పేజీలు

27, మే 2022, శుక్రవారం

భార్య భర్తలు ఎలా ఉండాలి?


దేవుడు సృష్టిని ఆరు దినములలో చేశాడు. ఆ క్రమములో ఆరవ దినమందు జంతువులను మరియు మొదటి మానవుడయినా ఆదామును కూడా అదే దినమున దేవుడు సృష్టించాడు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది! అయితే జంతువులలో లేని పూర్ణాత్మ, మనసు (మనసాక్షి) మానవులకు అనుగ్రహించాడు దేవుడు (1 థెస్సలొనీకయుకు 5:23). జంతువులకు కేవలం ప్రాణము మరియు దేహమును ఇవ్వటమును బట్టి, వాటి శరీర అవసరాల నిమిత్తం ఆకలి తీర్చుకోవటానికి ఆహారం కోసం వేటాడం మరియు శరీర కోరికలను లేదా వాటి ఋతువులను బట్టి ఇతర జంతువులతో కలుసుకోవటం చేస్తాయి. ఆ విషయంలో వాటికి ఎటువంటి నియమ నిష్టలు ఉండబోవు. 

దేవుడు ఆదామును చేసిన తర్వాత అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలచి, అతనికి తోడుగా మొదటి స్త్రీ అయినా అవ్వను అతనికి  జతగా చేశాడు. అటుపైన "ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరచు కొనుడి" అని వారిద్దరిని దీవించాడు (ఆదికాండము 1:28). మరియు వారు ఇద్దరు హత్తుకొని ఏక శరీరులుగా ఉంటారని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది (ఆదికాండము 2:24). అప్పటి నుండి వివాహం అనేది ప్రతి తరము పాటిస్తూ వచ్చింది (ఆదికాండము 4:16-17). కాల క్రమేణా దేవుడు మోషే ద్వారా జన్యు పరమయిన ఇబ్బందులు రాకుండా మరిన్ని నియమ నిబంధనలు పెట్టాడు (లేవికాండము 18:6-18). ఎవరు ఎవరిని వివాహం చేసుకోరాదో దేవుడు తన ఆజ్ఞల ద్వారా వెల్లడి చేశాడు.  

ఈ నియమ నిబంధనలు తప్పిన నాడు, మనిషి జంతువు స్థితికి దిగజారి పోతాడు. నేటి సమాజంలో ఎన్నో రకాల పోకడలు చలామణి అవుతున్నాయి! డేటింగ్ అని సహజీవనం అని నియమ నిష్టలు లేని తప్పుడు కార్యాలను ఉన్నతమయినవిగా చిత్రీకరిస్తూ యువతి యువకులను శోధిస్తున్నారు. కాముకత్వము తీర్చుకోవటానికి పెళ్ళికి ముందు కట్టడలు లేని విచ్చలవిడితనం ప్రోత్సహించే ఈ కార్యాలను ఆమోదయోగ్యంగా మారుస్తున్నారు.  జంతువులకంటే హీనమయిన స్థితిలోకి మనుష్యులను నడిపిస్తూ దేవుడు ఏర్పరచిన వివాహ వ్యవస్థను ప్రాముఖ్యం లేనిదిగా ప్రచారం చేస్తున్నారు. వివాహం అన్నింటా ఘనమయినది అని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 13:4)

కాబట్టి సహోదరి, సహోదరుడా! పెళ్ళికి ముందు విచ్చలవిడితనం దేవుని దృష్టిలో పాపమే అని గుర్తించి మసలుకోండి. దేవుని చిత్తమును కనిపెట్టి మీ జీవిత భాగస్వామిని ఎన్నుకోండి. దేవుడు స్త్రీ పురుషులు  ఇద్దరిని తన స్వరూపంలో, సమానంగా సృష్టించాడు. "అయితే సంఘమునకు క్రీస్తు తలగా ఉన్నట్లుగా స్త్రీకి తన భర్త తలగా ఉండాలి, మరియు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీ తన భర్తకు అన్ని విషయాలలో లోబడాలి. అయితే క్రీస్తు ఎలాగయితే సంఘమును ప్రేమించి దానిని పవిత్రముగా చేయటానికి తనను తాను ఏలా అప్పగించుకొని శ్రమలు పడ్డాడో అదేవిధంగా పురుషులు కూడా తమ భార్యలను ప్రేమించాలి మరియు వారిని గౌరవిస్తూ పోషించాలి" అని దేవుని వాక్యం సెలవిస్తోంది (ఎఫెసీయులకు 5:24-27)

భార్యలను చిన్న చూపు చూస్తూ నియంత వలె వ్యవహరించటం దేవుని ఉద్దేశ్యం కాదు. పురుషులు తమ శరీరమును ప్రేమించినట్లుగా, భార్యలను ప్రేమించాలి (ఎఫెసీయులకు 5:28). మరియు వారు శారీరికంగా బలహీనమయిన వారిగా గుర్తించి వారి విషయంలో మరి ఎక్కువ శ్రద్ధ చూపించాలి. దేవుడు ఇచ్చిన జీవితమును వారు భర్తలతో పంచుకుంటున్నారు కనుక వాళ్లను గౌరవించాలి. తద్వారా ఇద్దరు కూడా క్రీస్తులో ఆనందిస్తూ, ఆత్మీయంగా బలపడుతారు (1 పేతురు 3:7). తమ సంతానము ప్రశాంతంగా పెరగటానికి మంచి వాతావరణం ఇచ్చిన వారిగా ఉంటూ దేవుని రాజ్యనికి వారిని దగ్గర చేస్తారు. మరియు భార్యలు తమ భర్తలను తమ గొంతెమ్మ కోరికలతో బాధించ రాదు. తమ భర్తల సంపాదనను గుర్తెరిగి గుట్టుగా సంసారం చేయాలి. 

కొంతమంది స్త్రీలు లోకస్తులను చూసి, నగలు చీరలు కావాలని భర్తలను సాధిస్తూ ఉంటారు. అయితే "స్త్రీలు ఖరీదయిన వస్త్రములతో కానీ నగలతో గాని, రక రకాల జడలతో గాని అలంకరించుకోకుండా, మీ అంతరాత్మను, సాత్వికత, శాంతత అనే శాశ్వత గుణాలతో అలంకరించుకోవటం ద్వారా దేవుని దృష్టిలో విలువయిన వారిగా ఉంటారు" అని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 3:3-4). శారా అబ్రాహాముకు లోబడి అతనిని యజమాని అని పిలిచింది, మరియు విశ్వాసములో అతనితో ప్రయాణం చేసింది (ఆదికాండము 18:12) కనుక దేవుని చేత ఆశీర్వదించబడింది. భార్యలు తమ భర్తలకు లోబడుతూ, విశ్వాసములో వారితో నడిస్తే తప్పకుండా దేవుడు మిమ్మును కూడా దివిస్తాడు.  

సామెతలు 31 వ అధ్యాయము 10 వ వచనం నుండి పూర్తిగా చదవమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాము. ఇక్కడ దేవుడు గుణవతి అయినా భార్య ఏలా ఉండాలో వివరంగా రాయించాడు. పురుషులు మోసకారమయిన సౌందర్యము మరియు అశాశ్వతమయిన అందమును  మోహించకుండా దేవుని యందు భయ భక్తులు కలిగిన భార్యను బట్టి సంతోషించాలని దేవుని వాక్యం చెపుతోంది. భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు విశ్వాసములో బలపరచుకుంటూ క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి. ఏ ఒక్కరయినా దేవునికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే వేరే వాళ్ళు దానిని వ్యతిరేకించాలి. ఉదాహరణకు అననీయ మరియు సప్పీరా ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకమయిన నిర్ణయం తీసుకోని, మరణం పొందారు. కానీ వారిలో ఒక్కరు దేవుని పేరిట వేరే వాళ్ళను గద్దిస్తే, అటువంటి అనర్థం జరిగేది కాదు కదా? 

చాల మంది ఇళ్ళలో భార్య భర్తలు ఒకరి మీద ఒకరు నేరారోపణ చేస్తూ ఉంటారు. "నీ మూలంగానే నేను ఇలా ఉన్నాను" అంటూ భర్త కానీ భార్య కానీ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ నేరారోపణ చేస్తారు. అదే పనిగా నేరారోపణ చేయటం లేదా  నిందించటం అనేది  సాతాను లక్షణము (ప్రకటన 12:10). ఏదెను వనములో సాతాను మాట విని నిషేదించిన పండు తినగానే ఆదాము అవ్వ కూడా ఆ లక్షణాలనే కనపరిచారు. దేవుడు "ఆదాము ఎక్కడ ఉన్నావు, నేను వద్దని చెప్పిన పండు గాని తిన్నావా" అని అడగ్గానే, ఆదాము ఏమన్నాడు "నాకు జతగా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది" అన్నాడు. అక్కడే మొదలు అయింది, నిందలు వేసే స్వభావం. దేవుడు అడిగింది "ఎందుకు తిన్నావు?" అని కాదు లేదా "ఎలా జరిగింది?" అని కూడా కాదు. "అవును ప్రభువా తిన్నాను, నన్ను క్షమించు" అని అంటే సరిపోయేది కదా!

మీ భార్య వల్ల గాని భర్త వల్ల గాని పెద్ద తప్పే జరిగి ఉండవచ్చు. కానీ క్రీస్తు ప్రేమ అన్నింటిని క్షమిస్తుంది, ప్రతి తప్పిదమును  కప్పివేస్తుంది. దేవుడు తిరిగి మీ జీవితాలను బాగు చేస్తాడు, ప్రతి కీడును మన మంచికై మలిచే సమర్థుడిగా ఉన్నాడు. యోసేపును తన అన్నలు అమ్మేసారు, ఐగుప్తులో బానిసగా బ్రతికాడు, నిందలు పొంది చెరసాల పాలయినాడు. ఇవ్వని కూడా యోసేపు జీవితంలో జరిగిన చెడు అనుభవాలు. అయితే దేవుడు వాటిని అతని తండ్రి యాకోబు కుటుంబానికి ఆశీర్వాదంగా మార్చాడు. కరువుతో వారు చనిపోకుండా యోసేపును ఐగుప్తుకు ప్రధానిగా మార్చి వారిని పోషించాడు. మీ జీవితాలలో కూడా జరిగిన తప్పులను లేదా చెడును మీకు ఆశీర్వాదంగా  మార్చే సమర్థుడిగా మన దేవుడు ఉన్నాడు. కనుక ఒకరి నొకరు క్షమించుకుంటూ, క్రీస్తు పై విశ్వాసంలో ఎదగాలి. 

కొందరు తల్లితండ్రులు పిల్లల విషయంలో పక్షపాతం చూపుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉంటే తల్లి ఒక్కరిని మరియు తండ్రి ఒక్కరిని ఎక్కువగా గారాబం చేస్తూ లేదా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఇది ఖఛ్చితముగా దేవుని వాక్యానుసారమయిన పెంపకం కాదు. సరదాకయినా పిల్లలను వేరుగా చూడకూడదు, అది వారిపై  దుష్ప్రభావము చూపుతుంది. దేవుడు మానవులందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. చెడ్డవారి మీద మరియు మంచివారి మీద వర్షం ఒకేలాగా కురుపిస్తున్నాడు, వారి పంటలు కూడా అలాగే పండుతున్నాయి. ఇస్సాకు మరియు రిబ్కా పిల్లలిద్దరిలో చెరొకరిని అమితంగా ప్రేమించి, మరో బిడ్డను నిర్లక్ష్యం చేశారు. అందును బట్టి వారి మధ్య విభేదాలు పెరిగేలా చేశారు. 

ఇస్సాకు ఏశావును అమితంగా ప్రేమించి దేవుడు యాకోబుకు చేసిన వాగ్దానమును  లెక్కచేయకుండా, ఏశావును ఆశీర్వదించాలని చూశాడు. రిబ్కా, భర్తకు దేవుని వాగ్దానం గుర్తుచేయవలసింది పోయి, యాకోబు, తండ్రిని మోసం చేసేలాగా ప్రోత్సహించింది. అందును బట్టి వారిద్దరూ సఖ్యత లేనివారిగా మరియు పిలల్లను దేవుని చిత్తముగా పెంచలేని వారిగా మనకు కనబడుతారు. "కానీ వారి వివాహం అయినా మొదట్లో ఇద్దరు ఎంతో ప్రేమగా ఉన్నారని, రిబ్కా, ఇస్సాకు తన తల్లి అయినా శారా మరణం మరచిపోయేలా చేసింది" అని దేవుని వాక్యం చెపుతుంది (ఆదికాండము 24:67). అయితే ఎక్కడో వారి మధ్య దూరం పెరిగి పోయింది, కనుకనే ఇటువంటి స్థితిలోకి వెళ్లిపోయారు. భార్య భర్తలు ఒకరి నొకరు హెచ్చరించుకునే స్థితిలో ఉండాలి,  ఏ విధమయిన రహస్యాలు వారి మధ్య ఉండరాదు, లేదంటే వారి మధ్య దూరం పెరిగిపోతుంది. 

కొంతమంది భార్యలు కాని భర్తలు కాని అదేపనిగా తమ తల్లితండ్రుల మీద ఆధారపడుతూ, తమ సంసారపు బండిని నడుపుమని వారికి అప్పగిస్తారు. ఇది ఖచ్చితముగా దేవుని వాక్యానికి విరుద్ధము. తల్లిని తండ్రిని గౌరవించండి, వారిని పోషించండి. కానీ మీ సంసారపు విషయాలు మీరే పరిష్కరించుకోండి. మీ జీవిత భాగస్వామికి నచ్చ చెప్పండి. సమస్య మీ శక్తికి మించినది అయితే, కొంతవరకు మీ తల్లి తండ్రి సహాయం తీసుకోండి. కానీ దేవునికి అప్పగించి, పరిష్కారం కోసం ఎదురు చూడండి. అయన మార్చలేని మనిషి కానీ, తీర్చలేని సమస్య కానీ లేదు. 

ఆదికాండము 2: "24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు."

కీర్తనలు 45: "10. కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము"

ఈ వచనములు మనకు ఏమి నేర్పుతున్నాయి! పురుషుడు తల్లితండ్రిని విడిచి భార్యను హత్తుకొని ఉండాలి! అస్తమానం భార్య మీద తల్లి, తండ్రికి ఫిర్యాదులు చెపుతూ, చంటి పిల్లాడి మాదిరి ప్రవర్తించరాదు. మరియు పెద్దలు కూడా వారి పిల్లల కాపురంలో పెత్తనాలు చేయకుండా, వారిని సొంతంగా ఎదగనివ్వాలి. మరియు భార్య కూడా తన స్వజనమును, మరియు తండ్రి ఇంటిని మరచి భర్త ఇంటిలో సర్దుకుపోవాలి. అస్తమానం తండ్రి ఇంటి వారికి ఫిర్యాదులు చేస్తూ, అత్తింటి వారిని విసిగించ కూడదు, వారి గుట్టు రట్టు చేయకూడదు. భార్య యొక్క పుట్టింటి వారి లోపాలు తెలిసినా కూడా భర్త తన కుటుంబం ముందు, ఎగతాళి చేస్తూ ఆమెను అవమానం చేయరాదు. 

భార్య భర్తలు యేసయ్య తల్లి తండ్రులు అయినా యోసేపు, మరియు మరియమ్మ మాదిరి ఉండాలి. దేవదూత తనతో మాట్లాడక మునుపు మరియమ్మ గర్భం గురించి తెలిసి యోసేపు, ఆమెను అవమానపరచకుండా, మౌనంగా విడనాడలనుకున్నాడు. దేవుని కార్యం తెలిసిన తర్వాత, ఆ కాలపు ఆచారాలు, కట్టుబాట్ల నుండి మరియమ్మను ఎంతగా కాపాడి ఉంటాడు! చుట్టూ పక్కల వారి సూటిపోటి మాటల నుండి, ఆమెను ఎంతగా సమర్థించి ఉంటాడు! కనుకనే ఆ ఇద్దరు దేవుని చేత ఎన్నుకోబడ్డారెమో! 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు మనలను తన స్వరూపంలో సృష్టించాడు అని దేవుని వాక్యం చెపుతోంది. మరి మనం అయన స్వరూపంలో కనీసం సగం అయినా మనలో సగం అయినా మన జీవిత భాగస్వామికి చూపగలుగుతున్నామా? సమస్య ఏదయినా! దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. అయన వాక్యాన్ని అనుసరించి, ఆయన చిత్తముకై మొరపెడుదాము. మూర్కుడయినా రాజుకు  భార్య అయినా ఎస్తేరు మీద అతనికి కనికరం ఎలా కలిగింది? అది దేవుని కార్యం కదా? అదే దేవునికి నీ జీవిత భాగస్వామిని మార్చే శక్తి లేదా? ఒకరి నొకరు గౌరవించుకోండి, ప్రేమించండి, క్షమించండి, హెచ్చరించండి! భార్య భర్తలు సమానమంటూ, ఒకరి కోసము ఒకరనుకుంటూ కలిసి విశ్వాసంలో ప్రయాణం చేయండి! 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

19, మే 2022, గురువారం

దేవునికి నమ్మకముగా ఉంటున్నావా?

 

దేవుడు మానవులను ఏర్పరచుకున్నది వారితో వ్యక్తిగతంగా సంభందం కలిగిఉండటానికి అని ఇదివరకు మనం నేర్చుకున్నాం కదా! ఎంత వ్యక్తిగతం అంటే, అయన ఆఖరికి మనకు అంత విలువయినవి కానీ మన తల వెంట్రుకలు సైతం లెక్కించి ఉన్నాడు. మరియు తానూ చేసిన సృష్టిలో మనుష్యులను అత్యంత శ్రేష్ఠమయిన వారిగా పరిగణించాడు (లూకా 12:7). తనను ప్రేమించినవారికి సమస్తము సమకూర్చి వారికి మేలు చేయాలనీ ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు (రోమియులకు 8:28). ఆయనను ప్రేమించటం ఆంటే ఏమిటి? "మన సొంత చిత్తమును వదిలి, అన్నింటికి అయన మీద ఆధారపడాలి. మరియు ప్రతి విషయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి అనగా ప్రతి నిర్ణయము దేవుని అనుమతితో  తీసుకోవాలి"

ఇటువంటి సాన్నిహిత్యము అయన మన నుండి కోరుకుంటున్నాడు. దేవుడు మనకు స్వచిత్తమును అనుగ్రహించాడు కదా! మరి ఎందుకని ఇంతగా మన జీవితంలో తన ఆధిపత్యం కోరుకుంటున్నాడు? ప్రతి మనిషిని దేవుడు ఒక ఉద్దేశ్యముతో సృష్టించాడు, కనుక అయన ఉద్దేశ్యాలు నెరవేర్చాలని దేవుడు మనలను తన విశ్వాసులుగా ఏర్పరచుకుని, ఎంతో విలువయిన రక్షణను మనకు ఇఛ్చి, మనలను తన ఉద్దేశ్యాలు నెరవేర్చులాగున నడిపించాలని ఆశపడుతున్నాడు. కానీ మనము కేవలం రక్షణ పొందుకుంటే చాలు, ఏ కష్టాలు రాకుంటే చాలు, అన్ని అవసరాలు ఎప్పటికప్పుడు తీరిపోతే చాలు అని కుచించిన లేదా స్వార్థ పూరిత  మనస్తత్వంతో ఆలోచిస్తున్నాము. 

దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకమును త్రోసి పుచ్చి, ప్రతి చిన్న, పెద్ద విషయంలో మన స్వార్థంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ దేవుణ్ణి ఎంతగానో భాధిస్తున్నాము, అయన మన మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేక పోతున్నాము. ఉదాహరణకు మనకు ఆకలి లేకపోయినా ఏదయినా తినాలని అనిపిస్తే వెంటనే వెళ్ళి కొనుక్కుని తినేస్తాము! మరియు పెద్దగా అవసరం లేకపోయినా, ఏదయినా ఖరీదయిన వస్తువు కొనాలి అనిపిస్తే డబ్బులు ఉన్నాయి కదా అని వెంటనే వెళ్ళి కొనేస్తాం. ఎందుకంటే మన ఉద్దేశ్యంలో మనం ఎవరిని మోసం చేయటం  లేదు, పైగా అది మన డబ్బు, అంత మన ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకుంటాము అని ఆలోచిస్తాము.  

కానీ దేవుణ్ణి నమ్మిన విశ్వాసులుగా మనము గుర్తించవలసిన విషయము ఏమిటంటే, సృష్టిలో ప్రతిది దేవునికి సంబంధించినదే. మనకు ఉన్న జీవిత కాలం, ఆరోగ్యము, ఆత్మీయ వరములు, సంతానము ఆఖరికి మనకు ఉన్న డబ్బు కూడా ఆయనదే. దానిని అయన మనకు ఎందుకు ఇచ్చాడో, ఏవిధంగా మన ద్వారా వాడలనుకుంటుంన్నాడో మనకు తెలియదు. కేవలం దశమ భాగం ఇచ్చేశాము కదా, ఇదంతా మనదే అన్న ఆలోచన కూడదు. ఆలా అని మనకు ఉన్నదంతా దైవ జనులకు ఇచ్చేయమని కాదు కానీ, దేవుడు ఇచ్చిన ఆ ధనమును నమ్మకంగా ఖర్చు చేయాలి. ప్రతి నిర్ణయానికి ముందు అయన చిత్తమును కనిపెట్టాలి. 

నలుపది దినముల ఉపవాసం తర్వాత, రాళ్ళను రొట్టెలుగా చేసే శక్తి ఉన్నప్పటికి యేసయ్య ఎందుకు తన ఆకలి తీర్చుకోలేదు? తండ్రి చిత్త ప్రకారంగా మనుష్యుడు కేవలం రొట్టె ద్వారా కాకుండా దేవుని నోటి నుండి వచ్చే  ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు అని సాతాను ముందు నిరూపించాడు (మత్తయి 4:4). తద్వారా దేవుడు తనకు ఇచ్చిన అద్భుతాల వరమును తన కోసం ఉపయోగించకుండా, దేవుని మహిమార్థమై వాడుతూ, మనకు పాఠంగా తనను తాను ఉపేక్షించుకున్నాడు. 

అలాగే స్వస్థతలు చేసే విషయంలో కూడా క్రీస్తు దేవుని చిత్తమును పాటించాడు అని చెప్పవచ్చు, ఎందుకంటే బేతెస్థ కొలను దగ్గర ఎంతోమంది రోగులు పడి ఉండగా అయన ఒక్కరిని మాత్రమే స్వస్థపరిచాడు. తన ఇష్ట ప్రకారమే అయితే అక్కడున్న అందరిని స్వస్థ పరచి తన గొప్పను చాటుకునే వాడు. కానీ ప్రతి చిన్న విషయంలో అయన పరిశుద్ధాత్మకు లోబడి నడుచుకున్నాడు కనుకనే దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయనను సంతోష పెట్టాడు. దేవుడు తనను భూమి మీదికి  పంపిన ఉద్దేశ్యమును చివరి వరకు నెరవేర్చాడు.  

దేవుడు మనకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం విషయంలో ఆయనకు నమ్మకంగా ఉండాలి. అయన మనకు ఇస్తున్న ఆయుష్షు కాలము ఎంతవరకు నమ్మకంగా వెచ్చిస్తున్నాము! మనకు ఇచ్చిన సంతానము ఎంతవరకు ఆయనకు దగ్గరగా చెరుస్తూ వారి విషయంలో నమ్మకంగా ఉన్నాము? ప్రతి ఆత్మీయ వరమును ఎంతవరకు అయన నామ ఘనార్థమై వాడుతూ నమ్మకంగా ఉన్నాము. మనకు అయన ఇచ్చిన ఆరోగ్యము ఎంతవరకు నమ్మకంగా అయన కోసం వాడాలని తపన పడుతున్నాము? విశ్వాసం చూపి రక్షణ పొందుకోవటం అనేది ప్రాథమికమయిన విషయము, దాన్ని దాటి ప్రతి విషయంలో నమ్మకముగా జీవించే ప్రయత్నం చేయాలి. 

మత్తయి సువార్త 25: "21. అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను."

ఈ వచనము యేసు క్రీస్తు చెప్పిన పరదేశం వెళ్ళే యజమాని మరియు తలాంతులు పొందిన ముగ్గురు దాసుల ఉపమానంలో చెప్పబడిన సందర్భము. ఇక్కడ మొదటి దాసుడు అయిదు తలాంతులు పొంది మరో అయిదు తలాంతులు సంపాదించెను! మరియు రెండవ వాడు రెండు తలాంతులు పొంది మరో రెండు తలాంతులు సంపాదించెను! అయితే మూడవ వాడు శ్రమించే తత్వం లేక, తన ఇష్టానికి సమయం గడిపి, ఎటువంటి  నమ్మకత్వము చూపకుండా, తానూ పొందిన ఒక్క తలాంతును భూమిలో పాతి పెట్టెను. 

తిరిగి వచ్చిన యజమాని మొదటి దాసుడు సంపాదించిన తలాంతులను బట్టి మెచ్చుకొని "భళా నమ్మకమైన దాసుడా! కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక, నీవు సంపాదించిన తలాంతులు నీవే ఉంచుకొనుము, నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమించెదను" అని చెప్పెను. అదే విధంగా రెండవ దాసునితో కూడా చెప్పేను. మూడవ దాసుణ్ణి అడుగగా వాడు, "నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చు కఠినుడవని ఎరిగి, భయపడి భూమిలో పాతి పెట్టితిని" అనెను. అందుకు యజమాని ఆగ్రహించి "సోమరి అయినా చెడ్డ దాసుడా, నేను కఠినుడనా? నువ్వు నమ్మినట్లే నీకు అవును గాక" అని వాడిని శిక్షించి, పది తలాంతులు ఉన్న మొదటి వాడికి ఆ ఒక్క తలాంతును కూడా ఇచ్చెను. 

మరి మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము? మొదటి ఇద్దరు దాసులా మాదిరి దేవునికి నమ్మకముగా ఉన్నామా? అయన ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి మనం లెక్క అప్పగించాలి అని ఎరిగి ప్రవర్తిస్తున్నామా? కొంచెములో నమ్మకముగా ఉంటేనే దేవుడు మరి కొన్ని ఆశీర్వాదాలు, భాద్యతలు మనకు అప్పగిస్తాడు. ఉదాహరణకు ఒక ఆత్మీయ వరము పొందిన విశ్వాసి నమ్మకముగా, దేవుని నామ ఘనతార్థమై వాడితే, మరొక ఆత్మీయ  వరమును దేవుడు ఆ విశ్వాసికి  అనుగ్రహిస్తాడు. అదే విధంగా, పాతిక వేయిలు సంపాదించే ఉద్యోగం మనకు ఉండి, దాన్ని నమ్మకంగా, అయన చిత్తాను సారముగా ఖర్చు చేస్తే, నలుపది వేయిలు సంపాదించే ఉద్యోగం ఇస్తాడు. 

కానీ మూడవ దాసుని మాదిరి, సోమరిగా ఉంటూ, దేవుడు ఇచ్చిన తలాంతులను పాతి పెట్టటమో లేదా దేవుడు అప్పగించిన భాద్యతలను నెరవేర్చకుండా సమయం వృధా చేస్తూ ఇచ్చిన కొంచెములో నమ్మకత్వం చూపించలేని వారిగా ఉన్నామా? ఆశీర్వాదాలు కలగటం లేదు అని బాధపడే విశ్వాసి, నీకు ఉన్న ఆశీర్వాదాలను ఏలా నమ్మకముగా నిర్వహిస్తున్నావు? 

దేవుడు మనకు ఇచ్చిన రక్షణ కూడా అయన నుండి మనం పొందిన గొప్ప ఆశీర్వాదమే. దానిని ఏ విధముగా నమ్మకముగా నిలుపుకుంటున్నాము అనేది ప్రాముఖ్యతను కలిగి ఉంది. సంఘము అనే వధువు కోసం క్రీస్తు పెండ్లి కుమారునిగా వస్తాడని ఇదివరకు మనం తెలుసుకున్నాము కదా! విశ్వాసులందరు కూడా పెండ్లి కూమార్తెలుగా పరిగణింపబడుతారు. క్రీస్తు చెప్పిన బుద్ధిగల కన్యలు, మరియు బుద్ధిలేని కన్యల ఉపమానము మనకు ఏమి నేర్పుతుంది? బుద్ది గల కన్యలు తమ దీపాలలో తగినంత నూనె ఉండేలా చూసుకున్నారు. కానీ బుద్ధిలేని కన్యలు మధ్యలో నిద్రపోయి, తమ దీపాలలో తగినంత నూనె ఉండేలా చూసుకోలేక పోయారు. కనుక పెండ్లి కుమారుడి చేత "మీరెవరో నేను ఎరుగను" అని తృణీకరింపబడ్డారు (మత్తయి 25:1-12)

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! ఇక్కడ దీపాలలో నూనె పవిత్రతకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మనకు దేవుడు ఇచ్చిన ఉచితమయిన ఆశీర్వాదం రక్షణ. మొదట అందరం బాగానే ప్రారంభం అవుతాము, కాలం గడుస్తున్న కొలది నిర్లక్యం చోటు చేసుకుంటుంది. దేవుడు ఇచ్చిన రక్షణ, ఆశీర్వాదాలు, దీవెనలు విలువ లేనివిగా లేదా అతి సాధారమయినవిగా మారిపోతాయి. అటువంటి స్థితిలో మనము ఉన్నామా? ఇప్పటికి ఆలస్యం జరుగలేదు! కొంచెములో నమ్మకముగా ఉందాము. దేవుడు ఇచ్చిన ప్రతి దీవెన, బాధ్యత మరియు  రక్షణ ఎంతో విలువయినవిగా పరిగణించి, మన పట్ల అయన చిత్తమును నెరవేరుద్దాము! రేపు అయన లెక్క అడిగితె సమాధానం చెప్పలి కదా!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

13, మే 2022, శుక్రవారం

పశ్చాత్తాప పడుతున్నావా?

 

విశ్వాసులయిన మనము దేవుని వాక్యము నమ్మినట్లయితే మనలో పాపం ఉన్నదని గుర్తించిన వారిగా ఉన్నాము. తమలో పాపం లేదని ఎవరయినా అంటే గనుక తమను తాము మోసం చేసుకొంటూ, దేవుణ్ణి అబద్ధికునిగా మారుస్తున్నారు మరియు సత్యమును తమ నుండి దూరం చేసుకుంటున్నారు (1 యోహాను 1:8-10). అసలు పాపం అంటే ఏమిటి? దాని నుండి ఎలా మనం తప్పించుకోవచ్చు అనే విషయాలు మనం ఇదివరకు "పాపం చేతిలో ఓడి విసిగి పోతున్నావా?" అనే అంశములో నేర్చుకున్నాము. 

అయితే మనలో చాల మంది ప్రత్యక్షమయిన లేదా భౌతికమయిన పాపం గురించి మాత్రమే దేవుణ్ణి క్షమాపణ అడుగుతాము. నిజానికి మానసిక మయిన పాపముల గురించి మనం పట్టించుకోము. మరియు వాటి విషయంలో పెద్దగా దేవుని దగ్గర క్షమాపణ అడగము అంటే పశ్చాత్తాప పడము. కానీ మన ప్రభువయినా యేసు క్రీస్తు ఆ పాత నిబంధన అనగా ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞలు అనగా భౌతికమయిన ఆజ్ఞలు అన్ని నెరవేర్చి తన ద్వారా మనకు నూతన నిబంధన అనగా కొత్త ఆజ్ఞలు బోధించాడు. అనగా మానసిక మార్పులు పొందుకొని, ఇది వరకు వచ్చే కోపము, గర్వము, కాముకత్వము, అసూయా వంటి ఎన్నో శరీర క్రియలకు స్వస్తి చెప్పాలి. తద్వారా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ, విశ్వాసములో బలపడుతూ ఉండాలి. 

మన ప్రభువయినా క్రీస్తు దేవుని మహిమను మనకు కనపరచటానికి మనుష్య కుమారునిగా భూమి మీద పాపం లేకుండా బ్రతికి తండ్రి అయినా దేవుని చిత్తమును నెరవేర్చాడు, మనకు మార్గదర్శిగా నిలిచాడు (యోహాను 1:14). అయన నీతిని మనం పొందుకోవాలంటే మనం కూడా ఆయనను వెంబడించాలి. అయన చేసిన ప్రతి బోధను మరియు అయన తత్వమును ఖచ్చితంగా పాటించాలి. ఆ క్రమములో మనలో నిత్యము సంభవించే శరీర క్రియలను బట్టి (గలతీయులు 5:19-21)  పశ్చాత్తాప పడుతూ క్రీస్తులో నూతనపరచబడినమని విశ్వసిస్తూ మన ఆత్మీయ జీవితం కొనసాగించాలి. 

అంతే కాకుండా వాటి మీద విజయం కోసం పరిశుద్దాత్మ దేవుణ్ణి ఆశ్రయించాలి.  నిత్యము పశ్చాత్తాప పడటం అంటే అదేపనిగా మనలను మనం కించపరచుకొవటం కాదు గాని, మనలో సంభవించే శరీర క్రియాలను నిత్యమూ దేవుని ముందు ఒప్పుకుంటూ క్రీస్తు రక్తంలో పరిశుద్దులుగా నూతనపరచుకోవటము అనగా మారుమనసు పొందుకోవటం.  ఈ మారుమనసు పొందుకోవటం అనే ప్రక్రియ క్రైస్తవ విశ్వాస జీవితంలో నిత్యమూ జరుగుతూ ఉండాలి. ఉదాహరణకు బయటకు వెళ్ళి రాగానే కాళ్లు, చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాము, లేదంటే ఏదయినా తినే ముందు చేతులు కడుక్కోటం కదా? మనకు అంటినా మురికి తొలగిపోయి జబ్బులు రాకుండా ఉంటాయని. 

దినదినము పాపము పట్ల అనగా శరీర క్రియల పట్ల మనలో ఏహ్యభావము పెరుగుతూ సున్నితమయిన ఆత్మ జ్ఞానము అలవరచుకోవాలి. తద్వారా మనము పరిశుద్దాత్మ అధీనములో ఉంటాము. అలాగే నిత్యమూ మన ప్రార్థనలో ప్రతి రోజు మనలో సంభవించె పాప క్రియలను బట్టి పశ్చాత్తాప పడటం ద్వారా వాటిని మనం గుర్తెరిగి పరిశుద్దాత్మ శక్తి ద్వారా వాటి మీద విజయం పొందుకుంటాము. ఆ విధంగా ఒక్కొక్క శరీర క్రియా మీద విజయం పొందుతూ విశ్వాసంలో ఎదగాలి. నిత్యమూ పశ్చత్తాప పడకుండా లేదా మారుమనసు లేని విశ్వాసము ద్వారా ఏ విధమయిన ఫలములు  మనము పొందుకోలేము. 

బాప్తిస్మము ఇచ్చు యోహాను ఆనాడు ప్రజలతో ఏమని సువార్త చెప్పి వారిని పశ్చాత్తాపానికి అనగా  మారు మనసుకు  సిద్దపరిచాడు?

లూకా 3: "8. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రా హామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను."

ఇక్కడ యోహాను "మారు మనసు పొందిన వారు మాత్రమే ఫలములు పొందుకుంటారు" అంటున్నాడు. అయితే ఆనాటి ప్రజలు ఇంకా మోషే ధర్మ శాస్త్రము ద్వారానే నీతి మంతులుగా తీర్చబడుతాము అని నమ్ముతున్నారు కనుకనే ఆ విశ్వాసం ద్వారా తాము అబ్రాహాము సంతానం అని తమకెందుకు మరల ఈ బాప్తిస్మసం మరియు మారుమనసు అని గర్వపడుతూ యోహానును ప్రశ్నించారు. అప్పుడు యోహాను "అబ్రాహాము సంతానం అయినంత మాత్రాన మీకు మినహాయింపు లేదు! దేవుడు తలచుకుంటే రాళ్ళ ద్వారా కూడా అబ్రాహాముకు సంతానం పుట్టించగలడు" అని గద్దించాడు.  

ఆ ప్రజలు యేసు క్రీస్తు వచ్చింది మోషే ధర్మ శాస్త్రమును నెరవేర్చి తన ద్వారా నీతిని స్థాపించి నూతన నిబంధన చెయ్యబోతున్నాడని ఎరుగరు. కనుకనే యోహాను క్రీస్తును గురించి ముందుగా సాక్ష్యం ఇస్తూ, ఈ సువార్తను చాటుతూ బాప్తీస్మం ఇస్తున్నాడు. ఆనాటి ప్రజల మాదిరి ఈనాటి విశ్వాసులు కూడా తమ సంఘములను బట్టి, బైబిల్ జ్ఞానమును బట్టి తమకు ఉన్న వివిధ రకాల ఆత్మీయ వరములను బట్టి గర్వపడుతూ తమలో పాపం గుర్తించని వారిగా ఉన్నారు. 

మరియు ఎదుటి వారిని దూషిస్తూ, వారికి తీర్పు తీరుస్తూ, శరీర క్రియలను విచ్చలవిడిగా జరిగిస్తూ, దేవుని కృప ఉంది అని పశ్చాత్తాపమును అనగా మారుమనసును నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు క్రీస్తు చెప్పిన సుంకరి మరియు పరిసయ్యుని ప్రార్థన ఉపమానం గుర్తుందా? (లూకా 18: 9-14)  ఆ ఇద్దరిలో పరిసయ్యుడు తానె నీతిమంతుడనని అనగా తనలో ఏ పాపం లేదని ప్రార్థించి వేషధారిగా మిగిలిపోయాడు, కానీ సుంకరి మాత్రం పాపినని ఒప్పుకొని నీతిమంతునిగా ఫలం పొందుకున్నాడు. 

యేసు క్రీస్తు చెప్పిన లాజరు మరియు ధనవంతుని సంఘటనలో ధనవంతుడు మారు మనసు పొందుకోకపోవటం ద్వారా పాతాళములో నరకయాతన పడుతున్నాడు. కేవలం తానూ అబ్రాహాము సంతానము అని గర్వపడి అనగా తన స్వనీతిని బట్టి నశించి పోయాడు. ఇప్పుడు అబ్రాహాముతో "తన సహోదరులకు సువార్త చెప్పి వారు మారు మనసు పొందులాగా మృతులలో నుండి లేచిన ఒకరు వెళ్ళుట ద్వారా వారు మారు మనసు పొందుదురని లాజరును పంపమని" వేడుకుంటున్నాడు. 

దానికి అబ్రాహాము "మోషే మొదలగు ప్రవక్తలు చెప్పిన నమ్మని వారు మృతులలో నుండి లేచిన వాని మాటలు విని మారు మనసు పొందారని" అన్నాడు (లూకా 16:19-31). మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నామని గుర్తించాలి! పశ్చాత్తాపము, మరియు మారు మనసు గురించి దేవుని వాక్యము ఎన్నో మారులు మనలను హెచ్చరిస్తుంది. వాటిని పాటిస్తూ మన పాపములను గురించి పశ్చాత్తాప పడుతున్నామా? 

చాల మంది విశ్వాసులు దేవుని కృప ఉంది, క్రీస్తు రక్తం పరిశుద్ధ పరుస్తుంది కదా అని, బుద్ది పూర్వకంగా పాపం చేస్తూ క్షమించు ప్రభువా అనుకోవటం పశ్చాత్తాప పడటం మరియు మారు మనసు పొందుకోవటం కాదు. ప్రతి హృదయ తలంపులను ఎరిగిన దేవుడు మన స్థితిని, ఉద్దేశ్యాలను కూడా ఎరిగి ఉన్నాడు. "ఒక్కసారి అనుభవ పూర్వకముగా నీతి మార్గము తెలుసుకొని, తమ రక్షణకు కారణమయిన క్రీస్తు ఆజ్ఞలను మీరటం కంటే, వాటిని తెలుసుకోక పోవటమే మేలు" (2 పేతురు 2:22)  అని దేవుని వాక్యం స్పష్టంగా చెపుతోంది. పశ్చాత్తాప పడటం ద్వారా మనలో పాపం మనకు స్పష్టంగా కనపడుతుంది తద్వారా దేవుని ముందు వేషధారలుగా ఉండకుండా అయన కృపను మరింతగా పొందుకుంటాము. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! బాప్తిస్మము ఇచ్చు యోహాను ద్వారా ప్రజలకు చెప్పబడిన దేవుని రాజ్యము యొక్క సువార్త క్రీస్తు ద్వారా మరింతగా విస్తృత పరచబడింది. కనుక పశ్చాత్తాపము మరియు మారు మనసు అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. యేసయ్య మనలను తన స్వరూపంలోకి మార్చటానికి మనకు ఆజ్ఞలు ఇచ్చి, సహాయంగా పరిశుద్దాత్మ శక్తిని ఇచ్చాడు. కాబట్టి అయన ఆజ్ఞలు పాటిస్తూ, పడిపోతే పశ్చాత్తాప పడుతూ మారు మనసు పొందుకుందాము. 

అపొస్తలుల కార్యములు 17: "30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించు చున్నాడు."

పరిశుద్దాత్మ ద్వారా రాయబడిన ఈ వచనము ఏమని చెపుతుంది? క్రీస్తును  ఎరుగని అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు కానీ ఒక్కసారి క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ ఆజ్ఞలు పాటించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లేదంటే మన విశ్వాసము క్రియలు లేని విశ్వాసముగా మిగిలి ఏ విధమయిన ఫలములు మనం పొందుకోలేము. క్రీస్తులో ఫలించటం అంటే అయన ఆజ్ఞలు అన్ని పాటించటమే కదా! అందులో ముఖ్యమయినది పశ్చాత్తాప పడటం అనగా మారు మనసు పొందుకోవటం. కనుక పాటించి ఫలములు పొందుదాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! 

6, మే 2022, శుక్రవారం

ఎటువంటి సంఘములో ఉన్నావు?

 

క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము, నమ్మేది ఏమిటంటే క్రీస్తు తన రెండవ రాకడలో వధువు సంఘము కోసం పెళ్ళి కూమారునిగా వస్తాడని. మరియు ప్రతి వాని క్రియల చొప్పున తన తీర్పు తిర్పబోతున్నాడు అని కూడా విశ్వసిస్తాము. విశ్వాసులుగా మన జీవితంలో సంఘము యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలు పాటించటానికి సరయిన బోధకుడు ఎంతయినా అవసరము. మరియు ఒకరి నొకరు ప్రోత్సహించుకొనే వాతావరణం చాల ముఖ్యమయినదిగా దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. 

మనము నిత్యమూ క్రీస్తు మీద విశ్వాసముతో  వెలుగుతూ ఉండాలి, మనము నులివెచ్చగా ఉన్నట్లయితే దేవుడు మనలను అంగీకరించడని దేవుని వాక్యం సెలవిస్తోంది (ప్రకటన 3:16). అంటే నిత్యమూ మనలో ఆత్మీయ పరమయిన మంట రగులుతూ ఉండాలి. సంఘము ఆ విషయంలో మనకు సహాయ పడుతుంది. ఒంటరిగా మండే కొరివి కాస్త గాలి వీచగానే చల్లారిపోతుంది. కానీ నిప్పుల కుంపటిలో ఉన్న కొరివి గాలి వీచిన కూడా మండుతూనే ఉంటుంది. విశ్వాసి జీవితం కూడా అటువంటిదే. ఒంటరిగా ఉంటె శోధనలకు  చల్లారి పోయే అవకాశం ఉంది. 

అంతే కాకుండా ఇనుము ఇనుమును సాన బెట్టినట్లుగా, ఒక ఆత్మీయ స్నేహితుడు మరొక ఆత్మీయుణ్ణి బలపరుస్తాడు (సామెతలు 27:17).  ఆ విధముగా సంఘములో ఉండే విశ్వాసులు వారి సాక్ష్యములు పంచుకోవటం ద్వారా, మరియు ప్రోత్సాహకారమయిన పలుకుల ద్వారా ఇతర విశ్వాసులను ఆత్మీయంగా బలపరుస్తారు. తద్వారా సంఘము క్రీస్తు వెలుగులో ఎదుగుతుంది, అందును బట్టి సంఘ సభ్యులు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభువు రాకడకై వధువు సంఘముగా సిద్ధపడుతారు. 

1 థెస్సలొనీకయులకు 5: "11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకని నొకడు ఆదరించి యొకని కొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి."

పౌలు గారు థెస్సలొనీకయులకు రాసిన మొదటి పత్రికలో ఈ వచనములు ఏమని చెపుతున్నాయి! "మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగా ఒకరి నొకరు ఆదరించి ఒకరి నొకరు క్షేమాభివృద్ది కలుగ జేయుడి" అని. క్షేమాభివృద్ధి అంటే ఎదుటి వారిని  ఆర్థికపరంగా బలపరచుమనో లేక మరో రకంగా వారిని ఉద్దరించమనో కాదు గాని ఆత్మీయంగా అభివృద్ధి పరచుకోవాలి. ఒకవేళ ఆర్థిక పరమయిన కష్ట నష్టాలూ వచ్చి ఏదయినా కుటుంబం ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవటం చేయాలి. ఎందుకంటే పౌలు గారు చందాలు వసూలు చేసి పేద సంఘాలకు పంపినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. 

అయితే ముఖ్యముగా వారిని ఆత్మీయంగా బలపరిచేలా సంఘ సభ్యుల ప్రవర్తన ఉండాలి. ఎదుటి వారిని నొప్పించకుండా, వారి విశ్వాసమును దెబ్బతీయకుండా క్రీస్తు ప్రేమను పంచుతూ ఉండాలి. ఒక్కరి భాధలలో ఒకరు విశ్వాసముతో ప్రార్థించాలి. ఎందుకంటే సంఘము అనగా  క్రీస్తు దేహము ఆ దేహములో మనమందరము భాగములుగా ఉన్నాము (1 కొరింథీయులకు 12:12).  ఒక భాగము బాధపడితే మరో భాగము ఎలాగయితే సంతోషపడదో, అటువంటి సానుభూతి పరులుగా సంఘ సభ్యులంతా నడుచుకోవాలి. 

మనం  వెళ్తున్న సంఘము దేవుని వాక్యాను సారముగా నడచుకొంటుందా? లేక లోకపరమయిన డంబికాలు ప్రదర్శిస్తూ దేవుని వాక్యమునకు విరుద్ధంగా నడుస్తోందా? ఈ విషయాలు మనం ఖచ్చితంగా దేవుని వాక్యముతో సరి చూసుకోవాలి. 

1 పేతురు 3: "8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణా చిత్తులును, వినయ మనస్కులునై యుండుడి."

క్రీస్తు సంఘ సభ్యులకు ఉండవలసిన లక్షణాలను పేతురుగారు పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. సంఘము లో సభ్యులు ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తు ఎక్కడ ఇద్దరు, ముగ్గురు నా నామములో కూడితే వారి మధ్య నేను ఉంటాన్నన్నాడు కదా! మరి ఇంత మంది ఒక్కటిగా కూడితే వారి మధ్య ఖచ్చితంగా ఉంటాడు అనుకోవద్దు! యేసయ్య చెప్పింది కేవలం ఒక్కటిగా కూడు కోవటం గురించి మాత్రమే కాదు గాని ఏక మనస్కులై తనను ప్రార్థించే వారి మధ్యనే అయన ఉంటాడు. 

ఆ విధంగా సంఘములో ఐక్యత లోపిస్తే అక్కడ యేసయ్య లేనట్లేనని గుర్తించాలి. కాబట్టి సంఘము యొక్క బలగమును బట్టి కాక వారి మధ్య ఐక్యత ఎంతవరకు ఉందన్న విషయం పరిగణలోకి తీసుకోవాలి.  ఎదుటి వారి కష్టాలకు వారు ఏలా స్పందిస్తున్నారు! సంఘములో అవసరాలకు అనగా సభ్యుల అవసరాలకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారు, వారి కష్టాలలో పాలి భాగస్తులుగా ఉంటున్నారా అనగా  చేతనయినా ఆర్థిక సహాయము మరియు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ వారిని విశ్వాసములో బలపరుస్తున్నారా? లేక చిన్న చూపు చూస్తున్నారా? దానిని బట్టి సంఘము యొక్క ఆత్మీయ స్థితిని గుర్తించాలి. 

మరియు సంఘ సభ్యులు  సహోదర ప్రేమ కలిగి, కరుణ చూపే వారుగా ఉన్నారా లేక పక్షపాతలు చూపుతూ వివక్షలు పాటిస్తున్నారా? మరియు వారు వినయ మనసు కలవారుగా ఉన్నారా లేక తమ సంపదలను, ఆత్మీయ వరములను ప్రదర్శిస్తూ డంబికంగా ప్రవర్తిస్తున్నారా? వాక్యాను సారముగా నడుచుకొని సంఘము విశ్వాసులను శోధించి వారిని క్రీస్తులో వెనుకపడేలా చేస్తుంది.  అయితే ఎవరో ఒక్కరు ఇద్దరు పల్లేరు కాయలు ఉండవచ్చు కానీ అధిక సభ్యుల ప్రవర్తన వాక్యాను సారమయిన ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి సంఘములో ఉండటం దేవుని చిత్తము మరియు ఆశీర్వాదకరము. 

అయితే దేవుడు కొన్నిసార్లు శోధించే సంఘములో మనలను కొసాగించుట ద్వారా, మనలను దీనులుగా చేసి అనగా అయన మీద ఆధారపడే వారిగా మార్చి తనకు మరింత దగ్గర చేసుకుంటాడు. అటువంటి అవకాశమును వదులు కోకుండా దేవుని చిత్తను సారముగా ఆ సంఘములోనే కొనసాగాలి. ఆ విషయంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఎదో ఒక రకంగా మనతో మాట్లాడటం జరుగుతుంది. కొలిమిలో కాల్చబడిన బంగారం శుద్ధి అయి విలువ పెంచుకున్నట్లుగా, ఇటువంటి సంఘములో కొనసాగించుట ద్వారా దేవుడు మనలను బలపరుస్తాడు. తద్వారా తన పనిలో మనలను మరింతగా వాడుకోబోతున్నాడు అని మనకు తెలిసిపోతుంది.  ఆలా కానీ పక్షములో మనం ఉంటున్న సంఘం యొక్క స్థితిని గుర్తించి కొనసాగాలి. 

సంఘ సభ్యులతో పాటు, సంఘ కాపరి మరియు పెద్దల ప్రవర్తనను కూడా వాక్యముతో సరి చూడాలి. తీర్పు తీర్చటానికి కాకుండా మనకు బోధించే వారు ఏమి బోధిస్తున్నారు అని  ఖచ్చితంగా వాక్యంతో పరిశిలించాలి మరియు పరిశోధించాలి. అపొస్తలులయిన పౌలు, సీలయు బోధిస్తుంటే సంఘములో విశ్వాసులు ప్రతి దినము లేఖనములు పరిశోధించారు అని దేవుని వాక్యములో రాయబడింది (అపొస్తలుల కార్యములు 17:11). అయితే నేటి విశ్వాసుల ధోరణి కాపరుల విషయంలో పూర్తీ భిన్నంగా ఉంది. "బైబిల్ ఎం చెప్పిన మాకు అవసరం లేదు, మా అయ్యా గారు ఏమి చేపితే దాన్ని పాటిస్తాం" అని వెర్రి అభిమానం చూపిస్తున్నారు. 

ఈ కాపరులు  యేసయ్య చెప్పిన మాటలకు విపరీత అర్థాలు చెపుతూ విశ్వాసులను చల్లారుస్తున్నారు. దేవుని వాక్యంలో లేని అంశాలను కలుపుతూ సంఘమును తప్పు దారి పట్టిస్తున్నారు. "మోహపు చూపే వ్యభిచారం" అని యేసయ్య చెపితే, "చూస్తేనే  పాపం కాదు" అని బోధిస్తున్నారు. "నీ కంటితో పాపం చేస్తే దాన్ని పెరికి వేయు" అని క్రీస్తు చెపితే "మనకు కృప ఉంది, దేవుడు క్షమిస్తాడు" అని విపరీత బోధలు చేస్తున్నారు. "స్త్రీ చక్కదనమును నీ హృదయములో ఆశ పడకుము" అని (సామెతలు 6:25)  దేవుని వాక్యం చెపుతుంటే,  ఆఖరికి చెడు తలంపులు  పాపం కాదని చెపుతూ యువతను తప్పు దారి పట్టిస్తూ సాతానుకు అప్పగిస్తున్నారు. 

ఇటువంటి బోధలు ఎందుకు జరుగుతున్నాయి? పరిశుద్దాత్మ లేని చోట మనుష్యుల జ్ఞానము ఇటువంటి విపరీత అర్థాలు తీస్తుంది. దేవుడు ఆత్మ సంబంధమయిన ఈ విషయాలను కేవలం తన మీద ఆధారపడిన వారికి అనగా పరిశుద్ధాత్మను పొందుకొనే వారికీ మాత్రమే బయలు పరుస్తాడు కానీ, "అంత నేనే, నాదే పెద్ద సంఘం, నన్ను మించిన వారు లేరు, నేను ఎన్ని సంఘాలు కట్టాను" అని విర్రవీగే వారికి మాత్రం కాదు. ఒకప్పుడు వారు గొప్పగా ప్రారంభం అయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారి స్థితి ఏలా ఉంది? గుర్తెరిగి ఆ సంఘములో కొనసాగండి. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! అననీయ మరియు అతని భార్య సప్పీరా ఒక చిన్న అబద్దం ఆడినందుకే చనిపోయారు అని దేవుని వాక్యములో రాసి ఉంది (అపొస్తలుల కార్యములు 5:3). అంటువంటి అబద్దాలు అంతకు ముందు ఎంతోమంది ఆడి ఉన్నారు, ఆ తర్వాత కూడా అబద్దాలు ఆడుతూనే ఉన్నారు. కానీ వారు మాత్రమే ఎందుకు చనిపోయారు? అననీయ చనిపోయిన తర్వాత అతని భార్య  సప్పీరాతో పేతురు "ప్రభువు ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి" అన్నాడు (అపొస్తలుల కార్యములు 5:9)

ఇక్కడ మనకు ఏమి అర్థం అవుతుంది? పెంతికోస్తు దినము నుండి సంఘం అంత పరిశుద్దాత్మతో  నిండి ఉంది, కనుకనే ఎంతో మంది మారుమనస్సు పొందుకున్నారు. అటువంటి పరిశుద్ధమయిన సంఘములో అబద్దం కూడా ఘోర పాపంతో సమానం, కనుక వారు చనిపోయారు. కాబట్టి క్రీస్తులో మీరు ఎదుగుతూ, అయన స్వరూపంలోకి మారాలంటే, దయచేసి పరిశుద్దాత్మ నిండిన సంఘములో కొనసాగండి! అది ఎలా తెలుస్తుంది? పైన చెప్పుకున్న లక్షణాలతో పాటు, ఆత్మ ఫలములు మెండుగా ఫలించే సభ్యులు ఉన్న సంఘము (గలతీయులకు 5:22)  అని వాక్యం ద్వారా మనకు అవగతమవుతుంది. 

ఇటువంటి సంఘంలో కొనసాగటం కొత్త విశ్వాసులకు మొదట్లో కష్టంగా ఉండవచ్చు, కానీ దేవుడు మనలను వదిలి పెట్టడు, తన పరిశుద్దాత్మ ద్వారా కృప ఇస్తూ ఎదిగిస్తాడు. అంతే కానీ "ఈ సంఘంలో కొన్ని లోకరీతులు పాటించవచ్చు, అయ్యగారి సంఘం ఎంతో పెద్దది, అయ్యగారు ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో పాటలు రాశారు" అని మాత్రం వెళ్ళకండి. వారిని దేవుడు తన రెండవ రాకడలో "మీరెవరో నేను ఎరుగను" అని ఖచ్చితంగా అంటాడు (మత్తయి 7:22-23), మనలను కూడా అనకుండా జాగ్రత్త పడుదాం!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !!