దేవుడు మానవులను తన స్వరూపములో నిర్మించాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. తన స్వరూపములో మనలను ఏర్పరచిన కూడా దేవుడు మనకు సొంత చిత్తమును అనుగ్రహించాడు. ఆవిధముగా మనము ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించే వారిగా ఉండాలని అయన అనుకున్నాడు. అంటే ఏమిటి? ఆయనను కాదని, అయన ఆజ్ఞలను కాదని మన ఇష్టానుసారముగా జీవించే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. లేదు అంటే మనకు మర బొమ్మలకు తేడా ఉండదు.
ఆ క్రమములో మొదటి మానవులు అయినా ఆదాము, అవ్వ దేవుని ఆజ్ఞలను మీరి, తమ ఇష్టానుసారముగా జీవించాలనుకున్నారు. కాబట్టి దేవునితో సాన్నిహిత్యం కోల్పోయారు. ఎందుకని దేవుని సాన్నిహిత్యం కోల్పోయారు? దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పరమాణువంత పాపం కూడా లేదు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా ఆదాము, అవ్వ పాపంలో పడిపోయారు. దేవుని స్వరూపములో చెయ్యబడిన వారిలో అప్పటి వరకు ఉన్న దేవుని మహిమ వారి నుండి విడిపోయింది. దాని స్థానములో తమ సొంత చిత్తము ద్వారా వచ్చిన స్వార్ధము, అసూయా, కోపము, ద్వేషము మరియు కామము లాంటి శరీర క్రియాలన్నీ పెరిగిపోయాయి.
ఈ క్రమములో పాపమునకు హేతువయినా మానవ శరీరమునకు మరణం సంభవించటం మొదలయింది. కానీ మరణం లేని ఆత్మ దేవుని ముందు తీర్పునకు నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఆ విధముగా శరీరములో ఉండి చేసిన ప్రతి పాపానికి నిత్యత్వములో నరకము లేదా పరలోకము అనగా దేవుని సన్నిధి అనుగ్రహించాలన్నది దేవుని నియామము. మనుష్యులు శరీరములో ఉన్నంత కాలం పాపం లేకుండా జీవించాలని, ముందుగా మనుష్యులకు మనసాక్షిని ఇచ్చాడు. ఆ తర్వాత లోకానికి తానె రక్షకుడిగా రావటానికి, ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకొని వారికి పది ఆజ్ఞలు ఇచ్చి, తన ప్రజలుగా వారిని నడిపించాడు.
వారు తప్పు చేసిన ప్రతి సారి కూడా వారిని శిక్షించాడు, న్యాయమంతుడిగా నిరూపించుకున్నాడు. ఆదే సమయంలో అనంతమయిన ప్రేమ కలిగిన తండ్రిగా, ఎన్నో మహిమల ద్వారా వారిని ఆదుకున్నాడు. యేసు క్రీస్తుగా తానూ రాబోతున్నట్లుగా ఎన్నో ప్రవచనాల ద్వారా తన రాకను ముందుగా తెలియజేసాడు. కన్య మారియా గర్భములో దేవుని పరిశుద్దాత్మ ద్వారా రక్షకునిగా లోకములో పుట్టాడు. ఈ యేసు క్రీస్తు ఎవరు? "దేవుడు పెట్టిన ఆజ్ఞలు అన్ని నెరవేర్చి, తన సొంత చిత్తము నెరవేర్చే అవకాశం ఉండి కూడా, తన ఇష్టం వదులు కొని కేవలం దేవుని చిత్తము చేయటానికి వచ్చాను" అని చాల సందర్భాలలో బోధించాడు అని దేవుని వాక్యం చెపుతుంది. దేవుని శక్తిని పొందుకొని, పాపం లేకుండా, ఎలా జీవించాలో మనుష్యులకు నేర్పించటానికే అయన వచ్చాడు. మనుష్యులను పాపం నుండి రక్షించటానికి వచ్చిన దేవుని కుమారుడు.
మనుష్యులను పాపం నుండి ఎలా రక్షిస్తాడు? దేవుని బలిదాన నియమం ప్రకారం, పాపం లేకుండా జీవించి మన అందరి కోసం కళంకం లేని తన రక్తం కార్చి మన పాపాలను రద్దు చేసాడు. మనుష్యులు గురవుతున్న మరణమును తానూ పొంది, దాన్ని జయించి, పాపం ద్వారా మనకు వచ్చే మరణాన్ని తొలగించాడు. ఆయనను విశ్వాసించి, మన పాపాలను ఒప్పుకొని, మన ప్రవర్తన మార్చుకుంటే, తన పరిశుద్దాత్మ శక్తి ద్వారా మనలను తనకు ఇష్టమయిన వారిగా నడిపించి, మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఆదాము ద్వారా మనం కోల్పోయిన దేవుని మహిమను, యేసు క్రీస్తు స్వరూపము లోకి మార్చటం ద్వారా, శరీర మరణం తర్వాత, దేవునితో పరలోకములో తన మహిమలో నివసించే నిత్య జీవితన్ని అనుగ్రహిస్తాడు.
అందుకనే, యేసు క్రీస్తును నమ్ముకున్న వారిని రక్షణ పొందుకున్న వారు లేదా రక్షించబడిన వారు అని పిలుస్తారు. అసలు రక్షణ పొందుకోవటం అంటే ఏమిటి? దేవుని వాక్యాను సారముగా నేర్చుకుందాము.
లూకా సువార్త 19: "8. జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. 9. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. 10. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను."
ఇక్కడ జక్కయ్య అనబడే వ్యక్తి, పన్నులు వసూలు చేసే అధికారి, ఎంతో ధనవంతుడు అయినప్పటికీ యేసు క్రీస్తు గురించి విని ఆయనను చూడాలని, ఆ దారి వెంట అయన వస్తున్నాడని కాపు కాచాడు. కానీ తానూ పొట్టి వాడు కావటం చేత జనాలు ఆడ్డువస్తారని చెట్టు ఎక్కి ఎదురు చూస్తున్నాడు. ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసే వారిని ఘోరమయిన పాపులుగా భావించే వారు. ఎందుకంటే వారు పేదలను పీడించి డబ్బులు వసూలు చేసి ధనవంతులు అవుతారని. అటువంటి వాడే జక్కయ్య కూడా. అంతటి ధనవంతుడు, ఏ చీకు చింత లేని జక్కయ్య దారుల వెంబడి ఎందుకు తిరుగుతున్నాడు? బహుశా తనకు మనశాంతి కరువయి ఉందేమో. యేసు క్రీస్తు ఇచ్చే ఆ శాంతి, సమాధానం తనకు కావాలనుకున్నాడేమో. ఎక్కడో "తానూ పాపం చేసి ధనం సంపాదించాడు" అని మనసాక్షి ఎదురు తిరిగిందేమో. అందుకే ఏసయ్యను ఒక్కసారి చూడాలని, అయన మాటలు వినాలని ఆశపడ్డాడు.
జనాలు అడ్డు వస్తున్నారు, మళ్ళి ఎప్పుడయినా చూద్దాంలే అని వెనుకకు తిరిగి పోలేదు. ధనవంతుడయినా నేను, ఒక బోధకుడి కోసం చెట్టు ఎక్కటం ఏమిటీ? అని అహంకారం చూపించలేదు. ఎలాగయినా అయన మాటలు వింటే, తన బ్రతుకు మారిపోతుందేమో, పాపిగా తనకు పడిన ముద్ర ఆ విధముగా చెదిరి పోతుందేమో, అని ఆశ పడ్డాడు. ఇప్పటికి కూడా ఎంతో మంది యేసయ్యను విశ్వసించాలని, వెంబడించాలని ఆశ ఉన్న కూడా, పాత కాలం అలవాట్లు అడ్డువచ్చి ఆగిపోతారు. బంధువులు, స్నేహితులు ఎక్కడ వెలి వేస్తారో, హేళన చేస్తారో అని భయపడతారు. మరణం లేని మన ఆత్మకు జవాబు దారి మనమే అవుతాము కానీ, మన బంధువులు, స్నేహితులు కారు. చెట్టు ఎక్కిన జక్కయ్య యేసయ్య ను పిలువలేదు, తనను చూడాలని ఏ విధమయిన సైగలు చెయ్యలేదు. చెట్టు కిందికి రాగానే యేసయ్య "జక్కయ్య కిందికి దిగి రా, నేను నీ ఇంటికీ వస్తాను" అన్నాడు.
మనలను కూడా అలాగే అలాగే పిలువటానికి, దర్శించటానికి అయన సిద్ధముగా ఉన్నాడు. కేవలం, ఆయనను చూడాలని ఆశ కలిగి ఉంటె చాలు, ఒక్క అడుగు నువ్వు వేస్తె లెక్కలేని అడుగులు వేసి నిన్ను చేరుకుంటాడు, తన వాడిగా నిన్ను మార్చుకుంటాడు. అప్పుడు ఏమి జరుగుతుంది? ఒక్కసారి జక్కయ్య జీవితాన్ని చూడండి, అప్పటి వరకు అన్యాయంగా ధనం సంపాదించినా జక్కయ్య ఒక్కసారిగా నీతి మంతుడిగా మారిపోయాడు. పేదలకు తన సంపాదనలో సగం దానం చేసాడు, అంతే కాకుండా ఎవరి వద్దయినా అన్యాయంగా పన్ను వసూలు చేస్తే నాలుగు రేట్లు పరిహారం చెల్లించాడు. ఇక్కడ జక్కయ్య తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపపు జీవితం వదిలి పెట్టాడు. అందుకే యేసయ్య అన్నాడు "ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని. నశించిపోయిన దానిని, వెతికి రక్షించటానికి నేను వచ్చానని"
ప్రియయిన నేస్తమా! నువ్వు నమ్మే సిద్ధాతం నిన్ను ఎంతగా మారుస్తుందో ఒక్కసారి పరిశీలించి చూసుకో! నరకం పేరు చెప్పి భయపెట్టటం క్రీస్తు తత్త్వం కాదు. నీకు మారు మనసు ఇచ్చి, నీలో ఉన్న పాపమూ యొక్క బీజమును తొలగించటం క్రీస్తు విధానము. శరీరం పై కలిగే పుండుకు మందు రాయటం పాతకాలం నాటి నాటు వైద్యపు పద్దతి, పుండ్లకు కారణం అవుతున్న శరీరంలో బ్యాక్టీరియాను చంపే పద్దతి నూతనమయిన ఉన్నత వైద్య విధానము. యేసయ్యను తెలుసుకోవటం వల్ల జరిగేది అదే. మన పాపానికి కారణం అవుతున్న అన్ని శరీర క్రియలను జయించటానికి శక్తి లభిస్తుంది. మన సాక్షి కంటే ఎంతో, శక్తి కలిగిన పరిశుద్దాత్మ శక్తి మనలను నడిపిస్తుంది.
నువ్వు ఎన్ని పుణ్య కార్యాలు చేస్తే, దేవునికి ప్రామాణికమయిన జీవితాన్ని పొందుకోగలవు? ఎంత నిష్టగా ఉంటె, నువ్వు కోరుకొనే మోక్షము అందుకోగలవు? ఏసయ్యను విశ్వాసిస్తే, అయన నీతి నీకు లభిస్తుంది. ఆయన శక్తి ద్వారా నువ్వు కోరుకొనే పాపం లేని జీవితం జీవించే అవకాశం ఉంది. క్రీస్తు చేతకాక సిలువలో చనిపోలేదు, అయన చనిపోవటానికే ఈ భూమి మీదికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించటానికే ఆ దేవుడు మనిషిగా అవతరించాడు. అదే క్రిస్మస్ పండుగ. మన పాపాలు ఒప్పుకోని, వాటిని విడిస్తేనే మనకు రక్షణ. అది వదిలేసి, ఎన్ని పాటలు పాడిన, ఎన్ని గంతులు వేసిన, ఆయన తెచ్చిన రక్షణ మనలో లేనట్లే.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!