క్రీస్తునందు విశ్వాసులుగా అయిన తర్వాత, మన పోషణ, అవసరములు మరియు అక్కరలు అన్ని తీర్చువాడు ఆయనేనని విశ్వాసములో కొసాగుతాము. ఎందుకంటే, యేసు క్రీస్తు ప్రభువుల వారు పలు సందర్బాలలో చెప్పిన మాటలు "దేనిని గురించి చింతపడకుడి, రేపటిని గురించి విచారించకుడి" అని. దావీదు తను రాసిన కీర్తనలో ఏమంటున్నాడు "సింహపు పిల్లలు ఆకలితో అలమటించు నెమో గాని, దేవుణ్ణి నమ్ముకొన్న వారికీ ఏదియు కొదువ ఉండబోదు" అని (కీర్తనలు 34:10-12). అలాగే అయన రాసిన 23 వ కీర్తన మొదటి వచనములో "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు" అని ఉంది. ఈ విధంగా దేవుని వాక్యము నిత్యమూ మనలను ఆదరిస్తూ, ధైర్యము నింపుతూ ఉంటుంది.
నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలు జనమును ఐగుప్తు లో నుండి విడిపించి, కనాను దేశమునకు నడిపినప్పుడు, అరణ్యములో, ఎడారులలో వారిని పోషించిన విధము ఎంతో అద్భుతము, మనకు అంతే ప్రోత్సాహకరము. దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు ఎంత ప్రాముఖ్యం కలవారో మనం కూడా అంతే ప్రాముఖ్యం కలవారము. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము కూడా అబ్రాహాము సంతానముగా పిలువబడుచున్నాము. అనగా ఇశ్రాయేలు జనమునకు దేవుడిగా ఉన్న సృష్టి కర్త, వారి పోషకుడు మనకు కూడా దేవుడిగా, పోషకుడిగా ఉన్నాడు (గలతీయులకు 3:29).
ఇశ్రాయేలు వారిని దేవుడు ఐగుప్తులో దాస్యం నుండి విడిపించి, తాను చెప్పిన వాగ్దాన భూమికి వారిని నడిపిస్తున్నపుడు అంత వరకు దేవుడు చేసిన గొప్ప కార్యములు వారు మరచిపోయారు. ఐగుప్తు వారికి వచ్చిన తెగుళ్ల నుండి వారి పక్కనే ఉన్న తమను దేవుడు ఏలా కాపాడింది పూర్తిగా విస్మరించారు. అంతే కాకుండా ఫరో సైన్యం తమను తరుముతుంటే, వారి కనుల యెదుట మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా చీలిన అద్బుతమును చూసి కూడా వారు కేవలం కొంత సమయం ఓర్పు వహించలేక దేవుని పై విశ్వాసం కోల్పోయారు, నిత్యమూ సణుగుకున్నారు. దాస్యం నుండి విడిపించిన గొప్ప దేవుడు తమను పోషించలేడని వారు అనుకోవటం ఎంత వరకు న్యాయము?
మత్తయి సువార్త 6: "26. ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?"
యేసు క్రీస్తు ప్రభువుల వారు తన బోధనలలో ఎన్నో మార్లు మన పట్ల దేవుని కి ఉన్న ప్రేమను బోధించారు. సృష్టి కర్త అయినా దేవుడు ఆఖరికి ఆకాశ పక్షులను సైతం పోషిస్తున్నాడు, అటువంటిది వాటి కంటే ఎన్నో రేట్లు శ్రేష్ఠమయిన మనలను పోషించ వెనుకాడునా? రేపును గురించి చింత వలదని యేసయ్య చెపుతున్న మాటలు నిజమని మనం నమ్మితే దేనికి చింతపడక మన పనులు మనం చేసుకుంటూ పోవటమే మన విశ్వాసము. అయినా కూడా నేను చింతపడుతాను, ఓర్పులేకుండా దేవుని మీద సణుగుకుంటాను అంటే, యేసయ్య మాటలు నమ్మటం లేదని, దేవుని శక్తిని శంకిస్తున్నావని అర్థం.
బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు. యాకోబు కుమారుడయినా యోసేపునే తీసుకోండి, సొంత అన్నలు బానిసగా అమ్మేసారు అయినా కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. యజమానురాలు తన మీద మనసు పడితే దేవుని మీద ఉన్న భయంతో పాపం చెయ్యలేదు. మనలాగా ఆయనకు బైబిల్ కూడా అందుబాటులో లేదు, కేవలం తన తండ్రి చెప్పిన సాక్ష్యములు తప్ప. చివరికి నిందల పాలయి జైలులో గడపవలసిన పరిస్థితి, అయినా అతను ఎక్కడ కూడా దేవుని మీద సణిగినట్లు చెప్పబడలేదు. ఆ శ్రమలలో దేవుడు నిత్యము అతనికి తోడుగా ఉన్నడు అని దేవుని వాక్యము చెపుతుంది. ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు? దేవుడంటే ఆయనకు భయం ఉంది, అయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంది. దేవుని కార్యములు గంభీరములు, అయన ప్రణాళికలు ఎన్నో సంవత్సరముల ముందు చూపు కలిగి ఉంటాయి.
కీర్తనలు 105: "16. దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. 17. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. 18. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. 19. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను."
దేశముల మీదికి భయంకరమయిన కరువు రాబొవుతుంది గనుక అబ్రాహాము సంతతిని కాపాడటానికి దేవుడు యోసేపును ముందుగా ఐగుప్తులోకి బానిసగా పంపాడు. తర్వాత అతను యజమాని పోతీఫరు వద్ద ఎన్నో యాజమాన్య పద్ధతులు నేర్చుకున్నాడు. అటుపైన జైలులో ఖైదీగా ఉన్నపుడు దేవుడు తనకు ఇచ్చిన కలలు వివరించే వరం ద్వారా ఇతర ఖైదీలకు వారి కలలను వివరించాడు. దేవుడు రాజుకు కలను ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు వివరించలేనప్పుడు, యోసేపు వివరించిన కల నిజమయి రాజు కొలువులో ఉన్న పూర్వపు ఖైదీ యోసేపు గురించి చెప్పటం, రాజు అతన్ని పిలిచి కల వివరణ విన్న తర్వాత దేశానికి ప్రధాన మంత్రిని చేయటం, తద్వారా తన సోదరులను, తండ్రిని కలుసుకోని వారిని కరువునుండి కాపాడటం అన్ని దేవుని కార్యములే.
దేవుని వాగ్దానాలు నెరవేరు వరకు అయన వాక్కు యోసేపును పరిశోదించు చుండెను అని రాసి ఉంది. అయన వాక్కు మనలను కూడా పరిశోధిస్తుంది, కనుక ఆ పరిశోధనలో నెగ్గుద్దాం. కానీ యోసేపు తర్వాత వచ్చిన మరో తరం అబ్రాహాము సంతతి వారయినా ఇశ్రాయేలీయులు మిక్కిలి విశ్వాసం లేని వారిగా, సణుగు కొంటూ దేవుని ఆగ్రహానికి లోనయిన వారిగా చూస్తాము. ఇశ్రాయేలీయులు తనను రాళ్లతో కొట్టి చంపివేస్తారేమో అని మోషే దేవుడికి మొఱ్ఱ పెట్టినంత తీవ్రముగా వారి సణుగుడు ఉండింది.
నిర్గమకాండము 16: "7. యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి. "
ఇశ్రాయేలు వారి సణుగుడు దేవుడు విన్నడు. వారి ఓర్పులేని తనమును దేవుడు సహించాడు. తమను దాస్యము నుండి, నరక యాతన నుండి విడిపించిన దేవుని గొప్ప కార్యమును మరచి కొద్దీ సేపు కలిగిన దాహమును బట్టి ఆ దాస్యములో ఉంటేనె మంచిది అని మాట్లాడుతున్నారు. అటువంటి ప్రవర్తన మనలో ఉందా? అయితే దేవుడు మన సణుగుడు వింటున్నాడు. అయన చేసిన గొప్ప కార్యములను మరచినందుకు బాధపడుతున్నాడు. మన సణుగుడును బట్టి అయన హస్తము మననుండి తొలగిపోక ముందే ఆయనను మన్నించమని వేడుకుందాం. ఇశ్రాయేలు జనము సణుగుడును బట్టి మోషే ఎన్నో మారులు దేవునికి మొఱ్ఱ పెట్టాడు, క్షమాపణ వేడుకున్నాడు, అందును బట్టి దేవుడు వారిని క్షమించాడు.
సంఖ్యాకాండము 21: "5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్య మైనదనిరి. 6. అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి."
ఇశ్రాయేలు వారి సణుగుడును బట్టి దేవుడు ఆగ్రహించి వారి మీదికి సర్పములు రప్పించాడు. మోషే ప్రార్థించగా సర్పము ప్రతిమను చేయించమని దాన్ని చూసిన వారినందరిని రక్షించాడు. ఇక్కడ సర్పము ప్రతిమ యేసయ్యకు ప్రతి రూపముగా ఉన్నదని భావించవచ్చు. మనకు అంతటి ఘోర శిక్ష కలుగ పోవటానికి కారణం! యేసయ్య మన పాపములు అన్ని సిలువలో భరించాడు, మరియు ఇశ్రాయేలు జనమునకు ఉన్న ప్రత్యక్షత మనకు లేదు. కానీ దేవుని ప్రత్యక్షత మనకు పెరుగుతున్న కొలది మన ఆత్మీయ స్థాయిని కూడా పెంచుకుంటూ పోవాలి. అనగా మనం విశ్వాసములో బలపడుతూ సాగిపోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారికి అయన చిత్తము చొప్పున సమస్తము సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తోంది (రోమీయులకు 8:28).
అంతే కాకుండా దేవుడు మన శక్తిని మించిన శోధన మన మీదికి రప్పించడు. కనుక దేవుని మీద సణగటం మాని, ఎడతెగక ప్రార్థించి అయన చిత్తము తెలుసుకొని, అయన మీద భారం వేసి సాగిపోవటమే మన విశ్వాసము. ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లుగా మనం ఇశ్రాయేలు వంటి వారమే, వారిని పోషించిన దేవుడు మనలను కూడా పోషించగలడు. వారిని నశింప చేసిన దేవుడు మనలను కూడా నశింపజేయగలడు. ఆనాటి ఇశ్రాయేలీయులు క్రీస్తు అనే బండలో నుండి నీరు తాగిన వారు కానీ దేవునికి ఇష్టమయిన వారుగా ఉండక సంహరింపబడ్డారు. సణుగుకొని విష సర్పముల చేత కరువబడి నశించి పోయారు (1 కొరింథీయులకు 10: 9). ఈ హెచ్చరికలు మన హృదయములలో ఉంచుకొని ఇకనయినా సణుగుట అప్పేద్దాం.
1 కొరింథీయులకు 10: "13. సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును."
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు కార్యములు ఆలస్యం చేస్తున్నాడని భావించవద్దు, ఇంకా ఎంత కాలం అని ప్రశ్నించవద్దు. నీ అవసరములు, అక్కరలు ఆయన ఎరిగి ఉన్నాడు. అయన ప్రణాళికలు బయలు పడితే గాని అర్థం కావు. ఆ ఆలస్యంలో ఎదో మంచి దాగి ఉంది, తన నామము నీ ద్వారా మహిమపరచుకుంటున్నాడు. అందును బట్టి ఆయనకు స్తోత్రము. కానీ ఇంకా నా వల్ల కాదు అంటే, దేవుడు నిన్ను పరిశోదించటాన్ని తప్పు పడుతున్నావా? అయన నువ్వు తట్టుకోలేని శోధన ఇవ్వడు అన్న మాటను నమ్మటం లేదా? దేవుడు ప్రతి వాగ్దానము నెరవేర్చు సమర్థుడు, అయన రాయించిన ప్రతి మాట సత్యము. సణుగుట మాని ప్రార్థించటం అలవాటు చేసుకుందాం, అయన చిత్తమును కనిపెట్టి నడుచుకుందాం.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!