మనం విశ్వాసంలోకి రావటానికి ఎన్నో సందర్భాలు ఉంటాయి! దేవుడు మన అవసరతలు తీర్చడానో, లేదా అనారోగ్యం నుండి స్వస్థతలు అనుగ్రహించాడనో, అర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల భాధల నుండి విముక్తి కలిగించడానొ క్రీస్తు మీద విశ్వాసం పెంచుకుంటాము. ఇటువంటి విశ్వాసము కొద్ది రోజులకు అనగా అవసరాలు తీరిపొయిన తర్వాత నెమ్మదిగా సన్నగిల్లుతుంది! ఒకప్పుడు కన్నిటితొ చెసిన ప్రార్థన అవసరాలు తీరిపొయాక, అవసరం లేదనిపిస్తుంది. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చింది కేవలం మన అవసరాలు తీర్చటానికి మాత్రమే కాదు గాని మనలను పవిత్రులుగా చేసి, నిత్యమూ తన సన్నిధిలో గడిపే జీవితం ఇవ్వటానికి అని గుర్తించాలి.
మొదటి సారి విశ్వాసం లోకి రావటానికి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి ఉండవచ్చు! ఎలాగంటే, ఆనాడు ఇశ్రాయెలియులను ఐగుప్తులో బానిస బ్రతుకు నుండి విముక్తి దయచేసిన సమయం నుండి, ఎఱ్ఱ సముద్రం చీల్చి ఫరో సైన్యం నుండి రక్షించటంతో పాటు అరణ్యంలో మన్నాను కురిపించి పోషించటం చేసాడు దేవుడు. మన జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలు దేవుడు చేసి ఉంటాడు. ఆ విధముగా దేవుని మహిమను గుర్తించి విశ్వాసములో బలపడి, దేవునిలో కొనసాగటం మొదలు పెడుతాము. జీవితం సాఫిగా సాగుతుంటే, దేవుని అవసరం తగ్గిపోవటం మొదలవుతుంది. తిరిగి మనం విడిచిన ప్రతి లోకరీతిని పాటిస్తూ, పూర్వపు స్వభావమును ముందుకు తెస్తాము, దేవునికి ఇష్టం లేని కార్యములు చేయటానికి వెనుకాడము.
ఒకప్పుడు ఈ సమస్య తీరిపోతే చాలు, ఇక దేవునిలో లేదా దేవుని కోసం ఎలా పరుగు పెడతానో చూడు అనుకుంటాము. దేవుడు తన శక్తి చేత అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తాడు. ఎంతో గొప్పగా సాక్ష్యం చెపుతాము, మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు అని గొప్పగా మాట్లాడుతాము. నెమ్మదిగా దేవుని ఘనకార్యాలకు కారణాలు వెతకటం మొదలవుతుంది. మనం దేవుని కోసం చెయ్యాలనుకున్న కార్యాలు, బ్రతకాలనుకున్న జీవితం అసాధ్యంగా మారి, ఇప్పుడు అంత కష్టం అవసరమా అనుకుంటూ దేవునికి దూరం కావటం మొదలవుతుంది.
ప్రసంగి 5: "4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. 5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు."
సొలొమోను రాజు ఏమని రాస్తున్నాడు ఒక్కసారి చూడండి! దేవునికి మ్రొక్కుబడి చేసి దాన్ని చెల్లించకుండా ఆలస్యం చేసే వారిని బుద్ధిహినులుగా పరిగణిస్తున్నాడు. అటువంటి వారు దేవునికి ఇష్టం లేని వారు. సమస్య తీవ్రతను బట్టి అది చేస్తాను ఇది చేస్తాను అని మనం చేయలేని మ్రొక్కుబడులు దేవుని ముందు పలుక వద్దు. ఒక్కసారి పలికిన తరువాత మ్రొక్కుబడి చెయ్యకుండా ఆగిపోరాదు. ఇదే అధ్యాయంలో దేవుని ముందు అనాలోచితంగా పలుకుటకు హృదయమును త్వరపడ నియ్యక నీ నోటిని కాచుకొనుము (ప్రసంగి 5:2) అని రాసి ఉంది. నీ మ్రొక్కుబడి కష్టంగా ఉందా? పవిత్రంగా జీవించలేక పోతున్నావా? దేవునికి మరోసారి మొఱ్ఱ పెట్టు, ప్రతి దినము ఉదయము, సాయంత్రము ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, తద్వారా దేవుని పరిశుద్దాత్మ శక్తి నిన్ను నడిపిస్తుంది.
మనలో కొంతమంది విశ్వాసంలో ఎదుగుతూ ఉంటారు. దేవుని ఘనకార్యాలను బట్టి పవిత్రంగా జీవించటం మొదలు పెడుతారు. రెండవ సారి ఏదయినా అవసరం కలిగినప్పుడు, ఆశీర్వాదాలు కావాలనుకున్నప్పుడు తీవ్రంగా ప్రార్థించటం మొదలు పెడుతారు. అయితే దేవుని ప్రణాళికలు మనం అర్థం చేసుకోలేము. అయన కార్యములు గంబీరమయినవి, ఎన్నో కోణములు కలిగి ఉంటాయి. మనం కోరుకున్నది జరగనప్పుడు, నెమ్మదిగా విశ్వాసం సడలి పోవటం మొదలవుతుంది. కన్నీటి ప్రార్థనతో మొదలయి, నిట్టూర్పులతో కొనసాగుతూ చివరకు సణుగుకొవటం వరకు వెళ్తుంది. ఆనాడు ఇజ్రాయెలీయిలు, దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుత కార్యములను మరచి, కాస్త ఆలస్యానికే సణుగు కోవటం మొదలు పెట్టారు.
"మేము ఐగుప్తులో ఉంటేనే బాగుండేది, మమల్ని చంపటానికి తీసుకోని వచ్చారా" అని దేవుని స్నేహితుడయిన మోషేతో వాదనకు దిగారు. దేవుడు విడిపించక ముందు తాము బానిసలుగా అనుభవించిన శ్రమలను పూర్తిగా మరచి పోయారు. మాంసం లేదని, నీళ్ళు ఆలస్యంగా దొరికాయని దేవుని మీద సణుగుకున్నారు. ఇదివరకు మనకు ఉన్న కష్టాల నుండి దేవుడు ఎలా నడిపించాడు మరచి పోవద్దు. ఇప్పుడు ఆలస్యం జరుగుతున్న కారణం, మనకు మేలు చేసేది గానే ఉంటుంది. దేవుని ప్రణాళికలు మనలను అభివృద్ధి చేయటానికే తప్ప నశింప చేయటానికి కాదు (యిర్మీయా 29:11) అని గుర్తుంచు కోవాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని, అయన ఉనికిని ప్రశ్నిస్తే ఎలా?
జెఫన్యా 1: "6. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను."
జెఫన్యా 1: "12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షిం తును."
ఈ వచనములలో జెఫన్యా ప్రవక్త దేవుని నుండి పొందిన ప్రవచనం ఒక్కసారి చూడండి! దేవుణ్ణి అనుసరించక, ఆయనను విసర్జించి, అయన యొద్ద విచారణ చేయని వారిని అయన నిర్మూలము చేస్తానని అంటున్నాడు. నువ్వు కోరుకున్న మేలులు పొందుకున్న తర్వాత ఇంకా దేవుని చిత్తము దేనికి అని తలుస్తున్నావా? ఒకప్పుడు నీ చిత్తమే చేస్తాను తండ్రి అని పలికి, ఇప్పుడు అయన చిత్తం ఏమిటో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నావా? అటువంటి వారిని దేవుడు నిర్ములము చేస్తానంటున్నాడు.
అదే విధముగా నువ్వు కోరుతున్న మేలులు పొందుకోవటం లేదని, నీ ప్రార్థనలకు సమాధానం లభించటం లేదని, దేవుడు ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే అని ఆలోచిస్తున్నావా? అయన కీడు చేయడు, మేలు కూడా చేయడు అని ఆలోచిస్తూ నామమాత్రంగా, మొక్కుబడిగా ప్రార్థిస్తున్నావా? అయన లోకమంతటిని పరిశోధిస్తున్నాడు. తమ హృదయములలో దేవుని గురించి నామమాత్రంగా ఉన్నవాడు అనుకునే వారిని శిక్షిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు.
సహోదరి సహోదరుడా దేవుడు మనలను తన ప్రాణం పెట్టి రక్షించుకున్నది, మనం ఆయనతో సహవాసం కలిగి నిత్య జీవితం పొందుకొని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి. అంతే కానీ మన గొంతెమ్మ కోరికలు తీరుస్తూ మనం ఆయనకు దూరంగా బ్రతకటానికి కాదు. ఒక వేళ నువ్వు కోరుతున్నది అవసరం అయినా సరే, తగిన సమయంలో మనకు ఆయనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే అయన ప్రణాళికలు మనలను అభివృద్ధి చేసేవే కానీ మనలను నశింప చేసేవి కావు. కనుక ఓర్పుతో అయన చిత్తము కొరకు కనిపెడుదాము.
యోహాను 5: "14. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా"
ముప్పయి ఎనిమిది ఏళ్ళుగా బేతెస్థ కొలను దగ్గర స్వస్థత లేక పడి ఉన్న వ్యక్తిని యేసయ్య స్వస్థ పరచి, నీ పరుపు ఎత్తుకొని నడువు అన్నాడు. అక్కడ ఎంతో మంది స్వస్థతల కోసం పడిగాపులు కాస్తుంటే, యేసయ్య ఆ వ్యక్తిని మాత్రమే స్వస్థపరిచాడు. మరి నిన్ను కూడా అలాగే రక్షించుకున్నాడు. నీ అవసరతలు తీర్చాడు, నీకు అసాధ్యం అనుకున్న కార్యాలు చేసాడు. మరి ఇప్పుడు నీవు వాటన్నింటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఓర్పుతో నిరీక్షిస్తూ ప్రార్థిస్తున్నావా? లేక దేవుడు పెద్దగా అవసరంలేదని నామమాత్రంగా విశ్వసిస్తున్నావా? స్వస్థతలు అందుకుని, మేలులు పొందుకుని దేవుణ్ణి మరచి పోయిన వారిని బట్టి యేసయ్య ఏమంటున్నాడు? మరి ఎక్కువ కీడు కలుగకుండునట్లు, ఇకపై పాపము చేయవద్దని.
దేవుడు నిత్యమూ లోకమును పరిశోధిస్తున్నాడు. తన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారిని ప్రతి క్షణము కాపాడుతూ ఉంటాడు. కానీ ఆయన శక్తిని తక్కువ చేసి ఆలోచిస్తే నశించి పోతాము. మరియు అయన ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి పాపంలో పడిపోతే, మరి ఎక్కువ కీడు పొందుకుంటాము. మన దేవుడు అనంత ప్రేమను కలిగి ఉన్నవాడు. ఎన్ని సార్లయినా నిన్ను క్షమిస్తాడు, కానీ నీ ఆత్మీయ పరుగులో వెనుక బడి, దేవుని ప్రణాళికలు, నీ పట్ల అయన ఉద్దేశ్యాలు తప్పిపోవద్దు. పౌలు తన జీవిత చరమాంకంలో "నా పరుగు ముగించాను" అని చెప్పిన మాట మన జీవితంలో మనం కూడా కూడా చెప్పగలగాలి, లేదంటే కేవలం భూమి మీద జీవితం ముగించిన వారిగానే మిగిలిపోతాము.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!