పేజీలు

24, ఫిబ్రవరి 2024, శనివారం

ఎంతకాలమని సణుగుతున్నావా?


క్రీస్తునందు విశ్వాసులుగా అయిన తర్వాత, మన పోషణ, అవసరములు మరియు అక్కరలు అన్ని తీర్చువాడు ఆయనేనని విశ్వాసములో కొసాగుతాము. ఎందుకంటే, యేసు క్రీస్తు ప్రభువుల వారు పలు సందర్బాలలో చెప్పిన మాటలు "దేనిని గురించి చింతపడకుడి, రేపటిని గురించి విచారించకుడి" అని. దావీదు తను రాసిన కీర్తనలో ఏమంటున్నాడు "సింహపు పిల్లలు ఆకలితో అలమటించు నెమో గాని, దేవుణ్ణి నమ్ముకొన్న వారికీ ఏదియు కొదువ ఉండబోదు" అని (కీర్తనలు 34:10-12). అలాగే అయన రాసిన 23 వ కీర్తన మొదటి వచనములో "యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు" అని ఉంది. ఈ విధంగా దేవుని వాక్యము నిత్యమూ మనలను ఆదరిస్తూ, ధైర్యము నింపుతూ ఉంటుంది. 

నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలు జనమును ఐగుప్తు లో నుండి విడిపించి, కనాను దేశమునకు నడిపినప్పుడు, అరణ్యములో, ఎడారులలో వారిని పోషించిన విధము ఎంతో అద్భుతము, మనకు అంతే ప్రోత్సాహకరము. దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులు ఎంత ప్రాముఖ్యం కలవారో మనం కూడా అంతే ప్రాముఖ్యం కలవారము. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనము కూడా అబ్రాహాము సంతానముగా పిలువబడుచున్నాము. అనగా ఇశ్రాయేలు జనమునకు దేవుడిగా ఉన్న సృష్టి కర్త, వారి పోషకుడు మనకు కూడా దేవుడిగా, పోషకుడిగా ఉన్నాడు (గలతీయులకు 3:29)

ఇశ్రాయేలు వారిని దేవుడు ఐగుప్తులో దాస్యం నుండి విడిపించి, తాను చెప్పిన వాగ్దాన భూమికి వారిని నడిపిస్తున్నపుడు అంత వరకు దేవుడు చేసిన గొప్ప కార్యములు వారు మరచిపోయారు. ఐగుప్తు వారికి వచ్చిన తెగుళ్ల నుండి వారి  పక్కనే ఉన్న తమను దేవుడు ఏలా కాపాడింది పూర్తిగా విస్మరించారు. అంతే కాకుండా ఫరో సైన్యం తమను తరుముతుంటే, వారి కనుల యెదుట మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా  చీలిన అద్బుతమును చూసి కూడా వారు కేవలం కొంత సమయం ఓర్పు వహించలేక దేవుని పై విశ్వాసం కోల్పోయారు, నిత్యమూ సణుగుకున్నారు.  దాస్యం నుండి విడిపించిన గొప్ప దేవుడు తమను పోషించలేడని వారు అనుకోవటం ఎంత వరకు న్యాయము?

మత్తయి సువార్త 6: "26.  ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?"

యేసు క్రీస్తు ప్రభువుల వారు తన బోధనలలో ఎన్నో మార్లు మన పట్ల  దేవుని కి ఉన్న ప్రేమను బోధించారు. సృష్టి కర్త అయినా దేవుడు ఆఖరికి ఆకాశ పక్షులను సైతం పోషిస్తున్నాడు, అటువంటిది వాటి కంటే ఎన్నో రేట్లు  శ్రేష్ఠమయిన మనలను పోషించ వెనుకాడునా? రేపును గురించి చింత వలదని యేసయ్య చెపుతున్న మాటలు నిజమని మనం నమ్మితే దేనికి చింతపడక మన పనులు మనం చేసుకుంటూ పోవటమే మన విశ్వాసము.  అయినా కూడా నేను చింతపడుతాను, ఓర్పులేకుండా దేవుని మీద సణుగుకుంటాను అంటే, యేసయ్య మాటలు నమ్మటం లేదని, దేవుని శక్తిని శంకిస్తున్నావని అర్థం. 

బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు. యాకోబు కుమారుడయినా యోసేపునే తీసుకోండి, సొంత అన్నలు బానిసగా అమ్మేసారు అయినా కూడా దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. యజమానురాలు తన మీద మనసు పడితే దేవుని మీద ఉన్న భయంతో పాపం చెయ్యలేదు. మనలాగా ఆయనకు బైబిల్ కూడా అందుబాటులో లేదు,  కేవలం తన తండ్రి చెప్పిన సాక్ష్యములు తప్ప. చివరికి నిందల పాలయి జైలులో గడపవలసిన పరిస్థితి, అయినా అతను ఎక్కడ కూడా దేవుని మీద సణిగినట్లు చెప్పబడలేదు. ఆ శ్రమలలో దేవుడు నిత్యము అతనికి తోడుగా ఉన్నడు అని దేవుని వాక్యము చెపుతుంది. ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు? దేవుడంటే ఆయనకు భయం ఉంది, అయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంది. దేవుని కార్యములు  గంభీరములు, అయన ప్రణాళికలు ఎన్నో సంవత్సరముల ముందు చూపు కలిగి ఉంటాయి. 

కీర్తనలు 105: "16. దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. 17. వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. 18. వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను. 19. అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను." 

దేశముల  మీదికి  భయంకరమయిన  కరువు రాబొవుతుంది గనుక అబ్రాహాము సంతతిని కాపాడటానికి దేవుడు యోసేపును ముందుగా ఐగుప్తులోకి బానిసగా పంపాడు.  తర్వాత అతను  యజమాని పోతీఫరు వద్ద ఎన్నో యాజమాన్య పద్ధతులు నేర్చుకున్నాడు. అటుపైన జైలులో ఖైదీగా ఉన్నపుడు దేవుడు తనకు ఇచ్చిన కలలు వివరించే వరం ద్వారా  ఇతర ఖైదీలకు వారి కలలను వివరించాడు. దేవుడు రాజుకు  కలను ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు వివరించలేనప్పుడు,  యోసేపు వివరించిన  కల నిజమయి రాజు కొలువులో ఉన్న పూర్వపు ఖైదీ యోసేపు గురించి చెప్పటం, రాజు అతన్ని పిలిచి కల వివరణ విన్న తర్వాత దేశానికి ప్రధాన మంత్రిని చేయటం, తద్వారా తన సోదరులను, తండ్రిని కలుసుకోని వారిని కరువునుండి కాపాడటం అన్ని దేవుని కార్యములే. 

దేవుని వాగ్దానాలు నెరవేరు వరకు అయన వాక్కు యోసేపును పరిశోదించు చుండెను అని రాసి ఉంది. అయన వాక్కు మనలను కూడా పరిశోధిస్తుంది, కనుక  ఆ పరిశోధనలో నెగ్గుద్దాం. కానీ యోసేపు తర్వాత వచ్చిన మరో తరం అబ్రాహాము సంతతి వారయినా ఇశ్రాయేలీయులు మిక్కిలి విశ్వాసం లేని వారిగా, సణుగు కొంటూ దేవుని ఆగ్రహానికి లోనయిన వారిగా చూస్తాము. ఇశ్రాయేలీయులు తనను రాళ్లతో కొట్టి చంపివేస్తారేమో  అని మోషే దేవుడికి మొఱ్ఱ పెట్టినంత తీవ్రముగా వారి సణుగుడు ఉండింది. 

నిర్గమకాండము 16: "7. యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి. " 

ఇశ్రాయేలు వారి సణుగుడు దేవుడు విన్నడు.  వారి ఓర్పులేని తనమును దేవుడు సహించాడు. తమను దాస్యము నుండి, నరక యాతన నుండి విడిపించిన దేవుని గొప్ప కార్యమును మరచి కొద్దీ సేపు కలిగిన దాహమును బట్టి ఆ దాస్యములో ఉంటేనె మంచిది అని మాట్లాడుతున్నారు. అటువంటి ప్రవర్తన మనలో ఉందా? అయితే దేవుడు మన సణుగుడు వింటున్నాడు. అయన చేసిన గొప్ప కార్యములను మరచినందుకు బాధపడుతున్నాడు. మన సణుగుడును బట్టి అయన హస్తము మననుండి తొలగిపోక ముందే ఆయనను మన్నించమని వేడుకుందాం. ఇశ్రాయేలు జనము సణుగుడును బట్టి మోషే ఎన్నో మారులు దేవునికి మొఱ్ఱ పెట్టాడు, క్షమాపణ వేడుకున్నాడు,  అందును బట్టి దేవుడు వారిని క్షమించాడు. 

సంఖ్యాకాండము 21: "5కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్య మైనదనిరి. 6.  అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.

ఇశ్రాయేలు వారి సణుగుడును  బట్టి దేవుడు ఆగ్రహించి వారి మీదికి సర్పములు రప్పించాడు. మోషే ప్రార్థించగా సర్పము ప్రతిమను చేయించమని దాన్ని చూసిన వారినందరిని రక్షించాడు. ఇక్కడ సర్పము ప్రతిమ యేసయ్యకు ప్రతి రూపముగా ఉన్నదని భావించవచ్చు. మనకు అంతటి ఘోర శిక్ష కలుగ పోవటానికి కారణం! యేసయ్య మన పాపములు అన్ని సిలువలో భరించాడు, మరియు ఇశ్రాయేలు జనమునకు ఉన్న ప్రత్యక్షత మనకు లేదు. కానీ దేవుని ప్రత్యక్షత మనకు పెరుగుతున్న కొలది మన ఆత్మీయ  స్థాయిని కూడా పెంచుకుంటూ పోవాలి. అనగా మనం  విశ్వాసములో బలపడుతూ సాగిపోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారికి అయన చిత్తము చొప్పున  సమస్తము సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తోంది (రోమీయులకు 8:28).

అంతే కాకుండా దేవుడు మన శక్తిని మించిన శోధన మన మీదికి రప్పించడు. కనుక దేవుని మీద సణగటం మాని, ఎడతెగక ప్రార్థించి అయన చిత్తము తెలుసుకొని, అయన మీద భారం వేసి సాగిపోవటమే మన విశ్వాసము. ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లుగా మనం ఇశ్రాయేలు వంటి వారమే, వారిని పోషించిన దేవుడు మనలను కూడా పోషించగలడు. వారిని నశింప చేసిన దేవుడు మనలను కూడా నశింపజేయగలడు. ఆనాటి ఇశ్రాయేలీయులు క్రీస్తు అనే బండలో నుండి నీరు తాగిన వారు కానీ దేవునికి ఇష్టమయిన వారుగా ఉండక సంహరింపబడ్డారు. సణుగుకొని విష సర్పముల చేత కరువబడి నశించి పోయారు (1 కొరింథీయులకు 10: 9). ఈ హెచ్చరికలు మన హృదయములలో ఉంచుకొని ఇకనయినా సణుగుట అప్పేద్దాం. 

1 కొరింథీయులకు 10: "13. సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుడు కార్యములు ఆలస్యం చేస్తున్నాడని భావించవద్దు, ఇంకా ఎంత కాలం అని ప్రశ్నించవద్దు. నీ అవసరములు, అక్కరలు ఆయన ఎరిగి ఉన్నాడు.  అయన ప్రణాళికలు బయలు పడితే గాని అర్థం కావు. ఆ ఆలస్యంలో ఎదో మంచి దాగి ఉంది, తన నామము నీ ద్వారా మహిమపరచుకుంటున్నాడు. అందును బట్టి ఆయనకు స్తోత్రము. కానీ ఇంకా నా వల్ల కాదు అంటే, దేవుడు నిన్ను పరిశోదించటాన్ని తప్పు పడుతున్నావా? అయన నువ్వు తట్టుకోలేని శోధన ఇవ్వడు అన్న మాటను నమ్మటం లేదా? దేవుడు  ప్రతి వాగ్దానము  నెరవేర్చు సమర్థుడు, అయన రాయించిన ప్రతి మాట సత్యము. సణుగుట మాని ప్రార్థించటం అలవాటు చేసుకుందాం, అయన చిత్తమును కనిపెట్టి నడుచుకుందాం. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

సంఘములో ఐక్యత!


సంఘము అనగా యేసు క్రీస్తును తలగా చేసుకొని అయన దేహముగా అయన రెండవ రాకడ కోసం సిద్దపడే వధువు వంటిది. క్రీస్తు దేహముతో పోల్చినప్పుడు అందులో భాగములు కూడా ఉంటాయి కదా! అనగా సంఘములో ఉండే అంగములే విశ్వాసులు. ఈ విశ్వాసుల మధ్యలో ఐక్యత, సఖ్యత కలిగి ఉంటేనే సంఘమంత ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నట్లు చెప్పుకోవచ్చు. కానీ నేటి సంఘములలో అటువంటి ధోరణి కొనసాగుతుందా? వాటి గురించి తెలుసుకొనే ముందు! అసలు సంఘము యొక్క లక్షణములు ఏమిటి? వాక్యానుసారముగా తెలుసుకుందాం.

అపొస్తలుల కార్యములు 2: "45. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. 46. మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను."

ఈ వచనము ఆనాడు ఆదిమ సంఘము, పెంతేకొస్తు దినమున పరిశుద్దాత్మ పొందుకొన్న తర్వాత, ఏవిధముగా తాము ప్రభువులో ఎదుగుతూ తమ పరిచర్యను కొనసాగించారో తెలుపుతుంది. విశ్వాసులు అందరు  తమకు కలిగినది అమ్మి అవసరం ఉన్నవారికి పంచి ఇచ్చారు. అంతే కాకుండా వారు ఏక మనస్సు కలిగిన వారై! దేవుణ్ణి స్తుతించారు. తద్వారా ప్రజల యొక్క దయను పొందారు. ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారము పుచ్చుకొనే వారు. మరియు ప్రభువు అనుదినము రక్షణ అనుభవము పొందిన వారిని వారితో చేర్చు చుండెను. అనగా రోజు కొత్తవారు సంఘములో చేర్చబడు చున్నారు. క్రీస్తు సంఘముగా ప్రజల యొక్క ఆదరణ పొందటం ఎంతో ప్రాముఖ్యమయినదిగా పరిగణించాలి. మన ప్రవర్తనయందు క్రీస్తు ప్రేమను చూపుతూ మన యొక్క రక్షణను ప్రకటించాలి. 

ఆవిధముగా ప్రభువు ప్రేమను ప్రజలకు చాటి అయన వైపు వారిని నడిపించాలి. ఇది జరగాలంటే విశ్వాసులు ఏక మనసు కలిగిన వారై ఉండాలి. దేహము యొక్క ప్రవర్తన తలను బట్టి ఉంటుంది గాని చేతిని బట్టి, ముక్కును బట్టి లేదా కళ్ళను బట్టి ఉండదు. అదే విధముగా సంఘము యొక్క ప్రవర్తన కూడా తలగా ఉన్న క్రీస్తును పోలి నడుచుకోవాలి గాని ఏ ఒక్క విశ్వాసిని బట్టి, సంఘ పెద్దలను బట్టి కాదు. దేవుడు ప్రతి విశ్వాసిని తన దేహములో అనగా సంఘములో అవయవాలుగా చేసాడు. తన చిత్తము చొప్పున తలాంతులు అనుగ్రహించి తన పరిచర్యను చేయటానికి అనగా తన రాజ్య వ్యాప్తికై వాడుకుంటున్నాడు. తద్వారా సంఘము యొక్క అభివృద్ధిని జరిగిస్తున్నాడు అనగా కొత్తవారిని చేర్చటానికి ఇష్టపడుతున్నాడు. కొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల సంఘ సభ్యుల ప్రవర్తనను విశదీకరిస్తూ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము చదవండి.

సహోదరులందరు ఏకభావము కలిగిన వారై ఉండాలి, కక్షలు లేకుండా ఏక మనసు కలిగిన వారై ఉంటు  ప్రభువు రాకడకై సంఘముగా సిద్దపడి ఉండాలి. విభిన్న మనస్తత్వాలు, నేపథ్యాలు కలిగిన మనుష్యుల మధ్య ఇది సాధ్యమేనా? ఒక ఇంట్లో పుట్టిన సహోదరి, సహోదరుల మధ్య ఎన్నో మనస్పర్థలు ఉన్నప్పుడు, ఇంతమంది పరాయి వారు ఉన్న సంఘములో ఐక్యత ఎలా సాధ్యం అవుతుంది? ప్రతి విశ్వాసి తమను తాము తగ్గించుకోవాలి, ఇతరులను ప్రేమించాలి అన్న క్రీస్తు లక్షణాలు కలిగి ఉంటె సాధ్యమే కదా! తగ్గించుకుంటే తగిన ఘనత దేవుడు మనకు ఇస్తాడు. 

1 పేతురు 3: "8.  తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. 9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి." 

అపొస్తలుడయిన పేతురు గారు కూడా తాను రాసిన మొదటి లేఖలోని వచనములు చూడండి. ఏక మనస్సు కలవారై ప్రతి ఒక్కరి సుఖదుఃఖముల యందు పాలు పంచుకొంటూ సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులుగా, వినయ మనస్సు కలవారై ఉండుమని ప్రోత్సహిస్తున్నారు. ఆశీర్వాదమునకు వారసులు కావటానికి మనం పిలువబడ్డ వారము కనుక కీడు చేసే వారికి ప్రతిగా కీడు చేయకుండా, దూషించిన వారిని తిరిగి దూషించకుండా దీవించుమని పరిశుద్దాత్మ ప్రేరణతో హెచ్చరిస్తున్నారు. యేసు క్రీస్తు చెప్పినట్లుగా "మిమల్ని దీవించిన వారిని దీవిస్తే మీకేమి ప్రయోజనము, మీకు తిరిగి సహాయము చేసేవారికి సహాయం చేస్తే ఏమిటి లాభము" (లూకా 14:13-14) అన్నట్లుగా ప్రతి ఒక్క విశ్వాసి ఈ లక్షణములు పాటించినట్లయితే సంఘములో ఐక్యత సాధ్యమవుతుంది.  

అలాగే ప్రతి ఒక్కరు కూడా మృదువైన మాట తీరును అలవరచు కోవాలి. ఆవిధమయిన మాట తీరు  ఎదుటి క్రోధమును చల్లార్చుతుంది, కానీ నొప్పించు మాట కోపమును రేపుతుంది. అసలు ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు విడిపోవడానికి సొలొమోను కుమారుడవైన రెహబాము మాట్లాడిన పరుషమయిన మాటలే అని లేఖనములు స్పష్టం చేస్తున్నాయి. ఇశ్రాయేలు వివిధ గోత్రముల నుండి కొంతమంది పెద్దలు రెహబాముతో కొన్ని విన్నపములు చేసుకోవటనికి వచ్చారు. అతని తండ్రి అయినా సొలొమోను వారిని ఎంతగా కష్టపెట్టింది చెప్పుకొని తననైనా ఆ కష్టములు తొలగించుమని వేడుకుంటారు (1 రాజులు 12: 3-4)

1 రాజులు 12: "13. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను 14. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును."

ఇక్కడ అహంకారుడయినా రెహబాము పెద్దల మాటను పేడ చెవిన పెట్టి తనవంటి  యవ్వనస్తులు చెప్పిన సలహాలు విని వారితో పరుషంగా మాట్లాడి ఇశ్రాయేలులో పది గోత్రముల వారు విడిపోయేలాగా ప్రవర్తించాడు.  రాజు తమ మాట మన్నించకపొగ పరుషంగా మాట్లాడినందుకు తన ఏలుబడిలో నుండి వెళ్ళి పోయారు ఇశ్రాయేలు వారు. తద్వారా ఇశ్రాయేలులో సమైఖ్యత నశించిపోయింది. సంఘములో సైతం పరుషముగా మాట్లాడుతూ, ఇతరులను నొప్పించువారు ఉన్నట్లయితే సంఘములో ఐక్యత ఖచ్చితంగా దెబ్బ తింటుంది. కనుక మృదువయిన మాట తీరును అలవరచుకుందాం! ఏక మనసు కలిగి ఉండటానికి ఇష్టపడుదాం కానీ ఏక పక్షముగా ఉండటాన్ని కాదు. ఇక్కడ రెహబాము ప్రజలు లొంగి ఉంటున్నారు కదా అని నిరంకుశంగా ఏక పక్షంగా ఉండాలని చూశాడు, కానీ ప్రజలు దాన్ని స్వాగతించ లేదు. సంఘములో ఉండే పెద్దలు సైతం ఇటువంటి మనస్తత్వమును మానుకోవాలి. 

క్రీస్తు ప్రేమయే మనలను ఐక్యపరచే బలము. ఆ ప్రేమ లోపించిన నాడు భిన్న మనస్తత్వాలు, సొంత చిత్తములు బయలు దేరుతాయి. క్రీస్తు ప్రేమ రెహబాము వంటి స్వభావమును అంగీకరించదు, సంఘము యొక్క ఐక్యతను కోరుకుంటుంది, ప్రతి సభ్యుడిని పాలిబాగస్తుడిగా చేర్చుకుంటుంది. కన్ను ఒక్కటి ఉంది కదా అని రెండవ కన్నును ఎవరయినా నిర్లక్యం చేస్తారా? చేతికి వెళ్ళు పది ఉన్నాయి కదా అని ఒక్క వేలిని నరికేసు కుంటారా? సంఘములో ఉన్న ప్రతి అంగము అనగా ప్రతి విశ్వాసి అంతే ప్రాముఖ్యం ఉన్నవాడు. అది దేవుని చిత్తముగా జరిగింది కనుకనే ఆ విశ్వాసి ఆ సంఘములోకి నడిపింపబడ్డాడు. విశ్వాసులను సరిచేయటం తప్పు కాదు, వారు మారనప్పుడు వదిలేయటం వాక్యానుసారం కానిది కాదు. కానీ అతను నా వాడు, ఇతను ఫలానా అతని వాడు అని గుంపులు కట్టటం కొరింథీయులకు రాసిన పత్రికలల్లో  పౌలు గారు ఏనాడో ఖండించాడు.  

రాజులు 18: "31.  యెహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని 32. ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి"

దేవుని ప్రవక్త ఏలీయా  బయలు ప్రవక్తలను సవాలు చేసి యెహోవాకు బలి అర్పించుటకు ముందు విడిపోయిన ఇశ్రాయేలు గోత్రములన్నింటిని బట్టి పన్నెండు రాళ్లు తెప్పించి దేవునికి బలి పీఠము కట్టి ఆ గోత్రముల సమైక్యతను, సమానత్వమును చాటుతున్నాడు. అటువంటి ప్రవర్తన  దేవునికి ఎంతో ప్రీతికరమవుతుంది! అటువంటి స్వభావము మనం కలిగి ఉన్నామా? వారు మా కులం వారు, వీరు మా వీధి వారు లేక మా ఉరి వారు అని ఇంకా తారతమ్యాలు పాటిస్తున్నామా?  సంఘము అనగా లోక రీతిగా ఒక కులం వారు కలుసుకోవటం కాదు, ఒక ఉరి వారు విహార యాత్రకు రావటం కాదు, లేదా కేవలం స్నేహితులు చేసుకొనే విందు కాదు.  ఒకరి మంచిని ఒకరు మెచ్చుకుంటూ, ప్రతి ఒక్కరు ఇతరుల మంచిని, క్షేమమమును ఆశిస్తూ, క్రీస్తులో ఎదగటం. అనగా అయన ప్రేమను చూపుతూ ఇతరులను ఎదిగించటం. 

తద్వారా క్రీస్తు రెండవ రాకడకై మనం సిద్దపడుతూ అయన చిత్తముగా ఇతర ఆత్మలను రక్షించటం. అందరం క్రీస్తు వారలము, దేవుని బిడ్డలము అన్న భావన కలిగిననాడు సంఘములో ఐక్యతకు లోటేమి ఉంటుంది. ఇవన్ని జరిగేలా చూడవలసింది సంఘములో ఉండే పెద్దలు. యధా రాజా తధా ప్రజ లాగా పరిస్థితి మారకుండా ఉండాలంటే యధా క్రీస్తు తథా సంఘముగా పరిస్థితి మారాలి. ప్రస్తుతం సంఘములలో పెత్తనాల కోసం పోరు మాములుగా ఉండటం లేదు. దేవుని సంఘములో ఎన్నికలు పెడుతున్నారు. అపొస్తలలు ఏనాడయినా  ఎన్నికలు పెట్టారా? యేసు క్రీస్తు తన వృత్తి చేసిన వారినే శిష్యులుగా ఎంచుకున్నాడా? చీటీలు వేసి తండ్రి నీ చిత్తము బయలు పరచు అని సభ్యులను ఎన్నుకొంటే సరిపోదా? సంఘ పెద్దలు ప్రార్థిస్తే దేవుడు తన  చిత్తమును  బయలు పరచాడా? 

ప్రియాయమయిన సహోదరి, సహోదరుడా! సొలొమోను రాజు దగ్గరికి వచ్చిన ఎంతో ప్రసిద్దమయిన తగువు సంఘటనను ఈ పరిస్థితులకు ఆపాదించి చూద్దాము. ఇద్దరు తల్లులు ఒక్క బిడ్డతో వచ్చి ఆ బిడ్డ నాదంటే నాదని తగువులాడుకున్నారు. అటువంటి స్థితిలో చాల సంఘాలు కూడా ఉన్నాయి. సంఘము నాదంటే నాది అని సంఘ పెద్దలు తగువులాడుకుంటున్నారు. వారి వారి గొప్ప కోసం సంఘమును ముక్కలు చేయటానికి వెనుకాడటం లేదు. కానీ సొలొమోను, బిడ్డను రెండు ముక్కలుగా చేయమన్నప్పుడు నిజమయిన తల్లి తన బిడ్డను త్యాగం చేయటానికి వెనుకాడలేదు. ఆ తల్లికే బిడ్డ అప్పగింపబడింది కానీ ముక్కలు చేయమన్న తల్లికి కాదు. కనుక  సంఘంలో  నీ పరిస్థితి ఎలాంటిదయినా సంఘమును ముక్కలు చెయ్య వద్దు. దేవుని చిత్తమును కనిపెట్టు ఆయన ప్రేరేపిస్తే అక్కడ నుండి వెళ్ళిపో. ఆయనే నిన్ను తన చిత్తానుసారముగా వాడుకుంటాడు. దేవుణ్ణి నమ్ముకొని, అయన చిత్తము నెరవేర్చి నశించి పోయినవాడు ఎక్కడ వెతికిన దొరకడు. దేవుని సంఘము ఐక్యతను కోరుకోవటం కన్న మించిన దేవుని చిత్తము మరోటి ఉంటుందా? 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగముతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

అపవాది!

నేను పడిపోయానని నవ్వుతున్నావా?
నా పశ్చతాపాన్ని పరిహాసం చేస్తున్నావా?
మరల పడిపోతానని ఎదురు చూస్తున్నావా?
ఎలా మోసం  చెయ్యాలా అని యోచిస్తున్నావా?

సిలువలో నీ ఓటమిని మరిచావా?
నా రక్షకుని రక్తానికి విలువ కట్టగలవా?
తన ప్రేమకు హద్దు చూపగలవా?
ఆ మరణము జాడ తెలుపగలవా?

నా పైన నీ విజయం తాత్కాలికమే
నీ మరణపు ఛాయలు అశాశ్వతమే
నా రక్షణ తప్పించటం నీకు అసాధ్యమే
తుదికి నాకు లభించేది నిత్య జీవమే 

మొదలు పెట్టిన నా దేవుడు వదిలి పెట్టడు
పరుగు ముగిసే వరకు నన్ను కొనసాగిస్తాడు
తనకు అనుగుణముగా మలుచుకుంటాడు
నీ చెరల నుండి నన్ను తప్పక విడిపిస్తాడు
తన సన్నిధిలో ఖచ్చితముగా నిలుపుకుంటాడు

3, ఫిబ్రవరి 2024, శనివారం

నాలుకతో జాగ్రత్త!దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనుష్యులు బ్రతుకుతారని దేవుని వాక్యం చెపుతోంది. అయితే మనలో చాల మంది మాట్లాడే మాటలు ఇతరులను బాధించేవిగా ఉంటాయి. వెనుక ముందు ఆలోచించకుండా మనం పలికే చెడ్డ మాటలు ఇతరులను తీవ్రమయిన ఇబ్బందులకు గురి చేస్తాయి. కనికరం లేని మాటలు పలికే వారు కూడా కనికరం లేని (యాకోబు 2:13) తీర్పును పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగే  "మనం వినటానికి త్వరపడాలి, మాట్లాడటానికి ఆలస్యం చేయాలి" (యాకోబు 1: 19).  తద్వారా ఎదుటి వారి జ్ఞానమును తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది, లేదంటే మనకు తెలిసిందే మనం చెప్పగలం, దాని వలన మనం కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. 

లోకంలో ఉన్న తీరును బట్టి అధికముగా మాట్లాడే వారు మాత్రమే తెలివయిన వారు అని భ్రమ పడుతారు. కానీ సందర్బమును బట్టి మాటలను నియంత్రించుకునే వారు అనగా తమ నాలుకను కట్టడి చేసుకొనే వారు మాత్రమే తెలివయిన వారు. అంతే కాకుండా దేవుణ్ణి స్తుతియించె నాలుకతో దేవుని స్వరూపములో చేయబడిన సాటి సహోదరుణ్ణి లేదా సహోదరిని దూషించటం, మనలో దేవుని ప్రేమను చూపించదు. ఎందుకంటే మంచి నీటి ఊటలో నుండి ఉప్పు నీరు ప్రవహించనట్లే, దేవుని ప్రేమ కలిగి ఉన్న మనలో నుండి శాపనార్థలు, దూషించే మాటలు రాజాలవు (యాకోబు 3:11)

కొలస్సయులకు 3 : "8. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి."

ఇక్కడ పౌలు గారు పేర్కొన్న పాపపు కార్యములన్ని కూడా నాలుకతోనే చేసేవిగా ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు మౌనముగా దేవుని వాక్యమును ధ్యానించు కోవాలి లేదా మౌనముగా మనసులోనే ప్రార్థించు కోవాలి. ఎలాంటి సందర్భములోను  నిగ్రహము కోల్పోయి మన ఆగ్రహమును చూపించ రాదు. మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య మన దేవుని అధీనములో ఉన్నాయి అని పూర్తిగా విశ్వాసం చూపాలి.  లేదంటే దేవునికి  ఇష్టం లేని దూషణ, మరియు బూతులు మాట్లాడుతాము. కొనసాగింపుగా దుష్టత్వము అనగా మనకు నష్టం లేదా కష్టం కలిగించిన వారికి కీడు చేయాలన్న తలంపులు మొదలవుతాయి. భక్తి పరులమని చెప్పుకుంటూ ఇటువంటి పనులు జరిగిస్తూ ఉంటె మన భక్తి వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తోంది (యాకోబు 1:26)

మత్తయి 12: "37. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు."

మనలో చాల మంది విశ్వాసులు వారు మాట్లాడే మాటలను చాల తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభువయినా యేసు క్రీస్తు చెపుతున్న మాట ఏమిటంటే, మనం పలికే ప్రతి మాటకు మనం లెక్క అప్పజెప్పాలని. వ్యర్థముగా మనం పలికే మాటలు మనలను అపరాదిగా దేవుని ముందు నిలబెడుతాయి. జీవము మరణము మన నోటిలోనే ఉన్నాయి, పలికే చెడ్డ మాటల యందు సంతోషించే వారు అటువంటి ఫలములనే పొందుకుంటారు (సామెతలు 18:21). కాబట్టి నిత్యమూ మనం పలికే మాటలను ఆచితూచి పలకాలి. ఎలా వేళల ఆశీర్వాదాలను, ప్రేమతో కూడిన మాటలను, ప్రతికూల పరిస్థితిలో కూడా అనుకూలమయిన మాటలనే పలకాలి. ఎందుకంటే మన విశ్వాసం చొప్పున మనకు  జరుగుతుందని దేవుని వాక్యం చెపుతోంది. 

చిన్న నిప్పు రవ్వ అడవి అంతటిని దహనం చేసినట్లుగా మన నోటి నుండి వచ్చే చిన్న మాట ఎన్నో గొడవలకు కారణం అవుతుంది. ప్రేమ పూర్ణుడు అయినా క్రీస్తు విశ్వాసులుగా మనము నిత్యమూ ప్రేమ కలిగిన మాటలనే పలకాలి. మామిడి చెట్టు కేవలం మామిడి పండ్లను మాత్రమే కాస్తుంది కానీ జామ పండ్లను కాయదు కదా.  క్రీస్తు విశ్వాసులుగా  ఉన్న మనము ఆయనకు సంబంధం లేని  చెడ్డ మాటలు, కనికరం లేని మాటలు మాట్లాడం మన విశ్వాసమును ఎలా చూపుతుంది? (యాకోబు 3:12). అలాగే మన మృదువయినా మాట తీరు ఎదుటి వారి కోపమును చల్లారుస్తుంది (సామెతలు 15:1), కనుక నిత్యము మృదువయినా మాట తీరునే కలిగి ఉండాలి. 

1 సమూయేలు 25 : "10. నాబాలు-దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజ మానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు."

ఇక్కడ దావీదు, నాబాలు వద్దకు తన మనుష్యులను పంపి "పరోక్షంగా తానూ చేసిన మేలుల నిమిత్తం, అతని మందలను అడవి మృగముల నుండి కాపాడిన నిమిత్తం తన వారికి ఆహారం ఇవ్వమన్నప్పుడు". నాబాలు  దావీదు మనుష్యులతో దురుసుగా మాట్లాడుతూ "అసలు దావీదు ఎవడు? తన యజమానుడయినా సౌలును విడచి పారిపోయాడు. ఇటువంటి దాసులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి నేనెందుకు ఆహారం ఇవ్వాలి" అని హేళన చేశాడు. ఆ మాటలు విన్న దావీదు అతణ్ణి సంహరించాలని బయలు దేరుతాడు. అప్పుడు నాబాలు పనివారిలో ఒక్కడు, అతని భార్య అయినా  అబీగయీలు తో విషయం చెప్పగానే ఆమె వారికి కావలసిన ఆహారం సిద్ధం చేసి దావీదును కలుసుకొని తన భర్త విషయమై అతణ్ణి క్షమాపణ వేడుకుంది. ఆమె మృదువయిన మాట తీరును బట్టి, బుద్ది కుశలతను బట్టి దావీదు క్షమించి వెళ్ళిపోయాడు. కానీ పది దినములైన తరువాత దేవుడు నాబాలును మెత్తినందున అతను చనిపోయాడు (1 సమూయేలు 25:5-38). 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! మృదువయినా మాట తీరు ఎంతటి ఆపదనయినా తప్పిస్తుంది. కఠినమయిన మాట తీరు లేని ఆపదలను కలిగిస్తుంది. ఇక్కడ నాబాలు దావీదు మనుష్యులతో దురుసుగా మాట్లాడి తన పని వారి ముందు దావీదును  అవమానించాలని చూశాడు. ఒకవేళ నాబాలు భార్య అబీగయీలు సమయస్ఫూర్తి చూపించక, మృదువయినా మాటలతో దావీదును వేడుకొనక పొతే దావీదు చేతిలో నాబాలు హతం అయ్యేవాడు. దావీదు నాబాలు యొక్క భార్య మృదువయినా మాట తీరును బట్టి అతణ్ణి క్షమించినా కూడా అతని చెడ్డతనమును బట్టి, మోటుతనమును బట్టి దేవుడు నాబాలును క్షమించలేదు. కేవలం పది దినములలో అతను చనిపోయాడు. ఎల్లప్పుడూ మృదువయినా మాటలను పలకటానికి ఆసక్తి చూపాలి, అది ఎదుటి వారిని శాంతపరుస్తుంది అలాగే మన దేవుణ్ణి సంతోష పెడుతుంది. 

దేవుని వాక్యం చెపుతున్నది ఏమిటంటే, మనుష్యులు ఎన్నో క్రూరమయిన జంతువులను మచ్చిక చేసుకున్నారు గాని, చిన్నదయినా నాలుకను మచ్చిక చేసుకోలేక పోతున్నారు. అందును బట్టి దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ పాపంలో పడి పోతున్నారు (యాకోబు 3:7-8). చుక్కాని లేని నావ ఎలాగయితే నియంత్రణ లేకుండా సముద్రములో కొట్టుకు పోతుందో, అదుపు లేని నాలుక ద్వారా మనుష్యులు కూడా విశ్వాసములో తప్పిపోతారు (యాకోబు 3:4-5). కాబట్టి మన నాలుక నిత్యమూ పరిశుద్ధాత్మ అధీనములో ఉండాలి. తద్వారా దేవుడు మనకు ప్రేమ పూరితమయిన మాటలను ఇస్తాడు. పెంతేకొస్తు దినము నాడు పరిశుద్దాత్మ శక్తిని పొందుకోవటం ద్వారా  అక్కడ ఉన్న ప్రజలు తమకు రాని భాషలను మాట్లాడారు అని దేవుని వాక్యం చెపుతోంది (అపొస్తలుల కార్యములు 2:1-2). అధే విధముగా మనకు సాధ్యం కానీ మృదువయినా మాటలను కూడా దేవుడు మనకు అనుగ్రహించగలడు. విశ్వాసముతో ఉండండి, మన నోటి నుండి అయన మాటలను పలికించుమని  ప్రార్థించండి. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!