పేజీలు

23, డిసెంబర్ 2022, శుక్రవారం

క్రిస్మస్ సందేశము!

 

దేవుడు మానవులను తన స్వరూపములో నిర్మించాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. తన స్వరూపములో మనలను ఏర్పరచిన కూడా దేవుడు మనకు సొంత చిత్తమును అనుగ్రహించాడు. ఆవిధముగా మనము ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించే వారిగా ఉండాలని అయన అనుకున్నాడు. అంటే ఏమిటి? ఆయనను కాదని, అయన ఆజ్ఞలను కాదని మన ఇష్టానుసారముగా జీవించే అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. లేదు అంటే మనకు మర బొమ్మలకు తేడా ఉండదు.

ఆ క్రమములో మొదటి మానవులు అయినా ఆదాము, అవ్వ దేవుని ఆజ్ఞలను మీరి, తమ ఇష్టానుసారముగా జీవించాలనుకున్నారు. కాబట్టి దేవునితో సాన్నిహిత్యం కోల్పోయారు. ఎందుకని దేవుని సాన్నిహిత్యం కోల్పోయారు? దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పరమాణువంత పాపం కూడా లేదు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా ఆదాము, అవ్వ పాపంలో పడిపోయారు. దేవుని స్వరూపములో చెయ్యబడిన వారిలో అప్పటి వరకు ఉన్న దేవుని మహిమ వారి నుండి విడిపోయింది. దాని స్థానములో తమ సొంత చిత్తము ద్వారా వచ్చిన స్వార్ధము, అసూయా, కోపము, ద్వేషము మరియు కామము లాంటి శరీర క్రియాలన్నీ పెరిగిపోయాయి.

ఈ క్రమములో పాపమునకు హేతువయినా మానవ శరీరమునకు మరణం సంభవించటం మొదలయింది. కానీ మరణం లేని ఆత్మ దేవుని ముందు తీర్పునకు నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఆ విధముగా శరీరములో ఉండి చేసిన ప్రతి పాపానికి నిత్యత్వములో నరకము లేదా పరలోకము అనగా దేవుని సన్నిధి అనుగ్రహించాలన్నది దేవుని నియామము. మనుష్యులు శరీరములో ఉన్నంత కాలం పాపం లేకుండా జీవించాలని, ముందుగా మనుష్యులకు మనసాక్షిని ఇచ్చాడు. ఆ తర్వాత లోకానికి తానె రక్షకుడిగా రావటానికి, ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకొని వారికి పది ఆజ్ఞలు ఇచ్చి, తన ప్రజలుగా వారిని నడిపించాడు. 

వారు తప్పు చేసిన ప్రతి సారి కూడా వారిని  శిక్షించాడు, న్యాయమంతుడిగా నిరూపించుకున్నాడు. ఆదే సమయంలో అనంతమయిన ప్రేమ కలిగిన తండ్రిగా, ఎన్నో మహిమల ద్వారా వారిని ఆదుకున్నాడు. యేసు క్రీస్తుగా తానూ రాబోతున్నట్లుగా ఎన్నో ప్రవచనాల ద్వారా తన రాకను ముందుగా తెలియజేసాడు. కన్య మారియా గర్భములో దేవుని పరిశుద్దాత్మ ద్వారా రక్షకునిగా లోకములో పుట్టాడు. ఈ యేసు క్రీస్తు ఎవరు? "దేవుడు పెట్టిన ఆజ్ఞలు అన్ని నెరవేర్చి, తన సొంత చిత్తము నెరవేర్చే అవకాశం ఉండి కూడా, తన ఇష్టం వదులు కొని కేవలం దేవుని చిత్తము చేయటానికి వచ్చాను" అని చాల సందర్భాలలో బోధించాడు అని దేవుని వాక్యం చెపుతుంది. దేవుని శక్తిని పొందుకొని, పాపం లేకుండా, ఎలా జీవించాలో మనుష్యులకు నేర్పించటానికే అయన వచ్చాడు. మనుష్యులను పాపం నుండి రక్షించటానికి వచ్చిన దేవుని కుమారుడు.

మనుష్యులను పాపం నుండి ఎలా రక్షిస్తాడు? దేవుని బలిదాన నియమం ప్రకారం, పాపం లేకుండా జీవించి మన అందరి కోసం కళంకం లేని తన రక్తం కార్చి మన పాపాలను రద్దు చేసాడు. మనుష్యులు గురవుతున్న మరణమును తానూ పొంది, దాన్ని జయించి, పాపం ద్వారా మనకు వచ్చే మరణాన్ని తొలగించాడు. ఆయనను విశ్వాసించి, మన పాపాలను ఒప్పుకొని, మన ప్రవర్తన మార్చుకుంటే, తన పరిశుద్దాత్మ శక్తి ద్వారా మనలను తనకు ఇష్టమయిన వారిగా నడిపించి, మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఆదాము ద్వారా మనం కోల్పోయిన దేవుని మహిమను, యేసు క్రీస్తు స్వరూపము లోకి మార్చటం ద్వారా, శరీర మరణం తర్వాత, దేవునితో పరలోకములో తన మహిమలో నివసించే నిత్య జీవితన్ని అనుగ్రహిస్తాడు.

అందుకనే, యేసు క్రీస్తును నమ్ముకున్న వారిని రక్షణ పొందుకున్న వారు లేదా రక్షించబడిన వారు అని పిలుస్తారు. అసలు రక్షణ పొందుకోవటం అంటే ఏమిటి? దేవుని  వాక్యాను సారముగా నేర్చుకుందాము.

లూకా సువార్త 19: "8. జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. 9. అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. 10. నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను."

ఇక్కడ జక్కయ్య అనబడే వ్యక్తి, పన్నులు వసూలు చేసే  అధికారి, ఎంతో ధనవంతుడు అయినప్పటికీ యేసు క్రీస్తు గురించి విని ఆయనను చూడాలని, ఆ దారి వెంట అయన వస్తున్నాడని కాపు కాచాడు. కానీ తానూ పొట్టి వాడు కావటం చేత జనాలు ఆడ్డువస్తారని చెట్టు ఎక్కి ఎదురు చూస్తున్నాడు. ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసే వారిని ఘోరమయిన పాపులుగా భావించే వారు. ఎందుకంటే వారు పేదలను పీడించి డబ్బులు వసూలు చేసి ధనవంతులు అవుతారని. అటువంటి వాడే జక్కయ్య కూడా. అంతటి ధనవంతుడు, ఏ చీకు చింత లేని జక్కయ్య దారుల వెంబడి ఎందుకు తిరుగుతున్నాడు? బహుశా తనకు మనశాంతి కరువయి ఉందేమో. యేసు క్రీస్తు ఇచ్చే ఆ శాంతి, సమాధానం తనకు కావాలనుకున్నాడేమో. ఎక్కడో "తానూ పాపం చేసి ధనం సంపాదించాడు" అని మనసాక్షి ఎదురు తిరిగిందేమో. అందుకే ఏసయ్యను ఒక్కసారి చూడాలని, అయన మాటలు వినాలని ఆశపడ్డాడు. 

జనాలు అడ్డు వస్తున్నారు, మళ్ళి ఎప్పుడయినా చూద్దాంలే అని వెనుకకు తిరిగి పోలేదు. ధనవంతుడయినా నేను, ఒక బోధకుడి కోసం చెట్టు ఎక్కటం ఏమిటీ? అని అహంకారం చూపించలేదు. ఎలాగయినా అయన మాటలు వింటే, తన బ్రతుకు మారిపోతుందేమో,  పాపిగా తనకు పడిన ముద్ర ఆ విధముగా చెదిరి పోతుందేమో, అని ఆశ పడ్డాడు. ఇప్పటికి కూడా ఎంతో  మంది యేసయ్యను విశ్వసించాలని, వెంబడించాలని ఆశ ఉన్న కూడా, పాత కాలం అలవాట్లు అడ్డువచ్చి ఆగిపోతారు. బంధువులు, స్నేహితులు ఎక్కడ వెలి వేస్తారో, హేళన చేస్తారో  అని భయపడతారు. మరణం లేని మన ఆత్మకు జవాబు దారి మనమే అవుతాము కానీ, మన బంధువులు, స్నేహితులు కారు.  చెట్టు ఎక్కిన జక్కయ్య యేసయ్య ను పిలువలేదు, తనను చూడాలని ఏ విధమయిన సైగలు చెయ్యలేదు. చెట్టు కిందికి రాగానే యేసయ్య "జక్కయ్య కిందికి దిగి రా, నేను నీ ఇంటికీ వస్తాను" అన్నాడు. 

మనలను కూడా అలాగే అలాగే పిలువటానికి, దర్శించటానికి అయన సిద్ధముగా ఉన్నాడు. కేవలం, ఆయనను చూడాలని ఆశ కలిగి ఉంటె చాలు, ఒక్క అడుగు నువ్వు వేస్తె లెక్కలేని అడుగులు వేసి నిన్ను చేరుకుంటాడు,  తన వాడిగా నిన్ను మార్చుకుంటాడు. అప్పుడు ఏమి జరుగుతుంది? ఒక్కసారి జక్కయ్య జీవితాన్ని చూడండి, అప్పటి వరకు అన్యాయంగా ధనం సంపాదించినా జక్కయ్య ఒక్కసారిగా నీతి మంతుడిగా మారిపోయాడు. పేదలకు తన సంపాదనలో సగం దానం చేసాడు, అంతే కాకుండా ఎవరి వద్దయినా అన్యాయంగా పన్ను వసూలు చేస్తే నాలుగు రేట్లు పరిహారం చెల్లించాడు. ఇక్కడ జక్కయ్య తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పాపపు జీవితం వదిలి పెట్టాడు. అందుకే యేసయ్య అన్నాడు "ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందని. నశించిపోయిన దానిని, వెతికి రక్షించటానికి నేను వచ్చానని" 

ప్రియయిన నేస్తమా! నువ్వు నమ్మే సిద్ధాతం నిన్ను ఎంతగా మారుస్తుందో ఒక్కసారి పరిశీలించి చూసుకో! నరకం పేరు చెప్పి భయపెట్టటం క్రీస్తు తత్త్వం కాదు. నీకు మారు మనసు ఇచ్చి, నీలో ఉన్న పాపమూ యొక్క బీజమును తొలగించటం క్రీస్తు విధానము. శరీరం పై కలిగే పుండుకు మందు రాయటం పాతకాలం నాటి నాటు వైద్యపు పద్దతి, పుండ్లకు కారణం అవుతున్న శరీరంలో బ్యాక్టీరియాను చంపే పద్దతి నూతనమయిన ఉన్నత వైద్య విధానము. యేసయ్యను తెలుసుకోవటం వల్ల జరిగేది అదే. మన పాపానికి కారణం అవుతున్న అన్ని శరీర క్రియలను జయించటానికి శక్తి లభిస్తుంది. మన సాక్షి కంటే ఎంతో, శక్తి కలిగిన పరిశుద్దాత్మ శక్తి మనలను నడిపిస్తుంది. 

నువ్వు ఎన్ని పుణ్య కార్యాలు చేస్తే, దేవునికి ప్రామాణికమయిన జీవితాన్ని పొందుకోగలవు? ఎంత నిష్టగా ఉంటె, నువ్వు కోరుకొనే మోక్షము అందుకోగలవు? ఏసయ్యను విశ్వాసిస్తే, అయన నీతి నీకు లభిస్తుంది. ఆయన శక్తి ద్వారా నువ్వు కోరుకొనే పాపం లేని జీవితం జీవించే అవకాశం ఉంది. క్రీస్తు చేతకాక సిలువలో చనిపోలేదు, అయన చనిపోవటానికే ఈ భూమి మీదికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించటానికే ఆ దేవుడు మనిషిగా అవతరించాడు. అదే క్రిస్మస్ పండుగ. మన పాపాలు ఒప్పుకోని, వాటిని విడిస్తేనే మనకు రక్షణ. అది వదిలేసి, ఎన్ని పాటలు పాడిన, ఎన్ని గంతులు వేసిన, ఆయన తెచ్చిన రక్షణ మనలో లేనట్లే. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

22, డిసెంబర్ 2022, గురువారం

సువార్త చెపుతున్నావా?


ప్రపంచం అంత జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్, అంటే యేసు క్రీస్తు పుట్టిన రోజు అని అందరి నమ్మకం. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించే వారు అని అర్థమని మనందరికి తెలుసు. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయం కూడా ప్రతి క్రైస్తవుడికి తెలుసు. పాపముల నుండి మనలను రక్షించటానికి దేవుని కుమారుడు అయినా యేసు క్రీస్తు భూమి మీద జన్మించాడు. ఈ సువార్తను పది మందికి తెలుపాలని క్రైస్తవులందరు ఎంతగానో ఆరాట పడుతుంటారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వీరు, క్రీస్తును నిజముగా అనుసరిస్తున్నారా? 

క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే చాలు, ప్రతి చర్చ్ లో ఎంతో హడావిడి మొదలవుతుంది. కారల్స్  తో  సువార్త,  మినీ క్రిస్మస్ తో సువార్త, పాటల ద్వారా సువార్త, క్రిస్మస్ ఉత్సవాలతో సువార్త. ఎందుకని  సువార్త చెపుతున్నాము? యేసయ్య చెప్పమన్నాడు కాబట్టి. కానీ అయన సువార్త ఒక్కటే చెప్పమన్నాడా? వారందరిని తన శిష్యులుగా మార్చమన్నాడు. యేసు క్రీస్తు దేవుడని అన్యులు సైతం నమ్ముతారు కదా. మరి వెళ్ళి వారికి సువార్త చెప్పినంత మాత్రాన మారిపోతారా? దేవుడు ఒక వ్యక్తిని మార్చాలనుకుంటే ఒక చిన్న కరపత్రిక చాలు. ఇంత హడావిడి అవసరం లేదు. 

యేసయ్యను అనుసరించమని అన్యులకు చెప్పే ముందు, నువ్వు ఆయనను అనుసరిస్తున్నావా? అయన శిష్యునిగా మారమని, నీ స్నేహితునికి చెప్పే ముందు, నువ్వు అయన శిష్యుడిగా ఉన్నావా? యేసయ్య తన శిష్యులను సువార్త చెప్పమని ఎప్పుడు పంపాడు? వారిని విశ్వాసములో బలపరచిన తర్వాత కదా! మరి మన విశ్వాసము కేవలం మాటలలోనే ఉందా లేక చేతలలో కూడా ఉందా? యేసయ్య శిష్యులుగా ఉండటం అంటే, అయన చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించాలని. 

1 యోహాను 3: "22. ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలెననునదియే."

యేసయ్య ప్రియా శిష్యుడయినా యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఈ వచనం ఏమి చెపుతుంది. యేసు క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ, ఒకరి నొకరు ప్రేమించాలని. మనం క్రీస్తు మనుష్యులం అని చెప్పుకుంటే సరిపోదు, మనలో పాపం లేకుండా చూసుకోవాలి. పాపం మనలో ఉంటే, మనకు ఆయనకు సంబంధం లేదని దేవుని వాక్యం చెపుతుంది (1 యోహాను 3:6). మనకు అన్ని సౌకర్యాలు ఉండి, మన పక్కవాడు, తిండికి కూడా కష్టపడుతుంటే, నాకేందుకు అనుకుంటే, యేసయ్య ప్రేమ మనలో లేనట్లే. మనం అయన శిష్యులం కానట్లే. మనకు ఉన్నవన్నీ అందరికి పంచేయమని దేవుడు చెప్పటం లేదు. నీకు ఉన్న దాంట్లో, సంతోషంగా ఇతరులకు సహాయం చేయమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. 

మనం చూపే ఆ ప్రేమ ఎంతో మందిని యేసయ్యకు దగ్గర చేస్తుంది! నీతి కలిగిన జీవితం మన బంధువులను, స్నేహితులను అయన శిష్యులుగా మారుస్తుంది. ఎన్నో ప్రసంగాల ద్వారా చెప్పలేని సువార్త నీ జీవితం ద్వారా చెపితే, ఎంతో మంది మారి, నశించి పోకుండా క్రీస్తులోకి వచ్చే అవకాశం ఉంది. సువార్త భారం మంచిదే, కానీ అంతకన్నా ముందు మన  విశ్వాస జీవితం ఇంకా ప్రాముఖ్యమయినది. మనం బ్రతికి చెపితే, ఎదుటి వారి హృదయంలో దేవుడు దాన్ని ఫలింప చేస్తాడు. మనం పాటించకుండా ఎంత గొంతూ చించుకున్నా ఫలితం ఉండదు. 

1 యోహాను 3: "19. దేవుడు మన హృదయము కంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము."

పై వచనంలో చెప్పినట్లుగా దేవునికి నచ్చినట్లు బ్రతకటానికి మనకు గొప్ప బైబిల్ వాక్యాలు కూడా తెలియనవసరం లేదు. మన మనసు ఏ విషయాలలో మనలను తప్పు పడుతుందో వాటి విషయంలో దేవుని ఎదుట మన మనసును  సమాధాన పరచుకుంటే చాలు. మనలో దేవుని ప్రేమ ఉన్నట్లే, మనం యేసయ్య శిష్యులుగా నడచుకున్నట్లే. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మాటలతో, పాటలతో, ఇంకా ఎన్నో రకాలుగా సువార్త చెప్పటం మంచిదే! అన్నింటి కన్నా మనకు తెలిసిన వారికి మన జీవితాల ద్వారా చెపితే ఇంకా గొప్ప పరిచర్య చేసిన వారిగా ఉంటాము. మీకు పాటలు పాడే శక్తి లేక పోవచ్చు, ప్రసంగాలు చేసే తెలివి, దైర్యం లేక పోవచ్చు, మిమల్ని ఎవరు దేవుని పరిచర్యలో పాలి బాగస్తులు చేయట్లేదేమో! వాటి అవసరం లేదు. ప్రభువు మిమల్ని పిలుచుకున్నాడు, విశ్వాసం ఇచ్చి నడిపిస్తున్నాడు. మీ జీవితం చాలదా! అయన ప్రేమను చాటటానికి, సువార్త చెప్పటానికి! ఆలోచించండి, ఆచరించండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

9, డిసెంబర్ 2022, శుక్రవారం

దేవుడు ఇచ్చే సమృద్ధి!


విశ్వాసులు అయినా  మనము చాల సార్లు మనకు ఉన్న అవసరాలను బట్టి, దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు ఎత్తి పడుతూ ఆయనను ప్రార్థిస్తూ ఉంటాము.  కానీ మనలో చాల మంది తాము ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి అవిశ్వాసములో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే చాల సార్లు మనము దేవుడు నుండి ఆలస్యముగా సమాధానము పొందుకుంటాము. కానీ దేవుడు పాటించే సమయము, అయన ప్రణాళికలు అన్ని కూడా మనకు మేలు చేయటానికే తప్ప కీడు చేయటానికి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (యిర్మియా 29:11).  అధె విధముగా మన తెలివిని బట్టి కాకుండా, మన పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకము ఉంచి, మన ప్రవర్తన అంతటి యందు అయన అధికారమును ఒప్పుకోవటం ద్వారా అయన మన త్రోవలు సరళం చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది (సామెతలు 3:5-6). 

వాగ్దానము ఇచ్చి మరచి పోనీ దేవుడు ఖఛ్చితముగా మనకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు బోధలో చెప్పినట్లుగా, పాపములము అయినా మనమే మన బిడ్డలకు ఎన్నో గొప్ప ఈవులు ఇవ్వాలని ఆశపడుతుంటే, నీతి మంతుడయినా పరలోకపు తండ్రి ఇంకా ఎన్నో గొప్ప దీవెనలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయన రొట్టె అడిగిన వారికి రాతిని, చేప అడిగిన వారికి పామును ఇవ్వని దయ కలిగిన తండ్రిగా ఉన్నాడు.  కానీ ఈ సమృద్ధి చాల సార్లు మనలను గర్విష్టులుగా మారుస్తుంది. మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశ్యాలను మనం తప్పిపోయేలా చేస్తుంది. 

దేవుని వాక్యంలో నుండి మనం ఇప్పుడు అటువంటి వారిని గురించి ఇప్పుడు ధ్యానించుకుందాము. 

‭‭నిర్గమకాండము‬ ‭11‬:‭ "2. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము. 3. యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను."

ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం లో నుండి విడిపించే చివరి సమయంలో దేవుడు మోషే ద్వారా,  ఐగుప్తీయుల నుండి వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకోవాలని చెపుతున్నాడు. ఐగుప్తీయులకు బానిసలయినా ఇశ్రాయేలు వారి మీద దేవుడు కరుణ కలిగించాడు. అంతే కాకుండా  దేవుడు మోషే ద్వారా చేసిన అద్భుత కార్యములను బట్టి వారికి మోషే పట్ల కూడా ఎంతో గౌరవం ఏర్పడింది. బానిసలూ అయినా వారికి జీత భత్యాలు ఉండవు, పెట్టినది తినీ చెప్పిన పని చెయ్యటమే వారి పరిస్థితి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సమృద్ధిగా దీవించి బయటకు తీసుకురావాలనుకున్నాడు. వారు అంతకాలం చేసిన వెట్టి చాకిరికి జీతం ఇప్పించాడు. 

ఫరో ఒక్కసారి మోషేతో "మీ పశువులను ఇక్కడే ఉంచి మీ దేవుణ్ణి ఆరాదించటానికి వెళ్ళండి" అన్నప్పుడు, మోషే "మా దేవునికి మేము బలులు అర్పించాలి, ఎన్ని పశువులు అవసరం అవుతాయో మాకు తెలియదు, కనుక మా పశువులన్ని మాతో రావాల్సిందే" అంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు వారికి లభించిన బంగారం కూడా దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోకుండా,  దేవుడు వారికి ఆ సమృద్ధిని ఎందుకు ఇచ్చాడో ఎదురు చూడకుండా, సమృద్ధి ఉంది కదా అని వారు చేసిన పని ఏమిటి? మోషే దేవుని ధర్మశాస్త్రం కోసం వెళ్ళి నలుపది దినాలు కొండ దిగి కిందికి రాలేదని, దేవునికి వ్యతిరేకంగా బంగారు దూడను చేసుకొని దాన్ని పూజించటం మొదలు పెట్టారు, దేవుని ఆగ్రహానికి గురయినారు. 

2 దినవృత్తాంతములు 9: "13 . గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు."

దావీదు కుమారుడు అయినా సొలొమోను దేవుని చేత ఎంతో గొప్పగా దీవించబడ్డాడు. పై వచనం చూస్తే ప్రతి యేడు ఆయనకు కలిగే సంపద మనకు తెలుస్తుంది. అయన సంపద గురించి తెలియాలంటే తొమ్మిదవ అధ్యాయం పూర్తిగా చదువుమని కోరుకుంటున్నాను. అయితే సంపద కారణముగా సొలొమోను తన హృదయమునకు తోచిన ప్రతి కోరికను నెరవేర్చుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో అయన రాసినట్లుగా, ఎన్నో అందమయిన భవనాలు, ఉద్యానవనాలు, ద్రాక్ష తోటలు నిర్మించుకున్నాడు. ఎందరో భార్యలను కలిగి ఉండి, నిత్యము కామాతురతతో బ్రతికాడు అని దేవుని వాక్యం చెపుతుంది. 

1 రాజులు 11 : "6. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు."

ఈ వచనంలో సొలొమోను దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కొనసాగించాడు అని తెలుస్తుంది. దేవుడు ఇచ్చిన సమృద్ధిని తన సొంత గొప్ప కోసం వాడుకొని, దేవునికి తన పట్ల ఉన్న ఉద్దేశ్యాలను పూర్తిగా కోల్పోయాడు. భర్యలను అనుసరించి అన్య దేవతలకు ఎన్నో గొప్ప బలి పీఠములు కట్టించాడు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించిన కూడా పేడ చెవిన పెట్టాడు. కేవలం దావీదు కు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయనను రాజుగా కొనసాగించాడు. 

ఎజ్రా 1: "6. మరియు వారి చుట్టు నున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తు వులను ఇచ్చి వారికి సహాయము చేసిరి."

బబులోనుకు బానిసలుగా వెళ్లిన ఇశ్రాయేలు వారిని తిరిగి దేవుడు తన మందిర నిర్మాణానికి రప్పించాలనుకున్నప్పుడు, రాజయిన కోరెషు మనసును ప్రేరేపించినాడు. ఆ సందర్భంలో అక్కడ ఉన్న ఇతర ప్రజలకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు వెండి, బంగారం, పశువులను, మరియు ఎంతో విలువయిన వస్తువులను ఇవ్వటానికి దేవుడు ప్రేరేపించాడు. అధిక ధనవంతుడయినా సొలొమోను కట్టిన మందిరము వలే లేకపోయినప్పటికీ, బానిసలుగా బ్రతికి, ఏ సంపద లేకుండా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరమును కట్టటం సామాన్యమయిన విషయం కాదు. కానీ దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని వారు దేవుని చిత్తమునకు ఉపయోగించారు. అందును బట్టి తిరిగి దేవునిలో బలపడ్డారు, తప్పిపోయిన ప్రజలను నిలబెట్టారు. 

అపొస్తలుల కార్యములు 24: "26. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను."

అపొస్తలుడయినా పౌలు ధనిక కుటుంబముకు చెందిన వాడని బైబిల్ లో స్పష్టంగా లేకపోయినప్పటికి, అయన  పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు. రోమీయుల చేత పాలించబడుతున్న యూదులకు రోమా పౌరసత్వం ఎలా దొరుకుతుంది? వారి కుటుంబం ఎంతో గొప్ప సంపద కలిగి ఉంటె తప్ప సాధ్యం కాదు. అంతే కాకుండా అత్యంత ఖరీదయిన రోమా పట్టణములో రెండు సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండటం అత్యంత పేదవారికి సాధ్యపడేది కాదు. కనుకనే పౌలు నుండి లంచం ఆశించి గవర్నరు అయినా ఫేలిక్సు తన పని వారిని అతనికి పరిచర్య చేయమని పంపేవాడు, మరియు  తనను అదే పనిగా పిలిపించి మాట్లాడే వాడు. కానీ పౌలు తన కుటుంబం ద్వారా తనకు వచ్చిన ధనమును ఎంత మాత్రము, తన నిమిత్తము వాడుకోకుండా, అతను తనను పిలిపించిన ప్రతి సారి, క్రీస్తును గురించి సువార్తను తెలిపాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు నీకు ఇప్పుడు సమృద్ధిని ఇవ్వలేదేమో! కానీ దేవుడు తన వాగ్దానాలు నెరవేరుస్తాడు, ఖచ్చితముగా నీకు సమృద్ధిని ఇస్తాడు. కానీ ఆ సమృద్ధిని నువ్వు ఎలా వాడ బోతున్నావు? ఆ ధనము, ఆ సమృద్ధి నీకు యజమానిగా ఉండబోతోందా? ఒక వేళ దేవుడు నీకు సమృద్ధిని ఇప్పటికే ఇచ్చి ఉంటె, ఏ విధముగా ఆ సమృద్ధిని వాడుతున్నావు? నీ గొప్పల కోసం, డంబికముగా బ్రతకటానికి వాడుతున్నావా? దేవుని పరిచర్య నిమిత్తం, అయన చిత్తానుసారం వాడుతున్నావా? లాజరు, మరియు ధనికుని ఉపమానం గుర్తుందా? పేద వారీగా ఉండమని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ సమృద్ధిని బట్టి మీ  ఆత్మీయ జీవితం నశించి పోకుండా  చూసుకోండి. గర్వముకు లోనయి, సాతాను వలలో చిక్కుకోకండి, మీ పట్ల దేవుని ఉద్దేశ్యాలు తప్పిపోకండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

4, డిసెంబర్ 2022, ఆదివారం

పక్కవారితో ఉండే ప్రమాదము!


క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత, ప్రతి రోజు మన విశ్వాసమును మెరుగు పరుచుకుంటూ ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి. ఈ క్రమములో మనకు సాతాను ద్వారా ఎన్నో రకముల శోధనలు కలిగే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యమయినది, పక్క వారితో స్నేహము. వీరు అన్యులు కావలసిన అవసరం లేదు. వీరు కూడా క్రైస్తవులుగా చెలామణి అవుతుంటారు, కానీ వీరి ఆత్మీయ జీవితం మనలను శోదించేదిగా ఉంటుంది. లోకపు అలవాట్లు పాటిస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ మనలను కూడా అటువైపు లాగే వారిగా ఉంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యముగా కొత్తగా విశ్వాసములోకి వస్తున్న కుటుంబము లేదా వ్యక్తి  వీరికి దూరముగా ఉండకపోతే  తిరిగి లోకములోకి జారిపోయే అవకాశం ఉంది. 

2 థెస్సలొనీకయులకు 3: "6. సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము."

అపొస్తలుడయినా పౌలు గారు థెస్సలొనీయ సంఘమునకు రాసిన రెండవ పత్రికలో ఈ వచనము ఏమని చెపుతుంది చూడండి. దేవుని వాక్యము చెప్పినట్లు కాకుండా అనగా క్రమముగా జీవించకుండా, ఇష్టాను సారముగా  అనగా లోక రీతిగా ప్రవర్తించే సహోదరుని నుండి దూరముగా వెళ్లిపోవాలని చెపుతుంది. వీరు మాటకు ముందు, వెనుక దేవునికి స్తోత్రం అని చెపుతారు, సంఘములో  గొప్పగా ప్రార్థిస్తారు. కానీ దేవుని వాక్యమును ఎంత మాత్రము పాటించారు. రోడ్డు మీదికి రాగానే చెడ్డ మాటలు మాట్లాడుతారు. మరియు ఇతరుల గురించి అదే పనిగా గుసగుసలాడుతారు. 

ఇటువంటి వారిని బట్టి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతె మనం కూడా వారిలాగే మారిపోయి, అదే  క్రైస్తవ విశ్వాసం అనుకుని వెనుకపడే అవకాశం ఉంది. క్రీస్తు విశ్వాసులుగా మనము నూతన సృష్టిగా చేయబడాలి,  నిత్యమూ శరీరనుసారము కాకుండా దేవుని  వాక్యానుసారముగా జీవించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నములో ఇటువంటి శరీరనుసారముగా జీవించే వారితో సాంగత్యము మనలను కూడా శోధించే అవకాశం ఉంది. తద్వారా మన ఆత్మీయ పరుగులో వెనుక పడిపోతాము. కనుక అట్టి వారిని నుండి దూరముగా తొలగిపొండి. 

1 కొరింథీయులకు 5: "11. ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్ర హారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను."

కొరింథీ సంఘమునకు పౌలు గారు రాసిన మొదటి పత్రికలో, ఇతరుల మీద వ్యామోహం అనగా  సినిమా తారలు లేదా ఇతర స్త్రీ, పురుషుల మీద వ్యామోహం ఉన్నవాడు,  డబ్బు మీద వ్యామోహం కలవాడు, విగ్రహారాధకుడు అనగా దేవుని కంటే ఇతరమయిన  విషయాలను ఎక్కువగా ప్రేమించే వాడు, ఇతరులను దుర్భాషలాడు వాడు, త్రాగుబోతు, ఇతరులను  మోసం చేసేవాడు  సహోదరుడయినను అనగా సాటి విశ్వాసి అయినా కూడా అట్టి వారి నుండి దూరముగా తొలగి పోవటమే కాకుండా, కలిసి భోజనము కూడా  చేయరాదని దేవుని వాక్యము చెపుతుంది. వీరి  ప్రవర్తన మనలను శోధించి మన ఆత్మీయతను  బలహీన పరుస్తుంది. 

మనలో చాల మంది ఎదుటి వారిని మార్చాలి, లేదా వారిని ఉద్దరించాలి అన్న ఆత్రము కలిగి  ఉంటారు. ముఖ్యముగా కొత్త విశ్వాసులు అటువంటి ఆలోచనలకూ దూరముగా ఉండాలి. వారిని గురించి  భారం ఉంటె ప్రార్థించండి, మరియు సంఘ పెద్దలకు చెప్పి ప్రేమ పూర్వకముగా గద్దించండి. వారు క్రీస్తుతో పూర్తిగా అనుసంధానం  చేయబడని వారుగా ఉన్నారు. కనుక వారితో వాదనకు దిగి మీ విశ్వాసమును ప్రశ్నార్థకం చేసుకోకండి. ఇలాంటి వారికి వాక్యము బహుగా తెలిసి ఉన్నట్లయితే, వారు వక్రీకరించే వాక్యమును బట్టి మీరు మోసపోయే అవకాశం ఉంది. కనుక వీరికి దూరముగా వెళ్లిపోవటమే మీ ఆత్మీయతకు క్షేమము. 

1 సమూయేలు: 2: "17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. 18.  బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను."

ఇక్కడ ఏలీ కుమారులు దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఇతర విశ్వాసులను శోదిస్తూ ఉన్నారు మరియు దేవుని ఆగ్రహమునకు కారణముగా మారారు. అదే స్థలములో సమూయేలు ఏలీ యొక్క శిష్యరికములో యాజకులు ధరించే ఏఫోదును ధరించి దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటీ? సమూయేలు ఏనాడూ కూడా ఏలీ కుమారులను హెచ్చరించాలని చూడలేదు, కనీసం ఏలీ కి ఫిర్యాదు కూడా చేయలేదు. దేవుని  మందిరములో పడుకొనే వాడు. తన కన్న పెద్దవారు, తన గురువు కుమారులు అయినా వారు ఎంత చెడ్డగా ప్రవర్తించిన కూడా సమూయేలు ప్రభావితం కాలేదు. 

కొన్ని సార్లయినా వారు సమూయేలు ను అతి భక్తి పరుడు అని లేదా మరో రకముగా హేళన చేసే ఉంటారు కదా! సమూయేలు వారి మాటలకూ, చేష్టలకు లొంగిపోలేదు, వారి చెడ్డ కార్యాలలో పాలు పంచుకోలేదు. నిత్యమూ దేవుని సన్నిధిలో గడుపుతూ, ఏలీ కి దేవుని పరిచర్యలో సహాయపడుతూ దేవునికి ఇష్టమయిన ప్రవక్తగా ఎదిగాడు. పక్కనున్న నులి వెచ్చని విశ్వాసులను చూసి, వారు బాగానే ఉన్నారు కదా, ఇది చేస్తే ఏమౌతుంది, ఈ ఒక్కసారికి పర్వాలేదు లే అనుకుని వారు చేసే అక్రమ కార్యములు, వాక్య విరుద్దమయిన పనులలో వారితో కూడి విశ్వాసంలో వెనుకపడొద్దు. అదే విధముగా ఎవరో కొందరు సంఘ పెద్దలు వాక్యమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారని, మీ కన్న పాత విశ్వాసులు క్రమము లేకుండా ఉన్నారని వారిని బట్టి ఆ స్థాయికి పడిపోవద్దు. మన మాదిరి మన రక్షకుడయినా క్రీస్తు మాత్రమే! 

మత్తయి 5: "13. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పిన ఈ మాటలు ఒక్కసారి చూడండి. మనము లోకమునకు ఉప్పుగా ఉన్నాము. ఉప్పు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది! ముఖ్యముగా ప్రతి వంటను రుచిగా మారుస్తుంది. మనం ఎవరికయినా పరిచయం అయితే వారి జీవితంలో మనం రుచిగా మారాలి, కానీ ఇబ్బందిగా ఉండకూడదు (సామెతలు 25:17).  అలాగే ఉప్పు పదార్దములు పాడు కాకుండా కూడా ఉపయోగపడుతుంది. మనలను బట్టి మన పక్కవారు మంచి విషయాలు నేర్చుకోవాలి, కానీ మనలను బట్టి చెడి పోకూడదు, లేదా శోధించ బడకూడదు. ఉప్పు వంటి లక్షణాలు మనకు అలవాడాలంటే, దేవుని వాక్యము పాటించటమే మార్గము. 

యేసయ్య తనను అనుసరించమని చెప్పాడు తప్ప తనను విశ్వసించినా వారిని కాదు. కనుక మన పక్కవారిని బట్టి, వారి సూటి పోటీ, హేళన కరమయిన మాటలను బట్టి దేవుని పై మీకు ఉన్న ప్రేమను  తగ్గించుకోకండి. మిమల్ని హేళన చేసిన  వారికి మీకంటే  ఎక్కువగా వాక్యం  తెలిసి ఉండవచ్చు. కానీ వారి ప్రవర్తన వాక్యాను సారం ఉందా? లేదంటే, వారి నుండి తొలగిపోవటమే మీ ఆత్మీయతకు క్షేమము. దేవుని ప్రేమ మన లో లేని  నాడు  క్రీస్తు విశ్వాసులైన మనలను అన్యులు సైతం అసహ్యించుకొని, క్రీస్తుకు దూరముగా, సువార్తకు వ్యతిరేకముగా మారిపోయే అవకాశం ఉంది. దేవుడు మనలను రక్షించుకున్నది, అయన ప్రేమను మనం లోకానికి  చూపటానికే కానీ,  లోకము పట్ల  అనగా లోక  రీతుల పట్ల మన ప్రేమను  చూపటానికి కాదు. అంతే కాకుండా దేవుడు నిన్ను లెక్క అడిగేది నీ జీవితమును బట్టి కానీ పక్కవారిని బట్టి కాదు కదా!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

17, సెప్టెంబర్ 2022, శనివారం

యేసయ్య తో శిష్యరికము!


మనలో చాల మంది, యేసు క్రీస్తు మీద విశ్వాసము కనపరచవచ్చు, ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించే వారు కూడా ఎంతో మంది ఉండవచ్చు. కానీ అయన మీద విశ్వాసము మరియు రక్షకునిగా ఆయనను అంగికరించటం మాత్రమే క్రైస్తవ జీవితం కాదు. సంపూర్ణముగా ఆయనకు శిష్యులుగా మారిపోవాలి. అనగా మనలను మనం ఉపేక్షించుకోవాలి, అయన కన్న, అయన కార్యము కన్న మనకు ఏది కూడా ఎక్కువ కాకూడదు. అన్నింటిలో ఆయనకు సంపూర్ణముగా ప్రథమస్థానం ఇవ్వవలసిందే. 

లూకా 14: "26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27.  మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు."

ఈ వచనము సరిగా అర్థం చేసుకోలేని కొంతమంది, అన్యులు మరియు విశ్వాసులు సైతం క్రీస్తును స్వార్థపరుడిగా మరియు, తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేయుమన్న వ్యక్తిగా అపార్థం చేసుకుంటారు. ఇక్కడ యేసయ్య చెపుతున్న మాటలు, అయన బోధనలకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ, వాటిని పాటించాలని చెపుతున్నారు. దేవుని బలిదాన నియమం ప్రకారం దైవ కుమారుడయినా క్రీస్తు మానవాళి కోసం సిలువలో మరణించి, లేచి వారికి నరకాగ్నిని తప్పించాలని భూమి మీద శరీర దారిగా జన్మించాడు. మన శరీరంలో ఉద్బవించే పాపమును బట్టి మనం నరకాగ్నికి కాకుండా తనతో నిత్య జీవితం పొందటానికి పాటించవలసిన నియమాలు అన్నియు  అయన బోధించాడు. ప్రతి వారు, వారి పాపమును బట్టి, క్రీస్తును అంగీకరించిన విధానము బట్టి తీర్పు పొందుకుంటారు. కానీ వారి తల్లి, తండ్రి మంచితనము బట్టి ఎవరు కూడా పాప శిక్షను తప్పించుకోలేరు. 

కనుకనే క్రీస్తు ప్రతి ఒక్కరు తమ రక్షణ నిమిత్తం అయనను వెంబడించాలని అనగా అయన బోధలు పాటించాలని సూచిస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులను బట్టి, వారికి ఉన్న అభ్యంతరాలను బట్టి ఆయనను త్రోసి పుచ్చి రక్షణ కోల్పోవద్దని యేసయ్య మనలను హెచ్చరిస్తున్నాడు. తమ ప్రాణమును లెక్క చేయని వారు అయన శిష్యులనబడుతారు అంటున్నాడు యేసయ్య! ప్రాణమును ఎందుకు లెక్క చేయకూడదు? మన శరీరము పాపమునకు నిలయముగా ఉన్నది. మనలను శోధిస్తూ, అన్ని రకాల కోరికలను మనకు కలిగిస్తుంది. మనలను మనం ఎక్కువగా, ప్రేమించుకుంటే లేదా శరీరమును లొంగదీయకుంటే పాపములో పడిపోయి క్రీస్తు బోధనలు నిర్లక్యం చేసే స్థితికి వెళ్ళిపోతాము. 

అదే విధముగా "తమ సిలువను మోసుకుంటూ ఆయనను వెంబడించని వారు అయన శిష్యులుగా చెప్పబడ లేరు" అంటున్నాడు యేసయ్య. సిలువ, తగ్గింపుకు సాదృశ్యముగా ఉన్నది. అనగా ఎవరు తమను తాము తగ్గించుకొంటూ, గర్వపడకుండా, అతిశయపడకుండా మరియు ఇతరులను ద్వేషించకుండా జీవించాలన్న తపన కలిగి ఉంటారో, వారే అయన నిజమయిన శిష్యులు అని యేసుక్రీస్తుల వారు ఈ మాటలు చెపుతున్నారు. వీటిని పాటించగలము లేదా ఆ విధముగా జీవించాలన్న తపన కలిగిన వారు మాత్రమే ఆయనను అంగీకరించాలని క్రీస్తు సెలవిస్తున్నారు. లేదంటే ఆయనకు ఇష్టం లేని వేషధారులుగా లేదా నులివెచ్చని స్థితిగల వారిగా మిగిలిపోతాము.  

క్రీస్తును ద్వేషిస్తూ, క్రైస్తవులను హింసిస్తూ తిరిగిన సౌలు అనబడే పౌలు గా మారిన వ్యక్తిని గురించి మనం ఎరిగి ఉన్నాము కదా? ఈ సౌలు తన యూదా మతమందు నియమనిష్టలు కలిగి, మతపరమయిన గర్వంతో ఉండేవాడు. ఇతని అంగీకారంతో స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అటువంటి సౌలు, ఒక్కసారి క్రీస్తు దర్శనం పొందుకున్న తర్వాత వెనుకకు తిరిగి చూడలేదు. క్రీస్తును గూర్చిన సువార్త సేవ చేస్తూ, తనను తానూ తగ్గించుకొని, అల్పుడిగా ఎంచుకొని, పౌలు అని పేరు మార్చుకున్నాడు. ఎన్ని రకాల కష్టాలు ఎదురయినా, యేసు క్రీస్తు దేవుడనే సత్యమును బోధించటం ఆపలేదు. 

అటువంటి పౌలుకు అనారోగ్యం ఉంటే, దేవుడు ఆయనను స్వస్థ పరచలేదు (2 కొరింథీయులకు 12:8-9), దానిని బట్టి కూడా పౌలు గారు సంతృప్తిని వ్యక్తం చేశారు తప్ప ఎక్కడ కూడా సణుగుకొలేదు, విసుగు పడలేదు. మరియు అగబు అను ప్రవక్త యెరూషలేము లోని యూదులు తనను చంపటానికి ఆయనను అన్యులకు అప్పగిస్తారని ప్రవచనము చెప్పినప్పుడు అక్కడ ఉన్న అందరు పౌలును యెరూషలేముకు వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. అప్పుడు "ప్రభువు నామము నిమిత్తము బంధింపబడుటకు మాత్రమే కాదు చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని" చెప్పారు పౌలు గారు (అపొ. కార్యములు 21:13). అటువంటి మారుమనస్సు, సంతృప్తి, దేవుని కోసం తెగింపు మనలో ఉన్నాయా? 

యేసయ్య చెప్పే భవిష్యత్తు ప్రవచనాలు పూర్తిగా అర్థం కాకపోయినా కూడా ఆయనను  క్రీస్తుగా విశ్వసించినా శిష్యులను చూసి మనం ఏమి నేర్చుకోవాలి? యేసయ్య "నా శరీరము తినకుండా, రక్తము తాగకుండా మీకు రక్షణ లేదు" అని చెప్పగానే, అప్పటి వరకు అద్భుతాలు చూసి, అయన పెట్టిన రొట్టెలు తిని, స్వస్థతలు పొందుకొన్న జనం ఒక్కసారిగా, ఆయనను వెంబడించటం మాని వేశారు. కానీ అయన శిష్యులు మాత్రం ఆయనతోనే ఉన్నారు. ఆయనే దైవకుమారుడు, తమను కాపాడటానికి వచ్చిన క్రీస్తు అని నమ్మారు (యోహాను 6:66). కానీ మనం, పది మందిలో క్రీస్తు విశ్వాసులము అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతాము? అసలు మనం సిగ్గు ఎందుకు పడుతామో తెలుసా? సాతానుకు తెలుసు మనం క్రీస్తును జనం ముందు అంగీకరించకుంటే, క్రీస్తు తండ్రి ముందు మనలను అంగీకరించాడని, అందుకే మనం క్రీస్తును అంగీకరించకుండా, మనలో సిగ్గును రేపుతాడు. 

పేతురు అంగీకరించక పోయిన యేసయ్య క్షమించాడు కదా! అనుకోవద్దు. అప్పుడు వారికి పరిశుద్దాత్మ ఇవ్వబడలేదు, మరియు యేసయ్య, పేతురు యొక్క ఆత్మీయ గర్వమును తీసివేయటానికి, ఆ శోధనను అయన మీదికి  అనుమతించాడు. అందును బట్టి పేతురు గారు, తన ఆత్మీయ గర్వం తొలగించుకొని, దేవుని శక్తి మీద ఆధారపడి, ఎంతగానో సువార్త సేవలో వాడబడ్డారు. అందును బట్టి  తన శరీరంలో జీవించినంత కాలం, ఆఖరి సమయము వరకు సాటి వారిని ప్రేరేపిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చారు పేతురు గారు (2 పేతురు 1:13). అటువంటి వారే మిగిలిన శిష్యులు కూడా. తమ ప్రాణముల కంటే, యేసు క్రీస్తు సజీవుడు, నిజమయిన రక్షకుడు అని చెప్పటమే, దేవుని చిత్తము అని నమ్మి, హత సాక్ష్యులుగా మిగిలి పోయారు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుని కోసం హత సాక్షిగా మార్చబడటం కన్న అదృష్టం ఏముంటుంది? అటువంటి పరిస్థితి వస్తే, దేవుడే మనకు తగిన కృపను, విశ్వాసమును అనుగ్రహిస్తాడు. కానీ ఏనాటికి కూడా డబ్బు సంచిని ఆశించి యేసయ్యను వెంబడించిన యూదా మాదిరి శిష్యులుగా మనం మారకూడదు. యేసయ్య రాత్రంతా ప్రార్థించి, పన్నెండు మందిని శిష్యులుగా ఎన్నుకున్నాడు (లూకా 6:12). అందులో యూదా కూడా ఒక్కడు. కానీ అతను స్వార్థంతో దేవుడు ఇచ్చిన ధన్యతను పోగొట్టుకున్నాడు. ధనం మీద వ్యామోహముతో, చివరకు క్రీస్తును అప్పగించాడు. 

అంతే కాకుండా చేసిన పాపమును బట్టి, దేవుని వద్ద పశ్చాత్తాప పడకుండా, సాతాను ప్రేరణను బట్టి, తనను తానూ నిందించుకొని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు, చివరకు సాతాను చెరలోకి వెళ్ళి పోయాడు. నీ పాపం నిన్ను వెక్కిరిస్తోందా? బలహీనమయిన ఆ క్షణాలు నిన్ను బాధిస్తున్నాయా? నిజమయిన క్రీస్తు శిష్యుడి లక్షణం, పశ్చాత్తాప పడటం! దేవుని క్షమాపణ పొందుకొని, అయన శక్తి చేత దాని నుండి విడుదల పొందుకోవటం. తిరిగి వాటి వైపు కన్నెత్తి కూడా చూడక పోవటం. అది లేదు, ఇది లేదు అని సణుగకుండా దేవుని చిత్తమును అంగికరించి, నిత్యము ఆయనలో ఆనందించటము. నిన్ను చూసి, నలుగురు క్రీస్తు శిష్యులుగా మారాలి, నీ జీవితమే ఒక సువార్త కావాలి. అటువైపు అడుగులు వేయు, నడపటానికి నిన్ను ఎన్నుకున్న ఆయనే ఉన్నాడు!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

10, సెప్టెంబర్ 2022, శనివారం

దేవుణ్ణి చిన్నబుచ్చుతున్నావా?

ఇదివరకు మనం చాల సార్లు దేవుడు మన జీవితాలలో శోధనలకు అనుమతినిచ్చి మనలను విశ్వాసములో బలపరుస్తాడు అని తెలుసుకున్నాము కదా! అంతే కాకుండా మన పట్ల తన ఉద్దేశ్యాలు నెరవేర్చుకునేలా ఆ పరిస్థితులను ఉపయోగించుకొని మనలను అటు వైపుగా నడిపిస్తాడని కూడా తెలుసుకున్నాము! అయితే దేవుడు మన ఆత్మీయ స్థితిని ఎరిగి ఉన్నాడు, అందును బట్టి మనకు తగిన శోధనలు అనుమతిస్తాడు.  అనగా శోధనలు అనేవి పరీక్ష పత్రాలు అనుకుంటే, దేవుడు విశ్వాసములో మన తరగతిని బట్టి ఆ పరీక్షను రాయటానికి మనకు అనుమతిస్తాడు.  అంతే కాకుండా శోధనలు జయించటానికి మార్గమును కూడా అనుగ్రహిస్తాడు. 

1 కొరింథీయులకు 10:"13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప బడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును."

ఈ వచనములో పౌలు గారు కొరింథీ సంఘమును ఏమని ఆదరిస్తున్నారు చూడండి. మనము సహింప లేని ఎటువంటి శోధనను దేవుడు మన మీద అనుమతించాడు, మరియు సహింపటానికి, దాని నుండి తప్పించుకోవటానికి మార్గమును కూడా కలుగ జేస్తాడు. అయితే మనము కలిగే శోధనలను బట్టి,  దేవుడు మన మీద ప్రేమలేని వాడిగా, మన పాపములను బట్టి మనలను శిక్షిస్తున్నాడు అనుకుంటూ ఉంటాము. మన పాపములను బట్టి దేవుడు శిక్షిస్తూ పొతే, మనం ఒక క్షణం కూడా నెమ్మదయినా జీవితం గడపటానికి అర్హులం కాము. 

దేవుడు ప్రేమలేని వాడయితే, మనకు విశ్వాసం ఇచ్చి, క్రీస్తు నీతిని మనకు ఆపాదించి, నిత్య జీవితానికి సిద్ధపరచే వాడు కాదు కదా! ఎన్ని సార్లు అయన ప్రేమ చొప్పున సాధ్యం కావు అనుకున్న పనులను సాధ్యపరచి, మన అవసరాలు తీర్చాడో మళ్ళి గుర్తు చేసుకుందామా? రెప్పపాటులో కలిగే ప్రాణాంతకమయిన ప్రమాదాలు ఏలా తప్పించి సజీవుల లెక్కలో ఉంచాడో మరచిపోకుండా ఉందామా? దేవుని సార్వభౌమాధికారాన్ని బట్టి మనలను ఎన్నుకొన్నాడు, మన చేత జరిగించవలసిన కార్యములను బట్టి మనలను ఈ పరిస్థితుల వెంబడి నడిపిస్తున్నాడు. అయన బిడ్డలము అయినా మన జీవితాలలో ప్రతి సంఘటన అయన చిత్తము లేకుండా జరగటం లేదు. 

యోబు 1: "10. నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది."

ఈ వచనంలో సాతాను దేవునితో అంటున్న మాటలు వినండి! "యోబుకు దేవుడంటే అంతగా భయభక్తులు కలిగి ఉండటానికి కారణం, దేవుడు తన చుట్టూ, తన కుటుంబము చుట్టూ మరియు అతని సమస్త సంపద చుట్టూ కంచె వేసి రక్షిస్తున్నాడు, కనుకనే యోబు దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు"  అని  అంటున్నాడు. మనం కూడా దేవుని దృష్టిలో  యోబు వంటి వారమే, మన చుట్టూ కూడా దేవుడు తన కంచెను ఉంచి కాపాడుతున్నాడు. కానీ అది గ్రహించని మనము ఏదయినా ఇబ్బంది రాగానే, ఎక్కడయినా ఆస్తి నష్టం, ధన నష్టం కలుగగానే దేవుడు మనతో లేడు, లేదంటే దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు అనుకుంటాము. తద్వారా దేవుని మీద విశ్వాసం కోల్పోయి అయన మన మీద అనుమతిస్తున్నా శోధనలు మనకు తగినవి కావని చెప్పుట ద్వారా దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలను చిన్న బుచ్చుతున్నాము. 

సాతాను మన మీదికి శోధనలు తేవటం ద్వారా  మనలను విశ్వాసములో నశింప చేయాలనీ ప్రయత్నిస్తుంటాడు. కానీ దేవుడు సాతాను శక్తిని కూడా నియంత్రించే సర్వ శక్తిమంతుడు, కనుక మన మీద సాతాను ఎటువంటి శోధనను, ఎంత మోతాదులో ఇవ్వాలి అని సాతానుకు అనుమతిని ఇస్తున్నాడు (యోబు 1:12). తద్వారా మనలను ఆత్మీయతలో, విశ్వాసములో బలపరుస్తూ మనలను మరింతగా తనకు దగ్గర చేసుకుంటున్నాడు. ఈ సాతాను శోధనలు తాటాకు శబ్దము వంటివి మాత్రమే, ఇవ్వని దేవుని చిత్తములో లేకుండా జరగటం లేదు. ఏ తండ్రి అయినా బిడ్డలు నశించిపోయేలా కష్టపెడుతాడా? మన కోసం ఘోరమయిన సిలువ మరణం పొందిన, ఈ తండ్రి మీద నమ్మకం లేదా? నాకే ఎందుకు ఈ కష్టాలు అని చిన్నబుచ్చుకొని అలిగిపోతావా?

2 రాజులు 6: "17. యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను."

ప్రవక్త అయినా ఎలీషాను బందించాలని సిరియా రాజు సైన్యం పంపిన వేళ, ఎలీషా సేవకుడు భయపడుతుంటే, ఎలీషా అతనికి ధైర్యం చెప్పి, ఆ సేవకుని కండ్లు తెరవమని దేవునికి ప్రార్థించగానే, ఆ సేవకునికి అదృశ్యముగా ఉన్న పరలోక సైన్యము కనపడింది. నీ చుట్టు కూడా సమస్యలు తప్ప మరేమి కనపడటం లేదేమో! ఏ విధమయిన పరిష్కారం నీకు దొరకటం లేదేమో. కానీ దేవుని సైన్యం నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతోంది,  అవిశ్వాసముతో నీకు కలిగే ఆందోళన, భయం నిజం కావు. మన కన్నా ముందే మన దేవుడు నడుస్తున్నాడు (ద్వితీయోపదేశకాండము 31:8) అన్న విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. 

ఇక్కడ ఎలీషా అదే విశ్వాసముతో ఉన్నాడు, కనుకనే ఎదురుగా ఎంత గొప్ప సైన్యం ఉన్న కూడా భయపడకుండా, ఆందోళన పడకుండా ఉన్నాడు. కానీ అతని సేవకుడు, కేవలం ఎదురుగా ఉన్న సైన్యమును మాత్రమే చూసి, అవిశ్వాసముతో భయపడ్డాడు. దేవుడు మనలను ఏర్పరచిన దినము నుండే మనలను కాపాడటానికి కొందరు రక్షకభటుల వంటి దేవ దూతలను మన చుట్టూ ఉంచుతున్నాడు (మత్తయి 18:10, హెబ్రీయులకు 1:14), అయన అనుమతి లేకుండా ప్రమాదము, నష్టము మనకు సంభవించదు. మనకు కనపడని సైన్యం మనలను  నిత్యము కాపాడుతోంది, కాబట్టి అవిశ్వాసముతో  విసుగుకొని దేవుణ్ణి చిన్నబుచ్చ వద్దు. 

రోమీయులకు 8: "17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. 18. మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను."

దేవుని పిల్లలయిన మనలను దేవుడు తన కుమారుడయినా క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులను చేయుట ద్వారా తన మహిమకు వారసులుగా మారుస్తున్నాడు. ఈ శ్రమల ద్వారా మన పాప శరీరము యొక్క చిత్తమును, క్రియలను నశింపచేస్తున్నాడు. దేవుని మీద విశ్వాసమును పెంపొందించుట ద్వారా పరలోకములో మన స్వాస్థ్యమును పెంచుతూ, నిత్యత్వములో మనం నిలవటానికి అర్హులుగా రూపాంతరం చేస్తున్నాడు.  ఇప్పుడు కలిగే ఈ శ్రమలు ఆ మహిమ ముందు, ఆ నిత్యత్వము ముందు ఎంత మాత్రము ఎన్నతగినవి కావు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుని అనుమతిని బట్టి సాతాను చేత పీడించబడుతున్న యోబుతో అతని భార్య "ఇంకా ఎందుకు ఈ విశ్వాసము? దేవుణ్ణి దూషించి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపో" అన్నప్పుడు యోబు ఏమన్నాడు? "మూర్ఖురాలిగా మాట్లాడకు, దేవుని నుండి మేలులు మాత్రమే పొందుకోవాలా? కీడు పొందుకోకూడదా?" అని చెప్పి దేవుణ్ణి ఎంత మాత్రము దూషించలేదు, పాపం చేయలేదు (యోబు 2:9-10). మన నుండి కూడా దేవుడు అటువంటి విశ్వాసమును,  సాక్ష్యమును కోరుకుంటున్నాడు. ఆయనకు తెలియని మన కష్టాల? అయన మన మీద అనుమతించని పరిస్థితులా? నీ విశ్వాసం వదులుకొని, ఆ తండ్రిని చిన్నబుచ్చ వద్దు, నిత్యత్వము పరుగులో వెనుకపడి పోవద్దు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

1, సెప్టెంబర్ 2022, గురువారం

భక్తి హీనులు బాధ పేడుతున్నారా?

ఇదివరకు దేవుడు మన జీవితాలలో కష్టాలూ అనుమతించి, మనలను విశ్వాసములో ఎదిగిస్తాడు అని తెలుసుకున్నాము కదా! అయితే కొన్ని సార్లు పరిస్థితులను మాత్రమే కాకుండా, మన చుట్టూ ఉన్న జనులను మనకు వ్యతిరేకముగా లేపి, వారిని మనకు ఇబ్బందులు కలిగించే లాగున అనుమతిస్తాడు. వారు అవిశ్వాసులు అయినా వారు కూడా కావచ్చు. ఆ విధమయిన భక్తి హినులను దేవుడు ఎందుకని మన మీద ఆధిపత్యం చేసేవారిగా నిలబెడుతున్నాడు లేదా మన కన్న ఎక్కువ అశీర్వదిస్తున్నాడు అని మనలో చాల మంది విశ్వాసులు భాధపడుతుంటారు. చాల సార్లు ఆ ఆశీర్వాదాలు, ధనముకు సంబంధించినవిగా, మరియు లోకములో ఘనతను పొందుకొనేవిగా ఉంటాయి. వీటిని పొందుకోవటం ద్వారా జనులు దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ, సాతాను చేతిలో చిక్కుకొని నాశనమునకు దగ్గరవుతున్నారు. 

ఆనాడు సాతాను యేసయ్యను, నాకు నమస్కారం చేసి నన్ను ఆరాదించు నీకు లోకములో అన్ని ఘనతలు ఇస్తాను అని ఆశ పెట్టాడు కదా? ధనము, ఘనత అన్ని కూడా సాతాను అధీనములో ఉన్నాయి. కనుకనే, వాటిని  వాడు భక్తి హీనులకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు నిత్యమూ గర్వపడుతూ, జీవము కలిగిన దేవునికి దూరముగా ఉండులాగున ఏర్పాటు చేస్తున్నాడు సాతాను. అటువంటి వారిని బట్టి ఆయాసపడుతూ, సమయానుకూలముగా నీకు సహాయం చేస్తున్న దేవుణ్ణి అవమానించటం ఎంతవరకు సమంజసం? అయ్యో వారి వలె నాకు అది లేదు ఇది లేదు అనుకోవటం, మన దేవునికి అవమానం కదా? మన పిల్లలు ఇతర పిల్లలను చూసి, వారికి అది ఉంది ఇది ఉంది అని మన మీద విసుగుకుంటే ఎంత బాధపడుతాము? 

కానీ దేవుడు మనకు ఇచ్చిన ఎంతో ఉన్నతమయిన విశ్వాసము తద్వారా మనకు ఇచ్చిన రక్షణ, నిరీక్షణను గుర్తించకకుండా ఆ భక్తి హీనులను బట్టి బాధపడటం మనకు తగిన ప్రవర్తనేనా? చాల సార్లు దేవుడు మనలను భక్తి హీనులకు అప్పగించి, మన ద్వారా తనకు మహిమను, ఘనతను తెచ్చుకుంటాడు. అయన మహిమను చాటించె పాత్రగా ఉండుట కన్న శ్రేష్ఠమయినదా? ఆ పెద్ద కారులో ప్రయాణించటం? అయన సన్నిధిని నిత్యం అనుభవించటం కన్న ఉన్నతమయినదా! ఆ ఖరీదయిన బంగ్లాలో జీవితం? ప్రతి పూట, ప్రతి అవసరం అయన నుండి, ఆయన చిత్తముగా పొందుకోవటం కన్న ధన్యత! విచ్చలవిడిగా ధనం ఖర్చు చేయటం? షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోల ఉద్ధంతం గుర్తుందా? దేవుడు భక్తి హీనుడయినా రాజు నెబుకద్నెజరుకు వారిని ఎందుకు అప్పగించాడు? దేవుడు తలచుకుంటే వారిని ఎలాగయినా తప్పించవచ్చు కదా? 

అటువంటి స్థితిలో వారిని ఉండకుండా చేయవచ్చు కదా! అని వారు అనుకోలేదు. ధైర్యముగా దేవుని కోసం నిలబడ్డారు. కనుకనే దేవుడు వారిని కాపాడుకున్నాడు, తద్వారా వారి దేవుడే నిజమయిన దేవుడు అని ఆ భక్తి హీనుడయినా రాజు చేత ప్రకటింపబడి, కీర్తించబడ్డాడు (దానియేలు 3: 20-30). మరియు షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలను బబులోను సామ్రాజ్యంలో హెచ్చించేలా చేశాడు దేవుడు.  ఇటువంటి అదృష్టం మనకు వస్తే కాదని, పారిపోతామా? ఎప్పుడు ఎవరు మనలను కొడుతారా? ఏ ఆపదలో పడిపోవాలా? అని ఎదురు చూడమని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు, కానీ దేవుని మహిమను చాటించటానికి అవకాశం ఉంటే, కాస్త కష్టానికి ఓర్చుకోలేమా? మనలను బాధించే వారికి క్రీస్తు ప్రేమను చూపుట ద్వారా, వారిని సిగ్గుపడేలాగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 3:16). తద్వారా వారు క్రీస్తు క్షమా గుణం మన ద్వారా రుచి చూచి దేవుని చిత్తములో ఉంటె రక్షణ పొందుకొనే అవకాశం ఉంది కదా!

అయితే కొన్ని సార్లు దేవుడు తన మార్గంలో మనలను నడపటానికి భక్తి హీనులకు మనలను అప్పగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను బబులోను వారికి ఎందుకు అప్పగించాడు? ఎందరో ప్రవక్తలు వారి విగ్రహరాధనను ఖండిస్తున్న కూడా లెక్క చేయలేదు. యిర్మియా ప్రవక్త ద్వారా ఎంతగా హెచ్చరించిన కూడా వారు అబద్ద ప్రవక్తలను నమ్మి దేవుని మాటలు పెడచెవిన పెట్టారు. కనుకనే దేవుడు బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వారిని నడిపించాడు. అక్కడ దానియేలు మరియు పైన చెప్పుకున్న షద్రక్, మేషాక్ మరియు అబేద్నెగోలను లేపి వారి ద్వారా తన మీద విశ్వాసము పెంపొందేలా చేసుకున్నాడు. తద్వారా తరువాతి తరము వారు, విగ్రహారాధనను పూర్తిగా మర్చిపోయేలా చేసాడు. మనలో ఉన్న అవలక్షణాలు పోవటానికి దేవుడు మనలను కూడా అటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. అటువంటప్పుడు మనలను మనం మార్చుకుంటూ దేవునికి మరింతగా దగ్గర కావాలి. 

అపొస్తలుల కార్యములు 16: "30. వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. 31. అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి 32. అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి."

లూకా గారు రాసిన పౌలు గారి పరిచర్యలో జరిగిన ఈ గొప్ప సంఘటనను ఒక్కసారి పరిశీలిద్దాము. దేవుని వాక్యమును చెపుతున్న పౌలు, సిలయులను నిరసించి, వస్త్రములు లాగివేసి  బెత్తములతో కొట్టి చెరసాలలో వేసినప్పుడు, పౌలు మౌనముగా బాధను అనుభవించాడు. కానీ అదే పౌలు తర్వాత "తాను రోమీయుడనని" ప్రకటించుకొన్నాడు, తద్వారా విచారణలో  కొంత ఉపశమానం పొందుకున్నాడు (అపొస్తలుల కార్యములు 22:27-28). ఇక్కడ మొదటి సంఘటనలో పౌలు మౌనముగా ఉండుట ద్వారా,   జైలులో దేవుని మహిమను ప్రత్యక్ష పరచి, ఆ జైలు అధికారి మరియు అతని కుటుంబము రక్షణ పొందుకొనేలా దేవుని ద్వారా వాడుకోబడ్డాడు. ఇతరులు మనలను శోదిస్తున్నప్పుడు, చాల సార్లు మన గొప్పను ప్రకటించుట ద్వారా దేవుని కార్యములకు అడ్డుగా మారే అవకాశం ఉంది. 

కనుక మన గొప్పను గోప్యముగా ఉంచుట ద్వారా లేదా కలిగే శోధనకు తలొగ్గటం ద్వారా దేవుని కార్యములు జరిగించే వారిగా ఉంటాము. ఇక్కడ  పౌలు భక్తి హినుల ముందు దీనుడిగా ఉండుట ద్వారా ఆ జైలు అధికారికి రక్షణ  ప్రకటించే అవకాశం కలిగింది.  ఎక్కడ  మౌనముగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అన్న జ్ఞానము పౌలుకు ఎలా కలిగింది? నిత్యమూ తానూ దీనుడిగా ఉన్నాడు కనుక పరిశుద్దాత్మ దేవుడు తనను నడిపించాడు, కనుకనే అంతగా దేవుని చేత వాడుకోబడ్డాడు. సువార్త పరిచర్య జరిగేది దీనులుగా ఉన్నవారి వారి ద్వారానే గాని డంబికాలు పోతూ, ఇతరుల మీద తిరగబడే వారి ద్వారా కాదు. 

హబక్కూకు 2: "1. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా"

ప్రియాయమయిన సహోదరి, సహోదరుడా! ఈ వచనములో ప్రవక్త అయినా హబక్కూకు కూడా మనవలెనే  భక్తి హీనుల దురాగతాలను బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దేవా! ఇంకా ఎంత కాలము ఇటువంటి అన్యాయమును చూస్తూ ఊరకుందువు, అని దేవుని ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు. తర్వాతి వచనములలో దేవుడు హబక్కూకు తో జరుగ బోయే విషయాలను వివరించాడు. దుష్టులయిన వారిని తానూ ఎలా శిక్షించబోతున్నాడో స్పష్టంగా ఆ ప్రవక్తకు తెలియజేశాడు (హబక్కూకు 2:3-18). మనం అనుకోవచ్చు, "మనలను బాధిస్తున్న వారిని దేవుడు వెంటనే శిక్షించవచ్చు కదా! విశ్వాసులను వేధిస్తూ సువార్తను తృణీకరిస్తున్న వారిని నశింప చేయవచ్చు కదా" అని. కానీ అన్ని సక్రమముగా జరుగుతుంటే మన విశ్వాసానికి గొప్పతనం ఏముంటుంది? 

సాతాను ముందు, దేవుడు "అదిగో! నా ఫలానా  బిడ్డను చూశావా! ఎంత ఓర్పుతో నా మీద విశ్వాసం చూపుతున్నాడో!" అని నిన్ను చూపించి గర్వపడాలి కదా. విధవరాలు, అన్యాయస్తుడయినా న్యాయాధిపతి ఉపమానం గుర్తుందా? తనకు మొఱ పెడుతున్న విధవరాలుకు, న్యాయం చేసిన అన్యాయస్తుడయినా న్యాయాధిపతి కన్న అనంతముగా న్యాయమయిన వాడు మన దేవుడు. తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేయకుండా ఉంటాడా? వెంటనే వారికి తగిన న్యాయం చేస్తానని అంటున్నాడు (లూకా 18:7-8). ఓర్పు వహించండి, తగిన శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను హేళన చేసిన వారే సిగ్గుపడేలా చెయ్యగలడు. కనుక భక్తి హీనులను బట్టి బాధపకుండా దేవుని మీద ఆధారపడి, అయన చిత్తమును జరిగిద్దాము! 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

26, ఆగస్టు 2022, శుక్రవారం

కష్టపడకూడదని కష్టాలు తెచ్చుకుంటావా?


దేవుడు మనకు ఇచ్చిన విశ్వాసమును బట్టి ఆయనలో కొనసాగుతున్నాము. అయితే మన విశ్వాసము మరింతగా బలపడులాగున దేవుడు మన జీవితాలలో వివిధ రకాలయిన పరిస్థితులగుండా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే, ఫలానా దేవుణ్ణి నమ్ముకుంటే ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది, అని తెలిస్తే ప్రతి ఒక్కరు ఆ దేవుణ్ణే నమ్ముకుంటారు. మన దేవునికి కావలసింది అటువంటి విశ్వాసులు కాదు. మనస్ఫూర్తిగా ఆయనను నమ్ము కొనే, ఏమి ఆశించకుండా ఆయనను ప్రేమించేవారు కావాలి. కనుకనే తన అనుకున్న వాళ్ళను విశ్వాసంలో బలపరుస్తాడు. మనం కోరుకున్న కొన్ని ఆశీర్వాదాలు మనకు ఇవ్వకుండా ఆపివేస్తాడు. 

ఇది ఎటువంటిదంటే! ఒక హాస్టల్ వార్డెన్ ఉందనుకుందాం. హాస్టల్ లో పిల్లలందరికి ఐస్ క్రీమ్  ఇస్తున్నారు, కానీ తన కుమారుని దగ్గరికి వచ్చేసరికి ఇవ్వద్దు అని చెప్పింది. ఆ బిడ్డ కోపంగా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత తన ఆఫీస్ రూమ్ కు పిలుచుకొని, పోయిన వారం తనకు జలుబు చేసి వచ్చిన జ్వరం గుర్తుచేసి తానూ ఎంతగా భాదపడ్డాడో వివరించింది. బిడ్డకు ఇష్టమయిన మిరపకాయ బజ్జిలు హోటల్ నుండి తెప్పించి, ప్రేమతో తినిపించింది. కుమారుని ఇష్టం ఐస్ క్రీమ్ తినాలని, కానీ తల్లి భయం బిడ్డ ఎక్కడ మళ్ళి జబ్బుపడి నరకయాతన పడుతాడో అని. అందుకే  కుమారుని ఇష్టం కాదని, మరో విధముగా తృప్తి పరచింది. 

దేవుడు మన పట్ల కూడా అటువంటి ఆతురతను కలిగి ఉన్నాడు. మనం ఆత్మీయకంగా జబ్బుపడకూడదని, మనం ఆయనకు దూరంగా వెళ్ళకూడదని, కొన్ని మనకు దూరంగా ఉంచుతున్నాడు. మనం లోకంలో ఎంతగా సంపాదించిన చివరకు మిగిలేది, మనం తీసుకోని పోయేది ఏది లేదు. కానీ అన్నింటి కంటే ముఖ్యమయిన మన రక్షణను కోల్పోతే ఏమిటి లాభం (మత్తయి 16: 26)   అని యేసయ్య చెప్పిన మాటలు గుర్తున్నాయా? అయితే ఈ లోక ఆశలు మనలను విశ్వాసంలో బలహీన పరచి, దేవునికి మన పట్ల లేని ఉద్దేశ్యాలు నెరవేర్చుకోవాలని మనలను ప్రేరేపిస్తూ మన ఆత్మీయతను దెబ్బ తీస్తాయి. తద్వారా ఎవరిని ఎప్పుడు మింగుదునా అని  గర్జించు సింహం వలె తిరుగుతున్నా సాతాను కు చిక్కి , దేవునికి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది. 

బైబిల్ లో ఎంతో ప్రాముఖ్యమయిన తప్పిపోయిన కుమారుడి ఉపమానము గుర్తుందా? (లూకా 15:11-32) తండ్రి దగ్గర పని చేసుకుంటూ, వేళకు భోజనం చేయటం అతనికి నచ్చలేదు. ఇంకా ఎదో సాధించాలి, ఎన్నో అనుభవించాలి అనుకున్నాడు. తండ్రికి విరుద్ధముగా దూర దేశం ప్రయాణించి, ఇష్టానికి జీవించి, చివరకు ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేక పోయాడు. అభివృద్ధిని ఆశించటం తప్పు అని చెప్పటం ఉద్దేశ్యం కాదు, కానీ అభివృద్ధి కోసమని దేవునికి ఇష్టం లేని కార్యములు చేయటం, కుటుంబానికి చేటు చేస్తుంది. దేవుని నీతి తర తరములు ఉన్నట్లుగానే, అయన కోపం కూడా మూడు నాలుగు తరములు ఉంటుంది (నిర్గమకాండము 20:5)

మీరు అనుకున్నట్లుగానే అభివృద్ధి జరుగుతూ మీకు ధనము వచ్చి పడుతుండవచ్చు, కానీ ఆ ధనము మూలముగా మీరు దేవునికి దూరం అవుతున్నారా? మొక్కుబడిగా ప్రార్థించటం మొదలు పెట్టారా? ఎదుటి వారిని చులకనగా   చూస్తున్నారా? "నా ప్రాణమా తినుము, తాగుము మరియు  సుఖించుము" అని మిమల్ని మీరు ప్రలోభ పెట్టుకుంటున్నారా? (లూకా 12:16-21) ధనము దేవునికి వ్యతిరేకమయినది. అది మనలో గర్వం పెంచుతుంది, మనలో తగ్గింపును తగ్గిస్తుంది. కనుకనే దేవుడు మనకు కష్టాలు అనుమతించి, మనకు గర్వం దూరం చేసి, తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు. అలాగని, మన అవసరాలు తీర్చకుండా ఉంటాడా? తప్పిపోయిన కుమారుడు, తండ్రి దగ్గర తిండి లేక వెళ్ళిపోలేదు, మరేదో కావాలని, అన్ని అనుభవించాలని దురాశతో వెళ్ళిపోయాడు. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలనుకుంటున్నామా? 

కుష్టు నయం చేసుకున్న నయమాను, ఎలీషాకు లోబడి కానుకలు ఇస్తుంటే, "అందులో ఒక్కటి కూడా  నాకు అవసరంలేదని" తిప్పి పంపాడు. కానీ అయన సేవకుడయినా  గేహజీ మాత్రం, ఎలీషాపై మనసులో నొచ్చుకొని, నయమాను రథం వెంబడి పరుగు పెట్టి, అబద్దం ఆడి, నయమాను నుండి వెండిని, మరియు విలువయిన వస్త్రములు గైకొన్నాడు కదా (2 రాజులు 5:20-27). ఇక్కడ గేహజీ తినటానికి లేక ఆశపడలేదు, కానీ ఇంకా సుఖముగా జీవించాలని, తన పిల్లలు అసలు ఏ కష్టాలు పడకూడదని, దేవునికి విరుద్ధముగా ప్రవర్తించి, తన తర తరములను  కుష్టుకు బలి చేసాడు. కష్టాలు వద్దనుకుని మరి ఎక్కువ కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అతనే కనుక దేవునికి అనుకూలముగా ఉంటె, ఏలీయా తర్వాత ఎలీషా వలే నాలుగింతల ఆశీర్వాదం పొందుకొని దేవుని ప్రవక్త వలే కొనసాగే వాడేమో కదా? 

1 పేతురు 3: " 17. దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! పేతురు గారు తన మొదటి పత్రికలో ఏమని రాస్తున్నారో చూడండి! దేవుని చిత్తానుసారముగా మనము కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే మేలు!  అది ఎంతో మంచిది. ఇక్కడ గేహజీ శ్రమలు పడకూడదని దేవుని దృష్టిలో కీడు చేసి అంతకన్నా ఎక్కువ శ్రమలు తెచ్చుకున్నాడు, తనకు తన కుటుంబానికి తగరగని నష్టం చేశాడు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా దేవుడు మనలను కష్టాల గుండా నడిపిస్తూ, మన విశ్వాసమును, బంగారము వలె శుద్ధి చేస్తున్నాడు (1 పేతురు 1:7). ఈ శ్రమల కొలిమిలో మనలో ఆత్మీయ మాలిన్యం సాంతం తొలగిపోయి, శుద్ధమయిన వారిగా మారుతున్నాము. తద్వారా మన రక్షకుడయినా క్రీస్తు ప్రత్యక్ష మయినపుడు, అయన మెప్పుకు, ఘనతకు మరియు మహిమకు  పాత్రులుగా మారుతున్నాము. 

కష్టాలు కొని తెచ్చుకోమని చెప్పటం లేదు. వాటికి ఎదురు వెళ్ళి ఇది దేవుని చిత్తమని చెప్పమనటం లేదు. కానీ శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడి, దేవుడు మనలను విరిగి నలిగిన వారిగా మార్చాలనుకున్నపుడు అయన చిత్తము నుండి తొలగిపోయి, మన విశ్వాస పరిమళాలు బయటకు రాకుండా కఠినులుగా ఉండిపోవద్దు. ఆనాడు మరియ చేతిలో అత్తరు బుడ్డి పగిలిన తర్వాతనే కదా ఆ గదిలో పరిమళం నిండుకుంది (యోహాను 12:3). మన విశ్వాస పూరితమయిన, విరిగి నలిగిన హృదయపు ప్రార్థనలు కూడా దేవునికి ఇష్టమయిన పరిమళము. వాటిని వద్దనుకుని, దేవునికి ఇష్టంలేని వారిగా, మిగిలి పోతామా? (2 కొరింథీయులకు 2:15, ఎఫెసీయులకు 5:1-2)

దేవుని చిత్తమయితే మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

19, ఆగస్టు 2022, శుక్రవారం

సాటి వారు నీకు సాకుగా ఉన్నారా?

ఇది వరకు మనం దేవుని సంఘములో ఉండటం మన ఆత్మీయతకు మేలు చేస్తుందని తెలుసుకున్నాం కదా! అయితే కొన్ని సార్లు ఆ సంఘమే మనలను శోదించటం ద్వారా మన ఆత్మీయతకు భంగం కలింగించే అవకాశం ఉంది. కారణాలు ఏమయినప్పటికి, కొన్ని సార్లు మన సాటి సహోదరి, సహోదరులు మనలను కించపరచటం ద్వారానో లేక కనీస గౌరవం ఇవ్వక పోవటం ద్వారానో మనలను శోధించే అవకాశం ఉంది. ఈ శోధనలను బట్టి మనం భాధపడటమో లేదా తిరిగి వారిని భాదపెట్టటమో చేస్తాము. తద్వారా క్రీస్తు ప్రేమను చూపించని వారిగా మిగిలిపోతాము. అందునుబట్టి మన ఆత్మీయ పరుగు కుంటుపడుతుంది.  ఇటువంటి సమయంలో మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా చెపుతుంది. 

1 పేతురు 5: "6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. 7. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి."

మనం దేవుని వారము అని సంపూర్ణముగా నమ్మినప్పుడు, మనలను కావాలని బాధపెట్టే వారికి దేవుడు వారి తప్పును గుర్తు చేయకుండా ఉంటాడా? తగిన రీతిలో వారికి పాఠం నేర్పకుండా ఉంటాడా? తండ్రి అయినా దేవుని చేతికింద దీనులుగా ఉండుట ద్వారా అయన కృపకు పాత్రులుగా ఉంటాము. అయన మన గురించి చింతిస్తున్నాడు, కనుక మనం చింతపడనవసరం లేదు. తగిన స్థానం, గౌరవం ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. నిన్ను ప్రేమించక పోవటం, నిన్ను గౌరవించక పోవటం ఎదుటి వారి ఆత్మీయతలో లోపం! కానీ వారిని ద్వేషిస్తూ, వారి వలే నువ్వు కూడా ప్రవర్తిస్తే అది నీ ఆత్మీయ లోపంగా పరిగణింపబడుతుంది. అటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడని భ్రమ పడవద్దు. బలిపీఠం వద్దకు వచ్చే ముందు, ప్రతి ఒక్కరితో సమాధానపడుమని దేవుని వాక్యం సెలవిస్తోంది (మత్తయి 5:23). లేదంటే మన ప్రార్థనలు గాలికి కొట్టుకు పోయే పొట్టువంటివి గానే మిగిలిపోతాయి. 

కొన్నిసార్లు మన తోటి వారు మాట్లాడే లోక విషయాలు మనలను శోదించేలాగున ఉండవచ్చు. వారి సంభాషణలలో పాలుపంచుకోవాలని, ఆ విషయాల మీద జ్ఞానం పెంచుకోవాలని తాపత్రయపడి తిరిగి వదలి వేసిన వాటి జోలికి వెళ్ళి మన ఆత్మీయ స్థితికి చేటు చేసుకోకూడదు. ఇటువంటి లోక విషయాలు వ్యర్థమయినవిగా దేవుని వాక్యం సెలవిస్తోంది. మన మనసు నిత్యమూ పైనున్న వాటి మీదనే గాని, భూసంబంధమయిన వాటి మీద ఉండరాదని పౌలు గారు కొలొస్సయులకు రాసిన పత్రికలో పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నాడు (కొలొస్సయులకు 3:2). అందరితో పాటు కలిసి పోకపోతే ఏలా? మరీ ఎటువంటి లోక జ్ఞానం లేకుంటే ఎలా? అనుకోవద్దు. మన దైనందిన జీవితానికి కావలసిన, రాజకీయ, ఆర్థిక విషయాలు తెలుసుకోవద్దు అని చెప్పటం లేదు కానీ, అనవసర విషయాలపై అవగాహనా అనవసరం.  

ఆ విషయాలు మనలను శోధించగలవు మరియు మన మనసులను ఆక్రమించి దేవునికి కొంత కాలమయినా మనలను దూరం చేయగలవు. కొంతమంది సహోదరి సహోదరులు తోటి వారితో సరదాగా మాట్లాడాలని తాపత్రయపడుతూ, శోదించబడుతూ తోటి వారిని కూడా శోధిస్తారు. ఇటువంటి వారితో అతి సన్నిహిత్యం కొనసాగిస్తూ, అటువంటి మాటలకూ అలవాటుపడి పూర్వ స్వభావమును తిరిగి పొందుకోవద్దు. సరదాగా మాట్లాడుకోవటం తప్పు కాదు, కానీ అదేపనిగా, ఒకరినొకరు కించపరచుకోవటం, లేక వంగ్యంగా మాట్లాడుకోవటం మన ఆత్మీయ స్థితికి ఎంత మాత్రము మేలు చేయదు. 

క్రీస్తు ఏనాడయినా, ఎవరితోనయినా ఇటువంటి ఛలోక్తులు వేసినట్టు బైబిల్ లో రాయబడిందా? హద్దులో లేని ఛలోక్తులు ఎదుటి వారిని శోధిస్తాయి మరియు  విస్తారమయిన మాటలు ఎన్నో దోషములు కలిగి ఉంటాయి. సహోదరుల మధ్య నిత్యము ప్రేమ కలిగి ఉంటూ తప్పులు మన్నించాలి మరియు సణుగుకొనకుండా ఒకరినొకరు ఆతిథ్యము చేయుమని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 4:8-9). అయితే ఇటువంటి సాటి వారిని సాకుగా తీసుకోని అటువంటి సంభాషణల్లో పాల్గొని, ఎదుటి వారిని శోదిస్తూ లేదా విస్తారముగా దోషములు మాట్లాడుతూ  ఆత్మీయతలో వెనుకపడవద్దు. ఒక్క విషపు చుక్క కడివెడు పాలను ప్రాణాంతకం చేసినట్లు, మన అల్లరితో కూడిన మాటలు, దోషములు కలిగి ఉంటూ మనలో అత్మీయతను కలుషితం చేయకుండా మానవు.  

కొంతమంది సహోదరి, సహోదరులు తాము దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మానేసి, ఇచ్చే వారిని కూడా శోధిస్తూ మాట్లాడుతారు. వారు అన్యులతో కలవటమే కాకుండా, సాటి వారిని కూడా వారితో పాటు లాగాలని ప్రయత్నం చేస్తారు. ఒక వేళ తిరస్కరిస్తే, రకరకాలుగా విశ్వాసులయిన వారిని తృణీకరించటమో, లేదా "గొప్ప భక్తిపరులు, అంత విశ్వాసులు, ఇంత విశ్వాసులు" అని హేళనగా మాట్లాడుతూ రెచ్చగొట్టాలని చూస్తుంటారు. "పాపముతో మీకు ఉన్న సంబంధం, అన్యజనుల ఇష్టము నెరవేర్చటానికి గతించిన కాలమే చాలును, మీరు వారి పాప కార్యములలో పాలిభాగస్తులు  కానందుకు ఆశ్చర్యపడుచు, మిమల్ని దూషించుదురు" అని పేతురు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో రాశారు (1 పేతురు 4: 3-4). కనుక ఎవరో తిరస్కరిస్తారని, మరెవరో హేళన చేస్తారని మన విశ్వాసమును తగ్గించుకుని, దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించుకోవద్దు. 

మరియు కొన్ని సార్లు ఇతరులు మనలను పొగుడుతున్నారని, మనం గొప్ప ఆత్మీయ వరములు కలిగిన వారమని అన్నప్పుడు విని వదిలేయటమే ఉత్తమం. వారి మాటలను బట్టి అతిశయ పడుతూ గర్వ పడటం మన ఆత్మీయతకు మేలు చేయదు. గర్వం పొంచి ఉండి మనలను సాతానుకు దగ్గరగా చేస్తుంది. ఇతరుల అభిప్రాయములు మనకు విలువలేనివిగా ఉండాలి. వారు మన గురించి మంచి చెప్పిన, చెడు చెప్పిన దేవునికి స్తోత్రం అనుకుని మన ఆత్మీయ పరుగులో కొనసాగాలి. "నా నామమును బట్టి దూషించబడువారు ధన్యులు" అని యేసయ్య చెప్పాడు కదా! "మీరేమి చేసినను మనుష్యుల కొరకు కాకుండా, దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేయుమని" దేవుని వాక్యం సెలవిస్తోంది (కొలొస్సయులకు 3:24)

నెహెమ్యా 2: "19 అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మో నీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయు డైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! మన ఆత్మీయతను బట్టి, ప్రభువు కోసం మనం పరిశుద్ధంగా కట్టుకుంటున్న మన దేహమనే దేవాలయమును కలుషితం చేయటానికి, సాతాను ఎన్నో రకాలుగా మన మీద శోధనలు తీసుకోని రావచ్చు. ఆనాడు నెహెమ్యాకు  మందిరం కట్టటానికి అడ్డుపడిన వారివలె, మన సాటి వారిని మన ఆత్మీయ పరుగుకు అడ్డుగా వాడుకోవటానికి రెచ్చగొట్టవచ్చు.  అయితే నెహెమ్యా వలె వారిని లక్ష్యపెట్టకుండా "దేవుడే నాకు సహాయకుడు, పరిశుద్దాత్మ  శక్తి నాకు బలము. నాకు, నా దేవునికి మధ్యన ఎవరు ఉండకూడదు" అని ముందుకు సాగిపోండి. కొన్నిసార్లు వాక్య పూరితమయిన విశ్లేషణలతో కూడా మనలను శోధించే అవకాశం ఉంది. వాటన్నింటిని బట్టి అనవసరపు వాగ్వాదాలకు దిగి, మన పిలుపును చులకన చేసుకోవద్దు. 

నీలో తగ్గింపును తేవటానికి, మరింతగా నిన్ను విశ్వాసంలో బలపరచటానికి దేవుడు, మన సాటి సహోదరి, సహోదరులను వాడుకుంటున్నాడేమో! కనుక వారికి తీర్పు తీర్చి తీర్పుకు లోనుకాకండి. కానీ నిర్లక్ష్యం వహించి వారితో పాటు పాలుపంచుకొని, ఆత్మీయతలో కిందికి జారిపోకండి, సాటి వారిని సాకుగా చూపకండి. మనం తట్టుకోలేని శోధన ఏది కూడా దేవుడు మనమీద అనుమతించడు! "ఆనాడు సాతాను అన్ని విధాలుగా యేసయ్యను శోధించి, కొంత కాలము ఆయనను విడిచేను" అని దేవుని వాక్యం లో రాసి ఉంది (లూకా 4:13).  మరి మనం ఏపాటి వారం? ఎంత జాగురతతో మన ఆత్మీయ ప్రయాణం కొనసాగించాలి?

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !! 

12, ఆగస్టు 2022, శుక్రవారం

దేవుడు ఇచ్చే శిక్షణ!

దేవుడు మనకు తండ్రిగా తల్లిగా ఉండి మనలను నిత్యము తన ప్రేమ చొప్పున కాపాడుతూ ఉంటాడు. ఎందుకు పనికి రాని వారమయిన మనలను, ఏ అర్హత లేని మనలను ఎన్నుకొని తన కృపల చొప్పున నిత్యము మన అవసరాలు, అక్కరలు తీరుస్తుంటాడు. "సృష్టి కారకుడయినా పరలోకపు తండ్రి మనలను నిత్యము పోషిస్తాడు, మరియు మనకు ఎంతో శ్రేష్ఠమయిన ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నాడు" అని దేవుని వాక్యం సెలవిస్తోంది (మత్తయి 7:11). "అడుగుడి మీకు ఇవ్వబడును, వేతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తియ్యబడును" అని యేసయ్య చేసిన బోధను బట్టి (మత్తయి 7:7) విశ్వాసులయిన మనము ఎంతో గొప్ప విశ్వాసం చూపుతూ ప్రార్థిస్తాము. ఎందుకంటే, తండ్రి అయినా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడటం అత్యంత సహజం. 

అయితే మనం ఎంత గొప్ప విశ్వాసంతో ప్రార్థించిన కూడా, దేవుని చిత్తమును బట్టే మనకు అయన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. మనకు ఆశీర్వాదాలు ఇవ్వటం దేవునికి ఇష్టం ఉండదా? దేవుడు మన భవిష్యత్తును పూర్తిగా ఎరిగి ఉన్నాడు, ఫలానా ఆశీర్వాదం పొందుకుంటే మన ప్రవర్తన ఎలా ఉండబోతోంది, అదీ పొందుకోవటం ద్వారా మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోతామా? దానివలన దీర్ఘకాలికంగా మనకు ఏదయినా కీడు జరుగబోతోందా? మొదలగు విషయాలన్నీ దేవుడు పరిగణలోకి తీసుకోని మనకు ఆశీర్వాదాలు దయచేస్తాడు. మనలను అయన ఏర్పరచుకున్న ఉద్దేశ్యాలకు, మన ఆత్మీయ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కొద్దీ కాలం మనలను  కష్టకాలం నుండి నడిపిస్తాడు. తద్వారా మనకు అవసరమయిన జీవిత పాఠాలు నేర్పిస్తాడు. 

ఆనాడు దావీదు గొఱ్ఱెల కాపరిగా ఉన్నప్పుడు, కాబోయే రాజయిన తనకు దేవుడు యుద్ధ విద్యలు ఎలా నేర్పించాడు? (1 సమూయేలు 17:34-37) గొల్యాతును చంపబోయే ముందు తనకు ఒక అవకాశం ఇమ్మని రాజయిన సౌలును అడుగుతూ దావీదు, "తన మీద అనుమానపడనవసరం లేదని, గొఱ్ఱెలను కాపాడటానికి తానూ ఎలుగుబంటి, సింహము వంటి బలమయిన జంతువులతో తలపడి, వాటిని చంపి తన గొఱ్ఱెలను కాపాడినట్లు" చెప్పాడు కదా? ఆనాడు దావీదు ఇటువంటి క్రూర జంతువులను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, నేను ఎంతో విశ్వాసంతో ప్రార్థించాను కదా? అనుకుంటే, కేవలం గొఱ్ఱెల కాపరిగానే మిగిలిపోయి ఉండేవాడు. దేవుని చిత్తమును అంగీకరించాడు కాబట్టే, దైర్యముగా "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నేను బ్రతుకు దినములన్ని కృప క్షేమములు నా వెంట వచ్చును" అని కీర్తన రాశాడు. 

దేవుడు మనలను గొప్ప ఉద్దేశ్యాలకు సిద్దపరుస్తున్నాడు అని సంపూర్ణంగా విశ్వసించాలి. కనుకనే మన జీవితంలో మనకు నచ్చని పరిస్థితులను అనుమతిస్తున్నాడు. మాములు గొఱ్ఱెల కాపరి, సింహమును జయించటం సాధ్యపడుతుందా? దాని అరుపు వినగానే భయపడి పారిపోవటం ఖాయం. కానీ దావీదుకు అంతటి ధైర్యం, బలం ఎలా వచ్చాయి. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. నేడు నీకు కూడా తండ్రి హస్తం తోడుగా ఉండి, నిత్యమూ నిన్ను నడిపిస్తూ ఉంది, పరిశుద్ధాత్మతో అయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు పిరికిగల ఆత్మను ఇవ్వలేదు అని దేవుని వాక్యం సెలవిస్తోంది (2 తిమోతికి 1:7) . పరీక్ష కఠినంగా ఉంది అని రాయకుండా పారిపోతే పై తరగతికి వెళుతామా? దేవుడే ఆ పరీక్షను నీతో రాయిస్తున్నాడు, కేవలం అయన మీద ఆధారపడి, నీ చిత్తము నెరవేర్చు తండ్రి అనుకంటే, ఆయనే నిన్ను గెలిపిస్తాడు. 

కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసమును కూడా పరిక్షిస్తాడు, ఆయన మీద మన ప్రేమ నిజమయినదా? మనం ఆత్మీయంగా ఎటువంటి స్థితిలో ఉన్నాము అని మనకు బయలు పరుస్తాడు. అంత సక్రమంగా సాగిపోతుంటే, నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఎంతో విశ్వాసంతో ఉన్నాము, మనకు చాల భక్తి, దేవుడంటే విపరీతమయిన ప్రేమ అనుకుంటాము. కానీ కష్ట కాలంలో అసలు రంగు బయటపడుతుంది. తద్వారా మనలను మనం సరి చేసుకొని, విశ్వాసంలో నూతన పరచబడుతాము. కలిగే కష్టాల ద్వారా, మనలో ఉన్న ఆత్మీయ గర్వము, సొంత శక్తి మీద ఆధారపడే తత్వము తగ్గిపోతాయి. దేవుడు దావీదును ఎంతగా కష్టాల గుండా నడిపిన కూడా, ఎక్కడ కూడా ఆయాసపడలేదు, దేవుని మీద ఆధారపడి మాత్రమే జీవించాడు. సులభంగా రాజయిన సౌలు మాత్రం, గర్వపడి దేవుని మాటలను కూడా ధిక్కరించాడు. కనుకనే దేవుని కృపను కోల్పోయాడు. 

సులభముగా దొరికే దానికి విలువ తక్కువ, లేదా అది మనలను గర్వపడేలా చేస్తుంది. కనుకనే దేవుడు మనకు తగ్గింపును నేర్పటానికి, కొన్ని మనకు త్వరగా అందించాడు. అయన శక్తిని, మహిమను మనం పూర్తిగా గుర్తిస్తాము అనుకున్న సమయం దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అనాడు ఇశ్రాయేలీయులు, సముద్రం దాటి తమను విడిపించింది, తాము తయారు చేసిన ఒక దూడ ప్రతిమ అని పూజించారు. కొద్దిపాటి దాహానికి, ఆకలికి దేవుని మీద సణుగుకొని దేవుని ఆగ్రహానికి లోనయ్యారు. తమ ముందు ఉన్న కష్టాలను, అనగా బలవంతులయిన కాననీయులను  చూసి అవిశ్వాసముగా మాట్లాడి దేవుని కృపను కోల్పోయారు. మన ముందు ఉన్న కష్టాలను బట్టి అధైర్యపడుతూ విశ్వాసం కోల్పోవటం దేవునికి ఇష్టం లేని ప్రవర్తన. 

ద్వితీయోపదేశకాండము 8: "3. ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను."

పై వచనములో ఇశ్రాయేలు వారితో మోషే ఎం అంటున్నాడు చూడండి. ఆహారము వలన గాక దేవుని మాట ద్వారా నరులు బ్రదుకుదురు అని వారికి తెలియటానికి దేవుడు వారిని ఆకలికి అప్పగించాడు. తర్వాత మన్నాతో పోషించాడు. మన జీవితంలో కూడా, ఏది ముఖ్యమయినది అనుకుంటున్నామో, అది లేకుండా కూడా దేవుడు మన జీవితం సాఫీగా సాగిపోయేలా చేయగల సమర్థుడిగా ఉన్నాడు. తద్వారా మన విశ్వాసమును బలపరుస్తూ, గొప్ప సాక్ష్యం మనకు దయచేసి ఇతరులకు మనలను దీవెనకరంగా మార్చబోతున్నాడు. నలుపది సంవత్సరాలు అరణ్యంలో నడిచిన కూడా ఇశ్రాయేలీయుల బట్ట చిరిగి పోలేదు, వారి కాలి చెప్పులు అరిగిపోలేదు, వారి కాళ్ళు కూడా వాయలేదు. ఇది ఎలా సాధ్యం అయింది? 

సామెతలు 3: "11. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. 12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! నీ జీవితంలో ఎదో లేదని వెలితిగా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో సమృద్ధిని ఇవ్వటం లేదని సణుగుతున్నావా? ప్రతిది ఆయనకు సాధ్యమే. కానీ దేవుడు నీకు విశ్వాసము నేర్పిస్తున్నాడు. అయన మీద ఆధారపడి జీవించటం నేర్పిస్తున్నాడు. నువ్వు, నీ జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండులాగున  నీకు శిక్షణ ఇస్తున్నాడు. నీ రక్షణ ప్రయాణంలో పై తరగతికి నిన్ను చేర్చాలని ఆశపడుతున్నాడు. అయన నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయనకు మరింత దగ్గరగా ఉండాలని, నిన్ను ఆయనకు దూరం చేసే వాటిని నీకు దూరంగా ఉంచుతున్నాడు. అలాగని నిన్ను ఇతరుల ముందు చేయి చాపనివ్వడు, రోషం కలిగిన దేవుడు, తన బిడ్డలను పోషించకుండా వదిలి పెట్టాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

5, ఆగస్టు 2022, శుక్రవారం

దైవ సేవకులను దూషిస్తున్నావా?

దేవుడు ఒకనాడు అనగా క్రీస్తు రాకడకు ముందు కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకొని తన ప్రజలయిన ఇశ్రాయేలు జనముతో మాట్లాడి, వారు తన మార్గములో నడవటానికి, మరియు తన చిత్తమును నెరవేర్చటానికి ప్రవక్తలకు  తన యొక్క ప్రవచనములు బయలు పరచేవాడు. అదే విధముగా నేడు కూడా కొంతమంది దైవ సేవకులను తన సేవకు పిలుచుకొని వారికి తన పరిశుద్దాత్మ ద్వారా జ్ఞానమును అనుగ్రహిస్తూ, విశ్వాసులను దేవునిలో బలపరచటానికి వాడుకుంటున్నాడు. వీరిలో కొందరు తమ తమ సంఘముల నేపథ్యమును బట్టి కొన్ని మతపరమయిన సిద్దాంతాలు పాటిస్తూ ఉంటారు. వీరు క్రీస్తూనే నమ్ముతుంటారు, కానీ కొన్ని ఉపదేశాలు విశేషముగా విశ్వాసులకు బోధిస్తూ ఉంటారు. 

ఇవ్వని కూడా  దేవుని వాక్యమును అర్థం చేసుకొనే విధానము వలన కలిగే సిద్దంతాలు లేదా ఉపదేశాలు. క్రీస్తును రక్షకునిగా, దేవునిగా అంగీకరించని బోధను వ్యతిరేకించమని దేవుని వాక్యం సెలవిస్తోంది (2 యోహాను 1:10) కానీ సిద్ధాంతా పరమయిన అవగాహన లోపాలను  ప్రేమ పూర్వకంగా హెచ్చరించాలి, వాక్యము చేత ఖండించాలి. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో చెప్పినట్లుగా, వివాదాలకు, వ్యర్థమయిన వాదనలకు వెళ్ళి, మన హృదయములలో  గర్వమునకు చోటిచ్చి, దేవుడు మనకు ఇచ్చిన భక్తిని తప్పి పోరాదు. కొంతమంది దైవ సేవకులు దేవుని పిలుపు లేకపోయినా కూడ, కేవలం ప్రజలను ఆకర్షించి పేరు ప్రఖ్యాతులు పొందటానికి  మరియు ధనం సంపాదించటానికి సంఘములు నడుపుతుంటారు. 

వీరిని బట్టి సంఘమును హెచ్చరించటం చేయాలి, మరియు ఆ సంఘములో విశ్వాసులకు అర్థం అయ్యే రీతిగా అతని తప్పుడు బోధలను వాక్యముతో ఖండించాలి. ఆ దైవ సేవకుడు చేసేది వాక్యాను సారమయిన బోధ కాదని తెలిసి కూడా, అతణ్ణి అనుసరిస్తు అతని బోధలు పాటిస్తే కనుక, ఆ విశ్వాసులను, వారి ఆత్మీయ స్థితిని దేవుని చిత్తమునకు వదిలేయాలి. మానవ శక్తితో, జ్ఞానముతో ఏ ఒక్కరిని కూడా మనం మార్చలేము, ప్రభువులోకి నడిపించలేము. కేవలము, ప్రభువు సువార్తను మాత్రమే మనం ప్రకటించగలము. తప్పుడు బోధలు చేసే వారిని మరియు వారి పక్షమున నిలిచే వారిని,  దేవుని తీర్పుకు వదిలి వేసినట్లుగా రాశారు పౌలు గారు (2 తిమోతికి 4:14-16)

మనలో కొంతమంది అదేపనిగా దైవ సేవకులను విమర్శించటం చేస్తుంటారు. వారికి ఉన్న విలాసవంతమయిన సౌకర్యలను బట్టి వారిని దూషిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వారికి ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు వారిని తప్పకుండా లెక్క అడుగుతాడు. ఆ పనిని మనం చేసి దేవుని తీర్పుకు లోనుకావద్దు. ఇటువంటి సేవకులు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన ధనం వాడుకుంటున్నారు అని నిలదీయటం విశ్వాసులయిన మనకు తగదు. సర్వము దేవుని అధీనములో ఉంది, అయన చిత్తము ప్రతి వ్యక్తి విషయంలో, సంఘము విషయంలో నెరవేరుతుంది.  అమాయకులయిన విశ్వాసులకు అవగాహన పెంచే ప్రయత్నం చేయండి, కానీ ఆ దైవ సేవకులను దుయ్యపట్టి మన ఆత్మీయతకు చేటు చేసుకోవద్దు. 

సంఖ్యాకాండము 16: "3. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడు; యెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా"

ఆనాడు దైవ సేవకుడయినా మోషేను, అహరోనులను దూషిస్తూ కోరహు "మీరు మాత్రమే ఎందుకు ఇంతటి ఘనత పొందుతున్నారు. ఇక్కడ అందరు పరిశుద్ధులే, మేము కూడా అటువంటి ఘనతకు అర్హులమే" అని వారికి వ్యతిరేకంగా సమాజమును రెచ్చగొట్టారు. అంటువంటి  వారి విషయంలో దేవుని తీర్పు ఎలా నెరవేరింది? భూమి చీల్చబడి వారిని సజీవంగా మింగి వేసింది. ఇప్పటి దైవ సేవకులు మోషే వంటి వారు కాకపోవచ్చు గాక! కానీ ఆ దేవుడు ఒక్కడే, అయన తీర్పులు ఎప్పుడు ఒక్కలాగే ఉంటాయి. ఆ దైవసేవకులను, వారిని గుడ్డిగా అనుసరిస్తున్న విశ్వాసులను బట్టి  భారంతో ప్రార్థించండి. వారిని దేవుడే మారుస్తాడు లేదా ఆ విశ్వాసులను కాపాడుకుంటాడు. అంతే కానీ కోరహు వలె నోరు జారి దేవుని తీర్పుకు గురి కావద్దు. 

కొందరు దైవ సేవకులు డబ్బు మీద వ్యామోహంతో అదేపనిగా కానుకలు ఇవ్వాలని సంఘమును ప్రేరేపిస్తూ ఉంటారు! తమ సొంత ఘనత కోసం సంఘమును వాడుకుంటూ ఉంటారు. మరి అటువంటి వారి సేవను కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. ఎందుకిలా జరుగుతుంది? దేవుడు ఎందుకు వీరిని కూడా వాడుకుంటున్నాడు, అని చాలామంది భాధ పడుతూ ఉంటారు. ఆనాడు ఇశ్రాయేలీయులు నీటి కోసం వాదించినప్పుడు మోషే ఆయాస పడి, "ఇప్పుడు మీ కోసం మేము ఈ రాతి నుండి నీటిని తెప్పించాలా?" అని ఆవేశంగా అరచి, దేవుడు రాతితో మాట్లాడమంటే దాన్ని కొట్టి తప్పు చేశాడు. అయినప్పటికి దేవుడు రాతి నుండి నీటిని రప్పించటం ఆపలేదు. ఇక్కడ మోషే తప్పు కన్న కూడా, ప్రజల దాహం తీర్చటం దేవుని ప్రేమలో ప్రాముఖ్యమయినది. 

ఇటువంటి దైవ సేవకులు ఎన్ని వందల తప్పులు చేసిన తన ప్రజలను కాపాడు కోవటం, వారిని రక్షించుకోవటం దేవుని అనంత ప్రేమలో ప్రాముఖ్యం కలిగి ఉన్న విషయం. అందుకనే ఇటువంటి దైవ సేవకులను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఆనాడు డబ్బుకై ఆశపడిన బిలామును సైతం, ఇశ్రాయేలు ప్రజలను దీవించటానికి దేవుడు వాడుకున్నాడు కదా? వీరు కూడా అటువంటి వారేనని, దేవుని తీర్పుకు వారిని వదిలేయటమే మన ఆత్మీయతకు శ్రేయస్కరము. లేదంటే మోషేను దూషించిన మిరియాము కుష్ఠును పొందుకున్నట్లుగా, ఆత్మీయంగా మనం కూడా స్పర్శను కోల్పోయిన, అనగా పాపం విషయంలో సున్నితత్వము కోల్పోయిన వారి వలే మారిపోతాము. 

1 తిమోతికి 6: "2. విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము."

ప్రియమయిన సహోదరి, సహోదరులారా! ప్రభువు సేవ కోసం, తమ జీవితాలను అర్పిస్తూ, గొప్ప సాక్ష్యం కలిగి ఉన్న దైవ సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా, ప్రభువు పేరిట మిమల్ని హెచ్చరిస్తున్నాము. ప్రభువు వారికి నిత్యము తోడుగా ఉండి నడిపిస్తుంటాడు. వారు మీతో ప్రేమగా, ఓర్పుగా ఉంటున్నారు కదా అని వారికి మీ  వంటి భావోద్వేగాలు ఉండవని తలంచకండి. వారిని మరింతగా గౌరవిస్తూ, మరి ఎక్కువగా ప్రేమించండి. సాక్ష్యం చూడకుండా, వారు బోధించే విషయాలను వాక్యంతో పరిశీలించకుండా, ఎవరిని పడితే వారిని నెత్తిన పెట్టుకొమ్మని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ నిజమయిన ప్రభువు సేవకులను ఆదరించండి, అది ప్రభువు ఎన్నటికీ మరచిపోకుండా మీకు ప్రతిఫలం దయచేస్తాడు. "తన శిష్యులయిన వారికి, ఎండా దినము చల్లని మంచి నీటిని ఇచ్చిన వారికి కూడా నేను ప్రతిఫలం ఇస్తానని" యేసయ్య చెప్పాడు కదా (మత్తయి 10:42)

కానీ ఆ దైవ సేవకులు మనం కోరుకున్నది చెయ్యలేదనో, లేక ఎదో విషయంలో ప్రాముఖ్యం ఇవ్వలేదనో, వారిని అవమానించటం, చులకనగా చూడటం చేయకండి. మిమల్ని వారు  అవమానిస్తే అది దేవుడు చూసుకుంటాడు, మీకు  రావలసిన ప్రాముఖ్యత ఆయనే ఇస్తాడు. ప్రతికారము యెహోవాదే కానీ మనది కాదు, దాన్ని మనం తీర్చుకుంటే దేవుడు మన మీద తీర్చుకుంటాడు. ఎలీషాను అవమానించిన యువకుల గతి ఏమైంది? అడవి నుండి రెండు ఏలుగు బంట్లు వచ్చి నలభై రెండు మందిని చీల్చి వేశాయి (2 రాజులు 2:24). మనకు ఇప్పుడు కృప ఉంది కదా అని, గర్వపడుతూ, ఇష్టానికి ప్రవర్తిస్తూ దేవుని కృపకు దూరం కావద్దు. దైవ సేవకులను గౌరవించండి, కానీ ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువుకు మాత్రమే అర్పించండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

29, జులై 2022, శుక్రవారం

దేవుని అవసరం లేదనుకుంటున్నావా?


మనం విశ్వాసంలోకి రావటానికి ఎన్నో సందర్భాలు ఉంటాయి! దేవుడు మన అవసరతలు తీర్చడానో, లేదా అనారోగ్యం నుండి స్వస్థతలు అనుగ్రహించాడనో, అర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల భాధల నుండి విముక్తి కలిగించడానొ క్రీస్తు మీద విశ్వాసం పెంచుకుంటాము. ఇటువంటి విశ్వాసము కొద్ది రోజులకు అనగా అవసరాలు తీరిపొయిన తర్వాత నెమ్మదిగా సన్నగిల్లుతుంది! ఒకప్పుడు కన్నిటితొ చెసిన ప్రార్థన అవసరాలు తీరిపొయాక, అవసరం లేదనిపిస్తుంది. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చింది కేవలం మన అవసరాలు తీర్చటానికి మాత్రమే కాదు గాని మనలను పవిత్రులుగా చేసి, నిత్యమూ తన సన్నిధిలో గడిపే  జీవితం ఇవ్వటానికి అని గుర్తించాలి. 

మొదటి సారి విశ్వాసం లోకి రావటానికి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి ఉండవచ్చు! ఎలాగంటే, ఆనాడు ఇశ్రాయెలియులను ఐగుప్తులో బానిస బ్రతుకు నుండి విముక్తి దయచేసిన సమయం నుండి, ఎఱ్ఱ సముద్రం చీల్చి ఫరో సైన్యం నుండి రక్షించటంతో పాటు అరణ్యంలో మన్నాను కురిపించి పోషించటం చేసాడు దేవుడు. మన జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలు దేవుడు చేసి ఉంటాడు. ఆ విధముగా దేవుని మహిమను గుర్తించి విశ్వాసములో బలపడి, దేవునిలో కొనసాగటం మొదలు పెడుతాము. జీవితం సాఫిగా సాగుతుంటే, దేవుని అవసరం తగ్గిపోవటం మొదలవుతుంది. తిరిగి మనం విడిచిన ప్రతి లోకరీతిని పాటిస్తూ,  పూర్వపు స్వభావమును ముందుకు తెస్తాము, దేవునికి ఇష్టం లేని కార్యములు చేయటానికి వెనుకాడము. 

ఒకప్పుడు ఈ సమస్య తీరిపోతే చాలు, ఇక దేవునిలో లేదా దేవుని కోసం  ఎలా పరుగు పెడతానో చూడు అనుకుంటాము. దేవుడు తన శక్తి చేత అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తాడు. ఎంతో గొప్పగా సాక్ష్యం చెపుతాము, మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు అని గొప్పగా మాట్లాడుతాము. నెమ్మదిగా దేవుని ఘనకార్యాలకు కారణాలు వెతకటం మొదలవుతుంది. మనం దేవుని కోసం చెయ్యాలనుకున్న కార్యాలు, బ్రతకాలనుకున్న జీవితం అసాధ్యంగా మారి, ఇప్పుడు అంత కష్టం అవసరమా అనుకుంటూ దేవునికి దూరం కావటం మొదలవుతుంది. 

ప్రసంగి 5: "4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. 5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు."

సొలొమోను రాజు ఏమని రాస్తున్నాడు ఒక్కసారి చూడండి! దేవునికి మ్రొక్కుబడి చేసి దాన్ని  చెల్లించకుండా ఆలస్యం చేసే వారిని బుద్ధిహినులుగా పరిగణిస్తున్నాడు. అటువంటి వారు దేవునికి ఇష్టం లేని వారు. సమస్య తీవ్రతను బట్టి అది చేస్తాను ఇది చేస్తాను అని మనం చేయలేని మ్రొక్కుబడులు దేవుని ముందు పలుక వద్దు. ఒక్కసారి పలికిన తరువాత మ్రొక్కుబడి చెయ్యకుండా ఆగిపోరాదు. ఇదే అధ్యాయంలో దేవుని ముందు అనాలోచితంగా పలుకుటకు  హృదయమును త్వరపడ నియ్యక నీ నోటిని కాచుకొనుము (ప్రసంగి 5:2) అని రాసి ఉంది. నీ మ్రొక్కుబడి కష్టంగా ఉందా? పవిత్రంగా జీవించలేక పోతున్నావా? దేవునికి మరోసారి మొఱ్ఱ పెట్టు, ప్రతి దినము ఉదయము, సాయంత్రము ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, తద్వారా దేవుని పరిశుద్దాత్మ శక్తి నిన్ను నడిపిస్తుంది. 

మనలో కొంతమంది విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. దేవుని ఘనకార్యాలను బట్టి పవిత్రంగా జీవించటం మొదలు పెడుతారు. రెండవ సారి ఏదయినా అవసరం కలిగినప్పుడు, ఆశీర్వాదాలు కావాలనుకున్నప్పుడు తీవ్రంగా ప్రార్థించటం మొదలు పెడుతారు. అయితే దేవుని ప్రణాళికలు మనం అర్థం చేసుకోలేము. అయన కార్యములు గంబీరమయినవి, ఎన్నో కోణములు కలిగి ఉంటాయి. మనం కోరుకున్నది జరగనప్పుడు, నెమ్మదిగా విశ్వాసం సడలి పోవటం మొదలవుతుంది. కన్నీటి ప్రార్థనతో మొదలయి,  నిట్టూర్పులతో కొనసాగుతూ చివరకు సణుగుకొవటం వరకు వెళ్తుంది. ఆనాడు ఇజ్రాయెలీయిలు, దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుత కార్యములను మరచి, కాస్త ఆలస్యానికే సణుగు కోవటం మొదలు పెట్టారు. 

"మేము ఐగుప్తులో ఉంటేనే బాగుండేది, మమల్ని చంపటానికి తీసుకోని వచ్చారా" అని దేవుని స్నేహితుడయిన మోషేతో వాదనకు దిగారు. దేవుడు విడిపించక ముందు తాము  బానిసలుగా  అనుభవించిన శ్రమలను పూర్తిగా మరచి పోయారు. మాంసం లేదని, నీళ్ళు ఆలస్యంగా దొరికాయని దేవుని మీద సణుగుకున్నారు. ఇదివరకు మనకు ఉన్న కష్టాల నుండి దేవుడు ఎలా నడిపించాడు మరచి పోవద్దు. ఇప్పుడు ఆలస్యం జరుగుతున్న కారణం, మనకు మేలు చేసేది గానే ఉంటుంది. దేవుని ప్రణాళికలు మనలను అభివృద్ధి చేయటానికే తప్ప నశింప చేయటానికి కాదు (యిర్మీయా 29:11) అని  గుర్తుంచు కోవాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని, అయన ఉనికిని ప్రశ్నిస్తే ఎలా? 

జెఫన్యా 1: "6. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను."

జెఫన్యా 1: "12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షిం తును."

ఈ వచనములలో జెఫన్యా ప్రవక్త దేవుని నుండి పొందిన ప్రవచనం ఒక్కసారి చూడండి! దేవుణ్ణి అనుసరించక, ఆయనను విసర్జించి, అయన యొద్ద విచారణ చేయని వారిని అయన నిర్మూలము చేస్తానని అంటున్నాడు. నువ్వు కోరుకున్న మేలులు పొందుకున్న తర్వాత ఇంకా దేవుని చిత్తము దేనికి అని తలుస్తున్నావా? ఒకప్పుడు నీ చిత్తమే చేస్తాను తండ్రి అని పలికి, ఇప్పుడు అయన చిత్తం ఏమిటో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నావా? అటువంటి వారిని దేవుడు నిర్ములము చేస్తానంటున్నాడు. 

అదే విధముగా నువ్వు కోరుతున్న మేలులు పొందుకోవటం లేదని, నీ ప్రార్థనలకు సమాధానం లభించటం లేదని, దేవుడు ఉన్న  ఒక్కటే లేకున్నా ఒక్కటే అని ఆలోచిస్తున్నావా? అయన కీడు చేయడు, మేలు కూడా చేయడు అని ఆలోచిస్తూ నామమాత్రంగా, మొక్కుబడిగా ప్రార్థిస్తున్నావా? అయన లోకమంతటిని పరిశోధిస్తున్నాడు. తమ హృదయములలో దేవుని గురించి నామమాత్రంగా ఉన్నవాడు అనుకునే వారిని శిక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. 

సహోదరి సహోదరుడా దేవుడు మనలను తన ప్రాణం పెట్టి రక్షించుకున్నది, మనం ఆయనతో  సహవాసం కలిగి నిత్య జీవితం పొందుకొని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి. అంతే కానీ మన గొంతెమ్మ కోరికలు తీరుస్తూ మనం ఆయనకు దూరంగా బ్రతకటానికి కాదు. ఒక వేళ నువ్వు కోరుతున్నది అవసరం అయినా సరే, తగిన సమయంలో మనకు ఆయనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అయన ప్రణాళికలు మనలను అభివృద్ధి చేసేవే కానీ మనలను నశింప చేసేవి కావు. కనుక ఓర్పుతో అయన చిత్తము కొరకు కనిపెడుదాము. 

యోహాను 5: "14. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా"

ముప్పయి ఎనిమిది ఏళ్ళుగా బేతెస్థ కొలను దగ్గర స్వస్థత లేక పడి ఉన్న వ్యక్తిని యేసయ్య స్వస్థ పరచి, నీ పరుపు ఎత్తుకొని నడువు అన్నాడు. అక్కడ ఎంతో మంది స్వస్థతల కోసం పడిగాపులు కాస్తుంటే, యేసయ్య ఆ వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచాడు. మరి నిన్ను కూడా అలాగే రక్షించుకున్నాడు. నీ అవసరతలు తీర్చాడు, నీకు అసాధ్యం అనుకున్న కార్యాలు చేసాడు. మరి ఇప్పుడు నీవు వాటన్నింటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఓర్పుతో నిరీక్షిస్తూ ప్రార్థిస్తున్నావా? లేక దేవుడు పెద్దగా అవసరంలేదని నామమాత్రంగా విశ్వసిస్తున్నావా? స్వస్థతలు అందుకుని, మేలులు పొందుకుని దేవుణ్ణి మరచి పోయిన వారిని బట్టి యేసయ్య ఏమంటున్నాడు? మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు, ఇకపై  పాపము చేయవద్దని. 
 
దేవుడు నిత్యమూ లోకమును పరిశోధిస్తున్నాడు. తన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారిని ప్రతి క్షణము కాపాడుతూ ఉంటాడు. కానీ ఆయన శక్తిని తక్కువ చేసి ఆలోచిస్తే నశించి పోతాము. మరియు అయన ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి పాపంలో పడిపోతే, మరి ఎక్కువ కీడు పొందుకుంటాము. మన దేవుడు అనంత ప్రేమను కలిగి ఉన్నవాడు. ఎన్ని సార్లయినా నిన్ను క్షమిస్తాడు, కానీ నీ ఆత్మీయ పరుగులో వెనుక బడి, దేవుని ప్రణాళికలు, నీ పట్ల అయన ఉద్దేశ్యాలు తప్పిపోవద్దు. పౌలు తన జీవిత చరమాంకంలో "నా పరుగు ముగించాను" అని చెప్పిన మాట మన జీవితంలో మనం కూడా  కూడా చెప్పగలగాలి, లేదంటే కేవలం భూమి మీద జీవితం ముగించిన వారిగానే మిగిలిపోతాము. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

22, జులై 2022, శుక్రవారం

ఆరాధన అనగా ఏమిటి?

 

ప్రతి క్రైస్తవుడు తరచుగా వినే మాట ఆరాధన. ప్రతి ఆదివారం చర్చ్ లో చేసేది ఆరాధన అని క్రైస్తవులందరూ నమ్ముతారు. అందుకనే ఎవరయినా ఆదివారం చర్చ్ లో కనపడకపోతే "ఏంటి, పోయిన వారం ఆరాధనకు రాలేదు" అని ఇతరులను పలకరిస్తారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఆరాధన అనగానే పాటలు పాడటం, ఆనందంగా గంతులు వేయటం అనుకుంటారు. తర్వాత ఆరాధన వర్తమానం, అటు పైన ఒక్కొక్కరు దేవుడు తమకు ఇచ్చిన రక్షణను బట్టి ఆయనకు కృతఙ్ఞతలు చెల్లించటం చేస్తారు.

దేవుడు ఏమయి ఉన్నాడో తెలుపుతూ, కృతఙ్ఞత స్తుతులు చెల్లించటం  ఆరాధన అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. దేవుని మహిమను, అయన  గొప్ప కార్యములను, అయన ప్రేమను గుర్తు చేసుకోవటం కూడా ఆరాధన అనిపించుకోదు. దేవుని మాటలు వినటం,  ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటం ఆరాధన అనిపించుకుంటుంది. చాల మంది దేవుని సేవ చేస్తున్నాము అన్న పేరుతొ దేవుని మాటలు వినటమే మానేస్తారు. సంఘము పనులలో, పరిచర్యలో తలమునకలు అవుతూ వ్యక్తిగత ప్రార్థన, దేవుని వాక్య పఠనము మరియు దేవునితో ఏకాంతంగా గడపటం నిర్లక్ష్యం చేస్తారు. వాక్యము కంఠస్తంగా నోటికి వస్తుందే తప్ప, దేవుని అభిషేకం నుండి రావటం లేదు అని గుర్తించారు. 

మార్కు 7: "6. అందుకాయన వారితో ఈలాగు చెప్పెనుఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7. వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే."

ఈ వచనములలో యేసు క్రీస్తు ఏమని సెలవిస్తున్నారు చూడండి! ప్రజలు కేవలం తమ పెదవుల చేత ప్రార్థిస్తున్నారు కానీ తమ హృదయములు ఆయనకు ఎంతో దూరముగా ఉన్నాయి అని, అటువంటి వారిని వేషధారులుగా పరిగణిస్తున్నాడు. చాల మంది విశ్వాసులకు కొత్తలో విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఉన్నంత ఉజ్జివం ఉండదు. రక రకాల వ్యాపకాలు, పాటలు వినటం, సందేశాలు వినటం లేదంటే దేవుని సేవ పేరిట తమను తాము ఘనపరచు కోవటం చేస్తారు. వారు కేవలం  రోజు అరగంట వాక్యం చదువుతారు, కొద్దీ సేపు ప్రార్థన చేసి యధావిధిగా తమ పనులకు ఉపక్రమిస్తారు. దేవుని మాటలు వినటానికి, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటానికి వారికి సమయం ఉండదు. 

సాతాను యేసయ్యను తనను ఆరాధించాలని కోరినప్పుడు ఏమి ఆశ చూపాడు? (మత్తయి 4:8-9) లోకంలో ఉన్న రాజ్యములలో మహిమను ఇస్తానని, తనకు సాగిలపడి నమస్కారం చెయ్యాలని అడిగాడు. అందుకు యేసయ్య నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే ఘనపరచాలని వాడిని గద్దించాడు. మరి మనకు ఉన్న ఆశలు ఏమిటి? మనం దేవునికి ప్రార్థన కేవలం అవసరాల నిమిత్తమే చేస్తున్నామా? లేక ఆయనను మనసారా ఆరాధిస్తున్నామా? సమస్త ఘనత ఆయనకు ఆపాదిస్తున్నామా లేక మనకు కూడా భాగం ఉంది అని భావిస్తున్నామా? 

యెషయా ఆరవ అధ్యాయము 2 వచనము నుండి 9 వచనము వరకు చదువవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాము. ఇక్కడ యెషయా ప్రవక్త పరలోకంలో జరిగే ఆరాధనను దర్శనం రూపంలో చూశాడు. వివిధ రకాల దేవ దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గానములు చేస్తున్నారు. ఆయన పరిశుద్దత నుండి వచ్చే వెలుగును చూసే శక్తి లేక, తమ రెక్కలతో ముఖములు కప్పుకుంటున్నారు. యెషయా తన అపవిత్రను బట్టి దేవుణ్ణి చూసి తానూ నశించిపోయానని అనుకున్నాడు. అయితే సెరాపులలో ఒక దూత బలిపీఠము నుండి నిప్పును తెచ్చి అతని పెదవులకు తగిలించి పవిత్రునిగా చేసింది. అప్పుడు దేవుడు "నేను ఎవరిని నా నిమిత్తం పంపుదును" అనగానే యెషయా "చిత్తము ప్రభువా నేను వెళ్ళెదను" అని చెప్పాడు. 

పాపముతో ఉండే మనము నిత్యమూ మనలను మనం తగ్గించుకొని దేవుణ్ణి సన్నిధిలో  పాపములు ఒప్పుకోవటం  ద్వారా అయన మనకు తన కృపను అనుగ్రహిస్తాడు, అప్పుడు పాపం మన మీద అధికారం కోల్పోతుంది, తద్వారా మనం పవిత్రులుగా మారుతాము. అప్పుడు దేవుడు తన చిత్తమును మనకు బయలు పరచి మనలను నడిపిస్తాడు. ఆ విధముగా దేవుని చిత్తమును చేయటము నిజమయిన ఆరాధనకు సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. దేవుని పనే కదా చేస్తున్నాము, దేవుని పాటలే కదా పాడుతున్నాము, లేదా వింటున్నాము అనుకోవటం ఆరాధన కాదు. కేవలం జ్ఞానం కోసం దేవుని వాక్యం చదువకుండా, ఆత్మ శక్తి కోసం చదవాలి  (2 కొరింథీయులకు 3:4-6).  మన సమస్తమును పక్కన పెట్టి, అయన యందె దృష్టి నిలిపి అయన స్వరం వినటమే ఆరాధన. 

బైబిల్ లో మొదటి ఆరాధన చేసింది అబ్రాహాము. తనకు ఎంతో ప్రియమయిన కుమారుడు ఇస్సాకును దేవుడు తనకు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రాహాము వెనుకాడ లేదు. ఆ సమయంలో అబ్రాహాము తన పని వారితో పలికిన మాటలు ఒక్కసారి చూడండి (ఆదికాండము 22:5) "నేను ఈ చిన్న వాడును వెళ్లి దేవునికి మ్రొక్కి (worship) వస్తాము"  అన్నాడు. ఇక్కడ అబ్రాహాము తనకు ప్రియమయిన కుమారుణ్ణి దేవునికి అర్పించటం ఆరాధనగా పేర్కొన్నాడు. మరి మనకు ఇష్టమయినవి వదిలి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మనలో అహంకారం, జారత్వము, ధనాపేక్ష, క్రోధము, పేరు ప్రఖ్యాతులు ఇవ్వని కూడా మనకు ఎంతో ఇష్టమయిన కార్యములు కదా? వీటిని వదిలి పెడుతున్నామా? అయన పరిశుద్దాత్మ శక్తికై ఆరాటపడుతున్నామా? 

ముందు చెప్పుకున్నట్లుగా, దేవునికి కృతఙ్ఞతలు చెల్లించటం, అయన మేలులను తలచుకోవటం సంపూర్ణ ఆరాధన కాదు. ప్రతి స్థితియందు ఆయనకు మొక్కటం, అయన మీద ఆధారపడటం ఆరాధన అని చెప్పుకోవచ్చు. యోబు తన సమస్త సంపద నశించి, తన బిడ్డలందరు చనిపోయారని తెలియగానే ఏమి  చేసాడు చూడండి! "యెహోవా  ఇచ్చెను, యెహోవా  తీసికొని  పోయెను, యెహోవా నామమునకు స్తుతి  కలుగునుగాక" అన్నాడు (యోబు 1:21). ఇక్కడ యోబు తనకు ఎంతో దుఃఖకరమయిన పరిస్థితి ఉన్న కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మరియు ఈ సంగతులలో ఏ విషయమందు దేవుని మీద విసుగుపడి పాపం చేయలేదు. మరి మనం అటువంటి ఓర్పు కలిగి ఉన్నామా? దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తున్నామా? అదియే ఆరాధన. 

మనుష్యులయిన మనము ఆత్మ, జీవము, దేహము అను మూడు భాగములు కలిగి ఉన్నాము (1 థెస్సలొనీకయులకు 5:23).  దేవుడు పరిశుద్దాత్మ రూపంలో మనలో ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ ఆత్మకు నిలయం మన యొక్క దేహము. కనుక మన దేహమును పవిత్రముగా ఉంచుకోవాలి, అనగా అందులో జరిగే సమస్త పాప కార్యములు (గలతీయులకు 5:18-21) చేయకుండుట ద్వారా ఆత్మ చేత నడిపింపబడిన వారిగా ఉంటాము. మరియు మన దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుటమే ఆయనను ఆరాధించటము అని (రోమీయులకు 12:1) అని పౌలు గారు పరిశుద్దాత్మ ద్వారా తెలియజేసారు. మరియు క్రీస్తు యేసు నందు అతిశయపడుతూ, మన సొంత బలమును, తెలివిని విడిచి ఆత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది (ఫిలిప్పీయులకు 3:3)
 
యోహాను 4: "24. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను."

దయచేసి యోహాను సువార్త 4 వ అధ్యాయము పూర్తిగా చదవమని ప్రభువు పేరిట బ్రతిమాలుకొనుచున్నాము. ఈ వచనములలో యేసయ్య దేవుణ్ణి ఎలా ఆరాదించాలో సమరయ స్త్రీకి వివరిస్తున్నాడు. ఇక్కడ ఆ సమరయ స్త్రీ తన పాప జీవితమును యేసయ్య ముందు దాచుకోలేదు, అన్ని నిజాలు చెప్పింది, తన పాపములన్ని కూడా ఒప్పుకుంది.  దేవుణ్ణి ఎలా ఆరాదించాలి అన్న విషయంలో సరయిన అవగాహనా లేకుండా ఉంది. అప్పుడు యేసయ్య "కొండ మీద కాదు మందిరములో కాదు, యదార్థముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తారని, అటువంటి వారినే తండ్రి కోరుకుంటున్నాడు" అని సెలవిస్తున్నాడు. 

ప్రియామయిన సహోదరి, సహోదరుడా! ఆరాధన విషయంలో నీకు ఉన్న అవగాహనా ఏమిటి? నీ పాపపు జీవితం ఒప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పాటలు పాడటం, కేవలం మందిరములో దేవుణ్ణి ప్రార్థించటమే ఆరాధన అనుకుని అక్కడే ఆగిపోతున్నావా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యము తోనూ ఆరాధించాలని దేవుని వాక్యం చెపుతున్నది పాటిస్తున్నావా? ఆత్మతో అనగా కేవలం పెదవులతో కాకుండా, హృదానుసారముగా అయన ఆజ్ఞలు పాటిస్తూ జీవించటం. సత్యముతో అనగా ఎటువంటి స్థితికి భయపడకుండా, మన శక్తిని బట్టి కాకుండా కేవలం దేవునిపై   విశ్వాసముతో కొనసాగటం. ఆరాధన అనేది, మన ప్రతి దిన చర్యలో కనపడాలి, అది మన విశ్వాస జీవిత విధానముగా అనుసరించాలి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

1, జులై 2022, శుక్రవారం

దేవునితో సాన్నిహిత్యం!

 

దేవుడు మనతో వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉండాలని కోరుకుంటున్నాడు, మన అణువణువును అయన ఎరిగి ఉన్నాడు! సృష్టి కారుడయినా దేవుడు మనకు తండ్రివలె ఉండి మనలను పోషిస్తున్నాడు, నిత్యము మన పట్ల అయన కలిగి ఉన్న ఉద్దేశ్యాలను నెరవేర్చాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కానీ మనము అనిత్యమయిన వాటికి ఆశపడి దేవుని ఉద్దేశ్యాలను కాదని మన ఇష్టానికి బ్రతకాలని చూస్తున్నాము. 

యోహాను 17: "22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. 23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని."

యేసు క్రీస్తు సిలువలో తన ప్రాణం పెట్టుటకు ముందు చేసిన ప్రార్థనలో ఈ వచనములు ఏమి చెపుతున్నాయి? దేవుడు యేసయ్యను ప్రేమించినట్లు మనలను కూడా ప్రేమిస్తున్నాడు. మరియు క్రీస్తుకు అనుగ్రహించిన మహిమను దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. దేవుని దృష్టిలో మనం క్రీస్తుకు సమానముగా మరియు అంతే ప్రాముఖ్యత కలిగి ఉన్నాము! మరి మన ఆలోచన విధానం ఏలా ఉంది? యేసయ్య ఏవిధముగా పరిపూర్ణముగా, పరిశుద్ధముగా జీవించాడో, పరిశుద్దాత్మ శక్తి ద్వారా మనకు సాధ్యమే, అప్పుడు  దేవునితో యేసయ్య అంతటి సన్నిహిత్యము మనకు కూడా ఏర్పడుతుంది. 

యేసయ్య వలె మనం నీటి మీద నడువక పోవచ్చు, అయన వలే స్వస్థతలు చెయ్యకపోవచ్చు, అయన వలే చనిపోయిన వారిని తిరిగి లేపలేక పోవచ్చు. కానీ అయన వలే దేవునికి మనకు అడ్డుగా వస్తున్నా పాపమును, మన శరీర క్రియలను జయించే శక్తిని దేవుడు తన పరిశుద్దాత్మ శక్తితో ఇస్తానంటుంటే, మనం చేస్తున్నది ఏమిటి? కోపం అణచుకోలేక పోవటం, కాముకత్వమును కాదనుకోలేక పోవటం. గర్వపడుతూ దేవుని దృష్టిలో అల్పులుగా మిగిలిపోవటం, నిత్యము నిరుత్సాహపడుతూ, తృప్తి లేకుండా దైవ దూషణకు కారకులుగా మారిపోవటం. సాతాను నిత్యమూ దేవుని దగ్గర మనలను బట్టి ఆయనను దూషిస్తూ (యోబు 2:9) మన మీద నేరారోపణ చేస్తూ తనతో పాటు మనలను నరకాగ్నికి సిద్ధం చేస్తున్నాడు ఎరిగి  అని ఉన్నామా? 

ఆనాడు తప్పిపోయిన కుమారుడు తన ఆస్థికోసం తండ్రి నుండి విడిపోయినట్లు, మనం కూడా మన శరీర క్రియలను బట్టి దేవునికి దూరంగా బ్రతకాలని ఇష్టపడుతున్నాము లేదా దూరంగా అయిపోతున్నాము. మన శరీరము మన సొత్తుకాదు, అది దేవుని వలన అనుగ్రహింపబడి, అయన మనకు అనుగ్రహించు పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నది.  క్రీస్తు మనలను ఎంతో వెల చెల్లించి కొన్నాడు కనుక శరీరముతో దేవుణ్ణి మహిమ పరచాలి  (కొరింథీయులకు 6:19-20)  అని దేవుని వాక్యం సెలవిస్తున్నది.  పాత నిబంధన ప్రకారం దేవుడు, మానవుల పాప క్షమాపణార్థం జంతువులను బలిగా అర్పించులాగున నియమం పెట్టాడు. ఆ నియమం ప్రకారం జంతువులను చంపి, బలి పీఠం మీద దహనం చెయ్యాలి. కానీ నేడు మన శరీరాలను సజీవముగా సమర్పించాలి (రోమీయులకు 12:1) అని దేవుని వాక్యం సెలవిస్తోంది. 

అనగా శరీర క్రియలకు లొంగిపోకుండా వాటిని లొంగదీసి మన శరీరమును బానిసగా చెయ్యాలి (1 కొరింథీయులకు 9:27).  అప్పుడు  దేవుడు  తనతో మన సన్నిహిత్యముకు అడ్డుగా వచ్చే ప్రతి క్రియను జయించే శక్తిని తన పరిశుద్దాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మనం క్రీస్తు  చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటిస్తూ, ఆయనతో నిత్య సహవాసం చేస్తుంటాము. అందును బట్టి అయన స్వభావమును పొందుకొని తన  స్వరూపములోకి మారుతాము.  క్రీస్తు శరీర దారిగా ఉన్న దినములలో నిత్యము మహా రోధనతో మరియు కన్నీళ్ళతో కూడిన ప్రార్థనలు చేస్తూ దేవుని యెడల భయభక్తులు చూపుట ద్వారా పాపం అనే మరణం నుండి దేవుని చేత రక్షించబడ్డాడు (హెబ్రీయులకు 5:7) అని దేవుని వాక్యం సెలవిస్తోంది.  

మరి మనం పాపం జయించటానికి అటువంటి ప్రార్థనలు చేస్తున్నామా? ఎంతసేపు భూమిమీద బ్రతికే ఎనభై ఏళ్ళలో అన్ని సక్రమంగా జరిగిపోవాలి, అది కావాలి ఇది కావాలి అని ప్రార్థనలు చేస్తాము. కానీ దేవుడు కోరుకుంటున్న నిత్య సహవాసం అయన మనకు ఇస్తానన్న నిత్య జీవితము ప్రాముఖ్యం లేనివిగా మారిపోయాయి. అయన మనలను సృష్టించినప్పుడు, మనలను ఎలా పోషించాలో, ఎలా నడిపాంచాలో ప్రణాళిక లేకుండా ఉంటాడా? పక్షి రోధనను పట్టించుకొనే దేవునికి, సింహం పిల్లలను ఆకలికి ఉంచని దేవునికి, ఎంతో శ్రేష్ఠముగా ఎంచిన నీ జీవితం  పట్టింపు  లేదా? సోమరిగా ఉండవద్దు కానీ విశ్వాసంతో మన ప్రయత్నాలు చేస్తూ  భయం, ఆందోళన దూరం చేసుకోవాలి.  

మన జీవితంలో ఇప్పుడు ఎదురవుతున్న ప్రతి సమస్య దేవుడు అనుమతించిందే, అయన ప్రణాళికలు మన భవిష్యత్తును బాగు చేయటానికే తప్ప భగ్నం చేయటానికి కాదు (యిర్మీయా 29:11)  అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఒక వేళ దేవునికి విరుద్ధముగా నిర్ణయం తీసుకోని ఇప్పుడు కష్టాలు కొని తెచుకున్నావా? దేవుని ముందు మోకరించి క్షమాపణ కోరుకో! ఆ కీడును కూడా నీకు మేలుగా మారుస్తాడు. నిరాకారంగా మారిపోయిన భూమిని దేవుడు తిరిగి బాగు చెయ్యలేదా? (ఆదికాండము 1:2)  మన జీవితాలను కూడా బాగు చేసే సమర్థుడిగా దేవుడు ఉన్నాడు. భారం మోయటం అపి అయన మీద వేసి కొనసాగటమే మనం చేయవలసింది. 

మనలో చాల మంది దేవుని కోసం కనీసం ఏమి చేస్తే ఆయనను సంతోషపెట్టవచ్చు అని ఆలోచిస్తారు. ఆ విధముగా ప్రతి ఆదివారం మందిరముకు వెళ్ళటం, ప్రతి నెల దశమ భాగం ఇవ్వటం చేసి దేవుణ్ణి సంతోషపెడుతున్నాము అనుకుంటారు. దేవుడు మనలను పూర్తిగా కోరుకుంటున్నాడు. ఇలా వచ్చి ఆలా వెళ్లిపోవటానికి మనం బంధువులం కాదు, అయన పిల్లలం! ఒక్క ఆదివారమే కేటాయిస్తాను, మిగతా రోజులు సరదాగా అన్ని అనుభవిస్తాను అంటే కుదరదు. 

మన పిల్లలు వచ్చి మేము  ఆదివారం మాత్రమే మన ఇంట్లో ఉంటాము, మిగతా రోజులు పకింట్లో ఉంటాము అంటే ఎలా ఉంటుంది? ప్రతి రోజు, ప్రతి క్షణము ఆయనతో సంభందం కలిగి ఉండాలి. అనగా ఆయనకు ఇష్టం లేని క్రియలు మనకు ఎంతో ఇష్టమయిన మానివేయాలి మరియు ఆయనకు ఇష్టమయిన క్రియలు మనకు కష్టమయిన చేయాలి. అప్పుడే మనం ఆయన పిల్లలుగా, క్రీస్తు పెండ్లాడె వధువు సంఘములో భాగంగా పరిగణింపబడుతాము. లేదంటే అరకొర ఆత్మీయ జీవితంతో మనలను మనమే మోసపుచ్చుకుంటాము. 

మరి కొంతమంది దేవుని పరిచర్య చేయాలని, ఎదో ఒకటి చేసేయ్యాలి అని తమకు ఉన్న తాలాంతులను వాడుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. దేవుని చిత్తము కనిపెట్టకుండా ఎదో ఒకటి చెయ్యాలి అని అత్యుత్సాహంతో చేస్తుంటారు. చాల సార్లు దేవుడు తమకు ఇచ్చిన లౌకిక బాధ్యతలు, ఆశీర్వాదాలు కూడా వదిలేసి దేవుని కోసం ఎదో చేస్తున్నాము అన్న భావనలో ఉంటారు.  కానీ వారి విషయంలో దేవుని చిత్తము ఏమిటి? అని అడిగి తెలుసుకోవాలి.  

మార్త మరియు మరియ విషయంలో యేసయ్య ఏమి చెప్పాడు గుర్తుందా? (లూకా 11:38-42) యేసయ్యకు ఎదో చెయ్యాలని మార్త ఆరాటపడుతుంటే మరియ అయన పాదాల దగ్గర కూర్చుని అయన చెప్పే సంగతులు వింటూ ఉంది. "ప్రభు మరియను నాకు సహాయంగా పని చేయమను" అన్న మార్తతో యేసయ్య, "నువ్వు అనవసరమయిన వాటి కోసం విచారిస్తూ తొందరపడుతున్నావు కానీ మరియ శ్రేష్ఠమయిన దానినే ఎన్నుకోంది! అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు" అని చెప్పాడు కదా!  కొన్ని సార్లు దేవుడు మనలను మౌనంగా ఉండమంటాడు, అప్పుడు అయన చిత్తమును చెయ్యాలి. అయన పరిచర్య కంటే కూడా అయనను వినటం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్న తలంతు ఎక్కడికి పోదు, దాన్ని వాడుకొనే అవకాశం ఆయనే మనకు ఇస్తాడు. 

ప్రియమయిన సహోదరి సహోదరుడా! సొలొమోను గారు రాసిన పరమగీతము చదివినట్లయితే, క్రీస్తుకు మరియు వధువు సంఘముకు సాదృశ్యముగా ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. ప్రియుడు, ప్రియురాలు ఎంతటి అన్యోన్యత కలిగి ఉండాలో, ఎంతగా ఒకరి నొకరు కోరుకోవాలో ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది (పరమగీతము 7:6-12). క్రీస్తు మన ప్రతి ఆణువణువూ ఎరిగి ఉన్నాడు, మనతో అత్యంత సన్నిహిత్యం కోరుకుంటున్నాడు. 

ఆదే విధమయిన ఆరాటం మనకు ఉందా? అంతగా క్రీస్తును ఎరిగి ఉన్నామా? సంపూర్ణ సమర్పణ మనం చేస్తున్నామా? క్రీస్తు అనే మన ప్రియుడు తన సమస్తం మన కోసం అర్పించి, మన పాపములు తొలగించి మనలను శుద్ధులుగా మార్చాడు, దేవునికి దగ్గరగా చేర్చాడు. హృదయమనే మన తోటలోకి  ఆయనను ఆహ్వానిస్తే అయన దాన్ని ఫలవంతంగా మారుస్తాడు. మన శరీరం ఆయనకు అర్పిస్తే తన పరిశుద్ధాత్మతో అందులో నివసిస్తాడు, అయన వెలుగుతో మనలను ప్రకాశింపజేస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్ !!