దేవుడు ఏమయి ఉన్నాడో తెలుపుతూ, కృతఙ్ఞత స్తుతులు చెల్లించటం ఆరాధన అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. దేవుని మహిమను, అయన గొప్ప కార్యములను, అయన ప్రేమను గుర్తు చేసుకోవటం కూడా ఆరాధన అనిపించుకోదు. దేవుని మాటలు వినటం, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటం ఆరాధన అనిపించుకుంటుంది. చాల మంది దేవుని సేవ చేస్తున్నాము అన్న పేరుతొ దేవుని మాటలు వినటమే మానేస్తారు. సంఘము పనులలో, పరిచర్యలో తలమునకలు అవుతూ వ్యక్తిగత ప్రార్థన, దేవుని వాక్య పఠనము మరియు దేవునితో ఏకాంతంగా గడపటం నిర్లక్ష్యం చేస్తారు. వాక్యము కంఠస్తంగా నోటికి వస్తుందే తప్ప, దేవుని అభిషేకం నుండి రావటం లేదు అని గుర్తించారు.
మార్కు 7: "6. అందుకాయన వారితో ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే."
ఈ వచనములలో యేసు క్రీస్తు ఏమని సెలవిస్తున్నారు చూడండి! ప్రజలు కేవలం తమ పెదవుల చేత ప్రార్థిస్తున్నారు కానీ తమ హృదయములు ఆయనకు ఎంతో దూరముగా ఉన్నాయి అని, అటువంటి వారిని వేషధారులుగా పరిగణిస్తున్నాడు. చాల మంది విశ్వాసులకు కొత్తలో విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఉన్నంత ఉజ్జివం ఉండదు. రక రకాల వ్యాపకాలు, పాటలు వినటం, సందేశాలు వినటం లేదంటే దేవుని సేవ పేరిట తమను తాము ఘనపరచు కోవటం చేస్తారు. వారు కేవలం రోజు అరగంట వాక్యం చదువుతారు, కొద్దీ సేపు ప్రార్థన చేసి యధావిధిగా తమ పనులకు ఉపక్రమిస్తారు. దేవుని మాటలు వినటానికి, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటానికి వారికి సమయం ఉండదు.
సాతాను యేసయ్యను తనను ఆరాధించాలని కోరినప్పుడు ఏమి ఆశ చూపాడు? (మత్తయి 4:8-9) లోకంలో ఉన్న రాజ్యములలో మహిమను ఇస్తానని, తనకు సాగిలపడి నమస్కారం చెయ్యాలని అడిగాడు. అందుకు యేసయ్య నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే ఘనపరచాలని వాడిని గద్దించాడు. మరి మనకు ఉన్న ఆశలు ఏమిటి? మనం దేవునికి ప్రార్థన కేవలం అవసరాల నిమిత్తమే చేస్తున్నామా? లేక ఆయనను మనసారా ఆరాధిస్తున్నామా? సమస్త ఘనత ఆయనకు ఆపాదిస్తున్నామా లేక మనకు కూడా భాగం ఉంది అని భావిస్తున్నామా?
యెషయా ఆరవ అధ్యాయము 2 వచనము నుండి 9 వచనము వరకు చదువవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాము. ఇక్కడ యెషయా ప్రవక్త పరలోకంలో జరిగే ఆరాధనను దర్శనం రూపంలో చూశాడు. వివిధ రకాల దేవ దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గానములు చేస్తున్నారు. ఆయన పరిశుద్దత నుండి వచ్చే వెలుగును చూసే శక్తి లేక, తమ రెక్కలతో ముఖములు కప్పుకుంటున్నారు. యెషయా తన అపవిత్రను బట్టి దేవుణ్ణి చూసి తానూ నశించిపోయానని అనుకున్నాడు. అయితే సెరాపులలో ఒక దూత బలిపీఠము నుండి నిప్పును తెచ్చి అతని పెదవులకు తగిలించి పవిత్రునిగా చేసింది. అప్పుడు దేవుడు "నేను ఎవరిని నా నిమిత్తం పంపుదును" అనగానే యెషయా "చిత్తము ప్రభువా నేను వెళ్ళెదను" అని చెప్పాడు.
పాపముతో ఉండే మనము నిత్యమూ మనలను మనం తగ్గించుకొని దేవుణ్ణి సన్నిధిలో పాపములు ఒప్పుకోవటం ద్వారా అయన మనకు తన కృపను అనుగ్రహిస్తాడు, అప్పుడు పాపం మన మీద అధికారం కోల్పోతుంది, తద్వారా మనం పవిత్రులుగా మారుతాము. అప్పుడు దేవుడు తన చిత్తమును మనకు బయలు పరచి మనలను నడిపిస్తాడు. ఆ విధముగా దేవుని చిత్తమును చేయటము నిజమయిన ఆరాధనకు సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. దేవుని పనే కదా చేస్తున్నాము, దేవుని పాటలే కదా పాడుతున్నాము, లేదా వింటున్నాము అనుకోవటం ఆరాధన కాదు. కేవలం జ్ఞానం కోసం దేవుని వాక్యం చదువకుండా, ఆత్మ శక్తి కోసం చదవాలి (2 కొరింథీయులకు 3:4-6). మన సమస్తమును పక్కన పెట్టి, అయన యందె దృష్టి నిలిపి అయన స్వరం వినటమే ఆరాధన.
బైబిల్ లో మొదటి ఆరాధన చేసింది అబ్రాహాము. తనకు ఎంతో ప్రియమయిన కుమారుడు ఇస్సాకును దేవుడు తనకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రాహాము వెనుకాడ లేదు. ఆ సమయంలో అబ్రాహాము తన పని వారితో పలికిన మాటలు ఒక్కసారి చూడండి (ఆదికాండము 22:5) "నేను ఈ చిన్న వాడును వెళ్లి దేవునికి మ్రొక్కి (worship) వస్తాము" అన్నాడు. ఇక్కడ అబ్రాహాము తనకు ప్రియమయిన కుమారుణ్ణి దేవునికి అర్పించటం ఆరాధనగా పేర్కొన్నాడు. మరి మనకు ఇష్టమయినవి వదిలి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనలో అహంకారం, జారత్వము, ధనాపేక్ష, క్రోధము, పేరు ప్రఖ్యాతులు ఇవ్వని కూడా మనకు ఎంతో ఇష్టమయిన కార్యములు కదా? వీటిని వదిలి పెడుతున్నామా? అయన పరిశుద్దాత్మ శక్తికై ఆరాటపడుతున్నామా?
ముందు చెప్పుకున్నట్లుగా, దేవునికి కృతఙ్ఞతలు చెల్లించటం, అయన మేలులను తలచుకోవటం సంపూర్ణ ఆరాధన కాదు. ప్రతి స్థితియందు ఆయనకు మొక్కటం, అయన మీద ఆధారపడటం ఆరాధన అని చెప్పుకోవచ్చు. యోబు తన సమస్త సంపద నశించి, తన బిడ్డలందరు చనిపోయారని తెలియగానే ఏమి చేసాడు చూడండి! "యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక" అన్నాడు (యోబు 1:21). ఇక్కడ యోబు తనకు ఎంతో దుఃఖకరమయిన పరిస్థితి ఉన్న కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మరియు ఈ సంగతులలో ఏ విషయమందు దేవుని మీద విసుగుపడి పాపం చేయలేదు. మరి మనం అటువంటి ఓర్పు కలిగి ఉన్నామా? దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తున్నామా? అదియే ఆరాధన.
మనుష్యులయిన మనము ఆత్మ, జీవము, దేహము అను మూడు భాగములు కలిగి ఉన్నాము (1 థెస్సలొనీకయులకు 5:23). దేవుడు పరిశుద్దాత్మ రూపంలో మనలో ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ ఆత్మకు నిలయం మన యొక్క దేహము. కనుక మన దేహమును పవిత్రముగా ఉంచుకోవాలి, అనగా అందులో జరిగే సమస్త పాప కార్యములు (గలతీయులకు 5:18-21) చేయకుండుట ద్వారా ఆత్మ చేత నడిపింపబడిన వారిగా ఉంటాము. మరియు మన దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుటమే ఆయనను ఆరాధించటము అని (రోమీయులకు 12:1) అని పౌలు గారు పరిశుద్దాత్మ ద్వారా తెలియజేసారు. మరియు క్రీస్తు యేసు నందు అతిశయపడుతూ, మన సొంత బలమును, తెలివిని విడిచి ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (ఫిలిప్పీయులకు 3:3).
యోహాను 4: "24. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను."
దయచేసి యోహాను సువార్త 4 వ అధ్యాయము పూర్తిగా చదవమని ప్రభువు పేరిట బ్రతిమాలుకొనుచున్నాము. ఈ వచనములలో యేసయ్య దేవుణ్ణి ఎలా ఆరాదించాలో సమరయ స్త్రీకి వివరిస్తున్నాడు. ఇక్కడ ఆ సమరయ స్త్రీ తన పాప జీవితమును యేసయ్య ముందు దాచుకోలేదు, అన్ని నిజాలు చెప్పింది, తన పాపములన్ని కూడా ఒప్పుకుంది. దేవుణ్ణి ఎలా ఆరాదించాలి అన్న విషయంలో సరయిన అవగాహనా లేకుండా ఉంది. అప్పుడు యేసయ్య "కొండ మీద కాదు మందిరములో కాదు, యదార్థముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తారని, అటువంటి వారినే తండ్రి కోరుకుంటున్నాడు" అని సెలవిస్తున్నాడు.
ప్రియామయిన సహోదరి, సహోదరుడా! ఆరాధన విషయంలో నీకు ఉన్న అవగాహనా ఏమిటి? నీ పాపపు జీవితం ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పాటలు పాడటం, కేవలం మందిరములో దేవుణ్ణి ప్రార్థించటమే ఆరాధన అనుకుని అక్కడే ఆగిపోతున్నావా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యము తోనూ ఆరాధించాలని దేవుని వాక్యం చెపుతున్నది పాటిస్తున్నావా? ఆత్మతో అనగా కేవలం పెదవులతో కాకుండా, హృదానుసారముగా అయన ఆజ్ఞలు పాటిస్తూ జీవించటం. సత్యముతో అనగా ఎటువంటి స్థితికి భయపడకుండా, మన శక్తిని బట్టి కాకుండా కేవలం దేవునిపై విశ్వాసముతో కొనసాగటం. ఆరాధన అనేది, మన ప్రతి దిన చర్యలో కనపడాలి, అది మన విశ్వాస జీవిత విధానముగా అనుసరించాలి.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!
ఇంకా వివరంగా తెలియ చేయండి praise lord
రిప్లయితొలగించండిఆరాధన అంటే ఏమిటి ఎలా చేయాలి
రిప్లయితొలగించండి