అయన ప్రేమను హింస ఆపలేదు మన నీతి కోసం తన సిలువ యాగం సాగింది మరణమును సైతం హత్తుకుంది మరణముతో ఆగిపోలేదు అయన చరిత మరణమును గెలవటం అయన ఘనత తనను నమ్మటమే మన భవిత!
క్రైసవ విశ్వాసము నిత్యమూ పాపమూ, పరిశుద్ధత గురించి ప్రాముఖ్యముగా బోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే సృష్టి కారకుడయినా దేవుడు ఎంతో పరిశుద్ధుడిగా ఉన్నాడు. కనుక ఆయన బిడ్డలయినా మనము కూడా నిత్యమూ పరిశుద్ధముగా ఉండాలని, పాపపు తలంపులు పాటించకుండా ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. దేవుడు మనలను తన స్వరూపములో సృష్టించాడు అని దేవుని వాక్యం చెపుతోంది. కానీ మనకు ఉన్నటు వంటి సంపూర్ణ స్వేచ్ఛను బట్టి, పాపమూ చేసి, దేవుడు మనకు ఇచ్చిన అయన మహిమను కోల్పోయాము. అప్పుడు పరిశుద్ధుడయినా దేవుని సన్నిధిని మనము కోల్పోయాము. దేవుని ప్రమాణాల ప్రకారం పాపం చేయటం అంటే, దొంగతనము, హత్య చేయటం లాంటివి మాత్రమే కాదు గాని చిన్న అబద్దం చెప్పిన కూడా పాపముగానే పరిగణింప బడుతుంది.
దురదృష్టవశాత్తు కొన్ని ధర్మాలలో అబద్దాలు చెప్పటం కూడా అంగీకారముగా బోధింపబడుతోంది. అదేవిధముగా, ఇతరుల మీద కోపం పెంచుకోవటం వారిని హత్య చేయటంతో సమానంగా, పరాయి స్ర్తీని మోహపు చూపు చూడటం వారితో వ్యభిరించటంతో సమానముగా బైబిల్ బోధిస్తుంది. ఈ విధముగా ఏ ఒక్క మానవుడు దేవుని పరిశుద్ధ ప్రమాణాలను అందుకోలేడు, కనుకనే క్రెస్తవ విశ్వాసము పాపమూ గురించి, పరిశుద్ధత గురించి ప్రాముఖ్యముగా బోధిస్తుంది. అయితే దేవుని కుమారుడు అయినా యేసు క్రీస్తు మనిషిగా జన్మించి, పాపం లేకుండా జీవించి, మన పాపముల నిమిత్తం, పరిశుద్ధమయిన తన రక్తం కార్చి, పాపం ద్వారా మనకు సంభవించే మరణము పొందుకొని, మరణము జయించి తిరిగి లేచాడు. దానినే ఈస్టర్ గా లేదా పునరుద్ధాన ఆదివారముగా జరుపుకుంటున్నాము.
మనలో చాల మంది యువతి, యువకులు మరియు మధ్య వయస్కులు దేవుని దగ్గరికి రావటానికి, పాపములు ఒప్పుకొని పరిశుద్ధముగా జీవించే ప్రయత్నం చేయటానికి ఇంకా చాల సమయం ఉంది అనుకుంటారు. కానీ రేపు ఏమి జరుగుతుందో తెలియని అనిశ్చితి ఉన్న ఈ లోకంలో మనకు ఎంత సమయం ఉందొ ఎవరు మాత్రం చెప్పగలరు? ఇలాంటి వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. అయితే మరి కొంత మంది దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడుతారు కానీ, తమకు ఉన్న చెడు అలవాట్లను బట్టి రాకుండా, ఆ అలవాట్లు వదిలేసినా తర్వాత రావాలని వెనుకడుగు వేస్తుంటారు. దేవుని పరిశుద్ధ ప్రమాణాలను, ఒక్క క్రీస్తు తప్ప, ఏ మానవుడు కూడా అందుకోలేదు, ఇక ముందు కూడా అందుకోలేడు (రోమీయులు 3:23) అని దేవుని వాక్యం చెపుతోంది.
క్రీస్తు తన బోధలలో "రోగులకే వైద్యుడు అవసరం కానీ, ఆరోగ్యవంతులకు కాదు" అని చెప్పాడు (మార్కు 2:17). అయన వైద్యుడిగా మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మన ఆత్మీయ రోగాలను, అనగా పాపాలను తొలగించటానికి అయన వచ్చినప్పుడు, ఆనారోగ్యం అనగా పాపములు తొలగించు కోవటానికి ఆయనను చేరుకోవాలి గాని, ఆరోగ్యం పొందుకున్న తర్వాత అనగా పాపములు వదిలిపెట్టిన తర్వాత అయన దగ్గరకు వస్తానని చెప్పటం ఏమిటి? దేవుని వాక్యము, యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము మరియు పరిశుద్దాత్మ శక్తి లేకుండా మనం ఏ చిన్న చెడు అలవాటును కూడా జయించ లేము. మనసులో అదిమి పెట్టి ఉంచటం తప్ప. మారు మనసు కావాలంటే క్రీస్తు దగ్గరకు రావాల్సిందే. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, మోకరించి అడుగు, నీ పరిశుద్ధ జీవితానికి అదే మొదటి అడుగవుతుంది.
నిర్గమకాండము 3: "6. మరియు ఆయననేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖ మును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను."
దేవుడు మోషేకు తనను తానూ, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. వీరందరూ కూడా ఎన్నో తప్పులు చేసిన మానవమాత్రులు మాత్రమే. కానీ దేవుడు తన పరిచయం వారితో జోడించి చేసుకుంటున్నాడు. సర్వ సృష్టిని చేసింది నేనే, అని చెప్పి దేవుడు అద్భుతాలు చూపించి తన పరిచయం చేసుకోవచ్చు కదా? కానీ దేవునికి మనుష్యులంటే ప్రేమ. తనను విశ్వసించినా వారంటే గర్వం. కనుకనే వారి పేరుతొ జోడించి తనను తానూ పరిచయం చేసుకుంటున్నాడు. తన పరిచయం మన ద్వారా కూడా జరగాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. హనోకు దేవునితో నడిచాడని దేవుని వాక్యం చెపుతోంది. అంటే హనోకులో ఏ తప్పులు లేవా? దేవుని వాక్యం ప్రకారం ఖచ్చితముగా ఉన్నాయి. కానీ ఆయనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఆయనను మరణం లేకుండా దేవుని దగ్గరికి చేర్చింది (ఆదికాండము 5:24).
యాకోబు 4: "8. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి."
క్రీస్తు సహోదరుడయినా యాకోబు గారు పాపులయిన ప్రతి ఒక్కరు దేవుని యొద్దకు వస్తే అయన మీ వద్దకు వస్తాడు అని చెపుతున్నాడు. అప్పుడు మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అని పిలుపునిస్తున్నారు. అలాగే ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధ పరచుకొనుడి అని సూచిస్తున్నారు. ఈ యాకోబు గారు ఒకప్పుడు యేసయ్యను పిచ్చి పట్టిన వాడని చెప్పి, ఆయనను పట్టుకో బోయిన వారిలో ఒక్కడు అని దేవుని వాక్యంలో చూడవచ్చు (మార్కు 3:21). కానీ క్రీస్తు మరణం, పునరుద్ధానము చూసిన తర్వాత ఆయన విశ్వాసిగా మారిపోయాడు.
పాపి అయినా తనను పరిశుద్ధ పరిచింది క్రీస్తు సిలువ మరణమే అని ఆయన గుర్తించాడు కనుకనే మనకు కూడా బోధిస్తున్నాడు. అలాగే క్రీస్తు విశ్వాసులయిన వారు ద్వంద మనసును మానుకొని హృదయములను దేవుని యొద్ద పరిశుద్ధ పరుచుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు. మన పాపపు బ్రతుకులను శుభ్రము చేసి మన హృదయాలను పరిశుద్ధ పరిచేది ప్రభువయినా క్రీస్తు మాత్రమే. కనుక ఏ పరిస్థితిలో మనం ఉన్న అయన దగ్గరకు రావటమే మనం చేయవలసింది.
తీతుకు 3: "5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను."
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! తన ఆత్మీయ కుమారుడయిన తీతుకు పౌలు గారు రాసిన లేఖలో ఏమని రాస్తున్నాడు చూడండి. మనం పాటించే నీతిని క్రియలను బట్టి కాకుండా కేవలము దేవుని కనికరము చేత మాత్రమే మనము రక్షింపబడ్డాము అని చెపుతున్నాడు. నీలో పాపపు క్రియలు ఉన్నాయని, చెడు అలవాట్లు పాటిస్తున్నానని దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్ను ఎప్పుడెప్పుడు పరిశుద్ధ పరచి తన బిడ్డగా మార్చుకోవాలా? అని తపన పడుతున్నాడు. క్రీస్తు మీద విశ్వాసం ఉంచి, బాప్తిస్మము తీసుకోని, పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా మన చెడు అలవాట్లు జయించే శక్తిని మనకు దేవుడే ఇస్తాడు.
క్రీస్తు మనకు ఇచ్చే ఆదరణ కర్త పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావం కలిగిస్తాడు. అప్పుడు మన పాపపు జీవితం మారిపోయి, పరిశుద్ధ పరచబడుతుంది. ఆ విధముగా దేవుడు నిన్ను పరిశుద్ధ పరుస్తాడు. కేవలము నువ్వు విశ్వాసం చూపి, ఆయనతో సాంగత్యం చేస్తే చాలు. అంటే ఏమిటి? ప్రతి రోజు ప్రార్థన, దేవుని వాక్య ధ్యానము, పరిశుద్దాత్మ ప్రేరణను ఆగింకరించటం. ఈ ప్రయత్నంలో పడిపోయిన పర్వాలేదు. మరల లేచిరా! ఏ మనుష్యుడు కూడా సంపూర్ణ పరిశుద్ధుడు కాలేదు, దేవుని కృప చేతనే వారు రక్షించ బడ్డారు. కానీ మొక్కవోని విశ్వాసం వారి సొతం. అదే నీ ఆయుధం కావాలి, కొంత మంది కయినా దేవుని పరిచయం నీతో జరగాలి.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!
దావీదు ఈ కీర్తనలో దేవుని సార్వభౌమాధికారాన్ని, అయన స్వరము యొక్క బలమును, శక్తిని కవితాత్మకంగా వర్ణిస్తూ, దేవుణ్ణి స్తోత్రిస్తున్నాడు. ఈ కీర్తనలో మనం చివరగా దేవుడు ఇవ్వబోయే బలము, అనుగ్రహించబోయే సమాధానము, ఆశీర్వాదములను గూర్చి నిశ్చయత దావీదు కలిగియుండటం మనం చూడవచ్చు.
సర్వ జనములకు దేవుడయిన యెహోవాను స్తుతించాలని దావీదు గుర్తు చేస్తున్నాడు. మనం ఎంత గొప్పవారమయిన, లోకంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్న, దేవుని ఘనతను మాత్రం మరచి పోరాదని రాస్తున్నాడు. ఆయన ఎలా వేళల శక్తి వంతుడు, ప్రభావము, గొప్పతనము కలిగిన వాడు గనుక వాటిని ఆయనకు ఆరోపించాలని సూచిస్తున్నాడు. చాలామంది దేవుడు ఊరికే ఉన్నాడు, అయన మేలైన కీడైన చేయడు అని అనుకుంటారు (జెఫన్యా 1: 12), కానీ దేవుడు అన్నింటిని నియంత్రించగల సమర్థుడిగా ఉన్నాడు అని దావీదు గుర్తుచేస్తున్నాడు. ఆనాటి కాలములో ఉన్న అన్య దేవతలు దాగోను మరియు బయలు వంటి ప్రాణం లేని, మనుషులు చేసిన దేవుడు కాదు, అయన సజీవుడయినా దేవుడు, కనుక అయన ఎదుట, సర్వ మానవాళి సక్రమముగా సాగిలపడి మొక్కాలని దావీదు ప్రోత్సహిస్తున్నాడు, దేవుని గొప్పతనమును చాటుతున్నాడు.
దేవుడు భూమ్యాకాశాలను చేసిన తర్వాత భూమి నిరాకరమయినప్పుడు దేవుని ఆత్మ జలముల అల్లాడుచున్నదని దేవుని వాక్యంలో రాయబడింది (ఆదికాండము 1:2), ఆతర్వాత దేవుని స్వరము వెలుగు కలుగు గాక అని చెప్పగానే వెలుగు కలిగింది, అలాగే సమస్త సృష్టి కూడా ఏర్పడింది. యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా, ఆదియందు దేవుని వద్ద ఉన్న వాక్యము, ప్రభువయినా యేసు క్రీస్తు (యోహాను 1:1). కలిగినదంతము ఆయన ద్వారానే కలిగియున్నదని (యోహాను 1:2-3) దేవుని వాక్యం చెపుతోంది. ఇక్కడ దేవుడు తన ఆత్మ అనగా పరిశుద్దాత్మ, మరియు తన స్వరము అనగా ప్రభువయినా క్రీస్తు ద్వారా పాడయినా భూమిని బాగు చేసాడు. అలాగే సర్వ సృష్టిని ఏర్పరచాడు.
తర్వాత దేవుడయినా యెహోవా మహాజలముల మీద సంచరిస్తున్నాడని దావీదు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించినప్పుడు దేవుడు దానిని రెండుగా చీల్చిన సందర్భం గుర్తుచేసుకోవచ్చు. సముద్రములన్ని అయన మాటను వింటాయి, జలరాసులన్నీ అయన స్వర బలముకు లొంగిపోతాయి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటు సందర్భంలో కూడా ఇటువంటి ప్రభావము, అద్భుతము దేవుని స్వరము ద్వారా వారికి సాధ్యపడింది.
5. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. 6. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
దేవుని స్వరము యొక్క శక్తిని కవితాత్మకముగా దావీదు వివరిస్తున్నాడు. ఎంతో ఎత్తయిన, బలమయిన దేవదారు వృక్షములను, సహజ వనరుల సంపద సమృద్ధిగా కలిగిన లెబానోనులో ఉండే అత్యంత బలమయిన దేవదారు వృక్షాలనూ సైతం అయన స్వరం ముక్కలుగా విరిచి వేస్తుందని దావీదు వర్ణిస్తున్నాడు. కేవలము వృక్షములను మాత్రమే కాదు, అయన స్వరము రెండు పర్వతములయిన లెబానోను మరియు షిర్యోను పర్వతములను కేవలము తన నోటి మాట ద్వారా కంపింప చేస్తాడు, అప్పుడు అవి మేకపోతు గంతులు వేస్తున్నట్లు కనిపిస్తాయని దావీదు దేవుని స్వరము యొక్క శక్తిని తెలియ పరుస్తున్నాడు. ఇటువంటి భావమునే దావీదు 114 వ కీర్తన 4:6 వచనములలో కూడా ప్రస్తావించాడు. తన ప్రజలయిన ఇశ్రాయేలు జనముకు సర్వ సృష్టిని అనుకూలముగా దేవుడు కేవలము తన నోటి మాట ద్వారా చేశాడు, అని దావీదు వివరిస్తున్నాడు.
ఈ వచనంలో దేవుడు తన స్వరం ద్వారా అగ్ని జ్వాలలను సైతం పుట్టించగలడు, మరియు వాటిని నియంత్రించగలడని దావీదు గుర్తుచేస్తున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు రాజయినా ఫరోను దేవుడు ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి తొలగించి, పంపివేయాలని అడిగినప్పుడు, ఫరో తన హృదయము కఠినము చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఐగుప్తులో పది తెగుళ్ళను సంభవింప చేశాడు. అందులో ఏడవ తెగులునందు దేవుడు వడగండ్లు, పిడుగులతో పాటు అగ్నిని కురిపించాడు (నిర్గమకాండము 9:24) అని దేవుని వాక్యములో తెలుపబడింది. ఇదే మాటను దావీదు 105 వ కీర్తన 34 వ వచనములో కూడా రాశాడు. నీరు ఉన్న చోట సహజముగా నిప్పు ఉండదు, కానీ దేవుని స్వర ప్రభావము చేత ఐగుప్తులో వడగండ్లతో పాటు నిప్పులు కూడా కురిసాయి, అని దేవుని శక్తిని దావీదు గుర్తుచేస్తున్నాడు.
8. యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును 9. యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి.
ఇక్కడ దావీదు దేవుని స్వరము చేత అరణ్యములు కూడా కదిలించబడుతాయి అని రాస్తున్నాడు. అంతే కాకుండా దేవుని స్వరము చేత కాదేషు అరణ్యము కూడా కదిలించబడుతుందని గుర్తుచేస్తున్నాడు. ఈ కాదేషు ప్రాంతము దేవుని వాక్యమునందు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడే అబ్రాహాము అమాలేకీయులను ఓడించాడు. అదే స్థలములో ఇశ్రాయేలీయులు కనాను వారిని ఓడించలేమని భయపడి విశ్వాసములో వెనుకపడి పోయారు (సంఖ్యాకాండము 13:32-33). అలాగే వారు నీరు దొరకటం ఆలస్యం అయిందని, దేవుని మీద సణుగుకున్నది కూడా ఇదే స్థలము (సంఖ్యాకాండము 20:1-5). ఆ విధముగా ఈ రెండు సంఘటనలు కాదేషు ప్రాంతమును అవిశ్వాసమునకు, సణుగుకొవటానికి మరియు అవిధేయతకు స్వారూప్యముగా సూచిస్తున్నాయి. కాబట్టి దేవుని స్వరము అవిశ్వాసులను కదిలిస్తుందని, విశ్వాసులను స్థిరపరుస్తుందని మనం అర్థం చేసుకోవాలి.
అలాగే అయన స్వరము లేళ్ళకు సంతానము కలుగ జేస్తుంది, మరియు ఆకులను రాలుస్తుంది. అనగా సర్వ సృష్టిలో జరిగే పెద్ద క్రియల నుండి, చిన్న క్రియల వరకు దేవుని స్వరము నియంత్రిస్తుందని దావీదు గుర్తిస్తున్నాడు. దేవుడయినా యెహోవా ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాయి అని కూడా రాస్తున్నాడు దావీదు. అనగా యెషయా దేవుని ఆలయంలో అయన దూతలు "ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అయన మహిమ భూలోకమంతా నిండిపోయింది" అని ఘనంగా స్తుతించారు అని తానూ చూసిన దర్శనం గురించి రాశాడు (యెషయా 6:1-4). కనుక విశ్వాసులుగా ఉంటూ, ప్రతి పెద్ద, చిన్న అవసరముకు అయన మీద ఆధారపడి, నిత్యమూ ఆయనకు స్తుతులు అర్పించాలని మనం అర్థం చేసుకోవాలి.
దావీదు నోవహు కాలములో దేవుడు అనుమతించిన జల ప్రళయమును గుర్తుచేస్తున్నాడు (ఆదికాండము 9:11-12). దేవుడు ప్రళయ జలముల మీద ఆసీనుడిగా ఉన్నాడు, అయన నిత్యమూ రాజుగా ఆసీనుడై ఉన్నాడు. జల ప్రళయము దేవుని తీర్పును బట్టి వచ్చింది. తీర్పును తీర్చేది రాజు మాత్రమే. కాబట్టి యెహోవా రాజుగా తన తీర్పును తీర్చటానికి జల ప్రళయములను కూడా ఉపయోగించు కుంటాడు అని దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు. నోవహు కాలం మాదిరిగానే చెడ్డవారిని, పాపాత్ములను దేవుడు శిక్షిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు.
11. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.
దేవుడయినా యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఈ లోకములో ఉన్న ప్రతి శ్రమను జయించటానికి వారికి శక్తిని అనుగ్రహిస్తాడు అని దావీదు రాస్తున్నాడు. అంతే కాకుండా ప్రతి శ్రమలో వారికి సమాధానము కలుగజేసి, ఆశీర్వదిస్తాడు. ప్రభువయినా యేసయ్య "నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. కనుక మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవ నియ్యకుడి" అని బోధించాడు (యోహాను 14:27). ఇక్కడ లోకం ఇచ్చేది అశాశ్వత మయినది. కానీ దేవుడు ఇచ్చేది నిత్యమూ ఉండేది. కనుక దావీదు దేవుడు తనను నమ్ముకున్న ప్రజలకు బలమును, సమాధానము ఇచ్చి, తగిన సమయమునందు వారిని ఆశీర్వదిస్తాడు అని గుర్తు చేస్తున్నాడు. ఆ సమాధానము విశ్వాసులయిన మన మీద నిత్యమూ ఉంటుంది.
క్రైస్తవ విశ్వాసము అనగానే చాల మంది దేవుని మీద ఆధారపడటం, ఏ కష్టం, నష్టం కలిగిన అన్ని కూడా దేవుని అధీనములో ఉన్నాయి కాబట్టి సంతోషించాలి అని బోధిస్తారు మరియు అలాగే భావిస్తారు. అయితే విశ్వాసము లోకి రావటానికి మాత్రం చాల మంది జీవితాలలో ఏవో అద్భుతాలు జరిగి ఉండటం సహజం. కానీ అద్భుతాల మీద మాత్రమే కొనసాగే విశ్వాసం ఎక్కువ కాలం నిలువబోదు. అందుకే దేవుని వాక్యం చెపుతోంది "విశ్వాసం అంటే ఎదురు చూసే వాటికి నిజ స్వరూపముగా మరియు కనబడని వాటికి ఋజువుగా ఉందని" (హెబ్రీయులకు 11:1). అంటే ఏమిటి? పొందుకొబోయే వాటికి సంతోషించటం మరియు కంటికి కనబడని వాటిని నమ్మటం అనేది క్రైస్తవ విశ్వాసము అని అర్థము. అయితే ఇటువంటి విశ్వాసము చూపించటానికి ఎంతో ఓర్పు కావాలి, ముఖ్యముగా జీవితములో ఎదురయ్యే వివిధ సమస్యల యందు మరింత కష్టము.
అయితే ఇటువంటి విశ్వాసమును మనకు దేవుడే నేర్పిస్తాడు. ఆత్మ ఫలములలో ఒకటయిన ఫలము దీర్షశాంతము అని దేవుని వాక్యం చెపుతోంది (గలతీయులు 5:22). అనగా ఓర్పు కలిగి ఉండటము. క్రీస్తు నందు విశ్వాసము ఉంచి, అయన మీద ఆధారపడిన నాడు, తన ఆదరణ కర్త అయినా పరిశుద్దాత్మ దేవుడు మనలో తన కార్యములు నెరవేర్చటం మొదలు పెడుతాడు, అనగా మనం ఆత్మ ఫలములు పొందుకోవటం మొదలవుతుంది. అప్పుడు వాటిలో ఒకటయిన ఓర్పు మనలో మొదలవుతుంది. అయితే ఈ ఓర్పు వలన కలిగే లాభములు ఏమిటి? విశ్వాసములో ఇది ఎందుకు ప్రాముఖ్యత కలిగి ఉంది?
హెబ్రీయులకు 11: "11. విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను."
కుమారుణ్ణి ఇస్తానని దేవుడు తన భర్త అయినా అబ్రాహాముకు వాగ్దానము చేసినప్పుడు, శారా ఒక్కసారి తొందరపడి తన భర్తను దాసి అయినా హాగరు తో పంపినప్పటికి, తిరిగి తన విశ్వాసము పొందుకొని, మరల తప్పిపోలేదు. చాల ఓర్పు కలిగి ఎన్నో ఏండ్లు సంతానం కోసం నిరీక్షించింది. తన స్ర్తీ ధర్మము నిలిచి పోయినప్పటికి కూడా దేవుడు తనకు గర్భ ఫలమును ఇస్తాడని దృఢమయిన విశ్వాసముతో, దీర్ఘ శాంతముతో ఎదురు చూసి, కుమారుణ్ణి పొందుకుంది. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండటమే ఓర్పుతో కూడిన విశ్వాసముగా చెప్పుకోవచ్చు. ఓర్పు కలిగి ఉండటం ద్వారా ప్రతి విషయములో, ప్రతి పరిస్థితిలో దేవుని యందు ఆనందిస్తూ, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే మానసిక స్థితి లేదా విశ్వాసము అలవడుతుంది.
"క్రియలు లేని విశ్వాసము మృతమయినది" అని దేవుని వాక్యం చెపుతోంది (యాకోబు 2:17). మనలో విశ్వాసము ఉన్నదని చాల మంది చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్లుగా గొప్ప ప్రార్థన పరులుగా ఉండవచ్చు. కానీ యేసయ్య బోధలు ఏమని చెపుతున్నాయి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని కదా! చాల సార్లు మన సాటి వారు మనలను శోదించ వచ్చు లేదా సాతాను వారిని వాడుకొని, లేదా పరిస్థితులను వాడుకొని మన విశ్వాసమును దెబ్బ తీసే ప్రయత్నం చేయవచ్చు. వారు మనతో ప్రవర్తించే విధానమును బట్టి, మనలను తేలిక చేసే మాటలను బట్టి ఉక్రోషపడి వారి మీద కోపం పెంచుకుంటే మనం ఓర్పును కోల్పోతాము, ఆవిధముగా మన విశ్వాసములో వెనుక పడుతాము.
అయితే దేవుడు అటువంటి శోధన పరిస్థితులను వాడుకొని మనలో దీర్ఘశాంతమును పెంచుతున్నాడు. ఆవిధముగా మనలో వారి పట్ల కోపం లేకుండా ప్రేమ కలుగుతుంది. తద్వారా మిగతా ఆత్మ ఫలములు కూడా మనలో పెరుగుతాయి. ఆత్మ ఫలములు అనేవి ఒకదానితో ఒకటి విడదీయ లేని సంబంధం కలిగి ఉన్నాయి. ప్రేమ కలిగి ఉన్న వారు మంచితనము కూడా కలిగి ఉంటారు, అలాగే దయాళుత్వము, దీర్ఘశాంతము మరియు సాత్వికము ఇలా చెప్పుకంటే అన్ని లక్షణాలు క్రైస్తవ విశ్వాసిలో అభివృద్ధి చెందుతాయి. అయన ప్రేమ కలిగిన వాడే కానీ కొంచెం కోపం ఎక్కువ అండి అంటే అదెలా సాధ్యం అవుతుంది. రెండింటికి ఎక్కడ కూడా పొంతన లేదు. మొదటిది ఉంటె రెండవది లేనట్టు రెండవది ఉంటె మొదటి లేనట్లు.
ఇక్కడ బిడ్డల మీద తల్లి తండ్రి చూపించే కోపం గురించి మాట్లాడటం లేదు. క్రీస్తు విశ్వాసులుగా సాటి వారి పట్ల మన ప్రవర్తన గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే ఓర్పు కలిగి ఉండటం అనేది మనలో క్షమా గుణమును పెంపొందిస్తుంది. ఆవిధముగా తండ్రి అయినా దేవుడు మన తప్పులను మరింతగా క్షమించటానికి అర్హతను పొందుకుంటాము. ఆవిధముగా మన ఆత్మీయ జీవితము మెరుగుపడుతుంది. దేవుడు మనుష్యుల వలె సహనం కోల్పోతే అనగా ఓర్పును విడిచి లేదా దీర్ఘశాంతము మరచి పొతే మనం ఎవరమూ కూడా జీవించే అర్హతను పొందుకోలేము. ఏనాడో మనం నశియించి పోయి ఉండేవారము.
యోనా 4: "2. యెహోవా, నేను నా దేశమం దుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందు వలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాపపడి కీడుచేయక మానుదువని నేను తెలిసికొని దానికి ముందు గానే తర్షీషునకు పారిపోతిని."
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! ఇక్కడ యోనా ప్రవక్త నీనెవె పట్టణపు ప్రజల చెడ్డతనమును బట్టి వారి పట్ల కోపం పెంచుకొని, ఓర్పును కోల్పోయి వారు నశించి పోవాలనుకున్నాడు. కానీ దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు కాబట్టి వారిని తప్పక క్షమిస్తాడని దేవుడు చెప్పిన సందేశం చెప్పకుండా దూరముగా పారిపోయాడు. దేవుని అంతులేని ప్రేమను అయన తప్పు పడుతున్నాడు. సాటి మనుష్యులు నశించి పోవాలని కోరుకుంటున్నాడు. ఇదంతా కూడా తనకు ఉన్నటు వంటి స్వనీతిని బట్టి కలుగుతోంది. మనం కూడా చాల సార్లు ఎదుటి వారు మన పట్ల చేసిన తప్పులను బట్టి, దేవుడు వారిని శిక్షించాలని కోరుకుంటాము.
కానీ ఆలా కోరుకోవటం దేవుని ప్రేమను మనలో చూపించదు. నిత్యమూ మనము దీర్ఘశాంతము కలిగి క్షమిస్తూ ఉండాలి. వారిని ఎలా మార్చాలి, వారి అడ్డు మనకు ఎలా తొలగించాలి దేవుడు చూసుకుంటాడు. ఓర్పు వహించకుండా ఆనాడు ఇశ్రాయేలు మొదటి రాజయిన సౌలు సమూయేలుకు బదులుగా బలులు అర్పించి దేవుని ఆగ్రహానికి గురయినాడు (1 సమూయేలు 13: 8-15). ఆవిధముగా దేవుని ప్రణాళికలు కోల్పోయాడు. నిత్యమూ ఓర్పుతో కూడిన విశ్వాసము కలిగి ఉందాము. తద్వారా మెరుగయిన ఆత్మ ఫలములు పొందుకొని దేవుణ్ణి సంతోష పెడుదాము.
దేవుని చిత్తమయితే మరో వాక్య భాగముతో వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!
సంఘము యొక్క క్షేమాభివృద్ధికై పరిశుద్దాత్మ దేవుడు సంఘములో ప్రతి విశ్వాసికి ఆత్మీయ వరములు అనుగ్రహిస్తాడు. వాటిని పొందుకున్న విశ్వాసులు దేవుడి మహిమను దొంగిలించకుండా సంఘము అభివృద్ధికై పాటుపడాలి. కానీ పరిశుద్దాత్మ దేవుడు సాటి విశ్వాసులకు ఇచ్చే ఆత్మీయ వరములను నిర్లక్ష్యం చేయటం, వారి విశ్వాసమును మరియు ప్రభువు పట్ల వారి పరిచర్యను చులకన చేయటం వాక్యానుసారము కాదు. ఇశ్రాయేలుకు రాజయిన హిజ్కియా దేవుడయిన యెహోవాకు పస్కా పండుగ జరుపవలెనని తలచినప్పుడు అందరికి లేఖలు పంపాడు. తర్వాత దేవుని సేవలో ఉన్న లేవీయులను అతను ప్రసంశించాడు. అది వారు చేయవలసిన బాధ్యతే కదా అని నిర్లక్ష్యం వహించలేదు (2 దినవృత్తాంతములు 30:22). వారితో ఎంతో ప్రియముగా మాట్లాడినట్లు దేవుని వాక్యం తెలియ జేస్తుంది.అటువంటి ప్రితికరమయిన మాటలు సంఘములో ఉన్న పాస్టర్లతో మాట్లాడే స్థితిలో ఉన్నామా? లేదా "వారు చేయవలసిందే చేస్తున్నారు కదా" అని నిర్లక్ష్యం వహిస్తున్నామా?
1 కొరింథీయులకు 16: "18. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మా నించుడి."
పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమంటున్నారు! ఆయనకు సహాయం చేసిన వారిని సన్మానించుమని చెపుతున్నారు. మెచ్చుకోలు మాట ఆత్మను తృప్తి పరుస్తుంది, శ్రమను దూరం చేస్తుంది. అంతేకాకుండా రెట్టించిన ఉత్సాహముతో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళే శక్తిని ఇస్తుంది కనుకనే పౌలు గారు ఇలాంటి కార్యములు సూచిస్తున్నారు. దేవుడి మహిమను దొంగలించకూడదు అన్న నెపంతో ఇతరుల శ్రమను నిర్లక్ష్యం చేయటం ఎంత వరకు సరయినది? వారి ద్వారా దేవుడు తన కార్యములు చేస్తున్నాడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, "దేవుడు మిమల్ని ఇంత బాగా వాడుకుంటున్నందుకు చాల సంతోషం సోదరుడా లేదా సోదరి" అని చెప్పటం సరైన పని కాదంటారా?
మన ప్రభువయినా యేసు క్రీస్తు ఎన్నో మారులు ఆయనకు తండ్రి అయినా దేవుడు ఇచ్చిన మహా జ్ఞానమును బట్టి మత పెద్దల చేత శోదించబడ్డాడు. అయన చేయుచున్న పరిచర్యను బట్టి, అధికారముతో బోధించిన విధానమును బట్టి విమర్శలు ఎదుర్కొన్నాడు. వారు తమకు ఉన్న బైబిల్ జ్ఞానమును బట్టి ఆత్మీయ గర్వముతో నిండియున్నారు. అంతే కాకుండా యేసు క్రీస్తు నేపథ్యమును బట్టి ఆయనను చాల తక్కువ అంచనా వేశారు. కనుకనే దేవుడు ఆయనకు ఇచ్చిన అధికారమును గుర్తించ లేకపోయారు. మనలో అటువంటి ఆత్మీయ గర్వము ఉందా? ఇతరుల నేపథ్యమును బట్టి ఎదుటి వారిని చులకనగా చూస్తున్నామా? ఎవరు ఊహించారు! చేపలు పట్టే వారు ప్రంపంచాన్ని ప్రభువు పేరిట మార్చేస్తారని. గాడిదను సైతం వాడుకున్న దేవునికి తనయందు విశ్వాసం ఉంచి, తన పరిచర్యలో వాడబడాలనే తపన కలిగిన వారిని వాడుకోవటం అసాధ్యమా?
మత్తయి 13: "55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా? 56. ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి."
యేసు క్రీస్తును నజరేతు వారు ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి! "మన ముందు పెరిగిన వడ్లవాని కుమారునికి ఇంత జ్ఞానం ఎక్కడిది" అని అయన బోధను ఆటంక పరుస్తున్నారు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఎదుటి వారు నీకన్న చాల ఆలస్యంగా విశ్వాసములోకి రావచ్చు, లేదా వారు నీ అంత చదువుకోక పోవచ్చు, వారి ఆర్థిక స్థితి నీ అంత మెరుగుగా ఉండక పోవచ్చు, కానీ వారి ఆత్మీయ స్థితిని బట్టి, దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళికను బట్టి వారికి ఇస్తున్న జ్ఞానమును బట్టి, ఆత్మీయ వరములను బట్టి అభ్యంతరపడవద్దు. వారిని ప్రోత్సహిస్తూ సంఘము క్షేమాభివృద్ధికి వారిని వాడుకోవటమే దేవునికి ఇష్టమయిన కార్యము.
ముఖ్యముగా కొన్ని సంఘములలో సాటి సహోదరులు చెప్పే ప్రసంగమయిన, రాసిన పాటయినా, లేదా వారు పాడే పాటయినా ఏ ప్రోత్సాహానికి నోచుకోదు. లోకంలో చెప్పుకొనే సామెత "పొరుగింటి పుల్లకూర రుచి" అన్న మాదిరి, ఎవరో తెలియని వారు ఏమి చెప్పిన, ఏమి చేసిన అందులో అద్భుతాలు చూసే మనసు ఉంటుంది కానీ తోటి సహోదరుడు ఏమి చేసిన వంకలు వెతికి పక్కన పెడుతూ ఉంటారు. అటువంటి వారి నిమిత్తమై యేసయ్య ఏమన్నాడో తెలుసా?
దేవుని పరిచారకుడు సొంత ఊరిలో, ఇంటిలో తప్ప ప్రతి చోట ఘనంగా చూడబడుతాడని (మత్తయి 13: 57-58). తరువాత ఏమి జరిగింది, అటువంటి వారి అవిశ్వాసమును బట్టి అయన అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. నీ అవిశ్వాసమును బట్టి అనగా సాటి సహోదరునికి, సహోదరికి ఉన్న జ్ఞానము దేవుడే ఇస్తున్నడని నమ్మకుండా, నీ గర్వమును బట్టి, అభ్యంతరపడితే నీ జీవితంలో కూడా జరిగే అద్భుతములు ఆగిపోతాయేమో ఆలోచించుకో! వారు ఏమి చెప్పిన అద్భుతం అని పొగడవలసిన అవసరం లేదు! కానీ వారిని ప్రోత్సహిస్తూ సూచనలు ఇవ్వటం, ప్రభువులో వారిని బలపరుస్తుంది, సంఘముకు క్షేమాభివృద్ధి కలుగుతుంది.
మత్తయి 8: "10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి ఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను."
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! యేసయ్య విశ్వాసము చూపించిన వారిని ఎంతగా ప్రశంసించే వాడో ఈ వచనంలో స్పష్టంగా తెలుస్తుంది. తన దగ్గరికి వచ్చిన శతాధిపతి చూపిన విశ్వాసమును బట్టి అక్కడే ఉన్న ఇశ్రాయేలు లందరి ముందు, అన్యుడయినా అయన చూపిన విశ్వాసం వారిలో కూడా లేదని ప్రసంశించాడు. అంతే కాకుండా తమ విశ్వాసము ద్వారా స్వస్థత పొందిన ఎంతో మందిని కూడా ఎల్లప్పుడూ అయన ప్రసంశించాడు. వారు స్వస్థత కోసం విశ్వాసం చూపించారు కదా అని నిర్లక్ష్యం చెయ్యలేదు. వారిని మరింతగా బలపరచటానికి ఎల్లప్పుడు వారి విశ్వాసమును ప్రసంశించాడు యేసు ప్రభువు. తోటి వారిని ప్రసంశించటంలో చొరవ చూపించండి. వారికి ఉన్న తలాంతులను బట్టి, పరిచర్యను బట్టి, విశ్వాస జీవితమును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అంతే కానీ "ఇక చాలులే" అని చులకనగా చూడకండి, నిర్లక్ష్యం చేయకండి, ప్రభువుకు వారి పట్ల ఉన్న ఉద్దేశ్యాలకు అడ్డుపడకండి.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగం కలుసు కుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
దేవుడు మొదటి మానవులయిన ఆదాము, హవ్వలను తన స్వరూపములో చేసి, వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పటికి సంపూర్ణ స్వేచ్ఛను వారికి ఇచ్చాడు. అనగా వారి ఆలోచనలు వారికి ఉన్నాయి, తమ ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు. ఏదెను వనములో దేవుడు జ్ఞానము ఇచ్చే చెట్టు ఫలమును తినవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారు సాతాను మాటలు నమ్మి, దేవుని మాటలు పెడ చెవిన పెట్టి ఆ పండును తిన్నారు. ఇదంత వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండటం వలన జరిగింది. దేవుడు ఎందుకు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. మనం ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించటానికే! అదెలా అంటారా? ఉదాహరణకు ఒక్క సైంటిస్ట్ కు ఒక కొడుకు ఉన్నాడు, వాడికి ఎన్ని సార్లు చెప్పిన అల్లరి పనులు మానటం లేదు. బుద్ది చెప్పిన ప్రతిసారి తండ్రి మీద కోపం పెంచుకొని అతన్ని ద్వేషించటం మొదలు పెట్టాడు.
ఆ పిల్లాడికి మాదిరి కరంగా ఉండాలని ఒక రోబో బొమ్మను తయారు చేశాడు అ సైంటిస్ట్. ఈ రోబో బొమ్మను అతను ఎలా తయారు చేసాడంటే, ఎప్పుడు కూడా అల్లరి చేయకుండా, చెప్పిన మాట వింటూ, ఐ లవ్ యు డాడీ అని చెప్పటమే ఆ రోబో యొక్క పని. దాన్ని చూసి కూడా వాడిలో ఏ మార్పు కలుగ లేదు. అయితే ఒక్క రోజు ఆ పిల్లాడికి ఒక సమస్య వచ్చింది, సహాయం కోసం తండ్రి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నడు. తండ్రి వాడిని ప్రేమతో దగ్గరకు తీసుకోని ఓదార్చి, వాడి సమస్యను తీర్చాడు. తండ్రి ప్రేమను గుర్తించిన అ పిల్లాడు ఒక్కసారిగా కరిగిపోయి ఐ లవ్ యు డాడి అని తన తండ్రిని హత్తుకున్నాడు. తండ్రి మనసు సంతోషంతో ఉప్పొంగి పోయింది! రోబో కూడా రోజు ఐ లవ్ యు డాడి అని చెపుతుంది! చెప్పిన మాట కూడా వింటుంది. కానీ పిల్లాడు ఐ లవ్ యూ చెప్పినప్పుడే ఎందుకు ఆనందించాడు తండ్రి?
రోబోకు స్వేచ్ఛ లేదు, సొంత ఆలోచన లేదు, ఎప్పుడు ఐ లవ్ యు చెప్పేలాగా తయారు చేయబడింది. కూమారునికి మాత్రం సంపూర్ణ స్వేచ్ఛ ఉంది, సొంత ఆలోచనలున్నాయి. ఆ పిల్లాడు తండ్రి మాటను వినకుండా ఉండవచ్చు మరియు అతనికి ఐ లవ్ యు చెప్పకుండా కూడా ఉండవచ్చు. తన స్వేచ్ఛను వదులుకుని తండ్రి మాటను వినటం మొదలు పెట్టాడు, అల్లరి పనులు మానేసాడు అందుకే తండ్రి సంతోషించాడు. దేవుడు కూడా మన నుండి అటువంటి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని మనకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఇక్కడ పిల్లాడు తన స్వేచ్ఛను వదులుకుంటున్నాడు కదా! మరి పిల్లాడి స్వేచ్ఛను హరించటం తండ్రికి ఇష్టమా? కానే కాదు!
తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. తెలియక వారు చేసే తప్పులు వారి పురోగతిని అడ్డుకోకుండా వారి అల్లరికి అడ్డుకట్టలు వేస్తాడు. మన ఆత్మీయ జీవితం బాగుండాలని మన పరలోకపు తండ్రి కూడా మన పాపమునకు అడ్డుకట్టలు వేస్తాడు. ఏ మంచి లేని ఈ శరీరంలో ఉండి అయన ఆజ్ఞలు పాటిస్తూ పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రభువయినా యేసు క్రీస్తును నమ్ముకొన్న క్షణం నుండి, తన పరిశుద్దాత్మ నడిపింపును మనకు ఇస్తూ, తన ప్రేమ చొప్పున గద్దిస్తూ, ఆదరిస్తూ తనకు దగ్గరగా ఉండాలని నిత్యం మనలను ప్రేరేపిస్తున్నాడు. కానీ స్వేచ్ఛతో ఉన్న మనము ఆ గద్దింపును అంగీకరించకుండా, పాపం లో పడిపోతూ మరింతగా దేవునికి దూరం అవుతున్నాము.
మనం పాపం చేసినప్పుడు దేవుడు మనలను మనుష్యులకు అప్పగిస్తాడు, లేదా సమస్యలను మన మీదికి అనుమతిస్తాడు. విశ్వాసులుగా ఉన్న మనకు కష్టాలు ఉండవు అని చెప్పటం లేదు! మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని బలపరిచే పరీక్షల్లాంటి సమస్యలు కొన్నయితే, తప్పిపోయినప్పుడు లేదా పాపంలో పడిపోయినప్పుడు వచ్చే సమస్యలు కొన్ని. విశ్వాసాన్ని బలపరిచే సమస్యలు లేదా శోధనలు మనం తట్టుకోలేనంతగా ఇవ్వడు దేవుడు, మరియు అయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కానీ పాపంలో పడిపోయినప్పుడు లేదా మనలను క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు వచ్చే సమస్యలు లేదా శోధనలు తీవ్రంగా ఉంటాయి. మన నడక మారనంత వరకు దేవుడు మనలను నలుగ గొడుతూనే ఉంటాడు. దానిని గుర్తించి ఆయనకు మొరపెట్టిన నాడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకు ఉదాహరణగా యోనా జీవితమును చెప్పుకోవచ్చు.
తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగా అయన మనలను దండిస్తాడు (ద్వితీయోపదేశకాండము 8: 5). దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను సామ్రాజ్యమునకు అప్పగించే ముందు యిర్మీయా ప్రవక్త ద్వారా ఎన్నో మారులు వారిని, మరియు ఇశ్రాయేలు రాజులను హెచ్చరించాడు. కానీ శరీర క్రియలకు, విగ్రహారాధనకు అలవాటుపడిన వారు ఆ ప్రవక్తను బంధించి హింసించారు. అబద్ద ప్రవక్తల మాటలు నమ్మి దేవుని మాటలు పెడ చెవిన పెట్టారు. కనుకనే వారందరు బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు, వివిధ దేశాలకు చెదరిపోయారు. కానీ అంటువంటి సమయంలో కూడా దానియేలు వంటి గొప్ప విశ్వాసులు దేవునితో నడచి, ఘనతను పొందారు, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
యోబు 5: "17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. 18. ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును. "
దేవుడు ఈ విధముగా అందర్నీ గద్దించడు. తన చిత్తములో ఉన్నవారిని మాత్రమే అనగా ఆయనను అంగీకరించినా వారిని మాత్రమే తన వారిగా చేసుకొని వారిని తన మార్గములో నడిపించటానికి శిక్షిస్తాడు, తద్వారా శిక్షణ ఇస్తాడు. దానిని అంగీకరించి మనలను మనం సరిచేసుకున్న నాడు ఆయనే మనకు తన శాంతిని ఇస్తాడు. అనగా మన గాయములకు కట్టుకడుతాడు. ఆ శిక్ష సమయములో మనం అయనతో సాగిపోవాలి, క్షమాపణ వేడుకోవాలి కానీ మనసును కఠినం చేసుకొని ఆయనకు మరింతగా దూరం కారాదు.
దేవుడు తన వాక్కును ఎన్నో విధాలుగా మనకు వినిపిస్తాడు, కొన్ని సార్లు గద్దింపు తో కూడిన మాటలు విన్నప్పుడు మన హృదయములను కఠినపరచుకొని ఆయనకు ఆగ్రహం తెప్పించిన వారివలె మారి పోకూడదు. మరియు పాపము వలన కలుగు భ్రమచేత ఎవరు కూడా కఠినపడి, పాపమూ పట్ల సున్నితత్వమును కోల్పోయి దేవుడు ఇచ్చే నిత్య విశ్రాంతిని కోల్పోకుండా ఒక్కరి నొకరు సంఘముగా బుద్ది చెప్పు కోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 3:13-14). పరిశుద్దాత్మ దేవుడు మనకు ఇచ్చే నడిపింపును గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకొందాము. దేవునికి మనం ఎంత దగ్గర అవుతుంటే అంతగా సాతాను తన శక్తియుక్తులతో మనలను పడదోయాలని చూస్తాడు. ఆదాము, హవ్వల వలే వాని మాటలకూ అనగా శోధనలకు లొంగక దేవుని నడిపింపును అంగికరించాలి.
మత్తయి 16: "17. అందుకు యేసు సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. 18. మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను."
మత్తయి సువార్తలో పేతురు యేసయ్యను దేవుని కుమారుడవని చెప్పిన వెంటనే, యేసయ్య పేతురుతో దీనిని పరమునందున్న తండ్రే నీకు బయలుపరచాడు అని చెప్పి అతని విశ్వాసము వంటి బండ మీద తన సంఘమును కడుతానని అన్నాడు. అది జరిగిన కొద్దీ సమయానికి యేసయ్య తన సిలువ మరణం గురించి, పునరుద్ధానము గురించి చెప్పగానే సాతాను పేతురును ప్రేరేపించి యేసయ్యను శోధించటం మొదలు పెట్టాడు. ఎందుకిలా? పేతురు దేవునికి చాల దగ్గరగా ఉన్నాడు! మరియు యేసయ్య ప్రణాళికలో ఉన్నాడు. అంతే కాకుండా యేసయ్య సిలువ మరణము తన పాపపు లోకమును జయిస్తుందని, మనుష్యులను పాపం నుండి రక్షిస్తుందని తెలిసి పేతురు ద్వారా యేసయ్యను ఆపాలని చూస్తున్నాడు.
మత్తయి 16: "23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపటం లేదు"
వెంటనే యేసయ్య పేతురును "సాతానా వెనుకకు పో! నీవు నాకు అభ్యంతర కారణమయినావు. నీవు మనుష్యుల సంగతులను తప్ప దేవుని సంగతులు తలంచటం లేదు" అన్నాడు. ఇక్కడ పేతురును యేసయ్య సాతానా అని అందరి ముందు గద్దించినప్పుడు ఎంతో అవమానంగా భావించవచ్చు. మరియు తన మనసు కష్టపెట్టుకొని, కఠిన పరచుకొని యేసయ్యను వదిలి పోవచ్చు. కానీ పేతురు యేసయ్య చెప్పిన బోధను అర్థం చేసుకొని, అయన గద్దింపుకు బాధపడలేదు, కనుకనే విశ్వాసములో కొనసాగాడు. ఆలా అని ఇక్కడ పేతురు గొప్పతనం ఏమి లేదు. ఎందుకంటే మనకు ఉన్న విశ్వాసము దేవుడు ఇచ్చిందే, ముందు అయన మనలను ప్రేమించాడు, కనుకనే మనం ఆయనను ప్రేమిస్తున్నాము. అయితే పేతురు యేసయ్య గద్దింపును అంగింకరించాడు, తనను తాను తగ్గించుకున్నాడు, విశ్వాసములో కొనసాగాడు. అందుకే శిష్యులకు నాయకుడిగా యేసయ్య చేత ఎన్నుకోబడ్డాడు.
అదే సందర్భంలో తనను వెంబడించే వారు తమను తాము తగ్గించుకొని, తమ సిలువను ఎత్తుకొని అనగా శ్రమలు అనుభవించటానికి సిద్ధపడాలని శిష్యులకు బోధించాడు యేసయ్య (మత్తయి 16: 24-25). దేవుని కూమారుడయిన తానూ మనిషిగా సిలువ మీద పొందవలసిన మరణమును తెలియజేశాడు. అంతే కాకుండా తనను వెంబడించాలకున్న వారు తమను తాము ఉపేక్షించు కోవాలని వారికి బోధించాడు. అనగా తమ స్వేచ్ఛను వదులుకొని దేవుని కార్యములు జరిగించటము మరియు వాక్యానుసారముగా శరీర క్రియలు మాని పవిత్రముగా జీవించటము చెయ్యాలి. యేసు క్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం చేసింది అదే కదా!
కీర్తనలు 95: "7. రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. 8. అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి."
ప్రియాయమయిన సహోదరి, సహోదరుడా! మనలను సృష్టించిన దేవుని మాట అంగీకరించిన యెడల ఎంత మేలు అని గుర్తిద్దాము. ఇశ్రాయేలీయుల వలె హృదయమును కఠినపరచుకొనక అయన మాటలకు తల ఒగ్గటం మనలను విశ్వాసములో బలపరుస్తుంది మరియు ఆయనకు దగ్గరగా మనలను ఉంచుతుంది. దేవుడు మనకు స్వేచ్ఛను, సొంత ఆలోచనలు ఇచ్చింది, మనలను మనం కాదనుకుని ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని. కనుక దేవుని గద్దింపును అంగీకరిద్దాం, మనలను మనం ఉపేక్షించుకుందాం, దేవుని ప్రణాళికలో కొనసాగుతూ ఆత్మీయంగా పురోగతి సాధిద్దాం.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగం కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
క్షణ కాలం నీకు నచ్చినట్లు ఉండలేని వాడి కోసం ఈ ఆరాటం దెనికయ్యా?
నా కోసం పోరాడుతూనే ఉన్నావు, నేను ఓడిపోతూనే ఉన్నాను కొంచెమయినా కోప్పడవేంటయ్యా!
తప్పు నేను చేసి నింద నీ మీదేస్తాను, నన్నేదో శిక్షిస్తున్నావని అనుమానిస్తాను అయినా కూడా బుజ్జగిస్తావేంటయ్యా!
ఏది కావాలన్నా నిన్నే అడుగుతాను, కాస్తా ఆలస్యం అయితే అన్ని మర్చిపోయి నిన్నే శంకిస్తాను ఏ మాత్రం నొచ్చుకోకుండా కోరింది ఇచ్చేస్తావ్! ఇది వింత కాకపోతే ఇంకేంటయ్యా!
ఇంత ప్రేమను పొందే అర్హత నాకు లేదని నీకు మాత్రం తెలియదా! అయినా నన్ను విడిచిపోవు!