విశ్వాసులు అయిన మనము మన జ్ఞానమును బట్టి కొన్ని సంగతులు ఇలా జరగాలి, ఆలా జరగాలి అని అనుకుంటాము. మన ఆలోచన ప్రకారం లేదా మనకు తెలిసినట్లుగా జరగనప్పుడు బాధపడటం అత్యంత సహజం. కానీ దేవుని మార్గములు అత్యంత మర్మమయినవి, మానవ జ్ఞానమునకు అందనివి. అనంత జ్ఞానము కలిగిన దేవుని, కార్యములు ఉన్నతమయినవి, ఆవి మనలను అభివృద్ధి చేయటానికే దేవుడు మన జీవితాలలో జరిగిస్తున్నాడు. కానీ మనలో కొంత మంది ముందస్తు ఆలోచనలతో, ఊహలతో ప్రార్థిస్తారు అటుపైన తమ ఆలోచనలకు, ఊహలకు విరుద్ధంగా పరిస్థితులు కలుగుతుంటే నిరాశపడి పోతారు.
ఉదాహరణకు ఒక గణిత సమస్యకు రెండు మూడు రకాల విధానాల్లో సమాధానం కనుక్కొనే అవకాశం ఉండవచ్చు. విద్యార్థికి ఒక్క రకమయిన విధానామే తెలిసి ఉండవచ్చు. కానీ టీచర్ కు ఆ సబ్జెక్టు మీద ఉన్న జ్ఞానము ఎక్కువ గనుక మరి కొన్ని విధానాలు తెలిసి ఉండవచ్చు. అలాఅని విద్యార్థి టీచర్ ను నాకు తెలిసిన విధంగానే సమాధానం చెప్పమనటం అతని జ్ఞానమును అపి వేస్తుంది. ఆలాగే విశ్వాసి కూడా దేవుని మార్గములను ప్రతిఘటించటం, తాను అనుకున్నట్లుగా జరగాలను కోవటం కూడా అటువంటిదే. ఉదాహరణకు నీ జీవితంలో ఒక సమస్య తీరాలంటే ఫలానా ఫలానా విషయాలు జరిగితే నా సమస్య తీరుతుందని నీ జ్ఞానమును బట్టి అలోచించి ప్రార్థిస్తుంటావు, కానీ వాటికి విరుద్ధంగా సంఘటనలు జరిగితే కంగారుపడి పోయి విశ్వాసంలో వీగిపోయే అవకాశం ఉంది కదా! కానీ దేవుడు తన జ్ఞానము చొప్పున మరో విధంగా నీ సమస్యను తీరుస్తున్నాడు అని విశ్వసించాలి.
ఎర్ర సముద్రం ఎదురుగా ఉండి, ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు మాత్రం ఊహించారా? సముద్రంలో ఆరిన నేలమీద నడుస్తామని. వారు పాటలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ యెరికో గోడల చుట్టూ తిరిగితే బలమైన ప్రాకారాలు కూలి పోయి ఆ దేశము తమ వశం అవుతుందని వారికీ మాత్రం తెలుసా! దేవుని మార్గములు ఆసాధారణమయినవి, ఎంతో అద్బుతమయినవి. అయన మహిమను నీ జీవితంలో నిరూపించి తద్వారా నీ విశ్వాసమును మరింత పెంచటమే అయన ఉద్దేశ్యం, ఆ విధంగా నిన్ను మరింత దగ్గరగా చేర్చుకోవటమే అయన కోరుకుంటున్నది. అంతలోనే అలిగి పోతావా? కాస్త ఆలస్యానికే కుంగిపోతావా?
నువ్వు ఊహించినట్లుగా జరిగితే నీ విశ్వాసం బలపడుతుందా? దేవునికి మహిమ కలుగుతుందా? బైబిల్ నుండి ఒక్క సంఘటన చూద్దాం. సిరియా రాజ్యానికి సైన్యాధ్యక్షుడయిన నయమాను కుష్టు రోగంతో బాధపడుతు ఉండగా, దేవుని మహిమ ద్వారా ఇశ్రాయేలు పై విజయం పొందిన తర్వాత బానిసగా కొనిపోబడిన ఒక్క అమ్మాయి, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రవక్త ఎలీషాను దర్శిస్తే నయమాను కుష్టు నయం అవుతుందని అతని భార్యకు చెప్పుట ద్వారా, నయమాను ఎలీషాను కలుసుకుంటాడు. ఎలీషా తన మీద చేతులు ఉంచి ప్రార్థిస్తే తన కుష్టు నయం అవుతుందని నయమాను అనుకుంటాడు. కానీ ఎలీషా కనీసం తన గుడారంలో నుండి బయటకు రాకుండా తన అనుచరుడితో నయమానును యొర్దాను నదిలో ఏడు మార్లు మునిగి శుద్ధుడవు కమ్ము అని వర్తమానం పంపుతాడు.
2 రాజులు 5: "11. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి,తన దేవుడైన యెహోవా నామ మునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. 12. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను."
ఈ వచనములలో నయమాను కోపగించుకొని వేళ్ళ నిశ్చయించుకోవటం చూడవచ్చు. తానూ అనుకున్నట్లు ఎలీషా తనను చూడటానికి బయటకు రాలేదు, మరియు తానూ ఊహించినట్లుగా తన మీద చేతులుంచి ప్రార్థించలేదు. నయమాను ఇశ్రాయేలును జయించిన పొగరుతో వచ్చాడు, బాగుపడితే ఎన్నో కానుకలు ఇస్తాను కదా అన్న గర్వపు ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుని మహిమ ద్వారా ఇశ్రాయేలును జయించాడని తనూ ఎరుగడు. నేను జయించిన దేశమే కదా అనుకుని ఇశ్రాయేలు నదులలో నీటిని సైతం తక్కువగా చూస్తున్నాడు, ఈ మునకలేవో ఎంతో శ్రేష్ఠమయిన మా దేశపు నదులలోనే వేసేవాణ్ణి కదా అనుకుంటున్నాడు కానీ ఇక్కడ దేవుడి కార్యం ఉన్నదన్న విషయం గుర్తించలేక పోయాడు.
2 రాజులు 5: "13. అయితే అతని దాసులలో ఒకడు వచ్చినాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయ కుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను."
ఈ వచనములలో ఒక తెలివయిన దాసుని సలహాలు వినవచ్చు. ఆ ప్రవక్త ఏదయినా కష్టతరమయిన పని చెపితే చేసేవాడివి కదా? ఇంత చిన్న పని చేస్తే నీకు వచ్చే నష్టం ఏమిటి, అయన చెప్పినట్లు స్నానము చేసి కుష్టు నయం చేసుకోవచ్చు కదా అంటున్నాడు. నిజమే కదా, చాల సార్లు మనం కష్టమయినవి చేస్తేనే ఫలితాలు పొందుతాము అనుకుంటాము. కానీ కొలిమిలో ఉన్న ఇనుమును ఎంత బలంతో, ఏ విధంగా కొడితే అనుకున్న పరికరం తయారవుతుందో, కమ్మరికి మాత్రమే తెలుసు. ఎంత కష్టంతో కార్యం జరిగిస్తే నీ విశ్వాసం బలపడుతుందో, ఆయనకు మహిమ కలుగుతుందో దేవునికి మాత్రమే తెలుసు. ఇలాగె జరగాలి, ఆలా జరగటం లేదు అని కోపగించుకుంటే ఎలా? కొన్ని సార్లు సులభంగా అవుతుందన్నదనుకున్నది కూడా కష్ట తరంగా మారవచ్చు. అందులో దేవుని హస్తముందని గుర్తించాలి, వేచి చూడాలి.
నయమాను ఎలీషా చెప్పిన విధంగా చేసి పసి వాడి మాదిరి చర్మమును పొందుకున్నాడు. అప్పుడు గాని దేవుని మహాత్యమును గుర్తించలేదు. తానూ అనుకున్నట్లుగా ఎలీషా బయటకు వచ్చి తనను ఆహ్వానించి, చేతులుంచి ప్రార్థిస్తే తన గర్వం అణిగేదా? దేవుని యందు విశ్వాసం పెంచుకొనే వాడా? చక్రవర్తి సైన్యాధిపతిని కనుక నాకు గౌరవం ఇస్తున్నాడు, నేను కోరుకున్నట్లే ప్రార్థించాడు అనుకుని, తెచ్చిన కానుకలు ఇచ్చి వెళ్ళిపోయేవాడు.
2 రాజులు 5: "15. అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును;...."
"17. అప్పుడుయెహో వాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా?"
చూడండి ఈ వచనములలో నయమాను ఎంతలా మారిపోయాడో తెలుస్తుంది. ఇశ్రాయేలును జయించాను కదా, ఏముంది దీని గొప్ప అనుకున్న వాడు కాస్త, ఇక్కడ ఉన్న దేవుడు మరెక్కడ లేడు అని సాక్ష్యం చెపుతున్నాడు. సైన్యాధిపతిగా, దర్పంతో వచ్చిన వాడు ఇప్పుడు నీ దాసుణ్ణి అని తనను తానూ తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ నీటిని సైతం చిన్నచూపు చూసిన వాడు ఇప్పుడు ఇక్కడ మట్టిని సైతం ఎంతో ఉన్నతమయినదిగా భావిస్తున్నాడు. ఏ ఇతర దేవుళ్లను ఇక మీదట పూజించనని చెపుతూ దేవునికి బలిపీఠం కట్టటానికి ఇశ్రాయేలు మట్టిని మోసుకెళ్తున్నాడు.
దేవుడు నయమాను అనుకున్నది అనుకున్నట్లు చేస్తే అతను దేవుని మహిమను అంతగా గుర్తించేవాడు కాదు కదా! తనను తానూ తగ్గించుకొని విశ్వాసంలో బలపడేవాడు కాదు కదా! నీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుడు నీ ద్వారా మహిమను పొందుకోవాలి, నీ విశ్వాసం మరింత బలపడాలి, నీ సాక్ష్యం నీ చుట్టూ ఉన్నవారికి దీవెనగా మారాలి. నయమానుతో పాటు వచ్చిన ఎంతమంది దేవుని వైపు తిరిగి ఉంటారు, తన సాక్ష్యం చూసిన తర్వాత. కనుక దేవుని మర్మమయిన మార్గములను అనుమానించకు, విశ్వాసం విడిచి, దేవుని ఆశీర్వాదాలు కోల్పోకు. నయమాను కోపంతో వెళ్ళిపోయి ఉంటె స్వస్థత పొందేవాడా? ఓర్పుతో ఎలీషా చెప్పినది పాటించాడు, మేలు పొందుకున్నాడు. దేవుని దగ్గరికి నీ ఆలోచనలతో రాకు, కేవలం విశ్వాసంతో రా. అయన దగ్గరికి సమస్యతో రా, పరిష్కారంతో మాత్రం కాదు. నువ్వు ఊహించని మార్గాలు ఆయనే తెరుస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. ఆలస్యం జరుగుతుందా, యొర్దాను నది దగ్గరికి వెళ్ళేదాకా అగు, జరుగబోయే అద్భుతం ముందుంది.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !!
Amen Amen.
రిప్లయితొలగించండిPraise Be to GOD brother. It's true and thanks for the blessed message brother. GOD bless you and LORD be with you all brother.