26, ఆగస్టు 2022, శుక్రవారం
కష్టపడకూడదని కష్టాలు తెచ్చుకుంటావా?
19, ఆగస్టు 2022, శుక్రవారం
సాటి వారు నీకు సాకుగా ఉన్నారా?
ఇది వరకు మనం దేవుని సంఘములో ఉండటం మన ఆత్మీయతకు మేలు చేస్తుందని తెలుసుకున్నాం కదా! అయితే కొన్ని సార్లు ఆ సంఘమే మనలను శోదించటం ద్వారా మన ఆత్మీయతకు భంగం కలింగించే అవకాశం ఉంది. కారణాలు ఏమయినప్పటికి, కొన్ని సార్లు మన సాటి సహోదరి, సహోదరులు మనలను కించపరచటం ద్వారానో లేక కనీస గౌరవం ఇవ్వక పోవటం ద్వారానో మనలను శోధించే అవకాశం ఉంది. ఈ శోధనలను బట్టి మనం భాధపడటమో లేదా తిరిగి వారిని భాదపెట్టటమో చేస్తాము. తద్వారా క్రీస్తు ప్రేమను చూపించని వారిగా మిగిలిపోతాము. అందునుబట్టి మన ఆత్మీయ పరుగు కుంటుపడుతుంది. ఇటువంటి సమయంలో మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా చెపుతుంది.
మనం దేవుని వారము అని సంపూర్ణముగా నమ్మినప్పుడు, మనలను కావాలని బాధపెట్టే వారికి దేవుడు వారి తప్పును గుర్తు చేయకుండా ఉంటాడా? తగిన రీతిలో వారికి పాఠం నేర్పకుండా ఉంటాడా? తండ్రి అయినా దేవుని చేతికింద దీనులుగా ఉండుట ద్వారా అయన కృపకు పాత్రులుగా ఉంటాము. అయన మన గురించి చింతిస్తున్నాడు, కనుక మనం చింతపడనవసరం లేదు. తగిన స్థానం, గౌరవం ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. నిన్ను ప్రేమించక పోవటం, నిన్ను గౌరవించక పోవటం ఎదుటి వారి ఆత్మీయతలో లోపం! కానీ వారిని ద్వేషిస్తూ, వారి వలే నువ్వు కూడా ప్రవర్తిస్తే అది నీ ఆత్మీయ లోపంగా పరిగణింపబడుతుంది. అటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడని భ్రమ పడవద్దు. బలిపీఠం వద్దకు వచ్చే ముందు, ప్రతి ఒక్కరితో సమాధానపడుమని దేవుని వాక్యం సెలవిస్తోంది (మత్తయి 5:23). లేదంటే మన ప్రార్థనలు గాలికి కొట్టుకు పోయే పొట్టువంటివి గానే మిగిలిపోతాయి.
కొన్నిసార్లు మన తోటి వారు మాట్లాడే లోక విషయాలు మనలను శోదించేలాగున ఉండవచ్చు. వారి సంభాషణలలో పాలుపంచుకోవాలని, ఆ విషయాల మీద జ్ఞానం పెంచుకోవాలని తాపత్రయపడి తిరిగి వదలి వేసిన వాటి జోలికి వెళ్ళి మన ఆత్మీయ స్థితికి చేటు చేసుకోకూడదు. ఇటువంటి లోక విషయాలు వ్యర్థమయినవిగా దేవుని వాక్యం సెలవిస్తోంది. మన మనసు నిత్యమూ పైనున్న వాటి మీదనే గాని, భూసంబంధమయిన వాటి మీద ఉండరాదని పౌలు గారు కొలొస్సయులకు రాసిన పత్రికలో పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నాడు (కొలొస్సయులకు 3:2). అందరితో పాటు కలిసి పోకపోతే ఏలా? మరీ ఎటువంటి లోక జ్ఞానం లేకుంటే ఎలా? అనుకోవద్దు. మన దైనందిన జీవితానికి కావలసిన, రాజకీయ, ఆర్థిక విషయాలు తెలుసుకోవద్దు అని చెప్పటం లేదు కానీ, అనవసర విషయాలపై అవగాహనా అనవసరం.
ఆ విషయాలు మనలను శోధించగలవు మరియు మన మనసులను ఆక్రమించి దేవునికి కొంత కాలమయినా మనలను దూరం చేయగలవు. కొంతమంది సహోదరి సహోదరులు తోటి వారితో సరదాగా మాట్లాడాలని తాపత్రయపడుతూ, శోదించబడుతూ తోటి వారిని కూడా శోధిస్తారు. ఇటువంటి వారితో అతి సన్నిహిత్యం కొనసాగిస్తూ, అటువంటి మాటలకూ అలవాటుపడి పూర్వ స్వభావమును తిరిగి పొందుకోవద్దు. సరదాగా మాట్లాడుకోవటం తప్పు కాదు, కానీ అదేపనిగా, ఒకరినొకరు కించపరచుకోవటం, లేక వంగ్యంగా మాట్లాడుకోవటం మన ఆత్మీయ స్థితికి ఎంత మాత్రము మేలు చేయదు.
క్రీస్తు ఏనాడయినా, ఎవరితోనయినా ఇటువంటి ఛలోక్తులు వేసినట్టు బైబిల్ లో రాయబడిందా? హద్దులో లేని ఛలోక్తులు ఎదుటి వారిని శోధిస్తాయి మరియు విస్తారమయిన మాటలు ఎన్నో దోషములు కలిగి ఉంటాయి. సహోదరుల మధ్య నిత్యము ప్రేమ కలిగి ఉంటూ తప్పులు మన్నించాలి మరియు సణుగుకొనకుండా ఒకరినొకరు ఆతిథ్యము చేయుమని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 4:8-9). అయితే ఇటువంటి సాటి వారిని సాకుగా తీసుకోని అటువంటి సంభాషణల్లో పాల్గొని, ఎదుటి వారిని శోదిస్తూ లేదా విస్తారముగా దోషములు మాట్లాడుతూ ఆత్మీయతలో వెనుకపడవద్దు. ఒక్క విషపు చుక్క కడివెడు పాలను ప్రాణాంతకం చేసినట్లు, మన అల్లరితో కూడిన మాటలు, దోషములు కలిగి ఉంటూ మనలో అత్మీయతను కలుషితం చేయకుండా మానవు.
కొంతమంది సహోదరి, సహోదరులు తాము దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మానేసి, ఇచ్చే వారిని కూడా శోధిస్తూ మాట్లాడుతారు. వారు అన్యులతో కలవటమే కాకుండా, సాటి వారిని కూడా వారితో పాటు లాగాలని ప్రయత్నం చేస్తారు. ఒక వేళ తిరస్కరిస్తే, రకరకాలుగా విశ్వాసులయిన వారిని తృణీకరించటమో, లేదా "గొప్ప భక్తిపరులు, అంత విశ్వాసులు, ఇంత విశ్వాసులు" అని హేళనగా మాట్లాడుతూ రెచ్చగొట్టాలని చూస్తుంటారు. "పాపముతో మీకు ఉన్న సంబంధం, అన్యజనుల ఇష్టము నెరవేర్చటానికి గతించిన కాలమే చాలును, మీరు వారి పాప కార్యములలో పాలిభాగస్తులు కానందుకు ఆశ్చర్యపడుచు, మిమల్ని దూషించుదురు" అని పేతురు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో రాశారు (1 పేతురు 4: 3-4). కనుక ఎవరో తిరస్కరిస్తారని, మరెవరో హేళన చేస్తారని మన విశ్వాసమును తగ్గించుకుని, దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించుకోవద్దు.
మరియు కొన్ని సార్లు ఇతరులు మనలను పొగుడుతున్నారని, మనం గొప్ప ఆత్మీయ వరములు కలిగిన వారమని అన్నప్పుడు విని వదిలేయటమే ఉత్తమం. వారి మాటలను బట్టి అతిశయ పడుతూ గర్వ పడటం మన ఆత్మీయతకు మేలు చేయదు. గర్వం పొంచి ఉండి మనలను సాతానుకు దగ్గరగా చేస్తుంది. ఇతరుల అభిప్రాయములు మనకు విలువలేనివిగా ఉండాలి. వారు మన గురించి మంచి చెప్పిన, చెడు చెప్పిన దేవునికి స్తోత్రం అనుకుని మన ఆత్మీయ పరుగులో కొనసాగాలి. "నా నామమును బట్టి దూషించబడువారు ధన్యులు" అని యేసయ్య చెప్పాడు కదా! "మీరేమి చేసినను మనుష్యుల కొరకు కాకుండా, దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేయుమని" దేవుని వాక్యం సెలవిస్తోంది (కొలొస్సయులకు 3:24).
12, ఆగస్టు 2022, శుక్రవారం
దేవుడు ఇచ్చే శిక్షణ!
దేవుడు మనకు తండ్రిగా తల్లిగా ఉండి మనలను నిత్యము తన ప్రేమ చొప్పున కాపాడుతూ ఉంటాడు. ఎందుకు పనికి రాని వారమయిన మనలను, ఏ అర్హత లేని మనలను ఎన్నుకొని తన కృపల చొప్పున నిత్యము మన అవసరాలు, అక్కరలు తీరుస్తుంటాడు. "సృష్టి కారకుడయినా పరలోకపు తండ్రి మనలను నిత్యము పోషిస్తాడు, మరియు మనకు ఎంతో శ్రేష్ఠమయిన ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నాడు" అని దేవుని వాక్యం సెలవిస్తోంది (మత్తయి 7:11). "అడుగుడి మీకు ఇవ్వబడును, వేతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తియ్యబడును" అని యేసయ్య చేసిన బోధను బట్టి (మత్తయి 7:7) విశ్వాసులయిన మనము ఎంతో గొప్ప విశ్వాసం చూపుతూ ప్రార్థిస్తాము. ఎందుకంటే, తండ్రి అయినా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడటం అత్యంత సహజం.
అయితే మనం ఎంత గొప్ప విశ్వాసంతో ప్రార్థించిన కూడా, దేవుని చిత్తమును బట్టే మనకు అయన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. మనకు ఆశీర్వాదాలు ఇవ్వటం దేవునికి ఇష్టం ఉండదా? దేవుడు మన భవిష్యత్తును పూర్తిగా ఎరిగి ఉన్నాడు, ఫలానా ఆశీర్వాదం పొందుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండబోతోంది, అదీ పొందుకోవటం ద్వారా మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోతామా? దానివలన దీర్ఘకాలికంగా మనకు ఏదయినా కీడు జరుగబోతోందా? మొదలగు విషయాలన్నీ దేవుడు పరిగణలోకి తీసుకోని మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. మనలను అయన ఏర్పరచుకున్న ఉద్దేశ్యాలకు, మన ఆత్మీయ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కొద్దీ కాలం మనలను కష్టకాలం నుండి నడిపిస్తాడు. తద్వారా మనకు అవసరమయిన జీవిత పాఠాలు నేర్పిస్తాడు.
ఆనాడు దావీదు గొఱ్ఱెల కాపరిగా ఉన్నప్పుడు, కాబోయే రాజయిన తనకు దేవుడు యుద్ధ విద్యలు ఎలా నేర్పించాడు? (1 సమూయేలు 17:34-37) గొల్యాతును చంపబోయే ముందు తనకు ఒక అవకాశం ఇమ్మని రాజయిన సౌలును అడుగుతూ దావీదు, "తన మీద అనుమానపడనవసరం లేదని, గొఱ్ఱెలను కాపాడటానికి తానూ ఎలుగుబంటి, సింహము వంటి బలమయిన జంతువులతో తలపడి, వాటిని చంపి తన గొఱ్ఱెలను కాపాడినట్లు" చెప్పాడు కదా? ఆనాడు దావీదు ఇటువంటి క్రూర జంతువులను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, నేను ఎంతో విశ్వాసంతో ప్రార్థించాను కదా? అనుకుంటే, కేవలం గొఱ్ఱెల కాపరిగానే మిగిలిపోయి ఉండేవాడు. దేవుని చిత్తమును అంగీకరించాడు కాబట్టే, దైర్యముగా "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నేను బ్రతుకు దినములన్ని కృప క్షేమములు నా వెంట వచ్చును" అని కీర్తన రాశాడు.
దేవుడు మనలను గొప్ప ఉద్దేశ్యాలకు సిద్దపరుస్తున్నాడు అని సంపూర్ణంగా విశ్వసించాలి. కనుకనే మన జీవితంలో మనకు నచ్చని పరిస్థితులను అనుమతిస్తున్నాడు. మాములు గొఱ్ఱెల కాపరి, సింహమును జయించటం సాధ్యపడుతుందా? దాని అరుపు వినగానే భయపడి పారిపోవటం ఖాయం. కానీ దావీదుకు అంతటి ధైర్యం, బలం ఎలా వచ్చాయి. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. నేడు నీకు కూడా తండ్రి హస్తం తోడుగా ఉండి, నిత్యమూ నిన్ను నడిపిస్తూ ఉంది, పరిశుద్ధాత్మతో అయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు పిరికిగల ఆత్మను ఇవ్వలేదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (2 తిమోతికి 1:7) . పరీక్ష కఠినంగా ఉంది అని రాయకుండా పారిపోతే పై తరగతికి వెళుతామా? దేవుడే ఆ పరీక్షను నీతో రాయిస్తున్నాడు, కేవలం అయన మీద ఆధారపడి, నీ చిత్తము నెరవేర్చు తండ్రి అనుకంటే, ఆయనే నిన్ను గెలిపిస్తాడు.
కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసమును కూడా పరిక్షిస్తాడు, ఆయన మీద మన ప్రేమ నిజమయినదా? మనం ఆత్మీయంగా ఎటువంటి స్థితిలో ఉన్నాము అని మనకు బయలు పరుస్తాడు. అంత సక్రమంగా సాగిపోతుంటే, నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఎంతో విశ్వాసంతో ఉన్నాము, మనకు చాల భక్తి, దేవుడంటే విపరీతమయిన ప్రేమ అనుకుంటాము. కానీ కష్ట కాలంలో అసలు రంగు బయటపడుతుంది. తద్వారా మనలను మనం సరి చేసుకొని, విశ్వాసంలో నూతన పరచబడుతాము. కలిగే కష్టాల ద్వారా, మనలో ఉన్న ఆత్మీయ గర్వము, సొంత శక్తి మీద ఆధారపడే తత్వము తగ్గిపోతాయి. దేవుడు దావీదును ఎంతగా కష్టాల గుండా నడిపిన కూడా, ఎక్కడ కూడా ఆయాసపడలేదు, దేవుని మీద ఆధారపడి మాత్రమే జీవించాడు. సులభంగా రాజయిన సౌలు మాత్రం, గర్వపడి దేవుని మాటలను కూడా ధిక్కరించాడు. కనుకనే దేవుని కృపను కోల్పోయాడు.
సులభముగా దొరికే దానికి విలువ తక్కువ, లేదా అది మనలను గర్వపడేలా చేస్తుంది. కనుకనే దేవుడు మనకు తగ్గింపును నేర్పటానికి, కొన్ని మనకు త్వరగా అందించాడు. అయన శక్తిని, మహిమను మనం పూర్తిగా గుర్తిస్తాము అనుకున్న సమయం దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అనాడు ఇశ్రాయేలీయులు, సముద్రం దాటి తమను విడిపించింది, తాము తయారు చేసిన ఒక దూడ ప్రతిమ అని పూజించారు. కొద్దిపాటి దాహానికి, ఆకలికి దేవుని మీద సణుగుకొని దేవుని ఆగ్రహానికి లోనయ్యారు. తమ ముందు ఉన్న కష్టాలను, అనగా బలవంతులయిన కాననీయులను చూసి అవిశ్వాసముగా మాట్లాడి దేవుని కృపను కోల్పోయారు. మన ముందు ఉన్న కష్టాలను బట్టి అధైర్యపడుతూ విశ్వాసం కోల్పోవటం దేవునికి ఇష్టం లేని ప్రవర్తన.
5, ఆగస్టు 2022, శుక్రవారం
దైవ సేవకులను దూషిస్తున్నావా?
దేవుడు ఒకనాడు అనగా క్రీస్తు రాకడకు ముందు కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకొని తన ప్రజలయిన ఇశ్రాయేలు జనముతో మాట్లాడి, వారు తన మార్గములో నడవటానికి, మరియు తన చిత్తమును నెరవేర్చటానికి ప్రవక్తలకు తన యొక్క ప్రవచనములు బయలు పరచేవాడు. అదే విధముగా నేడు కూడా కొంతమంది దైవ సేవకులను తన సేవకు పిలుచుకొని వారికి తన పరిశుద్దాత్మ ద్వారా జ్ఞానమును అనుగ్రహిస్తూ, విశ్వాసులను దేవునిలో బలపరచటానికి వాడుకుంటున్నాడు. వీరిలో కొందరు తమ తమ సంఘముల నేపథ్యమును బట్టి కొన్ని మతపరమయిన సిద్దాంతాలు పాటిస్తూ ఉంటారు. వీరు క్రీస్తూనే నమ్ముతుంటారు, కానీ కొన్ని ఉపదేశాలు విశేషముగా విశ్వాసులకు బోధిస్తూ ఉంటారు.
ఇవ్వని కూడా దేవుని వాక్యమును అర్థం చేసుకొనే విధానము వలన కలిగే సిద్దంతాలు లేదా ఉపదేశాలు. క్రీస్తును రక్షకునిగా, దేవునిగా అంగీకరించని బోధను వ్యతిరేకించమని దేవుని వాక్యం సెలవిస్తోంది (2 యోహాను 1:10) కానీ సిద్ధాంతా పరమయిన అవగాహన లోపాలను ప్రేమ పూర్వకంగా హెచ్చరించాలి, వాక్యము చేత ఖండించాలి. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్పినట్లుగా, వివాదాలకు, వ్యర్థమయిన వాదనలకు వెళ్ళి, మన హృదయములలో గర్వమునకు చోటిచ్చి, దేవుడు మనకు ఇచ్చిన భక్తిని తప్పి పోరాదు. కొంతమంది దైవ సేవకులు దేవుని పిలుపు లేకపోయినా కూడ, కేవలం ప్రజలను ఆకర్షించి పేరు ప్రఖ్యాతులు పొందటానికి మరియు ధనం సంపాదించటానికి సంఘములు నడుపుతుంటారు.
వీరిని బట్టి సంఘమును హెచ్చరించటం చేయాలి, మరియు ఆ సంఘములో విశ్వాసులకు అర్థం అయ్యే రీతిగా అతని తప్పుడు బోధలను వాక్యముతో ఖండించాలి. ఆ దైవ సేవకుడు చేసేది వాక్యాను సారమయిన బోధ కాదని తెలిసి కూడా, అతణ్ణి అనుసరిస్తు అతని బోధలు పాటిస్తే కనుక, ఆ విశ్వాసులను, వారి ఆత్మీయ స్థితిని దేవుని చిత్తమునకు వదిలేయాలి. మానవ శక్తితో, జ్ఞానముతో ఏ ఒక్కరిని కూడా మనం మార్చలేము, ప్రభువులోకి నడిపించలేము. కేవలము, ప్రభువు సువార్తను మాత్రమే మనం ప్రకటించగలము. తప్పుడు బోధలు చేసే వారిని మరియు వారి పక్షమున నిలిచే వారిని, దేవుని తీర్పుకు వదిలి వేసినట్లుగా రాశారు పౌలు గారు (2 తిమోతికి 4:14-16).
మనలో కొంతమంది అదేపనిగా దైవ సేవకులను విమర్శించటం చేస్తుంటారు. వారికి ఉన్న విలాసవంతమయిన సౌకర్యలను బట్టి వారిని దూషిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వారికి ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు వారిని తప్పకుండా లెక్క అడుగుతాడు. ఆ పనిని మనం చేసి దేవుని తీర్పుకు లోనుకావద్దు. ఇటువంటి సేవకులు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన ధనం వాడుకుంటున్నారు అని నిలదీయటం విశ్వాసులయిన మనకు తగదు. సర్వము దేవుని అధీనములో ఉంది, అయన చిత్తము ప్రతి వ్యక్తి విషయంలో, సంఘము విషయంలో నెరవేరుతుంది. అమాయకులయిన విశ్వాసులకు అవగాహన పెంచే ప్రయత్నం చేయండి, కానీ ఆ దైవ సేవకులను దుయ్యపట్టి మన ఆత్మీయతకు చేటు చేసుకోవద్దు.
ఆనాడు దైవ సేవకుడయినా మోషేను, అహరోనులను దూషిస్తూ కోరహు "మీరు మాత్రమే ఎందుకు ఇంతటి ఘనత పొందుతున్నారు. ఇక్కడ అందరు పరిశుద్ధులే, మేము కూడా అటువంటి ఘనతకు అర్హులమే" అని వారికి వ్యతిరేకంగా సమాజమును రెచ్చగొట్టారు. అంటువంటి వారి విషయంలో దేవుని తీర్పు ఎలా నెరవేరింది? భూమి చీల్చబడి వారిని సజీవంగా మింగి వేసింది. ఇప్పటి దైవ సేవకులు మోషే వంటి వారు కాకపోవచ్చు గాక! కానీ ఆ దేవుడు ఒక్కడే, అయన తీర్పులు ఎప్పుడు ఒక్కలాగే ఉంటాయి. ఆ దైవసేవకులను, వారిని గుడ్డిగా అనుసరిస్తున్న విశ్వాసులను బట్టి భారంతో ప్రార్థించండి. వారిని దేవుడే మారుస్తాడు లేదా ఆ విశ్వాసులను కాపాడుకుంటాడు. అంతే కానీ కోరహు వలె నోరు జారి దేవుని తీర్పుకు గురి కావద్దు.
కొందరు దైవ సేవకులు డబ్బు మీద వ్యామోహంతో అదేపనిగా కానుకలు ఇవ్వాలని సంఘమును ప్రేరేపిస్తూ ఉంటారు! తమ సొంత ఘనత కోసం సంఘమును వాడుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారి సేవను కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. ఎందుకిలా జరుగుతుంది? దేవుడు ఎందుకు వీరిని కూడా వాడుకుంటున్నాడు, అని చాలామంది భాధ పడుతూ ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలీయులు నీటి కోసం వాదించినప్పుడు మోషే ఆయాస పడి, "ఇప్పుడు మీ కోసం మేము ఈ రాతి నుండి నీటిని తెప్పించాలా?" అని ఆవేశంగా అరచి, దేవుడు రాతితో మాట్లాడమంటే దాన్ని కొట్టి తప్పు చేశాడు. అయినప్పటికి దేవుడు రాతి నుండి నీటిని రప్పించటం ఆపలేదు. ఇక్కడ మోషే తప్పు కన్న కూడా, ప్రజల దాహం తీర్చటం దేవుని ప్రేమలో ప్రాముఖ్యమయినది.
ఇటువంటి దైవ సేవకులు ఎన్ని వందల తప్పులు చేసిన తన ప్రజలను కాపాడు కోవటం, వారిని రక్షించుకోవటం దేవుని అనంత ప్రేమలో ప్రాముఖ్యం కలిగి ఉన్న విషయం. అందుకనే ఇటువంటి దైవ సేవకులను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆనాడు డబ్బుకై ఆశపడిన బిలామును సైతం, ఇశ్రాయేలు ప్రజలను దీవించటానికి దేవుడు వాడుకున్నాడు కదా? వీరు కూడా అటువంటి వారేనని, దేవుని తీర్పుకు వారిని వదిలేయటమే మన ఆత్మీయతకు శ్రేయస్కరము. లేదంటే మోషేను దూషించిన మిరియాము కుష్ఠును పొందుకున్నట్లుగా, ఆత్మీయంగా మనం కూడా స్పర్శను కోల్పోయిన, అనగా పాపం విషయంలో సున్నితత్వము కోల్పోయిన వారి వలే మారిపోతాము.
ప్రియమయిన సహోదరి, సహోదరులారా! ప్రభువు సేవ కోసం, తమ జీవితాలను అర్పిస్తూ, గొప్ప సాక్ష్యం కలిగి ఉన్న దైవ సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా, ప్రభువు పేరిట మిమల్ని హెచ్చరిస్తున్నాము. ప్రభువు వారికి నిత్యము తోడుగా ఉండి నడిపిస్తుంటాడు. వారు మీతో ప్రేమగా, ఓర్పుగా ఉంటున్నారు కదా అని వారికి మీ వంటి భావోద్వేగాలు ఉండవని తలంచకండి. వారిని మరింతగా గౌరవిస్తూ, మరి ఎక్కువగా ప్రేమించండి. సాక్ష్యం చూడకుండా, వారు బోధించే విషయాలను వాక్యంతో పరిశీలించకుండా, ఎవరిని పడితే వారిని నెత్తిన పెట్టుకొమ్మని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ నిజమయిన ప్రభువు సేవకులను ఆదరించండి, అది ప్రభువు ఎన్నటికీ మరచిపోకుండా మీకు ప్రతిఫలం దయచేస్తాడు. "తన శిష్యులయిన వారికి, ఎండా దినము చల్లని మంచి నీటిని ఇచ్చిన వారికి కూడా నేను ప్రతిఫలం ఇస్తానని" యేసయ్య చెప్పాడు కదా (మత్తయి 10:42).
కానీ ఆ దైవ సేవకులు మనం కోరుకున్నది చెయ్యలేదనో, లేక ఎదో విషయంలో ప్రాముఖ్యం ఇవ్వలేదనో, వారిని అవమానించటం, చులకనగా చూడటం చేయకండి. మిమల్ని వారు అవమానిస్తే అది దేవుడు చూసుకుంటాడు, మీకు రావలసిన ప్రాముఖ్యత ఆయనే ఇస్తాడు. ప్రతికారము యెహోవాదే కానీ మనది కాదు, దాన్ని మనం తీర్చుకుంటే దేవుడు మన మీద తీర్చుకుంటాడు. ఎలీషాను అవమానించిన యువకుల గతి ఏమైంది? అడవి నుండి రెండు ఏలుగు బంట్లు వచ్చి నలభై రెండు మందిని చీల్చి వేశాయి (2 రాజులు 2:24). మనకు ఇప్పుడు కృప ఉంది కదా అని, గర్వపడుతూ, ఇష్టానికి ప్రవర్తిస్తూ దేవుని కృపకు దూరం కావద్దు. దైవ సేవకులను గౌరవించండి, కానీ ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు మాత్రమే అర్పించండి.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!