినట్లు మనం గమనించవచ్చు. 

పాటలు దేవుని గొప్పతనమును చాటేవిగా ఉండవచ్చు, లేదా దేవుడు వారి జీవితాలలో చేసిన అద్భుత కార్యాలను తెలుపుతూ ఉండవచ్చు. కొన్ని సార్లు దేవునికి మొరపెడుతూ, తమ నిస్సహాయతను చాటుతూ, ఇతరులను ఆదరించేవిగా కూడా ఉండవచ్చు. కొన్ని పాటలు మనలను ప్రశ్నిస్తూ, మన విశ్వాస జీవితమును మెరుగు పరచుకోవటానికి ఉపయోగపడుతాయి. మన రక్షకుడయినా క్రీస్తు సిలువలో చేసిన త్యాగమును తెలుపుతూ అయన ప్రేమను గుర్తు చేసి మనం మరల పశ్చాత్తాప పడేలా చేస్తాయి. పాట ఎటువంటిదయినా దాని అంతిమ ఉద్దేశ్యం విశ్వాసులను బలపరిచేదిగా ఉండాలి. 

పరిశుద్దాత్మ దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చే ఈ తలాంతు ఎంతో ఉన్నతమయినది. మన ప్రభువయినా యేసు క్రీస్తు కూడా తన శిష్యులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడాడు (మత్తయి 26:30) అని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. కనుక పాటలు రాసే తలాంతు ఉన్న వారు, దేవుని వాక్యముతో ఆ పాటలు సరిచూసుకుని బయటకు తేవాలి. కొన్ని సార్లు సంపూర్ణముగా వాక్యము తెలియని అన్యులు ఎవరయినా వింటే వాక్యానుసారమయిన మాటలు ఉన్న కూడా ఆ పాట దేవుని నామానికి అవమానం కలిగిస్తుందా అని, అన్ని కోణాలలో ఆలోచించ బద్దులుగా ఉన్నారు. వాక్యాను సారం కానీ వర్ణనలు, ఆత్మీయత లోతు లేని పాటలు విశ్వాసులకు ఎంత మాత్రము మేలుచేయవు! వారు ముందుకు వెళ్ళకుండా అడ్డుగా మారే అవకాశం ఉంది. 

పౌలు, సిలను కొట్టి చెరసాలలో వేసి బంధించినప్పుడు వారు పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న ఖైదీలందరు వారి పాటలు విన్నారు, తర్వాత దేవుడు అద్భుత రీతిగా భూకంపం తెప్పించి, వారందరి సంకెళ్లు విడిపోయేలా చేసాడు. ఆ జైలు అధికారి మరియు అతని ఇంటి వారందరు కూడా మారుమనసు పొంది రక్షణ పొందుకున్నారు (అపొస్తలుల కార్యములు 16:25-34). విశ్వాసముతో మనం పాడే పాటలు కూడా దేవుని కార్యములు జరిగిస్తాయి. సాటి వారికి ఆయన ప్రేమను, శక్తిని తెలిపి వారిని రక్షణలోకి నడిపిస్తాయి. కనుక పాట ఎవరు రాసారు, దాన్ని ఎవరు రూపొందించారు అని కాకుండా, ఎంత వాక్యాను సారముగా ఉంది, ఎటువంటి లోతును కలిగి ఉంది అని వాక్యముతో సరిచూసి పాటలు వినండి మరియు పాడండి. 

ఎఫెసీయులకు 5: "19: ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,"

పౌలు గారు సంఘములకు తానూ రాసిన పత్రికలలో కూడా ఎన్నో మారులు కూడా సంఘములో విశ్వాసులు ఒకరినొకరు పాటల ద్వారా హెచ్చరించుకోవాలని, ప్రోత్సహించుకోవాలని మరియు పాటల  ద్వారా దేవుణ్ణి కీర్తించాలని పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా తెలియజేసారు. అనగా ఈ పాటలు పాడుట ద్వారా ఇతరుల విశ్వాసమును మనము బలపరిచే వారిగా ఉన్నాము. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా, సంగీతం హృదయములను ఆహ్లాదపరుస్తుంది మరియు ఆత్మీయత నిండిన పాటలు విశ్వాసులను ఎంతగానో ఆదరిస్తాయి. తద్వారా వారు విశ్వాసములో ఎదుగుతూ దేవుని కృపను పొందుకుంటారు. అంతే కాకుండా దేవుని వాక్యానుసారమయిన పాటలు వినుట ద్వారా ఎంతోమంది అన్యులు సైతం దేవుని ప్రేమను తెలుసుకొనే అవకాశం ఉంది.  

కొలొస్సయులకు 3: "16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి."

పౌలు గారు కొలొస్సయులకు రాసిన పత్రికలో ఈ వచనము మనకు ఏమని చెపుతుంది? పాటలు పాడటం అనేది కేవలం నామమాత్రముగా చేసేది కాదు మరియు మన ఇష్టానుసారముగా నిర్ణయించేది కాదు గాని ఒక ఆజ్ఞవలె పాటించాలని మనకు అర్థమవుతుంది. ఆత్మ సంభంధమయిన కీర్తనలు పాడుట ద్వారా దేవుని వాక్యము బోధించబడాలి తద్వారా సంఘములో ఒకరి నొకరు హెచ్చరించుకోవాలి! అయితే ఈ పాటలు ఇతరులను విమర్శించినట్లు కాకుండా కృప సహితముగా ఉంటూ  క్రీస్తు వాక్యము మన హృదయాలలో నిండిపోయేలా రాయబడాలి.  పాట ద్వారా చెప్పిన వాక్యము సులువుగా అర్థం అవుతుంది మరియు ఎన్నో రోజులు గుర్తుంటుంది. 

అయితే ఈ మధ్య కాలంలో ఆత్మీయత మరియు ఆదరణ కలిగించే పాటలు కరువయి పోయాయి. కేవలం లౌకిక  పాటలకు ధీటుగా ఉండాలని హంగు ఆర్బాటల మోజులో పడిపోతున్నారు. విశ్వాసులను బలపరుస్తు సంఘమును కట్టవలసిన పాటలు, ఏ విధమయిన వాక్యము లోతు లేకుండా, సంగీతము, దృశ్యముకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంఘమునకు ఉపయోగం లేకుండా మారుతున్నాయి. కేవలము పాటను ఎంతమంది చూశారు, ఎంతగా పాపులర్ అయింది అనేది ప్రమాణంగా అయిపొయింది. 

చెవులకు ఇంపుగా ఉన్నాయి కదా అని లేదా కంటికి అందంగా ఉన్నాయి కదా అని ఆత్మీయత లోపించిన పాటలు విని మీ విశ్వాసపు యాత్రలో చల్లారిపోకండి. ఉదాహరణకు పదవ తరగతి పాస్ అయినా విద్యార్ధి తిరిగి ఏడవ తరగతి చదివితే అతని జ్ఞానం పెరుగుతుందా? కొద్దీ రోజులకు  అతను పదవ తరగతి పాఠాలు మరచిపోయి, చివరకు ఏడవ తరగతి పాఠాలకు అలవాటు పడిపోయి అందులోనే కొనసాగుతాడు. విశ్వాస జీవితం కూడా అటువంటిదే, వాక్యపు లోతు లేని, వాక్యాను సారం కానీ, ఆత్మీయ అభివృద్ధి కనపరచని  పాటలు వినుట ద్వారా మీ ఆత్మీయ ఎదుగుదలను మీరే అడ్డుకుంటున్నారు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! పాటలు రాయటం, పాడటం దేవుడు మనకు ఇచ్చిన ఆత్మీయ వరములు, వాటిని చులకనగా చూడవద్దు. దేవుని పాటలు పాడే నోటితో అన్యమయిన పాటలు పాడి విశ్వాసంలో వెనుకపడి పోవద్దు. ఏ పాటయినా మిమల్ని ఆదరిస్తుంటే లేదా మిమల్ని ఆత్మీయంగా బలపరుస్తుంటే దానిలో ప్రతి పదము విశ్వాసించి పాడండి.  ఎందుకంటే ఆ పాట ద్వారా పరిశుద్దాత్మ దేవుడు మిమల్ని నడిపిస్తున్నాడు. పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తూ దూతలు పాటలు పాడుతున్నారు అని చాల సందర్భాలలో బైబిల్ లో రాయబడింది. రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత యుగయుగములు మనం చేయవసింది కూడా ఆయనను  ఆరాధించటమే! 

అయితే పాటలు దేవుని వాక్యమునకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. దేవుడి వాక్యమునకు ముందు గాని తర్వాత గాని పాటలు పాడుకోవచ్చు లేదా వినవచ్చు కానీ దేవుని వాక్యమునకు బదులు పాటలు పాడటం వినటం చేయరాదు. ఎవరయినా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడండి మరియు దుఃఖముగా ఉన్నపుడు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెపుతుంది (యాకోబు 5:13). కనుక పాటలు పాడటం అనేది ప్రార్థనకు కూడా ప్రత్యామ్నాయం కాదు. దేవుడు పాటల ద్వారా అద్భుత కార్యములు చేసాడు, చేస్తాడు, కానీ వాక్యము చదవాలని, మరియు ఆయనను ప్రార్థించాలని, ఆరాధించాలని కూడా అయన కోరుకుంటున్నాడు. 

దేవుని చిత్తమయితే వచ్చేవారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

3, జూన్ 2022, శుక్రవారం

ఫలభరితమైన జీవితము

 

యేసుక్రీస్తును మన రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత మనం విశ్వాస జీవితంలో  ఫలభరితముగా మారాలి. అనగా క్రీస్తు ఎలాగయితే దేవుని సర్వపరిపూర్ణతను  శోధించే శరీరములో ఉండి కూడా ఏలా వెల్లడి చేశాడో లేదా నివసింప చేశాడో  (కొలసయులకు 2:9) మనం కూడా అటువంటి జీవితమును కొనసాగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన కోసం తన ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు మన ఫలభరితమయిన జీవితమును బట్టి ఆకలి గొంటున్నాడు. 

మార్కు 11. "13. ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. 14. అందుకాయన ఇక మీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి."

యేసు క్రీస్తు మనకు పాఠాలు నేర్పిన అంజూరపు చెట్టు వృత్తాంతమును ఒక్కసారి గమనించండి. ప్రభువు ఆకలి గోని ఎంతో ఆశతో అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళాడు, కానీ దాని  వద్ద ఆకులు తప్ప మరేమి దొరకలేదు. ఇక్కడ అంజూరపు పండ్ల కాలము కాకపోయినా కూడా ఆ చెట్టు ఎన్నో ఆకులతో ఫలములు ఉన్నట్లుగా కనపడింది. మనలో చాల మంది లోపల అంతగా ఆత్మీయంగా లేకపోయినా కూడా, బయటకు మాత్రం ఎంతో భక్తిగా, ఆత్మీయంగా కనపడుతాము. మాటకు ముందు వెనుక "పైస్ ది లార్డ్" అని పలుకుతాము, ప్రతి ఆదివారం తూచా తప్పకుండా చర్చ్ కు వెళ్తాము. 

మనలను చూస్తే ఎవరయినా సరే, ఎంత భక్తి పరుడో అని మోసపోవలసిందే. కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేము, క్రీస్తు మనలో ఏ ఫలములు లేవని ప్రకటించే సమయం త్వరలోనే రానుంది. ఆ సమయంలో, అంజూరపు చెట్టును శపించినట్లుగా మనలను కూడా తన సన్నిధికి అనుమతించడు. మనము ఎవరో తండ్రి ముందు మనలను బట్టి సాక్ష్యం ఇవ్వడు.  మన జీవితం ఫల భరితం కావాలంటే ఏమి చేయాలో తెలుసుకునే ముందు, అసలు ఫలభరితమయిన విశ్వాసము అనగా ఏమిటి? 

పౌలు గారు కొలస్సయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదవవలసిందిగా మనవి చేస్తున్నాము. నూతనముగా మొదలు పెట్టిన కొలస్సి సంఘము తప్పుడు బోధలను బట్టి విశ్వాసములో వెనుకబడుతుంటే ఆ బోధలను ఖండిస్తూ పౌలు గారు, వారు ఏ విధముగా విశ్వాసములో ఫలభరితముగా ఉండాలో పరిశుద్దాత్మ ప్రేరణతో రాస్తున్నాడు.  
 
ప్రతి నిత్యమూ ఆత్మీయత లేదా ఆధ్యాత్మిక జ్ఞానము మరియు దేవుని గురించిన జ్ఞానము కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండాలి మరియు వాటి విషయమై దేవున్ని నిత్యమూ ప్రార్థించాలి. అలాగే దేవుని చిత్తమును తెలుసుకొనే జ్ఞానం కలిగి ఉండాలి. నిత్యము వాక్య ధ్యానములో గడుపూట ద్వారా ఆయన చిత్తము ఏమిటో, దేవుణ్ణి మనం ఎలా సంతోషపెట్టవచ్చో సులభముగా గుర్తించగలము. ఆవిధముగా దేవునికి ఇష్టమయిన వారిగా జీవిస్తూ, అన్ని వేళల ఆయనకు ఆనందం కలిగించే వాటిని మాత్రమే చేయాలి. అటువంటి మంచి కార్యాలు చేస్తూ, ఫలములు చూపించాలి. 

మనకు కలిగే ప్రతి శోధనలో దేవుని శక్తిని పొందుకొనే లాగా ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు అన్నింటిని భరించగల సహనము మనలో కలుగుతుంది. క్రీస్తు తన శ్రమలలో ఎంతగా తగ్గించుకున్నాడో, అయన శిష్యులుగా మరియు విశ్వాసులుగా మనం కూడా అటువంటి స్వభావము పొందుకోవాలి. ఇది మనుష్యులుగా మనకు అసాధ్యమే కానీ, దేవునికి అన్ని సాధ్యమే, కాబట్టి అయన మీద ఆధారపడి, అయన శక్తి ద్వారానే సాదించగలము. ఎందుకంటే దేవుడు మనలను తన వెలుగు రాజ్యానికి వారసులుగా ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనకు కలిగే శ్రమలను బట్టి మనలోని, పాపపు క్రియలను లేదా శరీర క్రియలను తగ్గిస్తూ, మనలను విశ్వాసములో బలపరుస్తున్నాడు. తద్వారా మన రక్షకుడయినా క్రీస్తు స్వరూపంలోకి మనలను మారుస్తూ, ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తున్నాడు. 

మనలో చాలామంది పౌలు గారు కొలస్సయులకు చెప్పిన  విషయాలు చేస్తారు! కానీ రోజులో కొన్ని గంటలు లేదా వారంలో ఒక్క రోజు మాత్రమే చేస్తూ, విశ్వాసములో ఫలిస్తున్నాము అని భ్రమపడుతూ ఉంటారు. ఫలించటం అంటే దినదినము అభివృద్ధి కలగాలి, హెచ్చుతూ తగ్గుతూ ఉండకూడదు. ఒక్కసారి చెట్టుకు పూత పూసిందంటే, అది పిందెలుగా మారుతుంది, తర్వాత కాయగా మారుతుంది అటుపైన దోరగా అవుతుంది చివరగా పండుగా మారుతుంది. ఈ క్రమములో ఎక్కడ కూడ కాయ మరల పిందెగా మారలేదు అనగా పురోగతి చెందిందే తప్ప తిరోగతి చెందలేదు. 

మన విశ్వాసం కూడా అలాగే ఫలిస్తు ఉండాలి. ఇక్కడ మనం పాపంలో పడిపోకూడదు అని చెప్పటం ఉద్దేశ్యం కాదు, అలా అని పడిపోయిన పర్వాలేదు అని కూడా కాదు. కానీ పడిపోయిన ప్రతిసారి ఎంత త్వరగా త్వరగా పైకి లేస్తున్నాము! ఎంత తీవ్రముగా దేవునికి మొఱపెడుతు పాపమూపై మన అయిష్టతను తెలుపుతూ దాని మీద విజయం కోసం ఆరాటపడుతున్నాము  అన్న విషయం చాల ప్రాముఖ్యతను కలిగి ఉంది. 

యోహాను 15: "5.  ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు."

ద్రాక్ష తీగలు ద్రాక్షావళికి అంటుకొని ఉంటేనే ఆ తీగలకు ద్రాక్ష పండ్లు కాస్తాయి. ఏ చెట్టు కొమ్మకయినా పండ్లు కాయలంటే ఆ కొమ్మ తప్పకుండా చెట్టుతో సంభందం కలిగి ఉండాలి. అప్పుడే ఆ చెట్టు లక్షణాలు మరియు సారము  కొమ్మకు పాకి దానికి పండ్లు కాస్తాయి. అదే విధముగా మనం క్రీస్తుతో అంటి పెట్టుకుని ఉంటె విశ్వాసపు ఫలములు పొందుకుంటాము. మనం క్రీస్తులో కొనసాగుతు విశ్వాసపు ఫలములు పొందులాగున పరిశుద్దాత్మ దేవుడు పాపం మనలను అంటకుండా కాపాడుతూ ఉంటాడు. 

కానీ మనం ఆ పరిశుద్దాత్మ హెచ్చరికను తోసిపుచ్చి మన జీవితంలో  పాపనికి చోటు ఇస్తాము. ఆ పాపం ద్వారా  మనం పొందవలసిన  విశ్వాసపు ఫలములు కోల్పోతాము.  కొంత మంది దైవ జనులు సైతం, ప్రసంగం చేస్తారు, ప్రసంగం అయినా వెంటనే అల్పమయిన విషయాలకు అందరి మీద కేకలు వేస్తారు. యేసయ్య ఆ విధముగా చేసి ఉంటాడని ఊహించగలమా? క్రీస్తులో నిలిచి ఉండటం అంటే కేవలం  "నేను ఆయనను నమ్ముకున్నాను" అని చెప్పటం కాదు. అయన చూపిన ప్రేమను మనం చూపించాలి, అయన ఓర్పును మనం అలవరచుకోవాలి, అయన ప్రతి మాటను తప్పకుండా పాటించాలి. 

మరియు ఆదివారం ఒక్కనాడు పవిత్రముగా ఉంటె సరిపోదు, మిగిలిన ఆరు రోజులు కూడా పవిత్రముగా దేవునితో గడపాలి. ప్రతి శరీర క్రియను త్యజించి, మన సొంత చిత్తముకు చనిపోవాలి. అప్పుడే మనం క్రీస్తులో బ్రతుకుతున్నట్లుగా పరిగణింపబడుతాము. తద్వారా మన  జీవితం ఫల భరితముగా ఉంటుంది మరియు మన ద్వారా తండ్రి నామం మహిమ పరచబడుతుంది! క్రీస్తు శిష్యులమని కేవలం నోటితో కాకుండా జీవిస్తూ ప్రకటించగలం.  ఫలించని ప్రతి తీగను వ్యవసాయకుడయినా తండ్రి  తొలగిస్తాడని యేసయ్య హెచ్చరిస్తున్నాడు. 

యోబు విశ్వాసమును సాతాను ముందు నిరూపించడానికి దేవుడు ఏమి చేసాడు? అతనిని శోదించులాగున సాతానుకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు యోబు మనవలె సణుగుకున్నాడా? తన భార్య చెప్పినట్లుగా దేవుణ్ణి దూషించాడా? "తన విమోచకుడు సజీవుడు, తనను తప్పకుండ విడిపిస్తాడు"  అని మొక్కవోని విశ్వాసం చూపించాడు. మన మీదికి  కూడా దేవుడు కొన్ని సార్లు శోధనలు అనుమతిస్తాడు. విత్తనం ఫలించాలంటే ఎలాగయితే విరిగి పోవాలో అదే విధముగా మన విశ్వాసం ఫలించాలంటే, మనము కూడా నలుగగొట్ట బడాలి. 

"బంగారము ఎలాగయితే అగ్నిచేత శుద్ధి చేయబడుతుందో, అంతకంటే విలువయిన మన విశ్వాసము ఈ శోధనల కొలిమి ద్వారా పరీక్షకు నిలిచి, క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనకు మెప్పు, మహిమ మరియు ఘనత కలగటానికి కారణంగా ఉంటుంది (1 పేతురు 1:7)". కాబట్టి దేవుడు మనలను నలుగ గొట్టటానికి తగిన సిద్ధపాటును, విశ్వాసమును మనం చూపుట ద్వారా ఫలభరితమైన జీవితమును పొందుకుంటాము. దేవుడు శోధనలు అనుమతించాడు అని పంటి బిగువున భాదలు దాచుకొంటూ జీవితం సాగించటం కాదు గాని అన్ని సమయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు దేవుణ్ణి దూషించక పోయిన కూడా  తనను తానూ నిందించుకున్నాడు. 

పాత నిబంధన (బైబిల్ లో భాగం గురించి కాదు) క్రింద ఉన్న యోబుకు ఆదరణ కర్త నడిపింపు అనగా పరిశుద్దాత్మ అనుగ్రహింపబడలేదు,  కనుక అది అతనికి పాపముగా పరిగణింపబడలేదు. కానీ నూతన నిబంధన క్రింద ఉన్న మనము "నిత్యమూ దేవునిలో ఆనందించాలి" అని దేవుని వాక్యం చెపుతుంది. మన ఓర్పును బట్టి,  మన బలహీనతలో సహాయం చేయులాగున పరిశుద్దాత్మ చెప్ప శక్యము కానీ మూలుగులతో మన తరపున విజ్ఞాపనలు చేస్తాడు (రోమీయులకు 8:26-27). మరియు దేవుడు మనం తట్టుకోలేని శోధన అనుమతించి మనం విఫలం కావాలని కోరుకోవటం లేదు కాని ప్రతి శోధనను తప్పించుకొనే మార్గమును కూడా ఇస్తున్నాడు (కొరింథీయులకు 10:13). కనుక నిత్యమూ ప్రతి పరిస్థితి యందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా ఫలభరితమైన జీవితం పొందుకుంటాము. 

దేవుని వాక్యము జీవము కలిగినది. అది మనస్ఫూర్తిగా విన్నవారి హృదయంలో ఖచ్చితముగా కార్యములు చేస్తుంది. మనలో చాలామంది నిత్యమూ బైబిల్ చదువుతారు, ఎన్నో ప్రసంగాలు వింటారు. ఏదయినా వాక్యం చదివినప్పుడో, లేదా మంచి ప్రసంగం విన్నపుడో, ఎంతో ఉజ్జీవము పొందుకుంటారు. తర్వాత కొద్ది సమయానికి, లేదా కొద్ది రోజులకు ఎప్పటి స్థితికి వెళ్ళి పోతారు. యేసయ్య చెప్పిన విత్తనాలు చల్లే వ్యక్తి ఉపమానం గుర్తుందా (మత్తయి 13:3-9). వాక్యము మన హృదయాలలో లోతుగా నాటుకు పోవాలి, అప్పుడే విన్న వాక్యం మనలో ఫలిస్తుంది. వాక్యం మనలో నాటుకు పోవాలంటే మన హృదయం సిద్దపడి ఉండాలి. సగం లోకం వైపు సగం దేవుని వైపు ఉంటె, విన్న వాక్యం దారి ప్రక్కన పడి పక్షులు ఎత్తుకు పోయిన విత్తనాల మాదిరి లేదా రాళ్ళ మీద పడి ఎండిపోయిన వాటి మాదిరి లేదా  ముండ్ల పొదలలో పడి ఎదుగలేని వాటి మాదిరి అయిపోతుంది. ఆ విధముగా ఫలభరితమయిన జీవితము చేజార్చుకుంటము. 

ప్రియాయమయిన సహోదరి, సహోదరుడా! ఎంతగా మనం ఫలిస్తున్నామని అనుకున్న కూడా ఇతరులకు మన ఫలముల ప్రత్యక్షత ఉండాలి. అనగా వారి ముందు వాటిని ప్రదర్శించటం కాదు గాని, సంఘము క్షేమాభివృద్దికి  మరియు సాటి విశ్వాసులను ఆదరించటానికి  మన ఫలములు  ఉపయోగపడాలి. చెట్టుకు ఫలములు కాచేది  తన గురించి కాదు, అదే విధముగా మన ఫలములు దేవుని రాజ్య వ్యాప్తికై ఉపయోగపడాలి. లేదంటే దేవుడు మనలో కోరుకున్న ఫలభరితమయిన జీవితము వ్యర్థమే!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!