దేవుడు ఆదామును చేసిన తర్వాత అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలచి, అతనికి తోడుగా మొదటి స్త్రీ అయినా అవ్వను అతనికి జతగా చేశాడు. అటుపైన "ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరచు కొనుడి" అని వారిద్దరిని దీవించాడు (ఆదికాండము 1:28). మరియు వారు ఇద్దరు హత్తుకొని ఏక శరీరులుగా ఉంటారని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది (ఆదికాండము 2:24). అప్పటి నుండి వివాహం అనేది ప్రతి తరము పాటిస్తూ వచ్చింది (ఆదికాండము 4:16-17). కాల క్రమేణా దేవుడు మోషే ద్వారా జన్యు పరమయిన ఇబ్బందులు రాకుండా మరిన్ని నియమ నిబంధనలు పెట్టాడు (లేవికాండము 18:6-18). ఎవరు ఎవరిని వివాహం చేసుకోరాదో దేవుడు తన ఆజ్ఞల ద్వారా వెల్లడి చేశాడు.
ఈ నియమ నిబంధనలు తప్పిన నాడు, మనిషి జంతువు స్థితికి దిగజారి పోతాడు. నేటి సమాజంలో ఎన్నో రకాల పోకడలు చలామణి అవుతున్నాయి! డేటింగ్ అని సహజీవనం అని నియమ నిష్టలు లేని తప్పుడు కార్యాలను ఉన్నతమయినవిగా చిత్రీకరిస్తూ యువతి యువకులను శోధిస్తున్నారు. కాముకత్వము తీర్చుకోవటానికి పెళ్ళికి ముందు కట్టడలు లేని విచ్చలవిడితనం ప్రోత్సహించే ఈ కార్యాలను ఆమోదయోగ్యంగా మారుస్తున్నారు. జంతువులకంటే హీనమయిన స్థితిలోకి మనుష్యులను నడిపిస్తూ దేవుడు ఏర్పరచిన వివాహ వ్యవస్థను ప్రాముఖ్యం లేనిదిగా ప్రచారం చేస్తున్నారు. వివాహం అన్నింటా ఘనమయినది అని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 13:4).
కాబట్టి సహోదరి, సహోదరుడా! పెళ్ళికి ముందు విచ్చలవిడితనం దేవుని దృష్టిలో పాపమే అని గుర్తించి మసలుకోండి. దేవుని చిత్తమును కనిపెట్టి మీ జీవిత భాగస్వామిని ఎన్నుకోండి. దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరిని తన స్వరూపంలో, సమానంగా సృష్టించాడు. "అయితే సంఘమునకు క్రీస్తు తలగా ఉన్నట్లుగా స్త్రీకి తన భర్త తలగా ఉండాలి, మరియు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా స్త్రీ తన భర్తకు అన్ని విషయాలలో లోబడాలి. అయితే క్రీస్తు ఎలాగయితే సంఘమును ప్రేమించి దానిని పవిత్రముగా చేయటానికి తనను తాను ఏలా అప్పగించుకొని శ్రమలు పడ్డాడో అదేవిధంగా పురుషులు కూడా తమ భార్యలను ప్రేమించాలి మరియు వారిని గౌరవిస్తూ పోషించాలి" అని దేవుని వాక్యం సెలవిస్తోంది (ఎఫెసీయులకు 5:24-27).
భార్యలను చిన్న చూపు చూస్తూ నియంత వలె వ్యవహరించటం దేవుని ఉద్దేశ్యం కాదు. పురుషులు తమ శరీరమును ప్రేమించినట్లుగా, భార్యలను ప్రేమించాలి (ఎఫెసీయులకు 5:28). మరియు వారు శారీరికంగా బలహీనమయిన వారిగా గుర్తించి వారి విషయంలో మరి ఎక్కువ శ్రద్ధ చూపించాలి. దేవుడు ఇచ్చిన జీవితమును వారు భర్తలతో పంచుకుంటున్నారు కనుక వాళ్లను గౌరవించాలి. తద్వారా ఇద్దరు కూడా క్రీస్తులో ఆనందిస్తూ, ఆత్మీయంగా బలపడుతారు (1 పేతురు 3:7). తమ సంతానము ప్రశాంతంగా పెరగటానికి మంచి వాతావరణం ఇచ్చిన వారిగా ఉంటూ దేవుని రాజ్యనికి వారిని దగ్గర చేస్తారు. మరియు భార్యలు తమ భర్తలను తమ గొంతెమ్మ కోరికలతో బాధించ రాదు. తమ భర్తల సంపాదనను గుర్తెరిగి గుట్టుగా సంసారం చేయాలి.
కొంతమంది స్త్రీలు లోకస్తులను చూసి, నగలు చీరలు కావాలని భర్తలను సాధిస్తూ ఉంటారు. అయితే "స్త్రీలు ఖరీదయిన వస్త్రములతో కానీ నగలతో గాని, రక రకాల జడలతో గాని అలంకరించుకోకుండా, మీ అంతరాత్మను, సాత్వికత, శాంతత అనే శాశ్వత గుణాలతో అలంకరించుకోవటం ద్వారా దేవుని దృష్టిలో విలువయిన వారిగా ఉంటారు" అని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 3:3-4). శారా అబ్రాహాముకు లోబడి అతనిని యజమాని అని పిలిచింది, మరియు విశ్వాసములో అతనితో ప్రయాణం చేసింది (ఆదికాండము 18:12) కనుక దేవుని చేత ఆశీర్వదించబడింది. భార్యలు తమ భర్తలకు లోబడుతూ, విశ్వాసములో వారితో నడిస్తే తప్పకుండా దేవుడు మిమ్మును కూడా దివిస్తాడు.
సామెతలు 31 వ అధ్యాయము 10 వ వచనం నుండి పూర్తిగా చదవమని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాము. ఇక్కడ దేవుడు గుణవతి అయినా భార్య ఏలా ఉండాలో వివరంగా రాయించాడు. పురుషులు మోసకారమయిన సౌందర్యము మరియు అశాశ్వతమయిన అందమును మోహించకుండా దేవుని యందు భయ భక్తులు కలిగిన భార్యను బట్టి సంతోషించాలని దేవుని వాక్యం చెపుతోంది. భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు విశ్వాసములో బలపరచుకుంటూ క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి. ఏ ఒక్కరయినా దేవునికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే వేరే వాళ్ళు దానిని వ్యతిరేకించాలి. ఉదాహరణకు అననీయ మరియు సప్పీరా ఇద్దరు కూడా దేవునికి వ్యతిరేకమయిన నిర్ణయం తీసుకోని, మరణం పొందారు. కానీ వారిలో ఒక్కరు దేవుని పేరిట వేరే వాళ్ళను గద్దిస్తే, అటువంటి అనర్థం జరిగేది కాదు కదా?
చాల మంది ఇళ్ళలో భార్య భర్తలు ఒకరి మీద ఒకరు నేరారోపణ చేస్తూ ఉంటారు. "నీ మూలంగానే నేను ఇలా ఉన్నాను" అంటూ భర్త కానీ భార్య కానీ చేసిన తప్పులను ఎత్తి చూపుతూ నేరారోపణ చేస్తారు. అదే పనిగా నేరారోపణ చేయటం లేదా నిందించటం అనేది సాతాను లక్షణము (ప్రకటన 12:10). ఏదెను వనములో సాతాను మాట విని నిషేదించిన పండు తినగానే ఆదాము అవ్వ కూడా ఆ లక్షణాలనే కనపరిచారు. దేవుడు "ఆదాము ఎక్కడ ఉన్నావు, నేను వద్దని చెప్పిన పండు గాని తిన్నావా" అని అడగ్గానే, ఆదాము ఏమన్నాడు "నాకు జతగా నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది" అన్నాడు. అక్కడే మొదలు అయింది, నిందలు వేసే స్వభావం. దేవుడు అడిగింది "ఎందుకు తిన్నావు?" అని కాదు లేదా "ఎలా జరిగింది?" అని కూడా కాదు. "అవును ప్రభువా తిన్నాను, నన్ను క్షమించు" అని అంటే సరిపోయేది కదా!
మీ భార్య వల్ల గాని భర్త వల్ల గాని పెద్ద తప్పే జరిగి ఉండవచ్చు. కానీ క్రీస్తు ప్రేమ అన్నింటిని క్షమిస్తుంది, ప్రతి తప్పిదమును కప్పివేస్తుంది. దేవుడు తిరిగి మీ జీవితాలను బాగు చేస్తాడు, ప్రతి కీడును మన మంచికై మలిచే సమర్థుడిగా ఉన్నాడు. యోసేపును తన అన్నలు అమ్మేసారు, ఐగుప్తులో బానిసగా బ్రతికాడు, నిందలు పొంది చెరసాల పాలయినాడు. ఇవ్వని కూడా యోసేపు జీవితంలో జరిగిన చెడు అనుభవాలు. అయితే దేవుడు వాటిని అతని తండ్రి యాకోబు కుటుంబానికి ఆశీర్వాదంగా మార్చాడు. కరువుతో వారు చనిపోకుండా యోసేపును ఐగుప్తుకు ప్రధానిగా మార్చి వారిని పోషించాడు. మీ జీవితాలలో కూడా జరిగిన తప్పులను లేదా చెడును మీకు ఆశీర్వాదంగా మార్చే సమర్థుడిగా మన దేవుడు ఉన్నాడు. కనుక ఒకరి నొకరు క్షమించుకుంటూ, క్రీస్తు పై విశ్వాసంలో ఎదగాలి.
కొందరు తల్లితండ్రులు పిల్లల విషయంలో పక్షపాతం చూపుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉంటే తల్లి ఒక్కరిని మరియు తండ్రి ఒక్కరిని ఎక్కువగా గారాబం చేస్తూ లేదా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఇది ఖఛ్చితముగా దేవుని వాక్యానుసారమయిన పెంపకం కాదు. సరదాకయినా పిల్లలను వేరుగా చూడకూడదు, అది వారిపై దుష్ప్రభావము చూపుతుంది. దేవుడు మానవులందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. చెడ్డవారి మీద మరియు మంచివారి మీద వర్షం ఒకేలాగా కురుపిస్తున్నాడు, వారి పంటలు కూడా అలాగే పండుతున్నాయి. ఇస్సాకు మరియు రిబ్కా పిల్లలిద్దరిలో చెరొకరిని అమితంగా ప్రేమించి, మరో బిడ్డను నిర్లక్ష్యం చేశారు. అందును బట్టి వారి మధ్య విభేదాలు పెరిగేలా చేశారు.
ఇస్సాకు ఏశావును అమితంగా ప్రేమించి దేవుడు యాకోబుకు చేసిన వాగ్దానమును లెక్కచేయకుండా, ఏశావును ఆశీర్వదించాలని చూశాడు. రిబ్కా, భర్తకు దేవుని వాగ్దానం గుర్తుచేయవలసింది పోయి, యాకోబు, తండ్రిని మోసం చేసేలాగా ప్రోత్సహించింది. అందును బట్టి వారిద్దరూ సఖ్యత లేనివారిగా మరియు పిలల్లను దేవుని చిత్తముగా పెంచలేని వారిగా మనకు కనబడుతారు. "కానీ వారి వివాహం అయినా మొదట్లో ఇద్దరు ఎంతో ప్రేమగా ఉన్నారని, రిబ్కా, ఇస్సాకు తన తల్లి అయినా శారా మరణం మరచిపోయేలా చేసింది" అని దేవుని వాక్యం చెపుతుంది (ఆదికాండము 24:67). అయితే ఎక్కడో వారి మధ్య దూరం పెరిగి పోయింది, కనుకనే ఇటువంటి స్థితిలోకి వెళ్లిపోయారు. భార్య భర్తలు ఒకరి నొకరు హెచ్చరించుకునే స్థితిలో ఉండాలి, ఏ విధమయిన రహస్యాలు వారి మధ్య ఉండరాదు, లేదంటే వారి మధ్య దూరం పెరిగిపోతుంది.
దేవుని కి వందనాలు అయ్యగారు🙏
రిప్లయితొలగించండి