పేజీలు

31, అక్టోబర్ 2020, శనివారం

ఎంతకాలమని సణుగుతున్నావా?

క్రీస్తునందు విశ్వాసులుగా అయిన తర్వాత, మన పోషణ, అవసరములు మరియు అక్కరలు అన్ని తీర్చువాడు ఆయనేనని విశ్వాసములో కొసాగుతాము. అది మనకు తగినది కూడా. ఎందుకంటే, యేసు క్రీస్తు ప్రభువుల వారు పలు సందర్బాలలో చెప్పిన మాటలు "దేనిని గురించి చింతపడకుడి, రేపటిని గురించి విచారించకుడి" అని. కీర్తనలు 34:10-12 లో దావీదు అంటాడు "సింహపు పిల్లలు ఆకలితో అలమటించు నెమో గాని, దేవుణ్ణి నమ్ముకొన్న వారికీ ఏదియు కొదువ ఉండబోదు" అని. అలాగే అయన  రాసిన 23 వ కీర్తన మొదటి వచనములో  "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు" అని ఉంది.  ఈ విధంగా దేవుని వాక్యము నిత్యమూ మనలను ఆదరిస్తూ, ధైర్యము నింపుతూ ఉంటుంది. నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలు జనమును ఐగుప్తు లో నుండి విడిపించి, కనాను దేశమునకు నడిపినప్పుడు, అరణ్యములో, ఎడారులలో వారిని పోషించిన విధము ఎంతో అద్భుతము, మనకు అంతే ప్రోత్సాహకరము. దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు ఎంత ప్రాముఖ్యం కలవారో మనం కూడా అంతే ప్రాముఖ్యం కలవారము. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము కూడా అబ్రాహాము సంతానముగా పిలువబడుచున్నాము. అనగా ఇశ్రాయేలు జనమునకు దేవుడిగా ఉన్న సృష్టి కర్త, వారి పోషకుడు మనకు కూడా దేవుడిగా, పోషకుడిగా ఉన్నాడు. క్రింది వచనము ద్వారా ఈ సంగతులు మనం రూడి చేసుకొనవచ్చును. 

గలతీయులకు 3: "29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు." 

ఇశ్రాయేలు వారిని దేవుడు ఐగుప్తులో దాస్యం నుండి విడిపించి, తాను చెప్పిన వాగ్దాన భూమికి వారిని నడిపిస్తున్నపుడు అంత వరకు దేవుడు చేసిన గొప్ప కార్యములు వారు మరచిపోయారు. ఐగుప్తు వారికి వచ్చిన తెగుళ్ల నుండి వారి  పక్కనే ఉన్న తమను దేవుడు ఏలా కాపాడింది పూర్తిగా విస్మరించారు. అంతే కాకుండా ఫరో సైన్యం తమను తరుముతుంటే, వారి కనుల యెదుట మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా  చీలిన అద్బుతమును చూసి కూడా వారు కేవలం కొంత సమయం ఓర్పు వహించలేక దేవుని పై విశ్వాసం కోల్పోయారు, నిత్యమూ సణుగుకున్నారు.  దాస్యం నుండి విడిపించిన గొప్ప దేవుడు తమను పోషించలేడని వారు అనుకోవటం తగునా?

యేసు క్రీస్తు ప్రభువుల వారు తన బోధనలలో ఎన్నో మార్లు మన పట్ల  దేవుని కి ఉన్న ప్రేమను బోధించారు. సృష్టి కర్త అయినా దేవుడు ఆఖరికి ఆకాశ పక్షులను సైతం పోషిస్తున్నాడు, అటువంటిది వాటి కంటే ఎన్నో రేట్లు  శ్రేష్ఠమయిన మనలను పోషించ వెనుకాడునా? క్రింది వచనములు చూడండి, ప్రభువు దేవుని ప్రేమను గురించి చెపుతున్న సంగతులు అవగతం అవుతాయి. 

మత్తయి సువార్త 6: "25.  అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; 26.  ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?"

రేపును గురించి చింత వలదని యేసయ్య చెపుతున్న మాటలు నిజమని మనం నమ్మితే దేనికి చింతపడక మన పనులు మనం చేసుకుంటూ పోవటమే.  అయినా కూడా నేను చింతపడుతాను, ఓర్పులేకుండా దేవుని మీద సణుగుకుంటాను అంటే, యేసయ్య మాటలు నమ్మటం లేదని, దేవుని శక్తిని శంకిస్తున్నావని అర్థం.  విశ్వాసిని  అని చెప్పుకొనే సోదర, సోదరి, విశ్వాసం (నమ్మకం) లేని వారెవరు దేవుణ్ణి సంతోషపెట్టలేరు.  బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు. యాకోబు కుమారుడయినా యోసేపునే తీసుకోండి, సొంత అన్నలు బానిసగా అమ్మేసారు అయినా కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. యజమానురాలు తన మీద మనసు పడితే దేవుని మీద ఉన్న భయంతో పాపం చెయ్యలేదు. మనలాగా ఆయనకు బైబిల్ కూడా అందుబాటులో లేదు,  కేవలం తన తండ్రి చెప్పిన సాక్ష్యములు తప్ప. చివరికి నిందలా పాలయి జైలులో గడపవలసిన పరిస్థితి, అయినా అతను ఎక్కడ కూడా దేవుని మీద సణిగినట్లు చెప్పబడలేదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నడు అని రాసి ఉంది. ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు? దేవుడంటే ఆయనకు భయం ఉంది, అయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంది. దేవుని కార్యములు  గంభీరములు, అయన ప్రణాళికలు ఎన్నో సంవత్సరముల ముందు చూపు కలిగి ఉంటాయి. అందుకే దావీదు తన కీర్తనలో  క్రింది విధంగా అంటాడు. 

కీర్తనలు 105: "16. దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. 17. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. 18. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. 19. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను." 

దేశముల  మీదికి  భయంకరమయిన  కరువు రాబొవుతుంది గనుక అబ్రాహాము సంతతిని కాపాడటానికి దేవుడు యోసేపును ముందుగా ఐగుప్తులోకి బానిసగా పంపాడు.  తర్వాత అతను  యజమాని పోతీఫరు వద్ద ఎన్నో యాజమాన్య పద్ధతులు నేర్చుకున్నాడు. అటుపైన జైలులో ఖైదీగా ఉన్నపుడు దేవుడు తనకు ఇచ్చిన కలలు వివరించే వరం ద్వారా  ఇతర ఖైదీలకు వారి కలలను వివరించాడు. దేవుడు రాజుకు  కలను ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు వివరించలేనప్పుడు,  యోసేపు వివరించిన  కల నిజమయి రాజు కొలువులో ఉన్న పూర్వపు ఖైదీ యోసేపు గురించి చెప్పటం, రాజు అతన్ని పిలిచి కల వివరణ విన్న తర్వాత దేశానికి ప్రధాన మంత్రిని చేయటం, తద్వారా తన సోదరులను, తండ్రిని కలుసుకోని వారిని కరువునుండి కాపాడటం అన్ని దేవుని కార్యములే. పై వచనములలో చూస్తే దేవుని వాగ్దానాలు నెరవేరు వరకు అయన వాక్కు యోసేపును పరిశోదించు చుండెను అని రాసి ఉంది. అయన వాక్కు మనలను కూడా పరిశోధిస్తుంది, కనుక  ఆ పరిశోధనలో నెగ్గుద్దాం. 

కానీ యోసేపు తర్వాత వచ్చిన మరో తరం అబ్రాహాము సంతతి వారయినా ఇశ్రాయేలీయులు మిక్కిలి విశ్వాసం లేని వారిగా, సణుగు కొంటూ దేవుని ఆగ్రహానికి లోనయిన వారిగా చూస్తాము. ఇశ్రాయేలు వారి సణుగుడు ఎంత తీవ్రంగా ఉందంటే, తనను రాళ్లతో కొట్టి చంపివేస్తారేమో  అని మోషే దేవుడికి మొఱ్ఱ పెట్టినంత. ఈ క్రింది వచనములు చూడండి:

నిర్గమకాండము 16: "7. యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి. " 

నిర్గమకాండము 17: "3.  అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషేమీద సణుగుచుఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసి కొని వచ్చితిరనిరి. 4. అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచుఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను."

ఇశ్రాయేలు వారి సణుగుడు దేవుడు విన్నడు.  వారి ఓర్పులేని తనమును దేవుడు సహించాడు. తమను దాస్యము నుండి, నరక యాతన నుండి విడిపించిన దేవుని గొప్ప కార్యమును మరచి కొద్దీ సేపు కలిగిన దాహమును బట్టి ఆ దాస్యములో ఉంటేనె మంచిది అని మాట్లాడుతున్నారు. అటువంటి ప్రవర్తన మనలో ఉందా? అయితే దేవుడు మన సణుగుడు వింటున్నాడు. అయన చేసిన గొప్ప కార్యములను మరచినందుకు బాధపడుతున్నాడు. మన సణుగుడును బట్టి అయన హస్తము మననుండి తొలగిపోక ముందే ఆయనను మన్నించమని వేడుకుందాం. ఇశ్రాయేలు జనము సణుగుడును బట్టి మోషే ఎన్నో మారులు దేవునికి మొఱ్ఱ పెట్టాడు, క్షమాపణ వేడుకున్నాడు,  అందును బట్టి దేవుడు వారిని క్షమించాడు. 

సంఖ్యాకాండము 21: "5కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్య మైనదనిరి. 6.  అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. 7. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చిమేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితివిు; యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. 8. ​మోషే ప్రజలకొరకు ప్రార్థన చేయగా యెహోవానీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను.

పై వచనములలో ఇశ్రాయేలు వారి సణుగుడును  బట్టి దేవుడు ఆగ్రహించి వారి మీదికి సర్పములు రప్పించాడు. మోషే ప్రార్థించగా సర్పము ప్రతిమను చేయించమని దాన్ని చూసిన వారినందరిని రక్షించాడు. ఇక్కడ సర్పము ప్రతిమ యేసయ్యకు ప్రతి రూపముగా ఉన్నదని భావించవచ్చు. మనకు అంతటి ఘోర శిక్ష కలుగ పోవటానికి కారణం! యేసయ్య మన పాపములు అన్ని సిలువలో భరించాడు, మరియు ఇశ్రాయేలు జనమునకు ఉన్న ప్రత్యక్షత మనకు లేదు. కానీ దేవుని ప్రత్యక్షత మనకు పెరుగుతున్న కొలది మన ఆత్మీయ  స్థాయిని కూడా పెంచుకుంటూ పోవాలి. అనగా మనం  విశ్వాసములో బలపడుతూ సాగిపోవాలి. 

దేవుణ్ణి నమ్ముకున్న వారికి అయన చిత్తము చొప్పున  సమస్తము సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తోంది. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 8 వ అధ్యాయం 28 వ వచనం చూస్తే ఆ విషయం తెలుస్తుంది. 

రోమీయులకు 8: "28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము."

అంతే కాకుండా దేవుడు మన శక్తిని మించిన శోధన మన మీదికి రప్పించడు. కనుక దేవుని మీద సణగటం మాని, ఎడతెగక ప్రార్థించి అయన చిత్తము తెలుసుకొని, అయన మీద భారం వేసి సాగిపోవటమే మన విశ్వాసము. ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లుగా మనం ఇశ్రాయేలు వంటి వారమే, వారిని పోషించిన దేవుడు మనలను కూడా పోషించును. వారిని నశింప చేసిన దేవుడు మనలను కూడా నశింపజేయగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఆ పోలికను చెపుతూ మనలను హెచ్చరిస్తున్నారు. 

1 కొరింథీయులకు 10: "4.  అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. 5. అయితే వారిలో ఎక్కువమంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి."

1 కొరింథీయులకు 10: "9. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి. 10. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి." 

పై వచనములలో స్పష్టమవుతున్న సంగతులు ఏమిటి? క్రీస్తు అనే బండలో నుండి నీరు తాగిన వారు దేవునికి ఇష్టమయిన వారుగా ఉండక సంహరింపబడ్డారు. సణుగుకొని విష సర్పముల చేత కరువబడి నశించి పోయారు. ఈ హెచ్చరికలు మన హృదయములలో ఉంచుకొని ఇకనయినా సణుగుట అప్పేద్దాం. ఎందుకంటే దేవుడు మన మీదికి మనం తట్టుకోలేని శోధన దేన్నీ కూడా అనుమతించడు. అదే అధ్యాయం లో క్రింది వచనములు దేవుడు తన పరిశుద్దాత్మ ద్వారా పౌలు గారితో  రాయించి మనకు ఆదరణ కలిగిస్తున్నాడు. 

1 కొరింథీయులకు 10: "13. సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును."

దేవుడు కార్యములు ఆలస్యం చేస్తున్నాడని భావించవద్దు, ఇంకా ఎంత కాలం అని ప్రశ్నించవద్దు. నీ అవసరములు, అక్కరలు ఆయన ఎరిగి ఉన్నాడు.  అయన ప్రణాళికలు బయలు పడితే గాని అర్థం కావు. ఆ ఆలస్యంలో ఎదో మంచి దాగి ఉంది, తన నామము నీ ద్వారా మహిమపరచుకుంటున్నాడు. అందును బట్టి ఆయనకు స్తోత్రము. కానీ ఇంకా నా వల్ల కాదు అంటే, దేవుడు నిన్ను పరిశోదించటాన్ని తప్పు పడుతున్నావా? అయన నువ్వు తట్టుకోలేని శోధన ఇవ్వడన్నా మాటను నమ్మటం లేదా? దేవుడు  ప్రతి వాగ్దానము  నెరవేర్చు సమర్థుడు, అయన రాయించిన ప్రతి మాట సత్యము. సణుగుట మాని ప్రార్థించటం అలవాటు చేసుకుందాం, అయన చిత్తమును కనిపెట్టి నడుచుకుందాం. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

10, అక్టోబర్ 2020, శనివారం

దేవుని సార్వభౌమాధికారం


పవిత్రగ్రంథం బైబిల్ లో ఎంతోమంది గొప్ప  విశ్వసాము చూపుట ద్వారా దేవుని నామమును ఘన పరిచారు. తమ మొక్కవోని ధైర్యముతో ప్రతికూల పరిస్థితులను ఎదిరించి దేవుని కృపకు పాత్రులయ్యారు. తాము నమ్మిన దేవుడు సజీవుడు అని అప్పటి సమాజానికి చాటి చెప్పారు. అంటువంటి వారిలో దానియేలు ప్రవక్త ఒక్కరు. 

ఇశ్రాయేలు జనమును దేవుడు బబులోను రాజయిన నెబుకద్నెజరు కు అప్పగించినప్పుడు, కొంతమంది యూదా యువకులను తన సామ్రాజ్యానికి తీసుకెళ్లి, వారికి విద్యలు నేర్పి తన కొలువులో ఉంచుకోవాలనుకున్నాడు. ఆవిధంగా కొనిపోబడిన వారిలో దానియేలు ప్రవక్త ఒక్కరు. అతను యుక్త వయసులోనే పరాయి రాజ్యంలో బానిసలాగా బ్రతకటానికి వెళ్ళిపోయాడు. అతని తో పాటు ఎంతో మంది యూదులు ఉన్నప్పటికి, దేవుని గ్రంథం  మరో ముగ్గురికి మాత్రమే తనలో  స్థానం కల్పించింది. వారి యూదా దేశపు పేర్లు వేరే ఉన్నప్పటికీ బబులోను సామ్రాజ్యంలో వారి అధిపతి పెట్టిన పేర్లు మాత్రం షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగో. 

దానియేలు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అతను పరాయి రాజ్యంలో బానిసలాగా బ్రతుకుతున్నాడు. తాము నమ్మిన దేవుడు, తమకు విజయం ఇవ్వకుండా ఇలా పరాయి రాజు పాలనా క్రిందికి తమను తీసుకొచ్చాడు, అని అలోచించి వేధన పడవచ్చు, దేవుని శక్తిని శంకించ వచ్చు. లోక రీతిగా ఆలోచిస్తే అది సాధారణమయిన విషయం కూడా! కానీ దానియేలుకు  దేవుని మీద అపారమయిన విశ్వాసం ఉంది. అయన కార్యముల పట్ల భయభక్తులున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితిలోను తన దేవుని ఆజ్ఞలు మీరకుండా  తన పవిత్రతను కాపాడుకోవాలనుకున్నాడు. 
 
దానియేలు 1: "5. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను."

పై వచనంలో చూసినట్లయితే రాజాజ్ఞ ప్రకారం, వారి అధిపతి రాజు తినే ఆహారమును, మరియు ద్రాక్ష రసమును  వారికి ఇవ్వజూపినప్పుడు, దేవుని  నియమములకు వ్యతిరేకమయిన ఆ ఆహారమును తినటానికి దానియేలు నిరాకరించాడు. తన తోటి వారికి ఆదర్శంగా నిలిచి, వారి విశ్వాసమును వెలికి తీసాడు. తమ అధికారికి "పది రోజులు తమకు ఆ ఆహారం ఇవ్వకుండా పరీక్షించమని" విజ్ఞాపన చేశాడు. 

దానియేలు 1: "15. పది దినములైన పిమ్మట వారి ముఖ ములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా 16. రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను." 

తర్వాత జరిగిన అద్బుతము, దేవుడు వారిని మంచి భోజనము తిన్న వారికన్నా అందంగా మార్చాడు. వారి విశ్వాసము చొప్పున దేవుడు అద్భుత కార్యమును జరిగించాడు. ఇక్కడ దానియేలు నుండి మనం దేవుని పై గొప్ప  విశ్వాసము, అయన వాక్యానుసారముగా జీవించాలన్న దృఢ సంకల్పము నేర్చుకోవాలి. అదేవిధంగా  దేవుని అధికారమును, అయన చిత్తమును అంగీకరించి అన్ని వేళలో లోబడి ఉండే  స్వభావమును కూడా.  

తర్వాత ఇదే గ్రంథం లో కనిపించే మరొక సంఘటన కూడా మన విశ్వాసమును బలపరచటమే కాకుండా, దేవుని అద్భుత కార్యమును బయలు పరచి అన్యులను సైతం మన దేవుణ్ణి అంగీకరింప జేస్తుంది. 

రాజయిన నెబుకద్నెజరు ఒక గొప్ప బంగారు దేవత విగ్రహమును చేయించి,  తన రాజ్యంలో ఉన్న అందర్నీ దానికి సాగిలపడి మ్రొక్కమని ఆజ్ఞాపించినప్పుడు, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగో లు నిరాకరించారు. ఉగ్రరూపుడయిన ఆ రాజు వారిని మండుచున్న అగ్ని గుండములో పడవేస్తానని బెదిరించినపుడు వారు పలికిన మాటలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి.  దానియేలు గ్రంథం మూడవ అధ్యాయంలో ఆ సంఘటనను మనం అధ్యయనం చెయ్యవచ్చు. 


దానియేలు 3: "16. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరినెబుకద్నెజరూ,యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు. 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను 18. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము."
 
పై వచనంలో చూసినట్లయితే ఆ ముగ్గురు విశ్వాసులు రాజ్ఞనను ధిక్కరించారు, దేవుని మీద గొప్ప  విశ్వాసమును చూపించారు. అయితే కాస్త లోతుగా విషయమును పరిశీలిస్తే మరి కొన్ని మంచి  విషయాలు మనం నేర్చుకొనే అవకాశం ఉంది. 

రాజీపడని మనస్థత్వం: దేవుని వాక్యం మనలో దీనత్వం, తగ్గింపుతనం ఉండాలని చెపుతుంది, కానీ ఈ రాజీపడని మనస్థత్వం ఏమిటీ? పైన జరిగిన సంఘటనలో షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఇతర దేవత  విగ్రహముకు  సాగిలపడవలెనని రాజాజ్ఞ వచ్చింది. కానీ జీవము గల దేవుని ఆజ్ఞల ప్రకారం  వారు ఏ విధమయిన విగ్రహములను, మరియు ఇతర దేవతలను పూజించ రాదు. వారు రాజీపడి ఆ విగ్రహమునకు మొక్కినట్లయితే తమ దేవుని ఆజ్ఞలు మీరినట్లే.  తమ ప్రాణములకు ప్రమాదం ఉన్నదని తెలిసినా, దేవుని ఆజ్ఞను మిరకూడదని, తమ ఆత్మీయతకు భంగం కలగరాదని వారు రాజాజ్ఞను సైతం  లెక్క చెయ్యలేదు. అంటువంటి రాజీపడని తత్వం మనలో ఉందా? వారిలాగా ప్రాణాలకు తెగించవలసిన సందర్భం లేకపోయినా, స్వల్పమయిన విషయాలలో రాజీపడిపోయి మన ఆత్మీయ జీవితాన్ని చల్లార్చుకుంటూ ఉంటాము. లోకపరమయిన స్నేహాల కోసం, అందరు చేస్తున్నారులే అన్న నిర్లక్ష్యంతో దేవుని వాక్యానికి విరుద్దమయిన ఎన్నో పనులు అవలీలగా రాజిపడి చేసేస్తాం. దేవునికి మనకు మధ్య దూరం పెంచేది, మన ఆత్మీయతను ప్రశ్నార్థకం చేసేది ఎటువంటిదయినా పాటించకుండా, ఎంత గొప్ప వారికయినా లొంగిపోకుండా ఉన్నప్పుడు, దేవుడే మన పరిస్థితులు చక్కబెడుతాడు. దానికి ఉదాహరణ, రాజు యొక్క ఆహారం విషయంలో దానియేలు తమ అధికారిని  బ్రతిమాలుకున్నప్పుడు అతనికి వారి పట్ల కనికరం కలిగేలా చేసింది దేవుడే అని వాక్యం స్పష్టంగా తెలుపుతోంది. 

దానియేలు 1: "8. రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా  9. దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను ..."

పరిస్థితులను అనుకూలంగా మార్చే దేవుని శక్తిని నమ్మి, మనలను ఆయనకు దూరం చేసే ఏ విషయములోనయిన రాజీపడకుండా జీవించే మనస్థితిలో మనం ఉన్నామా? ఈ ఒక్కసారే కదా అని లొంగిపోతున్నామా? 

స్థిరమైన విశ్వాసం: ఈ సంఘటనలో ఈ ముగ్గురు విశ్వాసులు దేవుని శక్తిని సంపూర్ణంగా నమ్ముతున్నారు.  అయన తమను అగ్నిగుండంలో నుండి కాపాడగలిగిన సమర్థుడు అని విశ్వసించారు. ఈ విశ్వాసము వారికి ఎలా వచ్చింది? దేవుని ఆజ్ఞలను వారు తుచ తప్పకుండా పాటిస్తున్నారు కనుకనే అని చెప్పుటలో సందేహం లేదు. యోబు తన శ్రమల కాలంలో చెప్పిన మాటలు ఈ ముగ్గురి పట్ల జరిగిన సంఘటనకు ఆపాదించుకోవచ్చు. 

యోబు 23: "10. నేను నడచుమార్గము ఆయనకు తెలియునుఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును."

పై వచనంలో యోబు దేవుడు  తన మీదికి  శోధన అనుమతించిన  తర్వాత బంగారము వలె కనబడుతానని అంటున్నాడు. మరొక చోట యోబు అంటాడు "నా విమోచకుడు సజీవుడు" అని. మనందరికీ తెలిసిన విషయం, బంగారమును అగ్నిలో వేసి కరిగించి శుద్ధి చేస్తారు. ఇక్కడ కూడా ఈ ముగ్గురిని రాజయిన నెబుకద్నెజరు అగ్ని గుండములో పడవేస్తానంటున్నాడు. మన జీవితాల్లో కూడా కష్టాల కొలిమి ఒక్కోసారి ఎక్కువగా  మండవచ్చు. మనం నడుస్తున్న బాట భారంగా అనిపించవచ్చు. కాని మన దేవునికి మన మార్గము తెలుసు. మనకన్న ముందుగానే మన అవసరతలు తెలుసు. దేవుని మీద విశ్వాసం ఉంచి, అయన శక్తిని నమ్ముకొని సాగిపోవటం అలవాటు చేసుకోవాలి.  ఎందుకంటే మన దేవుడు సజీవుడు, మాట్లాడలేని బంగారుతో చేసిన విగ్రహం కాదు.  ఈ  విషయము ఎరిగిన వారు కనుకనే షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలు తమ దేవుడి మీద అపారమయిన విశ్వాసం చూపుతున్నారు. వారితో పాటు ఉన్న ఇతర యూదులు వారిలాంటి విశ్వాసం చూపించలేక పోయారు.  అపొస్తలుడయినా పౌలు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో  హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో  విశ్వాసము గురించి ఎంతో గొప్పగా వివరించారు. 

హెబ్రీయులకు 11: "1. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది."

హెబ్రీయులకు 11: "6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా."

పైనున్న మొదటి వచనంలో స్పష్టంగా విదితం అవుతున్న విషయం, "మనం ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం.   కనిపించని వాటికి రుజువులు వెతకకుండా ఉండటమె విశ్వాసం". అదే విధంగా మరో వచనంలో  "విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టటం అసాధ్యం. తనను నమ్ముకున్న వారికి తగిన రీతిలో మేలు చేయువాడు ఆయనే". ఈ ముగ్గురు వ్యక్తులు అదే విధమయిన విశ్వాసమును చూపిస్తున్నారు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, వారివంటి విశ్వాసం కలిగి ఉన్నామా? దేవుని శక్తిని శంకించకుండా ఉండగలుతున్నామా?   లేక దేవా అసలు చెయ్యగలవా అని ప్రశ్నిస్తున్నామా? ప్రశ్నించిన ప్రతిసారి విశ్వాసంలో ఒక్క మెట్టు కిందికి జారుతున్నామని ఎరిగిన వారాం కావాలి. 

దేవుని చిత్తము అంగీకరించటం: ఇక్కడ షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోల విశ్వాసం ఎంత గొప్పదయినా దేవుని చిత్తమును దాటి పోవటం లేదు. దేవుడు తమను కాపాడే సమర్థుడు అనే  విశ్వాసముతో  పాటు ఒక వేళ కాపాడక పోయిన చింత లేదు అని సమాధానం ఇస్తున్నారు. వారి విశ్వాసములో దేవుని చిత్తమును అంగికరిస్తున్నారు. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నం కదా! దేవుడు తమను తప్పకుండా కాపాడాలి అన్న ఎదురుచూపు వారిలో లేదు. కానీ దేవుని చిత్తమునకు తమ పరిస్థితిని అప్పగించుకున్నారు. దేవుని చిత్తమును అంగీకరించే మనసు మనకు ఎప్పుడు వస్తుంది? ఆయన కార్యములు మన కోరికలకన్నా ఉన్నతమయినవి, గంభీరమయినవి అని మనం నమ్మినప్పుడు. అది కూడా విశ్వాసము మూలంగానే సాధ్యం అయింది.  మనం అటువంటి స్థితిలో ఉన్నామా? మనం అనుకున్నది ఒక్క పని జరగక పోతేనే ఎంతగానో చింతిస్తాం, దేవుని ఉనికిని ప్రశ్నించటానికి కూడా సాహసిస్తాం. మనస్ఫూర్తిగా ప్రార్థించటానికి కూడా కష్టపడతాం! మన కోరికలు ఏమయినా గాని, మనం ఎంతగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న గాని, ఎంత ప్రార్థన పరులమయిన గాని, అయన చిత్తమును అంగీకరించి జీవిద్దాం. అయన  మన అవసరములను బట్టి, తగు సమయములో  మనకు మేలు చేయు కార్యములు చేయ సమర్థుడుగా ఉన్నాడు.

-: దేవుని అద్బుత కార్యము :-

దానియేలు 3: "20. మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించిషద్రకును, మేషా కును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా 21. వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్ర ములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి. 22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి. ​ 23. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మను ష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా 24. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచిమేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రుల నడి గెను. వారురాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి.  25. అందుకు రాజునేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను."

పై వచనములను అధ్యయనం చేస్తే దేవుని గొప్ప కార్యములను మనం చూడవచ్చు. తన ఆజ్ఞను దిక్కరించారని రాజయిన నెబుకద్నెజరు షద్రకు, మేషాకు ఇంకా అబేద్నెగోలను అగ్ని గుండములో పడ వేయించాడు. ఆ అగ్ని దాటికి వారిని పడవేసిన వారు కాలి పోయారు గాని, అగ్నిలో పడ్డ వారు మాత్రం నశించిపోలేదు. మన పక్కన వెయ్యిమంది కూలినా దేవుడు మనలను మాత్రం పడిపోనివ్వడు అనటానికి నిదర్శనంగా లేదూ! 

వారికి కట్టిన బంధకములు వీడి పోయాయి, వారు స్వేచ్చ గా అగ్నిగుండములో సంచరిస్తున్నారు. దేవుని చిత్తములో ఉంటె మన శోధనల్లో సైతం ఏ బంధకములు లేని వారిగా సంతోషముగా తిరుగుతాం, ఎందుకంటే  దేవుడు ఆ శోధనల్లో మనతో పాటు ఉంటాడు. మన బందకాలను విడిపించి, ఆ శోధనలు మనలను నశింప జేయకుండా కాపాడుతాడు. మన స్థిరమయిన విశ్వాసం, నీతివంతమయిన ప్రవర్తన, అయన చిత్తమును అంగీకరించే తత్వం మన జీవితాల్లో అయనచే గొప్ప కార్యములు చేయిస్తాయి. ఈ శోధనలు  మనలను స్వచ్చమయిన బంగారము వలె మార్చి, మన విశ్వాసము గొప్పగా బలపరచి,  దేవుని కృపకు మరింత దగ్గరగా చేరుస్తాయి.  

దానియేలుకు మొదట దేవుడు చేసిన అద్భుతం "మంచి ఆహారం తిన్నవారికంటే, వారందర్ని అందముగా మార్చటం". దీన్ని బట్టి చూస్తే, మన అవసరమును బట్టి దేవుడు తన కార్యములు జరిగిస్తాడు. దానియేలు బృందం పరిశుద్దతను కాయటానికి, వారి విశ్వాసమును బట్టి వారి జీవితాల్లో అద్భుత కార్యం జరిగించాడు. అటువంటి కార్యములు మన జీవితాల్లో కూడా చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు.  ఇక్కడ మన తెలివితో, సామర్థ్యంతో పనిలేదు, మనం ఉన్న పరిస్థితులు ఏవయినా పర్వాలేదు, వాటిని మార్చి మనలను ఉన్నంతగా నిలిపే సమర్థుడు మన దేవుడు. 

మన ఆత్మీయ సాక్ష్యమును కాపాడుకుంటూ, అయన సామర్థ్యమును విశ్వసిస్తూ, అయన చిత్తమును కనిపెట్టుకుని ఉంటే, ప్రతి శోధన నుండి కాపాడి,  మనలను గొప్పగా దీవించటానికి అయన ఎప్పుడు ఆలస్యం చేయని దేవుడు. ఇక్కడున్న నలుగురు దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించలేదు! అక్కడినుండే వారి విశ్వాసం మొదలయింది. అయన శక్తిని శంకించలేదు కనుకనె వారి విశ్వాసం చెక్కుచెదరనిదిగా రూపుదిద్దుకుంది. దేవుని శక్తిని చాటి, అన్యుల ముందు అయన  నామమునకు ఘనత తెచ్చింది. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం  మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!