దేవుడు మనుష్యలయిన మనందరిని తన సన్నిధిలో ఉండటానికి ఏర్పరచుకున్నాడు. తన ప్రియ కుమారుడు, మన రక్షకుడయినా యేసు క్రీస్తు పట్ల మన విశ్వాసము పెంపొందించటం ద్వారా అయన నీతిని మనకు ఆపాదించి పవిత్రులుగా చేసాడు. తద్వారా మనకు రక్షణ అనుభవం ఇచ్చాడు. అనగా మన పాపముల నుండి విమోచన కలిగించి, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, తన ఆజ్ఞలు మీరకుండా, తన వాక్యము అర్థం చేసుకొని జీవించటానికి కావలసిన తెలివిని, జ్ఞానమును దయచేస్తూ, మన రక్షకుడయినా యేసు క్రీస్తుల వారి స్వరూపములోకి మారటానికి ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ ఆత్మీయ ఎదుగుదల మన రక్షణ అనుభవమును బట్టి కాక మన యొక్క బైబిల్ జ్ఞానమును బట్టి, ప్రార్థన తడబడకుండా చేసే విధానమును బట్టి, లేదా వారికి తెలిసిన క్రైస్తవ గీతాల సంఖ్యను బట్టి మెండుగా ఉన్నట్లు సంఘాలలో భావిస్తారు, కానీ అది దేవుని కొలమానములో లేదు.
కొత్తగా విశ్వాసములోనికి వచ్చిన సహోదరి, సహోదరులు ప్రతి విషయములో ప్రతిభ లేని వారిగా కనబడవచ్చు. వారి విశ్వాసం, మరీ అంత గొప్పగా లేకపోవచ్చు, అనర్గళంగా ప్రార్థన చేసే తత్వం వారిలో కానరాక పోవచ్చు, బైబిల్ లో వాక్యము తీయటానికి కష్టపడవచ్చు, కానీ దేవుడి దృష్టిలో వారు ఆత్మీయ జీవితంలో ఇంకను పాలు త్రాగే శిశువుల వలె ఉన్నారు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన జ్ఞానము, క్రీస్తు దేహమయిన, సంఘములో అనుభవము బహు తక్కువ. అంటువంటి శిశువులతో, నడక నేర్చిన, పరుగు పెట్టే సాటి విశ్వాసులు పోల్చుకుంటూ "తాము వారికంటే గొప్ప" అనే ఆత్మీయ గర్వమునకు లోను కావటం దేవుని దృష్టిలో అంగీకారం కానేరదు. అదేవిధముగా వారి తడబాటును చూసి ఎగతాళి చేయటం, దేవుని దృష్టిలో నేరమే. దేవునికి అసహ్యమయిన విషయం గర్వము. దూరం ఎంతటిదయిన ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, విశ్వాసి ఎంత నీతి పరుడయినా పాపిగానె ప్రారంభమవుతాడు. మన గొప్ప కోసం, మొగ్గ స్థాయిలో ఉన్న విశ్వాసులను చులకనగా చూడటం, సంఘంలో వారికి ఏవయినా బాధ్యతలు అప్పగిస్తే తట్టుకోలేక పోవటం ప్రభువు దేహములో భాగమయిన మనకు తగునా? బలహీనుడయినా సహోదరుని విశ్వాసమును దెబ్బ తీసే లాగున ప్రవర్తించు ప్రతి వాడును పాపము చేసినవాడేనని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని ఏమిదవ అధ్యాయం నుండి క్రింది వచనం చూడండి.
1 కొరింథీయులకు 8: "12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు."
పై వాక్యము స్పష్టముగా చెబుతున్న సంగతులు గ్రహించి, సాటి విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడిన వారిగా ఉండటం సంఘమునకు క్షేమకరం. దేవుడు తన సేవ కొరకు అల్పులు, అజ్ఞానులను ఎన్నుకొంటాడు. అయన దృష్టికి గర్వం కలవారు అసహ్యులు, పనికి రాని వారు. ప్రభువు ఇచ్చే ఫలము ప్రతి వారికి ఒకేలాగా ఉంటుంది. ప్రభువు ఎవరు ఎప్పుడు మొదలు పెట్టారొ చూడటం లేదు కాని విశ్వాసములో కొనసాగటమే చూస్తాడు. కనుక క్రొత్త విశ్వాసులను తేలికగా చూడటం లేదా వారికి ఇవ్వబడుతున్న తలాంతులను బట్టి, సంఘములో వారికి ఇవ్వబడుతున్న బాధ్యతలను బట్టి అసూయపడటం కడు దీనుడయినా యేసు క్రీస్తు విశ్వాసులుగా మనకు తగదు.
ఈ విషయాలను బట్టి దేవుని వాక్యములో యేసు క్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్తలో గొప్ప సంగతులను మనకు నేర్పించారు.
మత్తయి 20: "8. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 9. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. 10. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. 11. వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, 12. పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి. 13. అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయ లేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; 14. నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; 15. నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను. "
ప్రభువు చెప్పిన ఈ ఉపమానమును గమనిస్తే సాటి సహోదరుల పట్ల, మరీ ముఖ్యంగా క్రొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల మన ధోరణి ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. ప్రభువు చెప్పిన ఈ ఉపమానంలో ఒక తోట యజమాని కొందరు కూలీలను పనికి కుదుర్చుకున్నాడు, కొన్ని గంటలు అయిన తర్వాత మరికొంత మంది పనిలోకి వచ్చారు. ఆపైన ఒక గంటలో పని గంటలు ముగుస్తాయనగా ఇంకొంతమంది పనివారు వచ్చి పనికి కుదిరారు. పని ఘడియలు ముగియగానే ఆ యజమాని తన గుమస్తాకు పనివారందరికి డబ్బులు ఇమ్మని చెప్పాడు. అప్పుడు ఒక గంట పని చేసిన వారికి, మరియు కొన్ని గంటలు పని చేసిన వారికి ఒక దినారము ఇవ్వటం చూసిన, రోజంతా పని చేసిన పనివారు తమకు ఇంకా ఎక్కువ లభిస్తుందని ఆశించారు. కానీ ఆ యజమాని వారికి కూడా మిగతా వారి లాగే ఒక్క దినారము ఇవ్వటం చుసిన ఆ పనివారు గొణుక్కుంటూ "ఒక గంట పనిచేసిన వారిని, రోజంతా కష్టపడిన మమల్ని సమానంగా చుస్తున్నావు" అని గొణుక్కున్నారు. ముందుగా వచ్చిన విశ్వాసి, నీ తర్వాత వచ్చిన విశ్వాసుల పట్ల నీ ఉద్దేశ్యం అలాగే ఉందా? అయితే ప్రభువు నీతో అనే మాటను, యేసయ్య ఆ యజమాని ద్వారా చెపుతున్నాడు. "నీకు ఇస్తానన్న కూలి ఇచ్చేసాను, నేను మిగతా వారికి ఎంత ఇస్తే నీకెందుకు, నేను మంచితనంతో ఉంటె నీ కడుపు మండిందా" అని. దేవుడు ప్రేమ స్వరూపి, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి విశ్వాసికి తన కృపలను అనుగ్రహిస్తాడు, తన సంఘములో స్థానం కల్పించి ఆత్మీయంగా బలపరుస్తాడు. వారి విశ్వాసము చొప్పున, వారికి ఉన్న భారమును బట్టి తలాంతులు అనుగ్రహించి, తన పరిచర్యలో వాడుకుంటాడు.
మన విశ్వాస పరుగును అందరి కన్న ముందు మొదలు పెట్టాము కదా! అని మన తర్వాత వచ్చిన వారిని దేవుడు తక్కువ చెయ్యాలను కోవటం వాక్యానుసారం కాదు. లోతుగా ఆలోచిస్తే, అటువంటి ఆలోచన విధానం, మన యొక్క అసూయను, మనకు లోకము పై ఆశను సూచిస్తుంది. "అయ్యో ! అనవసరంగా ముందే విశ్వాసంలోకి వచ్చాము! వీరి లాగే అన్ని అనుభవించి వస్తే బాగుండేది! అంతే దొరికే మేలులకు, ఇంత కాలం అన్ని సుఖాలు వదులుకున్నాను" అనుకున్నట్లు లేదా? ఇక్కడ ముందుగా వచ్చిన వారికి జరిగిన లాభం ఏమిటి? నిశ్చయత! ప్రశాంతత! ఆనందం! నమ్మకము! ఇతరుల వలె వారు పని గురించి ప్రయాస పడవలసిన అవసరం రాలేదు. తమకు ఈ రోజు కూలి దొరుకుతుంది కాబట్టి, తగిన ఆహారం తింటాము అన్న నిశ్చయత, దానితో ప్రశాంతత, అందువలన ఆనందం దాంతో పాటు రేపు కూడా పని దొరుకుతుందని నమ్మకము. అంటువంటి ప్రశాంతత ఎన్ని డబ్బులు ఇచ్చి కొనగలం? చివరి వారు ఎంత బాధ అనుభవించి ఉంటారు? కూలి దొరుకుతుందో లేదోనని ఎంత యాతన పడి ఉంటారు? అటువంటి యాతన మనకు తప్పినందుకు సంతోషంగా లేదా? దేవుని ప్రేమకు మనం హద్దులు నిర్ణయిస్తున్నామా?
సాటి వారిని దేవుడు దీవిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి! మన అవసరమును, మన ఆశలను తన చిత్తానుసారముగా తీర్చేది కూడా ఆ దేవుడే అని గుర్తుంచుకొని మన విశ్వాసం కొనసాగించాలి. దేవునికి ఇష్టమయిన వారిగా మన విశ్వాసం కొసాగిస్తున్నందుకు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకంటే మనం చెడ్డవారిగా ఉన్నప్పుడే మనలను ప్రేమించి అయన పట్ల మనకు విశ్వాసం అనుగ్రహించాడు కాబట్టి ఆనందించాలి. అంతే కాకుండా మన విశ్వాసము ఇతరులకు ఇబ్బంది కారాదు, వారి ఆశీర్వాదాలు మనకు అసూయా కారణం కారాదు. ఆత్మీయతలో దీనత్వం కనబడాలి, విశ్వాసంలో సహనం ఉండాలి. అటువంటి పరిశుద్దాత్మ నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
మన ప్రభువయిన యేసు క్రీస్తు చెప్పినట్లుగా "అడుగుడి మీకు ఇవ్వబడును, వేతకుడి మీకు దొరుకును మరియు తట్టుడి తియ్యబడును" అన్న వాక్యమును విశ్వాసించి, మనకు కావలిసిన మేలులను బట్టి ప్రార్థిస్తుంటాము. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవటం మరచిపోతాము! మనం కోరుకుంటున్న ఆ మేలు దేవుని చిత్తమేనా? ఆ మేలు కలుగుట వలన మనం ఆత్మీయంగా మరింతగా ఎదుగుతామా? లేదా దేవునికి దూరంగా లేదా విరోధంగా మారిపోతామా? అన్న భవిష్యత్ ప్రణాళిక మీద దేవుడు మనకు ఆ మేలులు అనుగ్రహిస్తాడు. కొన్ని సార్లు ఆ మేలులు పొందుకోవటం ద్వారా తాత్కలికంగా కలిగే మంచి కన్న శాశ్వతంగా జరిగే చెడు ఎక్కువగా ఉంటె వాటిని పొందుకోక పోవవటమే మనకు మేలు.
మనం కోరుకుంటున్న మేలులు దేవుని చిత్తమును నెరవేర్చేవిగా ఉండాలి! అనగా దేవుని పరిచర్యలో భాగంగా మిళితం కావాలి. ఉదాహరణకు సమూయేలు తల్లి హన్నా ప్రార్థనను గమనించండి!
1 సమూయేలు 1: "11. సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. "
ఇక్కడ హన్నా పిల్లలు లేనిదిగా అవమానము పొందుతోంది. దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏమని మొరపెడుతోంది! మగ బిడ్డను దయచేస్తే అతనిని దేవుని సేవకు వినియోగిస్తానని ప్రమాణం చేస్తోంది. తాను పొందుకొనే మేలును దేవుని పరిచర్యలో మిళితం చేస్తోంది. ఇక్కడ ఆమె స్వార్థం మచ్చుకయిన కనపడదు. కుమారుడు పుట్టిన తర్వాత మరల ఆమెకు పిల్లలు పుడుతారో లేదో కూడా తెలియదు కానీ దేవునికి ముందుగానే ప్రమాణం చేస్తోంది, కలిగిన ఒక్క బిడ్డను దేవుని సేవకు అంకితం చేస్తానని. ఆమె కోరుతున్న ఆశీర్వాదము దేవుని చిత్తములో ఉంది కనుక దేవుడు ఆమె కోరికను నెరవేర్చాడు.
అన్ని సార్లు అలాగే ఉండాలని కాదు, కొన్నిసార్లు దేవుడు మన అవసరాల నిమిత్తం మనకు మేలులు దయచేస్తాడు. కానీ కొన్ని మేలులు మనకు మేలు చెయ్యక పోగా కీడును చేస్తాయి. అంటువంటి సమయంలో దేవుడు ఆ మేలులు మనకు అనుగ్రహించకుండా ఆపివేస్తాడు. ఉదాహరణకు ఒక్క కుర్రాడు బైక్ గురించి తండ్రిని పీడిస్తున్నాడు అనుకుందాం. ఆ కుర్రాడి శక్తి సామర్థ్యాలు పూర్తిగా తండ్రి ఎరిగి ఉన్నాడు కనుక అతనికి బైక్ కొనివ్వటమో, ఇవ్వకపోవటమో చేస్తాడు. తండ్రి తనకు బైక్ కొనివ్వటం లేదు కనుక తండ్రికి తనంటే ఇష్టంలేదు అనుకోవటం ఆ కుర్రాడి తెలివి తక్కువతనం అవుతుంది. దేవుడు మన మేలులు ఆపివేయటం కూడా అటువంటిదే!
బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాజయిన హిజ్కియాదేవుని చిత్తమును అంగీకరించక పోవటం వలన కలిగిన సంఘటనలు ఒక్కసారి చూద్దాం.
2 రాజులు 20: "1. ఆదినములలో హిజ్కియాకు మరణకరమైన.... రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా"
పై వచనంలో దేవుడయినా యెహోవా రాజయిన హిజ్కియాకు ఆయువు తీరిందని సెలవిస్తున్నాడు. అప్పటివరకు ఆ రాజు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుని దృష్టికి ఎన్నో మంచి పనులు చేసి ఉన్నాడు. కానీ మరణం వచ్చే సరికి దేవుని చిత్తమునకు విరుద్ధంగా ప్రార్థిస్తున్నాడు.
2 రాజులు 20: "3. యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను."
పై వచనంలో హిజ్కియా ప్రార్థనను చూడవచ్చు. అప్పుడు దేవుడయినా యెహోవా తన యొక్క నిర్ణయమును మార్చుకున్నాడు. అప్పటి వరకు హిజ్కియాకు సంతానం లేదు. దేవుడు తనకు మరో పదిహేనేళ్ళు జీవితకాలం పొడిగించాడు (2 రాజులు 20: 5-6). దాని వలన జరిగిన అనర్థములు కూడా మనం తెలుసుకుందాం. అయుష్షూ పొడిగింపబడిన హిజ్కియా తనను పరామర్శించటానికి బబులోను నుండి వచ్చిన మనుష్యులను ఆహ్వానించి ఎంతో గర్వంగా తన యొద్ద ఉన్న సంపదను ప్రదర్శించాడు. తద్వారా భవిష్యత్తులో బబులోను వారు ఇశ్రాయేలు మీదికి దండెత్తి రావటానికి ప్రేరణ అయ్యాడు. అధేవిదంగా ఆ ఆయుష్షు ద్వారా మనష్షే అనే కుమారుణ్ణి కన్నాడు. అతను ఇశ్రాయేలు రాజులలో అత్యంత హీనుడని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది.
2 రాజులూ 21: "1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లిపేరు హెఫ్సిబా. 2. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రా యేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను."
పన్నెండు ఏండ్ల నుండి పాలించటం మొదలు పెట్టిన అతను దేవుని దృష్టికి ఎన్నో దుష్ట కార్యములు చేసి ప్రజలను దేవుని నుండి తిప్పివేశాడు. ఇదంతా ఎలా జరిగిందని ఆలోచిస్తే, ఎం అర్థం అవుతుంది? హిజ్కియా రాజు దేవుని చిత్తమును అంగీకరించక తనకు ఇంకా ఎక్కువ అయుష్షూ కావాలని కోరుకున్నాడు. దేవుని చిత్తమునకు విరుద్ధముగా మరో పదిహేనేళ్ళు జీవితకాలము అనగా మేలులు పొంది ఈ కార్యములన్ని కలుగటానికి పరోక్షంగా కారణం అయ్యాడు.
మనలను నడిపించవలసిన దేవుడు మరి మనకు కీడు చేయబోయే కోరికలను లేదా మేలులను ఎందుకు అనుగ్రహిస్తాడు అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఇదివరకు ఎన్నో మారులు మనం చెప్పుకోనట్లు దేవుడు మనకు పూర్తీ స్వేచ్ఛను కూడా అనుగ్రహించాడు. మన క్రియలకు మనమే భాద్యత వహించాలి. ఎలా అంటే! దేవుడు హిజ్కియాకు స్వస్థత అనుగ్రహించాడు మరియు కుమారుణ్ణి దయచేసాడు. కానీ అతను గర్వపడి సంపదను ప్రదర్శించాడు మరియు కుమారునికి దేవుని మహిమను మరియు భక్తి శ్రద్ధలను నేర్పటంలో విఫలం అయ్యాడు. పన్నెండేళ్లకు రాజయిన అతను అంత హీనుడిగా మారటానికి కారణం ఎవరు?
తండ్రిగా హిజ్కియా తన బాధ్యతను నెరవేర్చక పోవటమే అని అవగతమవుతుంది. మన ఉదాహరణలో చెప్పుకుంటే, తండ్రి కుర్రాడికి బైక్ కొనిచ్చాడు, కానీ వాడు దానిని తిన్నగా నడుపకుండా రకరకాల విన్యాసాలు చేసి ప్రమాదంలో పడితే తండ్రిని తప్పు పట్టటానికి లేదు. కనుక తండ్రి మాట విని బైక్ గురించి మంకుపట్టు పట్టకపోతే కొద్ది రోజులకు తండ్రి కారు కొని యిచ్చే వాడేమో కదా!
దేవుడు మన పట్టుదలను బట్టి, కోరికల తీవ్రతను బట్టి మనకు కావలసినది అనుగ్రహిస్తాడు, కానీ మనం ఆత్మీయంగా బలహీనులుగా మారిపోతాము. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు క్రింది వచనంలో చూడండి!
2 కొరింథీయులకు 12: "9. అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందె 10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను."
పౌలు అయనకు ఉన్న అనారోగ్యమును బట్టి దేవుణ్ణి స్వస్థతకై వేడుకుంటున్నాడు. కానీ దేవుని నుండి తనకు వచ్చిన సమాధానం "నా కృప నీకు చాలునని" కనుక తనకు ఉన్న ఆ బలహీనతలోనూ అతను బలవంతుడనని సంతోషిస్తున్నాడు. బలహీనతలో బలం ఎలా కలిగింది! దేవుడు తనకు తోడై ఉన్నాడు, అతను పూర్తిగా దేవుని చిత్తములో నడుస్తున్నాడు. దేవుని నిర్ణయమును అంగీకరించాడు. తానూ కోరుకొనే మేలు అనగా స్వస్థత కన్నా దేవుని కృపలో మిక్కిలి సంతోషించాడు.
కానీ ఇశ్రాయేలు వారు హిజ్కియా వలెనె తమ కోరికలు అణుచుకోలేక బలహీనులుగా మారిపోయారు. దేవుని చిత్తమును కనిపెట్టక తమకు కావలసిన మేలులకై ఆరాటపడి దేవునికి ఆగ్రహం తెప్పించారు.
కీర్తనలు 106: "13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. 14. అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి 15. వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను."
పై వచనం చూడండి! దేవుడు మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషిస్తుంటే వారు దానితో తృప్తి పడక, రుచులు మరిగి మాంసం కోసం అల్లాడినారు. అందు నిమిత్తమై తమ నాయకుడయినా మోషేతో వాదించి దేవుణ్ణి చులకనగా మాట్లాడారు. దేవుడు వారు కోరుకున్న మాంసం ఇచ్చాడు కానీ వారి ప్రాణములకు బలహీనత కలుగజేసాడు. పౌలు బలిహీనతలో కూడా బలంగా ఉన్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు వారు బలంలో కూడా బల హీనులుగా మారిపోయారు. వారు కోరుకున్న మేలు పనికి రానిది, దేవుని చిత్తములో లేనిది. కనుక వారు బలహీనులుగా మారిపోయారు.
కనుక సహోదరి, సహోదరుడా నువ్వు కోరుకొనే మేలు దేవుని పరిచర్యలో మిళితమయి ఉందా? అది దేవుని చిత్తములో ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. గ్రామంలో ఉన్న ఒక్క దైవ సేవకుడు, అంతర్జాతీయంగా సేవ చేయాలనీ కోరుకోవటం తప్పుగా అనిపించక పోవచ్చు కానీ దానికి తగ్గ నైపుణ్యం తనకు ఉందా? దేవుని సేవను అంతటి స్థాయిలో జరిగించగలడా? అలాగే భవిష్యత్తులో గర్వపకుండా దేవుని సేవను నిస్వార్థంగా నడుపగలడా? అని తనను తాను అంచనా వేసుకోవాలి. దేవునికి మనలను దూరం చేసే గుర్తింపు లేదా మేలుల కన్నా గుర్తింపు లేని సాధారణ జీవితమే మనకు మేలు కదా! దేవుని మీద ఆధారపడి మేలులు కోరుకోవాలి. అప్పుడు ప్రభువే మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. తగు సమయంలో ఆ మేలులు మనకు దయచేస్తాడు.
ప్రభువయిన యేసు క్రీస్తును మన రక్షకునిగా చేసుకున్న తర్వాత, మారు మనసు పొందిన వారమయి, ఇది వరకు మనం చేసిన పాపపు కార్యములను చేయకుండా ఉండవలెనని దేవుని వాక్యం మనకు బోధిస్తోంది. మన శరీరములో నిత్యమూ లోక సంబంధమయిన, నీతి యుక్తము కానీ క్రియలు తారసిల్లుతుంటాయి. దేవుడు అతి పరిశుద్ధుడు, మనం ఆయనలో నిలవాలి అంటే, మనం కూడా పవిత్రంగా ఉండవలసిందే. అప్పుడే మనం విశ్వాసం లో కొసాగుతున్నట్లు. బాప్తిస్మము పొందగానే, ప్రతి ఆదివారం దేవుని మందిరమునకు వెళ్తుంటే తాము పవిత్రులుగా మారిపోయినట్లు భావిస్తారు చాల మంది. అటువంటి స్థితిలో మనం ఉంటె పశ్చాత్తాపమును మరచిపోయి, మనకు లోకముతో ఉన్న సంబంధమును గుర్తించని వారిగా ఉన్నాము.
1 పేతురు 4: "2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును. 3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, 4. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు."
అపొస్తలుడయిన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, యేసుక్రీస్తు విశ్వాసులము అయినా మనము ఇదివరకు చేసిన శరీర క్రియలు చెయ్యవలదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకు ముందు అన్యజనులు చేయు కార్యములు, అనగా లోక రీతులు పాటించినది చాలునని, ఆ కార్యములన్నింటిని వివరిస్తున్నారు. అంతే కాకుండా లోకస్తులు తమ కార్యములలో, మనం పాల్గొననందుకు దూషించగలరు అని చెబుతున్నారు. అంటువంటి వారి స్నేహముకై, వారి మెప్పు కొరకై దేవునికి ఇష్టం లేని ఇటువంటి క్రియలు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం చేయతగదు.
ఇటువంటి స్థితిలో మనం కొనసాగటానికి కారణం, మన స్థితిని మనం గుర్తించకపోవటమే. అనగా మనం చేస్తున్న లోక పరమయిన కార్యములను మనం చాల తేలికగా తీసుకోవటం వల్లనే. ఆదివారం చర్చ్ కు వెళ్ళి ఆరాధించి, ప్రభువు బల్లలో పాలుపంచుకుంటే సరిపోతుంది అని అనుకోవటమో లేదా రోజుకు ఒక గంట టీవీ లో వచ్చే ఎదో ప్రసంగం వింటే సరిపోతుంది అని అనుకోవటమే వీటికి కారణం. కానీ అన్నింటికన్నా ముఖ్యమయినది, పాపముల ఒప్పుకోలు, మరియు (Self Cleansing) ఆత్మశుద్ధి కలిగి ఉండటం. పాపములు ఒప్పోకోనే వారే తమ స్థితిని గుర్తించిన వారిగా ఉంటారు. అటువంటి వారే లోక రీతులకు దూరంగా ఉంటూ, తమ ఆత్మీయ జీవితంలో బలంగా ఎదుగుతారు.
బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తుల వారు, మనకు ఎన్నో పాఠాలు నేర్పించారు. తన గొప్ప కోసం కాకుండా, తండ్రి నామమునకు ఘనతను తేవటముతో పాటు మనకు అమూల్యమయిన సంగతులు బోధించారు. మార్కు సువార్తలో 8 వ అధ్యాయం 22 వ వచనం నుండి 26 వ వచనము వరకు చదివితే ఆ సంగతులను చూడవచ్చు.
మార్కు 8: "22. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడు కొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. 23. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమి్మవేసి, వాని మీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, 24. వాడు కన్నులెత్తిమనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. 25. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. 26. అప్పుడు యేసునీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను."
పై వచనములలో యేసు క్రీస్తుల వారు బేత్సయిదా నుండి వచ్చిన ఒక గ్రుడ్డి మనుష్యుడిని స్వస్థపరిచారు. యేసు ప్రభువుల వారు స్వస్థతలు చేసే ముందు "నీకు విశ్వాసం ఉందా" అని అడిగి "నీ విశ్వాసము ప్రకారమే అవునుగాక" అని వారిని వెంటనే స్వస్థ పరుస్తారు. కానీ ఇక్కడ ప్రభువుల వారు ఆ వ్యక్తిని ఉరి బయటకు తీసుకొచ్చిన తర్వాత స్వస్థ పరిచారు. ఆశ్చర్యంగా ఎప్పుడు లేని విధంగా ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని రెండు సార్లు ముడితే గాని స్వస్థత రాలేదు. దానికి కారణం ఏమిటి? గ్రుడ్డి వ్యక్తికి విశ్వాసం లేదా? అతను ప్రభువు తనను ముట్టుకున్న తర్వాత కూడా పూర్ణ స్వస్థత పొందలేదని ఎందుకు నిజం చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభువుల వారు అతన్ని సంపూర్ణంగా స్వస్థ పరచిన తర్వాత ఎందుకు బేత్సయిదా ఊరిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మనకు లోకముతో సంభంధం ఉండటం వల్ల జరిగే నష్టములు, మరియు దానిలో నుండి బయటకు వస్తే జరిగే మేలులు అవగతం అవుతాయి.
బేత్సయిదా ఉరిని బట్టి యేసు క్రీస్తుల వారు మత్తయి సువార్తలో హెచ్చరికలతో గద్దించారు. ఆ విషయాలను మనం చూసినట్లయితే ఈ ఉరి నుండి ప్రభువుల వారు అతన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారొ అర్థం అవుతుంది.
మత్తయి 11: "20. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. 21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు 22. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను."
కోరాజీనా, బేత్సయిదా పట్టణముల వారు ప్రభువు చేసిన అద్భుత కార్యములు చుసిన కూడా మారు మనసు పొందని వారుగా ఉన్నారు. అనగా వారు లోక కార్యములు చేయుచు పశ్చాత్తాపము పొందక, దేవునికి ఇష్టంలేని పాపపు జీవితమునే కొనసాగిస్తున్నారు. కనుకనే ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని ముందుగా ఉరి నుండి వేరు చేశారు. మనలో కూడా ఆత్మీయపరంగా అంధకారము తొలగి పోవాలంటే ముందుగా లోకమునకు వేరు కావాలి.
ఆ తరువాత ప్రభువు అతన్ని ముట్టి "కనబడుతున్నదా" అని అడిగినప్పుడు గ్రుడ్డి వ్యక్తి చాల నిజాయితీగా పూర్తి స్వస్థత లేనట్లుగా, మనుష్యులకు, చెట్లకు తేడా తెలియటం లేదని చెప్పాడు. అతను ఇక్కడ ఎంతో మందిని బాగు చేసిన యేసు క్రీస్తు నన్ను స్వస్తపరుస్తున్నాడు గనుక "కనబడుతుంది ప్రభువా" అని చెప్పలేదు. అంతే కాకుండా వచ్చిన చూపు చాలులే అని అనుకోలేదు. నా ప్రియా సహోదరుడా, సహోదరి మనకు అలాంటి నిజాయితీ ఉందా? ఇంకా నాకు స్పష్టమయిన చూపు కావాలి, ఇంకా నేను ఆత్మీయతలో ఎదగాలి అన్న సంకల్పం ఉందా? నేను నమ్ముకున్నది పరిశుద్ధుడయినా యేసు క్రీస్తును గనుక నాకు ఎంటువంటి పాపమూ అంటదని నీ ఆత్మశుద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? యేసయ్య రక్తం పవిత్రమయినది, శక్తివంతమయినదే, కానీ ఆయన సంబంధులమయిన మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి, పరిశుద్దాత్మ శక్తితో నిండి ఉండాలి.
ఆ బేత్సయిదా ఉరి నుండి బయటకు రావాలి, ఆ మారు మనసు పొందని, పశ్చాత్తాప పడని స్థితి నుండి బయటకు రావాలి. మన ఆత్మీయ పరుగుకు అడ్డుపడే గ్రుడ్డి తనం నుండి స్వస్థత కావాలి, గొప్ప వెలుగుతో నిండిన చూపుతో యేసయ్య కోసం మన పరుగు కొనసాగాలి. ఒక వేళ పూర్తీ స్వస్థత పొందిన తర్వాత మరల ఆ బేత్సయిదా ఉరికి వెళుతున్నావా? యేసయ్య ఆ గ్రుడ్డి మనిషికి చెప్పినట్లు నువ్వు కూడా మరల ఆ ఊరిలోకి, ఈ లోకంలోకి వెళ్ళవద్దు. తిరిగి గ్రుడ్డి తనం నిన్ను ఆవరిస్తుంది. మరల దేవుడు నిన్ను స్వస్థపరచాలి. ఇలా వెనుకకు ముందుకు వెళ్తుంటే దేవుడు నిన్ను చూసి సంతోషించేది ఎప్పుడు? అయన నీకు ఇచ్చిన రక్షణకు నువ్విచ్చే ప్రాధాన్యత ఏపాటిది? ఆ పవిత్ర రక్తానికి నువ్వు ఇచ్చే విలువ ఏమిటి? సమయం మించి పోలేదు! మరోసారి ప్రభువును వేడుకో, నిజాయితీగా ఒప్పుకో! దేవా నాకు నీ వెలుగును చూసే స్పష్టత కావాలని, నాలో పాపం ఇంకా ఉందని పశ్చాత్తాప పడు. ఆ ఊరిలోకి, ఈ లోకం లోకి వెళ్ళే బలహీనత లేకుండా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు.
ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయినా సొలొమోను రాజు రాసిన పై వాక్యాలు చూడండి. లోకములో ఉండే సినిమాలు, నాటకాలు, కామెడీ షోలు, తాగుడు, వ్యభిచారము ఇంకా ఆటపాటలు అన్ని కూడా గడ్డి మంట లాగా ఉవ్వెత్తున్న ఎగిసి చల్లారిపోతాయి. దాని వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. ఆ తుచ్చమైన విషయాలు, మనలను శోదించటమే కాకుండా, మన అడుగులు పాపం వైపు వేయటానికి ప్రేరణ కల్పిస్తాయి. మనలను శోదించేది ఏదయినా సాతానుతో సంబంధం కలిగి ఉన్నదే.
జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది, కానీ మనుష్యులైన మనము అయన ఆజ్ఞలు పాటించకుండా, పవిత్రతను కోల్పోయి అయన సన్నిధికి దూరం అయిపోతున్నాము. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆ ఘోర సిలువలో నరక యాతన అనుభవించి, మనకు ఇచ్చిన పాప క్షమాపణను కోల్పోతున్నాము.
1 థెస్సలొనీకయులకు 4: "7. పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. 8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు."
దేవుడు మనలను పిలుచుకుంది పవిత్రులుగా ఉండాలని, కానీ లోక రీతులతో నిత్యము చెడు తలంపులతో శోదించబడుతూ, సాతాను సంబంధులుగా ఉండటానికి కాదు. ఒక్క వెళ అలా ప్రవర్తించేవారు, పాస్టర్లు చెప్పే ప్రసంగాలు కాదు, మనుష్యులు చెప్పే నీతులు కాదు గాని దేవుడినే నిర్లక్యం చేస్తున్నారు.
ప్రభువు నందు ప్రియమయిన మీకందరికి ఆయన పేరిట నేను చేస్తున్న మనవి, లోకముతో సంబంధం వదిలి పెట్టండి. సినిమాలు, టీవీ సీరియల్స్, మరియు మానసికంగా మనలను బలహీన పరచి శోధించే ప్రతి దానికి దూరంగా ఉండండి. అదే విధంగా తాగుడు, తిరుగుబోతు తనం, చెడ్డ స్నేహములు విడచి దేవునికి ఇష్టమయిన వారిగ ఉండండి.
దావీదు "దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించు వాడు ధన్యుడు" అని రాశాడు. మరో కీర్తనలో "దేవుని వాక్యము తన పాదములకు దీపముగా ఉన్నదని" అంటాడు. అయన వాక్యము మన హృదయాంతరాలలో ఉన్న చీకట్లు తొలగించి క్రీస్తు వెలుగులోకి నడిపిస్తుంది. అయన సన్నిధి మనలను హృదయశుద్ధి గలవారిగా మార్చి దేవుణ్ణి చూచె తేట చూపును పొందుకునెలా చేస్తుంది. అనగా దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఉంటాము, అప్పుడు దేనికి చింతపడని వారిగా మారిపోతాము. ముఖ్యంగా దేవుణ్ణి సంతోష పెట్టె వారిగా మన నడక మారుతుంది. కొన్ని నిముషాలు లేదా ఒక గంట మహా అయితే ఒక పూట లోక పరమయిన సంతోషం కోసం, దేవుణ్ణి సంతోష పెట్టె గొప్ప అవకాశం వదులుకుంటామా! సందర్భానుసారమయిన ఈ క్రింది పాటను వినండి! ప్రేరణ పొందండి!! దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో మీ ముందుకు వస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
మనలో ప్రతి ఒక్కరం ఇతరుల ముందు ఘనత పొందాలని ఆశపడుతూ ఉంటాము. మనకున్న ప్రత్యేకతలను బట్టి, ఇతరుల కంటే మనం అన్ని విషయాలలో నైపుణ్యం ఉన్నవారిగా గుర్తింపు పొందటానికి ఆరాటపడుతూ ఉంటాము. ఎవరయినా మన ప్రతిభ గురించి పది మందిలో పొగడాలని ఎదురు చూస్తూ ఉంటాము. అందును బట్టి కొందరు ఇతరులను కాకా పట్టడం, వారు కోరుకున్నవి ఇవ్వటం చేస్తూ ఉంటారు. పూర్వ కాలం భట్రాజులు అనే వారిని పిలిపించుకొనేవారు, వారు దానం ఇచ్చిన వారిని అదే పనిగా పొగుడుతూనే ఉండెవారు. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, కేవలం ఆ దానం చేసిన వారి అహం చల్లార్చుకోవటానికి తప్ప. అదేవిధముగా కొంతమంది క్రైస్తవ సహోదరులలో, సహోదరిలలో ఎవరయినా మన ప్రార్థన గురించి గాని, మనం పాడే పాట గురించిగాని ఇతరులు పొగడాలని ఎదురు చూస్తూ ఉంటారు. అంతే కాకుండా ఫలానా వ్యక్తి ఇంత దశమ భాగం ఇచ్చారు, అంత కానుక ఇచ్చారు అని సంఘములలో మైకు పెట్టి మరీ చెప్పించుకుంటారు. అంతే కాకుండా తమ ఆత్మీయ జీవితము ఎంతో ఉన్నతమయినదని, వారు ఎంతో గొప్పగా దేవునిలో ఎదుగుతున్నామని నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు. యేసు క్రీస్తు తన ఘనతను పక్కన పెట్టి, తండ్రి అయినా దేవుని నామముకు ఘనత రావటానికి, లోకమునకు తండ్రి ఉద్దేశ్యములు తెలపటానికి మాత్రమే ఆరాట పడ్డాడు. పొగడ్తలకై ఎదురు చూడలేదు, ఎవరు తిట్టినా పట్టించు కోలేదు. మత్తయి సువార్తలో యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్పిన విషయాలు గమనించండి!
మత్తయి 6: "1. మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు. 2. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. "
ఈ అధ్యాయంలో చూసినట్లయితే మనుష్యుల మెప్పు కోసము నీతి కార్యములు చేయటం, వారి ముందు ఘనత పొందటానికి దాన ధర్మములు చేయటం దేవునికి ఇష్టం లేని కార్యములు. వారు దేవుని నుండి ఎటువంటి ఘనతను పొందలేరని దేవుని వాక్యము సెలవిస్తోంది. అంతే కాకుండా లేని ఆత్మీయ జీవితమును నటించటము వేషధారణగా దేవుడు పరిగణిస్తాడు. వేషధారులయిన పరిసయ్యులను, శాస్త్రులను యేసు క్రీస్తు సున్నం కొట్టిన సమాధులతో పోల్చాడు. అంటువంటి వారిని అయన ఎన్నడూ అంగీకరించలేదు. కాబట్టి నా ప్రియా సోదరి సోదరులారా మీ ఆత్మీయ జీవితాన్ని ఇతరుల ముందు నిరూపించుకోవాలనే ఆరాటం వలదు. దేవుడు మీ జీవితం లో చేసిన మార్పులు చెప్పే తరుణంలో మీకు ఎక్కడయినా ఘనత కలుగుతుందేమో అలోచించి మీ సాక్ష్యములు పంచుకోండి. మనలో ఏ ఒక్కరం కూడా మన విశ్వాసమును బట్టి అతిశయ పడటానికి వీలు లేదు, ఏలయనగా మనకున్న విశ్వాసము అనాది కాలములో దేవుడి ఏర్పాటు చొప్పున కలిగినదే.
"సోదరుడా నువ్వు ఆత్మీయంగా బాగా ఎదుగుతున్నావ్" అని ఎవరయినా అంటే గర్వపడకండి కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఇతరుల ముందు ఎక్కువ ఆత్మీయంగా ఉంటున్నామా? నిజానికి సంఘములో కాకుండా మనం ఇంటిలో కూడా అంతే ఆత్మీయంగా ఉంటున్నామా? ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులు దేవుని చుట్టే ఉంటున్నాయా? ఒక వేళ మన ఆత్మ సాక్షి లేదని చెపితే మాత్రం ఖచ్చితంగా మనం వేషధారణ వైపు పరుగు పెడుతున్నాము గాని ఆత్మీయత వైపు కాదు.
మనుష్యులు మనలను ఘనత చేయాలని ఎదురు చూడటం, దేవుడి నుండి పొందే ఫలమును నిర్లక్ష్యం చేయటమే అవుతుంది. మన గురించి సాక్ష్యములు దేవుడు చెప్పాలి గాని, మనలాంటి మనుష్యులు కాదని ఎలా వేళల గుర్తుంచు కోవాలి. యోబు గురించి సాతాను ముందు దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసుగా! అంటువంటి సాక్ష్యం దేవుడు నీ గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నావా? అయితే మనుష్యుల పొగడ్తలకు దూరంగా ఉండు, ఎలా వేళల నీతిని జరిగిస్తూ, దేవుని యందు భయ భక్తులు కలిగిఉండు, తగిన సమయంలో దేవుడు నీ సాక్ష్యమును బయలు పరుస్తాడు. తగిన ఘనతను, ఆశీర్వాదాలను నీ జీవితంలో కురిపిస్తాడు.
మన రక్షకుడయినా యేసయ్య జీవితంలో జరిగిన ఈ సంఘటనను ఒక్కసారి చూద్దాం, మనం దేవుని చిత్తమును జరిగించినప్పుడు ఎలాగా మనకు ఘనతను తెస్తాడో తెలుస్తుంది
మత్తయి 3: "13. ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. 14. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని 15. యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. "
ఇక్కడ ప్రజలకు యోహాను నీళ్ళతో బాప్తీస్మం ఇస్తున్నాడు, ఆ సమయంలో వారు తమ పాపములు ఒప్పుకొని, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందుతున్నారు. ఏ పాపం లేని యేసయ్య వారిలాగే వరుస క్రమములో నిలబడి బాప్తీస్మం పొందటానికి వెనుకాడలేదు. ఈ జనమంతా తన గురించి ఏమనుకుంటారు, తనను కూడా పాపి కింద జమకడుతారెమో అని ఆలోచించలేదు. ప్రవచనములు నెరవేరడానికి, దేవుని చిత్తము జరిగించటానికి తన యొక్క సొంత ప్రతిష్టను లెక్క చెయ్యలేదు. ఇక్కడ అయన ఆలోచన విధానం ఇతరుల అభిప్రాయం పట్ల భయం లేదు, వారి పొగడ్తలకు, లేదా వారి తిట్లను లెక్క చేయని స్వభావం కనబడుతోంది. అయన ఆనాడు తన గురించి ఆలోచించుకొలేదు గనుకనే ఈనాడు మన రక్షణ అనుభవంలో ఎంతో ప్రాముఖ్యమయిన బాప్తీస్మం ప్రవేశ పెట్టబడింది. సంఘము క్షేమము కోసం మనం అటువంటి త్యాగము చేయటానికి సిద్ధమా? నాకు వాక్యం చెప్పే అవకాశం ఇవ్వలేదని ఒక్కరూ, పాడేటప్పుడు మైకు ఇవ్వలేదని మరోకరు, అన్నింటా నేనే ఉండాలి, అన్ని నా నుండే జరగాలి అని ఆత్మనూన్యతతో బాధపడుతూ సంఘమును ఎదగనివ్వని సంఘ పెద్దలు కొందరు. కానీ ఒక్క విషయం మరచి పోతున్నారు, దేవుని చిత్తమును జరిగిస్తే, సంఘము అభివృద్ధికి పాటుపడితే దేవుడే మన ఘనతను ఇతరుల ముందు చాటుతాడు, మన సాక్ష్యమును పెంచి ఇతరులకు ఆదర్శంగా నిలుపుతాడు. యేసయ్య బాప్తీస్మం పొందిన తర్వాత జరిగిన గొప్ప సంగతులు చూడండి.
"16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 17. మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను."
దేవుని గ్రంథమయిన బైబిల్ ప్రకారం యేసయ్య అప్పటివరకు ఎటువంటి అద్భుతాలు చెయ్యలేదు, ఎంటువంటి ప్రసంగాలు చెయ్యలేదు, ఎటువంటి పాటలు రాయలేదు, పాడలేదు, ఎటువంటి అన్య భాషలు మాట్లాడలేదు. కానీ దేవుడు అయన యందు ఆనందించుచున్నాడు! ఏలా సాధ్యం అయింది. దేవుని ఆత్మ ఆకాశం నుండి సాక్ష్యం ఇస్తోంది. దేనిని బట్టి? ఆయనలో వేషధారణ లేదు. ఇతరుల మెప్పుకోసం ఆరాటం లేదు, తన ఘనత కోసం పాకులాడటం లేదు. కేవలం దేవుని చిత్తమును జరిగించటం, సంఘము క్షేమాభివృద్ధిని కాంక్షించటం మాత్రమే ఉన్నాయి. అందుకే దేవుడు ఆయనయందు ఆనందించుచున్నాడు. అంతే కానీ యోహాను ఆయనను పొగిడినందుకు కాదు, అయన చెప్పులు ఎత్తటానికి కూడా నేను సరిపోను అని యేసయ్యను గురించి సాక్ష్యం ఇచ్చినందుకు కాదు.
మత్తయి 6: "5. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును."
పై వచనములలో మనకు తెలుస్తున్న సంగతులు ఏమిటీ? మన ఆత్మీయతను ఇతరుల ముందు ప్రదర్శించటం వాక్యానుసారం కాదు. దానిని బట్టి దేవుడు మన ప్రార్థనలు అంగీకరింపడు. ఇవిధంగా ప్రదర్శించటం వలన మనం వారి పొగడ్తల కోసం ఎదురు చూసినట్లే. పొగడ్తల కోసం ఎదురు చూసేవారు, దేవుని చిత్తము కన్న కూడా మనుష్యులకు ఏది ఇష్టమో అది చేయటానికి ఇష్టపడుతారు. మరియు మన హృదయమును దేవుని ముందు చూపించుకోవటానికి అవకాశం ఉండదు తద్వారా మనలో ఆత్మీయ ఎదుగుదల కుంటుపడుతుంది. కనుక అంటువంటి ఆత్మీయ జీవితం ఎన్నటికి దేవుణ్ణి సంతోషపెట్టదు, అది వేషధారణను పెంచి పోషిస్తుంది. ఇతరుల మెప్పును కోరటం ఆపివేయండి, దేవుని చిత్తమును చెయ్యండి. దేవుడే తగిన సమయంలో మన సాక్ష్యమును బయలు పరచి సంఘములో మనుష్యుల ముందు ఘన పరుస్తాడు. దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!