పేజీలు

31, డిసెంబర్ 2023, ఆదివారం

దేవునికి అన్ని సాధ్యమే!



గడచిన సంవత్సరము అంత మనలను కాచి, కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఒక్కసారి పోయిన సంవత్సరము మనము దేవునితో గడిపిన సమయమును సమీక్షించుకుందాము. రోజుకు ఒక్కసారయినా ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయా? రోజు దేవుని వాక్యం ధ్యానించిన సందర్భాలు ఉన్నాయా? ఒక వేళ లేవు అని తెలిస్తే, ఖచ్చితముగా మనం తొందరపడవలసిన అవసరం ఉంది. క్రైస్తవ జీవితములో మనము నిత్యమూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇతర విశ్వాసముల మాదిరి, వారానికి ఒక్కసారి లేదా తిథులు, ముహుర్తాలు చూసుకుని పూజలు చేయటం లాంటిది కాదు.  ప్రతి నిత్యమూ దేవునితో మన సమస్తము అనుసంధానము అయి ఉండాలి. 

ప్రతి రోజు దేవుని వాక్యము ధ్యానించుట ద్వారా ఆత్మీయ ఆహారమును పొందుకుంటాము. మన శరీరమునకు ఆహారం ఎలా అవసరమో, మన ఆత్మకు కూడా ఆహారము అవసరము, దాని ద్వారా ఆత్మీయ జీవితంలో బలపడుతాము. మరియు ప్రార్థన జీవితము కలిగి ఉండటం ద్వారా, దేవుని యందు విశ్వాసము పెరుగుతుంది, అందును బట్టి కలిగే శోధనలను ఎదుర్కొనే ధైర్యము పొందుకుంటాము. క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత ఖచ్చితముగా తిరిగి జన్మించాలి. అనగా పాత జీవితమును వదిలి, నూతనముగా జీవించటం మొదలు పెట్టాలి. ఆ పాప క్రియలను పూర్తిగా మానేసి, క్రీస్తు ఆజ్ఞలు పాటిస్తూ ఆయనను వెంబడించాలి. కనుకనే నిత్యమూ దేవునితో సంబంధం కలిగి ఉండాలి. 

విశ్వాసంలోకి వచ్చిన కొత్తలో ఎంతో నిష్ఠగా గడిపి ఉండవచ్చు, దేవుని పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉండవచ్చు. ఎన్నో ఆత్మీయ వరములు పొంది ఉండవచ్చు, సంఘములో గొప్పగా వాడుకో బడుతూ ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మన  ఆత్మీయ స్థితి ఏమిటి? ఒక్కసారి పరీక్షించుకోవాలి. క్రీస్తును విశ్వసించటం అంటే ఆయనను గురించి పాటలు రాయటం కాదు, ఆయనను గురించి పాడటం కాదు, అయన గురించి చెప్పటం కాదు, గాని ఆయనను అనుసరించటం. అయన ఎలాగయితే పాపం లేకుండా జీవించాడో, మనం కూడా జీవించే ప్రయత్నం చేయాలి. క్రీస్తు మనకు ఇచ్చిన పరిశుద్దాత్మ శక్తి ద్వారా (అపో 2:38)  అటువంటి పవిత్ర జీవితమును గడపాలి. 

చాల మంది యవ్వన సహోదరి, సహోదరులు ఎన్నో రకాల లోకరీతులకు కట్టుబడి పోయారు. సినిమా తారలను అనుకరిస్తూ, వారిని ఆరాధిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిత్యమూ వారి గురించి ఆలోచిస్తూ, తపన పడుతూ దేవునికి  దూరం అయిపోతున్నారు. అలాగే సహోదరీలు అందం పట్ల వ్యామోహం పెంచుకుంటూ, తమను తాము కించపరచుకుంటూ కుంగి పోతున్నారు. జీవితంలో అసంతృప్తితో రక రకాల దురలవాట్లకు  లోనయి సంతోషం వెతుక్కుంటున్నారు, పచ్చని జీవితాలను ఫలం లేనివిగా మార్చుకుంటున్నారు.  దేవుడు మనలను ఏర్పరచుకున్నది, కేవలం విశ్వాసులం అని చెప్పుకోవటానికి మాత్రమే కాదు, అవసరాలు ఉన్నప్పుడు ప్రార్థించటానికే కాదు, గాని శరీర క్రియలు వదిలి, ఆత్మ ఫలములు పొందుకోవాలని (గలతి 5:19-22). 

అలాగే కొంతమంది జీవితములో ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత లేదా ఎటువంటి కష్టాలు లేకపోవటం ద్వారా కూడా దేవునికి దూరం అయిపోతారు. వారి దృష్టిలో దేవుని అవసరం పెద్దగా ఉండదు, కనుక ఆత్మీయ జీవితం వారికి పనికి రానిదిగా, దేవుని మాటలు చేతకానివిగా ఉంటాయి. కానీ మరణం తర్వాత దేవుడు ఇచ్చిన వారి ఆత్మ దేవుని ముందు తీర్పుకు లోనవుతుందన్న విషయం విస్మరిస్తున్నారు. క్రీస్తు చెప్పినట్లుగా "ఒకడు సమస్తము సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే ఏమిటి ప్రయోజనము" (మత్తయి 16:26)

మీకా 6: "8. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. "

దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఏమిటి? కేవలము మంచిని పాటించుమని చెపుతున్నాడు. అలాగే న్యాయముగా నడుచుకోవాలని ఆశిస్తున్నాడు. మీకా గ్రంథములో ప్రజలు ఎంతటి అన్యాయాలు చేస్తున్నారో చెప్పి, వారు ఎలా ఉండాలో దేవుడు ఆ ప్రవక్త ద్వారా రాయించాడు. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో, ఈనాడు మనం కూడా అలాగే ఉన్నాము. కనికరము కలిగి, ఆ కనికరమును ప్రేమించే వారిలాగా మనం ఉండాలి. అలాగే అహంకారము, అహంభావము వదిలి దేవుని యెదుట దిన మనస్కులమై ప్రవర్తించాలి. చాల మంది ఎదుటి వారి హోదాను బట్టి, ధనమును బట్టి గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ అది కేవలము మనుష్యులను మాత్రమే సంతోషపెడుతుంది, అటువంటి వారు క్రీస్తు విశ్వాసులు అనిపించుకోరు (గలతి 1:10). ప్రతి ఒక్కరిని సమానముగా గౌరవించటం దేవుణ్ణి సంతోష పెడుతుంది. అలాగే నిత్యమూ పరిశుద్ధముగా జీవించాలని తపన కలిగి ఉండాలి. 

గత సంవత్సరమును వదిలేయండి, అది ఎన్నటికీ తిరిగి రాదు. దేవుని ముందు తిరిగి మన పాపములు ఒప్పుకుని నూతన జీవితమును ప్రారంభిద్దాము. ఆ పాత అలవాట్లకు స్వస్తి చెప్పి నూతనమయిన అలవాట్లు కొనసాగిద్దాము. పొద్దున్న లేవగానే దేవునికి వందనాలు చెప్పుకుని దినమును మొదలు పెట్టాలి. తర్వాత వాక్యము ధ్యానించుకోవాలి, ఒక వేళ వీలు కాకపొతే ఆ దినమంతా దేవుని చిత్తము నెరవేర్చేలాగా అయన సహాయం కోసం ప్రార్థించి, ఉద్యోగనికో, వ్యాపారనికో వెళ్ళిపోవాలి. అక్కడ కూడా చెడ్డవారితో సాహసవం చేయకుండా మంచి వారితో సహవాసం చేయాలి. చెడ్డ మాటలు మాట్లాడే వారితో ఉంటే మన ఆలోచనలు కూడా  కలుషితం అయ్యే అవకాశం ఉంది. 

తరువాత ఇంటికి వచ్చి కాసేపు కుటుంబముతో గడిపి దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి. పడుకొనే ముందు ఖచ్చితముగా కుటుంబ ప్రార్థన ఉండి తీరాలి. ఒంటరి వారయిన కూడా ఆ దినమంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పి నిద్రకు ఉపక్రమించాలి. సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటె అంత మంచిది. ఎందుకంటే వాటిని బట్టి శోదించబడి తిరిగి మన ఆత్మీయ జీవితములో వెనుకబడిపోయే అవకాశం ఉంది. విశ్వాసులకు క్రైస్తవ జీవితం చాల కష్టతరమయినదిగా అనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితము దేవునికి పూజ చేసి మరచిపోవడం కాదు, నిత్య పోరాటము, ప్రతి క్షణం దేవునికి ఇష్టముగా జీవించాలన్న ఆరాటము. 

యేసయ్య తన బోధలలో కూడా తనను విశ్వసించే వారు నిత్యమూ తమ సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలని బోధించాడు. అలాగే అయనను నమ్ముకోవటం ద్వారా ఇతరుల నుండి ద్వేషమును పొందుకుంటారని కూడా చెప్పాడు. అంతే కాకుండా తమ ఆస్తి మీద నమ్మకము ఉంచుకొను వారు పరలోకమును చేరలేరని కూడా అయన బోధించాడు. ఈ బోధలు విన్న క్రీస్తు శిష్యులు "అసలు పరలోకం వెళ్ళటం ఎవరికీ సాధ్యమవుతుంది" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మార్కు 10: "27. యేసు వారిని చూచి ఇది మను ష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. "

దేవుని పరిశుద్దాత్మ పొందుకున్న విశ్వాసులకు సమస్తము సాధ్యమే అని యేసయ్య వారికి ధైర్యము చెపుతున్నాడు. ఈ పరిశుద్దాత్మ దేవుడు మనం పాపములు ఒప్పుకొని, క్రీస్తు యందు విశ్వాసము ఉంచి బాప్తిస్మము పొందుకున్న దినము నుండి మనతో ఉంటాడు అని దేవుని వాక్యము చెపుతోంది. పరిశుద్దాత్మ దేవుడు నిత్యమూ మనతో, మనలో ఉంటూ మనలను సరయిన మార్గములో నడిపిస్తూ ఉంటాడు. మనం అయన అధీనములో ఉండటం ద్వారా అంటే అయన సూచనలు / ఆలోచనలు నిత్యమూ పాటించటం ద్వారా మన శరీర క్రియలను జయిస్తాము. ఫలితముగా ఆత్మ ఫలములు పొందుకొని దేవుని ఇష్టమయిన వారీగా జీవించే శక్తిని పొందుకుంటాము. 

క్రైస్తవ విశ్వాసము కేవలం ప్రవర్తనలో మార్పును కోరుకోదు గాని, మనసులో మార్పును కోరుకుంటుంది. అది కేవలము దేవుని పరిశుద్దాత్మ శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది. క్రీస్తు మన హృదయములో నివాసం చేసినప్పుడే ఇటువంటి జీవితము మనుష్యులకు సాధ్యం అవుతుంది. కన్య మరియమ్మ పరిశుద్దాత్మ శక్తి ద్వారా క్రీస్తును గర్భం దాల్చినట్లుగా, పరిశుద్దాత్మ శక్తి ద్వారానే మనలో క్రీస్తు పోలికలు ఏర్పడుతాయి, మన ప్రవర్తన ఆయనను ప్రతిబింబిస్తుంది. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! క్రైస్తవ జీవితం కష్టమయినది కేవలం తమ సొంత శక్తి మీద ఆధారపడే వారికి మాత్రమే. కానీ దేవుని శక్తి మీద ఆధారపడే వారికి కాదు. నిత్యమూ ప్రార్థించండి, పడిపోయిన ప్రతి సారి తిరిగి లేవండి, కన్నీళ్లతో దేవుని ముందు మోకరించి అయన కృప కోసం, క్షమాపణ కోసం అడగండి. వెయ్యి సార్లు పడిపోతే వెయ్యి సార్లు క్షమాపణ అడగండి. నా ప్రతి శరీర క్రియను జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి. దినంగా, చేతకాని వారిగా ఆయన మీద ఆధారపడి అడగండి. ఖచ్చితముగా నీకు జయజీవితం అనుగ్రహిస్తాడు. ఉన్నతమయిన ఆత్మీయ స్థితిలో దేవుడు నిన్ను నిలబెడుతాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగముతో కలుసుకుందాము. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఆమెన్ !! 

26, నవంబర్ 2023, ఆదివారం

చూస్తున్న దేవుడు (ఎల్రోయి)!


సామెతలు 15: "3. యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును."

దేవుని కన్నులు నిత్యమూ ప్రతి స్థలము మీద ఉండి, చెడ్డ వారిని మరియు మంచి వారిని చూస్తున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం చేసే ప్రతి క్రియ అయన ఎరిగి ఉన్నాడు, ప్రతి ఆలోచన చెడ్డదా మంచిదా ఆయనకు అవగతమై ఉన్నది. కనుక విశ్వాసులయిన మనము దేవుణ్ణి సంతోష పెట్టెలాగా జీవించాలి. చాల సార్లు మనం మన జీవితములో వివిధ రకాల పరిస్థితుల గుండా వెళ్తుంటాము. ఎన్నో సార్లు భయపెట్టె పరిస్థితులను ఎదురుకొంటాము. అటువంటి సమయంలో మన విశ్వాసం కాస్త సన్నగిల్లే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితిని దేవుడు మన మీదికి అనుమతించాడు అని సమస్తము అయన అధీనములో నడుస్తున్నాయని మనము పూర్తిగా విశ్వాసం చూపాలి. 

విశ్వాసులయిన మనలను ఓడించటానికి సాతాను దేవుని నుండి అనుమతి పొందుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మనం ఎంత గొప్ప విశ్వాసం చూపితే అంత గొప్పగా సాతాను మన మీదికి శోధనలు తీసుకువస్తాడు. అయితే ఆ శోధన కూడా మనం తట్టుకునేది గానే ఉంటుంది తప్ప, మన శక్తికి మించినదిగా ఉండదు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ఇటువంటి భయపెట్టే పరిస్థితులను ఎదుర్కోవటం దేవుని శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది. నిత్యమూ ప్రార్థనలో దేవునికి మన మొరలు చెప్పుకోవటం ద్వారా దేవుని నుండి ఆదరణ పొందుకుంటాము, తద్వారా ఆ శోధనలు గెలుస్తాము. 

కొంతమంది దేవుడు మనలను పట్టించుకోడు, కేవలం పూజలు చేసి వేడుకుంటేనే మనకు కావలసిన అవసరాలు తీరుస్తాడు అని నమ్ముతారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు.  మనలను మిక్కిలిగా ప్రేమించే దేవుడు, మనం ఎటువంటి స్థితిలో ఉన్న, ఆయనకు ఎంత దూరంగా ఉన్న మనలను చూస్తున్నాడు, మన గురించే ఆలోచిస్తున్నాడు. మనలను ఏ విధంగా రక్షించు కోవాలా? ఏ విధంగా ఆయనకు దగ్గరగా ఉంచుకోవాలా? ఏ విధముగా ఆయనను ప్రేమించే వారిగా మనలను మార్చుకోవాలా? అని ఆరాటపడుతున్నాడు. యేసయ్య చెప్పిన తప్పిన పోయిన కుమారుని ఉపమానం గుర్తుందా? కొడుకు తనను కాదని దూర దేశం వెళ్ళిన కూడా తండ్రి, అతని రాక కోసం ఎదురుచుశాడు. దూరాన ఉన్న కొడుకును గుర్తుపట్టి, పరుగున వెళ్ళి ముద్దాడి, నూతన వస్త్రాలు ధరింప జెసి, విందు చేశాడు. మన గురించి కూడా దేవుడు ఆలాగే ఎదురు చూస్తున్నాడు. 

కొన్ని సార్లు సాతాను పెట్టె శోధనలకు ఓడిపోయి, కొంతమంది విశ్వాసులు దేవునికి దూరంగా వెళ్ళి పోవాలనుకుంటారు. కానీ అప్పుడు కూడా దేవుడు వారిని చూస్తున్నాడు అన్న విషయం మరచిపోతారు. ప్రభువయినా యేసు క్రీస్తు సిలువలో చేసిన త్యాగాన్ని నిర్లక్ష్యం చేసి, వారిని బట్టి సాతాను దేవుని ముందు నిత్యము పిర్యాధులు చేయటానికి వారు కారణం అవుతున్నారు (ప్రకటన 12:10). అటువంటి వారికి ఘోరమయిన తీర్పు వేచి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తోంది (హెబ్రీయులకు 10:29). తల్లి గర్బంలో మనలను రూపించినప్పుడే దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశ్యాలు కలిగి ఉన్నాడు మరియు మనం ఎలా బ్రతకాలో నిర్ణయించాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. 

కీర్తనలు 139: "16. నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. 17. దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది."

దావీదు తానూ రాసిన కీర్తనలో తానూ పిండముగా ఉన్నప్పుడే తానూ బ్రతక వలసిన దినములన్ని దేవుని గ్రంథములో రాయబడ్డాయని చెపుతున్నాడు. అంతే కాకుండా దేవునికి తన పట్ల ఉన్న తలంపులు లెక్కించటం అసాధ్యం అని చెపుతున్నాడు. ఎందుకు పనికి రాని, ఏ మంచి లేని మన గురించి దేవుడు ఇంతగా ఆలోచిస్తాడా? అని అనుమానం వద్దు. సృష్టి కారకుడయినా యేసు క్రీస్తు, మన కోసం మనిషిగా పుట్టి, పాపం లేకుండా జీవించి, సిలువలో మన కోసం తన ప్రాణం పెట్టి, తిరిగి సజీవుడయినది ఎంత నిజమో, మన కోసం అయన నిత్యం ఆలోచిస్తున్నాడు, మనలను చూస్తున్నాడు అన్నది కూడా అంతే నిజము. ఇకనయినా దేవుని వైపు తిరిగి, విశ్వాసములో బలపడుతూ సాతానుకు సవాలుగా నిలుద్దాము, దేవునికి గొప్ప సాక్ష్యులుగా సాగుదాము. 

చూస్తున్న దేవుడు లేదా ఎల్రోయి అన్న ఈ మాటను మొదట ఉపయోగించింది అన్యురాలయినా హాగరు. ఈమె అబ్రాహాము భార్య అయినా శారా దగ్గర దాసిగా ఉండేది. శారా దేవుడు ఇచ్చిన వాగ్దానమును పూర్తిగా విశ్వసించకుండా, కుమారుణ్ణి కనటానికి తన భర్త అయినా అబ్రాహామును దాసితో కలువుమని చెప్పింది. విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రాహాము శారాను గద్దించటం మాని ఆమె చెప్పినట్లు చేశాడు. గర్భవతి అయినా హాగరు, శారను చిన్న చూపు చూడటంతో, అబ్రాహాము అనుమతితో శారా హాగరును హింసించటం మొదలు పెట్టింది. తట్టుకోలేని హాగరు అరణ్యంలోకి పారిపోయింది. అటు పైన యెహోవా దూత ఆమె సంతానం గురించి దేవుని వాగ్దానాలు వివరించి, ఆమె కుమారుడయిన ఇస్మాయేలు గురించి ప్రవచనాలు చెప్పటం జరుగుతుంది.

ఆదికాండము 16: "12. అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా  13. అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను."

హాగరు దేవునికి ఇష్టం లేకుండా కుమారుణ్ణి కనటానికి వాడుకోబడింది. ఇది శారా, అబ్రాహాముల తొందరపాటు వలన కలిగిన పొరపాటు. కనుక దేవుడు హాగరును కనికరించాడు. ఆమె ఎటు వెళ్తుంది కనిపెట్టడానికి, ఆమెకు ధైర్యం చెప్పటానికి దేవుడు తన దూతను పంపాడు. తిరిగి తన యజమానురాలయిన శారా వద్ద వినయంగా ఉండి కుమారుని కనుమని హితవు చెప్పించాడు. లెక్కింప శక్యం కానీ సంతానమును ఆమెకు వాగ్దనము చేశాడు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! అన్యురాలు మరియు దేవునికి  ఇష్టం లేని సంతానం మోస్తున్న ఒక దాసిని దేవుడు ఇంతగా చూస్తున్నాడు, ఆమె పట్ల అంతటి కనికరం కలిగి ఉన్నాడు. మనకు విశ్వాసం ఇచ్చి, తన రక్తం ద్వారా మనలను పరిశుద్దులుగా చేసుకొని, తన బిడ్డలుగా పిలుచుకున్న మనలను చూడకుండా ఉంటాడా? ఇక్కడ ఇస్మాయేలును గురించిన వాగ్దానాలు ప్రోత్సాహకరంగా లేకపోయినా హాగరు ఎక్కడ కూడా బాధపడలేదు. ఎందుకంటే ఐగుప్తు దాసీగా ఉన్న తనకు దేవుని వాగ్దానాల ద్వారా గొప్ప స్థానం లభించింది. మరియు దేవుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితముగా నెరవేరుస్తాడని విశ్వాసం. మరియు తన కుమారుని సంతానం లెక్కలేని రేట్లు విస్తరిస్తుందని  సంతోషం. అంతే కాకుండా దేవుని తోడులో  తనకు, తన కుమారునికి రక్షణ దొరుకుతుందని నిశ్చయత ఆమెకు కలిగాయి. 

అందుకని "నన్ను చూసిన దేవుణ్ణి నేను ఇక్కడ చూశాను" అనుకొని దేవునికి "చూస్తున్న దేవుడు" అని పేరు పెట్టింది. మనం కూడా శోధన ఎదురయినప్పుడు, వేదన కలిగినప్పుడు "చూస్తున్న దేవుడు" అని గుర్తుచేసుకుని ధైర్యం పొందుకుందామా?  అలాగే చుట్టూ ఎవరు లేరు కదా అని పాపం చేస్తున్నపుడు, "చూస్తున్న దేవుడు" అని గుర్తెరిగి భయపడుదామా? దేవుని ప్రణాళికలు, అయన ఉద్దేశ్యములు మనకు అంతుపట్టవు. అబ్రాహాము, శారా దేవుడు చేసిన ఆలస్యముకు కారణాలు తెలియకుండా, తొందరపడ్డారు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన  శారా గర్భమును తెరిచి ఇస్సాకును ఇవ్వటం ద్వారా దేవుడు మహిమ పొందగొరుతున్నాడు అని గుర్తించలేకపోయారు (ఆదికాండము 18:11). మనం కూడా ఆలస్యానికి అలసిపోయి, లేదా కలిగే శోధనలకు అధైర్యపడి విశ్వాసం కోల్పోకుండా వాటిని ధైర్యంగా ఎదురుకుందాము, విశ్వాసములో బలపడుదాము. సాతానుకు లొంగిపోయి మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశ్యాలు తప్పిపోకుండా ఉందాము.  అయన చూస్తున్న దేవుడు, నిత్యమూ మనలను కాస్తున్న దేవుడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

22, నవంబర్ 2023, బుధవారం

ఆత్మీయ ఆరోగ్యము!

 

విశ్వాసులయిన చాల మంది, యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన తరువాత, కొంత కాలానికి తిరిగి లోక రీతుల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. కొన్ని సార్లు మనం అనుకున్నది దేవుడు మనకు అనుగ్రహించటం లేదని నిస్తేజమయిన స్థితికి వెళ్ళి పోవటం ద్వారా ఇటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉంటాడు. కొన్ని సార్లు మనం అనుకున్న మేలులు  దీర్ఘ కాలంలో మనకు కీడుగా మారటాన్ని బట్టి దేవుడు దాన్ని మనకు అనుగ్రహించకుండా ఉంటాడు. అందును బట్టి నిరాశపడి పోయి దేవునికి దూరంగా వెళ్ళటం ద్వారా, దేవుణ్ణి  బాధించే వారిగా మారిపోతాము. 

మరియు కొన్ని సార్లు మనకు జీవితంలో ఎటువంటి బాదరా బందీలు, శోధనలు లేకపోవటం ద్వారా కూడా దేవుని మీద ఆసక్తిని కోల్పోతాము. చాల సార్లు సరయిన సంఘము, లేదా సరయిన ఆత్మీయ స్నేహితులు లేక పోవటం ద్వారా ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆత్మీయ జీవితంలో నెమ్మదిగా వెనుకపడి పోయి, చివరకు ప్రార్థించటానికి కూడా సమయం కేటాయించనంత స్థితిలోకి వెళ్ళి పోతాము. మరియు దేవుని వాక్యము చదవటానికి ఆసక్తి చూపించాము. ఎందుకంటే ఆ లోక రీతులు మనకు ఎంతో సంతోషం కలిగిస్తుంటాయి, వాటి ద్వారా కలిగే సుఖాలకు తిరిగి అలవాటు పడి పోతాము. 

ఈ అలవాట్లు మన ఆత్మీయ జీవితమును నశింప చేస్తూ, దేవునితో మనకు ఉండే సంబంధమును పలుచన చేస్తుంటాయి. తద్వారా ఎంతో గొప్ప త్యాగం చేసి క్రీస్తు మన కొరకు సాధించిన రక్షణను కూడా కోల్పోయే స్థితిలోకి మనలను నడిపిస్తాయి. ఈ లోక రీతులను బట్టి, మనం విశ్వాసము కోల్పోయి మన రక్షణను మనమే నశింప  చేసుకుంటున్న వారిలా మారిపోతాము. ఈ అలవాట్లు హృదయములో చోటు చేసుకొని, మనలను నియంత్రిస్తుంటాయి. తద్వారా వాక్యము అంటే విసుగు, ప్రార్థన పట్ల విముఖత మరియు దేవుడంటే విరక్తిని పెంచుతాయి. ఆ విధముగా పరిశుద్దాత్మను వినే సున్నితత్వమును కోల్పోయి,  రక్షణకు ముందు ఉన్న స్థితి కంటే దారుణమయిన స్థితిలోకి వెళ్ళి పోతాము. 

ఆత్మీయంగా అనారోగ్యమునకు గురి అయినా మనలను  స్వస్థ పరచి తిరిగి పరిశుద్దులుగా  మార్చేది  ప్రభువయినా యేసు క్రీస్తు మాత్రమే. కేవలము అయన ముందు మోకరించి, మన పాపపు అలవాట్లు  ఒప్పుకుని, క్షమించమని అడిగితె చాలు, ఆ సిలువలో అయన సాధించిన విజయం నీకు కూడా అనుగ్రహిస్తాడు. నిన్ను తమ అధీనములో ఉంచుకొని, ఆత్మీయముగా నాశనం చేస్తున్న ప్రతి లోక రీతి నుండి అయన విడుదల దయచేస్తాడు. పాపములు ఒప్పుకోవటం అన్నది, షరతులు లేకుండా, సంజాయిషీలు ఇవ్వకుండా జరగాలి. అంటే ఫలానా కారణం వల్ల ఆలా చేసాను, ఫలానా వారి వల్ల ఇది చూసాను, వంటి ఆలోచనలు చేస్తే మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి క్షమాపణ కోరటం లేదని అర్థం. దేవుడు మనకు తన వాక్కును అనుగ్రహించాడు,  పరిశుద్ధాత్మను తోడుగా ఉంచాడు. మన ముందు నడచిన క్రీస్తు పాపం లేకుండా జీవించాడు. ఆలా బ్రతకటం మనకు కూడా  సాధ్యమే అని భూమి మీదికి వచ్చి నిరూపించాడు. 

మార్కు 5: "13. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను."
"15. జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయ పడిరి."

ఇక్కడ దురాత్మల గుంపు చేత పీడించబడుతూ, వాటి అధీనములో ఉండి, తనను తానూ గాయపరచుకుంటున్న ఒక వ్యక్తిని యేసు క్రీస్తు స్వస్థపరచటం మనం చూస్తాము. ఆ వ్యక్తిని ఇనుప సంకెళ్ళు వేసి బంధించిన కూడా, వాటిని తెంపుకొని తిరిగి స్మశానంలో తిరుగుతూ, రాళ్ళతో గాయాలు చేసుకొనే వాడు అని దేవుని వాక్యం చెపుతోంది.   ఇటువంటి మతి స్థిమితం లేని స్థితిలో మనలో చాల మంది ఉన్నారు. ఎంతో నిష్ఠగా ఉండాలనుకుంటారు, కానీ చివరకు ఆ సంకెళ్ళు తెంచుకొని, ఆ అలవాట్లకు లొంగి పోతారు. ప్రతి లోక రీతి, చెడు అలవాటు సాతాను ప్రవేశ పెట్టిన దురాత్మలు  మాత్రమే. 

ఆనాడు సాతాను యేసయ్యను శోధీంచినప్పుడు, లోకములో ఉన్న ఎన్నో సుఖ సౌఖ్యాలను, బోగ భాగ్యలను చూపించి ఆయనను లొంగదీసు కోవాలని చూశాడు. ఈనాడు మనలను కూడా లొంగ దిసుకొని, దేవునికి దూరముగా, ఆయనకు ఇష్టం లేని అపవిత్రపు జీవితం జీవించేలా చేస్తున్నాడు. కొంత మంది యోగ, ధ్యానము వంటివి సాధన చేస్తూ పంటి బిగువున వాటిని నియంత్రిస్తుంటారు. కానీ మనసులో నిత్యమూ వాటిని గురించి వ్యసన పడుతూ ఉంటారు, వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది మారు మనసు అనిపించుకోదు. కేవలం సొంత శక్తి మీద ఆధారపడి పవిత్రముగా జీవించాలను కోవటం లాంటిది, అది పాపానికి నిలయం అయినా మన శరీరానికి సాధ్యం కాదు.

మనకు సొంత నియంత్రణ ఉండాలి, వాటి మీద విజయం కావాలన్నా తపన ఉండాలి. ఆ విధముగా ఆత్మీయ జీవితమును అభ్యాసం  చేయాలి, కానీ అది మొదటి మెట్టు మాత్రమే. తర్వాత మనం దేవుని శక్తి మీద అంటే పరిశుద్దాత్మ మీద ఆధారపడి వాటి మీద విజయం పొందుకుంటూ ఉండాలి. నెమ్మదిగా క్రీస్తు స్వభావములోకి మారిపోవాలి. సొంత శక్తి మీద ఆధారపడటం అనేది, పాత్రను పైన శుభ్రం చేయటం లాంటిది. పరిశుద్దాత్మ శక్తి మీద ఆధారపడటం అనేది, పాత్రను లోపల శుభ్రం చేయటం లాంటిది.  అందుకే క్రీస్తు పరిసయ్యులతో, పాత్రను లోపల శుభ్రం చెయ్యండి అని గద్దించాడు (మత్తయి 23:26). అంటే మారు మనసు పొందుకొని, దేవునికి ఇష్టముగా జీవించటము. 

ఇక్కడ దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తిని సంకెళ్ళు వేసి బంధించిన కూడా, ఆ దురాత్మల నుండి అతనిని నియంత్రించ లేక  పోయారు. ఎందుకంటే అవి అతనిలోనే నివసిస్తున్నాయి కాబట్టి. ఎప్పుడయితే యేసయ్య వాటిని అతని నుండి వెళ్లగొట్టి పందుల గుంపులోకి పంపించాడో, అతను పూర్తిగా స్వస్థ పరచ బడ్డాడు. మన చెడు అలవాట్లు, లోక రీతులు కూడా అటువంటివే.  వాటి నుండి పూర్తిగా విడుదల కావాలంటే, మన మనసులో నుండి వాటిని పూర్తిగా తొలగించాలి. ఆ మారు మనసు పొందుకున్న  స్థితి మరల మనకు తిరిగి రావాలి. అది కేవలము దేవుని శక్తి ద్వారానే సాధ్యం అవుతుంది, దేవుని వాక్యము ద్వారానే అది కొనసాగుతుంది. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! నిరాశ, నిస్పృహ అసలు వద్దు. సాతాను చెప్పే అబద్దాలు నమ్మవద్దు. దేవుడు మనం ఎన్ని సార్లు పడిపోయిన క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. మనం వద్దని చెప్పిన కూడా మురికిలో ఆడుకొని వచ్చిన మన బిడ్డలను ఇంట్లోంచి వెళ్ళగొడుతామా? లేక స్నానం చేయించి మన పక్కన పడుకో బెట్టు కొంటామా? మనం కూడా దేవుని పిల్లలమే! అయన మనం ఎప్పుడు వస్తామా, మనలను పరిశుద్ధ పరచమని ఎప్పుడు అడుగుతామా అని ఎదురు చూస్తున్నాడు. అనుమానం వద్దు, అవిశ్వాసం చూపొద్దు. 

మార్కు 5: "17. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి."

మనలో కొంత మంది క్రీస్తును పూర్తిగా నమ్ముకుంటే బంధువులు ఏమనుకుంటారో, ఎటువంటి కష్ట నష్టాలు కలుగుతాయో అని సంకోచిస్తూ ఉంటారు. అటువంటి స్థితిలోనే యేసు క్రీస్తు దురాత్మలు వదిలించిన వ్యక్తి యొక్క గ్రామస్తులు కూడా ఉన్నారు అన్న విషయం పై వచనంలో చూడవచ్చు. యేసయ్య దురాత్మలను పందులలో ప్రవేశ పెట్టటం వల్ల, ఆ పందులు సముద్రములో దూకి చనిపోయాయి. అందును బట్టి వారు భయపడి, క్రీస్తును తమ ప్రాతం నుండి వెళ్ళి పోవలసిందిగా వేడుకున్నారు. ఇక్కడ వారు, ఒక వ్యక్తి స్వస్థపరచ బడ్డాడు అని ఆనందించ కుండా, ఎక్కడ తమకు ఇంకా ఆర్థిక పరమయిన నష్టం కలుగుతుందో అని వ్యసన పడ్డారు. అటువంటి స్థితిలో మనలో చాల మంది ఉన్నారు. కొంతమంది యవ్వనస్తులు ఫలానా అలవాటు మానేస్తే, ఎక్కడ ఇతరుల ముందు లోకువ అవుతామో, ఫలానా సంగతి తెలియదంటే ఎక్కడ చిన్న చూపు చూస్తారో అని భయపడుతు వాటిని కొనసాగిస్తుంటారు. 

మన రక్షణను మించిన విలువయినది ఏది లేదు! దేవుణ్ణి సంతోష పెట్టె పవిత్రమయిన జీవితం కంటే మేలయినది మరొకటి లేదు. ఎవరు మనలను  కాదన్నా, ఎంతగా చిన్న చూపు చూసిన, మన ఆత్మీయ ఆరోగ్యము మనకు ప్రధానం కావాలి. ఎన్ని నష్టాలూ వచ్చిన, కష్టాలు ఎదురయినా! పవిత్రంగా జీవిస్తూ, యేసయ్య వద్దకు చేరి దేవునికి ఇష్టముగా జీవించాలి. తగిన సమయంలో మన నష్టాలను, కష్టాలను ఆయనే తొలగిస్తాడు, తిరిగి పడిపోని బలమును అనుగ్రహిస్తాడు. 

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

15, ఏప్రిల్ 2023, శనివారం

పెళ్లి కూతురు పాట పై వివరణ!

 

"పెళ్లి కూతురు" అనే ఈ పాట మీద కొంత మంది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, కాబట్టి వారికి సరయిన వివరణ ఇవ్వాలని దేవుడు నడిపించినట్లుగా ఈ మాటలు  రాయటం జరుగుతోంది. 

పాట ముఖ్య ఉద్దేశ్యం: లోక రీతులను బట్టి ఎంతో మంది యవ్వనస్తులు తమ వివాహ విషయం లో ఎన్నో రకాల శొధనలకు గురి అవుతున్నారు. వారిని ప్రోత్సహించాలని, దేవుని చిత్తము కోసం ఎదురు చూస్తు తమ జీవిత భాగస్వాములను ఎన్నుకొవాలని, బైబిల్ లొని పాత్రలు, ఏ విధముగా ఎదురు చూసారో చెప్పాలని ఉద్దేశ్యము.  ఈ పాటలో చెప్పబడిన ప్రతి బైబిల్ పాత్ర వివాహ సమయంలో దేవుని ద్వారా నడిపింప బడ్డారు. అందుకే పెళ్ళి కాబోయే ప్రతి యవ్వనస్తురాలు వారి వలె కొనసాగాలని, వారి తో పోల్చుకోవాలని ఉద్దేశ్యము. 

వివాహ విషయంలో, "ఆ బైబిల్ పాత్రల మాదిరి నేను ఉన్నాను, ఉంటాను" అని చెప్పటమే ఉద్దేశ్యము. "దేవా పాపిని" అని ఎవరయినా పాట రాస్తే అయన మాత్రమే పాపి అని కాదు కదా! ఎవరు ఆ పాట పాడుకుంటే వారికి వర్తిస్తుంది. అదే విధముగా ఈ పాట ఏ యవ్వనస్తురాలు పాడుకున్నా  వారికి వర్తిస్తుంది. 

పాటలో పరిసరాలు:  పాట చిత్రీకరణ చేయాలనుకున్నప్పుడు మేము అనుకున్నది ఒక్కటే, ప్రజలు మరచి పోతున్న గ్రామీణ నేపథ్యమును చూపించాలని. అందుకే ముఖ్య  పాత్ర దారి అయిన యవ్వనస్తురాలు, గ్రామంలో ఉంటూ స్నేహితురాళ్ళతో, తోబుట్టువులతో సంతోషముగా గడుపుతూ, తల్లికి ఇంటి పనులలో సహాయం చేస్తుంటుంది. అదే సమయములో ప్రార్థన చేసుకుంటూ, దేవుని మీద గొప్ప విశ్వాసం చూపుతూ ఉంటుంది. 

రోకలితో పిండి దంచటం, కుండలో వంట చేయటం, బండ మీద పచ్చడి రుబ్బటం, గారెలకు పిండి రుబ్బటం, హిందూ మతానికి సంబంధం లేదు. ఇవ్వని కూడా గ్రామీణ వాతావరణంలో సాధారణమయిన ఇంటి పనులు. ఎవరో ఎదో సీరియల్ లో చూపించారని, మన పనులు మనం చేసుకోకుండా ఆపుకుంటామా? ఇంటి పనులు చేసుకోవటానికి మతానికి ఏమిటి సంబంధం? 

లిరిక్స్ యొక్క వివరణ: కొంత మందికి అభ్యంతరకరంగా ఉన్న వాక్యాలను, వాటి ఉద్దేశ్యాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ పాడుకునే వారు గొప్ప చెప్పుకొవటం కాదు గాని, బైబిల్లో చెప్పబడిన పాత్రలను పోలి నడుచు కుంటాను, లేదా నడుచు కోవాలని చెప్పటం ముఖ్య ఉద్దేశ్యము. 

"బుద్ది మంతురాలు ఎస్తేరు కు నిలువెత్తున ప్రతి రూపం" 
ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము, ప్రతి యవ్వనస్తురాలు ఎస్తేరు లాగా దేవుని మీద ఆధారపడాలి. భర్త ఎలాంటి వాడయినా, దేవుని మీద ఆధారపడితే ఆయనే భర్తకు తన మీద దయను కలిగిస్తాడు. అంతే కాకుండా తన వారిని కాపాడు కోవటానికి నిత్యమూ ప్రార్థన చేయాలని, చేస్తానని ఇక్కడ చెప్పాలనుకున్నాము. 

"హద్దులేవి దాటి ఎరుగవు నా ఊహలు – దేవుని పలుకులే నింపెను నా ఆశలు"
లోకస్తుల మాదిరి హద్దు లేకుండా చూసిన ప్రతి వారిని మోహించకుండా, ఊహలను హద్దులో ఉంచుకోవాలని, దేవుని పలుకులను బట్టి ఆశలను నియంత్రించు కోవాలని చెప్పటం ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము. అంతే కానీ చెడు ఆలోచనలు మనకు రావు అని కాదు, కానీ అలా వచ్చినప్పుడు పరిశుద్దాత్మ శక్తితో వాటిని జయించవచ్చు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. మన ఆశలు అన్ని దేవుని వాక్యాను సారముగా, అయన చిత్తమును బట్టి ఉండాలని చెప్పటం మరొక ఉద్దేశ్యము. 

"రిబ్కాను పోలిన నను చూసి సంబరాలు చేసేరు"
ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము, "రిబ్కా ఎంతటి పనిమంతురాలో, ఎంత జాలి కలిగిన హృదయం కలిగి ఉందొ నేను కూడా అలాగే ఉన్నాను, లేదా ఉంటాను" అని చెప్పటం. 

"రూతులాగా కలిసిపోవడం నాకున్న గుణం"
అత్తారింటికి వెళ్లే ప్రతి అమ్మాయి, వారితో బాగా కలిసి పోవాలి. రూతు లాగా అత్తను కూడా అమ్మ లాగా చూసుకొనే గొప్ప మనసు ఉండాలని చెప్పటమే ఇక్కడ ఉద్దేశ్యము. రూతు లాగ అత్తింటి వారితో అంత బాగా కలిసి పోతాను, అంతే కానీ "నేను రూతు, ఇద్దరమూ ఒక్కటే" అని చెప్పటం కాదు. 

"శుద్ధమయిన మరియమ్మ లాగ బుద్దిగా పెరిగాను"
మరియమ్మ ఎలాగయితే శుద్ధముగా, కన్యగా ఉండి దేవుని చిత్తమును పాటించిందో, తనకు జరిగే అవమానలను లెక్క చేయకుండా ఎలాగయితే, దేవుని కార్యమును నెరవేర్చిందో, ప్రతి యవ్వనస్తురాలు ఆవిధముగా ఉండాలని చెప్పటం, ఈ వాక్యము యొక్క ఉద్దేశ్యము. 

ఈ పాట, పెళ్లి కావలసిన యవ్వనస్తులను, ముఖ్యముగా అడ కూతుర్లను దేవుని మీద ఆధారపడుతూ, దేవుడు మన కోసం రాయించినా గొప్ప పాత్రలను బట్టి, వారి ప్రవర్తన ఉండాలని చెప్పే పెళ్ళి గీతము. ఈ పాట ద్వారా కొంతమంది అయినా యవ్వన సహోదరీలు లోకస్తుల మాదిరి కాకుండా, దేవుడు మనకు చూపించిన లక్షణాలను బట్టి నడుచు కుంటారని ఆశ పడుతున్నాము. 

ఈ పాట ఏ పాటకు అనుకరణ కాదు. కేవలం దేవుని మాటలు, అయన మీద ఆధారపడిన జనులు మనకు అనుసరణీయం కావాలని రాయటం జరిగింది. దయచేసి ఇకనయినా తీర్పు తీర్చటం ఆపండి. మీకు నచ్చక పొతే చూడకండి, కానీ విషం చిమ్మి మీలో చేదు వేరును మొలకెత్త నివ్వకండి. మా పరిచర్య కోసం  దయచేసి ప్రార్థించండి! సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక! ఆమెన్ !!

14, జనవరి 2023, శనివారం

చిన్న అలవాటనీ కొనసాగిస్తున్నావా?

 

దేవుడు మనలను నిత్యము పవిత్రులుగా ఉండాలని కొరుకుంటున్నాడు అని దేవుని వాక్యం మనకు చెపుతుంది. అందుకని ఇశ్రాయేలు వారికి మోషె ద్వారా పది అజ్ఞలు ఇచ్చి వారిని పాపం చేయకుండ చూడలనుకున్నాడు. పాపంలొ పడిపోతె పాప పరిహారార్ధ బలులు చేసే నిబంధన ద్వారా వారి పాపములు క్షమించాడు. అయితే యేసయ్య వచ్చిన తర్వాత పది అజ్ఞల స్థానంలొ కొత్త భొధలు మొదలయినయి. వ్యభిచారం చేయరాదు అన్న అజ్ఞ స్థానంలొ మొహపు చూపే వ్యభిచారముగా మారిపొయింది. నర హత్య చేయరాదు అన్న అజ్ఞ, స్థాయిని పేంచుకొని కోపపడటమె హత్యగా మారిపొయింది. ఎందుకని యేసయ్య ఇటువంటి అజ్ఞలు ఇచ్చాడు?

మన శరిరము బలహీనమయినదని అయనకు తెలుసు, కనుకనే దానికి ఎటువంటి శొధించబడె అవకాశం ఇవ్వరాదని అనుకున్నాడు. అంతె కాకుండా రోగం వచ్చినప్పుదు మందు తీసుకొవటం కన్న రొగం రాకుండా నియంత్రించలనుకున్నాడు. అందుకని ఇటువంటి అజ్ఞలు ఇచ్చి మనలను పవిత్రంగా ఉంచాలని మనకు భోదించాడు. మరియు పరిశుద్దాత్మ శక్తిని పొందుకోని అటువంటి జీవితమును కొనసాగించి, మనకు మాదిరిగా ఉన్నాడు. మనం కూడా పరిశుద్దాత్మ శక్తిని పొందుకొని అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలొ ఉన్న ఎన్నొ విషయాలు మనకు ఉదాహరణలుగా ఉండాలని దేవుడు రాయించాడు. అన్యజనులను ఇశ్రాయేలు వారి మధ్య నుండి వెళ్ళగొట్టాలని నాయకులకు, రాజులకు అజ్ఞపిస్తు వచ్చాడు. కానీ వారు వివిధ రకాలైన కారణాలు చెప్పి, దేవుని అజ్ఞను తృణికరించారు. కనుకనే అన్యజనుల చేడు అలవాట్లు నేర్చుకొని దేవుని అగ్రహానికి గురి అయినారు. 

2 దినవృత్తాంతములు 8: "7. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలో నుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలో నుండియు, శేషించియున్న సకల జనులను 8. ఇశ్రాయేలీ యులు నాశనముచేయక వదలివేసిన ఆ యా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను." 

ఈ వచనములొ సొలొమోను గారు దేవుడు నశింపచెయమన్న అన్య జనులను బానిసలుగా పెట్టుకున్నట్లుగా చూడవచ్చు. ఈ జనులను దేవుడు యెహొషువ కాలం నుండి కూడ నశింపచేయాలని అజ్ఞపిస్తు వచ్చాడు, కాని ఇశ్రాయేలు వారు వారి చేత పనులు చేయించుకొవచ్చు అన్న నెపంతొ వారిని తమ మధ్య నివాసం చేసెలా అనుమతించారు.  ఇదివరకు మనం పక్కవారితొ మనకు కలిగే అత్మీయ ఇబ్బందులను ధ్యానించుకున్నాము. అదే విధంగా మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లు  కూడా మనలను అత్మీయతలొ  వెనుకపడెలా చేస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలు వారు, మనకు బానిసలుగా ఉన్నవారు మనలను ఏం చేస్తారు అనుకోని ఉంటారు. అదే విధముగా మనకు ఉండే అల్పమయిన అలవాట్లు అంత ప్రమాదకారం కాదులే అని మనం అనుకోవచ్చు. కానీ ఆ అలవాట్లే దీర్ఘ కాలంలో మనలను శోధించి, దేవునికి  దూరంగా తీసుకెళ్తాయి. 

దేవుని వాక్యంలో చెప్పినట్లుగా సాతాను, "ఎవరిని మింగుదునా" అని గర్జించే సింహంలాగా ఎదురు చూస్తున్నాడు. మనం ఫోన్ లో చూసే ఆ వీడియోలు, మన ఆలోచనలు కలుషితం చేయవచ్చు. చదివే ఆ పిచ్చి వార్తలు దేవుని వాక్యం మర్చి పోయేలా చేయవచ్చు. దేవుణ్ణి ఎరుగని జనంతో స్నేహము, మన పాత జీవితం వైపు మనలను లాగవచ్చు. ఊరికే సినిమా పాటలు విందాం అనుకునే ఆ అలవాటు, దేవున్నీ మనం ఆరాధించే సమయాన్ని తగ్గించి వేయవచ్చు. అత్మీయపరంగా మనలను శోధించి, దేవునికి మనలను దూరం చేసే ప్రతి అలవాటు మానుకోవటం దేవునికి ఇష్టమయిన కార్యము.  కనీసం సెల్ ఫోన్ కూడా చుడ్దోద్దా? సంగీతం వింటే మరి అంత నష్టం కలుగుతుందా, అనుకునే వారు ఒక్కసారి ఈ వచనము చూడండి. 

1 కొరింథీయులకు 6: "12. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను."

మనకు అన్ని  చేయటానికి స్వేచ్ఛ ఉంది, కానీ అన్ని కూడా మనకు మేలును కలిగించవు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అది ఎంత చిన్నదయినా, పెద్దదయినా మనకు మేలును కలిగించే పనులను మాత్రమే చేయాలి. దేవుడు మన శరీరమును వెల పెట్టి కొన్నాడు, మనం మన సొత్తు కాదు గాని, పరిశుద్దాత్మ నివసించే దేవాలయము.  కాబట్టి మనము మన దేహము ద్వారా ఆయనను మహిమ పరచాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనలను శోదిస్తూ, అపవిత్రంగా మార్చబోయే అలవాట్లు నిమిషం పాటు కొనసాగించిన అవి మన ఆత్మీయతను తగ్గిస్తాయి. 

కీర్తనలు 106: "34. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. 35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. 36.  వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఈ వచనము చూడండి. దేవుడు నాశనం చెయ్యమన్న అన్య జనులను ఇశ్రాయేలు వారు నాశనం చెయ్యకుండా, వారిని బానిసలుగా ఉంచుకొని చివరకు వారి అలవాట్లు పాటించే వారిగా మారిపొయారు. వారిలాగే విగ్రహలను ఆరాధిస్తు వాటి ద్వారానే నశించిపొయారు అని దేవుని వాక్యం స్పష్టంగా చెపుతొంది. నీ చేతిలొ ఉన్న ఆ సెల్ ఫొన్ నీకు బానిసగా ఉందనుకుంటున్నావా? దాని ద్వారా పనులు తెలికగా అయిపొతున్నాయి అని సంబరపడుతున్నావా? టెక్నలజి వాడటం మంచిదే, కాని అది మనలను తనకు బానిసగా చేసుకొనంత వరకు మాత్రమె అయితే ఇంకా బాగుంటుంది. 

నువ్వు చదివే ఆ సినిమా రివ్యూలు నిన్ను ఏ విధముగా అత్మియతలో బలపరుస్తాయి అలొచించి అడుగులు వేయు.  నవ్వు కొవటానికి నువ్వు చూసే ఆ టివి ప్రోగ్రాం నిన్ను సాతాను ముందు నవ్వుల పాలు కాకుండా చూసుకో.  చిన్న అలవాటె కదా, ఇది నన్నెం చేస్తుంది అన్న నిర్లక్ష్యం వద్దు. సాతానుకు ఒక్క చిన్న అవకాశం చాలు  మనలను దేవునికి దూరం చేయటానికి. మనలను అపవిత్రంగా మార్చి మన అత్మీయతను దెబ్బ తియ్యటానికి.   

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము, అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!

7, జనవరి 2023, శనివారం

నూతన సంవత్సరము!

 

గడచినా కాలమంతా దేవుడు మన అందరిని కాచి  మరో సంవత్సరము దయ కిరీటముగా అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ప్రతి దినము అయన చిత్తమును నెరవేర్చటానికి, మనలను మనం తగ్గించుకోవటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాలని ఆయనను ప్రార్థిద్దాము. దేవుడు నిత్యమూ మన క్షేమాభివృద్ధిని ఆశిస్తూ ఉంటాడు. క్షేమాభివృద్ధి అనగానే, లోకపరమయిన ఆశీర్వాదాలు అని మాత్రమె అనుకోవద్దు. దేవుడు మనలను ఆశీర్వదించాడా? పేదవారిగా, చాలీచాలని వారిగానే ఉంచుతాడా? ఖచ్చితముగా కాదు. ఆకాశ పక్షులను పోషిస్తూ, గడ్డి పువ్వులను అలంకరిస్తున్న దేవుడు మనలను పోషించకుండా ఉండడు కదా. 

అయితే దేవుడు నిత్యమూ మన దీర్ఘకాల ప్రయోజనాలు క్షేమముగా ఉండాలని చూస్తాడు. మనం  ఆత్మీయతలో బలపడుతూ, ఆయనకు దగ్గర కావాలని అశపడుతున్నాడు. ఆ రకంగా ఈ భూమి మిద మనం ఉండె కొద్దికాలం గురించి కాకుండ నిత్యము మనము అయనతొ ఉండె పరలొకమునకు వారసులుగా మనం ఉండాలని కొరుకుంటున్నాడు. మనకు దేవుడు దయ కిరీటముగా ఇచ్చిన ఈ సంవత్సరమును ఎలా గడుపబొతున్నాము అన్న విషయము ఎంతొ ప్రముఖ్యత కలిగి ఉంది. చదువులొ తరగతి పెరుగుతున్న కొలది జ్ఞానం ఎలా పెరుగుతు ఉంటుందొ, అత్మియతలో వయసు పెరిగె కొద్ది, దేవునితొ మన సాన్నిహిత్యము కూడ పెరుగుతు ఉండాలి.  

నిత్యము క్రీస్తు శిష్యులుగా మారటానికి అయన మీద ఆధారపడాలి. అయన మీద ప్రేమ మునుపటి కంటె ఎక్కువగా పెరగాలి. ఇదివరకు ఉన్న లొక రీతులు అన్ని కూడ తగ్గి పొవాలి. మునుపటి కాలం కన్న మరింతగా మన యొక్క ప్రవర్తన అయనకు ఇష్టముగా మారిపొవాలి. క్రీస్తు విశ్వాసులుగా, క్రీస్తు స్వరూపములొనికి మారటం అనేది ఒక్క రోజులొ జరిగే ప్రక్రియ కాదు. అది నిత్యము మనము సాధన చెయవలసిన విషయము. అనుక్షణము పరిశుద్దాత్మ శక్తి  పొందుకోవటం ద్వారా మాత్రమె సాధ్యపడె విషయము. 

రూతు 3: "10. అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని ¸వనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది. 11. కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యు రాలవని నా జనులందరు ఎరుగుదురు."

ఈ వచనములొ చెప్పబడినట్లుగా రూతు ఒక్క అన్య జనము నుండి వచ్చిన స్త్రీ, అయినప్పటికి అమెకు తన అత్త మీద ఉన్న కనికరమును బట్టి, దేవుని మీద అమెకు ఉన్న విశ్వాసమును బట్టి, అమె ఏ పురుషున్ని  వెంబడించని మంచి గుణమును బట్టి, బొయజు అమె మంచి ప్రవర్తన మునుపటి కంటె ఇప్పుడు ఇంకా అధికముగా ఉందని అంటున్నాడు. అందును బట్టి ఆమెను యోగ్యురాలుగా గుర్తిస్తున్నాడు. దేవుడు కూడా మనలను యోగ్యులుగా చూడలని అశపడుతున్నడు. ఆవిధంగా మనలను అత్మియంగా దివించాలని అయన ఎదురుచుస్తున్నాడు. 

ఇంతకు ముందు మనకు ఎన్నొ కష్టలు ఉండవచ్చు, ఇప్పటికి ఆ కష్టలు కొనసాగుతుండవచ్చు, కాని రూతు అత్త నయోమి లాగ సణుగుకొకుండా, రూతు లాగా దేవుని మిద అధారపడుతు, మంచి పనులను చెయటంలొ విసిగి పొకుండ మన ప్రవర్తనను మునుపటి సంవత్సరము కంటె మరింతగా మెరుగు పరుచుకుందాము. ఇంకా ఎక్కువ సమయము దేవునితో గడపటానికి ఇష్టపడుదాము. తగిన సమయంలొ దేవుడు మనకు అశీర్వదాలు, అత్మీయ ఫలములు అనుగ్రహిస్తాడు. 

ఎజ్రా 2: "70. యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి."

బబులొనుకు బానిసలుగా తీసుకొని పొబడిన ఇశ్రాయేలియులు తిరిగి యెరుషలెముకు లెదా యుదా దేశమునకు రావటం ఈ వచనములొ మనం చూడవచ్చు. బబులొను అనెది లొకమునకు సాద్రుష్యముగా ఉన్నది, యెరుషలెము దేవుని సన్నిధికి, రక్షణకు సాద్రుష్యముగా ఉన్నది. కనుక ఆ బబులొను నుండి భయటకు రావటానికి ఎంత తపత్రయ పడుతున్నాము.  లోకము ఎన్నొ అకర్షణలు కలిగి ఉంది, బబులొను లాగ ఎత్తయిన, అందమయిన భవనాలు, ఎన్నొ సౌకర్యాలు ఉండవచ్చు. యెరుషలెము కూలిపొయి అకర్షణ లెకుండా కనపడుతుండవచ్చు, కాని అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. 

ప్రియమయిన సహొదరి, సహొదరుడా! ఇప్పుడు అకర్షణ లేని ఇరుకయిన, ఇబ్బంది కలిగిన ఆ యెరుషలెము మార్గములో సాగటానికి సిద్దపడి ఉన్నవా?  లెక లొకములొ ఉన్న అకర్షణలకు లొంగిపొయి, పాపమునకు బానిసగ బ్రతకటానికి ఇష్టపడుతు బబులొను లొనే కొనసాగుతావా? దేవుడు ఇచ్చిన ఈ సంవత్సరము మరి కొన్ని అడుగులు వెయు, ఆ బబులొనును దాటి రావటానికి దేవుని మిద మరింతగా అధారపడు. గత సంవత్సరము కంటె మెరుగయిన అత్మియ జీవితం జీవించ బోతున్నవా? దానికి తగిన ప్రణాళికలు వెసుకున్నవా? వాటిని అమలు చెయటానికి  అన్ని సిద్దం చెసుకున్నవా? దేవుడు మనకు ఇచ్చిన ఈ సమయం మనం మరింతగా అయనకు దగ్గర కావాటనికే  అన్న విషయం గుర్తుపెట్టుకొండి. మనకు వచ్చె ప్రతి కష్టము, నష్టము మనకు క్షేమాబివృద్దిని కలుగ చెయటానికే, మన రక్షణ అనుభవలను  మెరుగు పరచటానికే. మనలను ప్రేమించె దేవుడు, మనం నశించి పోయెలా చేయడు కదా! 

దేవుని చిత్తమయితే మరో వాక్య భాగంతో వచ్చే వారం కలుసుకుందాము, అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!!