దేవుని స్వభావమును ఎరిగిన వారు ఎవ్వరు కూడా దేవుడు ప్రేమలేని వాడని ఆలోచించలేరు! కానీ ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులను బట్టి, లోకంలో చెలరేగిపోతున్న కరోనా విలయ తాండవం ద్వారా నశించిపోతున్నా ప్రజలను బట్టి, మరణాల సంఖ్యను బట్టి, ఇటువంటి ప్రశ్నలు తలెత్తడం అత్యంత సహజమే. దేవుడు ఎన్నోమారులు తన ప్రేమ స్వభావమును ప్రత్యక్ష పరచుకున్నాడు. అయన ఎంత ప్రేమమయుడో తెలుకోవాలంటే పవిత్ర బైబిల్ గ్రంథం నుండి ఒక రాజు గురించి తెలుసుకుందాం.
అతను దేవుని కృపను పొంది, 15 సంవత్సరాలు అధిక ఆయుష్షు పొందిన హిజ్కియా కుమారుడయినా మనష్షే. ఇతని గురించి బైబిల్ గ్రంథం అత్యంత హీనమయిన వాడని సెలవిస్తోంది.
2 దినవృత్తాంతములు 32: "33. హిజ్కియా తన పితరులతో కూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమి యందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియ లను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను."
2 దినవృత్తాంతములు 33: "1. మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను. 2. ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్ల గొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను."
పై వచనములు చూస్తే ఇతని ప్రవర్తన ఏమిటో తెలుస్తుంది. మోషే ధర్మ శాస్త్రమును తృణీకరించాడు. దేవుని మందిరములో తానూ చేయించిన దేవత విగ్రహ మూర్తులను ప్రతిష్టింప జేశాడు. యాబై ఏళ్ళుగా ప్రజలను రాచి రంపాన పెట్టాడు, ప్రజలకు దేవుణ్ణి పూర్తిగా దూరం చేసాడు. అప్పుడు దేవుడు మనష్షే మీదికి అష్షూరు రాజు సైన్యాధిపతులను రప్పించాడు. అతడు బబులోనుకు బందీగా తీసుకోనిపోబడ్డాడు. ఆసమయంలో అతని అహంకారం పూర్తిగా అణగారి పోయింది.
2 దినవృత్తాంతములు 33: "12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించు కొని. 13. ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను."
పై వచనములలో అతను దేవునికి తనను తాను తగ్గించుకొని ప్రార్థించగా తిరిగి అతణ్ణి రాజ్యములోకి తీసుకోని వచ్చాడు. అసలు ఇది సాధ్యమేనా? బందీగా వెళ్లిన ఏ రాజయిన తిరిగి తన రాజ్యంలోకి రావటం జరుగుతుందా? దేవుని కార్యం కాక మరేమిటి? అందుకే మనష్షే దేవుని గొప్పతనం తెలుసుకున్నాడు. అప్పటి నుండి తానూ కట్టించిన ఇతర దేవతల విగ్రహాలు కూలిపించాడు, బలి పీఠములు బద్దలు కొట్టించాడు. దేవుడయినా యెహోవాను మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించాడు. పశ్చాత్తాప పడిన ఒక దుర్మార్గపు రాజుకు దేవుని క్షమాపణ లభించింది. తనను యాభై ఏళ్ళుగా నిరాకరించి, తన ప్రజలను తనకు దూరం చేసిన వాడిని, క్షమించి ఆదుకున్న దేవునికి ఎంత ప్రేమ ఉండాలి? ఇటువంటి సంఘటనలు ఎన్నో, మరెన్నో బైబిల్ నందు మనం చూడవచ్చు.
సహోదరి, సహోదరుడా ఒక్కసారి ఆలోచించు! ప్రపంచం ఎటువైపు వెళ్తోంది. ఎటు చూసిన అశ్లిలత, విచ్చలవిడితనం, మోసాలు, నేరాలు. ఆఖరికి దేవుడి పేరిట కూడా వ్యాపారం. మరి దేవుడు వీళ్ళందరినీ దారికి తీసుకు రావాలి కదా? మానవులు పశ్చాత్తాప పడి సక్రమ మార్గంలో సాగాలి కదా? డబ్బు ఉందన్న గర్వం కూడా ఎవరిని కాపాడలేక పోతోంది. ఈ మాటలన్నీ దేవుడు ఏనాడో తన గ్రంథంలో రాయించాడు.
జెఫన్యా 1: "18. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింప బడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వ నాశనము చేయబోవుచున్నాడు."
పేద లేదు, ధనిక లేదు అందరు ఏక రీతిగా కష్టాలు అనుభవిస్తున్నారు, చావు నుండి తప్పించుకోలేక పోతున్నారు. డబ్బు ఉండి కూడా సరైన వైద్యం అందక చనిపోతున్న వారు ఎందరో! చనిపోయిన వారందరు చెడ్డవారని నేను చెప్పటం లేదు! కానీ దేవుని కరుణ పొందాలంటే ఆయనను ఆశ్రయించటమే తుది అగత్యము. అభివృద్ధిని చూసి, సాంకేతితను చూసి దేవుడి ఉనికినే ప్రశ్నించిన ప్రపంచం, కంటికి కూడా కనపడని కీటకంతో యుద్ధం చేస్తోంది.
జెఫన్యా 2: "15. నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచార ముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గ మున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు."
పై వచనం చూడండి, నా వంటి వారు లేరు, నాకున్న రక్షణ కోటలు ఎవరు ఛేదించగలరు అని గర్వపడిన ఒక పట్టణము ఎలా నశించిపోతుందో దేవుడు జెఫన్యా ప్రవక్త ద్వారా చెపుతున్నాడు. మానవాళి కూడా అటువంటి గర్వంతోనే నిండియుండి. మనకున్న టెక్నాలజీకి దేన్నైనా సాధిస్తాం అనుకుంది, చివరకు దేవుడు ఉన్నడా అన్న దగ్గరి నుండి అసలు దేవుడి అవసరమే మానవాళికి లేదు, సృష్టి అంత దానంతట అదే ఉద్బవించింది అన్న దగ్గరికి వచ్చేసారు. ఇది మూర్కత్వం కాక మరేమిటి? సృష్టి కర్తను మరచి సృష్టిని ఆరాధించే వారు కొందరు, అసలు సృష్టికర్తే అవసరం లేదు అనే వారు మరికోందరు!
ప్రియా సంఘమా, సమయం లేదు! త్వరపడు. ప్రభువు చెప్పిన తన ఘడియలు రావటానికి ఎంతో కాలం పట్టదు సుమా. ఇంతవరకు ప్రభువు నందు విశ్వాసములో పడుతూ లేస్తూ సాగుతున్నావేమో, కానీ ఇప్పుడు పరుగు పెట్టటమే ఆవశ్యకం! వద్దు! ఆ చెత్త సీరియల్స్ ఆపేయ్, ఆ కుళ్ళు జోకుల ప్రోగ్రామ్స్ మానెయ్! ఆ బూతు సినిమాలు చూస్తు నీ హృదయమును అపవిత్రం చేసుకోకు, ఆత్మీయతలో నశించి పోకు! వారందరు యుగ యుగములు దహించబడటానికి సిద్ధంగా ఉన్నవారు. కానీ నీవు దేవుడి చేత ఎన్నుకోబడ్డావు. చివరికి తప్పిపోతావా? దేవుని దుఃఖముకు కారణం అవుతావా?
జరుగుతున్నా విపత్తులను చూసి అధైర్యపడవద్దు. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో కూడా నీకు తెలియదు. కానీ దేవునికి వాటి సంఖ్యలు కూడా తెలుసు! అంటే ఏది మొదటిది, ఏది రెండవది ఈ విధంగా అయన నిన్ను ఎరిగి ఉన్నాడు. అయన చిత్తం లేకుండా నిన్ను ఏది ఏమి చెయ్యలేదు. ఆలా అని విచ్చలవిడిగా తిరగవద్దు. ఐగుప్తు లో చివరి తెగులు సంహార దూత వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారిని భయట తిరగమనలేదు, గొర్రె పిల్ల రక్తం తమ ఇంటి ద్వారాలకు పూసుకొని ఇంట్లో భద్రంగా ఉండమన్నాడు. మనం చేయవలసింది కూడా అదే!
2 దినవృత్తాంతములు 7: "14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును."
పై వచనములో దేవుడు మన నుండి ఆశిస్తున్నా ప్రవర్తనను సెలవిస్తున్నాడు. మన పాప దోషములు గుర్తించి దేవుని క్షమాపణకై మొఱ్ఱ పెట్టవలెను, తద్వారా అయన మన పాపములను క్షమించి, మనం నివసించు దేశమును స్వస్థపరుస్తాడు. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అల్ప జ్ఞానులము అయినా మనకు అందని సమాధానాలు. కొందరు స్వాములు ఫలానా నెలకు కరోనా తగ్గిపోతుంది అంటారు, కానీ ఏ సంవత్సరమో చెప్పరు, ఎప్పుడు తగ్గితే అప్పుడే అని మాట మార్చేయొచ్చూ. కానీ మన దేవుడు ఆలా కాదు ప్రియులారా! అయన నరుడు కాదు మాట ఇచ్చి తప్పటానికి! భూమ్యాకాశాలు గతించిన అయన మాట గతించిపోదు. ఎందుకంటే అయన ఆది, అంతం లేని వాడు, సజీవుడు, ఉన్నవాడు. అయన ప్రేమ నిత్యం, అయన మార్గం సత్యం. దేవుడికి మరో పేరే ప్రేమ అని మనకు బైబిల్ లో ఏ పుస్తకములో ఏ అధ్యాయం చదివిన అవగతమవుతుంది. కనుక అధైర్యపడి విశ్వాసం కోల్పోవద్దు, కడవరకు సాగిపోదాము, పరలోకం చేరేవరకు.
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక!