యాకోబు 3: "1. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి."
30, ఏప్రిల్ 2022, శనివారం
ప్రసంగం చెయ్యాలనుకుంటున్నావా?
25, ఏప్రిల్ 2022, సోమవారం
పాపం చేతిలో ఓడి విసిగి పోతున్నావా?
16, ఏప్రిల్ 2022, శనివారం
ఈస్టర్ సందేశము
15, ఏప్రిల్ 2022, శుక్రవారం
గుడ్ ఫ్రైడే - ఏడవ మాట (లూకా 23:46)
కీర్తనలు 31: "5. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే."
14, ఏప్రిల్ 2022, గురువారం
గుడ్ ఫ్రైడే - ఆరవ మాట (యోహాను 19:30)
ఈ నిబంధన ప్రకారం, దేవుడు లేవి గోత్రికులను తనకు యాజకుకులుగా నియమించుకున్నాడు. అందులో ప్రధాన యాజకులు, ఆయనకు సహాయకులు యాజకులు. ఈ ప్రధాన యాజకుడు దేవుని ఆలయంలో ఉంటూ ప్రజలు తెచ్చిన బలులను దేవునికి అర్పిస్తూ, ప్రజల మీద జంతువుల రక్తము ప్రోక్షిస్తూ, వారికి పాప క్షమాపణ కలిగించే వాడు. ఈ నిబంధన ప్రకారం ప్రధాన యాజకులు తప్ప ఇతరులు ఎవరు బలులు అర్పించటానికి లేదు, మరియు ఈ ప్రధాన యాజకులు కూడా ఎన్నో నియమ నిష్టలు పాటించాలి.
లేదంటే దేవుని ఆగ్రహానికి గురి అయ్యేవారు, బలుల అంగీకార సూచనగా దేవుని నుండి అగ్ని వచ్చి ఆ బలులను దహించేది. అయితే ఆపవిత్రమయిన అగ్నితో బలులను దహించాలని చూసిన అహరోను కుమారులను దేవుని అగ్ని దహించినట్లు కూడా మనం చూడవచ్చు (లేవీయ కాండము 10:1-2). ప్రతి యేడాది ప్రధాన యాజకుడు దేవుని మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి తన పాపముల నిమిత్తము, మరియు ప్రజల పాపముల నిమిత్తము జంతువుల రక్తమును అర్పించే వాడు (లేవీయ కాండము 16:34)
అయితే ఈ నిబంధనను రద్దు చేసి కొత్త నిబంధనను మానవాళికి ఇవ్వటానికి యేసయ్య ఈ భూమి మీదికి రక్షకుడిగా వచ్చాడు. తన జీవితం అంత ధర్మ శాస్త్రమును నెరవేర్చి, పాపం లేని వాడిగా జీవించి, శ్రేష్ఠమయిన బలిగా తనను తానె అర్పించుకోవటం ద్వారా ప్రధాన యాజకుల కంటే గొప్ప ప్రధాన యాజకుడిగా పిలువ బడ్డాడు (హెబ్రీయులకు 4:14-15) .
యేసు క్రీస్తు దేవుని ఆజ్ఞలు నెరవేర్చటంతో పాటు, దేవుని మీద ఆధారపడి, ఆ స్థాయిని మించిన జీవితము జీవించి మనకు బోధించాడు. ఉదాహరణకు పాత నిబంధనలో నర హత్య చేయరాదు అని ఉంటె క్రీస్తు ఒకరి మీద ఆగ్రహం ఉండటమే హత్యగా బోధించాడు. మరియు వ్యభిచారం చేయరాదు అని ధర్మశాస్త్రం చెపితే మోహపు చూపు కలిగి ఉండటమే వ్యభిచారం అని మన విశ్వాసపు స్థాయిని పెంచాడు. తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, పరిశుద్దాత్మను పొందుకుని తనవలె జీవించే పరిస్థితులను మనకు కలిగించాడు.
దేవుని హృదయాను సారుడు అను పిలువ బడే దావీదు ఆకలితో ఉన్నప్పుడు దేవుని ఆలయంలో ఉంచిన పవిత్రమయిన రొట్టెలు కూడా తిన్నాడు, కానీ యేసు క్రీస్తు నలుపది దినములు ఉపవాసం ఉండి కూడా, తనను సాతాను రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు "నరుడు కేవలం రొట్టె ద్వారా కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట ద్వారా" అని వాడిని గద్దించాడు. ఇక్కడ దావీదు తప్ప చేసాడని చెప్పటం ఉద్దేశ్యం కాదు, కానీ నూతన నిబంధనను దేవుని మీద ఆధారపడి యేసయ్య అప్పటినుండే జీవించాడు.
"నీ శిష్యులు ఎందుకు ఎప్పుడు ఉపవాసం ఉండరు" అని పరిసయ్యులు యేసును ప్రశ్నించినప్పుడు, అయన ఏమన్నాడు. "పెండ్లి కుమారుడు వారితో ఉండగా ఎవరు ఉపవాసం చేయారని, పెండ్లి కుమారుడు వెళ్లిపోయే రోజు దగ్గరలోనే ఉంది అప్పుడు వారు ఉపవాసం చేస్తారు" అని. మరియు "పాత వస్త్రము పై చిరుగుకు కొత్త వస్త్రం వేయ కూడదని, ఆలాగే పాత తోలు సంచులలో కొత్త ద్రాక్షరసం దాచరాదని" దీని అర్థం ఏమిటి, క్రీస్తు రాకడ నూతన నిబంధన ఏర్పాటు చేయటానికి.
అంటే ఇదివరకు ఉన్న రక్త ప్రోక్షణ, దహన బలులు రద్దు చేయబడ్డాయి. ప్రధాన యాజకుడు అనే పాత్ర ముగిసి పోయింది, దేవుని ఆలయంలో పవిత్ర స్థలం వెళ్ళే అర్హత అందరికి లభించింది. ఎలాగంటే మన దేహమే దేవుని ఆలయంగా, క్రీస్తు తన రక్తమిచ్చి కొనుట ద్వారా మనం అయన సొత్తుగా మారిపోయాము. క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త రూపంలో దేవుడు మనలోనే నివసించటం మొదలు పెట్టాడు.
నూతన నిబంధనను క్రీస్తు ద్వారా పొందుకున్న మనము నూతనమయిన జీవితము బ్రతుకుతున్నామా? పరిశుద్దాత్మ శక్తి ద్వారా మన శరీర క్రియలను ఉపవాసం ఉంచుతున్నామా? లేక ఈ ఒక్కసారి ఆకలి తీర్చుకుందాం అని సాతానుకు లొంగి పోతున్నామా?
సహోదరి, సహోదరుడా! యేసయ్య మన కోసం తన జీవితం అంత పవిత్రంగా బ్రతికాడు. ఆ సిలువలో తన ఆఖరి రక్తపు బిందువు వరకు మన కోసం కార్చాడు. మరి మన పాత జీవితానికి ముగింపు చెప్పేది ఎప్పుడు! ఆ పాత నిబంధన స్థాయి అనగా శారీరక ఆజ్ఞల నుండి నూతన నిబంధన స్థాయి అనగా మానసిక మార్పులొకి రావాలి. అది కేవలం క్రీస్తు మీద ఆధారపడి, పరిశుద్దాత్మ శక్తి ద్వారానే సాధించగలం. అనగా అయన ఆజ్ఞలు పాటించుట ద్వారా.
అనాడు అహరోను కుమారులను దహించినట్లు దేవుడు మన పాపములను బట్టి ఈనాడు దహించక పోవచ్చు, కానీ క్రీస్తు పెండ్లి కుమారునిగా వధువు సంఘం కోసం త్వరలో రానున్నాడు. ఆనాడు మనం ఎవరో ఆయనకు తెలియదంటే మన పరిస్థితి ఏమిటి? దేవుడు క్రీస్తు ద్వారా మనలను ఎన్నుకొని రాజులయిన యాజకులుగా చేశాడు (1 పేతురు 2:9). కానీ మనం ఇంకా పాపనికి బానిసలుగా ఉంటే, క్రీస్తు సిలువలో మన కొరకు ప్రాణం పెడుతూ "సమాప్తమయినది" అని చెప్పిన మాట మనకు అర్థమయినట్లేనా?
దేవుని చిత్తమయితే ఏడవ మాటను ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!
13, ఏప్రిల్ 2022, బుధవారం
గుడ్ ఫ్రైడే - అయిదవ మాట (యోహాను 19:28)
యేసయ్య తండ్రి తనకు అనుగ్రహించిన అన్ని ఆత్మలను రక్షించాలని నిత్యమూ ఆరాట పడ్డాడు. తన స్వస్థతల ద్వారా, తన బోధనల ద్వారా దేవుని ప్రేమను తెలియ చేసాడు, మరియు తండ్రికి ఇష్టమయిన వారిగా ఎలా జీవించాలో నేర్పించాడు. అయితే ఈ చివరి ఘడియాలలో కూడా ఆ సిలువలో పలికిన అయిదవ మాట ద్వారా తనకు ఉన్న ఆత్మల రక్షణను బట్టి దప్పిగొన్నాడని చెప్పవచ్చు.
యోహాను 19: "28. అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను."
ఈ వచనమును మనం పరిశీలిస్తే, సమస్తము సమాప్తమైనదని ఎరిగి అని ఉంది. ఏమి సమాప్తము అయింది? మానవాళిని రక్షించటానికి తండ్రి తన మీద పెట్టిన భారము పూర్తీ అయింది అని యేసు క్రీస్తు గ్రహించాడు. అంతకు ముందు నాలుగవ మాటలో మనం చెప్పుకున్నట్లు, దేవుడు క్రీస్తు మీద మన పాప భారం మోపి, క్రీస్తుకు, తనకు ఎడబాటు కలిగించాడు. తద్వారా క్రీస్తు మనకై చెల్లించ వలసిన క్రయధనము అనగా పాపమూ ద్వారా మనకు కలిగే జీతము మరణమును పొందుకోబోతున్నాడు. ఇకపై మిగిలిన కార్యము, మానవాళి తన యందు విశ్వాసము ఉంచి, తన ద్వారా నీతిని పొందుకొని తండ్రిని చేరుకోవటమే. ఈ సువార్తను చాటించి ఆత్మలను రక్షించు లాగున, ఆత్మల భారంతో దాహము పొందుకున్నాడు.
దయచేసి యోహాను సువార్త 4 అధ్యాయం పూర్తిగా చదవండి. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి ఏమని వెళ్ళాడు? తనకు దాహంగా ఉన్నది, కొంచెం నీళ్ళు ఇమ్మని కదా! నీళ్ళు ఇవ్వ జూచిన ఆమెతో, ఈ నీరు తాగితే మరల దాహం కలుగుతుంది, కానీ నేను ఇచ్చే నీరు తాగితే ఎన్నటికీ దాహం కలుగదు అని చెప్పి, తానే వారు ఎదురు చూస్తున్న మెస్సియ్య నని ఆమెకు తెలియ జేశాడు. అప్పటి వరకు పాపంలో ఉండి, సిగ్గు పడుతూ, ఎవరు చూడకుండా మధ్యాహ్నం మంచి నీటికై వచ్చిన ఆ స్త్రీ, యేసయ్య మెస్సియ్య అని తెలుకోగానే, ఎవరు ఏమి అనుకుంటారోనని పట్టించుకోకుండా, ఊరిలోకి వెళ్ళి అందరిని క్రీస్తు దగ్గరికి చేర్చింది !
యేసయ్య అదే సందర్భంలో కోత కాలం గురించి శిష్యుల వద్ద ప్రస్తావించి, ఆత్మల రక్షణను తెలియ చేసాడు. మరియు తన తండ్రి కార్యము నెరవేర్చటమే తనకు ఆహారముగా ఉన్నదని కూడా చెప్పినట్లు మనం చూడవచ్చు. యేసయ్య ఆ సమరయ స్త్రీ వద్దకు వచ్చింది, సహజంగా కలిగే దాహము తీర్చుకోవటానికి కాదు కానీ ఆత్మలను తన దగ్గరకు చేర్చుకోవాలని. ఆ స్త్రీ ద్వారా ఉరి వారంత రక్షణ పొందుకున్నారు, యేసయ్యను వారితో పాటు రెండు రోజులు ఉండమని బ్రతిమాలుకున్నారు. మనలో ఎంత మంది క్రీస్తు దాహం తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాము? మన ద్వారా ఎంతమంది క్రీస్తు తమతో ఉండాలని కోరుకుంటున్నారు?
ఉరి వారందరి చేత ఛీత్కరింపబడుతూ, ఎవరి ముందుకు రాలేక, సిగ్గుపడుతూ బ్రతుకుతున్న సమరయ స్త్రీ కంటే హీనమయిన స్థితిలో మనం లేము కదా? మరి సువార్త చెప్పటానికి ఎందుకు సిగ్గు? మనం అపొస్తలుల వలె ప్రాణాలు పెట్టాలని దేవుడు చెప్పలేదు, ఒకవేళ అటువంటి స్థితి వస్తే దేవుడు మనకు తగిన కృపను ఇస్తాడు. కానీ కనీసం మన జీవితం ద్వారా, క్రీస్తు ప్రేమను చూపించే వారీగా ఉన్నామా? తద్వారా సువార్తను చాటిస్తున్నామా? క్రైస్తవులంటే ఇంత కనికరం, క్షమా గుణం కలిగి ఉంటారా? అని అన్యులు అనుకునేలా బ్రతికే ప్రయత్నం చేస్తున్నామా?
యేసయ్య నిత్యమూ ప్రజలకు తన గురించి చెప్పి, తనయందు విశ్వాసం కలిగించి వారిని రక్షించాలని చూశాడు. ఎవరయినా దప్పికగొంటే తన యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలని పిలుపు నిచ్చాడు. తన యందు విశ్వాసము ఉంచిన వారిలో నుండి జీవజలములు ప్రవహిస్తాయని లేఖనములు గుర్తు చేశాడు (యోహాను 7:34). మరి క్రీస్తు విశ్వాసులుగా చెప్పుకొనే మనము, లేఖనాలలో రాసి ఉన్నట్లుగా మన జీవితంలో జరగటానికి, క్రీస్తు బోధలు పాటిస్తున్నామా? లేఖనముల నెరవేర్పుకై క్రీస్తు ఎన్నో మార్లు తన సొంత చిత్తమును, ఘనతను వదిలి పెట్టాడు. ఇప్పుడు దప్పిక గొనటానికి మరొక కారణం లేఖనముల నెరవేర్పుగా కూడా మనం చూడవచ్చు.
లూకా 24: "44. అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను"
క్రీస్తును గురించిన ప్రవచనాలు, లేఖనాలలో ఎన్నో మార్లు రాయబడి ఉన్నాయి. కీర్తనలు 69:21 లో చూసినట్లయితే దావీదు పరిశుద్దాత్మ ప్రేరేపితుడయి "నాకు చేదు ఆహారము పెట్టిరి, నేను దాహము గొన్నప్పుడు వారు చిరకను తాగ నిచ్చిరి" అని రాసాడు. ఈ మాట క్రీస్తును గురించినది కాబట్టి, యేసయ్య సిలువలో ఆ ప్రవచనం నెరవేర్చులాగా దాహం పొందుకున్నాడు. తర్వాత సైనికులు ఆయనకు చేదు ద్రాక్షారసములో చిరకను ముంచి అందించారు.
సహోదరి, సహోదరుడా! ఆత్మల రక్షణకై చేదు అనుభవాలు ఎదుర్కోవటానికి, కష్టాలు భరించటానికి సిద్దపడి ఉన్నామా? మనలను బట్టి అయన ఇంకా దాహంగానే ఉన్నాడు అని గుర్తిస్తున్నామా! ఆ సమరయ స్త్రీ జీవితంలో యేసయ్య ద్వారా లోకపరమయిన అద్భుతాలు ఏమి జరుగలేదు, కేవలం రక్షకుడు అయినా యేసయ్యను తెలుసుకుంది. పాపము చేత సిగ్గుతో నిండుకున్న ఆమె జీవితం ఇప్పుడు ధైర్యంతో, సంతోషంతో నిండి పోయింది. తనకు దొరికిన ఆ సంతోషం, ఆ రక్షణ ఉరి వారందరికి పంచి పెట్టింది. అటువంటి సువార్త పరిచారం మనం చేస్తే, మన కొరకు, మనలాంటి వారి కొరకు సిలువలో నలిగినా యేసయ్య దాహం తీర్చిన వారిగా ఉంటాము.
దేవుని చిత్తమయితే ఆరవ మాటను ధ్యానించుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!
12, ఏప్రిల్ 2022, మంగళవారం
గుడ్ ఫ్రైడే - నాలుగవ మాట (మార్కు 15:34)
పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా (రోమీయులకు 3:23) అందరమూ పాపమూ చేసి దేవుని మహిమను కోల్పోతున్నాము. అనగా మనకు పాపంతో సహవాసం ఉంటె దేవునితో సంబంధం లేని వారీగా అయిపోతాము. అయితే క్రీస్తు సకల మానవాళి పాపముల నిమిత్తం సిలువలో బలియాగం అవుతున్న సమయంలో, మన పాపముల భారం అయన పై మోపిన దేవుడు, తన పవిత్రతను బట్టి క్రీస్తును స్వల్ప కాలం వదిలి వేసాడు. ఆ స్వల్ప కాల దూరమును సైతం యేసు క్రీస్తు భరించలేక సిలువలో పలికిన నాలుగవ మాట ద్వారా బిగ్గరగా ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు.
మార్కు 15: "34. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము."
అప్పటి వరకు దేవుణ్ణి తండ్రిగా సంబోధించిన క్రీస్తు ఈ సమయంలో మాత్రం నా దేవా అని సంబోధిస్తున్నాడు. తన మీద ఉన్న పాప భారమును బట్టి దేవుడి తో తనకు ఉన్నసంబంధం తండ్రి అని పిలిచే చనువు నుండి దేవా అని పిలించేంత దూరం పెరిగిందని క్రీస్తు ఎరిగి యున్నాడు. కానీ దేవుణ్ణి మనం ఎలా చూడాలో మనకు నేర్పిస్తున్నాడు క్రీస్తు. దేవుడంటే దయ, జాలి లేని తీర్పు తీర్చేవాడిగా కాకుండా, తండ్రిగా మనలను ఆదరించు వాడని క్రీస్తు మనకు చూపించాడు. శిష్యులు మాకు ప్రార్థన చేయటం నేర్పుమని ఆడినప్పుడు యేసయ్య దేవుణ్ణి ఏమని సంబోధించాడు "పరలోక మందు ఉన్న మా తండ్రి" (మత్తయి 6:9) అని కదా.
అయితే తండ్రి అని పిలిచే ఈ చనువు మనకు ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరు తండ్రి అని పిలువ వచ్చా? ముమ్మాటికీ కాదు. పాపమూ పట్ల విముఖత ఉండి, దాని మీద విజయం పొందుకోవాలనే తపన ఉండాలి. క్రీస్తు మీద విశ్వాసంతో అయన చేసిన బోధనలు నిత్యం పాటించు వారీగా ఉండాలి. క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త ద్వారా అనగా పరిశుద్దాత్మ ద్వారా మన శరీర క్రియలను జయిస్తూ క్రీస్తు స్వభావంలోకి మారిపోవాలి. అప్పుడే దేవుణ్ణి మనం తండ్రి అని పిలవటానికి అర్హులుగా ఉంటాము.
దయచేసి లూకా సువార్త 19:12-28 వరకు చదవండి. అందులో మూడవ దాసుడు తనకు డబ్బు ఇచ్చిన యజమానిని కఠినుడిగా విశ్వాసించి, తనకు భయపడి ఏ వ్యాపారం చేయలేదని చెప్పినపుడు, ఆ యజమాని ఆగ్రహించి "చెడ్డ దాసుడా, నేను కఠినుడనా, నువ్వు నమ్మినట్లే నీకు అవును గాక" అని వాడిని శిక్షించాడు కదా! యేసయ్య దేవుడు కఠినాత్ముడు కాడని, ప్రేమ కలిగిన వాడని చెప్పటానికే ఈ ఉపమానం మనకు బోధించాడు. అయితే మొదటి పని వాడు, ఎక్కువ కష్టపడ్డాడు, దేవునికి ఎక్కువ విధేయత చూపించాడు, కనుకనే ఎక్కువగా ఫలించాడు. అలాగే మనం దేవునికి ఎంత విధేయత చూపితే అంతగా దేవునికి ప్రియమయిన వారిగా మారిపోతాము.
యేసయ్య దేవుని తో సంబంధం విడిపోయిన కొద్దీ సమయానికే తన ఆత్మను అప్పగించాడు. కానీ ఆ కొద్దీ సేపు సమయానికి కూడా దేవునితో దూరన్నీ భరించలేక పోయాడు. తానూ భూమి మీద బ్రతినంత కాలం, శోధించే శరీరం తనను ఆత్మీయ మరణానికి గురి చేయకుండా, నిత్యమూ రోదిస్తూ, కన్నీళ్ళతో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుని పట్ల అమితమయిన భయభక్తులు చూపించుట ద్వారా దేవుడు అయన ప్రార్థనలు అంగీకరించాడు, పాపం మీద విజయం అనుగ్రహించాడు (హెబ్రీయులకు 5:7). కేవలం రోదిస్తూ ప్రార్థన చేస్తే సరిపోదు కానీ, దేవుని చిత్తమును నెరవేర్చు వారీగా ఉండాలి. దేవుని చిత్తము పట్ల ఆసక్తి, అటువంటి పోరాటం మనకు ఉందా? దేవుని సన్నిధి దూరం అయితే తట్టుకోలేని ఆరాటం మనలో ఉందా?
క్రీస్తు తండ్రి చిత్తము అంగికరించి సిలువ శ్రమలు పొందుట ద్వారా దేవుడు మన పాపములు రద్దు చేయటంతో పాటు, క్రీస్తును ఘనపరిచాడు. ఆయనను సిలువ మరణం నుండి లేపటమే కాకుండా ఆ దినము నుండి ఆయనను కుడిపార్శ్వమున ఆసీనుడిగా చేసాడు (లూకా 22:69). అటువంటి ఘనత పొందటానికి, దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు నెరవేరటానికి సిద్దముగా ఉన్నామా? అసలు దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి అర్హత కలిగి ఉన్నామా? కేవలం పెదవుల ద్వారా తండ్రి నీ చిత్తము నెరవేర్చు అంటాము, కానీ మళ్ళి దేవుని చిత్తం మనకు నచ్చింది కాకపోతే ఎలా? అని లోపల భయపడుతాం కదా?
కానీ దేవుని ప్రణాళికలు మన ఆలోచనల కన్న ఉన్నతమయినవి. అయన మన మీద అనుమతించే ప్రతి పరిస్థితి మనలను అభివృద్ధి పరిచేదే గాని మనకు కీడు చేసేదిగా ఉండదు. సహోదరి, సహోదరుడా! తండ్రి చిత్తమును నెరవేర్చటానికి యేసయ్య అన్ని శ్రమలు పడ్డాడు, సిలువ శ్రమల కన్న కష్టమయిన విషయం, దేవుని సాంగత్యం కోల్పోయాడు. మరి మనకు ఎదురయ్యే ఈ చిన్న, చిన్న సమస్యలకు లొంగి పోయి, తండ్రితో ఉండే ఆ సంబంధం కోల్పోతామా? ఆయనను సంతోషపెట్టే అవకాశం వదులుకుందామా?
దేవుని చిత్తమయితే అయిదవ మాటను ధ్యానించుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!