పేజీలు

29, జనవరి 2022, శనివారం

ప్రభువు రాకడకు సిద్దపడుతున్నావా?

 

ప్రభువు నందు విశ్వాసముతో మారు మనసు పొందిన మీరు, నూతనముగా జన్మించి, ప్రభువయినా యేసు క్రీస్తును హృదయములలో నిలుపుకుని, అయన ప్రేమను ప్రతిఫలింపఁజేయ ప్రయత్నం చేస్తున్నారా? అయన రాకడకు సిద్దపడుతున్నారా? ప్రస్తుతం లోకములో జరుగుతున్నా పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉంటున్నాయి. యేసు ప్రభువు తన రెండవ రాకడను బట్టి అయన బోధలలో ప్రవచించిన విషయములవలే గోచరిస్తున్నాయి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్న మాటలు చూడండి ఈ వచనంలో:

ఎఫెసీయులకు 5: "15. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, 16.  అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి."


దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగము చెసుకొమ్మని, అజ్ఞానుల వలే కాక జ్ఞానులవలె నడచుకోవాలని హెచ్చరిస్తున్నారు పౌలు గారు. ప్రతి వేళలో దైవ చింతన కలిగి ఉండుట మన ఆత్మీయతకు క్షేమకరము. ప్రస్తుతం మన చుట్టూ ఎన్నో శోధించే విషయాలు ఉన్నాయి. స్వల్పకాలం లోనే మనలను దేవునికి దూరం చేసి మన ఆత్మీయ మరణానికి కారణం కాగలవు. కనుక కాస్సేపే కదా అని వాటి జోలికి వెళ్లకుండా ప్రార్థనలో సమయం గడుపుతునో, దేవుని మాటలు ధ్యానిస్తునో లేదా దేవుని పాటలు వింటూనో కాలక్షేపం చెయ్యండి. 

పేతురు గారు తన మొదటి పత్రికలో సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడని రాశారు. సాతాను కుయుక్తులకు పడిపోకుండా, చుట్టూ ఉన్న శోధనలకు లొంగి పోకుండా, విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఉన్నంత ఆరాటం, దేవుడి మీద ప్రేమ చూపించాలి. ఆత్మీయతలో నీవు ఎదిగే కొద్దీ ఆ ప్రేమ పెరుగుతూ రావాలి. కానీ చాల మందిలో అది తగ్గిపోతూ ఉంటుంది. రాను రాను మునుపటి స్థితికి కూడా వెళ్ళిపోతారు. తేడా ఒక్కటే ఏమిటంటే, అప్పుడు అన్యులుగా ఉన్నారు, ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. 

ఎందుకిలా జరుగుతుంది? దేవుడి అనంత ప్రేమను వారు తెలుసుకున్నారు. ఏం చేసిన క్షమిస్తాడులే, మరోసారి "క్షమించు ప్రభువా" అని రొట్టె, ద్రాక్షరసం తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు.  మనలను మనం మోసం చేసుకోవచ్చు కానీ, దేవుణ్ణి మోసం చేయలేము. ప్రతి హృదయపు తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. వాటిని బట్టే మనకు తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు నిజంగా మారాలని ఆరాటపడుతున్నావా! నీ శరీరంతో పోరాటం చేస్తూ ఓడిపోతున్నావా? లేక పరిశుద్దాత్మ గద్దింపును లెక్కచేయక బుద్ధిపూర్వకంగా పడిపోతున్నావా? అయన అన్ని సంగతులు ఎరిగి ఉన్నాడు. ఒకవేళ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంటే, నీ ప్రయాణం ప్రభువు రాకడ వైపు సాగటం లేదు. 

సహోదరి, సహోదరుడా కొన్ని నిమిషాల సుఖం కోసం దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను  తప్పిపోకండి. నిన్ను జగతు పునాది వేయక ముందే అయన ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏ కాలంలో, ఏ కుటుంబంలో పుడితే నీకు రక్షణ పట్ల ఆసక్తి కలుగుతుందో ఆయనకు తెలుసు. కనుకనే నీకు విశ్వాసం ఇచ్చి, నిన్ను బలపరచటానికి ఎన్నో మేలులు చేశాడు, తన దగ్గర చేర్చుకోవటానికి ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు అనుమతించాడు, నువ్వు తట్టుకోలేని శోధనలు ఇవ్వకుండా, చంటి బిడ్డను సాకినట్లుగా విశ్వాసంలో పెంచుతూ వచ్చాడు. మరి నువ్వు ఇప్పుడు అ  గొప్ప రక్షణ మార్గంలోనే సాగుతున్నావా? లేక శరీర సౌఖ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నావా? వేయిమంది భార్యలు, సర్వ సౌఖ్యాలు అనుభవించిన సొలొమోను ఏమని రాస్తున్నాడు ప్రసంగిలో ఒక్కసారి చూడండి!

ప్రసంగి 12: "1. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2.  తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము."

సొలొమోను గారు అన్ని సుఖాలు అనుభవించిన తర్వాత వాటిలో ఏ సంతోషం లేదని ముసలి ప్రాయంలో ఈ విషయాలు రాస్తున్నారు. అయన విషయంలో ఆలస్యం జరిగిపోయింది. కనుకనే మనలను హెచ్చరించే ఈ మాటలు దేవుడు తన గ్రంథంలో అనుమతించాడు. బాల్యమునందే దేవుణ్ణి తెలుసుకొని నడుచుకొనుట, ఆయనను స్మరించుట మేలయినదని తెలుపుతున్నాడు. మనకు ఇంకా సమయం ఉంది అనుకోని వ్యర్థమయిన, అశాశ్వతమయిన వాటికై అణగారిపోకండి. ప్రభువు రాకడ  ఎప్పుడో ఎవరికీ తెలియదు!

2 పేతురు  3: "10. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన 11.  ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, 12. దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను."

ప్రభువు దినము దొంగవలే వస్తుందని పేతురు గారు రాస్తున్నారు. యేసు క్రీస్తును శిష్యులు ఆ దినము గురించి అడిగినప్పుడు తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు అని చెప్పారు. కనుకనే ఆ దినము చెప్పకుండా, దొంగవలే వస్తుందని పరిశుద్దాత్మ పలుమార్లు రాయించాడు. దొంగను ఎదురుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? గట్టిగా తలుపులు బిగించి తాళలు వేసేసి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా  మనం కూడా ఆత్మీయంగా పరిశుద్దమయిన ప్రవర్తనతో, భక్తితో జాగ్రత్తగా ఉంటూ ప్రభువు రాకడకై నిరీక్షించాలని  పేతురు గారు రాస్తున్నారు. 

1 థెస్సలొనీకయులకు  5: "4. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు. 5.  మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. 6.  కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము."

పరిశుద్దాత్మ దేవుడు మరోసారి కూడా పౌలు గారిని ప్రేరేపించి ఈ వచనం  రాయించాడు. దొంగ వలే వచ్చు ఆ దినమునకు భయపడటానికి మనం చీకటిలో ఉండువారం కాదు. దొంగ ఎప్పుడు చీకటిలోనే వస్తాడు కనుక చీకటిలో ఉన్నవారు మాత్రమే ఆ దినమును గురించి భయపడతారు.  కానీ మనము క్రీస్తు ద్వారా  నిత్యమూ వెలుగులో కొనసాగువారము. మనకు  వెలుగు దేవుని వాక్యము మరియు  ప్రభువయినా యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. చీకటిలో ఉన్నవారు ఆత్మలో నిద్రపోతారు. లోకరీతులకు ఆకర్షితులయి, దుర్నీతిని అనుసరిస్తూ సాతాను సంబంధులుగా ఉంటారు. కానీ వెలుగులో ఉన్న మనము మెలుకువగా ఉంటూ అనగా మన రక్షణధారమయిన విశ్వాసమును అభ్యాసం చేస్తూ ప్రభువు రాకడకై ఎదురు చూడాలని పౌలుగారు మనలను ప్రోత్సహిస్తున్నారు. విశ్వాసమును ఎలా అభ్యాసం చెయ్యాలి? 

1 థెస్సలొనీకయులకు  5: "15. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. 16. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; 17. యెడతెగక ప్రార్థనచేయుడి; 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. 19. ఆత్మను ఆర్పకుడి. 20.  ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. 21.  సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. 22.  ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి." 

ఈ వచనములలో చెప్పిన విషయాలు కష్టతరంగా తోయటం సహజమే. కానీ అసాధ్యమయిన విషయాలు మాత్రం కావు. పరిశుద్దాత్మ శక్తి ద్వారా పాటించగల వాటినే దేవుడు రాయించాడు.  కీడుకు ప్రతి కీడు చేయక పోవటం, మనుష్యులందరికి మేలు చేయటం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం. అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేయటం, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం చెయ్యాలి. ఎందుకంటే దేవుడు మన మేలు కొరకే దేనినయినా అనుమతిస్తాడు గాని మనకు కీడు చేయుటకు మాత్రం కాదు. 

ఆత్మను మండే స్థితిలో ఉంచుకోవటం, అంటే పరిశుద్దాత్మ గద్దింపును అనుసరించటం ప్రాముఖ్యమయినది. ఆలాగుననే దేవుడు రాయించిన ప్రవచనములు నిర్లక్ష్యం చేయక పోవటం. అలాగని ప్రతివారు తెలిపే ప్రతి ప్రవచనమును  నమ్మకుండా దేవుని వాక్యముతో సరిచూసుకోవాలి. అన్నింటిని వాక్యముతో పరీక్షించి  మేలయినది పాటించాలి. మన ఆత్మీయతను దెబ్బతీసే సమస్తమయిన కీడుకు దూరంగా ఉండాలి. 

వీటన్నింటికి కట్టుబడి ఉండటానికి సిద్ధపాటు చూపిన నాడు, పరిశుద్దాత్మ దేవుడు మనలను నడపటానికి తోడుగా ఉంటాడు. మనలను పిలుచుకున్న దేవుడు నమ్మకమయినవాడు. ప్రభువయినా యేసుక్రీస్తును ప్రేమించిన దేవుడు మనలను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. విశ్వాసములో కొనసాగటమే మనం చేయవలసింది. అనగా క్రియలు కలిగిన విశ్వాసమును పాటించాలి. 

1 థెస్సలొనీకయులకు  5: "9. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు."

ఈ వచనము ఎంత ధైర్యం నింపుతుంది చూడండి. దేవుడు మనలను ఏర్పరచుకున్నది ప్రభువయినా యేసుక్రీస్తు ద్వారా రక్షించటానికే గాని మన పాపముల నిమిత్తం శిక్షించటానికి మాత్రం కాదు. జగతు పునాది వేయక ముందే నిన్ను ఏర్పరచుకొని, పిలుచుకున్న దేవుడు తలపెట్టిన కార్యములు పూర్తీ చేయకుండా వదిలిపెడుతాడా? నిన్ను రక్షించటానికే కదా విశ్వాసం ఇచ్చింది! అయన మార్గములు అనుసరిస్తే చాలు నిన్ను మార్చుకోవటం ఆయనకు అసాధ్యమా? కనుక సహోదరి, సహోదరుడా - ప్రభువు రాకడకై సిద్ధపాటులో  అలక్ష్యం వలదు! రక్షణ విషయంలో నిర్లక్ష్యం కూడదు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో మీ ముందుకు వస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!! 

22, జనవరి 2022, శనివారం

పిల్లల మాదిరి విశ్వాసము!

 

ప్రభువయినా యేసు క్రీస్తు చిన్న పిల్లలను ఎంతగానో ప్రేమించారు. అంతే కాకుండా విశ్వాసులయిన వారికి చిన్న పిల్లల మనస్త్వత్వం ఉంటేనే పరలోకం చేరుకుంటారని కూడా బోధించారు. ఈ విషయమును కాస్త లోతుగా ధ్యానించుకుందాము.  ఎందుకు ప్రభువు చిన్నపిల్లల మనసు కలిగి ఉండాలని సెలవిచ్చారు? పిల్లల విశ్వాసం ఎలా ఉంటుంది? మోషే తర్వాత ఇశ్రాయేలుకు  దేవుని చేత నాయకునిగా ఎన్నుకోబడిన యెహోషువ అమోరీయుల మీద యుద్దానికి వెళ్ళినప్పుడు చేసిన ప్రార్థన క్రింది వచనములలో ఒక్కసారి చూద్దాము. 

యెహోషువ 10: "12. యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా. 13. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. 14.  యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను."

యెహోషువను నాయకుడిగా చేసినప్పుడు దేవుడు ఆయనకు ఇచ్చిన వాగ్దానము ఏమిటంటే అయన ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలువలేడని! కానీ ఆ రోజు గడిచి పోతున్నను వారికి విజయం లభించటం లేదు. ఆ సమయంలో యెహోషువ నిరుత్సాహపడలేదు, దేవుని వాగ్దానాలు పని చేయటం లేదని సణుగుకొలేదు. ఎంతో ధైర్యముగా దేవుణ్ణి  ప్రార్థిస్తు, సూర్య చంద్రులను నిలిచిపొమ్మని అడుగుతున్నాడు. మానవ మాత్రుడయినా వ్యక్తికి ప్రకృతిని శాసించటం సాధ్యమా? అతని ప్రార్థనలో సాధ్యసాధ్యాల ప్రస్తావన లేదు. హేతుబద్దమయిన ఆలోచనకు తావు లేదు. సృష్టి కారుడయినా దేవునికి అన్ని సాధ్యమే అన్న విశ్వాసమే కనపడుతుంది. అందుకే తన ప్రార్థన ఫలించింది. ఆ రోజు దేవుడు నరుని మాట విని సూర్య చంద్రుల్ని నిలిపి వేసి వారి తరపున యుద్ధం చేసి వారిని గెలిపించాడు.  

చాల సార్లు చిన్న పిల్లలు తమ తల్లి తండ్రుల స్థితిని, పరిస్థితిని గమనించుకోకుండా అమాయకంగా తమకు  అది కావాలి ఇది కావాలి మారం చేస్తారు. తల్లితండ్రులకు  అది సాధ్యమా కాదా అని ఆలోచించారు. ఎందుకంటే హేతుబద్దమయిన ఆలోచన చేసే శక్తి వారిలో ఇంకా రాలేదు. కనుకనే తల్లి తండ్రుల మీద వారికి అంతటి విశ్వాసం. వారు ఎదగటం మొదలు పెట్టిన తర్వాత హేతు బద్దమయిన ఆలోచనలు పెరిగి తమ కోరికలను అదుపులో ఉంచుకుంటారు.  విశ్వాసంలో ఎదిగే కొద్ది మనలో హేతుబద్దమయిన ఆలోచనలు తగ్గుతూ రావాలి. దేవునికి సమస్తము సాధ్యమే. అయన చిత్తానుసారముగా నా మేలు కొరకే అన్ని జరిగించగలడు అని విశ్వాసించాలి.  కానీ మనమెమో ఆత్మీయంగా ఎదిగిన కూడా ఈ హేతుబద్దమైన ఆలోచనలు పాటిస్తూ మన ప్రార్థన విన్నపాలు నియంత్రించుకుంటాము. తద్వారా మన విశ్వాసమును  చిన్నబుచ్చుకుంటూ దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు చేజార్చుకుంటాము.  

కానీ మన పరలోకపు తండ్రికి సజీవమయిన దేవుడు! సర్వ శక్తి మంతుడు, సర్వాధికారి, కేవలం నోటి మాట చేత సకలము సృష్టించిన దేవుడు. అయన మన నుండి కోరుకుంటున్నది మన స్వబుద్ధి ప్రకారం కాకుండా అనగా పరిస్థితులను బట్టి, సాధ్యమా కాదా అని అలోచించకుండా పూర్ణ హృదయముతో అయన యందు విశ్వాసము ఉంచటము మరియు మన ప్రవర్తన అంతటి యందు అయన అధికారమును ఒప్పుకోవటం అనగా ఆయన ఆజ్ఞలు పాటించటం, అప్పుడు ఆయనే మన త్రోవలను సరళం చేస్తాడు. అటువంటి అమాయకత్వముపరాధీనత మరియు విశ్వాసము చిన్న పిల్లల్లోనే సాధ్యము.  ఇలాగ నమ్మటం ఎంతవరకు సురక్షితము అన్న సందేహము వలదు.  క్రింది వచనంలో యేసయ్య ఏమని బోధిస్తున్నాడు చూడండి!

మత్తయి  7: "10. మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా 11. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును."

పాపులము, చెడ్డ వారమయిన మనమే మన పిల్లలకు ఉన్నతమయిన జీవితం ఇవ్వాలని ఆరాటపడుతూ ఉంటాము కదా! మరి పరిశుద్ధుడు, ఏ తప్పు ఎరుగని సృష్టి కారుడయినా దేవుడు మన కోసం ఎంత గొప్పదయినా జీవితం దాచి ఉంటాడు. కేవలం అయన మీద విశ్వాసంతో ముందుకు సాగటమే మనం చేయవలసింది.  బైబిల్ లో ఎక్కడ కూడా సాధ్యాసాధ్యాలు చూడమని చెప్పలేదు, కేవలం విశ్వాసం మాత్రమే చూపుమని చెప్పబడింది. పరిస్థితులు ఎంత ప్రతికూలమయిన నీకెందుకు! నాలో మీరు ఉండి, నా మాటలు మీలో ఉంటె నా నామములో  మీరు ఏదడిగినా ఇస్తాను అని చెప్పింది అయన! అవన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు చేయవలసింది విశ్వాస పూరితమయిన  ప్రార్థన! నీ సర్వము ఆయనకు అప్పగించటమే నీ ముందున్నా కర్తవ్యం. 

ఒక తండ్రి తన కుమారునితో  నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నీకు సైకిల్ కొనిపెడుతాను అన్నాడనుకుందాం. ఇక ఆ పిల్లాడు రాత్రి పగలు చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడు. వాడి దృష్టి బహుమానంగా వచ్చే సైకిల్ మీదే ఉంటుంది తప్ప తండ్రికి  సైకిల్ కొనటం ఆసమయంలో సాధ్యమా కాదా అని వాడికి పట్టదు.  కానీ నీ పరలోకపు తండ్రికి  అసాధ్యం ఏమి లేదు. ఆ పిల్లాడు కష్టపడి చదివినట్లుగా, విశ్వాసంతో అయన ఆజ్ఞలు పాటిస్తూ పార్థిస్తే ఆయన చెయ్యలేని కార్యం ఉందా? నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకుంటే నీ ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేయటానికి అయన ఎదురుచూస్తున్నాడో నీకు తెలుసా! 

యేసు క్రీస్తు చేసిన అద్భుతాలలో ప్రాముఖ్యమయినది అయిదు రొట్టెలు, రెండు చేపలతో అయిదు వేల మందికి భోజనం పెట్టటం. ఇది ఏలా సాధ్యం అయింది? ఒక్క చిన్నవాడు నిస్వార్థంగా తన దగ్గర ఉన్న సమస్తమును అనగా అయిదు రొట్టెలు, రెండు చేపలు అప్పగించటం ద్వారా. యేసయ్య కార్యం చేసింది దానివాళ్లనే అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఒక్క చిన్నవాడు దేవుని కార్యం కోసం తన గురించి ఆలోచించకుండా కేవలం యేసయ్య మీది విశ్వాసంతో ఎంతో పెద్దమనసుతో ప్రవర్తిస్తే, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసాడో చూడండి! 

యోహాను 6: "9. ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా 10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి. 11. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;"

విశ్వాసులము అని చెప్పుకొనే మనము అటువంటి నిస్వార్ధమయిన అప్పగింపు చేయగలమా? అయ్యో ఉన్నదంతా యేసయ్యకు ఇచ్చేస్తే నాకు ఆకలి వేస్తె ఎలా? అని ఆ పిల్లాడు అనుకోలేదు, తన దగ్గర ఉన్నది దాచుకోలేదు! ఏమి ఉన్న సరే యేసయ్య చూసుకుంటాడు అనుకున్నాడు! విశ్వాసంతో తన దగ్గర ఉన్నది సమర్పించాడు. అతనితో పాటు ఆ ప్రసంగానికి వచ్చిన మరి కొంతమంది దగ్గరయిన ఆహారం ఉండి ఉంటుంది, కానీ మా దగ్గర ఇది ఉంది అని వారెవ్వరు ముందుకు రాలేదు. వారు ఎంతగా సిగ్గుపడి ఉంటారో కదా తమ అవిశ్వాసానికి.  అటువంటి సిగ్గు మనం కూడా పడుదామా? లేక విశ్వాసముతో దేవుని గొప్ప కార్యాలు చవిచూద్దామా? 

సహోదరి, సహోదరుడా అందుకే పిల్లలవంటి విశ్వాసం దేవుడు మననుండి కోరుకుంటున్నాడు. అధైర్యపడవద్దు, అనుమానపడవద్దు, సాధ్యాసాధ్యాలు లెక్కలు వేయొద్దు. నీకు మేలయినది, నీకు శ్రేష్ఠమయినది ఇవ్వటానికి మన దేవుడు ఎదురుచూస్తున్నాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో మీ ముందుకు వస్తాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

15, జనవరి 2022, శనివారం

దేవుని మర్మమైన మార్గములు!


విశ్వాసులు అయిన మనము మన జ్ఞానమును బట్టి కొన్ని సంగతులు ఇలా జరగాలి, ఆలా జరగాలి అని అనుకుంటాము. మన ఆలోచన ప్రకారం లేదా మనకు తెలిసినట్లుగా జరగనప్పుడు బాధపడటం అత్యంత సహజం. కానీ దేవుని మార్గములు అత్యంత మర్మమయినవి, మానవ జ్ఞానమునకు అందనివి. అనంత జ్ఞానము కలిగిన దేవుని, కార్యములు ఉన్నతమయినవి, ఆవి మనలను అభివృద్ధి చేయటానికే దేవుడు మన జీవితాలలో జరిగిస్తున్నాడు. కానీ మనలో కొంత మంది ముందస్తు ఆలోచనలతో, ఊహలతో ప్రార్థిస్తారు అటుపైన తమ ఆలోచనలకు, ఊహలకు విరుద్ధంగా పరిస్థితులు కలుగుతుంటే నిరాశపడి పోతారు.

ఉదాహరణకు ఒక గణిత సమస్యకు రెండు మూడు రకాల విధానాల్లో సమాధానం కనుక్కొనే అవకాశం ఉండవచ్చు. విద్యార్థికి ఒక్క రకమయిన విధానామే తెలిసి ఉండవచ్చు. కానీ టీచర్ కు ఆ సబ్జెక్టు మీద ఉన్న జ్ఞానము ఎక్కువ గనుక మరి కొన్ని విధానాలు తెలిసి ఉండవచ్చు. అలాఅని విద్యార్థి టీచర్ ను నాకు తెలిసిన విధంగానే సమాధానం చెప్పమనటం అతని జ్ఞానమును అపి వేస్తుంది. ఆలాగే విశ్వాసి కూడా దేవుని మార్గములను ప్రతిఘటించటం, తాను అనుకున్నట్లుగా జరగాలను కోవటం కూడా అటువంటిదే. ఉదాహరణకు నీ జీవితంలో ఒక సమస్య  తీరాలంటే ఫలానా ఫలానా విషయాలు జరిగితే నా సమస్య తీరుతుందని నీ జ్ఞానమును బట్టి అలోచించి ప్రార్థిస్తుంటావు, కానీ వాటికి విరుద్ధంగా సంఘటనలు జరిగితే కంగారుపడి పోయి విశ్వాసంలో వీగిపోయే అవకాశం ఉంది కదా!  కానీ దేవుడు తన జ్ఞానము చొప్పున మరో విధంగా నీ సమస్యను తీరుస్తున్నాడు అని విశ్వసించాలి. 

ఎర్ర సముద్రం ఎదురుగా ఉండి, ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు మాత్రం ఊహించారా? సముద్రంలో ఆరిన నేలమీద నడుస్తామని. వారు పాటలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ యెరికో గోడల చుట్టూ తిరిగితే బలమైన ప్రాకారాలు కూలి పోయి ఆ దేశము తమ వశం అవుతుందని వారికీ మాత్రం తెలుసా! దేవుని మార్గములు ఆసాధారణమయినవి, ఎంతో అద్బుతమయినవి. అయన మహిమను నీ జీవితంలో నిరూపించి తద్వారా నీ విశ్వాసమును మరింత పెంచటమే అయన ఉద్దేశ్యం, ఆ విధంగా నిన్ను మరింత దగ్గరగా చేర్చుకోవటమే అయన కోరుకుంటున్నది. అంతలోనే అలిగి పోతావా? కాస్త ఆలస్యానికే కుంగిపోతావా? 

నువ్వు ఊహించినట్లుగా జరిగితే నీ విశ్వాసం బలపడుతుందా? దేవునికి మహిమ కలుగుతుందా? బైబిల్ నుండి ఒక్క సంఘటన చూద్దాం. సిరియా రాజ్యానికి సైన్యాధ్యక్షుడయిన నయమాను కుష్టు రోగంతో బాధపడుతు ఉండగా, దేవుని మహిమ ద్వారా ఇశ్రాయేలు పై విజయం పొందిన తర్వాత బానిసగా కొనిపోబడిన ఒక్క అమ్మాయి, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రవక్త ఎలీషాను దర్శిస్తే నయమాను కుష్టు నయం అవుతుందని అతని భార్యకు చెప్పుట ద్వారా, నయమాను ఎలీషాను కలుసుకుంటాడు. ఎలీషా తన మీద చేతులు ఉంచి ప్రార్థిస్తే తన కుష్టు నయం అవుతుందని నయమాను అనుకుంటాడు. కానీ ఎలీషా కనీసం తన గుడారంలో నుండి బయటకు రాకుండా తన అనుచరుడితో నయమానును యొర్దాను నదిలో ఏడు మార్లు మునిగి శుద్ధుడవు కమ్ము అని వర్తమానం పంపుతాడు. 

రాజులు 5: "11. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి,తన దేవుడైన యెహోవా నామ మునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. 12. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను."

ఈ వచనములలో నయమాను కోపగించుకొని వేళ్ళ నిశ్చయించుకోవటం చూడవచ్చు. తానూ అనుకున్నట్లు ఎలీషా తనను చూడటానికి బయటకు రాలేదు, మరియు తానూ ఊహించినట్లుగా తన మీద చేతులుంచి ప్రార్థించలేదు. నయమాను ఇశ్రాయేలును జయించిన పొగరుతో వచ్చాడు, బాగుపడితే ఎన్నో కానుకలు ఇస్తాను కదా అన్న గర్వపు ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుని మహిమ ద్వారా ఇశ్రాయేలును జయించాడని తనూ ఎరుగడు. నేను జయించిన దేశమే కదా అనుకుని ఇశ్రాయేలు నదులలో నీటిని సైతం తక్కువగా చూస్తున్నాడు, ఈ మునకలేవో ఎంతో శ్రేష్ఠమయిన మా దేశపు నదులలోనే వేసేవాణ్ణి కదా అనుకుంటున్నాడు కానీ ఇక్కడ దేవుడి కార్యం  ఉన్నదన్న విషయం గుర్తించలేక పోయాడు. 

రాజులు 5: "13. అయితే అతని దాసులలో ఒకడు వచ్చినాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయ కుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను." 

ఈ వచనములలో ఒక తెలివయిన దాసుని సలహాలు వినవచ్చు. ఆ ప్రవక్త ఏదయినా కష్టతరమయిన పని చెపితే చేసేవాడివి కదా? ఇంత చిన్న పని చేస్తే నీకు వచ్చే నష్టం ఏమిటి, అయన చెప్పినట్లు స్నానము చేసి కుష్టు నయం చేసుకోవచ్చు కదా అంటున్నాడు. నిజమే కదా, చాల సార్లు మనం కష్టమయినవి చేస్తేనే ఫలితాలు పొందుతాము అనుకుంటాము. కానీ కొలిమిలో ఉన్న ఇనుమును ఎంత బలంతో, ఏ విధంగా కొడితే అనుకున్న పరికరం తయారవుతుందో, కమ్మరికి మాత్రమే తెలుసు. ఎంత కష్టంతో కార్యం జరిగిస్తే నీ విశ్వాసం బలపడుతుందో, ఆయనకు మహిమ కలుగుతుందో దేవునికి మాత్రమే తెలుసు. ఇలాగె జరగాలి, ఆలా జరగటం లేదు అని కోపగించుకుంటే ఎలా? కొన్ని సార్లు సులభంగా అవుతుందన్నదనుకున్నది కూడా కష్ట తరంగా మారవచ్చు. అందులో దేవుని హస్తముందని గుర్తించాలి, వేచి చూడాలి. 

నయమాను ఎలీషా చెప్పిన విధంగా చేసి పసి వాడి మాదిరి చర్మమును పొందుకున్నాడు. అప్పుడు గాని  దేవుని మహాత్యమును గుర్తించలేదు. తానూ అనుకున్నట్లుగా ఎలీషా బయటకు వచ్చి తనను ఆహ్వానించి, చేతులుంచి ప్రార్థిస్తే తన గర్వం అణిగేదా? దేవుని యందు విశ్వాసం పెంచుకొనే వాడా? చక్రవర్తి సైన్యాధిపతిని కనుక నాకు గౌరవం ఇస్తున్నాడు, నేను కోరుకున్నట్లే ప్రార్థించాడు అనుకుని, తెచ్చిన కానుకలు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. 

రాజులు 5:  "15. అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచిచిత్త గించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోక మంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగు దును;...."

"17. అప్పుడుయెహో వాకు తప్ప దహనబలినైనను మరి యే బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను; రెండు కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించ కూడదా?"

చూడండి ఈ వచనములలో నయమాను ఎంతలా మారిపోయాడో తెలుస్తుంది. ఇశ్రాయేలును జయించాను కదా, ఏముంది దీని గొప్ప అనుకున్న వాడు కాస్త, ఇక్కడ ఉన్న దేవుడు మరెక్కడ లేడు అని సాక్ష్యం చెపుతున్నాడు. సైన్యాధిపతిగా, దర్పంతో వచ్చిన వాడు ఇప్పుడు నీ దాసుణ్ణి అని తనను తానూ తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ నీటిని సైతం చిన్నచూపు చూసిన వాడు ఇప్పుడు ఇక్కడ మట్టిని సైతం ఎంతో ఉన్నతమయినదిగా భావిస్తున్నాడు. ఏ ఇతర దేవుళ్లను ఇక మీదట పూజించనని చెపుతూ దేవునికి బలిపీఠం కట్టటానికి ఇశ్రాయేలు మట్టిని  మోసుకెళ్తున్నాడు.  

దేవుడు నయమాను అనుకున్నది అనుకున్నట్లు చేస్తే అతను దేవుని మహిమను అంతగా గుర్తించేవాడు కాదు కదా! తనను తానూ తగ్గించుకొని విశ్వాసంలో బలపడేవాడు కాదు కదా! నీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుడు నీ ద్వారా మహిమను పొందుకోవాలి, నీ విశ్వాసం మరింత బలపడాలి, నీ సాక్ష్యం నీ చుట్టూ ఉన్నవారికి దీవెనగా మారాలి. నయమానుతో పాటు వచ్చిన ఎంతమంది దేవుని వైపు తిరిగి ఉంటారు, తన సాక్ష్యం చూసిన తర్వాత. కనుక దేవుని మర్మమయిన మార్గములను అనుమానించకు, విశ్వాసం విడిచి, దేవుని ఆశీర్వాదాలు కోల్పోకు. నయమాను కోపంతో వెళ్ళిపోయి ఉంటె స్వస్థత పొందేవాడా? ఓర్పుతో ఎలీషా చెప్పినది పాటించాడు, మేలు పొందుకున్నాడు. దేవుని దగ్గరికి నీ ఆలోచనలతో రాకు, కేవలం విశ్వాసంతో రా. అయన దగ్గరికి సమస్యతో రా, పరిష్కారంతో మాత్రం కాదు. నువ్వు ఊహించని మార్గాలు ఆయనే తెరుస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. ఆలస్యం జరుగుతుందా, యొర్దాను నది దగ్గరికి వెళ్ళేదాకా అగు, జరుగబోయే అద్భుతం ముందుంది. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !! 

8, జనవరి 2022, శనివారం

దేవుడంటే విసుగు కలిగిందా?


శీర్షిక (టైటిల్) చూసి బహుశా కొందరికి కోపం కలుగ వచ్చు! కానీ ఇది ముమ్మాటికీ నిజము. చాల మందివిశ్వాసులు ప్రార్థించి, ప్రార్థించి విసిగి పోయి దేవుడు తమను వదిలేసాడు, లేదంటే దేవుడే లేడు అని ఆలోచించటానికి దైర్యం చేస్తారు. అటు పైన ఇదివరకు అసహ్యంగా చూసిన లోక రీతులను కూడా ఆస్వాదించటం మొదలు పెడుతారు. ఒకనాడు దేవుడు చేసిన ఎన్నో మేలులను పూర్తిగా మర్చిపోతారు. ఒక తండ్రిలా, తల్లిలా తమను కాపాడుతూ, వారి అవసరాలను అద్భుత రీతిలో తీర్చిన అయన మహాత్యమును విస్మరిస్తారు.

మరి కొంత మంది ఒక్క పెద్ద  ఇబ్బంది రాగానే  "ఏంటి దేవుడు ఇలా చేసేసాడు, అసలు నన్నెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, పక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అన్యులు సైతం ఎంతో ఆనందందంగా ఉన్నారు, జీవముగల దేవుడని నమ్ముకుంటే ఇదేంటి! ప్రార్థన కూడా వినటం లేదు" అనుకుంటూ చిన్నగా దేవుడి నుండి దూరంగా  వెళ్ళి పోతారు. 

కానీ ఒక్క విషయం మర్చి పోతున్నాము! దేవుడు మన అవసరాలు తీరుస్తాడు కానీ, మన ఆడంబరాలు కాదు. అంటే దేవుడు మనలను దీవించాడా? ఎప్పుడు ఇలాగ గొఱ్ఱె తోకలాగే ఉంచుతాడా? ముమ్మాటికీ కాదు. దావీదు 23వ కీర్తనలో ఏమని రాసాడు? "నా గిన్నె నిండి పొర్లుచున్నది" అని. దాని అర్థం ఏమిటి? నన్ను సమృద్ధిగా దీవించావు అనే కదా! సమృద్ధి అంటే, లేమి లేకపోవటమే కానీ లెక్క లేనంత ఉండటం కాదు. ఆ లెక్కలేనితనం నిర్లక్ష్యం కలిగిస్తుంది,  గర్వం కలిగిస్తుంది, దేవుణ్ణే మరపిస్తుంది. 

మత్తయి  16: "26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించు కొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయో జనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?"

ఈ వచనంలో యేసయ్య ఎం అంటున్నాడు చూడండి!  ఎంత సంపద ఉన్న కూడా చివరకు రక్షణ కోల్పోతే ఏమిటి ప్రయోజనం. ఎవరు కూడా ఇద్దరు యజమానులను సేవించలేరు! వారిలో ఒక్కరు యేసయ్య, మరొకరు ధనము. రక్షణ ఇచ్చే యేసయ్య కావాలా? లోకంలో సుఖపెట్టే ధనం కావాలా? కొందరి విషయంలో ధనం మాత్రమే యజమాని కాదు గాని, వారికి కీర్తి ప్రతిష్టలు కావాలి. వారి గురించి రాత్రికి రాత్రి ఊరంతా, జిల్లా అంత, రాష్ట్రమంతా లేదా దేశమంతా తెలిసి పోవాలి. ఇది కూడా ఒక రకమయిన ఆడంబరమే. దేవుడు నిన్ను వాడుకుంటున్నది, నీ ద్వారా పది మందికి అయన ప్రేమను తెలుపాలని, అంతే కానీ నిన్ను పది మందిలో గొప్ప చేయటానికి కాదు. అవసరం అనుకుంటే ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. 

కీర్తనలు 73: "3. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని."

ఈ వచనములో కీర్తన కారుడు భక్తి హీనుల క్షేమం చూసినప్పుడు నేను ఈర్ష్యపడ్డాను, ఎందుకంటే వారు నా ముందు గర్వం ప్రదర్శిస్తున్నారు అంటున్నాడు. కానీ దేవుడు వారికి సరయిన తీర్పు తిరుస్తాడు. నిన్ను దేవుడు ఏర్పరచుకున్నది, లోకంలో జీవించే  ఎనభై యేళ్ళ కోసమో లేదా వంద యేళ్ళ కోసమో కాదు. యుగయుగములు ఆయనతో జీవించటానికి అని తెలుసు కోవాలి. అదే 73వ కీర్తనలో 18, 19 వచనములు చూసినట్లయితే "18. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు 19.  క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

ఈ వచనముల ద్వారా అవగతమవుతున్నది ఏమిటి? దేవుణ్ణి ఎరుగని వారు ఇప్పుడు సుఖపడుతున్నట్లు కనపడవచ్చు, కానీ చివరకు వారు నశించి పోతారు. ధనవంతుడు, లాజరు ఉపమానంలో యేసయ్య ఏమని చెప్పాడు లూకా 16:19-31 వచనములు దయచేసి చదవండి. 

నువ్వు అనుకున్న పని జరగటం లేదా? నీ ప్రార్థన ఫలించటం లేదా? దేవుడు నీ చేయి విడువలేదు. కానీ  నిన్ను విశ్వాసంలో బలపరుస్తున్నాడు. సమస్య ఉంటేనే కదా సత్తువ పెరుగుతుంది? వ్యాయామం చేయటం అంటే ఏమిటి? బరువులు ఎత్తటం, పరుగులు పెట్టటం, తద్వారా శరీరానికి బలం కలిగించటం. మరి మన విశ్వాసం కూడా బల పడాలంటే శోధన అనే బరువును మోయాలి, ప్రార్థన అనే పట్టుదలతో, విశ్వాసపు పరుగును కొనసాగించాలి. సత్తువ అయిపోతుందా, నిరసపడి పోతున్నావా? అయితే అడుగు నీ దేవుణ్ణి, మొదలు పెట్టిన వాడు, వదిలి పేట్టడు. నిన్ను మధ్యలో దించటానికి ఎత్తుకోలేదు, తనతో జీవింప చేయటానికే నిన్ను రక్షించు కున్నాడు. కాస్త పాటి కష్టానికే చంక దిగుతానని మారాం చేస్తావా? వెలుగును విడిచి చీకటికి దాసోహం అంటావా? కాపరిని వదిలి మోస పోతావా? 

నీకు లేని వాటిని చూపించటమే సాతాను లక్షణం. తద్వారా జీవితంలో అసంతృప్తి, ఆత్మీయ జీవితంలో విసుగు. చూడలేని వాడిని అడిగితె తెలుస్తుంది కళ్ళు ఉన్న వాడి అదృష్టం, కాళ్ళు లేని వాడిని అడిగితె  తెలుస్తుంది  నడవలేని తన దురదృష్టం. ఎటువంటి స్థితి అయినా మార్చగల సమర్థుడు మన దేవుడు. అంతవరకు వేచి చూడటమే విశ్వాసం. విశ్వాసం లేని వాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. విశ్వాసం ద్వారా శోధన అనే కొలిమి నుండి శుద్ధ సువర్ణము వలే విలువ పెంచుకొని బయటకు రావాలి కానీ కాకి బంగారంల  విలువ లేకుండా మిగిలి పోకూడదు. విశ్వాసం కోల్పోయి  విసుగు పడుతూ దేవునికి దూరం అవుతున్నావా? 

మీకా 6: "3. నా జనులారా, నేను మీకేమి చేసితిని? మిమ్ము నేలాగు ఆయాసపరచితిని? అది నాతో చెప్పుడి. 4. ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని." 

ఈ వచనముల ద్వారా దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆయన ఇదివరకు చేసిన మేలులకు సమాధానం ఉందా నీ దగ్గర? అసాధ్యమే అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగించినప్పుడు, సంతోషంతో కన్నీళ్లు పెట్టి సాక్ష్యం పంచుకున్నావు. మరి ఇప్పుడు ఏమైంది ఆ విశ్వాసం? దేవుడు నీతోనే మాట్లడుతున్నాడు. అయన ప్రేమను చులకనగా చూడవద్దు. విశ్వాసం కోల్పోవద్దు, విసుగు పడవద్దు.  మన విశ్వాసం సన్నగిల్లుతుంటే సాతాను మన మీద తన ఆధిపత్యం పెంచుకుంటూ ఉంటాడు, తద్వారా మనలను పూర్తిగా నాశనం చేస్తాడు. పాపం అనే తన ప్రపంచంలో సుఖమనే మత్తులో మనలను బంధిస్తాడు. దేవుని మాటలు చేదుగా అనిపిస్తాయి, చేతకాని వారు  పాటించేవిగా గోచరిస్తాయి. 

మరి ఇటువంటి స్థితిని ఎలా అధిగమించాలి? ఈ విసుగు చెందే తత్వం ఎలా ఏర్పడుతుంది? చెట్టు వేళ్ళు ఎంత లోతుగా ఉంటె చెట్టు అంత పచ్చగా ఉంటుంది. కానీ మొక్క వేళ్ళు లోతుగా ఉండవు కనుక కాస్త ఎండ తగలగానే వాడి పోవటం మొదలు పెడుతుంది. విశ్వాసి జీవితం కూడా అటువంటిదే. దేవునితో లోతయిన సంబంధం కలిగి ఉండటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది,  తద్వారా ధైర్యం కలుగుతుంది. మరి దేవునితో లోతయిన సంబంధం ఎలా ఏర్పడుతుంది?

కీర్తనలు 1. "1. దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక 2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3. అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును." 

ఈ వచనములలో ఏమి చెప్పబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఎంతో మంది ఆలా చేయు ఇలా చేయు అని తమకు తోచిన సలహాలు ఇస్తుంటారు. తాము ఎలా బాగుపడింది, చిన్న చిన్న అబద్దాల ద్వారా, మోసాల ద్వారా డబ్బులు ఎలా సంపాదించింది చెపుతుంటారు. వాటిని పాటించక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే వారి పిచ్చి పరిహాసాలకు నవ్వకుండా, చతురతకు అబ్బురపడకుండా దేవుని వాక్యమును నిత్యమూ ధ్యానిస్తూ, అనగా పనులన్నీ మానేసి బైబిల్ చదవమాని కాదు గాని, ఎక్కడ ఉన్న, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ, కృతజ్ఞత  పూరితమయిన  సమయము దినమంతా గడుపుతూ ఉండేవారు నీటి కాలువల వద్ద నాటిన చెట్టువలె ఆకు వాడక ఉంటారు. మరియు తగిన సమయంలో ఫలం పొందుకుంటారు.  అంతే కాకుండా వారు చేసే దంతయు సఫల మవుతుంది. ఈ విధంగా దేవునితో లోతయిన సంబంధం విశ్వాసంతో కూడిన ధైర్యం కలిగిస్తుంది, తద్వారా ఈ విసుగు స్థానంలో శాంతి, సమాధానం, నెమ్మది మన జీవితాలలో చోటు చేసుకుంటాయి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాముఅంతవరకూ దేవుడు  మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్ !!