పేజీలు

31, డిసెంబర్ 2023, ఆదివారం

దేవునికి అన్ని సాధ్యమే!గడచిన సంవత్సరము అంత మనలను కాచి, కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఒక్కసారి పోయిన సంవత్సరము మనము దేవునితో గడిపిన సమయమును సమీక్షించుకుందాము. రోజుకు ఒక్కసారయినా ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయా? రోజు దేవుని వాక్యం ధ్యానించిన సందర్భాలు ఉన్నాయా? ఒక వేళ లేవు అని తెలిస్తే, ఖచ్చితముగా మనం తొందరపడవలసిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితములో మనము నిత్యమూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇతర విశ్వాసముల మాదిరి, వారానికి ఒక్కసారి లేదా తిథులు, ముహుర్తాలు చూసుకుని పూజలు చేయటం లాంటిది కాదు.  ప్రతి నిత్యమూ దేవునితో మన సమస్తము అనుసంధానము అయి ఉండాలి. 

ప్రతి రోజు దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా ఆత్మీయ ఆహారమును పొందుకుంటాము. మన శరీరమునకు ఆహారం ఎలా అవసరమో, మన ఆత్మకు కూడా ఆహారము అవసరము, దాని ద్వారా ఆత్మీయ జీవితంలో బలపడుతాము. మరియు ప్రార్థన జీవితము కలిగి ఉండటం ద్వారా, దేవుని యందు విశ్వాసము పెరుగుతుంది, అందును బట్టి కలిగే శోధనలను ఎదుర్కొనే ధైర్యము పొందుకుంటాము. క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత ఖచ్చితముగా తిరిగి జన్మించాలి. అనగా పాత జీవితమును వదిలి, నూతనముగా జీవించటం మొదలు పెట్టాలి. ఆ పాప క్రియలను పూర్తిగా మానేసి, క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ ఆయనను వెంబడించాలి. కనుకనే నిత్యమూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. 

విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఎంతో నిష్ఠగా గడిపి ఉండవచ్చు, దేవుని పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉండవచ్చు. ఎన్నో ఆత్మీయ వరములు పొంది ఉండవచ్చు, సంఘములో గొప్పగా వాడుకో బడుతూ ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మన  ఆత్మీయ స్థితి ఏమిటి? ఒక్కసారి పరీక్షించుకోవాలి. క్రీస్తును విశ్వసించటం అంటే ఆయనను గురించి పాటలు రాయటం కాదు, ఆయనను గురించి పాడటం కాదు, అయన గురించి చెప్పటం కాదు, గాని ఆయనను అనుసరించటం. అయన ఎలాగయితే పాపం లేకుండా జీవించాడో, మనం కూడా జీవించే ప్రయత్నం చేయాలి. క్రీస్తు మనకు ఇచ్చిన పరిశుద్దాత్మ శక్తి ద్వారా (అపో 2:38)  అటువంటి పవిత్ర జీవితమును గడపాలి. 

చాల మంది యవ్వన సహోదరి, సహోదరులు ఎన్నో రకాల లోకరీతులకు కట్టుబడి పోయారు. సినిమా తారలను అనుకరిస్తూ, వారిని ఆరాధిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిత్యమూ వారి గురించి ఆలోచిస్తూ, తపన పడుతూ దేవునికి  దూరం అయిపోతున్నారు. అలాగే సహోదరీలు అందం పట్ల వ్యామోహం పెంచుకుంటూ, తమను తాము కించపరచుకుంటూ కుంగి పోతున్నారు. జీవితంలో అసంతృప్తితో రక రకాల దురలవాట్లకు  లోనయి సంతోషం వెతుక్కుంటున్నారు, పచ్చని జీవితాలను ఫలం లేనివిగా మార్చుకుంటున్నారు.  దేవుడు మనలను ఏర్పరచుకున్నది, కేవలం విశ్వాసులం అని చెప్పుకోవటానికి మాత్రమే కాదు, అవసరాలు ఉన్నప్పుడు ప్రార్థించటానికే కాదు, గాని శరీర క్రియలు వదిలి, ఆత్మ ఫలములు పొందుకోవాలని (గలతి 5:19-22). 

అలాగే కొంతమంది జీవితములో ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత లేదా ఎటువంటి కష్టాలు లేకపోవటం ద్వారా కూడా దేవునికి దూరం అయిపోతారు. వారి దృష్టిలో దేవుని అవసరం పెద్దగా ఉండదు, కనుక ఆత్మీయ జీవితం వారికి పనికి రానిదిగా, దేవుని మాటలు చేతకానివిగా ఉంటాయి. కానీ మరణం తర్వాత దేవుడు ఇచ్చిన వారి ఆత్మ దేవుని ముందు తీర్పుకు లోనవుతుందన్న విషయం విస్మరిస్తున్నారు. క్రీస్తు చెప్పినట్లుగా "ఒకడు సమస్తము సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే ఏమిటి ప్రయోజనము" (మత్తయి 16:26)

మీకా 6: "8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. "

దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏమిటి? కేవలము మంచిని పాటించుమని చెపుతున్నాడు. అలాగే న్యాయముగా నడుచుకోవాలని ఆశిస్తున్నాడు. మీకా గ్రంథములో ప్రజలు ఎంతటి అన్యాయాలు చేస్తున్నారో చెప్పి, వారు ఎలా ఉండాలో దేవుడు ఆ ప్రవక్త ద్వారా రాయించాడు. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో, ఈనాడు మనం కూడా అలాగే ఉన్నాము. కనికరము కలిగి, ఆ కనికరమును ప్రేమించే వారిలాగా మనం ఉండాలి. అలాగే అహంకారము, అహంభావము వదిలి దేవుని యెదుట దిన మనస్కులమై ప్రవర్తించాలి. చాల మంది ఎదుటి వారి హోదాను బట్టి, ధనమును బట్టి గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ అది కేవలము మనుష్యులను మాత్రమే సంతోషపెడుతుంది, అటువంటి వారు క్రీస్తు విశ్వాసులు అనిపించుకోరు (గలతి 1:10). ప్రతి ఒక్కరిని సమానముగా గౌరవించటం దేవుణ్ణి సంతోష పెడుతుంది. అలాగే నిత్యమూ పరిశుద్ధముగా జీవించాలని తపన కలిగి ఉండాలి. 

గత సంవత్సరమును వదిలేయండి, అది ఎన్నటికీ తిరిగి రాదు. దేవుని ముందు తిరిగి మన పాపములు ఒప్పుకుని నూతన జీవితమును ప్రారంభిద్దాము. ఆ పాత అలవాట్లకు స్వస్తి చెప్పి నూతనమయిన అలవాట్లు కొనసాగిద్దాము. పొద్దున్న లేవగానే దేవునికి వందనాలు చెప్పుకుని దినమును మొదలు పెట్టాలి. తర్వాత వాక్యము ధ్యానించుకోవాలి, ఒక వేళ వీలు కాకపొతే ఆ దినమంతా దేవుని చిత్తము నెరవేర్చేలాగా అయన సహాయం కోసం ప్రార్థించి, ఉద్యోగనికో, వ్యాపారనికో వెళ్ళిపోవాలి. అక్కడ కూడా చెడ్డవారితో సాహసవం చేయకుండా మంచి వారితో సహవాసం చేయాలి. చెడ్డ మాటలు మాట్లాడే వారితో ఉంటే మన ఆలోచనలు కూడా  కలుషితం అయ్యే అవకాశం ఉంది. 

తరువాత ఇంటికి వచ్చి కాసేపు కుటుంబముతో గడిపి దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి. పడుకొనే ముందు ఖచ్చితముగా కుటుంబ ప్రార్థన ఉండి తీరాలి. ఒంటరి వారయిన కూడా ఆ దినమంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి నిద్రకు ఉపక్రమించాలి. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటె అంత మంచిది. ఎందుకంటే వాటిని బట్టి శోదించబడి తిరిగి మన ఆత్మీయ జీవితములో వెనుకబడిపోయే అవకాశం ఉంది. విశ్వాసులకు క్రైస్తవ జీవితం చాల కష్టతరమయినదిగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితము దేవునికి పూజ చేసి మరచిపోవడం కాదు, నిత్య పోరాటము, ప్రతి క్షణం దేవునికి ఇష్టముగా జీవించాలన్న ఆరాటము. 

యేసయ్య తన బోధలలో కూడా తనను విశ్వసించే వారు నిత్యమూ తమ సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలని బోధించాడు. అలాగే అయనను నమ్ముకోవటం ద్వారా ఇతరుల నుండి ద్వేషమును పొందుకుంటారని కూడా చెప్పాడు. అంతే కాకుండా తమ ఆస్తి మీద నమ్మకము ఉంచుకొను వారు పరలోకమును చేరలేరని కూడా అయన బోధించాడు. ఈ బోధలు విన్న క్రీస్తు శిష్యులు "అసలు పరలోకం వెళ్ళటం ఎవరికీ సాధ్యమవుతుంది" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మార్కు 10: "27. యేసు వారిని చూచి ఇది మను ష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. "

దేవుని పరిశుద్దాత్మ పొందుకున్న విశ్వాసులకు సమస్తము సాధ్యమే అని యేసయ్య వారికి ధైర్యము చెపుతున్నాడు. ఈ పరిశుద్దాత్మ దేవుడు మనం పాపములు ఒప్పుకొని, క్రీస్తు యందు విశ్వాసము ఉంచి బాప్తిస్మము పొందుకున్న దినము నుండి మనతో ఉంటాడు అని దేవుని వాక్యము చెపుతోంది. పరిశుద్దాత్మ దేవుడు నిత్యమూ మనతో, మనలో ఉంటూ మనలను సరయిన మార్గములో నడిపిస్తూ ఉంటాడు. మనం అయన అధీనములో ఉండటం ద్వారా అంటే అయన సూచనలు / ఆలోచనలు నిత్యమూ పాటించటం ద్వారా మన శరీర క్రియలను జయిస్తాము. ఫలితముగా ఆత్మ ఫలములు పొందుకొని దేవుని ఇష్టమయిన వారీగా జీవించే శక్తిని పొందుకుంటాము. 

క్రైస్తవ విశ్వాసము కేవలం ప్రవర్తనలో మార్పును కోరుకోదు గాని, మనసులో మార్పును కోరుకుంటుంది. అది కేవలము దేవుని పరిశుద్దాత్మ శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది. క్రీస్తు మన హృదయములో నివాసం చేసినప్పుడే ఇటువంటి జీవితము మనుష్యులకు సాధ్యం అవుతుంది. కన్య మరియమ్మ పరిశుద్దాత్మ శక్తి ద్వారా క్రీస్తును గర్భం దాల్చినట్లుగా, పరిశుద్దాత్మ శక్తి ద్వారానే మనలో క్రీస్తు పోలికలు ఏర్పడుతాయి, మన ప్రవర్తన ఆయనను ప్రతిబింబిస్తుంది. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! క్రైస్తవ జీవితం కష్టమయినది కేవలం తమ సొంత శక్తి మీద ఆధారపడే వారికి మాత్రమే. కానీ దేవుని శక్తి మీద ఆధారపడే వారికి కాదు. నిత్యమూ ప్రార్థించండి, పడిపోయిన ప్రతి సారి తిరిగి లేవండి, కన్నీళ్లతో దేవుని ముందు మోకరించి అయన కృప కోసం, క్షమాపణ కోసం అడగండి. వెయ్యి సార్లు పడిపోతే వెయ్యి సార్లు క్షమాపణ అడగండి. నా ప్రతి శరీర క్రియను జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి. దినంగా, చేతకాని వారిగా ఆయన మీద ఆధారపడి అడగండి. ఖచ్చితముగా నీకు జయజీవితం అనుగ్రహిస్తాడు. ఉన్నతమయిన ఆత్మీయ స్థితిలో దేవుడు నిన్ను నిలబెడుతాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగముతో కలుసుకుందాము. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఆమెన్ !! 

5, డిసెంబర్ 2023, మంగళవారం

29 వ కీర్తన - అధ్యయనం

దావీదు ఈ కీర్తనలో దేవుని  సార్వభౌమాధికారాన్ని, అయన స్వరము యొక్క బలమును,  శక్తిని కవితాత్మకంగా వర్ణిస్తూ, దేవుణ్ణి స్తోత్రిస్తున్నాడు.  ఈ కీర్తనలో మనం చివరగా దేవుడు  ఇవ్వబోయే బలము, అనుగ్రహించబోయే సమాధానము, ఆశీర్వాదములను గూర్చి నిశ్చయత దావీదు కలిగియుండటం మనం చూడవచ్చు. 

1. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. 2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.

సర్వ జనములకు దేవుడయిన యెహోవాను స్తుతించాలని దావీదు గుర్తు చేస్తున్నాడు. మనం ఎంత గొప్పవారమయిన, లోకంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్న, దేవుని ఘనతను మాత్రం మరచి పోరాదని రాస్తున్నాడు. ఆయన ఎలా వేళల శక్తి వంతుడు,  ప్రభావము, గొప్పతనము  కలిగిన వాడు గనుక వాటిని ఆయనకు ఆరోపించాలని సూచిస్తున్నాడు. చాలామంది దేవుడు ఊరికే ఉన్నాడు, అయన మేలైన కీడైన చేయడు అని అనుకుంటారు (జెఫన్యా 1: 12), కానీ దేవుడు అన్నింటిని నియంత్రించగల సమర్థుడిగా ఉన్నాడు అని దావీదు గుర్తుచేస్తున్నాడు. ఆనాటి కాలములో ఉన్న అన్య దేవతలు దాగోను మరియు బయలు వంటి ప్రాణం లేని, మనుషులు చేసిన దేవుడు కాదు, అయన సజీవుడయినా  దేవుడు, కనుక అయన ఎదుట, సర్వ మానవాళి సక్రమముగా సాగిలపడి మొక్కాలని దావీదు ప్రోత్సహిస్తున్నాడు, దేవుని గొప్పతనమును చాటుతున్నాడు. 

3. యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు. 4. యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.

దేవుడు భూమ్యాకాశాలను చేసిన తర్వాత భూమి నిరాకరమయినప్పుడు దేవుని ఆత్మ జలముల అల్లాడుచున్నదని దేవుని వాక్యంలో రాయబడింది (ఆదికాండము 1:2), ఆతర్వాత దేవుని స్వరము వెలుగు కలుగు గాక అని చెప్పగానే వెలుగు కలిగింది, అలాగే సమస్త సృష్టి కూడా ఏర్పడింది. యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా, ఆదియందు దేవుని వద్ద ఉన్న వాక్యము, ప్రభువయినా యేసు క్రీస్తు (యోహాను 1:1). కలిగినదంతము ఆయన ద్వారానే కలిగియున్నదని (యోహాను 1:2-3) దేవుని వాక్యం చెపుతోంది. ఇక్కడ దేవుడు  తన ఆత్మ అనగా పరిశుద్దాత్మ, మరియు తన స్వరము అనగా ప్రభువయినా క్రీస్తు ద్వారా పాడయినా భూమిని బాగు చేసాడు. అలాగే సర్వ సృష్టిని ఏర్పరచాడు. తర్వాత దేవుడయినా యెహోవా మహాజలముల మీద సంచరిస్తున్నాడని దావీదు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించినప్పుడు దేవుడు దానిని రెండుగా చీల్చిన సందర్భం గుర్తుచేసుకోవచ్చు. సముద్రములన్ని అయన మాటను వింటాయి, జలరాసులన్నీ అయన స్వర బలముకు లొంగిపోతాయి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యొర్దాను నదిని దాటు సందర్భంలో కూడా ఇటువంటి ప్రభావము, అద్భుతము దేవుని స్వరము ద్వారా వారికి సాధ్యపడింది. 

5. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. 6. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.

దేవుని స్వరము యొక్క శక్తిని కవితాత్మకముగా దావీదు వివరిస్తున్నాడు. ఎంతో ఎత్తయిన, బలమయిన దేవదారు వృక్షములను, సహజ వనరుల సంపద సమృద్ధిగా కలిగిన లెబానోనులో ఉండే అత్యంత బలమయిన దేవదారు వృక్షాలనూ సైతం అయన స్వరం ముక్కలుగా విరిచి వేస్తుందని దావీదు వర్ణిస్తున్నాడు. కేవలము వృక్షములను మాత్రమే కాదు, అయన స్వరము రెండు పర్వతములయిన లెబానోను మరియు షిర్యోను పర్వతములను కేవలము తన నోటి మాట ద్వారా కంపింప చేస్తాడు, అప్పుడు అవి మేకపోతు గంతులు వేస్తున్నట్లు కనిపిస్తాయని దావీదు దేవుని స్వరము యొక్క శక్తిని తెలియ పరుస్తున్నాడు. ఇటువంటి భావమునే దావీదు 114 వ కీర్తన 4:6 వచనములలో కూడా ప్రస్తావించాడు. తన ప్రజలయిన ఇశ్రాయేలు జనముకు సర్వ సృష్టిని అనుకూలముగా దేవుడు కేవలము తన నోటి మాట ద్వారా చేశాడు, అని దావీదు వివరిస్తున్నాడు. 

7. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.

ఈ వచనంలో దేవుడు తన స్వరం ద్వారా అగ్ని జ్వాలలను సైతం పుట్టించగలడు, మరియు వాటిని నియంత్రించగలడని దావీదు గుర్తుచేస్తున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు రాజయినా ఫరోను దేవుడు  ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి తొలగించి, పంపివేయాలని అడిగినప్పుడు, ఫరో తన హృదయము కఠినము చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఐగుప్తులో పది తెగుళ్ళను సంభవింప చేశాడు. అందులో ఏడవ తెగులునందు దేవుడు వడగండ్లు, పిడుగులతో పాటు అగ్నిని కురిపించాడు (నిర్గమకాండము 9:24) అని దేవుని వాక్యములో తెలుపబడింది.  ఇదే మాటను దావీదు 105 వ కీర్తన 34 వ వచనములో కూడా రాశాడు. నీరు ఉన్న చోట సహజముగా నిప్పు ఉండదు, కానీ దేవుని స్వర ప్రభావము చేత ఐగుప్తులో వడగండ్లతో పాటు నిప్పులు కూడా కురిసాయి, అని దేవుని శక్తిని దావీదు గుర్తుచేస్తున్నాడు. 

8. యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును 9. యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి.

ఇక్కడ దావీదు దేవుని స్వరము చేత అరణ్యములు కూడా కదిలించబడుతాయి అని రాస్తున్నాడు. అంతే కాకుండా దేవుని స్వరము చేత కాదేషు అరణ్యము కూడా కదిలించబడుతుందని గుర్తుచేస్తున్నాడు. ఈ కాదేషు ప్రాంతము దేవుని వాక్యమునందు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడే అబ్రాహాము అమాలేకీయులను ఓడించాడు. అదే స్థలములో ఇశ్రాయేలీయులు కనాను వారిని ఓడించలేమని భయపడి విశ్వాసములో వెనుకపడి పోయారు (సంఖ్యాకాండము 13:32-33). అలాగే వారు నీరు దొరకటం ఆలస్యం అయిందని, దేవుని మీద సణుగుకున్నది  కూడా ఇదే స్థలము (సంఖ్యాకాండము 20:1-5). ఆ విధముగా ఈ రెండు సంఘటనలు కాదేషు ప్రాంతమును అవిశ్వాసమునకు, సణుగుకొవటానికి మరియు అవిధేయతకు స్వారూప్యముగా సూచిస్తున్నాయి.  కాబట్టి దేవుని స్వరము అవిశ్వాసులను కదిలిస్తుందని, విశ్వాసులను స్థిరపరుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే అయన స్వరము లేళ్ళకు సంతానము కలుగ జేస్తుంది, మరియు ఆకులను రాలుస్తుంది. అనగా సర్వ సృష్టిలో జరిగే పెద్ద క్రియల నుండి, చిన్న క్రియల వరకు దేవుని స్వరము నియంత్రిస్తుందని దావీదు గుర్తిస్తున్నాడు. 

దేవుడయినా యెహోవా ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాయి అని కూడా రాస్తున్నాడు దావీదు. అనగా యెషయా దేవుని ఆలయంలో అయన దూతలు "ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అయన మహిమ భూలోకమంతా నిండిపోయింది" అని ఘనంగా స్తుతించారు అని తానూ చూసిన దర్శనం గురించి రాశాడు (యెషయా 6:1-4). కనుక విశ్వాసులుగా ఉంటూ, ప్రతి పెద్ద, చిన్న అవసరముకు అయన మీద ఆధారపడి, నిత్యమూ ఆయనకు స్తుతులు అర్పించాలని మనం అర్థం చేసుకోవాలి.  

10. యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.

దావీదు నోవహు కాలములో దేవుడు అనుమతించిన జల ప్రళయమును గుర్తుచేస్తున్నాడు (ఆదికాండము 9:11-12). దేవుడు ప్రళయ జలముల మీద ఆసీనుడిగా ఉన్నాడు, అయన నిత్యమూ రాజుగా ఆసీనుడై ఉన్నాడు. జల ప్రళయము దేవుని తీర్పును బట్టి వచ్చింది. తీర్పును తీర్చేది రాజు మాత్రమే. కాబట్టి యెహోవా రాజుగా తన తీర్పును తీర్చటానికి జల ప్రళయములను కూడా ఉపయోగించు కుంటాడు అని దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు.  నోవహు కాలం మాదిరిగానే చెడ్డవారిని, పాపాత్ములను దేవుడు శిక్షిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు.  

11. యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.

దేవుడయినా యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. ఈ లోకములో ఉన్న ప్రతి శ్రమను జయించటానికి వారికి శక్తిని అనుగ్రహిస్తాడు అని దావీదు రాస్తున్నాడు. అంతే కాకుండా ప్రతి శ్రమలో వారికి సమాధానము కలుగజేసి, ఆశీర్వదిస్తాడు. ప్రభువయినా యేసయ్య "నేను మీకు నా శాంతిని అనుగ్రహిస్తాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. కనుక మీ హృదయములను కలవరపడనియ్యకుడి, వెరవ నియ్యకుడి" అని బోధించాడు (యోహాను 14:27).  ఇక్కడ లోకం ఇచ్చేది అశాశ్వత మయినది. కానీ దేవుడు ఇచ్చేది నిత్యమూ ఉండేది. కనుక దావీదు దేవుడు తనను నమ్ముకున్న ప్రజలకు బలమును, సమాధానము ఇచ్చి, తగిన సమయమునందు వారిని ఆశీర్వదిస్తాడు అని గుర్తు చేస్తున్నాడు. ఆ సమాధానము విశ్వాసులయిన మన మీద  నిత్యమూ ఉంటుంది.