పేజీలు

1, జులై 2022, శుక్రవారం

దేవునితో సాన్నిహిత్యం!

 

దేవుడు మనతో వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉండాలని కోరుకుంటున్నాడు, మన అణువణువును అయన ఎరిగి ఉన్నాడు! సృష్టి కారుడయినా దేవుడు మనకు తండ్రివలె ఉండి మనలను పోషిస్తున్నాడు, నిత్యము మన పట్ల అయన కలిగి ఉన్న ఉద్దేశ్యాలను నెరవేర్చాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ మనము అనిత్యమయిన వాటికి ఆశపడి దేవుని ఉద్దేశ్యాలను కాదని మన ఇష్టానికి బ్రతకాలని చూస్తున్నాము. 

యోహాను 17: "22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని."

యేసు క్రీస్తు సిలువలో తన ప్రాణం పెట్టుటకు ముందు చేసిన ప్రార్థనలో ఈ వచనములు ఏమి చెపుతున్నాయి? దేవుడు యేసయ్యను ప్రేమించినట్లు మనలను కూడా ప్రేమిస్తున్నాడు. మరియు క్రీస్తుకు అనుగ్రహించిన మహిమను దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. దేవుని దృష్టిలో మనం క్రీస్తుకు సమానముగా మరియు అంతే ప్రాముఖ్యత కలిగి ఉన్నాము! మరి మన ఆలోచన విధానం ఏలా ఉంది? యేసయ్య ఏవిధముగా పరిపూర్ణముగా, పరిశుద్ధముగా జీవించాడో, పరిశుద్దాత్మ శక్తి ద్వారా మనకు సాధ్యమే, అప్పుడు  దేవునితో యేసయ్య అంతటి సన్నిహిత్యము మనకు కూడా ఏర్పడుతుంది. 

యేసయ్య వలె మనం నీటి మీద నడువక పోవచ్చు, అయన వలే స్వస్థతలు చెయ్యకపోవచ్చు, అయన వలే చనిపోయిన వారిని తిరిగి లేపలేక పోవచ్చు. కానీ అయన వలే దేవునికి మనకు అడ్డుగా వస్తున్నా పాపమును, మన శరీర క్రియలను జయించే శక్తిని దేవుడు తన పరిశుద్దాత్మ శక్తితో ఇస్తానంటుంటే, మనం చేస్తున్నది ఏమిటి? కోపం అణచుకోలేక పోవటం, కాముకత్వమును కాదనుకోలేక పోవటం. గర్వపడుతూ దేవుని దృష్టిలో అల్పులుగా మిగిలిపోవటం, నిత్యము నిరుత్సాహపడుతూ, తృప్తి లేకుండా దైవ దూషణకు కారకులుగా మారిపోవటం. సాతాను నిత్యమూ దేవుని దగ్గర మనలను బట్టి ఆయనను దూషిస్తూ (యోబు 2:9) మన మీద నేరారోపణ చేస్తూ తనతో పాటు మనలను నరకాగ్నికి సిద్ధం చేస్తున్నాడు ఎరిగి  అని ఉన్నామా? 

ఆనాడు తప్పిపోయిన కుమారుడు తన ఆస్థికోసం తండ్రి నుండి విడిపోయినట్లు, మనం కూడా మన శరీర క్రియలను బట్టి దేవునికి దూరంగా బ్రతకాలని ఇష్టపడుతున్నాము లేదా దూరంగా అయిపోతున్నాము. మన శరీరము మన సొత్తుకాదు, అది దేవుని వలన అనుగ్రహింపబడి, అయన మనకు అనుగ్రహించు పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నది.  క్రీస్తు మనలను ఎంతో వెల చెల్లించి కొన్నాడు కనుక శరీరముతో దేవుణ్ణి మహిమ పరచాలి  (కొరింథీయులకు 6:19-20)  అని దేవుని వాక్యం సెలవిస్తున్నది.  పాత నిబంధన ప్రకారం దేవుడు, మానవుల పాప క్షమాపణార్థం జంతువులను బలిగా అర్పించులాగున నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారం జంతువులను చంపి, బలి పీఠం మీద దహనం చెయ్యాలి. కానీ నేడు మన శరీరాలను సజీవముగా సమర్పించాలి (రోమీయులకు 12:1) అని దేవుని వాక్యం సెలవిస్తోంది. 

అనగా శరీర క్రియలకు లొంగిపోకుండా వాటిని లొంగదీసి మన శరీరమును బానిసగా చెయ్యాలి (1 కొరింథీయులకు 9:27).  అప్పుడు  దేవుడు  తనతో మన సన్నిహిత్యముకు అడ్డుగా వచ్చే ప్రతి క్రియను జయించే శక్తిని తన పరిశుద్దాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మనం క్రీస్తు  చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తూ, ఆయనతో నిత్య సహవాసం చేస్తుంటాము. అందును బట్టి అయన స్వభావమును పొందుకొని తన  స్వరూపములోకి మారుతాము.  క్రీస్తు శరీర దారిగా ఉన్న దినములలో నిత్యము మహా రోధనతో మరియు కన్నీళ్ళతో కూడిన ప్రార్థనలు చేస్తూ దేవుని యెడల భయభక్తులు చూపుట ద్వారా పాపం అనే మరణం నుండి దేవుని చేత రక్షించబడ్డాడు (హెబ్రీయులకు 5:7) అని దేవుని వాక్యం సెలవిస్తోంది.  

మరి మనం పాపం జయించటానికి అటువంటి ప్రార్థనలు చేస్తున్నామా? ఎంతసేపు భూమిమీద బ్రతికే ఎనభై ఏళ్ళలో అన్ని సక్రమంగా జరిగిపోవాలి, అది కావాలి ఇది కావాలి అని ప్రార్థనలు చేస్తాము. కానీ దేవుడు కోరుకుంటున్న నిత్య సహవాసం అయన మనకు ఇస్తానన్న నిత్య జీవితము ప్రాముఖ్యం లేనివిగా మారిపోయాయి. అయన మనలను సృష్టించినప్పుడు, మనలను ఎలా పోషించాలో, ఎలా నడిపాంచాలో ప్రణాళిక లేకుండా ఉంటాడా? పక్షి రోధనను పట్టించుకొనే దేవునికి, సింహం పిల్లలను ఆకలికి ఉంచని దేవునికి, ఎంతో శ్రేష్ఠముగా ఎంచిన నీ జీవితం  పట్టింపు  లేదా? సోమరిగా ఉండవద్దు కానీ విశ్వాసంతో మన ప్రయత్నాలు చేస్తూ  భయం, ఆందోళన దూరం చేసుకోవాలి.  

మన జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్న ప్రతి సమస్య దేవుడు అనుమతించిందే, అయన ప్రణాళికలు మన భవిష్యత్తును బాగు చేయటానికే తప్ప భగ్నం చేయటానికి కాదు (యిర్మీయా 29:11)  అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒక వేళ దేవునికి విరుద్ధముగా నిర్ణయం తీసుకోని ఇప్పుడు కష్టాలు కొని తెచుకున్నావా? దేవుని ముందు మోకరించి క్షమాపణ కోరుకో! ఆ కీడును కూడా నీకు మేలుగా మారుస్తాడు. నిరాకారంగా మారిపోయిన భూమిని దేవుడు తిరిగి బాగు చెయ్యలేదా? (ఆదికాండము 1:2)  మన జీవితాలను కూడా బాగు చేసే సమర్థుడిగా దేవుడు ఉన్నాడు. భారం మోయటం అపి అయన మీద వేసి కొనసాగటమే మనం చేయవలసింది. 

మనలో చాల మంది దేవుని కోసం కనీసం ఏమి చేస్తే ఆయనను సంతోషపెట్టవచ్చు అని ఆలోచిస్తారు. ఆ విధముగా ప్రతి ఆదివారం మందిరముకు వెళ్ళటం, ప్రతి నెల దశమ భాగం ఇవ్వటం చేసి దేవుణ్ణి సంతోషపెడుతున్నాము అనుకుంటారు. దేవుడు మనలను పూర్తిగా కోరుకుంటున్నాడు. ఇలా వచ్చి ఆలా వెళ్లిపోవటానికి మనం బంధువులం కాదు, అయన పిల్లలం! ఒక్క ఆదివారమే కేటాయిస్తాను, మిగతా రోజులు సరదాగా అన్ని అనుభవిస్తాను అంటే కుదరదు. 

మన పిల్లలు వచ్చి మేము  ఆదివారం మాత్రమే మన ఇంట్లో ఉంటాము, మిగతా రోజులు పకింట్లో ఉంటాము అంటే ఎలా ఉంటుంది? ప్రతి రోజు, ప్రతి క్షణము ఆయనతో సంభందం కలిగి ఉండాలి. అనగా ఆయనకు ఇష్టం లేని క్రియలు మనకు ఎంతో ఇష్టమయిన మానివేయాలి మరియు ఆయనకు ఇష్టమయిన క్రియలు మనకు కష్టమయిన చేయాలి. అప్పుడే మనం ఆయన పిల్లలుగా, క్రీస్తు పెండ్లాడె వధువు సంఘములో భాగంగా పరిగణింపబడుతాము. లేదంటే అరకొర ఆత్మీయ జీవితంతో మనలను మనమే మోసపుచ్చుకుంటాము. 

మరి కొంతమంది దేవుని పరిచర్య చేయాలని, ఎదో ఒకటి చేసేయ్యాలి అని తమకు ఉన్న తాలాంతులను వాడుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. దేవుని చిత్తము కనిపెట్టకుండా ఎదో ఒకటి చెయ్యాలి అని అత్యుత్సాహంతో చేస్తుంటారు. చాల సార్లు దేవుడు తమకు ఇచ్చిన లౌకిక బాధ్యతలు, ఆశీర్వాదాలు కూడా వదిలేసి దేవుని కోసం ఎదో చేస్తున్నాము అన్న భావనలో ఉంటారు.  కానీ వారి విషయంలో దేవుని చిత్తము ఏమిటి? అని అడిగి తెలుసుకోవాలి.  

మార్త మరియు మరియ విషయంలో యేసయ్య ఏమి చెప్పాడు గుర్తుందా? (లూకా 11:38-42) యేసయ్యకు ఎదో చెయ్యాలని మార్త ఆరాటపడుతుంటే మరియ అయన పాదాల దగ్గర కూర్చుని అయన చెప్పే సంగతులు వింటూ ఉంది. "ప్రభు మరియను నాకు సహాయంగా పని చేయమను" అన్న మార్తతో యేసయ్య, "నువ్వు అనవసరమయిన వాటి కోసం విచారిస్తూ తొందరపడుతున్నావు కానీ మరియ శ్రేష్ఠమయిన దానినే ఎన్నుకోంది! అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు" అని చెప్పాడు కదా!  కొన్ని సార్లు దేవుడు మనలను మౌనంగా ఉండమంటాడు, అప్పుడు అయన చిత్తమును చెయ్యాలి. అయన పరిచర్య కంటే కూడా అయనను వినటం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్న తలంతు ఎక్కడికి పోదు, దాన్ని వాడుకొనే అవకాశం ఆయనే మనకు ఇస్తాడు. 

ప్రియమయిన సహోదరి సహోదరుడా! సొలొమోను గారు రాసిన పరమగీతము చదివినట్లయితే, క్రీస్తుకు మరియు వధువు సంఘముకు సాదృశ్యముగా ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. ప్రియుడు, ప్రియురాలు ఎంతటి అన్యోన్యత కలిగి ఉండాలో, ఎంతగా ఒకరి నొకరు కోరుకోవాలో ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది (పరమగీతము 7:6-12). క్రీస్తు మన ప్రతి ఆణువణువూ ఎరిగి ఉన్నాడు, మనతో అత్యంత సన్నిహిత్యం కోరుకుంటున్నాడు. 

ఆదే విధమయిన ఆరాటం మనకు ఉందా? అంతగా క్రీస్తును ఎరిగి ఉన్నామా? సంపూర్ణ సమర్పణ మనం చేస్తున్నామా? క్రీస్తు అనే మన ప్రియుడు తన సమస్తం మన కోసం అర్పించి, మన పాపములు తొలగించి మనలను శుద్ధులుగా మార్చాడు, దేవునికి దగ్గరగా చేర్చాడు. హృదయమనే మన తోటలోకి  ఆయనను ఆహ్వానిస్తే అయన దాన్ని ఫలవంతంగా మారుస్తాడు. మన శరీరం ఆయనకు అర్పిస్తే తన పరిశుద్ధాత్మతో అందులో నివసిస్తాడు, అయన వెలుగుతో మనలను ప్రకాశింపజేస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి