పేజీలు

17, సెప్టెంబర్ 2022, శనివారం

యేసయ్య తో శిష్యరికము!


మనలో చాల మంది, యేసు క్రీస్తు మీద విశ్వాసము కనపరచవచ్చు, ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించే వారు కూడా ఎంతో మంది ఉండవచ్చు. కానీ అయన మీద విశ్వాసము మరియు రక్షకునిగా ఆయనను అంగికరించటం మాత్రమే క్రైస్తవ జీవితం కాదు. సంపూర్ణముగా ఆయనకు శిష్యులుగా మారిపోవాలి. అనగా మనలను మనం ఉపేక్షించుకోవాలి, అయన కన్న, అయన కార్యము కన్న మనకు ఏది కూడా ఎక్కువ కాకూడదు. అన్నింటిలో ఆయనకు సంపూర్ణముగా ప్రథమస్థానం ఇవ్వవలసిందే. 

లూకా 14: "26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27.  మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు."

ఈ వచనము సరిగా అర్థం చేసుకోలేని కొంతమంది, అన్యులు మరియు విశ్వాసులు సైతం క్రీస్తును స్వార్థపరుడిగా మరియు, తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేయుమన్న వ్యక్తిగా అపార్థం చేసుకుంటారు. ఇక్కడ యేసయ్య చెపుతున్న మాటలు, అయన బోధనలకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ, వాటిని పాటించాలని చెపుతున్నారు. దేవుని బలిదాన నియమం ప్రకారం దైవ కుమారుడయినా క్రీస్తు మానవాళి కోసం సిలువలో మరణించి, లేచి వారికి నరకాగ్నిని తప్పించాలని భూమి మీద శరీర దారిగా జన్మించాడు. మన శరీరంలో ఉద్బవించే పాపమును బట్టి మనం నరకాగ్నికి కాకుండా తనతో నిత్య జీవితం పొందటానికి పాటించవలసిన నియమాలు అన్నియు  అయన బోధించాడు. ప్రతి వారు, వారి పాపమును బట్టి, క్రీస్తును అంగీకరించిన విధానము బట్టి తీర్పు పొందుకుంటారు. కానీ వారి తల్లి, తండ్రి మంచితనము బట్టి ఎవరు కూడా పాప శిక్షను తప్పించుకోలేరు. 

కనుకనే క్రీస్తు ప్రతి ఒక్కరు తమ రక్షణ నిమిత్తం అయనను వెంబడించాలని అనగా అయన బోధలు పాటించాలని సూచిస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులను బట్టి, వారికి ఉన్న అభ్యంతరాలను బట్టి ఆయనను త్రోసి పుచ్చి రక్షణ కోల్పోవద్దని యేసయ్య మనలను హెచ్చరిస్తున్నాడు. తమ ప్రాణమును లెక్క చేయని వారు అయన శిష్యులనబడుతారు అంటున్నాడు యేసయ్య! ప్రాణమును ఎందుకు లెక్క చేయకూడదు? మన శరీరము పాపమునకు నిలయముగా ఉన్నది. మనలను శోధిస్తూ, అన్ని రకాల కోరికలను మనకు కలిగిస్తుంది. మనలను మనం ఎక్కువగా, ప్రేమించుకుంటే లేదా శరీరమును లొంగదీయకుంటే పాపములో పడిపోయి క్రీస్తు బోధనలు నిర్లక్యం చేసే స్థితికి వెళ్ళిపోతాము. 

అదే విధముగా "తమ సిలువను మోసుకుంటూ ఆయనను వెంబడించని వారు అయన శిష్యులుగా చెప్పబడ లేరు" అంటున్నాడు యేసయ్య. సిలువ, తగ్గింపుకు సాదృశ్యముగా ఉన్నది. అనగా ఎవరు తమను తాము తగ్గించుకొంటూ, గర్వపడకుండా, అతిశయపడకుండా మరియు ఇతరులను ద్వేషించకుండా జీవించాలన్న తపన కలిగి ఉంటారో, వారే అయన నిజమయిన శిష్యులు అని యేసుక్రీస్తుల వారు ఈ మాటలు చెపుతున్నారు. వీటిని పాటించగలము లేదా ఆ విధముగా జీవించాలన్న తపన కలిగిన వారు మాత్రమే ఆయనను అంగీకరించాలని క్రీస్తు సెలవిస్తున్నారు. లేదంటే ఆయనకు ఇష్టం లేని వేషధారులుగా లేదా నులివెచ్చని స్థితిగల వారిగా మిగిలిపోతాము.  

క్రీస్తును ద్వేషిస్తూ, క్రైస్తవులను హింసిస్తూ తిరిగిన సౌలు అనబడే పౌలు గా మారిన వ్యక్తిని గురించి మనం ఎరిగి ఉన్నాము కదా? ఈ సౌలు తన యూదా మతమందు నియమనిష్టలు కలిగి, మతపరమయిన గర్వంతో ఉండేవాడు. ఇతని అంగీకారంతో స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అటువంటి సౌలు, ఒక్కసారి క్రీస్తు దర్శనం పొందుకున్న తర్వాత వెనుకకు తిరిగి చూడలేదు. క్రీస్తును గూర్చిన సువార్త సేవ చేస్తూ, తనను తానూ తగ్గించుకొని, అల్పుడిగా ఎంచుకొని, పౌలు అని పేరు మార్చుకున్నాడు. ఎన్ని రకాల కష్టాలు ఎదురయినా, యేసు క్రీస్తు దేవుడనే సత్యమును బోధించటం ఆపలేదు. 

అటువంటి పౌలుకు అనారోగ్యం ఉంటే, దేవుడు ఆయనను స్వస్థ పరచలేదు (2 కొరింథీయులకు 12:8-9), దానిని బట్టి కూడా పౌలు గారు సంతృప్తిని వ్యక్తం చేశారు తప్ప ఎక్కడ కూడా సణుగుకొలేదు, విసుగు పడలేదు. మరియు అగబు అను ప్రవక్త యెరూషలేము లోని యూదులు తనను చంపటానికి ఆయనను అన్యులకు అప్పగిస్తారని ప్రవచనము చెప్పినప్పుడు అక్కడ ఉన్న అందరు పౌలును యెరూషలేముకు వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. అప్పుడు "ప్రభువు నామము నిమిత్తము బంధింపబడుటకు మాత్రమే కాదు చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని" చెప్పారు పౌలు గారు (అపొ. కార్యములు 21:13). అటువంటి మారుమనస్సు, సంతృప్తి, దేవుని కోసం తెగింపు మనలో ఉన్నాయా? 

యేసయ్య చెప్పే భవిష్యత్తు ప్రవచనాలు పూర్తిగా అర్థం కాకపోయినా కూడా ఆయనను  క్రీస్తుగా విశ్వసించినా శిష్యులను చూసి మనం ఏమి నేర్చుకోవాలి? యేసయ్య "నా శరీరము తినకుండా, రక్తము తాగకుండా మీకు రక్షణ లేదు" అని చెప్పగానే, అప్పటి వరకు అద్భుతాలు చూసి, అయన పెట్టిన రొట్టెలు తిని, స్వస్థతలు పొందుకొన్న జనం ఒక్కసారిగా, ఆయనను వెంబడించటం మాని వేశారు. కానీ అయన శిష్యులు మాత్రం ఆయనతోనే ఉన్నారు. ఆయనే దైవకుమారుడు, తమను కాపాడటానికి వచ్చిన క్రీస్తు అని నమ్మారు (యోహాను 6:66). కానీ మనం, పది మందిలో క్రీస్తు విశ్వాసులము అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతాము? అసలు మనం సిగ్గు ఎందుకు పడుతామో తెలుసా? సాతానుకు తెలుసు మనం క్రీస్తును జనం ముందు అంగీకరించకుంటే, క్రీస్తు తండ్రి ముందు మనలను అంగీకరించాడని, అందుకే మనం క్రీస్తును అంగీకరించకుండా, మనలో సిగ్గును రేపుతాడు. 

పేతురు అంగీకరించక పోయిన యేసయ్య క్షమించాడు కదా! అనుకోవద్దు. అప్పుడు వారికి పరిశుద్దాత్మ ఇవ్వబడలేదు, మరియు యేసయ్య, పేతురు యొక్క ఆత్మీయ గర్వమును తీసివేయటానికి, ఆ శోధనను అయన మీదికి  అనుమతించాడు. అందును బట్టి పేతురు గారు, తన ఆత్మీయ గర్వం తొలగించుకొని, దేవుని శక్తి మీద ఆధారపడి, ఎంతగానో సువార్త సేవలో వాడబడ్డారు. అందును బట్టి  తన శరీరంలో జీవించినంత కాలం, ఆఖరి సమయము వరకు సాటి వారిని ప్రేరేపిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చారు పేతురు గారు (2 పేతురు 1:13). అటువంటి వారే మిగిలిన శిష్యులు కూడా. తమ ప్రాణముల కంటే, యేసు క్రీస్తు సజీవుడు, నిజమయిన రక్షకుడు అని చెప్పటమే, దేవుని చిత్తము అని నమ్మి, హత సాక్ష్యులుగా మిగిలి పోయారు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుని కోసం హత సాక్షిగా మార్చబడటం కన్న అదృష్టం ఏముంటుంది? అటువంటి పరిస్థితి వస్తే, దేవుడే మనకు తగిన కృపను, విశ్వాసమును అనుగ్రహిస్తాడు. కానీ ఏనాటికి కూడా డబ్బు సంచిని ఆశించి యేసయ్యను వెంబడించిన యూదా మాదిరి శిష్యులుగా మనం మారకూడదు. యేసయ్య రాత్రంతా ప్రార్థించి, పన్నెండు మందిని శిష్యులుగా ఎన్నుకున్నాడు (లూకా 6:12). అందులో యూదా కూడా ఒక్కడు. కానీ అతను స్వార్థంతో దేవుడు ఇచ్చిన ధన్యతను పోగొట్టుకున్నాడు. ధనం మీద వ్యామోహముతో, చివరకు క్రీస్తును అప్పగించాడు. 

అంతే కాకుండా చేసిన పాపమును బట్టి, దేవుని వద్ద పశ్చాత్తాప పడకుండా, సాతాను ప్రేరణను బట్టి, తనను తానూ నిందించుకొని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు, చివరకు సాతాను చెరలోకి వెళ్ళి పోయాడు. నీ పాపం నిన్ను వెక్కిరిస్తోందా? బలహీనమయిన ఆ క్షణాలు నిన్ను బాధిస్తున్నాయా? నిజమయిన క్రీస్తు శిష్యుడి లక్షణం, పశ్చాత్తాప పడటం! దేవుని క్షమాపణ పొందుకొని, అయన శక్తి చేత దాని నుండి విడుదల పొందుకోవటం. తిరిగి వాటి వైపు కన్నెత్తి కూడా చూడక పోవటం. అది లేదు, ఇది లేదు అని సణుగకుండా దేవుని చిత్తమును అంగికరించి, నిత్యము ఆయనలో ఆనందించటము. నిన్ను చూసి, నలుగురు క్రీస్తు శిష్యులుగా మారాలి, నీ జీవితమే ఒక సువార్త కావాలి. అటువైపు అడుగులు వేయు, నడపటానికి నిన్ను ఎన్నుకున్న ఆయనే ఉన్నాడు!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

10, సెప్టెంబర్ 2022, శనివారం

దేవుణ్ణి చిన్నబుచ్చుతున్నావా?

ఇదివరకు మనం చాల సార్లు దేవుడు మన జీవితాలలో శోధనలకు అనుమతినిచ్చి మనలను విశ్వాసములో బలపరుస్తాడు అని తెలుసుకున్నాము కదా! అంతే కాకుండా మన పట్ల తన ఉద్దేశ్యాలు నెరవేర్చుకునేలా ఆ పరిస్థితులను ఉపయోగించుకొని మనలను అటు వైపుగా నడిపిస్తాడని కూడా తెలుసుకున్నాము! అయితే దేవుడు మన ఆత్మీయ స్థితిని ఎరిగి ఉన్నాడు, అందును బట్టి మనకు తగిన శోధనలు అనుమతిస్తాడు.  అనగా శోధనలు అనేవి పరీక్ష పత్రాలు అనుకుంటే, దేవుడు విశ్వాసములో మన తరగతిని బట్టి ఆ పరీక్షను రాయటానికి మనకు అనుమతిస్తాడు.  అంతే కాకుండా శోధనలు జయించటానికి మార్గమును కూడా అనుగ్రహిస్తాడు. 

1 కొరింథీయులకు 10:"13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప బడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును."

ఈ వచనములో పౌలు గారు కొరింథీ సంఘమును ఏమని ఆదరిస్తున్నారు చూడండి. మనము సహింప లేని ఎటువంటి శోధనను దేవుడు మన మీద అనుమతించాడు, మరియు సహింపటానికి, దాని నుండి తప్పించుకోవటానికి మార్గమును కూడా కలుగ జేస్తాడు. అయితే మనము కలిగే శోధనలను బట్టి,  దేవుడు మన మీద ప్రేమలేని వాడిగా, మన పాపములను బట్టి మనలను శిక్షిస్తున్నాడు అనుకుంటూ ఉంటాము. మన పాపములను బట్టి దేవుడు శిక్షిస్తూ పొతే, మనం ఒక క్షణం కూడా నెమ్మదయినా జీవితం గడపటానికి అర్హులం కాము. 

దేవుడు ప్రేమలేని వాడయితే, మనకు విశ్వాసం ఇచ్చి, క్రీస్తు నీతిని మనకు ఆపాదించి, నిత్య జీవితానికి సిద్ధపరచే వాడు కాదు కదా! ఎన్ని సార్లు అయన ప్రేమ చొప్పున సాధ్యం కావు అనుకున్న పనులను సాధ్యపరచి, మన అవసరాలు తీర్చాడో మళ్ళి గుర్తు చేసుకుందామా? రెప్పపాటులో కలిగే ప్రాణాంతకమయిన ప్రమాదాలు ఏలా తప్పించి సజీవుల లెక్కలో ఉంచాడో మరచిపోకుండా ఉందామా? దేవుని సార్వభౌమాధికారాన్ని బట్టి మనలను ఎన్నుకొన్నాడు, మన చేత జరిగించవలసిన కార్యములను బట్టి మనలను ఈ పరిస్థితుల వెంబడి నడిపిస్తున్నాడు. అయన బిడ్డలము అయినా మన జీవితాలలో ప్రతి సంఘటన అయన చిత్తము లేకుండా జరగటం లేదు. 

యోబు 1: "10. నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది."

ఈ వచనంలో సాతాను దేవునితో అంటున్న మాటలు వినండి! "యోబుకు దేవుడంటే అంతగా భయభక్తులు కలిగి ఉండటానికి కారణం, దేవుడు తన చుట్టూ, తన కుటుంబము చుట్టూ మరియు అతని సమస్త సంపద చుట్టూ కంచె వేసి రక్షిస్తున్నాడు, కనుకనే యోబు దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు"  అని  అంటున్నాడు. మనం కూడా దేవుని దృష్టిలో  యోబు వంటి వారమే, మన చుట్టూ కూడా దేవుడు తన కంచెను ఉంచి కాపాడుతున్నాడు. కానీ అది గ్రహించని మనము ఏదయినా ఇబ్బంది రాగానే, ఎక్కడయినా ఆస్తి నష్టం, ధన నష్టం కలుగగానే దేవుడు మనతో లేడు, లేదంటే దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు అనుకుంటాము. తద్వారా దేవుని మీద విశ్వాసం కోల్పోయి అయన మన మీద అనుమతిస్తున్నా శోధనలు మనకు తగినవి కావని చెప్పుట ద్వారా దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలను చిన్న బుచ్చుతున్నాము. 

సాతాను మన మీదికి శోధనలు తేవటం ద్వారా  మనలను విశ్వాసములో నశింప చేయాలనీ ప్రయత్నిస్తుంటాడు. కానీ దేవుడు సాతాను శక్తిని కూడా నియంత్రించే సర్వ శక్తిమంతుడు, కనుక మన మీద సాతాను ఎటువంటి శోధనను, ఎంత మోతాదులో ఇవ్వాలి అని సాతానుకు అనుమతిని ఇస్తున్నాడు (యోబు 1:12). తద్వారా మనలను ఆత్మీయతలో, విశ్వాసములో బలపరుస్తూ మనలను మరింతగా తనకు దగ్గర చేసుకుంటున్నాడు. ఈ సాతాను శోధనలు తాటాకు శబ్దము వంటివి మాత్రమే, ఇవ్వని దేవుని చిత్తములో లేకుండా జరగటం లేదు. ఏ తండ్రి అయినా బిడ్డలు నశించిపోయేలా కష్టపెడుతాడా? మన కోసం ఘోరమయిన సిలువ మరణం పొందిన, ఈ తండ్రి మీద నమ్మకం లేదా? నాకే ఎందుకు ఈ కష్టాలు అని చిన్నబుచ్చుకొని అలిగిపోతావా?

2 రాజులు 6: "17. యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను."

ప్రవక్త అయినా ఎలీషాను బందించాలని సిరియా రాజు సైన్యం పంపిన వేళ, ఎలీషా సేవకుడు భయపడుతుంటే, ఎలీషా అతనికి ధైర్యం చెప్పి, ఆ సేవకుని కండ్లు తెరవమని దేవునికి ప్రార్థించగానే, ఆ సేవకునికి అదృశ్యముగా ఉన్న పరలోక సైన్యము కనపడింది. నీ చుట్టు కూడా సమస్యలు తప్ప మరేమి కనపడటం లేదేమో! ఏ విధమయిన పరిష్కారం నీకు దొరకటం లేదేమో. కానీ దేవుని సైన్యం నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతోంది,  అవిశ్వాసముతో నీకు కలిగే ఆందోళన, భయం నిజం కావు. మన కన్నా ముందే మన దేవుడు నడుస్తున్నాడు (ద్వితీయోపదేశకాండము 31:8) అన్న విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. 

ఇక్కడ ఎలీషా అదే విశ్వాసముతో ఉన్నాడు, కనుకనే ఎదురుగా ఎంత గొప్ప సైన్యం ఉన్న కూడా భయపడకుండా, ఆందోళన పడకుండా ఉన్నాడు. కానీ అతని సేవకుడు, కేవలం ఎదురుగా ఉన్న సైన్యమును మాత్రమే చూసి, అవిశ్వాసముతో భయపడ్డాడు. దేవుడు మనలను ఏర్పరచిన దినము నుండే మనలను కాపాడటానికి కొందరు రక్షకభటుల వంటి దేవ దూతలను మన చుట్టూ ఉంచుతున్నాడు (మత్తయి 18:10, హెబ్రీయులకు 1:14), అయన అనుమతి లేకుండా ప్రమాదము, నష్టము మనకు సంభవించదు. మనకు కనపడని సైన్యం మనలను  నిత్యము కాపాడుతోంది, కాబట్టి అవిశ్వాసముతో  విసుగుకొని దేవుణ్ణి చిన్నబుచ్చ వద్దు. 

రోమీయులకు 8: "17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. 18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను."

దేవుని పిల్లలయిన మనలను దేవుడు తన కుమారుడయినా క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులను చేయుట ద్వారా తన మహిమకు వారసులుగా మారుస్తున్నాడు. ఈ శ్రమల ద్వారా మన పాప శరీరము యొక్క చిత్తమును, క్రియలను నశింపచేస్తున్నాడు. దేవుని మీద విశ్వాసమును పెంపొందించుట ద్వారా పరలోకములో మన స్వాస్థ్యమును పెంచుతూ, నిత్యత్వములో మనం నిలవటానికి అర్హులుగా రూపాంతరం చేస్తున్నాడు.  ఇప్పుడు కలిగే ఈ శ్రమలు ఆ మహిమ ముందు, ఆ నిత్యత్వము ముందు ఎంత మాత్రము ఎన్నతగినవి కావు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుని అనుమతిని బట్టి సాతాను చేత పీడించబడుతున్న యోబుతో అతని భార్య "ఇంకా ఎందుకు ఈ విశ్వాసము? దేవుణ్ణి దూషించి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపో" అన్నప్పుడు యోబు ఏమన్నాడు? "మూర్ఖురాలిగా మాట్లాడకు, దేవుని నుండి మేలులు మాత్రమే పొందుకోవాలా? కీడు పొందుకోకూడదా?" అని చెప్పి దేవుణ్ణి ఎంత మాత్రము దూషించలేదు, పాపం చేయలేదు (యోబు 2:9-10). మన నుండి కూడా దేవుడు అటువంటి విశ్వాసమును,  సాక్ష్యమును కోరుకుంటున్నాడు. ఆయనకు తెలియని మన కష్టాల? అయన మన మీద అనుమతించని పరిస్థితులా? నీ విశ్వాసం వదులుకొని, ఆ తండ్రిని చిన్నబుచ్చ వద్దు, నిత్యత్వము పరుగులో వెనుకపడి పోవద్దు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

1, సెప్టెంబర్ 2022, గురువారం

భక్తి హీనులు బాధ పేడుతున్నారా?

ఇదివరకు దేవుడు మన జీవితాలలో కష్టాలూ అనుమతించి, మనలను విశ్వాసములో ఎదిగిస్తాడు అని తెలుసుకున్నాము కదా! అయితే కొన్ని సార్లు పరిస్థితులను మాత్రమే కాకుండా, మన చుట్టూ ఉన్న జనులను మనకు వ్యతిరేకముగా లేపి, వారిని మనకు ఇబ్బందులు కలిగించే లాగున అనుమతిస్తాడు. వారు అవిశ్వాసులు అయినా వారు కూడా కావచ్చు. ఆ విధమయిన భక్తి హినులను దేవుడు ఎందుకని మన మీద ఆధిపత్యం చేసేవారిగా నిలబెడుతున్నాడు లేదా మన కన్న ఎక్కువ అశీర్వదిస్తున్నాడు అని మనలో చాల మంది విశ్వాసులు భాధపడుతుంటారు. చాల సార్లు ఆ ఆశీర్వాదాలు, ధనముకు సంబంధించినవిగా, మరియు లోకములో ఘనతను పొందుకొనేవిగా ఉంటాయి. వీటిని పొందుకోవటం ద్వారా జనులు దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ, సాతాను చేతిలో చిక్కుకొని నాశనమునకు దగ్గరవుతున్నారు. 

ఆనాడు సాతాను యేసయ్యను, నాకు నమస్కారం చేసి నన్ను ఆరాదించు నీకు లోకములో అన్ని ఘనతలు ఇస్తాను అని ఆశ పెట్టాడు కదా? ధనము, ఘనత అన్ని కూడా సాతాను అధీనములో ఉన్నాయి. కనుకనే, వాటిని  వాడు భక్తి హీనులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు నిత్యమూ గర్వపడుతూ, జీవము కలిగిన దేవునికి దూరముగా ఉండులాగున ఏర్పాటు చేస్తున్నాడు సాతాను. అటువంటి వారిని బట్టి ఆయాసపడుతూ, సమయానుకూలముగా నీకు సహాయం చేస్తున్న దేవుణ్ణి అవమానించటం ఎంతవరకు సమంజసం? అయ్యో వారి వలె నాకు అది లేదు ఇది లేదు అనుకోవటం, మన దేవునికి అవమానం కదా? మన పిల్లలు ఇతర పిల్లలను చూసి, వారికి అది ఉంది ఇది ఉంది అని మన మీద విసుగుకుంటే ఎంత బాధపడుతాము? 

కానీ దేవుడు మనకు ఇచ్చిన ఎంతో ఉన్నతమయిన విశ్వాసము తద్వారా మనకు ఇచ్చిన రక్షణ, నిరీక్షణను గుర్తించకకుండా ఆ భక్తి హీనులను బట్టి బాధపడటం మనకు తగిన ప్రవర్తనేనా? చాల సార్లు దేవుడు మనలను భక్తి హీనులకు అప్పగించి, మన ద్వారా తనకు మహిమను, ఘనతను తెచ్చుకుంటాడు. అయన మహిమను చాటించె పాత్రగా ఉండుట కన్న శ్రేష్ఠమయినదా? ఆ పెద్ద కారులో ప్రయాణించటం? అయన సన్నిధిని నిత్యం అనుభవించటం కన్న ఉన్నతమయినదా! ఆ ఖరీదయిన బంగ్లాలో జీవితం? ప్రతి పూట, ప్రతి అవసరం అయన నుండి, ఆయన చిత్తముగా పొందుకోవటం కన్న ధన్యత! విచ్చలవిడిగా ధనం ఖర్చు చేయటం? షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోల ఉద్ధంతం గుర్తుందా? దేవుడు భక్తి హీనుడయినా రాజు నెబుకద్నెజరుకు వారిని ఎందుకు అప్పగించాడు? దేవుడు తలచుకుంటే వారిని ఎలాగయినా తప్పించవచ్చు కదా? 

అటువంటి స్థితిలో వారిని ఉండకుండా చేయవచ్చు కదా! అని వారు అనుకోలేదు. ధైర్యముగా దేవుని కోసం నిలబడ్డారు. కనుకనే దేవుడు వారిని కాపాడుకున్నాడు, తద్వారా వారి దేవుడే నిజమయిన దేవుడు అని ఆ భక్తి హీనుడయినా రాజు చేత ప్రకటింపబడి, కీర్తించబడ్డాడు (దానియేలు 3: 20-30). మరియు షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో హెచ్చించేలా చేశాడు దేవుడు.  ఇటువంటి అదృష్టం మనకు వస్తే కాదని, పారిపోతామా? ఎప్పుడు ఎవరు మనలను కొడుతారా? ఏ ఆపదలో పడిపోవాలా? అని ఎదురు చూడమని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు, కానీ దేవుని మహిమను చాటించటానికి అవకాశం ఉంటే, కాస్త కష్టానికి ఓర్చుకోలేమా? మనలను బాధించే వారికి క్రీస్తు ప్రేమను చూపుట ద్వారా, వారిని సిగ్గుపడేలాగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 3:16). తద్వారా వారు క్రీస్తు క్షమా గుణం మన ద్వారా రుచి చూచి దేవుని చిత్తములో ఉంటె రక్షణ పొందుకొనే అవకాశం ఉంది కదా!

అయితే కొన్ని సార్లు దేవుడు తన మార్గంలో మనలను నడపటానికి భక్తి హీనులకు మనలను అప్పగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను బబులోను వారికి ఎందుకు అప్పగించాడు? ఎందరో ప్రవక్తలు వారి విగ్రహరాధనను ఖండిస్తున్న కూడా లెక్క చేయలేదు. యిర్మియా ప్రవక్త ద్వారా ఎంతగా హెచ్చరించిన కూడా వారు అబద్ద ప్రవక్తలను నమ్మి దేవుని మాటలు పెడచెవిన పెట్టారు. కనుకనే దేవుడు బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వారిని నడిపించాడు. అక్కడ దానియేలు మరియు పైన చెప్పుకున్న షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలను లేపి వారి ద్వారా తన మీద విశ్వాసము పెంపొందేలా చేసుకున్నాడు. తద్వారా తరువాతి తరము వారు, విగ్రహారాధనను పూర్తిగా మర్చిపోయేలా చేసాడు. మనలో ఉన్న అవలక్షణాలు పోవటానికి దేవుడు మనలను కూడా అటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. అటువంటప్పుడు మనలను మనం మార్చుకుంటూ దేవునికి మరింతగా దగ్గర కావాలి. 

అపొస్తలుల కార్యములు 16: "30. వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. 31. అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి 32. అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి."

లూకా గారు రాసిన పౌలు గారి పరిచర్యలో జరిగిన ఈ గొప్ప సంఘటనను ఒక్కసారి పరిశీలిద్దాము. దేవుని వాక్యమును చెపుతున్న పౌలు, సిలయులను నిరసించి, వస్త్రములు లాగివేసి  బెత్తములతో కొట్టి చెరసాలలో వేసినప్పుడు, పౌలు మౌనముగా బాధను అనుభవించాడు. కానీ అదే పౌలు తర్వాత "తాను రోమీయుడనని" ప్రకటించుకొన్నాడు, తద్వారా విచారణలో  కొంత ఉపశమానం పొందుకున్నాడు (అపొస్తలుల కార్యములు 22:27-28). ఇక్కడ మొదటి సంఘటనలో పౌలు మౌనముగా ఉండుట ద్వారా,   జైలులో దేవుని మహిమను ప్రత్యక్ష పరచి, ఆ జైలు అధికారి మరియు అతని కుటుంబము రక్షణ పొందుకొనేలా దేవుని ద్వారా వాడుకోబడ్డాడు. ఇతరులు మనలను శోదిస్తున్నప్పుడు, చాల సార్లు మన గొప్పను ప్రకటించుట ద్వారా దేవుని కార్యములకు అడ్డుగా మారే అవకాశం ఉంది. 

కనుక మన గొప్పను గోప్యముగా ఉంచుట ద్వారా లేదా కలిగే శోధనకు తలొగ్గటం ద్వారా దేవుని కార్యములు జరిగించే వారిగా ఉంటాము. ఇక్కడ  పౌలు భక్తి హినుల ముందు దీనుడిగా ఉండుట ద్వారా ఆ జైలు అధికారికి రక్షణ  ప్రకటించే అవకాశం కలిగింది.  ఎక్కడ  మౌనముగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అన్న జ్ఞానము పౌలుకు ఎలా కలిగింది? నిత్యమూ తానూ దీనుడిగా ఉన్నాడు కనుక పరిశుద్దాత్మ దేవుడు తనను నడిపించాడు, కనుకనే అంతగా దేవుని చేత వాడుకోబడ్డాడు. సువార్త పరిచర్య జరిగేది దీనులుగా ఉన్నవారి వారి ద్వారానే గాని డంబికాలు పోతూ, ఇతరుల మీద తిరగబడే వారి ద్వారా కాదు. 

హబక్కూకు 2: "1. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా"

ప్రియాయమయిన సహోదరి, సహోదరుడా! ఈ వచనములో ప్రవక్త అయినా హబక్కూకు కూడా మనవలెనే  భక్తి హీనుల దురాగతాలను బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవా! ఇంకా ఎంత కాలము ఇటువంటి అన్యాయమును చూస్తూ ఊరకుందువు, అని దేవుని ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు. తర్వాతి వచనములలో దేవుడు హబక్కూకు తో జరుగ బోయే విషయాలను వివరించాడు. దుష్టులయిన వారిని తానూ ఎలా శిక్షించబోతున్నాడో స్పష్టంగా ఆ ప్రవక్తకు తెలియజేశాడు (హబక్కూకు 2:3-18). మనం అనుకోవచ్చు, "మనలను బాధిస్తున్న వారిని దేవుడు వెంటనే శిక్షించవచ్చు కదా! విశ్వాసులను వేధిస్తూ సువార్తను తృణీకరిస్తున్న వారిని నశింప చేయవచ్చు కదా" అని. కానీ అన్ని సక్రమముగా జరుగుతుంటే మన విశ్వాసానికి గొప్పతనం ఏముంటుంది? 

సాతాను ముందు, దేవుడు "అదిగో! నా ఫలానా  బిడ్డను చూశావా! ఎంత ఓర్పుతో నా మీద విశ్వాసం చూపుతున్నాడో!" అని నిన్ను చూపించి గర్వపడాలి కదా. విధవరాలు, అన్యాయస్తుడయినా న్యాయాధిపతి ఉపమానం గుర్తుందా? తనకు మొఱ పెడుతున్న విధవరాలుకు, న్యాయం చేసిన అన్యాయస్తుడయినా న్యాయాధిపతి కన్న అనంతముగా న్యాయమయిన వాడు మన దేవుడు. తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేయకుండా ఉంటాడా? వెంటనే వారికి తగిన న్యాయం చేస్తానని అంటున్నాడు (లూకా 18:7-8). ఓర్పు వహించండి, తగిన శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను హేళన చేసిన వారే సిగ్గుపడేలా చెయ్యగలడు. కనుక భక్తి హీనులను బట్టి బాధపకుండా దేవుని మీద ఆధారపడి, అయన చిత్తమును జరిగిద్దాము! 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!