ఇది వరకు మనం దేవుని సంఘములో ఉండటం మన ఆత్మీయతకు మేలు చేస్తుందని తెలుసుకున్నాం కదా! అయితే కొన్ని సార్లు ఆ సంఘమే మనలను శోదించటం ద్వారా మన ఆత్మీయతకు భంగం కలింగించే అవకాశం ఉంది. కారణాలు ఏమయినప్పటికి, కొన్ని సార్లు మన సాటి సహోదరి, సహోదరులు మనలను కించపరచటం ద్వారానో లేక కనీస గౌరవం ఇవ్వక పోవటం ద్వారానో మనలను శోధించే అవకాశం ఉంది. ఈ శోధనలను బట్టి మనం భాధపడటమో లేదా తిరిగి వారిని భాదపెట్టటమో చేస్తాము. తద్వారా క్రీస్తు ప్రేమను చూపించని వారిగా మిగిలిపోతాము. అందునుబట్టి మన ఆత్మీయ పరుగు కుంటుపడుతుంది. ఇటువంటి సమయంలో మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా చెపుతుంది.
మనం దేవుని వారము అని సంపూర్ణముగా నమ్మినప్పుడు, మనలను కావాలని బాధపెట్టే వారికి దేవుడు వారి తప్పును గుర్తు చేయకుండా ఉంటాడా? తగిన రీతిలో వారికి పాఠం నేర్పకుండా ఉంటాడా? తండ్రి అయినా దేవుని చేతికింద దీనులుగా ఉండుట ద్వారా అయన కృపకు పాత్రులుగా ఉంటాము. అయన మన గురించి చింతిస్తున్నాడు, కనుక మనం చింతపడనవసరం లేదు. తగిన స్థానం, గౌరవం ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. నిన్ను ప్రేమించక పోవటం, నిన్ను గౌరవించక పోవటం ఎదుటి వారి ఆత్మీయతలో లోపం! కానీ వారిని ద్వేషిస్తూ, వారి వలే నువ్వు కూడా ప్రవర్తిస్తే అది నీ ఆత్మీయ లోపంగా పరిగణింపబడుతుంది. అటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడని భ్రమ పడవద్దు. బలిపీఠం వద్దకు వచ్చే ముందు, ప్రతి ఒక్కరితో సమాధానపడుమని దేవుని వాక్యం సెలవిస్తోంది (మత్తయి 5:23). లేదంటే మన ప్రార్థనలు గాలికి కొట్టుకు పోయే పొట్టువంటివి గానే మిగిలిపోతాయి.
కొన్నిసార్లు మన తోటి వారు మాట్లాడే లోక విషయాలు మనలను శోదించేలాగున ఉండవచ్చు. వారి సంభాషణలలో పాలుపంచుకోవాలని, ఆ విషయాల మీద జ్ఞానం పెంచుకోవాలని తాపత్రయపడి తిరిగి వదలి వేసిన వాటి జోలికి వెళ్ళి మన ఆత్మీయ స్థితికి చేటు చేసుకోకూడదు. ఇటువంటి లోక విషయాలు వ్యర్థమయినవిగా దేవుని వాక్యం సెలవిస్తోంది. మన మనసు నిత్యమూ పైనున్న వాటి మీదనే గాని, భూసంబంధమయిన వాటి మీద ఉండరాదని పౌలు గారు కొలొస్సయులకు రాసిన పత్రికలో పరిశుద్దాత్మ ప్రేరణ ద్వారా రాస్తున్నాడు (కొలొస్సయులకు 3:2). అందరితో పాటు కలిసి పోకపోతే ఏలా? మరీ ఎటువంటి లోక జ్ఞానం లేకుంటే ఎలా? అనుకోవద్దు. మన దైనందిన జీవితానికి కావలసిన, రాజకీయ, ఆర్థిక విషయాలు తెలుసుకోవద్దు అని చెప్పటం లేదు కానీ, అనవసర విషయాలపై అవగాహనా అనవసరం.
ఆ విషయాలు మనలను శోధించగలవు మరియు మన మనసులను ఆక్రమించి దేవునికి కొంత కాలమయినా మనలను దూరం చేయగలవు. కొంతమంది సహోదరి సహోదరులు తోటి వారితో సరదాగా మాట్లాడాలని తాపత్రయపడుతూ, శోదించబడుతూ తోటి వారిని కూడా శోధిస్తారు. ఇటువంటి వారితో అతి సన్నిహిత్యం కొనసాగిస్తూ, అటువంటి మాటలకూ అలవాటుపడి పూర్వ స్వభావమును తిరిగి పొందుకోవద్దు. సరదాగా మాట్లాడుకోవటం తప్పు కాదు, కానీ అదేపనిగా, ఒకరినొకరు కించపరచుకోవటం, లేక వంగ్యంగా మాట్లాడుకోవటం మన ఆత్మీయ స్థితికి ఎంత మాత్రము మేలు చేయదు.
క్రీస్తు ఏనాడయినా, ఎవరితోనయినా ఇటువంటి ఛలోక్తులు వేసినట్టు బైబిల్ లో రాయబడిందా? హద్దులో లేని ఛలోక్తులు ఎదుటి వారిని శోధిస్తాయి మరియు విస్తారమయిన మాటలు ఎన్నో దోషములు కలిగి ఉంటాయి. సహోదరుల మధ్య నిత్యము ప్రేమ కలిగి ఉంటూ తప్పులు మన్నించాలి మరియు సణుగుకొనకుండా ఒకరినొకరు ఆతిథ్యము చేయుమని దేవుని వాక్యం సెలవిస్తోంది (1 పేతురు 4:8-9). అయితే ఇటువంటి సాటి వారిని సాకుగా తీసుకోని అటువంటి సంభాషణల్లో పాల్గొని, ఎదుటి వారిని శోదిస్తూ లేదా విస్తారముగా దోషములు మాట్లాడుతూ ఆత్మీయతలో వెనుకపడవద్దు. ఒక్క విషపు చుక్క కడివెడు పాలను ప్రాణాంతకం చేసినట్లు, మన అల్లరితో కూడిన మాటలు, దోషములు కలిగి ఉంటూ మనలో అత్మీయతను కలుషితం చేయకుండా మానవు.
కొంతమంది సహోదరి, సహోదరులు తాము దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మానేసి, ఇచ్చే వారిని కూడా శోధిస్తూ మాట్లాడుతారు. వారు అన్యులతో కలవటమే కాకుండా, సాటి వారిని కూడా వారితో పాటు లాగాలని ప్రయత్నం చేస్తారు. ఒక వేళ తిరస్కరిస్తే, రకరకాలుగా విశ్వాసులయిన వారిని తృణీకరించటమో, లేదా "గొప్ప భక్తిపరులు, అంత విశ్వాసులు, ఇంత విశ్వాసులు" అని హేళనగా మాట్లాడుతూ రెచ్చగొట్టాలని చూస్తుంటారు. "పాపముతో మీకు ఉన్న సంబంధం, అన్యజనుల ఇష్టము నెరవేర్చటానికి గతించిన కాలమే చాలును, మీరు వారి పాప కార్యములలో పాలిభాగస్తులు కానందుకు ఆశ్చర్యపడుచు, మిమల్ని దూషించుదురు" అని పేతురు గారు పరిశుద్దాత్మ ప్రేరణతో రాశారు (1 పేతురు 4: 3-4). కనుక ఎవరో తిరస్కరిస్తారని, మరెవరో హేళన చేస్తారని మన విశ్వాసమును తగ్గించుకుని, దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించుకోవద్దు.
మరియు కొన్ని సార్లు ఇతరులు మనలను పొగుడుతున్నారని, మనం గొప్ప ఆత్మీయ వరములు కలిగిన వారమని అన్నప్పుడు విని వదిలేయటమే ఉత్తమం. వారి మాటలను బట్టి అతిశయ పడుతూ గర్వ పడటం మన ఆత్మీయతకు మేలు చేయదు. గర్వం పొంచి ఉండి మనలను సాతానుకు దగ్గరగా చేస్తుంది. ఇతరుల అభిప్రాయములు మనకు విలువలేనివిగా ఉండాలి. వారు మన గురించి మంచి చెప్పిన, చెడు చెప్పిన దేవునికి స్తోత్రం అనుకుని మన ఆత్మీయ పరుగులో కొనసాగాలి. "నా నామమును బట్టి దూషించబడువారు ధన్యులు" అని యేసయ్య చెప్పాడు కదా! "మీరేమి చేసినను మనుష్యుల కొరకు కాకుండా, దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేయుమని" దేవుని వాక్యం సెలవిస్తోంది (కొలొస్సయులకు 3:24).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి