పేజీలు

15, ఏప్రిల్ 2023, శనివారం

పెళ్లి కూతురు పాట పై వివరణ!

 

"పెళ్లి కూతురు" అనే ఈ పాట మీద కొంత మంది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, కాబట్టి వారికి సరయిన వివరణ ఇవ్వాలని దేవుడు నడిపించినట్లుగా ఈ మాటలు  రాయటం జరుగుతోంది. 

పాట ముఖ్య ఉద్దేశ్యం: లోక రీతులను బట్టి ఎంతో మంది యవ్వనస్తులు తమ వివాహ విషయం లో ఎన్నో రకాల శొధనలకు గురి అవుతున్నారు. వారిని ప్రోత్సహించాలని, దేవుని చిత్తము కోసం ఎదురు చూస్తు తమ జీవిత భాగస్వాములను ఎన్నుకొవాలని, బైబిల్ లొని పాత్రలు, ఏ విధముగా ఎదురు చూసారో చెప్పాలని ఉద్దేశ్యము.  ఈ పాటలో చెప్పబడిన ప్రతి బైబిల్ పాత్ర వివాహ సమయంలో దేవుని ద్వారా నడిపింప బడ్డారు. అందుకే పెళ్ళి కాబోయే ప్రతి యవ్వనస్తురాలు వారి వలె కొనసాగాలని, వారి తో పోల్చుకోవాలని ఉద్దేశ్యము. 

వివాహ విషయంలో, "ఆ బైబిల్ పాత్రల మాదిరి నేను ఉన్నాను, ఉంటాను" అని చెప్పటమే ఉద్దేశ్యము. "దేవా పాపిని" అని ఎవరయినా పాట రాస్తే అయన మాత్రమే పాపి అని కాదు కదా! ఎవరు ఆ పాట పాడుకుంటే వారికి వర్తిస్తుంది. అదే విధముగా ఈ పాట ఏ యవ్వనస్తురాలు పాడుకున్నా  వారికి వర్తిస్తుంది. 

పాటలో పరిసరాలు:  పాట చిత్రీకరణ చేయాలనుకున్నప్పుడు మేము అనుకున్నది ఒక్కటే, ప్రజలు మరచి పోతున్న గ్రామీణ నేపథ్యమును చూపించాలని. అందుకే ముఖ్య  పాత్ర దారి అయిన యవ్వనస్తురాలు, గ్రామంలో ఉంటూ స్నేహితురాళ్ళతో, తోబుట్టువులతో సంతోషముగా గడుపుతూ, తల్లికి ఇంటి పనులలో సహాయం చేస్తుంటుంది. అదే సమయములో ప్రార్థన చేసుకుంటూ, దేవుని మీద గొప్ప విశ్వాసం చూపుతూ ఉంటుంది. 

రోకలితో పిండి దంచటం, కుండలో వంట చేయటం, బండ మీద పచ్చడి రుబ్బటం, గారెలకు పిండి రుబ్బటం, హిందూ మతానికి సంబంధం లేదు. ఇవ్వని కూడా గ్రామీణ వాతావరణంలో సాధారణమయిన ఇంటి పనులు. ఎవరో ఎదో సీరియల్ లో చూపించారని, మన పనులు మనం చేసుకోకుండా ఆపుకుంటామా? ఇంటి పనులు చేసుకోవటానికి మతానికి ఏమిటి సంబంధం? 

లిరిక్స్ యొక్క వివరణ: కొంత మందికి అభ్యంతరకరంగా ఉన్న వాక్యాలను, వాటి ఉద్దేశ్యాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ పాడుకునే వారు గొప్ప చెప్పుకొవటం కాదు గాని, బైబిల్లో చెప్పబడిన పాత్రలను పోలి నడుచు కుంటాను, లేదా నడుచు కోవాలని చెప్పటం ముఖ్య ఉద్దేశ్యము. 

"బుద్ది మంతురాలు ఎస్తేరు కు నిలువెత్తున ప్రతి రూపం" 
ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము, ప్రతి యవ్వనస్తురాలు ఎస్తేరు లాగా దేవుని మీద ఆధారపడాలి. భర్త ఎలాంటి వాడయినా, దేవుని మీద ఆధారపడితే ఆయనే భర్తకు తన మీద దయను కలిగిస్తాడు. అంతే కాకుండా తన వారిని కాపాడు కోవటానికి నిత్యమూ ప్రార్థన చేయాలని, చేస్తానని ఇక్కడ చెప్పాలనుకున్నాము. 

"హద్దులేవి దాటి ఎరుగవు నా ఊహలు – దేవుని పలుకులే నింపెను నా ఆశలు"
లోకస్తుల మాదిరి హద్దు లేకుండా చూసిన ప్రతి వారిని మోహించకుండా, ఊహలను హద్దులో ఉంచుకోవాలని, దేవుని పలుకులను బట్టి ఆశలను నియంత్రించు కోవాలని చెప్పటం ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము. అంతే కానీ చెడు ఆలోచనలు మనకు రావు అని కాదు, కానీ అలా వచ్చినప్పుడు పరిశుద్దాత్మ శక్తితో వాటిని జయించవచ్చు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. మన ఆశలు అన్ని దేవుని వాక్యాను సారముగా, అయన చిత్తమును బట్టి ఉండాలని చెప్పటం మరొక ఉద్దేశ్యము. 

"రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు"
ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము, "రిబ్కా ఎంతటి పనిమంతురాలో, ఎంత జాలి కలిగిన హృదయం కలిగి ఉందొ నేను కూడా అలాగే ఉన్నాను, లేదా ఉంటాను" అని చెప్పటం. 

"రూతులాగా కలిసిపోవడం నాకున్న గుణం"
అత్తారింటికి వెళ్లే ప్రతి అమ్మాయి, వారితో బాగా కలిసి పోవాలి. రూతు లాగా అత్తను కూడా అమ్మ లాగా చూసుకొనే గొప్ప మనసు ఉండాలని చెప్పటమే ఇక్కడ ఉద్దేశ్యము. రూతు లాగ అత్తింటి వారితో అంత బాగా కలిసి పోతాను, అంతే కానీ "నేను రూతు, ఇద్దరమూ ఒక్కటే" అని చెప్పటం కాదు. 

"శుద్ధమయిన మరియమ్మ లాగ బుద్దిగా పెరిగాను"
మరియమ్మ ఎలాగయితే శుద్ధముగా, కన్యగా ఉండి దేవుని చిత్తమును పాటించిందో, తనకు జరిగే అవమానలను లెక్క చేయకుండా ఎలాగయితే, దేవుని కార్యమును నెరవేర్చిందో, ప్రతి యవ్వనస్తురాలు ఆవిధముగా ఉండాలని చెప్పటం, ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము. 

ఈ పాట, పెళ్లి కావలసిన యవ్వనస్తులను, ముఖ్యముగా అడ కూతుర్లను దేవుని మీద ఆధారపడుతూ, దేవుడు మన కోసం రాయించినా గొప్ప పాత్రలను బట్టి, వారి ప్రవర్తన ఉండాలని చెప్పే పెళ్ళి గీతము. ఈ పాట ద్వారా కొంతమంది అయినా యవ్వన సహోదరీలు లోకస్తుల మాదిరి కాకుండా, దేవుడు మనకు చూపించిన లక్షణాలను బట్టి నడుచు కుంటారని ఆశ పడుతున్నాము. 

ఈ పాట ఏ పాటకు అనుకరణ కాదు. కేవలం దేవుని మాటలు, అయన మీద ఆధారపడిన జనులు మనకు అనుసరణీయం కావాలని రాయటం జరిగింది. దయచేసి ఇకనయినా తీర్పు తీర్చటం ఆపండి. మీకు నచ్చక పొతే చూడకండి, కానీ విషం చిమ్మి మీలో చేదు వేరును మొలకెత్త నివ్వకండి. మా పరిచర్య కోసం  దయచేసి ప్రార్థించండి! సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక! ఆమెన్ !!