పేజీలు

26, మార్చి 2022, శనివారం

ఆత్మీయతలో అసూయ ఉందా?

 

దేవుడు మనుష్యలయిన మనందరిని తన సన్నిధిలో ఉండటానికి ఏర్పరచుకున్నాడు. తన ప్రియ కుమారుడు, మన రక్షకుడయినా యేసు క్రీస్తు పట్ల మన విశ్వాసము పెంపొందించటం ద్వారా అయన నీతిని మనకు ఆపాదించి పవిత్రులుగా చేసాడు. తద్వారా మనకు రక్షణ అనుభవం ఇచ్చాడు. అనగా మన పాపముల నుండి విమోచన కలిగించి, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, తన ఆజ్ఞలు మీరకుండా, తన వాక్యము అర్థం చేసుకొని జీవించటానికి కావలసిన తెలివిని, జ్ఞానమును దయచేస్తూ,  మన రక్షకుడయినా యేసు క్రీస్తుల వారి స్వరూపములోకి మారటానికి ఆత్మీయ ఎదుగుదలను  అనుగ్రహిస్తూ ఉంటాడు.  ఈ ఆత్మీయ ఎదుగుదల మన రక్షణ అనుభవమును బట్టి కాక మన యొక్క  బైబిల్ జ్ఞానమును బట్టి, ప్రార్థన తడబడకుండా చేసే విధానమును బట్టి, లేదా వారికి తెలిసిన క్రైస్తవ గీతాల  సంఖ్యను బట్టి మెండుగా ఉన్నట్లు సంఘాలలో భావిస్తారు, కానీ అది దేవుని కొలమానములో లేదు. 

కొత్తగా విశ్వాసములోనికి వచ్చిన సహోదరి, సహోదరులు ప్రతి విషయములో ప్రతిభ లేని వారిగా కనబడవచ్చు. వారి విశ్వాసం, మరీ అంత గొప్పగా లేకపోవచ్చు, అనర్గళంగా ప్రార్థన చేసే తత్వం వారిలో కానరాక పోవచ్చు, బైబిల్ లో వాక్యము తీయటానికి కష్టపడవచ్చు, కానీ దేవుడి దృష్టిలో వారు ఆత్మీయ జీవితంలో ఇంకను పాలు త్రాగే శిశువుల వలె ఉన్నారు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన జ్ఞానము,  క్రీస్తు దేహమయిన,   సంఘములో అనుభవము బహు తక్కువ.  అంటువంటి శిశువులతో, నడక నేర్చిన, పరుగు పెట్టే సాటి విశ్వాసులు  పోల్చుకుంటూ "తాము వారికంటే గొప్ప" అనే ఆత్మీయ గర్వమునకు లోను కావటం దేవుని దృష్టిలో అంగీకారం కానేరదు.  అదేవిధముగా వారి తడబాటును చూసి ఎగతాళి చేయటం, దేవుని దృష్టిలో నేరమే. దేవునికి అసహ్యమయిన విషయం గర్వము.  దూరం ఎంతటిదయిన ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది, విశ్వాసి ఎంత నీతి పరుడయినా పాపిగానె ప్రారంభమవుతాడు.  మన గొప్ప కోసం, మొగ్గ స్థాయిలో ఉన్న విశ్వాసులను చులకనగా చూడటం, సంఘంలో  వారికి ఏవయినా బాధ్యతలు అప్పగిస్తే తట్టుకోలేక పోవటం ప్రభువు దేహములో భాగమయిన మనకు తగునా? బలహీనుడయినా సహోదరుని విశ్వాసమును దెబ్బ తీసే లాగున ప్రవర్తించు ప్రతి వాడును పాపము చేసినవాడేనని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని ఏమిదవ అధ్యాయం నుండి  క్రింది వచనం చూడండి. 

1 కొరింథీయులకు 8: "12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు." 

పై వాక్యము స్పష్టముగా చెబుతున్న సంగతులు గ్రహించి, సాటి విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడిన వారిగా ఉండటం సంఘమునకు క్షేమకరం. దేవుడు తన సేవ కొరకు అల్పులు, అజ్ఞానులను ఎన్నుకొంటాడు. అయన దృష్టికి గర్వం కలవారు అసహ్యులు, పనికి రాని వారు. ప్రభువు ఇచ్చే ఫలము ప్రతి వారికి ఒకేలాగా ఉంటుంది. ప్రభువు  ఎవరు  ఎప్పుడు మొదలు పెట్టారొ  చూడటం లేదు  కాని  విశ్వాసములో కొనసాగటమే చూస్తాడు. కనుక క్రొత్త విశ్వాసులను తేలికగా చూడటం లేదా వారికి ఇవ్వబడుతున్న తలాంతులను బట్టి, సంఘములో వారికి ఇవ్వబడుతున్న బాధ్యతలను బట్టి అసూయపడటం కడు దీనుడయినా యేసు క్రీస్తు విశ్వాసులుగా మనకు తగదు. 

ఈ విషయాలను బట్టి దేవుని వాక్యములో యేసు క్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్తలో గొప్ప సంగతులను  మనకు నేర్పించారు. 

మత్తయి 20: "8. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. 9. దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి. 10. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను. 11. ​వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, 12. పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి. 13.  అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయ లేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము; 14.  నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది; 15.  నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను. 

ప్రభువు చెప్పిన ఈ ఉపమానమును గమనిస్తే సాటి సహోదరుల పట్ల, మరీ ముఖ్యంగా క్రొత్తగా వచ్చిన విశ్వాసుల పట్ల మన ధోరణి ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు. ప్రభువు చెప్పిన ఈ ఉపమానంలో ఒక తోట యజమాని కొందరు కూలీలను పనికి కుదుర్చుకున్నాడు, కొన్ని గంటలు అయిన తర్వాత మరికొంత మంది పనిలోకి వచ్చారు. ఆపైన ఒక గంటలో పని గంటలు ముగుస్తాయనగా ఇంకొంతమంది పనివారు వచ్చి పనికి కుదిరారు. పని ఘడియలు ముగియగానే ఆ యజమాని తన గుమస్తాకు పనివారందరికి  డబ్బులు ఇమ్మని చెప్పాడు. అప్పుడు ఒక గంట పని చేసిన వారికి, మరియు కొన్ని గంటలు పని చేసిన వారికి ఒక దినారము ఇవ్వటం చూసిన, రోజంతా పని చేసిన పనివారు తమకు ఇంకా ఎక్కువ లభిస్తుందని ఆశించారు. కానీ ఆ యజమాని వారికి కూడా మిగతా వారి లాగే ఒక్క దినారము ఇవ్వటం చుసిన ఆ పనివారు గొణుక్కుంటూ "ఒక గంట పనిచేసిన వారిని, రోజంతా కష్టపడిన మమల్ని సమానంగా చుస్తున్నావు" అని గొణుక్కున్నారు. ముందుగా వచ్చిన విశ్వాసి, నీ తర్వాత వచ్చిన విశ్వాసుల పట్ల నీ ఉద్దేశ్యం అలాగే ఉందా? అయితే ప్రభువు నీతో అనే మాటను, యేసయ్య ఆ  యజమాని ద్వారా చెపుతున్నాడు. "నీకు ఇస్తానన్న కూలి ఇచ్చేసాను, నేను మిగతా వారికి ఎంత ఇస్తే నీకెందుకు, నేను మంచితనంతో ఉంటె నీ కడుపు మండిందా" అని. దేవుడు ప్రేమ స్వరూపి, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి విశ్వాసికి తన కృపలను అనుగ్రహిస్తాడు, తన సంఘములో స్థానం కల్పించి ఆత్మీయంగా బలపరుస్తాడు.  వారి విశ్వాసము చొప్పున, వారికి ఉన్న భారమును బట్టి తలాంతులు అనుగ్రహించి, తన పరిచర్యలో వాడుకుంటాడు. 

మన  విశ్వాస పరుగును అందరి కన్న ముందు మొదలు పెట్టాము  కదా! అని మన తర్వాత వచ్చిన వారిని దేవుడు తక్కువ చెయ్యాలను కోవటం వాక్యానుసారం కాదు. లోతుగా ఆలోచిస్తే, అటువంటి ఆలోచన విధానం, మన  యొక్క అసూయను, మనకు లోకము పై ఆశను సూచిస్తుంది. "అయ్యో ! అనవసరంగా ముందే విశ్వాసంలోకి వచ్చాము! వీరి లాగే అన్ని అనుభవించి వస్తే బాగుండేది! అంతే దొరికే మేలులకు, ఇంత కాలం అన్ని సుఖాలు వదులుకున్నాను" అనుకున్నట్లు లేదా? ఇక్కడ ముందుగా వచ్చిన వారికి జరిగిన లాభం ఏమిటి? నిశ్చయత! ప్రశాంతత! ఆనందం! నమ్మకము! ఇతరుల వలె వారు పని గురించి ప్రయాస పడవలసిన అవసరం రాలేదు. తమకు ఈ రోజు కూలి దొరుకుతుంది కాబట్టి, తగిన ఆహారం తింటాము అన్న నిశ్చయత, దానితో ప్రశాంతత, అందువలన ఆనందం దాంతో పాటు రేపు కూడా పని దొరుకుతుందని నమ్మకము. అంటువంటి ప్రశాంతత ఎన్ని డబ్బులు ఇచ్చి కొనగలం? చివరి వారు ఎంత బాధ అనుభవించి ఉంటారు? కూలి దొరుకుతుందో లేదోనని ఎంత యాతన పడి ఉంటారు?  అటువంటి యాతన మనకు  తప్పినందుకు సంతోషంగా లేదా? దేవుని ప్రేమకు మనం హద్దులు నిర్ణయిస్తున్నామా? 

సాటి వారిని దేవుడు దీవిస్తున్నందుకు దేవునికి  కృతజ్ఞతలు చెల్లించాలి! మన అవసరమును, మన ఆశలను తన చిత్తానుసారముగా తీర్చేది కూడా ఆ దేవుడే అని గుర్తుంచుకొని మన విశ్వాసం కొనసాగించాలి. దేవునికి ఇష్టమయిన వారిగా మన విశ్వాసం కొసాగిస్తున్నందుకు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందుకంటే మనం చెడ్డవారిగా ఉన్నప్పుడే మనలను ప్రేమించి అయన పట్ల మనకు విశ్వాసం అనుగ్రహించాడు కాబట్టి ఆనందించాలి. అంతే కాకుండా మన విశ్వాసము ఇతరులకు ఇబ్బంది కారాదు, వారి ఆశీర్వాదాలు మనకు అసూయా కారణం కారాదు. ఆత్మీయతలో దీనత్వం కనబడాలి, విశ్వాసంలో సహనం ఉండాలి. అటువంటి పరిశుద్దాత్మ నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక.  దేవుని చిత్తమయితే వచ్చే ఆదివారం మరొక వాక్య భాగం మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి