పేజీలు

27, జనవరి 2024, శనివారం

దేవునితో లావాదేవీలు!చాల మంది క్రైస్తవ విశ్వాసులు పూర్వపు ధర్మము యొక్క అలవాట్లను, ఆచారాలను బట్టి దేవునికి మొక్కులు వాగ్దనాలు చేస్తారు. ఇతర ధర్మాలలో చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే, "దేవుడా! నీవు ఫలానా మేలు చేస్తే, నేను ఫలానా మొక్కు నీకు తీర్చుకుంటాను" అని వాగ్దానాలు చేయటం. కానీ భూమ్యాకాశములకు అధిపతి, సర్వ సృష్టి కారకుడయినా మన దేవుడు, మన నుండి ఎటువంటి మేలులు, మొక్కు బడులు ఆశించటం లేదు. సర్వము సృష్టించిన దేవునికి, చివరకు మనలను కూడా సృష్టించిన ఆయనకు మన మొక్కు బడులు ఏపాటివి? మనం ఏదయినా యిస్తే గాని మనకు  మేలులు చేయలేని స్వభావం దేవునికి ఉంటుందా? తల్లి తండ్రులుగా మన పిల్లలు మనకు మేలు చేస్తేనే వారికి మంచి చేస్తామా? లేక వారికి నిత్యము మేలులు చేసేవారిగా ఉంటామా? 

మన దేవుడు చెపుతున్న మాట ఏమిటంటే, "నీతి మంతుడి మీద మరియు అనీతి మంతుడి మీద సమానంగా వర్షం కురిపిస్తానని, సమానముగా వారి అవసరాలు తీరుస్తానని" (మత్తయి 5:45).  అసలు దేవుని యొక్క  లక్షణమే అది. అన్యాయము చేయని వాడు, నిత్యమూ నీతిని జరిగించు వాడు. కానీ కొందరు స్వార్థ పూరిత ఆలోచనలతో, తమ బ్రతుకు తెరువు కోసం, దేవునికి ఇవ్వండి, మీకు రెండతలుగా, పదింతలుగా తిరిగి ఇస్తాడు అని మభ్యపెడుతూ, ప్రజలను దోచుకుంటున్నారు. దేవుణ్ణి చేతకాని వానిగా, మనం ఇస్తేగాని అవసరాలు తీర్చుకోలేని వాడిగా ప్రదర్శిస్తున్నారు. తన కార్యములు జరిగించటానికి  అన్యులను సైతం దేవుడు వాడుకున్నాడు అని బైబిల్ నందు ఎన్నో సంఘటనలు మనం చూడవచ్చు. 

పాత నిబంధన ప్రకారం, ఆనాటి ప్రజలు, తమ పాపముల పరిహార్థం బలులు అర్పించే వారు. మరియు, దేవునికి  మొక్కుబడులు చెల్లించే వారు. ఆ ప్రకారం కొన్ని సార్లు ప్రజలు దేవుని సన్నిధి యందు, మొక్కు బడులు వాగ్దానం చేసేవారు. ఉదాహరణకు సమూయేలు తల్లి అయిన, హన్నా సంతానం లేక అవమానాలు పడుతూ, దేవుని సన్నిధిలో ఎంతో దినముగా ప్రార్థించి, తనకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే, అతణ్ణి అయన సేవకు అర్పిస్తానని మొక్కుకుంది. దేవుడు ఆమెకు గొప్ప ప్రవక్త అయిన సమూయేలను మగ బిడ్డను అనుగ్రహించాడు (1 సమూయేలు 1:11). ఇక్కడ దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించింది, ఆమె తన బిడ్డను సేవకు సమర్పిస్తుందని మాత్రం కాదు. ఆమె పడుతున్న అవమానాలు దేవుడు చూశాడు. కనుక దేవుడు ఆమెకు సంతానం అనుగ్రహించాడు. 

ఆదికాండము 29: "31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను."

యాకోబు మామ అయిన లాబాను, అతణ్ణి మోసం చేసి జబ్బు కండ్లు గల లేయాను కట్టబెట్టాడు. కానీ యాకోబు రాహేలును ప్రేమిస్తూ లేయాను ద్వేషించాడు. అప్పుడు దేవుడు లేయా యొక్క గర్భం తెరిచి, ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆవిధముగా యాకోబు ఆమెను ప్రేమిస్తాడని. ఇక్కడ లేయా ఎటువంటి మొక్కులు దేవునికి వాగ్దానం చేయలేదు. కేవలము ఆమె దినమయిన స్థితిని ఎరిగి, దేవుడు ఆమెను దీవించాడు. అలాగే బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు, ఎందుకు విడిపించాడు? వారి కష్టాలను తొలగించాలని. వారి పితరులకు చేసిన వాగ్దానాలు నిలబెట్టు కోవాలని. తనకు వారేదో మొక్కుబడులు చేస్తారని కాదు. అలాగే దేవుడు యాకోబును కాపాడింది, అతను మొక్కుబడులు చేస్తాడని కాదు గాని తనకు అయన పట్ల ఉన్న విశ్వాసమును బట్టి భయభక్తులను బట్టి మాత్రమే (ఆదికాండము 28:20). 

ప్రసంగి 5: "4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. 5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! జ్ఞానవంతుడయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథములో మాటలు అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రీస్తు భోధలలో చెప్పినట్లుగా మనం అవునంటే, అవునని! కాదంటే కాదన్నట్లుగా మన మాటలు ఉండాలి. కేవలము బుద్ది హీనులు మాత్రమే ఇష్ట రీతిగా మాటలు మారుస్తారు. దేవునికి వారి యందు ఇష్టం లేదు. దేవునికి  మన మొక్కుబడుల యందు, బలుల యందు సంతోషం లేదు (హెబ్రీయులకు 10:6). మనుష్యులను పాపం నుండి దూరంగా ఉంచడానికి  మాత్రమే ఇటువంటి నిబంధనలు దేవుడు చేశాడు. ఈ బలుల ద్వారా మనుస్యుల నుండి విధేయతను, తన పట్ల ప్రేమను ఆశించాడు మరియు తాత్కాలిక క్షమాపణను దేవుడు వారికి అనుగ్రహించాడు. పశ్చాత్తాపం లేకుండా వారు చేసే ప్రాయశ్చిత్త బలులు దేవునికి సువాసన ఇవ్వలేవు. 

వారి హృదయములో కలిగిన దీనత్వము మరియు పాపమూను బట్టి వారికి కలిగిన విచారమును బట్టి దేవుడు సంతోషిస్తాడు (కీర్తనలు 51:16-17) అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన రక్షణ మనం ఎదో  ఆయనను ప్రేమిస్తామని కాదు, నీతిమంతులుగా ఉంటామని కాదు. ముందుగా అయన మనలను ప్రేమించాడు కాబట్టి, అప్పుడప్పుడు మనం అయనను ప్రేమిస్తున్నాము. పరిశుద్దాత్మ శక్తి ద్వారా కొన్ని సందర్భాల్లో నీతిగా ప్రవరిస్తున్నాము. దేవుడు మన నుండి ఎదో ఆశించి మనలను దీవించడు, మనం నీతిగా లేమని మనలను తోసివేయడు. అధికమయిన మాటలతో ప్రార్థిస్తేనే దేవుడు మన ప్రార్థనలు వింటాడు అని చాల మంది భావిస్తారు. అది ముమ్మాటికి తప్పుడు భావన (మత్తయి 6:7) అని దేవుని వాక్యం చెపుతోంది. దేవుని తో గడపాలని ఆశ ఉన్నప్పుడు, గంటల కొద్దీ ప్రార్థనలో గడప వచ్చు కానీ కేవలము దీవెనల కోసం మాత్రం కాదు. 

అటువంటి భావన దేవునితో వ్యాపార లావాదేవీలు చేయటం లాంటిది. దేవుడు మన నుండి కోరుకుంటున్నది, సజీవ యాగముగా మన శరీరాలను అర్పించాలని. పాపముకు మరణించి, మారుమనసు అనే బలి పీఠం మీద,  పరిశుద్దాత్మ శక్తితో మన జీవితం మండాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కేవలము మేలుల కోసమే అయితే, ఏ విధమయిన లావాదేవీలు దేవునికి అవసరం లేదు. మనం చెల్లించ వలసిన మొక్కుబడి  పశ్చాత్తాపము, పాపము లేని జీవితము మాత్రమే. దాన్ని ఆలస్యం చేయకుండా దేవుని సమర్పిద్దాము, ఆయనను సంతోష పెడుదాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

20, జనవరి 2024, శనివారం

దేవుడు మోసానికి అప్పగిస్తాడా?దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి, నిత్యమూ అయన మన పాపములను క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు అని ఎన్నో మారులు మనము నేర్చుకున్నాము. అయితే కొన్ని సార్లు దేవుడు తన చిత్తానుసారముగా మనుష్యులకు గుడ్డితనమును, అనగా మోసపుచ్చే ఆత్మను పంపిస్తాడు, ఆవిధముగా తమ రక్షణ విషయములో వారు తప్పి పోయి, తమ హృదయ వాంఛలను బట్టి వారి ఆత్మ తీర్పుకు లోనవుతుంది.  పరిశుద్దాత్మ దేవుడు నిత్యమూ, క్రీస్తు స్వభావమునకు విరుద్దమయిన ప్రతి లక్షణమును మనలో నుండి తొలగించటానికి, లేదా మనం పాటించకుండా ఉండటానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మన శరీర ఆశలను బట్టి, లేదా దేవుని కృపను అలుసుగా తీసుకోవటాని బట్టి మనం ఉద్దేశ్య పూర్వకముగా పాపం చేస్తుంటే, దేవుడు మన హృదయములకు కాఠిన్యం ఆవరింప జేస్తాడు అని దేవుని వాక్యం చెపుతోంది. 

కీర్తనలు 81: "11. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. 12. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని."

మన దేవుడు నిన్న, నేడు, రేపు ఏక రీతిగా ఉన్నాడు. తరములు మారిన కూడా అయన స్వభావము నిత్యమూ ఒకే రీతిగా ఉంటుంది. అయన ప్రేమ మరియు క్షమా గుణము ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి (హెబ్రీయులకు 13:8).  ప్రస్తుతం క్రీస్తు మనకు అనుగ్రహించిన పరిశుద్దాత్మ దేవుడు ఎలాగయితే మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడో, ఆనాటి ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు మోషేను తోడుగా అనుగ్రహించాడు, తర్వాత ధర్మ శాస్త్రమును అటుపైన ప్రవక్తల ద్వారా వారిని నడిపించాలని చూశాడు. కానీ వారు దేవుని మాటను లెక్క చేయలేదు, కాబట్టి దేవుడు వారి హృదయాలకు కాఠిన్యం ఆవరింప చేశాడు. ఆవిధముగా వారు నశించి పోయి, దేవునికి వారి పట్ల ఉన్న ఉద్దేశ్యాలను కోల్పోయారు. 

చాల మంది విశ్వాసులు జీవితం చాల చిన్నది, బ్రతికి ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి కదా, రసజ్ఞత లేని జీవితం నిరర్థకం అనే సూక్తులు పాటిస్తూ, లోకం నుండి వేరు కావటానికి ఇష్టపడరు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దీవెనకు నమ్మకత్వము చూపించాలి, ప్రతి బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వహించాలి. కలిగిన ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ విధముగా దేవుడు మనకు హృదయానందము అనుగ్రహిస్తాడు (ప్రసంగి 5:20). ఇతరులను బట్టి వ్యసన పడు వారికి తృప్తి కరువయి దేవునికి కృతజ్ఞత చెల్లించని స్థితిలోకి వెళ్ళి పోతారు. 

ఇశ్రాయేలు వారు నిత్యమూ దేవుని మీద సణుగుకొంటూ, మోషేతో వాదనకు దిగి దేవుని ఆగ్రహానికి గురయినారు. దేవుడు వారు కోరుకున్నది అనుగ్రహించాడు కానీ వారి ప్రాణములకు క్షిణత కలుగ జేశాడు అని దేవుని వాక్యం చెపుతోంది (కీర్తనలు 106: 13-15). మనకు ఆశీర్వాదాలు కలుగుతున్నంత మాత్రాన మనం దేవుని నడిపింపులో ఉన్నాము అనుకోవటానికి లేదు. మన హృదయ వ్యసనమును బట్టి దేవుడు మనం కోరుకున్నది ఇస్తాడు, కానీ మన విషయంలో అయన ఉద్దేశ్యాలు నెరవేరటం లేదని  మనం గ్రహించాలి. దేవుని ఉద్దేశ్యాలు మనలో నెరవేరని నాడు, మనం లోక రీతులను అనుసరిస్తూ, సర్వ శరీర క్రియలను జరిగిస్తున్నాము. అటువంటి వారి రక్షణ విషయములో దేవుడు మోసపుచ్చే ఆత్మను పంపిస్తాడు అని దేవుని వాక్యం చెపుతోంది (2 థెస్సలొనీకయులకు 2: 10-12). 

2 దినవృత్తాంతములు 18: "22. యెహోవా నీ ప్రవక్తలగు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించి యున్నాడని చెప్పెను."

ఈ మాటలు దేవుని నిజమయిన ప్రవక్త అయినా మీకాయా, ఇశ్రాయేలు రాజయిన అహాబు, యూదా రాజయిన యెహోషాపాతుతో కలిసి శత్రువుల మీదకి యుద్దానికి సిద్దపడినప్పుడు, దేవుడు అతని అబద్ద ప్రవక్తల మీదికి మోసపుచ్చే ఆత్మను ప్రవేశపెట్టి, అతణ్ణి యుద్దానికి వెళ్ళే లాగా చేసి, అతను యుద్ధంలో చనిపోయేలా చేయబోతున్నాడని చెపుతున్న సందర్భం లోనివి.  అహాబు రాజు దేవునికి ఎంతగానో విరుద్ధముగా ప్రవర్తించాడు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించిన కూడా, అన్య దేవతలను పూజించటం మానలేదు. అలాగే తన రాజ్యములో ప్రజలను విగ్రహారాధన చేసే విధముగా ప్రోత్సహించాడు, లేదంటే ప్రజలను హింసించాడు. అప్పుడు దేవుడు తన ప్రజలయిన ఇశ్రాయేలు జనమును కాపాడటానికి అతన్ని నశింప చేయాలనుకున్నాడు. అందుకు దేవుడు అతని ప్రవక్తల మీదికి, మోసపుచ్చే ఆత్మను పంపి, అతన్ని యుద్దానికి వెళ్ళేలాగా ప్రోత్సహింప జేశాడు. 

అయితే దేవునికి నమ్మకముగా ఉన్న యూదా రాజు యెహోషాపాతు, నిజమయిన దేవుని ప్రవక్త అయినా మీకాయాను పిలిపించి దేవుని ప్రవచనం అడిగించమన్నప్పుడు, అహాబు రాజు యొక్క అధికారులు, మీకాయాను కూడా ఆ అబద్ధపు ప్రవక్తలు చెప్పిన మాటలనే చెప్పమన్నారు. అతను కూడా అలాగే చెప్పాడు. కానీ యెహోషాపాతు రెట్టించి ఆడినప్పుడు, అహాబు యుద్దములో చనిపోతాడు అని నిజం చెప్పాడు. అప్పుడు అహాబు రాజు ఆగ్రహం చెంది మీకాయాను బందించి యుద్దానికి వెళ్ళాడు, ఆ యుద్దములో, నిమిత్త మాత్రమూ చేత చనిపోయాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! ఇక్కడ చెడ్డవాడయినా అహాబు రాజు దేవుడు ఎన్ని సార్లు హెచ్చరించిన కూడా దేవుని ప్రేమను అలుసుగా తీసుకున్నాడు. ఉద్దేశ్య పూర్వకముగా దేవుణ్ణి తృణీకరించాడు. పాపం చేసిన స్థితిలోకి దావీదు కూడా వెళ్ళాడు, కానీ వెంటనే పాపములు ఒప్పుకొని, దేవుని క్షమాపణ కోసం ఎంతగానో  తపించాడు. కనుకనే దేవుడు దావీదును క్షమించాడు. కానీ అహాబు గర్వంగా ప్రవర్తించాడు, దేవుణ్ణి  క్షమాపణ అడుగ లేదు.  అంతే కాకుండా నిజం చెప్పాలనుకున్నా దేవుని నిజమయిన ప్రవక్త మీకాయాను తనకు నచ్చింది చెప్పమని బలవంతం చేశాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు అని నిరూపించటానికి యెహోషాపాతు రెట్టించి అడిగినప్పుడు, మీకాయా నిజం చెప్పిన కూడా అహాబు దేవుని వైపు తిరగలేదు సరికదా నిజం చెప్పిన మీకాయాను బంధించాడు. 

మనం కూడా చాల సార్లు మనకు నచ్చిందే వినటానికి, నమ్మటానికి ఆసక్తిని చూపిస్తాము. ఎవరయినా కఠినమయినవి చెప్పినప్పుడు కోపం తెచ్చుకుంటాము. మన దేవుడు ప్రేమ కలిగిన వాడే, అనంతమయిన క్షమాపణ కలిగిన వాడే. కానీ మనము నిత్యమూ ఆత్మీయముగా ఎదగాలని ఎదురు చూస్తున్నాడు. తుచ్చమయిన ఆశలను వదిలి, శరీర క్రియలను విసర్జించి, ఆత్మ ఫలములు పొందాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుని ఉద్దేశ్యాలు అర్థం చేసుకోకుండా, ఉద్దేశ్య పూర్వకముగా పాపం లో పడిపోతూ, కేవలం నామమాత్రపు విశ్వాసముతో కొనసాగే వారిని దేవుడు మోసానికి అప్పగిస్తాడు. వారు తాము దేవునిలో ఉన్నాము అనుకుంటారు, కానీ సాతాను చేతిలో బందీలుగా కొనసాగుతారు. 

కేవలము మన చెవులకు ఇంపైన మాటలు మాత్రమే వినకుండా, సంపూర్ణ సువార్తను వినటానికి ఆసక్తిని చూపించాలి (2 తిమోతి 4:3-4). ఆ సంపూర్ణ సువార్త కేవలము దేవుని ప్రేమను మాత్రమే భోదించదు కానీ పాపపు జీవితమును వదిలి మారు మనసు పొందుకోవటాన్ని కూడా బోధిస్తుంది. ప్రతి శ్రమలో, దీవెనలో దేవుని యందు ఆనందించటాన్ని, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాటాన్ని బోధిస్తుంది. బైబిల్ లో దేవుని ప్రేమను, క్షమా గుణమును అలుసుగా తీసుకోని, ఆయన ఉద్దేశ్యాలు తప్పి పోయి ఎంతో మంది నశించి పోయారు. వారి కంటే మన మేమి గొప్పవారం కాదు కదా?

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్ !! 

13, జనవరి 2024, శనివారం

విశ్వాసము - పశ్చాత్తాపముఒకప్పుడు పాపపు జీవితము గడిపి, వాటిని బట్టి పశ్చాత్తాప పడి, ఇప్పుడు వాటిని విడిచి పెట్టి క్రీస్తును విశ్వాసిస్తున్నాము. కాబట్టి విశ్వాసము, పశ్చాత్తాపము ఆత్మీయ ప్రయాణానికి రెండు కాళ్ళ వంటివి. ఈ రెండు సమన్వయంగా సాగినప్పుడే మన ఆత్మీయ జీవితం సాజావుగా సాగుతుంది. లేదంటే క్రియలు లేని విశ్వాసము ఎలాగయితే దేవుణ్ణి సంతోష పెట్టలేదో, అలాగే పశ్చాత్తాపం లేని విశ్వాసము మనకు గర్వమును కలిగించి ఆత్మీయంగా మరింత లోతునకు మనలను నెట్టి వేస్తుంది. పశ్చాత్తాపం అంటే చేసిన పాపాలను ఒప్పుకొని దేవుణ్ణి క్షమాపణ అడగటం. ఈ విధముగా దేవుణ్ణి విశ్వాసించే గుణమును కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అనేది క్రైస్తవ విశ్వాసము. 

అయితే ఇతర మతాలలో పాపానికి ప్రాయశ్చిత్తము చేయటం ద్వారా పాపములు తగ్గించు కోవచ్చు అని నమ్ముతారు.  కానీ పాపానికి నిలయం అయినా శరీరం సంగతి ఏమిటి? ఆవిధముగా కలుషితం అవుతున్న మనసును ఎవరు మారుస్తారు. ప్రభువయినా క్రీస్తు చెపుతున్నది ఏమిటంటే మరుమనసు పొంది అంటే పాపములు మానేసి, వాటిని ఒప్పుకోవటం అంటే పశ్చాత్తాపం చెందటం ద్వారా మనకు నూతన జీవితము ఇస్తానని,  మరియు తన పరిశుద్దాత్మ శక్తి ద్వారా మన శరీర క్రియలు జయించే శక్తిని పొందుకుంటామని. 

దేవుడు నిత్యమూ మనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు, ప్రతి మనిషికి తనను తానూ  బయలు పరచుకోవటానికి సిద్దపడి ఉన్నాడు. ఆయన పిలుపుకు స్పందించిన మానవులకు పశ్చాత్తాపము, విశ్వాసమును ఇఛ్చి తనకు దగ్గరగా ఉండటానికి వివిధ పరిస్థితులను కల్పించి తన మీద ఆధారపడటానికి ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహిస్తాడు. పశ్చాత్తాపము, విశ్వాసము అనే ఈ రెండు కృప వరములను పరిశుద్దాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. కనుక వీటిని బట్టి మనలో ఎవరు కూడా తమ గొప్పను చెప్పుకోవటానికి ఆస్కారం లేదు. పరిశుద్దాత్మ లేని కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ధర్మ శాస్త్రం ఇచ్చి వాటిని పాటించుట ద్వారా ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించాడు. అన్యులయిన ప్రజలకు మనసాక్షిని ఇచ్చి తమ తప్పులను బట్టి పశ్చాత్తాప పడే గుణమును ఇచ్చాడు. 

యోనా 3: "5. నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి."

దేవుడు "నీనెవె పట్టణపు ప్రజల పాపములు ఎక్కువైనాయి, నలుపది రోజులలో వారిని నేను నాశనం చేస్తాను" అని యోనా ద్వారా వర్తమానం పంపినప్పుడు వారు ఎం చేశారు? దేవునియందు విశ్వాసముంచి, గోనెపట్టలు కట్టుకొని అంటే పశ్చాత్తాప పడి ఉపవాసములు ఉన్నారు, దేవుడు తన మనసు మార్చుకొని వారిని కనికరిస్తాడని. అలాగే వారు తమ దుష్ట కార్యములను విడచి, తాము చేయు బలాత్కార్యములను మానివేయాలని ఆ దేశపు రాజు చాటింపు వేశాడు. ఏది మంచి కార్యము, ఏది చెడు కార్యము అని వారికి ఎలా తెలిసింది? దేవుడు ఇచ్చిన మనసాక్షిని బట్టి.  ఆవిధముగా వారు పశ్చాత్తాప పడుట ద్వారా దేవుని యందు విశ్వాసమును కనబరిచారు. అందును బట్టి  వారు దేవుని క్షమాపణను పొందుకున్నారు. 

పశ్చాత్తాపము మనలను నిత్యమూ దినులుగా ఉంచుతుంది. ఆ విధముగా మనము దేవుని కృపను పొందుకుంటాము, అప్పుడు మరింతగా ఆత్మీయముగా ఎదుగుతాము. కొన్ని సార్లు దేవుడు మన ఆపేక్షనుబట్టి కొన్ని విధములయిన శరీర క్రియల మీద విజయం ఇస్తాడు, అప్పుడు మనలో ఆత్మీయ గర్వం కలుగ వచ్చు. అలాగే కొన్ని సార్లు దేవుడు మనకు బయలు పరచే వాక్యపు లోతులను బట్టి కూడా మనలో ఎదుటి వారిని చిన్న చూపు చూసే తత్త్వం మొదలు కావచ్చు. తద్వారా మనము పశ్చాత్తాపమును కోల్పోయి, విశ్వాసములో వెనుకబడిపోయే అవకాశం ఉంది. 

యేసయ్యను క్రీస్తుగా, దైవ కూమారునిగా గుర్తించిన పేతురు, "వీళ్ళందరూ నిన్ను విడచి పోయిన కూడా నేను మరణని కైనా నీతో వస్తాను గాని, నిన్ను విడిచి పోను" అన్నాడు యేసయ్య తో (మార్కు 14:20-30). ఇది ఆయనలో ఉన్న ఆత్మీయ గర్వము. దేవుడే తనకు యేసయ్యను గురించి బయలు పరచాడని యేసయ్య చెప్పిన కూడా (మత్తయి 16:16-18), అదంతా తన విశ్వాసమే అనుకున్నాడు. కనుకనే ఆత్మీయముగా పడిపోయాడు. పలుమార్లు యేసయ్యను నేను ఎరుగనని అబద్దం ఆడాడు. తిరిగి పశ్చాత్తాప పడి, విశ్వాసులకు నాయకుడిగా యేసయ్య చేత ఎన్నుకోబడ్డాడు.  పడి పోయినప్పుడే పశ్చాత్తాప పడాలా? ముమ్మాటికీ కాదు. దేవుని పరిశుద్ధతను బట్టి మనం ఎన్నటికీ కూడా అయన నామమును సైతం ఉచ్చరించటానికి అర్హులము కాము. కానీ అయన మనకు విశ్వాసము ఇచ్చి ఆయనను "అబ్బా", "తండ్రి" అని పిలిచే ఆధిక్యతను ఇచ్చాడు కనుక, మనము నిత్యమూ పశ్చాత్తాప పడ బద్దులుగా ఉన్నాము. 

దానియేలు 9: "2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సర ములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించి తిని. 3. అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని."

బబులోనుకు చిన్నతనంలోనే బానిసగా పట్టుకొని పోబడిన దానియేలు తన దినచర్యను దేవుని వాక్యము చదువుట ద్వారా ప్రారంభిస్తున్నాడు. అప్పుడు అయన యిర్మీయా గ్రంథములో దేవుడు ఇశ్రాయేలుకు విధించిన డెబ్భై సంవత్సరాల చెర పూర్తవ్వబోతున్నట్లు కనుగొన్నాడు. వెంటనే గోనెపట్ట కట్టుకొని, తలపైన ధూళి వేసుకొని, ఉపవాసముండి దేవునికి ప్రార్థనలు చేయటానికి సిద్దపడ్డాడు. తన ప్రార్థనలో కూడా తమ పితరులు చేసిన పాప కార్యములను బట్టి పశ్చాత్తాప పడ్డాడు. దేవుని క్షమాపణకై దినముగా వేడుకున్నాడు. తిరిగి ఇశ్రాయేలును నిలబెట్టుమని దేవునికి విజ్ఞాపణ ప్రార్థనలు చేశాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! కొన్ని సార్లు దేవుని మీద మనకు ఉన్న  విశ్వాసము మనలను పశ్చాత్తాప పడ నివ్వదు. ఎందుకంటే దేవుడు కరుణ సంపన్నుడు, అయన మిక్కిలి మనలను ప్రేమిస్తున్నాడు, నిత్యమూ మనలను క్షమిస్తున్నాడు, ఇంకా పశ్చాత్తాప పడవలసిన అవసరం ఏమిటి? కొంత మంది, "అదే పనిగా పశ్చాత్తాప పడటం మనలను మనం ఖండించుకోవటం అవుతుంది" అని పశ్చాత్తాపాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దానియేలు పశ్చాత్తాప పడటం ద్వారా తన తగ్గింపును దేవుని ముందు చూపిస్తున్నాడు. దేవుడు జరిగించ బోయే కార్యాలకు అయన మీద ఆధారపడుతున్నాడు. ఆవిధముగా దేవుని మీద  తన విశ్వాసమును చాటుతున్నాడు. 

దేవుడు ఖచ్చితముగా తమను చెర నుండి విడిపిస్తాడని తెలిసిన కూడా, కేవలము కృతజ్ఞత ప్రార్థనతో సంతోషముగా గడపలేదు. రాబోయే ఆశీర్వాదాల కంటే గతములో చేసిన పాపాలకు, వాటి కోసం పశ్చాత్తాపానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దానియేలు పితరుల కంటే మనం ఏమి పవిత్రులము కాము. మనం చేసిన పాపముల నిమిత్తం క్రీస్తు సిలువలో మరణించి, తిరిగి లేచాడు. అందుకు మనం ఎంతగా పశ్చాత్తాప పడాలి? ఆయన మనకు ఇచ్చిన రక్షణ వాగ్దానమును బట్టి ఎంత దీనులుగా అయన ముందు ప్రవర్తించాలి. అయన మన జీవితములో నెరవేర్చే నిరీక్షణ వాగ్దానానికై  ఎంతగా అయన మీద ఆధారపడాలి? 

కొంతమంది విశ్వాసులు జీవితములో ఆశీర్వాదాలు కలిగే పరిస్థితులను బట్టి తగ్గింపును కోల్పోతారు. తాము పొందుకున్న దీవెనలు తమ అర్హతను బట్టి దేవుడు ఇచ్చాడు అని, దేవునికి తామంటే అధిక ఇష్టం అని విశ్వాసముతో కూడిన గర్వం ప్రదర్శిస్తారు. ఆ విధమయిన ఆలోచన మనలో పశ్చాతాపమును తగ్గించి, విశ్వాసములో మనలను వెనుకకు నెట్టేస్తుంది. కాబట్టి విశ్వాసమును బట్టి గర్వపడకుండా నిత్యమూ పశ్చాత్తాపమును కలిగి దినులుగా మన ఆత్మీయ పరుగును కొనసాగిద్దాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్ !! 

5, జనవరి 2024, శుక్రవారం

దేవుని దీవెనలు!క్రైస్తవ విశ్వాసులు ఎన్నో రీతులుగా దేవుని చేత దీవించబడాలని ఆశపడుతూ ఉంటారు. అందుకోసం ఎంతో విశ్వాసముతో ప్రార్థిస్తారు. ఎన్నో రకాల ప్రార్థనలు, అనగా ఉపవాస ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన పేరిట నిత్యమూ దేవునికి విన్నపాలు చేస్తుంటారు. మరియు నూతన సంవత్సరం పొందుకున్న వాగ్దానపు పత్రాలను భద్రంగా బైబిల్ లో దాచుకుంటారు. ప్రతి రోజు ప్రార్థనల్లో ఆ వాగ్దానాలను ఎత్తి పడుతూ సంవత్సరం అంత ప్రార్థిస్తారు. ఈ మధ్య కొంతమంది వాగ్దానాలు తీసుకోవటం జ్యోతిషం లాంటిది, మన దేవుడు అలాంటి వాటిని లెక్క చేయడు అని ప్రసంగాలు చేస్తూ విశ్వాసులను గందరగోళానికి గురి చేస్తున్నారు. 

క్రీస్తు ధర్మ శాస్త్రము నెరవేర్చి నూతన నిబంధన ఏర్పరచాడు కాబట్టి, దేవుడు పాత నిబంధనలో ఇచ్చిన పాప క్షమాపణార్థ బలులు మరియు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ధర్మ శాస్త్రము తప్ప, బైబిల్ లో ఉన్న ప్రతి ఆజ్ఞ, ప్రతి వాగ్దానము అయన విశ్వాసులయినా అందరి కోసము. ప్రతి వాగ్దానము లేదా ఆశీర్వాదము ఆజ్ఞను పాటించటం ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ఉదాహరణకు "నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము" (నిర్గమకాండము 20:12). దీర్ఘాయువు అనేది ఆశీర్వాదము అయితే దాన్ని పొందు కోవటానికి కావలసింది ఆజ్ఞను పాటించటము అంటే తండ్రిని తల్లిని గౌరవించటం. 

వాగ్దానపు కార్డులు తీసుకోవటం వాక్యానుసారమా? కాదా? అని చర్చ అనవసరం. దేవుని వాక్యం నుండి ఒక వాగ్దానం తీసుకోని, దాని ద్వారా ఆత్మీయ పరుగులో ఉత్తేజం తెచ్చుకుంటే, దేవుడు తప్పు పడుతాడా? లేక ఏ వచనమయిన ఖండిస్తుందా? "మనుష్యుడు బ్రతికేది కేవలము రొట్టె ద్వారా మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు ద్వారా" అని దేవుని వాక్యమే చెపుతోంది. మరి దేవుడు ఇచ్చిన మాటను ఎత్తి పడుతూ విశ్వాసులు ఆత్మీయంగా బలం పొందుకోవటాన్ని, ఎవరో మనుష్యులు చెప్పే జ్యోతిష్యంతో పోల్చటం విశ్వాసులను నిరుత్సాహ పర్చటమే అవుతుంది. 

2 కొరింథీయులకు 1: "20. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి."

పౌలు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో ఇదే మాటను మనకు వెల్లడి చేశారు. క్రీస్తు యేసు నామములో దేవునికి మహిమ కలుగుటకు ప్రతి వాగ్దనము విశ్వాసులయిన మన జీవితములో దేవుని చిత్తానుసారముగా నెరవేరుతాయి. కనుక వాగ్దనాలను తీసుకోవటానికి, నమ్మటానికి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఒక్క వాగ్దానమును మాత్రమే నమ్ముకోకుండా మిగిలిన దేవుని వాక్యమును కూడా ధ్యానించటానికి ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. 

అంతే కాకుండా వాగ్దనాల మీద విశ్వాసముతో పాటు, ప్రభువయినా యేసు క్రీస్తు చెప్పినట్లుగా "ముందుగా మనం దేవుని రాజ్యమును వెతకాలి, అప్పుడు మనం కోరినవి అన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు" (మత్తయి  6:33). దేవుని రాజ్యము వెతకటము అంటే ఏమిటి? బాప్తిస్మము ఇచ్చు యోహాను ఆనాటి ప్రజలకు "దేవుని రాజ్యము సమీపించినది కనుక పాపములు ఒప్పుకొని మారు మనసు పొందండి" అని బాప్తిస్మము ఇచ్చాడు (మత్తయి 3:1-2). యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు క్రీస్తు కూడా "దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది, సువార్తను నమ్ముడనీ, దేవుని సువార్తను ప్రకటించాడు" (మార్కు 1:15). దేవుని రాజ్యమును వెతకటం అంటే పాపములు ఒప్పుకొని, మారు మనసు పొందటమే అని మనకు అర్థం అవుతుంది. 

కనుక దేవుని దీవెనలు పొందుకోవాలంటే మనం ఖచ్చితముగా పాపమునకు దూరముగా ఉండాలి,  ఒక వేళ పడిపోతే పాపములు ఒప్పుకుంటూ, దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించే వారిగా ప్రయత్నం చేయాలి. బాప్తిస్మము తీసుకున్నపుడే మారు మనసు పొందుకోవటం కాదు. పడిపోయిన ప్రతి సారి మారు మనసు కలగాలి. అంటే ఆ పాపమూ పట్ల ద్వేషము కలగాలి, దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని క్రీస్తు రక్తములో పరిశుద్దులుగా మారాలి. పరిశుద్దాత్మ శక్తి ద్వారా ప్రతి శరీర క్రియను జయించి, ఆత్మ ఫలములు పొందుకోవాలి. ఆవగింజంత విశ్వాసము చూపి ప్రార్థిస్తే కొండలను సైతం కదిలించే శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇక వాగ్దనాలు నెరవేరి, దీవెనలు పొందుకోవటం అసాధ్యమా? 

దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు కనుక మనలను పోషిస్తున్నాడు. మనము కూడా నిత్యమూ ఆయనను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఆయనను సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. మనకు వస్తున్నా దీవెనలు అయన నామ ఘనతార్థమై, అయన సంఘము యొక్క క్షేమార్థమై వాడబడాలి. వ్యక్తిగత అభివృద్ధి చూసుకోవద్దు, ఆర్థిక సామర్థ్యము పెంచుకోవద్దు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. మనకు, మన పిల్లల భవిష్యత్తుకు సరిపడినంత ఉంచుకుంటూ, మిగిలినది ఇతరులకు సహాయం చేయటానికి వెచ్చించాలి. "రెండు అంగీలు గలవాడు ఏమియు లేనివానికియ్య వలెనని, ఆహారముగలవాడు లేని వానికి పెట్టాలని" బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పింది అందుకే (లూకా 3:11). దేవునికి ఇష్టముగా జీవిస్తూ, విశ్వాసముతో మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తాడు. 

ఎస్తేరు 2: "17. స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను."

ఇక్కడ పరాయి దేశములో, ఇతర ప్రజల మధ్య అన్యురాలుగా ఉంటున్న ఎస్తేరు పట్ల, రాజుకు తన దగ్గరికి పంపబడిన కన్యలందరి కంటే దయ దాక్షిణ్యాలు కల్పించాడు దేవుడు.  అందును బట్టి రాజు ఆమెను రాణిగా నియమించాడు. లేదంటే ఆమె కేవలం రాజుకు ఉప పత్నిగా ఉండిపోయేది. ఎంతో మందిలో ఒక్కత్తిగా ఆమె మిగిలి పోయేది. అంతే కాకుండా రాజు ఆమెను ఎంతగానో ప్రేమించాడు మరియు ఆమె నిమిత్తమై గొప్ప విందును కూడా ఏర్పాటు చేసాడు. ఆవిధముగా ఆమెను దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు. అయితే ఎస్తేరు రాణి అయినా తర్వాత కూడా ఆమె తన తగ్గింపును వదిలి పెట్టలేదు. ఎందుకంటే తన తండ్రి సోదరుడయినా మొర్దకై ఆజ్ఞకు లోబడి తన వంశమును కానీ, తన జాతిని కానీ బయట పెట్టలేదు అని దేవుని వాక్యం చెపుతోంది (ఎస్తేరు 2:20)

తర్వాత హామాను అనబడే ఆ రాజ్యపు ప్రధాన మంత్రి మొర్దకై తనకు సాష్టాంగ నమస్కారం చేయలేదని దేవుని ప్రజలయిన యూదులను పూర్తిగా నాశనం చేయాలని ఎదురు డబ్బులు కట్టి రాజు ద్వారా శాసనం రాయిస్తాడు. అప్పుడు మొర్దకై ఎస్తేరు తో "రాజు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, తన జాతి వారయినా యూదులను కాపాడమని" కబురు పంపుతాడు. అయితే ఎస్తేరు "రాజు పిలవకుండా అయన ముందుకు వెళితే నా ప్రాణాలు పోవచ్చు" అని తిరిగి కబురు పంపుతుంది.

ఎస్తేరు 4: "13. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులొ తలంచుకొనవద్దు; 14. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. "
 
ఇక్కడ మొర్దకై ఎస్తేరును "నువ్వు రాణివి అయినంత మాత్రాన క్షేమమముగా ఉంటావని అనుకోవద్దు. నువ్వు ధైర్యం చేసి ఇప్పుడు మాట్లాడక పొతే యూదులకు మరో రకముగా సహాయం దొరుకుతుంది. అసలు నువ్వు రాణివి అయింది యూదులను ఈ ఆపద నుండి తప్పించటానికేనేమో, ఒక్కసారి ఆలోచించుకో" అని హెచ్చరిస్తున్నాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీకు ఇచ్చిన దీవెనలు ఎందుకోసమో గుర్తించావా? అయన చిత్తమును నెరవేర్చటానికి, అయన సంఘము యొక్క క్షేమాభివృద్ధికై ఆ దీవెనలు వాడుతున్నావా? దేవుడు ఎంత గొప్పగా దీవిస్తే అంతగా తగ్గింపును అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఎస్తేరు రాణి అయినా తర్వాత కూడా తన తగ్గింపును వదులు కోలేదు. అందుకే మొర్దకై ఇచ్చిన ఆజ్ఞను పాటించి తన జాతిని, వంశమును గోప్యముగా ఉంచింది. లేదంటే దేవుడు ఆమె ద్వారా చేయాలనుకున్న గొప్ప కార్యం చేసే ధన్యతను ఆమె కోల్పోయేది. దేవుడు నిన్ను ఉన్నత స్థానములో నిలబెట్టడా? నీ దారి నువ్వు చూసుకోవద్దు, నీ వారి కోసం, దేవుని ప్రజల కోసం ధైర్యముగా నిలబడు. దేవుడు తన కార్యలను ఎలాగయినా జరిగించుకుంటాడు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవునికి అసాధ్యమయినది ఏది లేదు. కానీ అయన కార్యమును చేసే ధన్యతను నువ్వు కోల్పోతావు. 

దేవుని నుండి దీవెనలు పొందుకోవటం అసాధ్యం ఏమి కాదు గాని వాటిని ఏ విధముగా దేవుని కోసం వాడుతున్నాము అనేది చాల ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీవెనలు మన ఆత్మీయ జీవితమును మరింతగా మెరుగు పరచాలి గాని నశింప జేయకూడదు. దేవునికి మనలను మరింత దగ్గరగా చేయాలి గాని దూరం చేయకూడదు. "ఎందుకు పనికి రాని నన్ను ఎన్నుకొని, ఇంతగా దీవిస్తున్నావు తండ్రి" అని నిత్యమూ కృతజ్ఞత భావముతో దీనమనసు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఇచ్చే దీవెనలకు హద్దు ఉండదు, మన ద్వారా ఆయన చేసే గొప్ప కార్యాలకు అంతు ఉండదు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగముతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!