పేజీలు

31, డిసెంబర్ 2021, శుక్రవారం

యేసయ్య నీకు ఎవరు?

 

మనలో కొంతమంది "నేను యేసు క్రీస్తును నమ్ముకున్నానండి "  అని గర్వంగా చెప్పుకోవచ్చు! లేదా ఇతరుల అభిప్రాయాలకు భయపడి చెప్పుకోకపోవచ్చు. ఎవరికీ భయపడకుండా చెప్పుకోవటం గొప్ప విశ్వాసమే! ఇతరుల అభిపాయలకు ప్రాధాన్యత ఇచ్చి చెప్పుకోక పోవటం ఖచ్చితంగా అల్ప విశ్వాసమే. కానీ యేసు క్రీస్తును నీవు ఎందుకు నమ్ముకున్నావు? క్రీస్తునందు విశ్వాసం ప్రతి ఒక్కరికి ఒక్కో సందర్భంలో కలుగుతుంది. కానీ దాని కొనసాగింపు దేని మూలంగా కలుగుతోంది అన్నది చాల ప్రాముఖ్యతను కలిగి ఉంది. 

ప్రాథమికమయిన సువార్త ఏమిటీ? "సృష్టి కారకుడయినా దేవుడు మనుష్యులు పాపాలు చేసి, తన మహిమను కోల్పోతు, పాపం ద్వారా వచ్చే జీతము మరణమును పొంది, నిత్య నరకమునకు వెళ్లిపోతుంటే, వారిని ఆ పాపపు జీవితం నుండి రక్షించటానికి, తానూ మనిషిగా అవతరించి పాపం లేకుండా బ్రతికి, తన పవిత్ర రక్తమును క్రయధనముగా కార్చి, తన యందు విశ్వాసం ఉంచి తమ పాపములు ఒప్పుకొన్న వారిని క్షమించి, తన నీతిని ఆపాదించుట ద్వారా, వారికి నిత్య జీవమును అనగా తన సన్నిధిని అనుగ్రహిస్తాడు" 

విశ్వాసము యొక్క ఆరంభము అనారోగ్యము నుండి స్వస్థత కావచ్చు, ఆర్థిక సమస్య నుండి విడుదల కావచ్చు, లేదా  చదువు, ఉద్యోగం, పెళ్ళి ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు.  ఆ మొదటి మెట్టు దాటినా తర్వాత అసలు విశ్వాసపు యాత్ర మొదలవుతుంది. దేవుడు సమస్యలను తీరుస్తాడు కనుక ఇంకా విశ్వాసంగా ఉన్నామా? లేదా దేవుడు ఆగ్రహిస్తాడని, తానూ చేసిన మేలులు తీసివేస్తాడేమోనని భయపడి కొనసాగుతున్నామా? లేదా మనం నిత్యం చేసే పాపాలను క్షమించాలి కాబట్టి విశ్వసిస్తున్నామా? 

పైన చెప్పుకున్నట్లుగా యేసు క్రీస్తు తనయందు విశ్వాసము ఉంచి పాపములు ఒప్పుకొన్న వారికి తన నీతిని ఆపాదించి నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఇది చాలామంది విశ్వాసము కొనసాగించటానికి కారణము. ఇందులో ఎంత మాత్రమూ తప్పులేదు, అనుమానం అసలు లేదు. యేసు క్రీస్తు ప్రేమకు అవధులు లేవు, అయన క్షమాపణకు హద్దులు లేవు. 

యోహాను 6: "37. తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును."

ఈ వచనములో యేసయ్య ఏమంటున్నాడు! తన యొద్దకు వచ్చిన ఎవరిని కూడా త్రోసివేయను అని సెలవిస్తున్నాడు. అయన ప్రేమకు షరతులు లేవు, అయన కరుణకు కొలమానం లేదు (మత్తయి 18:22 లో చదవండి). నిత్యమూ పాపములు ఒప్పుకుంటూ, క్షమాపణ కోరుతూ, అయన నీతిని వెతకటమే క్రైస్తవ విశ్వాసముగా పరిగణింపబడుతోంది. పాపములు ఒప్పుకున్నా వారినెల్ల క్షమిస్తూ కేవలం నీతిని ఇవ్వటానికే, దేవుడు క్రీస్తుగా భూమి మీదకి వచ్చి, 33 సంవత్సరాలు మనిషిగా బ్రతికి, పాపం లేకుండా జీవించి, ధర్మ శాస్త్రమును నెరవేర్చి, అన్ని బోధలు చేయవలసిన అవసరం ఏమిటి? మనిషిగా క్రిందికి వచ్చి, రక్తం కార్చి, మరణమును జయించి వెళితే సరిపోతుంది కదా? హనోకు, ఏలీయా వంటి వారిని దేహముతో పరలోకం తీసుకుని వెళ్ళిన దేవునికి దేహంతో భూలోకం రావటం అసాధ్యం కాదు కదా! 

ఆయన క్షమించు వానిగానే కాదు నిజానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చాడు. దేని నుండి రక్షించటానికి? మనలో ఉన్న ఆదాము స్వభావము నుండి అనగా సాతాను మాట వినటం ద్వారా మనిషికి సంక్రమించిన సాతాను యొక్క లక్షణముల నుండి. దేవుని ఆజ్ఞను దిక్కరింప జేసే శరీర క్రియలనుండి రక్షించటానికి వచ్చాడు. మనవలె అన్నింట శోధించబడి కూడ దేవుని ఆజ్ఞలు అన్ని నెరవేర్చాడు అనగా పాపంలేని వాడిగా జీవించాడు. అందుకే మనకు బోధించాడు. అవి సాధ్యము కనుకనే వాటిని పాటించుమని నిబంధన పెట్టాడు. కానీ మనం ప్రతిసారి పడిపోతూ, క్షమించు తండ్రి అన్న దగ్గరే ఆగిపోతున్నాము. 

దేవుడు తన కుమారుడయినా క్రీస్తును లోకానికి పరిచయం చేసింది, కేవలం అద్భుతాలు చేయటానికి, మేలులు చేయటానికి మాత్రం కాదు. అద్భుతములు చేసింది ఆయన మహిమను, ఆధిక్యతను తెలిపి మానవాళిని తన వైపు నడిపించటానికి. పాపం లేకుండా 33 సంవత్సరాలు జీవించింది వారికి మార్గదర్శిగా నిలవటానికి. కేవలం క్షమించటానికే అయితే, క్రీస్తు పరలోకం వెళుతూ ఆదరణ కర్తను అనగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించటం దేనికి? 

అయన బోధనలు హృదయంలో నిలుపుకొని, ఒక్కొక్క శరీర క్రియ నుండి విడుదల పొందుతూ వాటి నుండి క్రీస్తు శక్తి ద్వారా రక్షించబడటానికి. కనుకనే అయన రక్షకుడిగా అవతరించాడు. లేదంటే క్షమాపణ కర్తగా మాత్రమే అవతరించేవాడు. క్రీస్తులో మన విశ్వాసం కొనసాగుతున్న కొలది మన హృదయాలలో అయన మేలులు చేసేవాడినుండి మొదలు పెట్టి మనకు క్షమాపణ కర్తవలే ఉంటూ  రక్షకుడిగా రూపాంతరం చెందాలి. ఎందుకంటే చాల మంది విశ్వాసులు యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించుకున్న తర్వాత కూడా ఆయనను పాపములు క్షమించే వానిగానే చూస్తున్నారు కానీ ఆ పాపములో పడిపోకుండా కాపాడే రక్షకుడిగా చూడటం లేదు. 

గలతీయులకు 5: "19. శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను."

ఈ వచనములలో మన పితరుడు ఆదాము నుండి మనకు సంక్రమించిన సర్వ అవలక్షణాలు పేర్కొనబడ్డాయి. వీటిని నిత్యం చేస్తూ, అయ్యో నన్ను క్షమించు ప్రభువా అనుకుంటూ ఉంటే, అది విశ్వాసమా? యేసయ్యను నువ్వు రక్షకుడిగా నమ్ముకున్నావా? వీటిని చేస్తూ ఇతరుల ముందు నేను యేసయ్యను నమ్ముకున్నాను అని చెప్పి అయన నామమునకు అవమానం చేయటం కన్న, అయన గురించి చెప్పక పోవటమే ఉత్తమం. 

క్రీస్తు ఇచ్చిన పరిశుద్దాత్మ శక్తి ద్వారా ప్రతి శరీర క్రియనుండి రక్షించబడుతూ నెమ్మదిగా ఆయన స్వభావమును పొందుకోవటమే యేసునందు విశ్వాసము కొనసాగటానికి కారణం కావాలి. ఎదుకంటే అయన వాటి నుండి మనలను రక్షించే రక్షకుడిగా అవతరించాడు, కానీ కేవలం క్షమించే వాడిగా మాత్రమే కాదు! క్షమాపణ పొందుకోవటం అన్నది ప్రాథమిక విషయము. మన యుద్ధము శరీర క్రియల పైన సాగాలి, అయన యందు విశ్వాసము ద్వారా, శక్తిని పొందుకొని వాటిని జయించాలి. తద్వారా మన పాపముల నుండి అయన ద్వారా రక్షించబడాలి. యేసయ్య నీ పాపములు క్షమించబడ్డాయి అని చెపుతూ ఏమని చెప్పేవాడు, మళ్ళి వాటిని చేయవద్దు అని కదా. అంటే పాపం లో ఎప్పటికి పడిపోమా? పడిపోవచ్చు, కానీ మన ప్రయత్నం ఎలా ఉంది? కేవలం క్షమాపణ ఉంది కనుక పర్వాలేదు అనుకుని పాపం చేస్తున్నావా? లేక శరీరము బలహీనతను బట్టి పడిపోతున్నావా? శరీర బలహీనత అయితే తండ్రి నాకు ఈ పాపం నుండి విడుదల ఇవ్వు, పాపంలో పడిపోకుండా నీ కృపను ఇవ్వు ప్రభువా అని పట్టుదలతో ప్రార్థిస్తే, తప్పక నీకు దేవుడు  దాని మీద విజయం ఇస్తాడు. కానీ కావాలని, దేవుడు  క్షమిస్తాడులే అని పాపం చేస్తే ఎప్పటికి దాని మీద విజయం పొందుకోలేవు, దేవుడు కోరుకుంటున్నా సంపూర్ణ విశ్వాసిగా మారలేవు. 

పడిపోయిన ప్రతిసారి లేవాలి, మళ్ళి పడిపోకూడదు అన్న పట్టుదల రావాలి. కేవలం ఆలా అనుకుంటే సరిపోతుందా? ముమ్మాటికీ కాదు. పాపముల నుండి రక్షించే ఆయన సహవాసంలో ఉండాలి! వాక్యపు వెలుగులో మనలను మనం సరిద్దిదుకోవాలి, ప్రార్థన శక్తితో శోధనలు ఎదుర్కొనే బలం పొందుకోవాలి. "నేను  ద్రాక్షావళిని, నాలో ద్రాక్ష తీగలవలె ఫలించమని" ఆయనే కదా చెప్పాడు. అందుకే ఎప్పుడు ఆయనను అంటి పెట్టుకుని ఉండాలి. అప్పుడే ఆయనలో ఉన్న శక్తి మనకు అనుగ్రహింపబడి వాటి మీద విజయం సాధిస్తాం. 

సంపూర్ణ విశ్వాసిగా మారటానికి, యేసయ్యను నువ్వు క్షమాపణ కర్తగా చూస్తున్నావా లేదా దాన్ని దాటి రక్షణ కర్తగా చూస్తున్నావా? అనగా ప్రతి శరీర క్రియనుండి విజయాన్ని ఇచ్చే రక్షకుడిగా చూస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం నీ ఆత్మీయ స్థితిని తెలుపుతుంది, సంపూర్ణ విశ్వాసిగా అయనలో  నిన్ను నిలుపుతుంది. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! 

15, మే 2021, శనివారం

దేవుడు ప్రేమలేని వాడా?

దేవుని స్వభావమును ఎరిగిన వారు ఎవ్వరు కూడా దేవుడు ప్రేమలేని వాడని ఆలోచించలేరు! కానీ ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులను బట్టి, లోకంలో చెలరేగిపోతున్న కరోనా విలయ తాండవం ద్వారా నశించిపోతున్నా ప్రజలను బట్టి, మరణాల సంఖ్యను బట్టి, ఇటువంటి ప్రశ్నలు తలెత్తడం అత్యంత సహజమే. దేవుడు ఎన్నోమారులు తన ప్రేమ స్వభావమును ప్రత్యక్ష పరచుకున్నాడు. అయన ఎంత ప్రేమమయుడో తెలుకోవాలంటే పవిత్ర బైబిల్ గ్రంథం నుండి ఒక రాజు గురించి  తెలుసుకుందాం. 

అతను దేవుని కృపను పొంది, 15 సంవత్సరాలు అధిక ఆయుష్షు పొందిన హిజ్కియా కుమారుడయినా మనష్షే. ఇతని గురించి బైబిల్ గ్రంథం అత్యంత హీనమయిన వాడని సెలవిస్తోంది. 

2 దినవృత్తాంతములు 32: "33.  హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియ లను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను."

2 దినవృత్తాంతములు 33: "1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను. 2.  ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్ల గొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను."

పై వచనములు చూస్తే ఇతని ప్రవర్తన ఏమిటో తెలుస్తుంది. మోషే ధర్మ శాస్త్రమును తృణీకరించాడు. దేవుని మందిరములో తానూ చేయించిన దేవత విగ్రహ మూర్తులను ప్రతిష్టింప జేశాడు. యాబై ఏళ్ళుగా ప్రజలను రాచి రంపాన పెట్టాడు, ప్రజలకు దేవుణ్ణి పూర్తిగా దూరం చేసాడు. అప్పుడు దేవుడు మనష్షే మీదికి అష్షూరు రాజు సైన్యాధిపతులను రప్పించాడు. అతడు బబులోనుకు బందీగా తీసుకోనిపోబడ్డాడు. ఆసమయంలో అతని అహంకారం పూర్తిగా అణగారి పోయింది. 

2 దినవృత్తాంతములు 33: "12.  అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని. 13. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను."

పై వచనములలో అతను దేవునికి తనను తాను తగ్గించుకొని ప్రార్థించగా తిరిగి అతణ్ణి  రాజ్యములోకి తీసుకోని వచ్చాడు. అసలు ఇది సాధ్యమేనా? బందీగా వెళ్లిన ఏ రాజయిన తిరిగి తన రాజ్యంలోకి రావటం జరుగుతుందా? దేవుని కార్యం కాక మరేమిటి? అందుకే మనష్షే దేవుని గొప్పతనం తెలుసుకున్నాడు. అప్పటి నుండి తానూ కట్టించిన ఇతర దేవతల విగ్రహాలు కూలిపించాడు, బలి పీఠములు బద్దలు కొట్టించాడు. దేవుడయినా యెహోవాను మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించాడు. పశ్చాత్తాప పడిన ఒక దుర్మార్గపు రాజుకు దేవుని క్షమాపణ లభించింది. తనను యాభై ఏళ్ళుగా నిరాకరించి, తన ప్రజలను తనకు దూరం చేసిన వాడిని, క్షమించి ఆదుకున్న దేవునికి ఎంత ప్రేమ ఉండాలి? ఇటువంటి సంఘటనలు ఎన్నో, మరెన్నో బైబిల్ నందు మనం చూడవచ్చు. 

సహోదరి, సహోదరుడా ఒక్కసారి ఆలోచించు! ప్రపంచం ఎటువైపు వెళ్తోంది. ఎటు చూసిన అశ్లిలత, విచ్చలవిడితనం, మోసాలు, నేరాలు. ఆఖరికి దేవుడి పేరిట కూడా వ్యాపారం. మరి దేవుడు వీళ్ళందరినీ దారికి తీసుకు రావాలి కదా? మానవులు పశ్చాత్తాప పడి సక్రమ మార్గంలో సాగాలి కదా? డబ్బు ఉందన్న గర్వం కూడా ఎవరిని కాపాడలేక పోతోంది. ఈ మాటలన్నీ దేవుడు ఏనాడో తన గ్రంథంలో రాయించాడు. 

జెఫన్యా 1: "18. ​యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు."

పేద లేదు, ధనిక లేదు అందరు ఏక రీతిగా కష్టాలు అనుభవిస్తున్నారు, చావు నుండి తప్పించుకోలేక పోతున్నారు. డబ్బు ఉండి కూడా సరైన వైద్యం అందక చనిపోతున్న వారు ఎందరో! చనిపోయిన వారందరు చెడ్డవారని నేను చెప్పటం లేదు! కానీ దేవుని కరుణ పొందాలంటే ఆయనను ఆశ్రయించటమే తుది అగత్యము. అభివృద్ధిని చూసి, సాంకేతితను చూసి దేవుడి ఉనికినే ప్రశ్నించిన ప్రపంచం, కంటికి కూడా కనపడని కీటకంతో యుద్ధం చేస్తోంది. 

జెఫన్యా 2: "15. నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు." 

పై వచనం చూడండి, నా వంటి వారు లేరు, నాకున్న రక్షణ కోటలు ఎవరు ఛేదించగలరు అని గర్వపడిన ఒక పట్టణము ఎలా నశించిపోతుందో దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా చెపుతున్నాడు. మానవాళి కూడా అటువంటి గర్వంతోనే నిండియుండి. మనకున్న టెక్నాలజీకి దేన్నైనా సాధిస్తాం అనుకుంది, చివరకు దేవుడు ఉన్నడా అన్న దగ్గరి నుండి అసలు దేవుడి అవసరమే మానవాళికి లేదు, సృష్టి అంత దానంతట అదే ఉద్బవించింది అన్న దగ్గరికి వచ్చేసారు. ఇది మూర్కత్వం కాక మరేమిటి? సృష్టి కర్తను మరచి సృష్టిని ఆరాధించే వారు కొందరు, అసలు సృష్టికర్తే అవసరం లేదు అనే వారు మరికోందరు! 

ప్రియా సంఘమా, సమయం లేదు! త్వరపడు. ప్రభువు చెప్పిన తన ఘడియలు రావటానికి ఎంతో కాలం పట్టదు సుమా. ఇంతవరకు ప్రభువు నందు విశ్వాసములో పడుతూ లేస్తూ సాగుతున్నావేమో, కానీ ఇప్పుడు పరుగు పెట్టటమే ఆవశ్యకం!  వద్దు! ఆ చెత్త సీరియల్స్ ఆపేయ్, ఆ కుళ్ళు జోకుల ప్రోగ్రామ్స్ మానెయ్! ఆ బూతు సినిమాలు చూస్తు నీ హృదయమును అపవిత్రం చేసుకోకు, ఆత్మీయతలో నశించి పోకు! వారందరు యుగ యుగములు దహించబడటానికి సిద్ధంగా ఉన్నవారు. కానీ నీవు దేవుడి చేత ఎన్నుకోబడ్డావు. చివరికి తప్పిపోతావా? దేవుని దుఃఖముకు కారణం అవుతావా?

జరుగుతున్నా విపత్తులను చూసి అధైర్యపడవద్దు. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా నీకు తెలియదు. కానీ దేవునికి వాటి సంఖ్యలు కూడా తెలుసు! అంటే ఏది మొదటిది, ఏది రెండవది ఈ విధంగా అయన నిన్ను ఎరిగి ఉన్నాడు. అయన చిత్తం లేకుండా  నిన్ను ఏది ఏమి చెయ్యలేదు. ఆలా అని విచ్చలవిడిగా తిరగవద్దు.  ఐగుప్తు లో చివరి తెగులు సంహార దూత వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారిని భయట తిరగమనలేదు, గొర్రె పిల్ల రక్తం తమ ఇంటి ద్వారాలకు పూసుకొని ఇంట్లో భద్రంగా ఉండమన్నాడు. మనం చేయవలసింది కూడా అదే! 

2 దినవృత్తాంతములు 7: "14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును."

పై వచనములో దేవుడు మన నుండి ఆశిస్తున్నా ప్రవర్తనను సెలవిస్తున్నాడు. మన పాప దోషములు గుర్తించి దేవుని క్షమాపణకై మొఱ్ఱ పెట్టవలెను, తద్వారా అయన మన పాపములను క్షమించి, మనం నివసించు దేశమును స్వస్థపరుస్తాడు.  ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అల్ప జ్ఞానులము అయినా మనకు అందని సమాధానాలు. కొందరు స్వాములు ఫలానా నెలకు కరోనా తగ్గిపోతుంది అంటారు, కానీ ఏ సంవత్సరమో చెప్పరు, ఎప్పుడు తగ్గితే అప్పుడే అని మాట మార్చేయొచ్చూ.  కానీ మన దేవుడు ఆలా కాదు ప్రియులారా! అయన నరుడు కాదు మాట ఇచ్చి తప్పటానికి! భూమ్యాకాశాలు గతించిన అయన మాట గతించిపోదు. ఎందుకంటే అయన ఆది, అంతం లేని వాడు, సజీవుడు, ఉన్నవాడు. అయన ప్రేమ నిత్యం,  అయన మార్గం సత్యం. దేవుడికి మరో పేరే ప్రేమ అని మనకు బైబిల్ లో ఏ పుస్తకములో ఏ అధ్యాయం చదివిన అవగతమవుతుంది. కనుక అధైర్యపడి విశ్వాసం కోల్పోవద్దు, కడవరకు సాగిపోదాము, పరలోకం  చేరేవరకు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! 

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

దేవుని గద్దింపును అంగీకరిస్తున్నావా?

దేవుడు మొదటి మానవులయిన ఆదాము, హవ్వలను తన స్వరూపములో చేసి, వారికి ఆజ్ఞలు ఇచ్చినప్పటికి సంపూర్ణ  స్వేచ్ఛను వారికి ఇచ్చాడు. అనగా వారి ఆలోచనలు వారికి ఉన్నాయి, తమ ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు.  ఏదెను వనములో దేవుడు జ్ఞానము ఇచ్చే చెట్టు ఫలమును తినవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారు సాతాను మాటలు నమ్మి, దేవుని మాటలు పెడ  చెవిన పెట్టి ఆ పండును తిన్నారు. ఇదంత వారికి  సంపూర్ణ స్వేచ్ఛ ఉండటం వలన జరిగింది. దేవుడు ఎందుకు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. మనం ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించటానికే! అదెలా! అంటారా? ఉదాహరణకు ఒక్క సైంటిస్ట్ కు ఒక  కొడుకు ఉన్నాడు, వాడికి ఎన్ని సార్లు చెప్పిన అల్లరి పనులు మానటం లేదు. బుద్ది చెప్పిన ప్రతిసారి తండ్రి మీద కోపం పెంచుకొని అతన్ని ద్వేషించటం మొదలు పెట్టాడు.  వాడికి మాదిరి కరంగా  ఉండాలని ఒక రోబో బొమ్మను తయారు చేశాడు అ సైంటిస్ట్. ఈ రోబో బొమ్మను అతను ఎలా తయారు చేసాడంటే, ఎప్పుడు కూడా అల్లరి చేయకుండా, చెప్పిన మాట వింటూ, ఐ లవ్ యు డాడీ  అని చెప్పటమే దాని పని. దాన్ని చూసి కూడా వాడిలో ఏ  మార్పు లేదు. అయితే  ఒక్క రోజు తనకు వచ్చిన సమస్యను బట్టి తండ్రి దగ్గరికి  వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నడు, తండ్రి వాడిని ప్రేమతో దగ్గర తీసుకోని ఓదార్చి, వాడి సమస్యను తీర్చాడు. తండ్రి ప్రేమను గుర్తించిన అ పిల్లాడు ఒక్కసారిగా కరిగిపోయి ఐ లవ్ యు డాడి అని తన తండ్రిని హత్తుకున్నాడు.  తండ్రి మనసు సంతోషంతో ఉప్పొంగి పోయింది! ఎందుకు? 

రోబో కూడా  రోజు ఐ లవ్ యు డాడి అని చెపుతుంది కదా! చెప్పిన మాట వింటుంది కూడా. కానీ దానికి స్వేచ్ఛ లేదు, సొంత ఆలోచన లేదు, ఎప్పుడు ఐ లవ్ యు చెప్పవలసిందే. కొడుకుకు మాత్రం సంపూర్ణ స్వేచ్ఛ ఉంది, సొంత ఆలోచనలున్నాయి. ఆ పిల్లాడు తండ్రి మాటను వినకుండా ఉండవచ్చు మరియు అతనికి ఐ లవ్ యు చెప్పకుండా కూడా ఉండవచ్చు. తన స్వేచ్ఛను వదులుకుని తండ్రి మాటను వినటం మొదలు పెట్టాడు, అల్లరి పనులు మానేసాడు. దేవుడు కూడా మన నుండి  అటువంటి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాలని మనకు సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఇక్కడ పిల్లాడు తన స్వేచ్ఛను వదులుకుంటున్నాడు కదా! మరి పిల్లాడి స్వేచ్ఛను హరించటం తండ్రికి ఇష్టమా? కానే కాదు! తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. తెలియక వారు చేసే తప్పులు వారి పురోగతిని అడ్డుకోకుండా వారి అల్లరికి అడ్డుకట్టలు వేస్తాడు. మన ఆత్మీయ జీవితం బాగుండాలని మన పరలోకపు తండ్రి కూడా మన పాపమునకు అడ్డుకట్టలు వేస్తాడు. 

ఏ మంచి లేని ఈ శరీరంలో ఉండి అయన ఆజ్ఞలు పాటిస్తూ పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు.  ప్రభువయినా యేసు క్రీస్తును నమ్ముకొన్న క్షణం నుండి, తన పరిశుద్దాత్మ నడిపింపును మనకు ఇస్తూ, తన ప్రేమ చొప్పున గద్దిస్తూ, ఆదరిస్తూ తనకు దగ్గరగా ఉండాలని నిత్యం మనలను ప్రేరేపిస్తున్నాడు. కానీ స్వేచ్ఛతో ఉన్న మనము ఆ గద్దింపును అంగీకరించకుండా, పాపం లో పడిపోతూ  మరింతగా దేవునికి దూరం అవుతున్నాము. దేవుడు మనలను  ఎలా గద్దిస్తాడు? దావీదు మహారాజుకు దేవుడు అతని కుమారుడయినా సొలొమోనును బట్టి వాగ్దనము చేస్తున్న మాటలు వినండి!

2 సమూయేలు 7:"14. నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని 15.  నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను."

పై వచనం స్పష్టం చేస్తున్న విషయం ఏమిటి? మనం పాపం  చేసినప్పుడు దేవుడు మనలను మనుష్యులకు అప్పగిస్తాడు, లేదా సమస్యలను మన మీదికి అనుమతిస్తాడు. విశ్వాసులుగా ఉన్న మనకు కష్టాలు ఉండవు అని చెప్పటం లేదు! మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసాన్ని బలపరిచే పరీక్షల్లాంటి సమస్యలు కొన్నయితే, తప్పిపోయినప్పుడు లేదా పాపంలో పడిపోయినప్పుడు వచ్చే సమస్యలు కొన్ని. విశ్వాసాన్ని బలపరిచే సమస్యలు లేదా శోధనలు మనం తట్టుకోలేనంతగా ఇవ్వడు దేవుడు, మరియు అయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటుంది. కానీ పాపంలో  పడిపోయినప్పుడు లేదా మనలను క్రమశిక్షణలో పెట్టాలన్నప్పుడు వచ్చే సమస్యలు లేదా శోధనలు తీవ్రంగా ఉంటాయి. మన నడక మారనంత వరకు దేవుడు మనలను నలుగ గొడుతూనే ఉంటాడు. దానిని గుర్తించి ఆయనకు మొరపెట్టిన నాడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. 

ద్వితీయోపదేశకాండము 8: "5.  ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని 6.  ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను."

తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగా అయన మనలను దండిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను సామ్రాజ్యమునకు  అప్పగించే ముందు యిర్మీయా ప్రవక్త ద్వారా ఎన్నో మారులు వారిని, మరియు ఇశ్రాయేలు రాజులను హెచ్చరించాడు. కానీ శరీర క్రియలకు, విగ్రహారాధనకు అలవాటుపడిన వారు ఆ ప్రవక్తను బంధించి హింసించారు. అబద్ద ప్రవక్తల మాటలు నమ్మి దేవుని మాటలు పెడ చెవిన పెట్టారు. కనుకనే వారందరు బబులోనుకు బానిసలుగా కొనిపోబడ్డారు, వివిధ దేశాలకు చెదరిపోయారు. కానీ అంటువంటి సమయంలో కూడా దానియేలు వంటి గొప్ప విశ్వాసులు దేవునితో నడచి, ఘనతను పొందారు. 

యోబు 5: "17. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. 18.  ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును. "

దేవుడు ఈ విధముగా అందర్నీ గద్దించడు. తన చిత్తములో ఉన్నవారిని మాత్రమే అనగా ఆయనను అంగీకరించినా వారిని మాత్రమే తన వారిగా చేసుకొని వారిని తన మార్గములో నడిపించటానికి శిక్షిస్తాడు, తద్వారా శిక్షణ ఇస్తాడు. దానిని అంగీకరించి మనలను మనం సరిచేసుకున్న నాడు ఆయనే మనకు సమాధానం ఇస్తాడు. అనగా మన గాయములకు కట్టుకడుతాడు. ఆ శిక్ష సమయములో మనం అయనతో సాగిపోవాలి, క్షమాపణ వేడుకోవాలి కానీ మనసును కఠినం చేసుకొని ఆయనకు మరింతగా దూరం కారాదు. 

హెబ్రీయులకు 3: "13.  నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, 14.  పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లునేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.

పౌలు గారు హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో ఏమంటున్నాడు చూడండి! దేవుని శబ్దమును విని అనగా గద్దింపును విని హృదయములను కఠినపరచుకొని ఆయనకు ఆగ్రహం తెప్పించిన వారివలె, అనగా అరణ్యంలో ఇశ్రాయేలు వారివలె,  ఉండరాదు. మరియు పాపము వలన కలుగు భ్రమచేత ఎవరు కూడా కఠినపడి, పాపమూ పట్ల సున్నితత్వమును కోల్పోయి దేవుడు ఇచ్చే నిత్య  విశ్రాంతిని కోల్పోకుండా ఒక్కరి నొకరు బుద్ది చెప్పుకోమంటున్నాడు. పరిశుద్దాత్మ దేవుడు మనకు ఇచ్చే నడిపింపును గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకొందాము. దేవునికి మనం ఎంత దగ్గర అవుతుంటే అంతగా సాతాను తన శక్తియుక్తులతో మనలను పడదోయాలని చూస్తాడు. ఆదాము, హవ్వల వలే వాని మాటలకూ అనగా శోధనలకు లొంగక దేవుని నడిపింపును అంగికరించాలి. 

మత్తయి 16: "15.  అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను. 16.  అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. 17.  అందుకు యేసు సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. 18.  మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

మత్తయి సువార్తలో పేతురు యేసయ్యను దేవుని కుమారుడవని చెప్పిన వెంటనే, యేసయ్య పేతురుతో దీనిని పరమునందున్న తండ్రే నీకు బయలుపరచాడు అని చెప్పి అతని  విశ్వాసము వంటి బండ మీద తన సంఘమును కడుతానని అన్నాడు. అది జరిగిన కొద్దీ సమయానికి  యేసయ్య తన సిలువ మరణం గురించి, పునరుద్ధానము గురించి చెప్పగానే సాతాను పేతురును ప్రేరేపించి యేసయ్యను శోధించటం మొదలు పెట్టాడు. ఎందుకిలా? పేతురు దేవునికి చాల దగ్గరగా ఉన్నాడు! మరియు యేసయ్య ప్రణాళికలో ఉన్నాడు. అంతే కాకుండా యేసయ్య సిలువ మరణము తన పాపపు లోకమును జయిస్తుందని, మనుష్యులను పాపం నుండి రక్షిస్తుందని తెలిసి  పేతురు ద్వారా యేసయ్యను ఆపాలని చూస్తున్నాడు. 

మత్తయి 16: "23 అయితే ఆయన పేతురు వైపు తిరిగిసాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంప"

వెంటనే యేసయ్య పేతురును "సాతానా వెనుకకు పో! నీవు నాకు అభ్యంతర కారణమయినావు. నీవు మనుష్యుల సంగతులను తప్ప దేవుని సంగతులు తలంచటం లేదు" అన్నాడు. ఇక్కడ పేతురును యేసయ్య సాతానా అని అందరి ముందు గద్దించినప్పుడు ఎంతో  అవమానంగా భావించవచ్చు. మరియు తన మనసు కష్టపెట్టుకొని, కఠిన పరచుకొని  యేసయ్యను వదిలి పోవచ్చు. కానీ పేతురు యేసయ్య చెప్పిన బోధను అర్థం చేసుకొని, అయన గద్దింపును అంగీకరించాడు, కనుకనే విశ్వాసములో కొనసాగాడు. 

మత్తయి 16: "24.  అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. 25.  తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును

యేసయ్య చెప్పిన పై మాటలు పేతురును, మరియు ఇతర శిష్యులను కూడా బలపరచాయి. దేవుని కూమారుడయిన తానూ మనిషిగా సిలువ మీద పొందవలసిన మరణమును తెలియజేశాడు. అంతే కాకుండా తనను వెంబడించాలకున్న వారు తమను తాము ఉపేక్షించు కోవాలని వారికి బోధించాడు. అనగా తమ స్వేచ్ఛను వదులుకొని దేవుని కార్యములు జరిగించటము మరియు వాక్యానుసారముగా శరీర క్రియలు మాని పవిత్రముగా జీవించటము. యేసు క్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం చేసింది అదే కదా! 

చివరగా దావీదు రాసిన కీర్తన లోంచి క్రింది వచనం చూడండి!

కీర్తనలు 95: "7.  రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు. 8.  అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి." 

మనలను సృష్టించిన దేవుని మాట అంగీకరించిన యెడల ఎంత మేలు! ఇశ్రాయేలీయుల వలె హృదయమును కఠినపరచుకొనక అయన మాటలకు తల ఒగ్గటం మనలను విశ్వాసములో బలపరుస్తుంది మరియు ఆయనకు దగ్గరగా మనలను ఉంచుతుంది. కనుక సహోదరి సహోదరుడా, దేవుని గద్దింపును గుర్తించండి, అంగికరించండి. మనలను మనం ఉపేక్షించుకుందాం, దేవుని ప్రణాళికలో కొనసాగుతూ ఆత్మీయంగా పురోగతి సాధిద్దాం.  దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

16, జనవరి 2021, శనివారం

సంఘములో ఐక్యత!

సంఘము అనగా యేసు క్రీస్తును తలగా చేసుకొని అయన దేహముగా అయన రెండవ రాకడ కోసం సిద్దపడే వధువు వంటిది. దేహము / శరీరము తో పోల్చినప్పుడు అందులో భాగములు కూడా ఉంటాయి కదా! అనగా సంఘములో ఉండే అంగములే విశ్వాసులు. ఈ విశ్వాసుల మధ్యలో ఐక్యత, సఖ్యత కలిగి ఉంటేనే సంఘమంత ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకోవచ్చు. కానీ నేటి సంఘములలో అటువంటి ధోరణి కొనసాగుతుందా? వాటి గురించి ఏకరువు పెట్టేముందు! అసలు సంఘము యొక్క లక్షణములు ఏమిటి? వాక్యానుసారముగా తెలుసుకుందాం.  

అపొస్తలుల కార్యములు 2: "44.  విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు కొనిరి. 45.  ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 46.  మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను."

పై వచనములో ఆదిమ సంఘము, పెంతేకొస్తు దినమున పరిశుద్దాత్మ పొందుకొన్న తర్వాత, ఎలా తాము ప్రభువులో ఎదుగుతూ తమ పరిచర్యను కొనసాగించారో తెలుపుతుంది. విశ్వాసులు అందరు  తమకు కలిగినది అమ్మి అవసరం ఉన్నవారికి పంచి ఇచ్చారు. అంతే కాకుండా వారు ఏక మనస్సు కలిగిన వారై! దేవుణ్ణి స్తుతించారు. తద్వారా ప్రజల యొక్క దయను పొందారు. ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు అనుదినము రక్షణ అనుభవము పొందిన వారిని వారితో చేర్చు చుండెను. అనగా రోజు కొత్తవారు సంఘములో చేర్చబడుచున్నారు. క్రీస్తు సంఘముగా ప్రజల యొక్క ఆదరణ పొందటం ఎంతో ప్రాముఖ్యమయినదిగా పరిగణించాలి.  మన ప్రవర్తనయందు క్రీస్తు ప్రేమను చూపుతూ మన యొక్క రక్షణను ప్రకటించాలి. అదియే ప్రభువు ప్రేమను ప్రజలకు చాటి అయన వైపు వారిని నడిపిస్తుంది. ఇది జరగాలంటే విశ్వాసులు ఏక మనసు కలిగిన వారై ఉండాలి. దేహము యొక్క ప్రవర్తన తలను బట్టి ఉంటుంది గాని చేతిని బట్టి, ముక్కును బట్టి లేదా కళ్ళను బట్టి ఉండదు. అదే విధముగా సంఘము కూడా ప్రభువును బట్టి అనగా వాక్యాను సారముగా నడుచుకోవాలి గాని ఏ ఒక్క విశ్వాసిని బట్టి, సంఘ పెద్దలను బట్టి కాదు. దేవుడు ప్రతి విశ్వాసిని తన దేహములో అనగా సంఘములో అవయవాలుగా చేసాడు. తన చిత్తము చొప్పున తలాంతులు అనుగ్రహించి తన పరిచర్యను చేయటానికి అనగా తన రాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు. తద్వారా సంఘము యొక్క అభివృద్ధిని జరిగిస్తున్నాడు అనగా కొత్తవారిని చేర్చటానికి ఇష్టపడుతున్నాడు. కొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల సంఘ సభ్యుల ప్రవర్తనను విశదీకరిస్తూ పౌలు గారు కొరింథీయులకు లేఖ రాశారు (1 కొరింథీయులకు 8) చదవండి. 

1 కొరింథీయులకు 1: "10.  సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను."

పౌలు గారు ఎంతో భారముతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ వచనము చూడండి. సహోదరులందరు ఏకభావము కలిగిన వారై ఉండాలని, కక్షలు లేకుండా ఏక మనసు కలిగిన వారై ఉంటు  ప్రభువు రాకడకై సంఘముగా సిద్దపడి ఉండాలని ప్రభువు పేరిట వేడుకుంటున్నాడు. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు కలిగిన మనుష్యుల మధ్య ఇది సాధ్యమేనా? క్రీస్తును బట్టి నడచుకొంటే సాధ్యమే. ప్రతి విశ్వాసి తమను తాము తగ్గించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి అన్న క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటె సాధ్యమే కదా! 

1 పేతురు 3: "8.  తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి." 

అపొస్తలుడయిన పేతురు గారు కూడా తాను రాసిన మొదటి లేఖలోని పై వచనములు చూడండి. ఏక మనస్సు కలవారై ప్రతి ఒక్కరి సుఖదుఃఖముల యందు పాలు పంచుకొంటూ సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులుగా, వినయ మనస్సు కలవారై ఉండుమని ప్రోత్సహిస్తున్నారు. ఆశీర్వాదమునకు వారసులు కావటానికి మనం పిలువబడ్డ వారము కనుక కీడు చేసే వారికి ప్రతిగా కీడు చేయకుండా, దూషించిన వారిని తిరిగి దూషించకుండా దీవించుమని పరిశుద్దాత్మ ప్రేరణతో హెచ్చరిస్తున్నారు. యేసు క్రీస్తు చెప్పినట్లుగా "మిమల్ని దీవించిన వారిని దీవిస్తే మీకేమి ప్రయోజనము, మీకు తిరిగి సహాయము చేసేవారికి సహాయం చేస్తే ఏమిటి లాభము" అన్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి పై లక్షణములు పాటించినట్లయితే సంఘములో ఐక్యత సాధ్యమే. 

సామెతలు 15: "1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును."

సామెతల గ్రంథములో సొలొమోను రాసిన ఈ గొప్ప మాటను ఒక్కసారి చూడండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చుతుంది కానీ నొప్పించు మాట కోపమును రేపుతుంది. అసలు ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు విడిపోవడానికి సొలొమోను కుమారుడవైన రెహబాము మాట్లాడిన పరుషమయిన మాటలే అని లేఖనములు స్పష్టం చేస్తున్నాయి. రాజయిన వెంటనే రెహబాము తండ్రి రాసిన సామెతల గ్రంథమును చదివినా బాగుండేదేమో అనిపిస్తుంది. 

రాజులు 12: "3. ​జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజ మంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. 4. ​నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెను; నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవచేయుదుము."

ఇశ్రాయేలు వివిధ గోత్రముల నుండి కొంతమంది పెద్దలు రెహబాముతో కొన్ని విన్నపములు చేసుకోవటనికి వచ్చారు. అతని తండ్రి అయినా సొలొమోను వారిని ఎంతగా కష్టపెట్టింది చెప్పుకొని తానయినా ఆ కష్టములు తొలగించుమని వేడుకుంటున్నారు. అయితే అహంకారుడయినా రెహబాము పెద్దల మాటను పేడ చెవిన పెట్టి తనవంటి  యవ్వనస్తులు చెప్పిన సలహాలు విని వారితో పరుషంగా మాట్లాడి ఇశ్రాయేలులో పది గోత్రముల వారు విడిపోయేలాగా ప్రవర్తించాడు. 

రాజులు 12: "16. కాబట్టి ఇశ్రాయేలువారందరును రాజు తమ విన్నపమును వినలేదని తెలిసికొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీమీ గుడారములకు పోవుడి; దావీదు సంతతివారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారములకు వెళ్లిపోయిరి."

పై వచనములో రాజు తమ మాట మన్నించకపొగ పరుషంగా మాట్లాడినందుకు తన ఏలుబడిలో నుండి వెళ్ళి పోయారు ఇశ్రాయేలు వారు. తద్వారా దేవుని వాగ్దానము నెరవేరటమే కాదు ఇశ్రాయేలులో సమైఖ్యత నశించిపోయింది. సంఘములో సైతం పరుషముగా మాట్లాడుతూ, ఇతరులను నొప్పించువారు ఉన్నట్లయితే సంఘములో ఐక్యత ఖచ్చితంగా దెబ్బ తింటుంది. మృదువయిన మాట తీరును అలవరచుకుందాం! ఏక మనసు కలిగి ఉండటానికి ఇష్టపడుదాం కానీ ఏక పక్షముగా ఉండటాన్ని కాదు. ఇక్కడ రెహబాము ప్రజలు లొంగి ఉంటున్నారు కదా అని నిరంకుశంగా ఏక పక్షంగా ఉండాలని చూశాడు కానీ ప్రజలు దాన్ని స్వాగతించ లేదు. సంఘములో ఉండే పెద్దలు సైతం ఇటువంటి మనస్థితిని జయించాలి. క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని సంఘము నిర్ణయలలో పాలిభాగస్తులను చెయ్యాలి. వాక్యానుసారముగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రేరణ కలిగిస్తూ ప్రోత్సహించాలి. క్రీస్తు ప్రేమయే మనలను ఐక్యపరచే బలము. ఆ ప్రేమ లోపించిన నాడు భిన్న మనస్తత్వాలు, సొంత అస్థిత్వాలు బయలు దేరుతాయి. క్రీస్తు ప్రేమ రెహబాము వంటి స్వభావమును అంగీకరించదు, సంఘము యొక్క ఐక్యతను కోరుకుంటుంది, ప్రతి సభ్యుడిని పాలిబాగస్తుడిగా చేర్చుకుంటుంది. కన్ను ఒక్కటి ఉంది కదా అని రెండవ కన్నును ఎవరయినా నిర్లక్యం చేస్తారా? చేతి వెళ్ళు పది ఉన్నాయి కదా అని ఒక్క వేలిని నరికేసు కుంటారా? సంఘములో ఉన్న ప్రతి అంగము అనగా ప్రతి విశ్వాసి అంతే ప్రాముఖ్యం ఉన్నవాడు. అది దేవుని చిత్తముగా జరిగింది కనుకనే ఆ విశ్వాసి ఆ సంఘములోకి నడిపింపబడ్డాడు. విశ్వాసులను సరిచేయటం తప్పు కాదు, వారు మారనప్పుడు వదిలేయటం వాక్యానుసారం కానిది కాదు. కానీ అతను నా వాడు, ఇతను ఫలానా అతని వాడు అని గుంపులు కట్టటం కొరింథీయులకు రాసిన పత్రికలల్లో  పౌలు గారు ఏనాడో దుయ్యబట్టారు.  

రాజులు 18: "31.  యెహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని 32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి"

పై వచనంలో బయలు ప్రవక్తలను సవాలు చేసిన దేవుని ప్రవక్త ఏలీయా యెహోవాకు బలి అర్పించుటకు ముందు విడిపోయిన ఇశ్రాయేలు గోత్రములన్నింటిని బట్టి పన్నెండు రాళ్లు తెప్పించి దేవునికి బలి పీఠము కట్టి ఆ గోత్రముల సమైక్యతను, సమానత్వమును చాటుతున్నాడు. అటువంటి ప్రవర్తన  దేవునికి ఎంత ప్రీతికరమవుతుందో కదా! అటువంటి స్వభావము మనం కలిగి ఉన్నామా? వారు మా కులం వారు, వీరు మా వీధి వారు లేక మా ఉరి వారు అని ఇంకా తారతమ్యాలు పాటిస్తున్నామా?  సంఘము అనగా లోక రీతిగా ఒక కులం వారు కలుసుకోవటం కాదు, ఒక ఉరి వారు విహార యాత్రకు రావటం కాదు, లేదా కేవలం స్నేహితులు చేసుకొనే విందు కాదు.  ఒకరి మంచిని ఒకరు మెచ్చుకుంటూ, ప్రతి ఒక్కరు ఇతరుల మంచిని, క్షేమమమును ఆశిస్తూ, క్రీస్తులో ఎదగటం. అనగా అయన ప్రేమను చూపుతూ ఇతరులను ఎదిగించటం. తద్వారా అయన రెండవ రాకడకై మనం సిద్దపడుతూ అయన చిత్తముగా ఇతర ఆత్మలను రక్షించటం. అందరం క్రీస్తు వారలము, దేవుని బిడ్డలము అన్న భావన కలిగిననాడు సంఘములో ఐక్యతకు లోటేమి ఉంటుంది. ఇవన్ని జరిగేలా చూడవలసింది సంఘములో ఉండే పెద్దలు. యధా రాజా తధా ప్రజ లాగా పరిస్థితి మారకుండా ఉండాలంటే యధా క్రీస్తు తధా సంఘముగా పరిస్థితి మారాలి. 

ప్రస్తుతం సంఘములలో పెత్తనాల కోసం పోరు మాములుగా ఉండటం లేదు. దేవుని సంఘములో ఎన్నికలు పెడుతున్నారు. అపొస్తలులు ఏనాడయినా  ఎన్నికలు పెట్టారా? యేసు క్రీస్తు తన వృత్తి చేసిన వారినే శిష్యులుగా ఎంచుకున్నాడా? చీటీలు వేసి తండ్రి నీ చిత్తము బయలు పరచు అని సభ్యులను ఎన్నుకొంటే సరిపోదా? సంఘ పెద్దలు ప్రార్థిస్తే దేవుని చిత్తము బయలు పరచాడా? 

సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన ఎంతో ప్రసిద్దమయిన తగువు సంఘటనను ఈ పరిస్థితులకు ఆపాదించాలనిపిస్తుంది. ఇద్దరు తల్లులు ఒక్క బిడ్డతో వచ్చి ఆ బిడ్డ నాదంటే నాదని తగువులాడుకున్నారు. అటువంటి స్థితిలో చాల సంఘాలు కూడా ఉన్నాయి. సంఘము నాదంటే నాది అని సంఘ పెద్దలు తగువులాడుకుంటున్నారు. వారి వారి గొప్ప కోసం సంఘమును ముక్కలు చేయటానికి వెనుకాడటం లేదు. కానీ సొలొమోను బిడ్డను రెండు ముక్కలుగా చేయమన్నప్పుడు నిజమయిన తల్లి బిడ్డను త్యాగం చేయటానికి వెనుకాడలేదు. ఆ తల్లికే బిడ్డ అప్పగింపబడింది కానీ ముక్కలు చేయమన్న తల్లికి కాదు. కనుక సహోదరి, సహోదరుడా సంఘంలో  నీ పరిస్థితి ఎలాంటిదయినా సంఘమును ముక్కలు చేయకు.  దేవుని చిత్తమును కనిపెట్టు ఆయన ప్రేరేపిస్తే అక్కడ నుండి వెళ్ళిపో. ఆయనే నిన్ను తన చిత్తానుసారముగా వాడుకుంటాడు. దేవుణ్ణి నమ్ముకొని, అయన చిత్తము నెరవేర్చి నశించి పోయినవాడు ఎక్కడ వెతికిన దొరకడు. దేవుని సంఘము ఐక్యతను కోరటం కన్న మించిన దేవుని చిత్తము మరోటి ఉంటుందా? దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

9, జనవరి 2021, శనివారం

దేవుడు కరోనా నుండి కాపాడలేడా?

ఇలాంటి శీర్షిక (టైటిల్) పెట్టింది ఎక్కువ మందిని ఆకర్షించటానికి కాదు గాని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యను బట్టి దేవుడి వాక్యమును విపులీకరిస్తే బాగా అర్థం అవ్వటమే కాకుండా సందర్బోచితంగా ఉంటుందని ఈ ప్రయత్నం చేశాను. కరోనా నుండే కాదు మన దేవుడు ఎటువంటి ఆపదనుండి అయినా తనను విశ్వసించిన వారిని కాపాడే సామర్థ్యం కలిగినవాడు. ఆనాడు ఇశ్రాయేలు జనమును ఎన్ని అసాధ్యమయిన కార్యములచే కాపాడాడో బైబిల్ గ్రంథం మనకు తెలుపుతుంది. వాటికి సంబందించిన చారిత్రక అధారాలు మరియు భౌతికమయిన సాక్ష్యాలు ఎన్నో తవ్వకాలలో మరియు పరిశోధనల్లో బయటపడ్డాయి. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవులుగా, సజీవమయిన దేవుణ్ణి నమ్ముకున్న వారముగా మనం ఎలా ఉండాలి? అన్నింటికీ మన దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని ఏమి పట్టించుకోకుండా ప్రవర్తించాలా? అది విశ్వాసముగా పరిగణింపబడుతుందా? ఒక్కసారి వాక్యానుసారముగా తెలుకొనే ప్రయత్నం చేద్దాం. 

సామెతలు 22: "3.  బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు."

నీతి వాక్యాలు ప్రభోదించే సామెతల గ్రంథం ఏమి చెపుతుంది పై వచనం ద్వారా! బుద్దిమంతుడు ప్రమాదము వస్తుందని తెలిసి దాక్కుంటాడు! అంతే కానీ నాకేం కాదు అని ఎదురెళ్లి ప్రమాదంలో పడడు అని చెపుతోంది. అది జ్ఞానం లేని వారు చేసే పని. కరోనా లాంటి ప్రమాదకరమయిన అంటూ వ్యాధి, మందులేని వ్యాధి మన మధ్య ఉందని తెలిసి కూడా, అవసరం ఉన్న లేక పోయిన ఇష్టం వచ్చినట్లు బయట తిరగటం, సామజిక బాధ్యత పాటించక పోవటం దేవునికి ఇష్టమయిన పని, లేదా మన విశ్వాసం చూపించుకోవటం అని మీరు అనుకుంటున్నారా? 

యేసయ్యను సాతాను శోధించు సమయంలో వాడు ఆయనకు లేఖనములు చూయించి, దేవ దూతలు నిన్ను కాపాడుతారు అని ఎంతలా రెచ్చ గొట్టిన కూడా యేసయ్య కొండ మీది నుండి దూకేశాడా? అయన భూమి మీదికి వచ్చిన ఉద్దేశ్యము వేరు అని తెలిసినప్పటికీ, తానూ చనిపోయేది కొండ మీది నుండి దూకి కాదు అని తెలిసి కూడా ఎందుకు దూకలేదు? ప్రభువయినా దేవుణ్ణి నీవు శోధింప వలదని లేఖనములు ఉటంకించి సాతానును ఎదుర్కొన్నాడు.  మరి మన కెందుకు ఇంతటి నిర్లక్ష్య ధోరణి? ఇది విశ్వాసమా? లేక సాతాను వలలో పడిపోవటమా? 

తన శిష్యులను సువార్తకు పంపు సమయంలో యేసయ్య ఎన్ని జాగ్రత్తలు చెప్పాడో ఒక్కసారి మత్తయి సువార్త 10 వ అధ్యాయంలో చదవండి! దేవుడయినా యేసయ్య  శిష్యులకు ఎందుకు  జాగ్రత్తలు చెప్పాడు? తాను వారితో ఉండనందుకు కాదు. నిజానికి అయన కూడా కొన్ని సార్లు  తనకు ప్రమాదం ఉన్నదని తెలిసిన పట్టణములకు వెళ్ళకుండా తన సువార్త పరిచర్యను కొనసాగించాడు (యోహాను 7:1). దేనికి? యేసయ్య భయపడ్డడా? యేసయ్య కంటే మనం ధైర్యవంతులమా?  తన ఘడియ వచ్చే వరకు తండ్రి అయినా దేవుణ్ణి శోధించలేక అయన ఆవిధంగా చేసాడు.  అదే విధంగా శిష్యులకు కూడా జాగ్రత్తలు చెప్పాడు. 

మత్తయి 10: "23. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; ..... "

పై వచనంలో చూడండి యేసయ్య తన శిష్యులకు ప్రమాదం ఉన్న చోటు నుండి పారిపోండి అని చెపుతున్నాడే గాని ఆక్కడే ఉండి ప్రభువా కాపాడు అని ప్రార్థించమని చెప్పలేదు. మరి మనం చేస్తున్నది ఏమిటి? ప్రమాదానికి ఎదురు వెళ్తున్నాం. జాగ్రత్తలు పాటించకుండా, అవసరం ఉన్న, లేకపోయినా అతి సాధారణంగా తిరిగేస్తున్నాం. ఎందుకు? మన దేవుడు సజీవుడు, ఆయనే మనలను కాపాడుతాడు, అంతేనా? ఇది విశ్వాసమా? లేక దేవుణ్ణి శోధించటమా?

తమ పరిధిలో ఉన్న జాగ్రత్తలు పాంటించి, పరిస్థితులను చక్కబెట్టుకొక దేవుణ్ణి శోధించు వారిని గురించి అపొస్తలుడయినా  పౌలు ఏమంటున్నాడో ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూద్దాము. 

1 కొరింథీయులకు 10: "9. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి." 

ఇశ్రాయేలు వారు దేవుడు చేసిన అద్భుత కార్యములు మరచిపోయి అదేపనిగా తమకు నచ్చిన ఆహారము కోసము, ఏమాత్రం ఓర్పులేకుండా మోషేతో వాదనలు పెట్టుకున్నారు. దేవుడు చేసిన దీర్ఘకాలిక వాగ్దానాలు విడిచి పెట్టి అప్పటికప్పుడు తృప్తి పరచే కోరికలను జయించలేక దేవుణ్ణి శోధించినారు. కనుకనే దేవుని  ఆగ్రహమునకు గురి అయినారు. దేవుడు మనలను కూడా ఇలాగె నశింపజేస్తాడా? దానిని నేను చెప్పలేను కానీ! ఏదయినా అనుకోనిది జరిగితే ఏమని ప్రార్థిస్తావు? "దేవా నేను ఏ జాగ్రత్తలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగాను, నాకు ఇప్పుడు కరోనా సోకింది, నువ్వే స్వస్థపరచు" అని ప్రార్థిస్తావా? లేక అల్పమయిన కోరికలను, ప్రలోబలను జయిస్తూ, ఓర్పుగా, కలిగినంతలో ఇంట్లో ఉంటూ, దేవుని సన్నిధిలో అనగా ప్రార్థిస్తూ, అయన వాక్యమును ధ్యానిస్తూ అయన నీకు ఇచ్చిన తలాంతులను మెరుగు పరచుకుంటూ  గడుపుతావా! దేవుని సన్నిధికి మించిన ఆనందం ఇంకేదయినా ఉందంటే నీ విశ్వాసమును ఒక్కసారి పరీక్షించుకో. 

ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉంటే మరీ దేవుడు చేసేది ఏమిటి? దీన్నిబట్టి దేవుడు మనలను కాపాడలేడు అని తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవునికి అసాధ్యమయినది ఏది లేదు. అయన జ్ఞానము మనకు అంతుపట్టనిది. ఈ పరిస్థితులు మానవాళి మీదికి అయన ఎందుకు అనుమతించాడో మనకు తెలియదు. కానీ మన ఘడియ కానప్పుడు దేవుడు మనలను ఖచ్చితంగా కాపాడుతాడు. అయన నిన్న, నేడు మరియు రేపు కూడా ఏక రీతిగా ఉండేవాడు. యేసయ్యను కాపాడిన దేవుడే నిన్ను, నన్ను కూడా కాపాడు సామర్థ్యం కలిగినవాడు. 

యోహాను 7: "30. అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు."

యోహాను గారు రాసిన సువార్తలో ఏమంటున్నారు చూడండి. పరిసయ్యులు యేసయ్యను పట్టుకొని సంహరించాలనుకున్నప్పుడు అయన ఘడియ ఇంకా రాలేదు కనుక వారు ఆయనను పట్టుకోలేక పోయారు. ఒక్కసారి కాదు, రెండు మూడు సార్లు అదే దేవాలయము దగ్గర వారు ఆయనకు హాని పెట్టాలని చూసారు. కానీ దేవుడు దానిని అనుమతించలేదు. ఒక్కసారి రాళ్లతో కొట్టి చంపాలని చూసారు అయినా దేవుడు దానిని జరగనివ్వలేదు. యేసయ్య చనిపోవలసింది రాళ్ళతో కొట్టబడి కాదు గనుక. 

లూకా 4: "29. ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి. 30.  అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను."

లూకా గారు రాసిన సువార్తలో యేసయ్యను జనము పట్టణము నుండి బయటకు తీసుకొచ్చి, కొండ మీది నుండి తల క్రిందులుగా పడేయాలని చూశారు. కానీ అద్భుతంగా అయన జనముల మధ్య నుండి తప్పించుకున్నాడు. ఎలా సాధ్యం అయింది ఇది? అంత మంది జనం మధ్యలో నుండి ఒక మనిషి తప్పించుకోవటం సాధ్యమా? ఇది దేవుని కార్యం కాకపోతే మరీ ఏమిటి? దేవుడు నీ పట్ల,  నా పట్ల అటువంటి ప్రణాళికలు, అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. ఐగుప్తు నుండి విడిపించబడిన ప్రతి ఇశ్రాయేలీయుడు కానాను చేరాలన్నది దేవుని ప్రణాళిక, అల్పమయిన కోరికలను జయించలేక నశించపోవటం వారి బుద్దిహీనత. ప్రియా సహోదరి,  సహోదరుడా ప్రమాదం లేదన్న భ్రమలో ఉంటె ప్రమాదం వెళ్ళిపోదు. మన దరికి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంద్దాం. దేవుడి మీద భారం వేసి, విశ్వాసముతో ముందుకు సాగుదాం. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!