పేజీలు

29, జులై 2022, శుక్రవారం

దేవుని అవసరం లేదనుకుంటున్నావా?


మనం విశ్వాసంలోకి రావటానికి ఎన్నో సందర్భాలు ఉంటాయి! దేవుడు మన అవసరతలు తీర్చడానో, లేదా అనారోగ్యం నుండి స్వస్థతలు అనుగ్రహించాడనో, అర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల భాధల నుండి విముక్తి కలిగించడానొ క్రీస్తు మీద విశ్వాసం పెంచుకుంటాము. ఇటువంటి విశ్వాసము కొద్ది రోజులకు అనగా అవసరాలు తీరిపొయిన తర్వాత నెమ్మదిగా సన్నగిల్లుతుంది! ఒకప్పుడు కన్నిటితొ చెసిన ప్రార్థన అవసరాలు తీరిపొయాక, అవసరం లేదనిపిస్తుంది. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చింది కేవలం మన అవసరాలు తీర్చటానికి మాత్రమే కాదు గాని మనలను పవిత్రులుగా చేసి, నిత్యమూ తన సన్నిధిలో గడిపే  జీవితం ఇవ్వటానికి అని గుర్తించాలి. 

మొదటి సారి విశ్వాసం లోకి రావటానికి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి ఉండవచ్చు! ఎలాగంటే, ఆనాడు ఇశ్రాయెలియులను ఐగుప్తులో బానిస బ్రతుకు నుండి విముక్తి దయచేసిన సమయం నుండి, ఎఱ్ఱ సముద్రం చీల్చి ఫరో సైన్యం నుండి రక్షించటంతో పాటు అరణ్యంలో మన్నాను కురిపించి పోషించటం చేసాడు దేవుడు. మన జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలు దేవుడు చేసి ఉంటాడు. ఆ విధముగా దేవుని మహిమను గుర్తించి విశ్వాసములో బలపడి, దేవునిలో కొనసాగటం మొదలు పెడుతాము. జీవితం సాఫిగా సాగుతుంటే, దేవుని అవసరం తగ్గిపోవటం మొదలవుతుంది. తిరిగి మనం విడిచిన ప్రతి లోకరీతిని పాటిస్తూ,  పూర్వపు స్వభావమును ముందుకు తెస్తాము, దేవునికి ఇష్టం లేని కార్యములు చేయటానికి వెనుకాడము. 

ఒకప్పుడు ఈ సమస్య తీరిపోతే చాలు, ఇక దేవునిలో లేదా దేవుని కోసం  ఎలా పరుగు పెడతానో చూడు అనుకుంటాము. దేవుడు తన శక్తి చేత అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తాడు. ఎంతో గొప్పగా సాక్ష్యం చెపుతాము, మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు అని గొప్పగా మాట్లాడుతాము. నెమ్మదిగా దేవుని ఘనకార్యాలకు కారణాలు వెతకటం మొదలవుతుంది. మనం దేవుని కోసం చెయ్యాలనుకున్న కార్యాలు, బ్రతకాలనుకున్న జీవితం అసాధ్యంగా మారి, ఇప్పుడు అంత కష్టం అవసరమా అనుకుంటూ దేవునికి దూరం కావటం మొదలవుతుంది. 

ప్రసంగి 5: "4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. 5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు."

సొలొమోను రాజు ఏమని రాస్తున్నాడు ఒక్కసారి చూడండి! దేవునికి మ్రొక్కుబడి చేసి దాన్ని  చెల్లించకుండా ఆలస్యం చేసే వారిని బుద్ధిహినులుగా పరిగణిస్తున్నాడు. అటువంటి వారు దేవునికి ఇష్టం లేని వారు. సమస్య తీవ్రతను బట్టి అది చేస్తాను ఇది చేస్తాను అని మనం చేయలేని మ్రొక్కుబడులు దేవుని ముందు పలుక వద్దు. ఒక్కసారి పలికిన తరువాత మ్రొక్కుబడి చెయ్యకుండా ఆగిపోరాదు. ఇదే అధ్యాయంలో దేవుని ముందు అనాలోచితంగా పలుకుటకు  హృదయమును త్వరపడ నియ్యక నీ నోటిని కాచుకొనుము (ప్రసంగి 5:2) అని రాసి ఉంది. నీ మ్రొక్కుబడి కష్టంగా ఉందా? పవిత్రంగా జీవించలేక పోతున్నావా? దేవునికి మరోసారి మొఱ్ఱ పెట్టు, ప్రతి దినము ఉదయము, సాయంత్రము ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, తద్వారా దేవుని పరిశుద్దాత్మ శక్తి నిన్ను నడిపిస్తుంది. 

మనలో కొంతమంది విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. దేవుని ఘనకార్యాలను బట్టి పవిత్రంగా జీవించటం మొదలు పెడుతారు. రెండవ సారి ఏదయినా అవసరం కలిగినప్పుడు, ఆశీర్వాదాలు కావాలనుకున్నప్పుడు తీవ్రంగా ప్రార్థించటం మొదలు పెడుతారు. అయితే దేవుని ప్రణాళికలు మనం అర్థం చేసుకోలేము. అయన కార్యములు గంబీరమయినవి, ఎన్నో కోణములు కలిగి ఉంటాయి. మనం కోరుకున్నది జరగనప్పుడు, నెమ్మదిగా విశ్వాసం సడలి పోవటం మొదలవుతుంది. కన్నీటి ప్రార్థనతో మొదలయి,  నిట్టూర్పులతో కొనసాగుతూ చివరకు సణుగుకొవటం వరకు వెళ్తుంది. ఆనాడు ఇజ్రాయెలీయిలు, దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుత కార్యములను మరచి, కాస్త ఆలస్యానికే సణుగు కోవటం మొదలు పెట్టారు. 

"మేము ఐగుప్తులో ఉంటేనే బాగుండేది, మమల్ని చంపటానికి తీసుకోని వచ్చారా" అని దేవుని స్నేహితుడయిన మోషేతో వాదనకు దిగారు. దేవుడు విడిపించక ముందు తాము  బానిసలుగా  అనుభవించిన శ్రమలను పూర్తిగా మరచి పోయారు. మాంసం లేదని, నీళ్ళు ఆలస్యంగా దొరికాయని దేవుని మీద సణుగుకున్నారు. ఇదివరకు మనకు ఉన్న కష్టాల నుండి దేవుడు ఎలా నడిపించాడు మరచి పోవద్దు. ఇప్పుడు ఆలస్యం జరుగుతున్న కారణం, మనకు మేలు చేసేది గానే ఉంటుంది. దేవుని ప్రణాళికలు మనలను అభివృద్ధి చేయటానికే తప్ప నశింప చేయటానికి కాదు (యిర్మీయా 29:11) అని  గుర్తుంచు కోవాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని, అయన ఉనికిని ప్రశ్నిస్తే ఎలా? 

జెఫన్యా 1: "6. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను."

జెఫన్యా 1: "12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షిం తును."

ఈ వచనములలో జెఫన్యా ప్రవక్త దేవుని నుండి పొందిన ప్రవచనం ఒక్కసారి చూడండి! దేవుణ్ణి అనుసరించక, ఆయనను విసర్జించి, అయన యొద్ద విచారణ చేయని వారిని అయన నిర్మూలము చేస్తానని అంటున్నాడు. నువ్వు కోరుకున్న మేలులు పొందుకున్న తర్వాత ఇంకా దేవుని చిత్తము దేనికి అని తలుస్తున్నావా? ఒకప్పుడు నీ చిత్తమే చేస్తాను తండ్రి అని పలికి, ఇప్పుడు అయన చిత్తం ఏమిటో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నావా? అటువంటి వారిని దేవుడు నిర్ములము చేస్తానంటున్నాడు. 

అదే విధముగా నువ్వు కోరుతున్న మేలులు పొందుకోవటం లేదని, నీ ప్రార్థనలకు సమాధానం లభించటం లేదని, దేవుడు ఉన్న  ఒక్కటే లేకున్నా ఒక్కటే అని ఆలోచిస్తున్నావా? అయన కీడు చేయడు, మేలు కూడా చేయడు అని ఆలోచిస్తూ నామమాత్రంగా, మొక్కుబడిగా ప్రార్థిస్తున్నావా? అయన లోకమంతటిని పరిశోధిస్తున్నాడు. తమ హృదయములలో దేవుని గురించి నామమాత్రంగా ఉన్నవాడు అనుకునే వారిని శిక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. 

సహోదరి సహోదరుడా దేవుడు మనలను తన ప్రాణం పెట్టి రక్షించుకున్నది, మనం ఆయనతో  సహవాసం కలిగి నిత్య జీవితం పొందుకొని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి. అంతే కానీ మన గొంతెమ్మ కోరికలు తీరుస్తూ మనం ఆయనకు దూరంగా బ్రతకటానికి కాదు. ఒక వేళ నువ్వు కోరుతున్నది అవసరం అయినా సరే, తగిన సమయంలో మనకు ఆయనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అయన ప్రణాళికలు మనలను అభివృద్ధి చేసేవే కానీ మనలను నశింప చేసేవి కావు. కనుక ఓర్పుతో అయన చిత్తము కొరకు కనిపెడుదాము. 

యోహాను 5: "14. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా"

ముప్పయి ఎనిమిది ఏళ్ళుగా బేతెస్థ కొలను దగ్గర స్వస్థత లేక పడి ఉన్న వ్యక్తిని యేసయ్య స్వస్థ పరచి, నీ పరుపు ఎత్తుకొని నడువు అన్నాడు. అక్కడ ఎంతో మంది స్వస్థతల కోసం పడిగాపులు కాస్తుంటే, యేసయ్య ఆ వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచాడు. మరి నిన్ను కూడా అలాగే రక్షించుకున్నాడు. నీ అవసరతలు తీర్చాడు, నీకు అసాధ్యం అనుకున్న కార్యాలు చేసాడు. మరి ఇప్పుడు నీవు వాటన్నింటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఓర్పుతో నిరీక్షిస్తూ ప్రార్థిస్తున్నావా? లేక దేవుడు పెద్దగా అవసరంలేదని నామమాత్రంగా విశ్వసిస్తున్నావా? స్వస్థతలు అందుకుని, మేలులు పొందుకుని దేవుణ్ణి మరచి పోయిన వారిని బట్టి యేసయ్య ఏమంటున్నాడు? మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు, ఇకపై  పాపము చేయవద్దని. 
 
దేవుడు నిత్యమూ లోకమును పరిశోధిస్తున్నాడు. తన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారిని ప్రతి క్షణము కాపాడుతూ ఉంటాడు. కానీ ఆయన శక్తిని తక్కువ చేసి ఆలోచిస్తే నశించి పోతాము. మరియు అయన ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి పాపంలో పడిపోతే, మరి ఎక్కువ కీడు పొందుకుంటాము. మన దేవుడు అనంత ప్రేమను కలిగి ఉన్నవాడు. ఎన్ని సార్లయినా నిన్ను క్షమిస్తాడు, కానీ నీ ఆత్మీయ పరుగులో వెనుక బడి, దేవుని ప్రణాళికలు, నీ పట్ల అయన ఉద్దేశ్యాలు తప్పిపోవద్దు. పౌలు తన జీవిత చరమాంకంలో "నా పరుగు ముగించాను" అని చెప్పిన మాట మన జీవితంలో మనం కూడా  కూడా చెప్పగలగాలి, లేదంటే కేవలం భూమి మీద జీవితం ముగించిన వారిగానే మిగిలిపోతాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

22, జులై 2022, శుక్రవారం

ఆరాధన అనగా ఏమిటి?

 

ప్రతి క్రైస్తవుడు తరచుగా వినే మాట ఆరాధన. ప్రతి ఆదివారం చర్చ్ లో చేసేది ఆరాధన అని క్రైస్తవులందరూ నమ్ముతారు. అందుకనే ఎవరయినా ఆదివారం చర్చ్ లో కనపడకపోతే "ఏంటి, పోయిన వారం ఆరాధనకు రాలేదు" అని ఇతరులను పలకరిస్తారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఆరాధన అనగానే పాటలు పాడటం, ఆనందంగా గంతులు వేయటం అనుకుంటారు. తర్వాత ఆరాధన వర్తమానం, అటు పైన ఒక్కొక్కరు దేవుడు తమకు ఇచ్చిన రక్షణను బట్టి ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించటం చేస్తారు.

దేవుడు ఏమయి ఉన్నాడో తెలుపుతూ, కృతఙ్ఞత స్తుతులు చెల్లించటం  ఆరాధన అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. దేవుని మహిమను, అయన  గొప్ప కార్యములను, అయన ప్రేమను గుర్తు చేసుకోవటం కూడా ఆరాధన అనిపించుకోదు. దేవుని మాటలు వినటం,  ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటం ఆరాధన అనిపించుకుంటుంది. చాల మంది దేవుని సేవ చేస్తున్నాము అన్న పేరుతొ దేవుని మాటలు వినటమే మానేస్తారు. సంఘము పనులలో, పరిచర్యలో తలమునకలు అవుతూ వ్యక్తిగత ప్రార్థన, దేవుని వాక్య పఠనము మరియు దేవునితో ఏకాంతంగా గడపటం నిర్లక్ష్యం చేస్తారు. వాక్యము కంఠస్తంగా నోటికి వస్తుందే తప్ప, దేవుని అభిషేకం నుండి రావటం లేదు అని గుర్తించారు. 

మార్కు 7: "6. అందుకాయన వారితో ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే."

ఈ వచనములలో యేసు క్రీస్తు ఏమని సెలవిస్తున్నారు చూడండి! ప్రజలు కేవలం తమ పెదవుల చేత ప్రార్థిస్తున్నారు కానీ తమ హృదయములు ఆయనకు ఎంతో దూరముగా ఉన్నాయి అని, అటువంటి వారిని వేషధారులుగా పరిగణిస్తున్నాడు. చాల మంది విశ్వాసులకు కొత్తలో విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఉన్నంత ఉజ్జివం ఉండదు. రక రకాల వ్యాపకాలు, పాటలు వినటం, సందేశాలు వినటం లేదంటే దేవుని సేవ పేరిట తమను తాము ఘనపరచు కోవటం చేస్తారు. వారు కేవలం  రోజు అరగంట వాక్యం చదువుతారు, కొద్దీ సేపు ప్రార్థన చేసి యధావిధిగా తమ పనులకు ఉపక్రమిస్తారు. దేవుని మాటలు వినటానికి, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటానికి వారికి సమయం ఉండదు. 

సాతాను యేసయ్యను తనను ఆరాధించాలని కోరినప్పుడు ఏమి ఆశ చూపాడు? (మత్తయి 4:8-9) లోకంలో ఉన్న రాజ్యములలో మహిమను ఇస్తానని, తనకు సాగిలపడి నమస్కారం చెయ్యాలని అడిగాడు. అందుకు యేసయ్య నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే ఘనపరచాలని వాడిని గద్దించాడు. మరి మనకు ఉన్న ఆశలు ఏమిటి? మనం దేవునికి ప్రార్థన కేవలం అవసరాల నిమిత్తమే చేస్తున్నామా? లేక ఆయనను మనసారా ఆరాధిస్తున్నామా? సమస్త ఘనత ఆయనకు ఆపాదిస్తున్నామా లేక మనకు కూడా భాగం ఉంది అని భావిస్తున్నామా? 

యెషయా ఆరవ అధ్యాయము 2 వచనము నుండి 9 వచనము వరకు చదువవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాము. ఇక్కడ యెషయా ప్రవక్త పరలోకంలో జరిగే ఆరాధనను దర్శనం రూపంలో చూశాడు. వివిధ రకాల దేవ దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గానములు చేస్తున్నారు. ఆయన పరిశుద్దత నుండి వచ్చే వెలుగును చూసే శక్తి లేక, తమ రెక్కలతో ముఖములు కప్పుకుంటున్నారు. యెషయా తన అపవిత్రను బట్టి దేవుణ్ణి చూసి తానూ నశించిపోయానని అనుకున్నాడు. అయితే సెరాపులలో ఒక దూత బలిపీఠము నుండి నిప్పును తెచ్చి అతని పెదవులకు తగిలించి పవిత్రునిగా చేసింది. అప్పుడు దేవుడు "నేను ఎవరిని నా నిమిత్తం పంపుదును" అనగానే యెషయా "చిత్తము ప్రభువా నేను వెళ్ళెదను" అని చెప్పాడు. 

పాపముతో ఉండే మనము నిత్యమూ మనలను మనం తగ్గించుకొని దేవుణ్ణి సన్నిధిలో  పాపములు ఒప్పుకోవటం  ద్వారా అయన మనకు తన కృపను అనుగ్రహిస్తాడు, అప్పుడు పాపం మన మీద అధికారం కోల్పోతుంది, తద్వారా మనం పవిత్రులుగా మారుతాము. అప్పుడు దేవుడు తన చిత్తమును మనకు బయలు పరచి మనలను నడిపిస్తాడు. ఆ విధముగా దేవుని చిత్తమును చేయటము నిజమయిన ఆరాధనకు సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. దేవుని పనే కదా చేస్తున్నాము, దేవుని పాటలే కదా పాడుతున్నాము, లేదా వింటున్నాము అనుకోవటం ఆరాధన కాదు. కేవలం జ్ఞానం కోసం దేవుని వాక్యం చదువకుండా, ఆత్మ శక్తి కోసం చదవాలి  (2 కొరింథీయులకు 3:4-6).  మన సమస్తమును పక్కన పెట్టి, అయన యందె దృష్టి నిలిపి అయన స్వరం వినటమే ఆరాధన. 

బైబిల్ లో మొదటి ఆరాధన చేసింది అబ్రాహాము. తనకు ఎంతో ప్రియమయిన కుమారుడు ఇస్సాకును దేవుడు తనకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రాహాము వెనుకాడ లేదు. ఆ సమయంలో అబ్రాహాము తన పని వారితో పలికిన మాటలు ఒక్కసారి చూడండి (ఆదికాండము 22:5) "నేను ఈ చిన్న వాడును వెళ్లి దేవునికి మ్రొక్కి (worship) వస్తాము"  అన్నాడు. ఇక్కడ అబ్రాహాము తనకు ప్రియమయిన కుమారుణ్ణి దేవునికి అర్పించటం ఆరాధనగా పేర్కొన్నాడు. మరి మనకు ఇష్టమయినవి వదిలి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనలో అహంకారం, జారత్వము, ధనాపేక్ష, క్రోధము, పేరు ప్రఖ్యాతులు ఇవ్వని కూడా మనకు ఎంతో ఇష్టమయిన కార్యములు కదా? వీటిని వదిలి పెడుతున్నామా? అయన పరిశుద్దాత్మ శక్తికై ఆరాటపడుతున్నామా? 

ముందు చెప్పుకున్నట్లుగా, దేవునికి కృతఙ్ఞతలు చెల్లించటం, అయన మేలులను తలచుకోవటం సంపూర్ణ ఆరాధన కాదు. ప్రతి స్థితియందు ఆయనకు మొక్కటం, అయన మీద ఆధారపడటం ఆరాధన అని చెప్పుకోవచ్చు. యోబు తన సమస్త సంపద నశించి, తన బిడ్డలందరు చనిపోయారని తెలియగానే ఏమి  చేసాడు చూడండి! "యెహోవా  ఇచ్చెను, యెహోవా  తీసికొని  పోయెను, యెహోవా నామమునకు స్తుతి  కలుగునుగాక" అన్నాడు (యోబు 1:21). ఇక్కడ యోబు తనకు ఎంతో దుఃఖకరమయిన పరిస్థితి ఉన్న కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మరియు ఈ సంగతులలో ఏ విషయమందు దేవుని మీద విసుగుపడి పాపం చేయలేదు. మరి మనం అటువంటి ఓర్పు కలిగి ఉన్నామా? దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తున్నామా? అదియే ఆరాధన. 

మనుష్యులయిన మనము ఆత్మ, జీవము, దేహము అను మూడు భాగములు కలిగి ఉన్నాము (1 థెస్సలొనీకయులకు 5:23).  దేవుడు పరిశుద్దాత్మ రూపంలో మనలో ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ ఆత్మకు నిలయం మన యొక్క దేహము. కనుక మన దేహమును పవిత్రముగా ఉంచుకోవాలి, అనగా అందులో జరిగే సమస్త పాప కార్యములు (గలతీయులకు 5:18-21) చేయకుండుట ద్వారా ఆత్మ చేత నడిపింపబడిన వారిగా ఉంటాము. మరియు మన దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుటమే ఆయనను ఆరాధించటము అని (రోమీయులకు 12:1) అని పౌలు గారు పరిశుద్దాత్మ ద్వారా తెలియజేసారు. మరియు క్రీస్తు యేసు నందు అతిశయపడుతూ, మన సొంత బలమును, తెలివిని విడిచి ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (ఫిలిప్పీయులకు 3:3)
 
యోహాను 4: "24. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను."

దయచేసి యోహాను సువార్త 4 వ అధ్యాయము పూర్తిగా చదవమని ప్రభువు పేరిట బ్రతిమాలుకొనుచున్నాము. ఈ వచనములలో యేసయ్య దేవుణ్ణి ఎలా ఆరాదించాలో సమరయ స్త్రీకి వివరిస్తున్నాడు. ఇక్కడ ఆ సమరయ స్త్రీ తన పాప జీవితమును యేసయ్య ముందు దాచుకోలేదు, అన్ని నిజాలు చెప్పింది, తన పాపములన్ని కూడా ఒప్పుకుంది.  దేవుణ్ణి ఎలా ఆరాదించాలి అన్న విషయంలో సరయిన అవగాహనా లేకుండా ఉంది. అప్పుడు యేసయ్య "కొండ మీద కాదు మందిరములో కాదు, యదార్థముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తారని, అటువంటి వారినే తండ్రి కోరుకుంటున్నాడు" అని సెలవిస్తున్నాడు. 

ప్రియామయిన సహోదరి, సహోదరుడా! ఆరాధన విషయంలో నీకు ఉన్న అవగాహనా ఏమిటి? నీ పాపపు జీవితం ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పాటలు పాడటం, కేవలం మందిరములో దేవుణ్ణి ప్రార్థించటమే ఆరాధన అనుకుని అక్కడే ఆగిపోతున్నావా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యము తోనూ ఆరాధించాలని దేవుని వాక్యం చెపుతున్నది పాటిస్తున్నావా? ఆత్మతో అనగా కేవలం పెదవులతో కాకుండా, హృదానుసారముగా అయన ఆజ్ఞలు పాటిస్తూ జీవించటం. సత్యముతో అనగా ఎటువంటి స్థితికి భయపడకుండా, మన శక్తిని బట్టి కాకుండా కేవలం దేవునిపై   విశ్వాసముతో కొనసాగటం. ఆరాధన అనేది, మన ప్రతి దిన చర్యలో కనపడాలి, అది మన విశ్వాస జీవిత విధానముగా అనుసరించాలి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

1, జులై 2022, శుక్రవారం

దేవునితో సాన్నిహిత్యం!

 

దేవుడు మనతో వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉండాలని కోరుకుంటున్నాడు, మన అణువణువును అయన ఎరిగి ఉన్నాడు! సృష్టి కారుడయినా దేవుడు మనకు తండ్రివలె ఉండి మనలను పోషిస్తున్నాడు, నిత్యము మన పట్ల అయన కలిగి ఉన్న ఉద్దేశ్యాలను నెరవేర్చాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ మనము అనిత్యమయిన వాటికి ఆశపడి దేవుని ఉద్దేశ్యాలను కాదని మన ఇష్టానికి బ్రతకాలని చూస్తున్నాము. 

యోహాను 17: "22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని."

యేసు క్రీస్తు సిలువలో తన ప్రాణం పెట్టుటకు ముందు చేసిన ప్రార్థనలో ఈ వచనములు ఏమి చెపుతున్నాయి? దేవుడు యేసయ్యను ప్రేమించినట్లు మనలను కూడా ప్రేమిస్తున్నాడు. మరియు క్రీస్తుకు అనుగ్రహించిన మహిమను దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. దేవుని దృష్టిలో మనం క్రీస్తుకు సమానముగా మరియు అంతే ప్రాముఖ్యత కలిగి ఉన్నాము! మరి మన ఆలోచన విధానం ఏలా ఉంది? యేసయ్య ఏవిధముగా పరిపూర్ణముగా, పరిశుద్ధముగా జీవించాడో, పరిశుద్దాత్మ శక్తి ద్వారా మనకు సాధ్యమే, అప్పుడు  దేవునితో యేసయ్య అంతటి సన్నిహిత్యము మనకు కూడా ఏర్పడుతుంది. 

యేసయ్య వలె మనం నీటి మీద నడువక పోవచ్చు, అయన వలే స్వస్థతలు చెయ్యకపోవచ్చు, అయన వలే చనిపోయిన వారిని తిరిగి లేపలేక పోవచ్చు. కానీ అయన వలే దేవునికి మనకు అడ్డుగా వస్తున్నా పాపమును, మన శరీర క్రియలను జయించే శక్తిని దేవుడు తన పరిశుద్దాత్మ శక్తితో ఇస్తానంటుంటే, మనం చేస్తున్నది ఏమిటి? కోపం అణచుకోలేక పోవటం, కాముకత్వమును కాదనుకోలేక పోవటం. గర్వపడుతూ దేవుని దృష్టిలో అల్పులుగా మిగిలిపోవటం, నిత్యము నిరుత్సాహపడుతూ, తృప్తి లేకుండా దైవ దూషణకు కారకులుగా మారిపోవటం. సాతాను నిత్యమూ దేవుని దగ్గర మనలను బట్టి ఆయనను దూషిస్తూ (యోబు 2:9) మన మీద నేరారోపణ చేస్తూ తనతో పాటు మనలను నరకాగ్నికి సిద్ధం చేస్తున్నాడు ఎరిగి  అని ఉన్నామా? 

ఆనాడు తప్పిపోయిన కుమారుడు తన ఆస్థికోసం తండ్రి నుండి విడిపోయినట్లు, మనం కూడా మన శరీర క్రియలను బట్టి దేవునికి దూరంగా బ్రతకాలని ఇష్టపడుతున్నాము లేదా దూరంగా అయిపోతున్నాము. మన శరీరము మన సొత్తుకాదు, అది దేవుని వలన అనుగ్రహింపబడి, అయన మనకు అనుగ్రహించు పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నది.  క్రీస్తు మనలను ఎంతో వెల చెల్లించి కొన్నాడు కనుక శరీరముతో దేవుణ్ణి మహిమ పరచాలి  (కొరింథీయులకు 6:19-20)  అని దేవుని వాక్యం సెలవిస్తున్నది.  పాత నిబంధన ప్రకారం దేవుడు, మానవుల పాప క్షమాపణార్థం జంతువులను బలిగా అర్పించులాగున నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారం జంతువులను చంపి, బలి పీఠం మీద దహనం చెయ్యాలి. కానీ నేడు మన శరీరాలను సజీవముగా సమర్పించాలి (రోమీయులకు 12:1) అని దేవుని వాక్యం సెలవిస్తోంది. 

అనగా శరీర క్రియలకు లొంగిపోకుండా వాటిని లొంగదీసి మన శరీరమును బానిసగా చెయ్యాలి (1 కొరింథీయులకు 9:27).  అప్పుడు  దేవుడు  తనతో మన సన్నిహిత్యముకు అడ్డుగా వచ్చే ప్రతి క్రియను జయించే శక్తిని తన పరిశుద్దాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మనం క్రీస్తు  చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తూ, ఆయనతో నిత్య సహవాసం చేస్తుంటాము. అందును బట్టి అయన స్వభావమును పొందుకొని తన  స్వరూపములోకి మారుతాము.  క్రీస్తు శరీర దారిగా ఉన్న దినములలో నిత్యము మహా రోధనతో మరియు కన్నీళ్ళతో కూడిన ప్రార్థనలు చేస్తూ దేవుని యెడల భయభక్తులు చూపుట ద్వారా పాపం అనే మరణం నుండి దేవుని చేత రక్షించబడ్డాడు (హెబ్రీయులకు 5:7) అని దేవుని వాక్యం సెలవిస్తోంది.  

మరి మనం పాపం జయించటానికి అటువంటి ప్రార్థనలు చేస్తున్నామా? ఎంతసేపు భూమిమీద బ్రతికే ఎనభై ఏళ్ళలో అన్ని సక్రమంగా జరిగిపోవాలి, అది కావాలి ఇది కావాలి అని ప్రార్థనలు చేస్తాము. కానీ దేవుడు కోరుకుంటున్న నిత్య సహవాసం అయన మనకు ఇస్తానన్న నిత్య జీవితము ప్రాముఖ్యం లేనివిగా మారిపోయాయి. అయన మనలను సృష్టించినప్పుడు, మనలను ఎలా పోషించాలో, ఎలా నడిపాంచాలో ప్రణాళిక లేకుండా ఉంటాడా? పక్షి రోధనను పట్టించుకొనే దేవునికి, సింహం పిల్లలను ఆకలికి ఉంచని దేవునికి, ఎంతో శ్రేష్ఠముగా ఎంచిన నీ జీవితం  పట్టింపు  లేదా? సోమరిగా ఉండవద్దు కానీ విశ్వాసంతో మన ప్రయత్నాలు చేస్తూ  భయం, ఆందోళన దూరం చేసుకోవాలి.  

మన జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్న ప్రతి సమస్య దేవుడు అనుమతించిందే, అయన ప్రణాళికలు మన భవిష్యత్తును బాగు చేయటానికే తప్ప భగ్నం చేయటానికి కాదు (యిర్మీయా 29:11)  అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒక వేళ దేవునికి విరుద్ధముగా నిర్ణయం తీసుకోని ఇప్పుడు కష్టాలు కొని తెచుకున్నావా? దేవుని ముందు మోకరించి క్షమాపణ కోరుకో! ఆ కీడును కూడా నీకు మేలుగా మారుస్తాడు. నిరాకారంగా మారిపోయిన భూమిని దేవుడు తిరిగి బాగు చెయ్యలేదా? (ఆదికాండము 1:2)  మన జీవితాలను కూడా బాగు చేసే సమర్థుడిగా దేవుడు ఉన్నాడు. భారం మోయటం అపి అయన మీద వేసి కొనసాగటమే మనం చేయవలసింది. 

మనలో చాల మంది దేవుని కోసం కనీసం ఏమి చేస్తే ఆయనను సంతోషపెట్టవచ్చు అని ఆలోచిస్తారు. ఆ విధముగా ప్రతి ఆదివారం మందిరముకు వెళ్ళటం, ప్రతి నెల దశమ భాగం ఇవ్వటం చేసి దేవుణ్ణి సంతోషపెడుతున్నాము అనుకుంటారు. దేవుడు మనలను పూర్తిగా కోరుకుంటున్నాడు. ఇలా వచ్చి ఆలా వెళ్లిపోవటానికి మనం బంధువులం కాదు, అయన పిల్లలం! ఒక్క ఆదివారమే కేటాయిస్తాను, మిగతా రోజులు సరదాగా అన్ని అనుభవిస్తాను అంటే కుదరదు. 

మన పిల్లలు వచ్చి మేము  ఆదివారం మాత్రమే మన ఇంట్లో ఉంటాము, మిగతా రోజులు పకింట్లో ఉంటాము అంటే ఎలా ఉంటుంది? ప్రతి రోజు, ప్రతి క్షణము ఆయనతో సంభందం కలిగి ఉండాలి. అనగా ఆయనకు ఇష్టం లేని క్రియలు మనకు ఎంతో ఇష్టమయిన మానివేయాలి మరియు ఆయనకు ఇష్టమయిన క్రియలు మనకు కష్టమయిన చేయాలి. అప్పుడే మనం ఆయన పిల్లలుగా, క్రీస్తు పెండ్లాడె వధువు సంఘములో భాగంగా పరిగణింపబడుతాము. లేదంటే అరకొర ఆత్మీయ జీవితంతో మనలను మనమే మోసపుచ్చుకుంటాము. 

మరి కొంతమంది దేవుని పరిచర్య చేయాలని, ఎదో ఒకటి చేసేయ్యాలి అని తమకు ఉన్న తాలాంతులను వాడుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. దేవుని చిత్తము కనిపెట్టకుండా ఎదో ఒకటి చెయ్యాలి అని అత్యుత్సాహంతో చేస్తుంటారు. చాల సార్లు దేవుడు తమకు ఇచ్చిన లౌకిక బాధ్యతలు, ఆశీర్వాదాలు కూడా వదిలేసి దేవుని కోసం ఎదో చేస్తున్నాము అన్న భావనలో ఉంటారు.  కానీ వారి విషయంలో దేవుని చిత్తము ఏమిటి? అని అడిగి తెలుసుకోవాలి.  

మార్త మరియు మరియ విషయంలో యేసయ్య ఏమి చెప్పాడు గుర్తుందా? (లూకా 11:38-42) యేసయ్యకు ఎదో చెయ్యాలని మార్త ఆరాటపడుతుంటే మరియ అయన పాదాల దగ్గర కూర్చుని అయన చెప్పే సంగతులు వింటూ ఉంది. "ప్రభు మరియను నాకు సహాయంగా పని చేయమను" అన్న మార్తతో యేసయ్య, "నువ్వు అనవసరమయిన వాటి కోసం విచారిస్తూ తొందరపడుతున్నావు కానీ మరియ శ్రేష్ఠమయిన దానినే ఎన్నుకోంది! అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు" అని చెప్పాడు కదా!  కొన్ని సార్లు దేవుడు మనలను మౌనంగా ఉండమంటాడు, అప్పుడు అయన చిత్తమును చెయ్యాలి. అయన పరిచర్య కంటే కూడా అయనను వినటం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్న తలంతు ఎక్కడికి పోదు, దాన్ని వాడుకొనే అవకాశం ఆయనే మనకు ఇస్తాడు. 

ప్రియమయిన సహోదరి సహోదరుడా! సొలొమోను గారు రాసిన పరమగీతము చదివినట్లయితే, క్రీస్తుకు మరియు వధువు సంఘముకు సాదృశ్యముగా ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. ప్రియుడు, ప్రియురాలు ఎంతటి అన్యోన్యత కలిగి ఉండాలో, ఎంతగా ఒకరి నొకరు కోరుకోవాలో ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది (పరమగీతము 7:6-12). క్రీస్తు మన ప్రతి ఆణువణువూ ఎరిగి ఉన్నాడు, మనతో అత్యంత సన్నిహిత్యం కోరుకుంటున్నాడు. 

ఆదే విధమయిన ఆరాటం మనకు ఉందా? అంతగా క్రీస్తును ఎరిగి ఉన్నామా? సంపూర్ణ సమర్పణ మనం చేస్తున్నామా? క్రీస్తు అనే మన ప్రియుడు తన సమస్తం మన కోసం అర్పించి, మన పాపములు తొలగించి మనలను శుద్ధులుగా మార్చాడు, దేవునికి దగ్గరగా చేర్చాడు. హృదయమనే మన తోటలోకి  ఆయనను ఆహ్వానిస్తే అయన దాన్ని ఫలవంతంగా మారుస్తాడు. మన శరీరం ఆయనకు అర్పిస్తే తన పరిశుద్ధాత్మతో అందులో నివసిస్తాడు, అయన వెలుగుతో మనలను ప్రకాశింపజేస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్ !!