పేజీలు

26, ఫిబ్రవరి 2022, శనివారం

ముచ్చట్లకు అలవాటు పడిపోయావా?

 

మనలో చాలామందికి ఎంతో ఇష్టమయిన వ్యాపకము బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం కన్న ఇతరుల గురించి ముచ్చటించుకోవటం. అనగా ముసలమ్మా ముచ్చట్లు ఎంతో ప్రితికరమయినవి. దేవుణ్ణి తెలుసుకోక ముందు సినిమాలు, షికార్లు ఇంకా ఎన్నో బోలెడు వ్యాపకాలు ఉండేవి. మరీ ఇప్పుడు పొద్దు పుచ్చటం ఎలా? అస్తమానం బైబిల్ ఎం చదువుతాం! ఎన్నిసార్లు ప్రార్థిస్తాం! సరదాగా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకొంటే తప్పేంటి? సాటి సహోదరి, సహోదరులే కదా! బైబిలే చెపుతుంది సహోదరులను హెచ్చరించమని వారిని సరయిన మార్గంలో నడుపుమని. మరింకేంటి? అని చాల సంఘములలో చాల మంది విశ్వాసులు ఇలా ఆలోచిస్తూ దేవునికి ఇష్టంలేని కార్యములు చేస్తూ పాపములో ఉండిపోతున్నారు. 

ఇక టెక్నాలజీ పెరిగిపోయాక సంఘములలో వాట్స్అప్ గ్రూపులు పెరిగిపోయాయి. ఒక్క తాటి మీద, క్రీస్తు ప్రేమను బట్టి నడుచుకోవాల్సిన విశ్వాసులు అస్తమానం చాటింగ్లలో గ్రూపులు పోషిస్తూ, తమతో కలువలేని, స్నేహంగా లేని విశ్వాసులను బట్టి దుష్ప్రచారం చేస్తూ మానసికమయిన పాపములకు లోనవుతున్నారు. ఇందులో అడా మగ తేడా లేదు. ఆరాధన అయిపోగానే ఫెలోషిప్ పేరుతొ కబుర్లాడుకోవటం, తమ మధ్య లేని సాటి సహోదరి, సహోదరుల మీద ఛలోక్తులు వేసుకోవటం చాల సంఘములలో పరిపాటి. ఇటువంటి ప్రవర్తన వాక్యాను సారమా?  అన్యులు సైతం దగ్గర లేని వారి గురించి మాట్లాడకూడదు అని మర్యాదను పాటిస్తారు. క్రీస్తును ఎరిగిన వారిగా ఉన్న మనము, సాటి క్రీస్తు విశ్వాసులను కించపరుస్తూ ఛలోక్తులు వేసుకోవటం క్రీస్తు ప్రేమను చూపిస్తుందా? ఎవరయినా వాక్యానుసారం నడుచుకోక పొతే సంఘ పెద్దలు నచ్చచెప్పాలి, కానీ పది మందిలో వారిని కించపరచటం క్రీస్తుకు వారిని దగ్గర చేస్తుందా? మానసిక క్షోభకు గురయిన వారు క్రీస్తుకు దూరమయితే దానికి బాధ్యులు మనం కదా? సరదాగా మాట్లాడుకోవటం తప్పుకాదు! అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న చనువును బట్టి, స్నేహమును బట్టి ఉంటుంది. కానీ సంఘములో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను మాత్రమే చూపించాలి. తన ఆత్మీయ కూమారుడయినా తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తూ రాసిన మొదటి లేఖలో ఈ వచనం చూడండి!

1 తిమోతికి 4: "7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము." 

ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవుని పై భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము అంటున్నాడు పౌలు. "నీకో విషయం తెలుసా! ఫలానా వాళ్లు ఫలానా" అని మొదలు పెట్టి, దానికి ఇంకెన్నో కల్పితాలు జోడించి సదరు ఆ కుటుంబాన్ని  దోషులుగా నిలబెట్టటమే కొందరి పని. నాలుగు వాక్యాలు కంఠత వచ్చి, పది పాటలు పాడగలిగితే చాలు, వీరిని మించిన నీతి మంతులు, భక్తి పరులు ఉండరన్న భావనలో బ్రతుకుతుంటారు. ఎదుటి వారికి  అదేపనిగా తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రేమను చూపటం వీరికి చేతకాదు. ఎదుటి వారు వేసుకున్న దుస్తులను బట్టి, ఆభరణాలను బట్టి వారి భక్తిని నిర్ణయించి గుస గుసలు మొదలు పెట్టేస్తారు. వీటి వలన ఆత్మీయ జీవితానికి వచ్చే ఉపయోగం ఏమిటి? గుస గుసలు చేయటం అన్నది సాతాను లక్షణం. ఎందుకంటే వాడు చెప్పేది నిజం కాదు కాబట్టి. కానీ యేసు క్రీస్తు తనను పట్టుకోవటానికి వచ్చిన వారితో, మరియు తనను విచారిస్తున్న వారితో ఏమన్నాడు "అందరి ముందు వెలుగులో నేను బోధించాను కదా! ఇప్పుడు ఏమిటి చీకటిలో నన్ను బందించాలని వచ్చారు" అని. వెలుగు సంబంధులయిన మనకు  చీకటితో సంబంధం దేనికి?

2 తిమోతికి 2: "16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు."

ఇటువంటి అపవిత్రమయిన మాటలకు విముఖులమై ఉండవలెనని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అట్టి మాటలు పలికే వారు భక్తి హీనులవుతారని దేవుని ఆత్మ పౌలు గారి ద్వారా మాట్లాడుతుంది.  ఛలోక్తుల దగ్గర మొదలు పెట్టి వివిధ రకాల మాటలకు ఆ సంభాషణలు దారి తీస్తాయి. తద్వారా మనలో చిక్కగా ఉండవలసిన క్రీస్తు ప్రేమ పలుచనవుతుంది. ఒకరిని మించిన వారిమి ఒకరమని నిరూపించుకోవటం క్రీస్తు తత్వమా లేక అతిశయం మానివేసి అణిగి ఉండుట క్రీస్తు తత్వమా? 

1 కొరింథీయులకు 5: "6.  మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?"

పై వచనంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో కొంచెం పులిసిన పిండి, మొత్తం పిండిని పులియ చేసినట్లు ఎంతో చిన్నదిగా కనిపించే ఈ ముచ్చట్ల అలవాటు మనలను క్రీస్తుకు విరోధులుగా మారుస్తుంది. తీర్పు తీర్చేవారిగా మనలను ఎదిగిస్తుంది.  వాక్యాను సారముగా నడచుకోని వారిని హెచ్చరించమన్న పౌలు గారు సంఘములో కలహములు ఉండవలదని ఉపదేశించారు (1 కొరింథీయులకు 1:11). క్రీస్తు ప్రేమతో ఐక్యంగా ఉండవలసిన సంఘములో కలహములు ఎలా వస్తాయి? 

సామెతలు  26: "22. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును." 

పై వచనం చూడండి చాడీలు చెప్పు వాని మాటలు రుచిగల పదార్థం వంటివి. వాటిని బట్టి సంఘములో సహోదరుల మధ్య అపార్థములు చోటు చేసుకుంటాయి. తద్వారా సంఘము యొక్క అభివృద్ధి ఆగిపోతుంది. దేవుని పరిచర్య జరగటం కుంటుపడుతుంది, మరియు విశ్వాసులు భక్తి హీనులుగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు.  దురదృష్టవశాత్తు మనలో చాల మంది ఎదుటి వారి జీవితాలలో ఏమి జరుగుతుందో వారి ఆత్మీయ స్థితి ఏమిటో తెలుసుకోవటంలో ఉన్న ఆసక్తి మనం క్రీస్తులో ఎలా ఉన్నాము, ఇంకా అయన ప్రేమను ఎలా పంచాలి అన్న వాటి మీద ఉండటం లేదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పటమే వీరి ఆత్మీయ జీవితం అవుతోంది. తద్వారా సంఘములో పదవులు ఆశిస్తూ తమ ఆత్మీయ జీవితానికి చేటు చేసుకుంటున్నారు. సహోదరుడా, సహోదరి ఇకనయినా మేలుకో! ప్రభువును మించిన శక్తి ఏది లేదు! ప్రభువు తన చిత్తానుసారముగా నిన్ను దివిస్తాడు. అయన సేవకు అవసరమయిన పదవిలో నిన్ను కొనసాగిస్తాడు. 

సామెతలు 16: "28. మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును."

సొలొమోను గారు రాసిన సామెతలు గ్రంథంలో ఎన్నిమార్లు చాడీలు చెప్పేవారి గురించి హెచ్చరిక చేయబడిందో తెలిస్తే దేవుడు ఇటువంటి ప్రవర్తన విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో అర్థమవుతుంది. ముచ్చట్లు చెపుతూ, చాడీలు మోస్తూ ఏమిటి సాధిస్తారు? ఇదేమీ క్రీస్తు ప్రేమ! ఇదేమి ఆత్మ నడిపింపు! సంఘము క్షేమమును పాడు చేసేవాడు క్రీస్తుకు విరోధిగా మిగిలిపోతాడు. స్నేహితుల మధ్య కలహములు రేపేవాడు దేవుని ఆగ్రహమునకు పాత్రుడవుతాడు. 

సామెతలు 11: "12. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును. 13. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును."

మనకున్న జ్ఞానము, విశ్వాసము కేవలము దేవుడు ఇచ్చిన కృపమే అని నమ్మిననాడు ఎవరి మీద చిన్న చూపు ఉండదు, కేవలం క్రీస్తు ప్రేమను బట్టి వారిని ప్రోత్సహిస్తాము, మనకు తెలిసిన దేవుని వాక్కుల ద్వారా వారిని సున్నితంగా హెచ్చరిస్తాము. కానీ వివేకము లేని వారు, క్రీస్తు ప్రేమ లేని వారు మాత్రమే ఎదుటి వారిని చిన్న చూపు చూస్తారు. ఎవరయినా మనలను నమ్మి తమ పాత జీవితంలో చేసిన తప్పులను పంచుకున్నట్లయితే వారి నమ్మకమును నిలబెట్టుకోవాలి. ఎక్కడ కూడా వారిని దెప్పిపొడవటం కానీ, పది మందిలో వారి గుట్టు రట్టు చేయటం కానీ చేయరాదు. అట్టి వారు దేవుని ప్రేమను చూపించని వారిగా ఉన్నారు. దేవుడే వారి తప్పులను గుర్తుంచుకోను అంటున్నాడు, మధ్యలో మనం ఎవరం? మన తప్పులు బయట పడనంత వరకే మనం నీతిమంతులం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, క్రీస్తు రక్తంలో మనం నీతిమంతులం. మనలో పాపం లేదు, ఏ తప్పులేదు అనుకొంటే దేవుని సత్యం మనలో లేదు. కొన్ని సంఘాలలో సాక్ష్యం చెప్పటానికి కూడా సాటి విశ్వాసులు ఆలోచించే పరిస్థితి! ప్రభువు తమ జీవితాలను ఎలా మార్చాడో చెప్పటానికి, వారి పాత జీవితమును పంచుకొంటే చాలు, వారిని తిరిగి అదే దృష్టితో చూస్తూ ఉంటారు, వారి మీద ఇదివరకు లేని కొత్త అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు, మరో విధంగా వారితో ప్రవర్తిస్తారు. 

క్రీస్తులోకి వచ్చిన వాడు నూతన సృష్టి అని నమ్మిన నాడు, ఎవరిని వారి పాత జీవితమును బట్టి చిన్నచూపు చూడము. పౌలు గారు ఫిలేమోనుకు రాసిన పత్రిక సారాంశం ఏమిటి?  బానిసగా ఉండలేక దొంగగా పారిపోయిన ఒనేసిమును కుమారుడిగా సంబోధిస్తూ ఇక మీదట అతను దాసుడు కాదు గాని క్రీస్తులో సహోదరుడు అని ప్రకటిస్తున్నాడు.  కనుక సహోదరి, సహోదరుడా ముచ్చట్లు మానివేయండి, చాడీలు చెప్పటం అపివేయండి, ఎదుటి వారి సంగతులు గోప్యంగా ఉంచండి. 

ఎఫెసీయులకు 4: "29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి. 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు. 31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. 32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి."

ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. అవసరమునుబట్టి అనుకూల వచనములే పలుక వలెను గాని ఏ విధమయిన దుర్భాషలు పలుకరాదు. దాని వలన దేవుని పరిశుద్దాత్మ దుఖఃపడుతుంది. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ అన్ని రకాల దుష్టత్వములను  మానుకోవాలి. ఒకరి యెడల ఒకరు దయగలిగి కరుణా హృదయమును కలిగి ఉంటూ దేవుడు మనలను క్షమించినట్లు ఇతరులను మనం కూడా క్షమించాలి. అంతే కానీ ఎదుటి వారి తప్పులను భూతద్దంలో పెట్టి చూపిస్తూ వారిని సిగ్గుపరచటం వాక్యానుసారం కాదు. వ్యభిచారంలో పట్టుపడిన స్త్రీని సైతం "అమ్మ" అని పిలిచినా గొప్ప ప్రేమ కలిగిన దేవుని విశ్వాసులము మనము. అటువంటిది సాటి సహోదరులు తప్పు చేస్తే మనమే నీతి మంతులము అయినట్లు చాడీలు చెప్పటం, గుసగుస లాడటం క్రీస్తు ప్రేమకు  విరుద్ధమే కదా?

మత్తయి 1: "19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను."

పై వచనము చూడండి! మత్తయి సువార్తలో యేసయ్య పుట్టుకకు ముందు మరియమ్మ పరిశుద్దాత్మ ద్వారా గర్భవతి అయినందుకు ప్రధానం చేయబడిన యోసేపు ఆమెను అవమానము చేయలేదు. రహస్యముగా ఆమెను విడవాలని చూశాడు. యోసేపు వంటి మనసు మనకు ఉందా? ఎదుటి వారి పిల్లల్లో గాని, వారి జీవితాల్లో గాని ఏవయినా తప్పులుంటే బయటపెట్టి అల్లరి పెట్టటం కాదు. వాక్యానుసారముగా హెచ్చరిస్తూ క్రీస్తు ప్రేమ ద్వారా  వారిని ప్రోత్సహించాలి.  సహోదరి, సహోదరులారా ప్రభువు ప్రేమ ఎప్పుడు ఇతరుల తప్పులను ఎత్తి చూపదు. ఆ ప్రేమకు తప్పులను క్షమించి మరచిపోవటమే తెలుసు. కానీ వాటి విషయమై గుస గుసలు పెట్టడం, చాడీలు మోయటం క్రీస్తు ప్రేమ కానేరదు. 

చాడీలు చెప్పే ప్రవర్తన మనలో ఉంటె క్రీస్తు లక్షణములు మనలో లేనట్లే! అయన ప్రేమను మనం పాటించనట్లే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక  13 అధ్యాయంలో ప్రేమ లక్షణములు  చదవండి. క్రీస్తు ప్రేమకు బద్దులుగా ఉన్న మనము వ్యర్థ పలుకులు  పలుకుతూ, చాడీలు చెపుతూ సంఘమును శోధించటం తగదుదేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి