పేజీలు

12, ఏప్రిల్ 2022, మంగళవారం

గుడ్ ఫ్రైడే - నాలుగవ మాట (మార్కు 15:34)

 

మనలో అందరికి తెలిసిన విధంగా, ఆదాము అవ్వ చేసిన పాపము నుండి మానవాళిని  విడిపించలని  బలియాగం చేయటానికి దేవుడు పాపం లేని క్రీస్తును అనగా త్రిత్వము లో ఒక్కరయినా తన కుమారుడిని  తండ్రి మన తరపున సిలువ శిక్షకు అప్పగించాడు. అయనలో  ఏ పాపమూ లేదు , కనుకనే ఇదివరకు ప్రధాన యాజకులు  చేసిన  బలుల కంటే శ్రేష్ఠమయిన బలిగా దేవుడు పరిగణించాడు. కనుకనే అయన చేసిన ఒక్కే ఒక్క బలి ద్వారా సర్వ మానవాళికి పాపం నుండి  క్షమాపణ అనుగ్రహించాడు దేవుడు. ఈ క్షమాపణ క్రీస్తును విశ్వాసించి, ఆయనను వెంబడించిన వారికి మాత్రమే లభిస్తుంది. 

పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా (రోమీయులకు 3:23) అందరమూ పాపమూ చేసి దేవుని మహిమను కోల్పోతున్నాము. అనగా మనకు  పాపంతో సహవాసం ఉంటె దేవునితో సంబంధం లేని వారీగా అయిపోతాము. అయితే క్రీస్తు సకల మానవాళి పాపముల నిమిత్తం సిలువలో బలియాగం అవుతున్న సమయంలో, మన పాపముల భారం అయన పై మోపిన దేవుడు, తన పవిత్రతను బట్టి క్రీస్తును స్వల్ప కాలం వదిలి వేసాడు. ఆ స్వల్ప కాల దూరమును సైతం యేసు క్రీస్తు భరించలేక సిలువలో పలికిన నాలుగవ మాట ద్వారా బిగ్గరగా ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు. 

మార్కు 15: "34. మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము."

అప్పటి వరకు దేవుణ్ణి తండ్రిగా సంబోధించిన క్రీస్తు ఈ సమయంలో మాత్రం నా దేవా అని సంబోధిస్తున్నాడు. తన మీద ఉన్న పాప భారమును బట్టి దేవుడి తో తనకు ఉన్నసంబంధం తండ్రి అని పిలిచే చనువు నుండి దేవా అని పిలించేంత దూరం పెరిగిందని క్రీస్తు ఎరిగి యున్నాడు. కానీ దేవుణ్ణి మనం ఎలా చూడాలో మనకు నేర్పిస్తున్నాడు క్రీస్తు. దేవుడంటే దయ, జాలి లేని తీర్పు తీర్చేవాడిగా కాకుండా, తండ్రిగా మనలను ఆదరించు వాడని క్రీస్తు మనకు చూపించాడు. శిష్యులు మాకు ప్రార్థన చేయటం నేర్పుమని ఆడినప్పుడు యేసయ్య దేవుణ్ణి ఏమని సంబోధించాడు  "పరలోక మందు ఉన్న మా తండ్రి" (మత్తయి 6:9) అని కదా. 

అయితే తండ్రి అని పిలిచే ఈ చనువు మనకు ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరు తండ్రి అని పిలువ వచ్చా? ముమ్మాటికీ కాదు. పాపమూ పట్ల విముఖత ఉండి, దాని మీద విజయం పొందుకోవాలనే తపన ఉండాలి. క్రీస్తు మీద విశ్వాసంతో అయన చేసిన బోధనలు నిత్యం పాటించు వారీగా ఉండాలి. క్రీస్తు ఇచ్చిన ఆదరణ కర్త ద్వారా అనగా పరిశుద్దాత్మ ద్వారా మన శరీర క్రియలను జయిస్తూ క్రీస్తు స్వభావంలోకి మారిపోవాలి. అప్పుడే దేవుణ్ణి మనం తండ్రి అని పిలవటానికి అర్హులుగా ఉంటాము. 

దయచేసి లూకా సువార్త 19:12-28 వరకు చదవండి. అందులో మూడవ దాసుడు తనకు డబ్బు ఇచ్చిన యజమానిని కఠినుడిగా విశ్వాసించి, తనకు భయపడి ఏ వ్యాపారం చేయలేదని చెప్పినపుడు, ఆ యజమాని ఆగ్రహించి "చెడ్డ దాసుడా, నేను కఠినుడనా, నువ్వు నమ్మినట్లే నీకు అవును గాక" అని వాడిని శిక్షించాడు కదా! యేసయ్య దేవుడు కఠినాత్ముడు కాడని, ప్రేమ కలిగిన వాడని చెప్పటానికే ఈ ఉపమానం మనకు బోధించాడు. అయితే మొదటి పని వాడు, ఎక్కువ కష్టపడ్డాడు, దేవునికి ఎక్కువ విధేయత చూపించాడు, కనుకనే ఎక్కువగా ఫలించాడు. అలాగే మనం దేవునికి ఎంత విధేయత చూపితే అంతగా దేవునికి ప్రియమయిన వారిగా మారిపోతాము. 

యేసయ్య దేవుని తో సంబంధం విడిపోయిన కొద్దీ సమయానికే తన ఆత్మను అప్పగించాడు. కానీ ఆ కొద్దీ సేపు సమయానికి కూడా దేవునితో దూరన్నీ భరించలేక పోయాడు. తానూ భూమి మీద బ్రతినంత కాలం, శోధించే శరీరం తనను ఆత్మీయ మరణానికి గురి చేయకుండా, నిత్యమూ రోదిస్తూ, కన్నీళ్ళతో దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుని పట్ల అమితమయిన భయభక్తులు చూపించుట ద్వారా దేవుడు అయన ప్రార్థనలు అంగీకరించాడు, పాపం మీద విజయం అనుగ్రహించాడు (హెబ్రీయులకు 5:7). కేవలం రోదిస్తూ ప్రార్థన చేస్తే సరిపోదు కానీ, దేవుని చిత్తమును నెరవేర్చు వారీగా ఉండాలి. దేవుని చిత్తము పట్ల ఆసక్తి,  అటువంటి పోరాటం  మనకు ఉందా? దేవుని సన్నిధి దూరం అయితే తట్టుకోలేని ఆరాటం మనలో ఉందా

క్రీస్తు తండ్రి చిత్తము అంగికరించి సిలువ శ్రమలు పొందుట ద్వారా దేవుడు మన పాపములు రద్దు చేయటంతో పాటు, క్రీస్తును ఘనపరిచాడు. ఆయనను సిలువ మరణం నుండి లేపటమే కాకుండా ఆ దినము నుండి ఆయనను కుడిపార్శ్వమున ఆసీనుడిగా చేసాడు (లూకా 22:69). అటువంటి ఘనత పొందటానికి, దేవునికి  మన పట్ల ఉన్న ప్రణాళికలు నెరవేరటానికి సిద్దముగా ఉన్నామా? అసలు దేవుణ్ణి తండ్రి అని పిలవటానికి అర్హత కలిగి ఉన్నామా? కేవలం పెదవుల ద్వారా తండ్రి నీ చిత్తము నెరవేర్చు అంటాము, కానీ మళ్ళి దేవుని చిత్తం మనకు నచ్చింది కాకపోతే ఎలా? అని లోపల భయపడుతాం కదా? 

కానీ దేవుని ప్రణాళికలు మన ఆలోచనల కన్న ఉన్నతమయినవి. అయన మన మీద అనుమతించే ప్రతి  పరిస్థితి మనలను అభివృద్ధి పరిచేదే గాని  మనకు కీడు చేసేదిగా ఉండదు. సహోదరి, సహోదరుడా! తండ్రి చిత్తమును నెరవేర్చటానికి యేసయ్య అన్ని శ్రమలు పడ్డాడు, సిలువ శ్రమల కన్న కష్టమయిన విషయం, దేవుని సాంగత్యం కోల్పోయాడు. మరి మనకు ఎదురయ్యే ఈ చిన్న, చిన్న సమస్యలకు లొంగి పోయి, తండ్రితో ఉండే ఆ సంబంధం కోల్పోతామా? ఆయనను సంతోషపెట్టే అవకాశం వదులుకుందామా?

దేవుని చిత్తమయితే అయిదవ మాటను ధ్యానించుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి