1 పేతురు 4: "2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును. 3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్య పానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును, 4. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు."
అపొస్తలుడయిన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, యేసుక్రీస్తు విశ్వాసులము అయినా మనము ఇదివరకు చేసిన శరీర క్రియలు చెయ్యవలదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకు ముందు అన్యజనులు చేయు కార్యములు, అనగా లోక రీతులు పాటించినది చాలునని, ఆ కార్యములన్నింటిని వివరిస్తున్నారు. అంతే కాకుండా లోకస్తులు తమ కార్యములలో, మనం పాల్గొననందుకు దూషించగలరు అని చెబుతున్నారు. అంటువంటి వారి స్నేహముకై, వారి మెప్పు కొరకై దేవునికి ఇష్టం లేని ఇటువంటి క్రియలు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం చేయతగదు.
ఇటువంటి స్థితిలో మనం కొనసాగటానికి కారణం, మన స్థితిని మనం గుర్తించకపోవటమే. అనగా మనం చేస్తున్న లోక పరమయిన కార్యములను మనం చాల తేలికగా తీసుకోవటం వల్లనే. ఆదివారం చర్చ్ కు వెళ్ళి ఆరాధించి, ప్రభువు బల్లలో పాలుపంచుకుంటే సరిపోతుంది అని అనుకోవటమో లేదా రోజుకు ఒక గంట టీవీ లో వచ్చే ఎదో ప్రసంగం వింటే సరిపోతుంది అని అనుకోవటమే వీటికి కారణం. కానీ అన్నింటికన్నా ముఖ్యమయినది, పాపముల ఒప్పుకోలు, మరియు (Self Cleansing) ఆత్మశుద్ధి కలిగి ఉండటం. పాపములు ఒప్పోకోనే వారే తమ స్థితిని గుర్తించిన వారిగా ఉంటారు. అటువంటి వారే లోక రీతులకు దూరంగా ఉంటూ, తమ ఆత్మీయ జీవితంలో బలంగా ఎదుగుతారు.
బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తుల వారు, మనకు ఎన్నో పాఠాలు నేర్పించారు. తన గొప్ప కోసం కాకుండా, తండ్రి నామమునకు ఘనతను తేవటముతో పాటు మనకు అమూల్యమయిన సంగతులు బోధించారు. మార్కు సువార్తలో 8 వ అధ్యాయం 22 వ వచనం నుండి 26 వ వచనము వరకు చదివితే ఆ సంగతులను చూడవచ్చు.
మార్కు 8: "22. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడు కొనివచ్చి, వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. 23. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నులమీద ఉమి్మవేసి, వాని మీద చేతులుంచినీకేమైనను కనబడుచున్నదా? అని వానినడుగగా, 24. వాడు కన్నులెత్తిమనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచు చున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. 25. అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా, వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడ సాగెను. 26. అప్పుడు యేసునీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను."
పై వచనములలో యేసు క్రీస్తుల వారు బేత్సయిదా నుండి వచ్చిన ఒక గ్రుడ్డి మనుష్యుడిని స్వస్థపరిచారు. యేసు ప్రభువుల వారు స్వస్థతలు చేసే ముందు "నీకు విశ్వాసం ఉందా" అని అడిగి "నీ విశ్వాసము ప్రకారమే అవునుగాక" అని వారిని వెంటనే స్వస్థ పరుస్తారు. కానీ ఇక్కడ ప్రభువుల వారు ఆ వ్యక్తిని ఉరి బయటకు తీసుకొచ్చిన తర్వాత స్వస్థ పరిచారు. ఆశ్చర్యంగా ఎప్పుడు లేని విధంగా ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని రెండు సార్లు ముడితే గాని స్వస్థత రాలేదు. దానికి కారణం ఏమిటి? గ్రుడ్డి వ్యక్తికి విశ్వాసం లేదా? అతను ప్రభువు తనను ముట్టుకున్న తర్వాత కూడా పూర్ణ స్వస్థత పొందలేదని ఎందుకు నిజం చెప్పాడు? యేసు క్రీస్తు ప్రభువుల వారు అతన్ని సంపూర్ణంగా స్వస్థ పరచిన తర్వాత ఎందుకు బేత్సయిదా ఊరిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మనకు లోకముతో సంభంధం ఉండటం వల్ల జరిగే నష్టములు, మరియు దానిలో నుండి బయటకు వస్తే జరిగే మేలులు అవగతం అవుతాయి.
బేత్సయిదా ఉరిని బట్టి యేసు క్రీస్తుల వారు మత్తయి సువార్తలో హెచ్చరికలతో గద్దించారు. ఆ విషయాలను మనం చూసినట్లయితే ఈ ఉరి నుండి ప్రభువుల వారు అతన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారొ అర్థం అవుతుంది.
మత్తయి 11: "20. పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. 21. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు 22. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను."
కోరాజీనా, బేత్సయిదా పట్టణముల వారు ప్రభువు చేసిన అద్భుత కార్యములు చుసిన కూడా మారు మనసు పొందని వారుగా ఉన్నారు. అనగా వారు లోక కార్యములు చేయుచు పశ్చాత్తాపము పొందక, దేవునికి ఇష్టంలేని పాపపు జీవితమునే కొనసాగిస్తున్నారు. కనుకనే ప్రభువుల వారు ఆ గ్రుడ్డి వ్యక్తిని ముందుగా ఉరి నుండి వేరు చేశారు. మనలో కూడా ఆత్మీయపరంగా అంధకారము తొలగి పోవాలంటే ముందుగా లోకమునకు వేరు కావాలి.
ఆ తరువాత ప్రభువు అతన్ని ముట్టి "కనబడుతున్నదా" అని అడిగినప్పుడు గ్రుడ్డి వ్యక్తి చాల నిజాయితీగా పూర్తి స్వస్థత లేనట్లుగా, మనుష్యులకు, చెట్లకు తేడా తెలియటం లేదని చెప్పాడు. అతను ఇక్కడ ఎంతో మందిని బాగు చేసిన యేసు క్రీస్తు నన్ను స్వస్తపరుస్తున్నాడు గనుక "కనబడుతుంది ప్రభువా" అని చెప్పలేదు. అంతే కాకుండా వచ్చిన చూపు చాలులే అని అనుకోలేదు. నా ప్రియా సహోదరుడా, సహోదరి మనకు అలాంటి నిజాయితీ ఉందా? ఇంకా నాకు స్పష్టమయిన చూపు కావాలి, ఇంకా నేను ఆత్మీయతలో ఎదగాలి అన్న సంకల్పం ఉందా? నేను నమ్ముకున్నది పరిశుద్ధుడయినా యేసు క్రీస్తును గనుక నాకు ఎంటువంటి పాపమూ అంటదని నీ ఆత్మశుద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? యేసయ్య రక్తం పవిత్రమయినది, శక్తివంతమయినదే, కానీ ఆయన సంబంధులమయిన మనం కూడా అంతే పవిత్రంగా ఉండాలి, పరిశుద్దాత్మ శక్తితో నిండి ఉండాలి.
ఆ బేత్సయిదా ఉరి నుండి బయటకు రావాలి, ఆ మారు మనసు పొందని, పశ్చాత్తాప పడని స్థితి నుండి బయటకు రావాలి. మన ఆత్మీయ పరుగుకు అడ్డుపడే గ్రుడ్డి తనం నుండి స్వస్థత కావాలి, గొప్ప వెలుగుతో నిండిన చూపుతో యేసయ్య కోసం మన పరుగు కొనసాగాలి. ఒక వేళ పూర్తీ స్వస్థత పొందిన తర్వాత మరల ఆ బేత్సయిదా ఉరికి వెళుతున్నావా? యేసయ్య ఆ గ్రుడ్డి మనిషికి చెప్పినట్లు నువ్వు కూడా మరల ఆ ఊరిలోకి, ఈ లోకంలోకి వెళ్ళవద్దు. తిరిగి గ్రుడ్డి తనం నిన్ను ఆవరిస్తుంది. మరల దేవుడు నిన్ను స్వస్థపరచాలి. ఇలా వెనుకకు ముందుకు వెళ్తుంటే దేవుడు నిన్ను చూసి సంతోషించేది ఎప్పుడు? అయన నీకు ఇచ్చిన రక్షణకు నువ్విచ్చే ప్రాధాన్యత ఏపాటిది? ఆ పవిత్ర రక్తానికి నువ్వు ఇచ్చే విలువ ఏమిటి? సమయం మించి పోలేదు! మరోసారి ప్రభువును వేడుకో, నిజాయితీగా ఒప్పుకో! దేవా నాకు నీ వెలుగును చూసే స్పష్టత కావాలని, నాలో పాపం ఇంకా ఉందని పశ్చాత్తాప పడు. ఆ ఊరిలోకి, ఈ లోకం లోకి వెళ్ళే బలహీనత లేకుండా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు.
ప్రసంగి 7: "5. బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 6. ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము."
ప్రసంగి గ్రంథంలో మహాజ్ఞాని అయినా సొలొమోను రాజు రాసిన పై వాక్యాలు చూడండి. లోకములో ఉండే సినిమాలు, నాటకాలు, కామెడీ షోలు, తాగుడు, వ్యభిచారము ఇంకా ఆటపాటలు అన్ని కూడా గడ్డి మంట లాగా ఉవ్వెత్తున్న ఎగిసి చల్లారిపోతాయి. దాని వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. ఆ తుచ్చమైన విషయాలు, మనలను శోదించటమే కాకుండా, మన అడుగులు పాపం వైపు వేయటానికి ప్రేరణ కల్పిస్తాయి. మనలను శోదించేది ఏదయినా సాతానుతో సంబంధం కలిగి ఉన్నదే.
జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది, కానీ మనుష్యులైన మనము అయన ఆజ్ఞలు పాటించకుండా, పవిత్రతను కోల్పోయి అయన సన్నిధికి దూరం అయిపోతున్నాము. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆ ఘోర సిలువలో నరక యాతన అనుభవించి, మనకు ఇచ్చిన పాప క్షమాపణను కోల్పోతున్నాము.
1 థెస్సలొనీకయులకు 4: "7. పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. 8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు."
దేవుడు మనలను పిలుచుకుంది పవిత్రులుగా ఉండాలని, కానీ లోక రీతులతో నిత్యము చెడు తలంపులతో శోదించబడుతూ, సాతాను సంబంధులుగా ఉండటానికి కాదు. ఒక్క వెళ అలా ప్రవర్తించేవారు, పాస్టర్లు చెప్పే ప్రసంగాలు కాదు, మనుష్యులు చెప్పే నీతులు కాదు గాని దేవుడినే నిర్లక్యం చేస్తున్నారు.
ప్రభువు నందు ప్రియమయిన మీకందరికి ఆయన పేరిట నేను చేస్తున్న మనవి, లోకముతో సంబంధం వదిలి పెట్టండి. సినిమాలు, టీవీ సీరియల్స్, మరియు మానసికంగా మనలను బలహీన పరచి శోధించే ప్రతి దానికి దూరంగా ఉండండి. అదే విధంగా తాగుడు, తిరుగుబోతు తనం, చెడ్డ స్నేహములు విడచి దేవునికి ఇష్టమయిన వారిగ ఉండండి.
దావీదు "దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించు వాడు ధన్యుడు" అని రాశాడు. మరో కీర్తనలో "దేవుని వాక్యము తన పాదములకు దీపముగా ఉన్నదని" అంటాడు. అయన వాక్యము మన హృదయాంతరాలలో ఉన్న చీకట్లు తొలగించి క్రీస్తు వెలుగులోకి నడిపిస్తుంది. అయన సన్నిధి మనలను హృదయశుద్ధి గలవారిగా మార్చి దేవుణ్ణి చూచె తేట చూపును పొందుకునెలా చేస్తుంది. అనగా దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఉంటాము, అప్పుడు దేనికి చింతపడని వారిగా మారిపోతాము. ముఖ్యంగా దేవుణ్ణి సంతోష పెట్టె వారిగా మన నడక మారుతుంది. కొన్ని నిముషాలు లేదా ఒక గంట మహా అయితే ఒక పూట లోక పరమయిన సంతోషం కోసం, దేవుణ్ణి సంతోష పెట్టె గొప్ప అవకాశం వదులుకుంటామా! సందర్భానుసారమయిన ఈ క్రింది పాటను వినండి! ప్రేరణ పొందండి!! దేవుని చిత్తమయితే వచ్చే వారం మరొక వాక్య భాగంతో మీ ముందుకు వస్తాము. అంతవరకూ దేవుడు మనందరికి తోడై ఉండును గాక! ఆమెన్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి