పేజీలు

31, డిసెంబర్ 2023, ఆదివారం

దేవునికి అన్ని సాధ్యమే!



గడచిన సంవత్సరము అంత మనలను కాచి, కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఒక్కసారి పోయిన సంవత్సరము మనము దేవునితో గడిపిన సమయమును సమీక్షించుకుందాము. రోజుకు ఒక్కసారయినా ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయా? రోజు దేవుని వాక్యం ధ్యానించిన సందర్భాలు ఉన్నాయా? ఒక వేళ లేవు అని తెలిస్తే, ఖచ్చితముగా మనం తొందరపడవలసిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితములో మనము నిత్యమూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇతర విశ్వాసముల మాదిరి, వారానికి ఒక్కసారి లేదా తిథులు, ముహుర్తాలు చూసుకుని పూజలు చేయటం లాంటిది కాదు.  ప్రతి నిత్యమూ దేవునితో మన సమస్తము అనుసంధానము అయి ఉండాలి. 

ప్రతి రోజు దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా ఆత్మీయ ఆహారమును పొందుకుంటాము. మన శరీరమునకు ఆహారం ఎలా అవసరమో, మన ఆత్మకు కూడా ఆహారము అవసరము, దాని ద్వారా ఆత్మీయ జీవితంలో బలపడుతాము. మరియు ప్రార్థన జీవితము కలిగి ఉండటం ద్వారా, దేవుని యందు విశ్వాసము పెరుగుతుంది, అందును బట్టి కలిగే శోధనలను ఎదుర్కొనే ధైర్యము పొందుకుంటాము. క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత ఖచ్చితముగా తిరిగి జన్మించాలి. అనగా పాత జీవితమును వదిలి, నూతనముగా జీవించటం మొదలు పెట్టాలి. ఆ పాప క్రియలను పూర్తిగా మానేసి, క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ ఆయనను వెంబడించాలి. కనుకనే నిత్యమూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. 

విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఎంతో నిష్ఠగా గడిపి ఉండవచ్చు, దేవుని పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉండవచ్చు. ఎన్నో ఆత్మీయ వరములు పొంది ఉండవచ్చు, సంఘములో గొప్పగా వాడుకో బడుతూ ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మన  ఆత్మీయ స్థితి ఏమిటి? ఒక్కసారి పరీక్షించుకోవాలి. క్రీస్తును విశ్వసించటం అంటే ఆయనను గురించి పాటలు రాయటం కాదు, ఆయనను గురించి పాడటం కాదు, అయన గురించి చెప్పటం కాదు, గాని ఆయనను అనుసరించటం. అయన ఎలాగయితే పాపం లేకుండా జీవించాడో, మనం కూడా జీవించే ప్రయత్నం చేయాలి. క్రీస్తు మనకు ఇచ్చిన పరిశుద్దాత్మ శక్తి ద్వారా (అపో 2:38)  అటువంటి పవిత్ర జీవితమును గడపాలి. 

చాల మంది యవ్వన సహోదరి, సహోదరులు ఎన్నో రకాల లోకరీతులకు కట్టుబడి పోయారు. సినిమా తారలను అనుకరిస్తూ, వారిని ఆరాధిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిత్యమూ వారి గురించి ఆలోచిస్తూ, తపన పడుతూ దేవునికి  దూరం అయిపోతున్నారు. అలాగే సహోదరీలు అందం పట్ల వ్యామోహం పెంచుకుంటూ, తమను తాము కించపరచుకుంటూ కుంగి పోతున్నారు. జీవితంలో అసంతృప్తితో రక రకాల దురలవాట్లకు  లోనయి సంతోషం వెతుక్కుంటున్నారు, పచ్చని జీవితాలను ఫలం లేనివిగా మార్చుకుంటున్నారు.  దేవుడు మనలను ఏర్పరచుకున్నది, కేవలం విశ్వాసులం అని చెప్పుకోవటానికి మాత్రమే కాదు, అవసరాలు ఉన్నప్పుడు ప్రార్థించటానికే కాదు, గాని శరీర క్రియలు వదిలి, ఆత్మ ఫలములు పొందుకోవాలని (గలతి 5:19-22). 

అలాగే కొంతమంది జీవితములో ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత లేదా ఎటువంటి కష్టాలు లేకపోవటం ద్వారా కూడా దేవునికి దూరం అయిపోతారు. వారి దృష్టిలో దేవుని అవసరం పెద్దగా ఉండదు, కనుక ఆత్మీయ జీవితం వారికి పనికి రానిదిగా, దేవుని మాటలు చేతకానివిగా ఉంటాయి. కానీ మరణం తర్వాత దేవుడు ఇచ్చిన వారి ఆత్మ దేవుని ముందు తీర్పుకు లోనవుతుందన్న విషయం విస్మరిస్తున్నారు. క్రీస్తు చెప్పినట్లుగా "ఒకడు సమస్తము సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే ఏమిటి ప్రయోజనము" (మత్తయి 16:26)

మీకా 6: "8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. "

దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏమిటి? కేవలము మంచిని పాటించుమని చెపుతున్నాడు. అలాగే న్యాయముగా నడుచుకోవాలని ఆశిస్తున్నాడు. మీకా గ్రంథములో ప్రజలు ఎంతటి అన్యాయాలు చేస్తున్నారో చెప్పి, వారు ఎలా ఉండాలో దేవుడు ఆ ప్రవక్త ద్వారా రాయించాడు. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో, ఈనాడు మనం కూడా అలాగే ఉన్నాము. కనికరము కలిగి, ఆ కనికరమును ప్రేమించే వారిలాగా మనం ఉండాలి. అలాగే అహంకారము, అహంభావము వదిలి దేవుని యెదుట దిన మనస్కులమై ప్రవర్తించాలి. చాల మంది ఎదుటి వారి హోదాను బట్టి, ధనమును బట్టి గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ అది కేవలము మనుష్యులను మాత్రమే సంతోషపెడుతుంది, అటువంటి వారు క్రీస్తు విశ్వాసులు అనిపించుకోరు (గలతి 1:10). ప్రతి ఒక్కరిని సమానముగా గౌరవించటం దేవుణ్ణి సంతోష పెడుతుంది. అలాగే నిత్యమూ పరిశుద్ధముగా జీవించాలని తపన కలిగి ఉండాలి. 

గత సంవత్సరమును వదిలేయండి, అది ఎన్నటికీ తిరిగి రాదు. దేవుని ముందు తిరిగి మన పాపములు ఒప్పుకుని నూతన జీవితమును ప్రారంభిద్దాము. ఆ పాత అలవాట్లకు స్వస్తి చెప్పి నూతనమయిన అలవాట్లు కొనసాగిద్దాము. పొద్దున్న లేవగానే దేవునికి వందనాలు చెప్పుకుని దినమును మొదలు పెట్టాలి. తర్వాత వాక్యము ధ్యానించుకోవాలి, ఒక వేళ వీలు కాకపొతే ఆ దినమంతా దేవుని చిత్తము నెరవేర్చేలాగా అయన సహాయం కోసం ప్రార్థించి, ఉద్యోగనికో, వ్యాపారనికో వెళ్ళిపోవాలి. అక్కడ కూడా చెడ్డవారితో సాహసవం చేయకుండా మంచి వారితో సహవాసం చేయాలి. చెడ్డ మాటలు మాట్లాడే వారితో ఉంటే మన ఆలోచనలు కూడా  కలుషితం అయ్యే అవకాశం ఉంది. 

తరువాత ఇంటికి వచ్చి కాసేపు కుటుంబముతో గడిపి దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి. పడుకొనే ముందు ఖచ్చితముగా కుటుంబ ప్రార్థన ఉండి తీరాలి. ఒంటరి వారయిన కూడా ఆ దినమంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి నిద్రకు ఉపక్రమించాలి. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటె అంత మంచిది. ఎందుకంటే వాటిని బట్టి శోదించబడి తిరిగి మన ఆత్మీయ జీవితములో వెనుకబడిపోయే అవకాశం ఉంది. విశ్వాసులకు క్రైస్తవ జీవితం చాల కష్టతరమయినదిగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితము దేవునికి పూజ చేసి మరచిపోవడం కాదు, నిత్య పోరాటము, ప్రతి క్షణం దేవునికి ఇష్టముగా జీవించాలన్న ఆరాటము. 

యేసయ్య తన బోధలలో కూడా తనను విశ్వసించే వారు నిత్యమూ తమ సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలని బోధించాడు. అలాగే అయనను నమ్ముకోవటం ద్వారా ఇతరుల నుండి ద్వేషమును పొందుకుంటారని కూడా చెప్పాడు. అంతే కాకుండా తమ ఆస్తి మీద నమ్మకము ఉంచుకొను వారు పరలోకమును చేరలేరని కూడా అయన బోధించాడు. ఈ బోధలు విన్న క్రీస్తు శిష్యులు "అసలు పరలోకం వెళ్ళటం ఎవరికీ సాధ్యమవుతుంది" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మార్కు 10: "27. యేసు వారిని చూచి ఇది మను ష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. "

దేవుని పరిశుద్దాత్మ పొందుకున్న విశ్వాసులకు సమస్తము సాధ్యమే అని యేసయ్య వారికి ధైర్యము చెపుతున్నాడు. ఈ పరిశుద్దాత్మ దేవుడు మనం పాపములు ఒప్పుకొని, క్రీస్తు యందు విశ్వాసము ఉంచి బాప్తిస్మము పొందుకున్న దినము నుండి మనతో ఉంటాడు అని దేవుని వాక్యము చెపుతోంది. పరిశుద్దాత్మ దేవుడు నిత్యమూ మనతో, మనలో ఉంటూ మనలను సరయిన మార్గములో నడిపిస్తూ ఉంటాడు. మనం అయన అధీనములో ఉండటం ద్వారా అంటే అయన సూచనలు / ఆలోచనలు నిత్యమూ పాటించటం ద్వారా మన శరీర క్రియలను జయిస్తాము. ఫలితముగా ఆత్మ ఫలములు పొందుకొని దేవుని ఇష్టమయిన వారీగా జీవించే శక్తిని పొందుకుంటాము. 

క్రైస్తవ విశ్వాసము కేవలం ప్రవర్తనలో మార్పును కోరుకోదు గాని, మనసులో మార్పును కోరుకుంటుంది. అది కేవలము దేవుని పరిశుద్దాత్మ శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది. క్రీస్తు మన హృదయములో నివాసం చేసినప్పుడే ఇటువంటి జీవితము మనుష్యులకు సాధ్యం అవుతుంది. కన్య మరియమ్మ పరిశుద్దాత్మ శక్తి ద్వారా క్రీస్తును గర్భం దాల్చినట్లుగా, పరిశుద్దాత్మ శక్తి ద్వారానే మనలో క్రీస్తు పోలికలు ఏర్పడుతాయి, మన ప్రవర్తన ఆయనను ప్రతిబింబిస్తుంది. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! క్రైస్తవ జీవితం కష్టమయినది కేవలం తమ సొంత శక్తి మీద ఆధారపడే వారికి మాత్రమే. కానీ దేవుని శక్తి మీద ఆధారపడే వారికి కాదు. నిత్యమూ ప్రార్థించండి, పడిపోయిన ప్రతి సారి తిరిగి లేవండి, కన్నీళ్లతో దేవుని ముందు మోకరించి అయన కృప కోసం, క్షమాపణ కోసం అడగండి. వెయ్యి సార్లు పడిపోతే వెయ్యి సార్లు క్షమాపణ అడగండి. నా ప్రతి శరీర క్రియను జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి. దినంగా, చేతకాని వారిగా ఆయన మీద ఆధారపడి అడగండి. ఖచ్చితముగా నీకు జయజీవితం అనుగ్రహిస్తాడు. ఉన్నతమయిన ఆత్మీయ స్థితిలో దేవుడు నిన్ను నిలబెడుతాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగముతో కలుసుకుందాము. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఆమెన్ !!