పేజీలు

15, ఏప్రిల్ 2022, శుక్రవారం

గుడ్ ఫ్రైడే - ఏడవ మాట (లూకా 23:46)

 

దేవుడు మానవులను తన స్వరూపంలో ఏర్పరచుకున్నది వారిని తన సాంగత్యములో ఉంచుకొని వారితో స్నేహం చేయటానికి, కనుకనే పిలిచిన వెంటనే తనయందు విశ్వాసం ఉంచిన అబ్రాహామును, తనకు స్నేహితునిగా దేవుడు పేర్కొన్నాడు (యెషయా 41:8). ఈ ఏర్పాటు జగతి పునాది వేయబడక ముందే దేవుని చిత్తములో ఉన్నట్లుగా లేఖనములలో మనం చూడవచ్చు. అయితే మనం ఇదివరకు సిలువ మాటల ధ్యానంలో చెప్పుకున్నట్లుగా, మానవాళి దేవుని ఉద్దేశ్యములు కోల్పోయి నశించు వారిగా మారిపోయారు. 

కనుక యేసు క్రీస్తు సిలువలో మన కోసం ప్రాణం పెడుతూ, తన శారీరక శ్రమను బట్టి వేధనతో ఈ మాటలు పలుకలేదు కానీ, మనకు దేవుని పట్ల విశ్వాసమును పెంపొందించే లాగున, మరియు ఆయనకు మనలను దగ్గరగా తీసుకు రావటానికే పలుకుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయన ఇప్పుడు సిలువలో పడుతున్న శ్రమ ద్వారా తండ్రి తనను ఘనపరుస్తాడని యెరిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాగ్దానాలు పూర్ణ హృదయముతో విశ్వసించాడు. 

అందుకే అయన సిలువలో పలికిన చివరి మాట అనగా ఏడవ మాట లూకా సువార్త 23:46 లో చూడవచ్చు. 
 
లూకా 23: "46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను."

యేసు క్రీస్తుకు అన్నింటి మీద అధికారం ఇవ్వబడింది. "ఎవరు కూడా తన అనుమతి లేనిదే తన ప్రాణం తియ్యలేరని" చెప్పాడు (యోహాను 10:18) . ఇక్కడ ఈ ఏడవ మాటలో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. అనగా తను చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. అప్పటివరకు మన పాప క్షమాపణకై  రక్త ప్రోక్షణ గావించి, చివరగా మన పాపం వలన మనం పొందవలసిన మరణమును తాను పొందుతున్నాడు. 

అందుకే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు "అయన ఆకారములో మనిషివలె కనబడి, మరణము పొందునంతగా తనను తానూ తగ్గించుకున్నాడు" అని (ఫిలిప్పీయులకు 2:6). వీటన్నింటిని బట్టి చూస్తే మనకు ఏమి అవగతమవుతుంది, క్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చటానికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. దైవ లేఖనములలో ఉన్న వాగ్దానములను పూర్తిగా విశ్వసించాడు. మన వలె శోధించే శరీరంలో ఉండి కూడా నిత్యము దేవునికి మొఱ్ఱపెట్టుట ద్వారా, దేవుని నడిపింపును పొందుకున్నాడు.  

కనుకనే తనకు ఈ లోకంలో కలిగే శ్రమలను బట్టి వేధన పడకుండా, దూషణలను బట్టి దూషించకుండా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు (1 పేతురు 2:23). తద్వారా దేవుని వాగ్దానాల పట్ల, మరియు అయన  సత్య శీలత పట్ల మనకు విశ్వాసం కలిగిస్తున్నాడు. కానీ అటువంటి విశ్వాసము మనకు కలగాలంటే మనలను మనం పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. క్రీస్తు తన బోధలలో ఏమని చెప్పాడు? "మీరు చెడ్డవారు అయి ఉండియు, మీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వ జూస్తారు కదా! నీతిమంతుడయిన మీ పరలోకపు తండ్రి మీకు కీడు చేయాలనీ చూస్తాడా?" అన్నాడు కదా. 
 
కాబట్టి మనకు కలిగే శ్రమలను బట్టి అధైర్య పడకుండా, దేవుని మీద విశ్వాసముతో కొనసాగాలి, మనలను మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. సిలువ మరణం తర్వాత దేవుడు తనను మరణం నుండి లేపుతాడని క్రీస్తు పూర్తిగా విశ్వసించాడు. మరియు ఇదివరకు చెప్పుకున్నట్లు, లేఖనములు నెరవేరులాగా ఈ మాటను పలికినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 

కీర్తనలు 31: "5. నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే."


ఈ వచనములో దావీదు, "నా ఆత్మను నీ చేతికి అప్పగించు చున్నాను, సత్య దేవా నన్ను విమోచించు వాడవు నీవే" అంటున్నాడు. ఇక్కడ దావీదు తనకు దేవుని మీద ఉన్న గొప్ప విశ్వాసమును వెల్లడి చేస్తున్నాడు, కానీ ఇక్కడ తానూ నిజంగా తన ఆత్మను అప్పగించలేదు. దేవుడు వాగ్దానము తప్పని వాడని లేఖనములలో మనం చాల సార్లు  చూడవచ్చు.  కనుకనే క్రీస్తు సిలువలో ఈ మాట పలుకుట ద్వారా మనకు మరో సారి దేవుని సత్య సందతను గుర్తు చేస్తున్నాడు. తన ప్రాణం పెట్టుట ద్వారా, అయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు నిత్య జీవం ఇస్తాడని, అయనను  మరణం నుండి లేపుట ద్వారా నిరూపించ బడుతుందని క్రీస్తు ఎరిగి ఉన్నాడు.  

అపొస్తలుల కార్యములు 7: "59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి."

క్రీస్తు మరణ, పునరుత్థానం తర్వాత శ్రమలు అనుభవించిన క్రీస్తు విశ్వాసులలో మొదటి హత సాక్షి అయినా సైఫను తనను రాళ్ళతో కొట్టి చంపుతున్న వారిని క్షమించి యేసు ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. క్రీస్తు సిలువలో చూపిన క్షమా గుణం, దేవునికి  తనను తానూ అప్పగించుకోవటం తానూ కూడా చేశాడు. మరి మన జీవితంలో కలిగే శ్రమలను బట్టి, విశ్వాసంలో సడలి పోతున్నామా? లేక దేవుని వాగ్దానాలు నమ్ముకొని, ఏనాటికయినా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తున్నామా?

అన్ని సక్రమంగా జరుగుతుంటే ఏ భాధ ఉండదు, అసలు విశ్వాసంలో తప్పిపోవటమే ఉండదు కదా! కానీ శ్రమలు లేకుండా దేవుని మీద ప్రేమ ఎలా తెలుస్తుంది? అసలు విశ్వాసం ఎలా పెరుగుతుంది? దేవుడు  యోబు గురించి సాతానుకు చెప్పినప్పుడు వాడు ఏమి అన్నాడు! అతన్ని బాగా దీవిస్తావు కాబట్టి, నిన్ను ప్రేమిస్తాడు, విశ్వసిస్తాడు అని! కానీ శ్రమల ద్వారా యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలిసింది. నా విమోచకుడు సజీవుడు అని తనను తానూ దేవునికి అప్పగించుకున్నాడు. తద్వారా రెండింతలు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. 

1 పేతురు 4: "19. కాబట్టి దేవుని చిత్తప్ర కారము బాధపడు వారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను." 

పేతురు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో ఏమని రాస్తున్నారు చూడండి. దేవుని చిత్త ప్రకారం భాదపడు వారు మంచి ప్రవర్తన వదిలి పెట్టకుండా, నమ్మకమైన సృష్టి కర్తకు, అనగా దేవునికి తమ  ఆత్మలు అప్పగించు కోవాలని. ఈ విశ్వాసం నిజమయిన దేవుని వాగ్దనాలను నమ్ముట ద్వారా, నిత్యమూ ఆయనతో ఉండే సన్నిహిత సాంగత్యమును బట్టి వస్తుంది. అబ్రాహాము దేవుని చేత స్నేహితుడని ఎలా పిలువ బడ్డాడు? దేవుణ్ణి నమ్ముట ద్వారా. 

సహోదరి, సహోదరుడా! క్రీస్తు సిలువలో పలికిన ఈ ఆఖరి మాట ద్వారా, మనకు నేర్పుతున్న విశ్వాసం, తగ్గింపు, శ్రమలలో మనలను మనం ఆయనకు అప్పగించుకోనే ప్రయత్నం చేస్తున్నారా? ఒక వేళ చేయక పోతుంటే, ఈ రోజు నుండయినా చేద్దామా? తండ్రిని  కూడా విశ్వాసించక పొతే, మరిం  ఇంకేవరిని విశ్వసిస్తాం చెప్పండి! 

దేవుని చిత్తమయితే ఈస్టర్ సందేశమును ధ్యానించుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్!! 

2 కామెంట్‌లు: