పేజీలు

6, మే 2022, శుక్రవారం

ఎటువంటి సంఘములో ఉన్నావు?

 

క్రీస్తు విశ్వాసులుగా ఉన్న మనము, నమ్మేది ఏమిటంటే క్రీస్తు తన రెండవ రాకడలో వధువు సంఘము కోసం పెళ్ళి కూమారునిగా వస్తాడని. మరియు ప్రతి వాని క్రియల చొప్పున తన తీర్పు తిర్పబోతున్నాడు అని కూడా విశ్వసిస్తాము. విశ్వాసులుగా మన జీవితంలో సంఘము యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలు పాటించటానికి సరయిన బోధకుడు ఎంతయినా అవసరము. మరియు ఒకరి నొకరు ప్రోత్సహించుకొనే వాతావరణం చాల ముఖ్యమయినదిగా దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. 

మనము నిత్యమూ క్రీస్తు మీద విశ్వాసముతో  వెలుగుతూ ఉండాలి, మనము నులివెచ్చగా ఉన్నట్లయితే దేవుడు మనలను అంగీకరించడని దేవుని వాక్యం సెలవిస్తోంది (ప్రకటన 3:16). అంటే నిత్యమూ మనలో ఆత్మీయ పరమయిన మంట రగులుతూ ఉండాలి. సంఘము ఆ విషయంలో మనకు సహాయ పడుతుంది. ఒంటరిగా మండే కొరివి కాస్త గాలి వీచగానే చల్లారిపోతుంది. కానీ నిప్పుల కుంపటిలో ఉన్న కొరివి గాలి వీచిన కూడా మండుతూనే ఉంటుంది. విశ్వాసి జీవితం కూడా అటువంటిదే. ఒంటరిగా ఉంటె శోధనలకు  చల్లారి పోయే అవకాశం ఉంది. 

అంతే కాకుండా ఇనుము ఇనుమును సాన బెట్టినట్లుగా, ఒక ఆత్మీయ స్నేహితుడు మరొక ఆత్మీయుణ్ణి బలపరుస్తాడు (సామెతలు 27:17).  ఆ విధముగా సంఘములో ఉండే విశ్వాసులు వారి సాక్ష్యములు పంచుకోవటం ద్వారా, మరియు ప్రోత్సాహకారమయిన పలుకుల ద్వారా ఇతర విశ్వాసులను ఆత్మీయంగా బలపరుస్తారు. తద్వారా సంఘము క్రీస్తు వెలుగులో ఎదుగుతుంది, అందును బట్టి సంఘ సభ్యులు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభువు రాకడకై వధువు సంఘముగా సిద్ధపడుతారు. 

1 థెస్సలొనీకయులకు 5: "11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకని నొకడు ఆదరించి యొకని కొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి."

పౌలు గారు థెస్సలొనీకయులకు రాసిన మొదటి పత్రికలో ఈ వచనములు ఏమని చెపుతున్నాయి! "మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగా ఒకరి నొకరు ఆదరించి ఒకరి నొకరు క్షేమాభివృద్ది కలుగ జేయుడి" అని. క్షేమాభివృద్ధి అంటే ఎదుటి వారిని  ఆర్థికపరంగా బలపరచుమనో లేక మరో రకంగా వారిని ఉద్దరించమనో కాదు గాని ఆత్మీయంగా అభివృద్ధి పరచుకోవాలి. ఒకవేళ ఆర్థిక పరమయిన కష్ట నష్టాలూ వచ్చి ఏదయినా కుటుంబం ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవటం చేయాలి. ఎందుకంటే పౌలు గారు చందాలు వసూలు చేసి పేద సంఘాలకు పంపినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. 

అయితే ముఖ్యముగా వారిని ఆత్మీయంగా బలపరిచేలా సంఘ సభ్యుల ప్రవర్తన ఉండాలి. ఎదుటి వారిని నొప్పించకుండా, వారి విశ్వాసమును దెబ్బతీయకుండా క్రీస్తు ప్రేమను పంచుతూ ఉండాలి. ఒక్కరి భాధలలో ఒకరు విశ్వాసముతో ప్రార్థించాలి. ఎందుకంటే సంఘము అనగా  క్రీస్తు దేహము ఆ దేహములో మనమందరము భాగములుగా ఉన్నాము (1 కొరింథీయులకు 12:12).  ఒక భాగము బాధపడితే మరో భాగము ఎలాగయితే సంతోషపడదో, అటువంటి సానుభూతి పరులుగా సంఘ సభ్యులంతా నడుచుకోవాలి. 

మనం  వెళ్తున్న సంఘము దేవుని వాక్యాను సారముగా నడచుకొంటుందా? లేక లోకపరమయిన డంబికాలు ప్రదర్శిస్తూ దేవుని వాక్యమునకు విరుద్ధంగా నడుస్తోందా? ఈ విషయాలు మనం ఖచ్చితంగా దేవుని వాక్యముతో సరి చూసుకోవాలి. 

1 పేతురు 3: "8. తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణా చిత్తులును, వినయ మనస్కులునై యుండుడి."

క్రీస్తు సంఘ సభ్యులకు ఉండవలసిన లక్షణాలను పేతురుగారు పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. సంఘము లో సభ్యులు ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తు ఎక్కడ ఇద్దరు, ముగ్గురు నా నామములో కూడితే వారి మధ్య నేను ఉంటాన్నన్నాడు కదా! మరి ఇంత మంది ఒక్కటిగా కూడితే వారి మధ్య ఖచ్చితంగా ఉంటాడు అనుకోవద్దు! యేసయ్య చెప్పింది కేవలం ఒక్కటిగా కూడు కోవటం గురించి మాత్రమే కాదు గాని ఏక మనస్కులై తనను ప్రార్థించే వారి మధ్యనే అయన ఉంటాడు. 

ఆ విధంగా సంఘములో ఐక్యత లోపిస్తే అక్కడ యేసయ్య లేనట్లేనని గుర్తించాలి. కాబట్టి సంఘము యొక్క బలగమును బట్టి కాక వారి మధ్య ఐక్యత ఎంతవరకు ఉందన్న విషయం పరిగణలోకి తీసుకోవాలి.  ఎదుటి వారి కష్టాలకు వారు ఏలా స్పందిస్తున్నారు! సంఘములో అవసరాలకు అనగా సభ్యుల అవసరాలకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తున్నారు, వారి కష్టాలలో పాలి భాగస్తులుగా ఉంటున్నారా అనగా  చేతనయినా ఆర్థిక సహాయము మరియు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ వారిని విశ్వాసములో బలపరుస్తున్నారా? లేక చిన్న చూపు చూస్తున్నారా? దానిని బట్టి సంఘము యొక్క ఆత్మీయ స్థితిని గుర్తించాలి. 

మరియు సంఘ సభ్యులు  సహోదర ప్రేమ కలిగి, కరుణ చూపే వారుగా ఉన్నారా లేక పక్షపాతలు చూపుతూ వివక్షలు పాటిస్తున్నారా? మరియు వారు వినయ మనసు కలవారుగా ఉన్నారా లేక తమ సంపదలను, ఆత్మీయ వరములను ప్రదర్శిస్తూ డంబికంగా ప్రవర్తిస్తున్నారా? వాక్యాను సారముగా నడుచుకొని సంఘము విశ్వాసులను శోధించి వారిని క్రీస్తులో వెనుకపడేలా చేస్తుంది.  అయితే ఎవరో ఒక్కరు ఇద్దరు పల్లేరు కాయలు ఉండవచ్చు కానీ అధిక సభ్యుల ప్రవర్తన వాక్యాను సారమయిన ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అటువంటి సంఘములో ఉండటం దేవుని చిత్తము మరియు ఆశీర్వాదకరము. 

అయితే దేవుడు కొన్నిసార్లు శోధించే సంఘములో మనలను కొసాగించుట ద్వారా, మనలను దీనులుగా చేసి అనగా అయన మీద ఆధారపడే వారిగా మార్చి తనకు మరింత దగ్గర చేసుకుంటాడు. అటువంటి అవకాశమును వదులు కోకుండా దేవుని చిత్తను సారముగా ఆ సంఘములోనే కొనసాగాలి. ఆ విషయంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఎదో ఒక రకంగా మనతో మాట్లాడటం జరుగుతుంది. కొలిమిలో కాల్చబడిన బంగారం శుద్ధి అయి విలువ పెంచుకున్నట్లుగా, ఇటువంటి సంఘములో కొనసాగించుట ద్వారా దేవుడు మనలను బలపరుస్తాడు. తద్వారా తన పనిలో మనలను మరింతగా వాడుకోబోతున్నాడు అని మనకు తెలిసిపోతుంది.  ఆలా కానీ పక్షములో మనం ఉంటున్న సంఘం యొక్క స్థితిని గుర్తించి కొనసాగాలి. 

సంఘ సభ్యులతో పాటు, సంఘ కాపరి మరియు పెద్దల ప్రవర్తనను కూడా వాక్యముతో సరి చూడాలి. తీర్పు తీర్చటానికి కాకుండా మనకు బోధించే వారు ఏమి బోధిస్తున్నారు అని  ఖచ్చితంగా వాక్యంతో పరిశిలించాలి మరియు పరిశోధించాలి. అపొస్తలులయిన పౌలు, సీలయు బోధిస్తుంటే సంఘములో విశ్వాసులు ప్రతి దినము లేఖనములు పరిశోధించారు అని దేవుని వాక్యములో రాయబడింది (అపొస్తలుల కార్యములు 17:11). అయితే నేటి విశ్వాసుల ధోరణి కాపరుల విషయంలో పూర్తీ భిన్నంగా ఉంది. "బైబిల్ ఎం చెప్పిన మాకు అవసరం లేదు, మా అయ్యా గారు ఏమి చేపితే దాన్ని పాటిస్తాం" అని వెర్రి అభిమానం చూపిస్తున్నారు. 

ఈ కాపరులు  యేసయ్య చెప్పిన మాటలకు విపరీత అర్థాలు చెపుతూ విశ్వాసులను చల్లారుస్తున్నారు. దేవుని వాక్యంలో లేని అంశాలను కలుపుతూ సంఘమును తప్పు దారి పట్టిస్తున్నారు. "మోహపు చూపే వ్యభిచారం" అని యేసయ్య చెపితే, "చూస్తేనే  పాపం కాదు" అని బోధిస్తున్నారు. "నీ కంటితో పాపం చేస్తే దాన్ని పెరికి వేయు" అని క్రీస్తు చెపితే "మనకు కృప ఉంది, దేవుడు క్షమిస్తాడు" అని విపరీత బోధలు చేస్తున్నారు. "స్త్రీ చక్కదనమును నీ హృదయములో ఆశ పడకుము" అని (సామెతలు 6:25)  దేవుని వాక్యం చెపుతుంటే,  ఆఖరికి చెడు తలంపులు  పాపం కాదని చెపుతూ యువతను తప్పు దారి పట్టిస్తూ సాతానుకు అప్పగిస్తున్నారు. 

ఇటువంటి బోధలు ఎందుకు జరుగుతున్నాయి? పరిశుద్దాత్మ లేని చోట మనుష్యుల జ్ఞానము ఇటువంటి విపరీత అర్థాలు తీస్తుంది. దేవుడు ఆత్మ సంబంధమయిన ఈ విషయాలను కేవలం తన మీద ఆధారపడిన వారికి అనగా పరిశుద్ధాత్మను పొందుకొనే వారికీ మాత్రమే బయలు పరుస్తాడు కానీ, "అంత నేనే, నాదే పెద్ద సంఘం, నన్ను మించిన వారు లేరు, నేను ఎన్ని సంఘాలు కట్టాను" అని విర్రవీగే వారికి మాత్రం కాదు. ఒకప్పుడు వారు గొప్పగా ప్రారంభం అయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారి స్థితి ఏలా ఉంది? గుర్తెరిగి ఆ సంఘములో కొనసాగండి. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! అననీయ మరియు అతని భార్య సప్పీరా ఒక చిన్న అబద్దం ఆడినందుకే చనిపోయారు అని దేవుని వాక్యములో రాసి ఉంది (అపొస్తలుల కార్యములు 5:3). అంటువంటి అబద్దాలు అంతకు ముందు ఎంతోమంది ఆడి ఉన్నారు, ఆ తర్వాత కూడా అబద్దాలు ఆడుతూనే ఉన్నారు. కానీ వారు మాత్రమే ఎందుకు చనిపోయారు? అననీయ చనిపోయిన తర్వాత అతని భార్య  సప్పీరాతో పేతురు "ప్రభువు ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి" అన్నాడు (అపొస్తలుల కార్యములు 5:9)

ఇక్కడ మనకు ఏమి అర్థం అవుతుంది? పెంతికోస్తు దినము నుండి సంఘం అంత పరిశుద్దాత్మతో  నిండి ఉంది, కనుకనే ఎంతో మంది మారుమనస్సు పొందుకున్నారు. అటువంటి పరిశుద్ధమయిన సంఘములో అబద్దం కూడా ఘోర పాపంతో సమానం, కనుక వారు చనిపోయారు. కాబట్టి క్రీస్తులో మీరు ఎదుగుతూ, అయన స్వరూపంలోకి మారాలంటే, దయచేసి పరిశుద్దాత్మ నిండిన సంఘములో కొనసాగండి! అది ఎలా తెలుస్తుంది? పైన చెప్పుకున్న లక్షణాలతో పాటు, ఆత్మ ఫలములు మెండుగా ఫలించే సభ్యులు ఉన్న సంఘము (గలతీయులకు 5:22)  అని వాక్యం ద్వారా మనకు అవగతమవుతుంది. 

ఇటువంటి సంఘంలో కొనసాగటం కొత్త విశ్వాసులకు మొదట్లో కష్టంగా ఉండవచ్చు, కానీ దేవుడు మనలను వదిలి పెట్టడు, తన పరిశుద్దాత్మ ద్వారా కృప ఇస్తూ ఎదిగిస్తాడు. అంతే కానీ "ఈ సంఘంలో కొన్ని లోకరీతులు పాటించవచ్చు, అయ్యగారి సంఘం ఎంతో పెద్దది, అయ్యగారు ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో పాటలు రాశారు" అని మాత్రం వెళ్ళకండి. వారిని దేవుడు తన రెండవ రాకడలో "మీరెవరో నేను ఎరుగను" అని ఖచ్చితంగా అంటాడు (మత్తయి 7:22-23), మనలను కూడా అనకుండా జాగ్రత్త పడుదాం!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి