పేజీలు

26, ఆగస్టు 2022, శుక్రవారం

కష్టపడకూడదని కష్టాలు తెచ్చుకుంటావా?


దేవుడు మనకు ఇచ్చిన విశ్వాసమును బట్టి ఆయనలో కొనసాగుతున్నాము. అయితే మన విశ్వాసము మరింతగా బలపడులాగున దేవుడు మన జీవితాలలో వివిధ రకాలయిన పరిస్థితులగుండా నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే, ఫలానా దేవుణ్ణి నమ్ముకుంటే ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది, అని తెలిస్తే ప్రతి ఒక్కరు ఆ దేవుణ్ణే నమ్ముకుంటారు. మన దేవునికి కావలసింది అటువంటి విశ్వాసులు కాదు. మనస్ఫూర్తిగా ఆయనను నమ్ము కొనే, ఏమి ఆశించకుండా ఆయనను ప్రేమించేవారు కావాలి. కనుకనే తన అనుకున్న వాళ్ళను విశ్వాసంలో బలపరుస్తాడు. మనం కోరుకున్న కొన్ని ఆశీర్వాదాలు మనకు ఇవ్వకుండా ఆపివేస్తాడు. 

ఇది ఎటువంటిదంటే! ఒక హాస్టల్ వార్డెన్ ఉందనుకుందాం. హాస్టల్ లో పిల్లలందరికి ఐస్ క్రీమ్  ఇస్తున్నారు, కానీ తన కుమారుని దగ్గరికి వచ్చేసరికి ఇవ్వద్దు అని చెప్పింది. ఆ బిడ్డ కోపంగా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత తన ఆఫీస్ రూమ్ కు పిలుచుకొని, పోయిన వారం తనకు జలుబు చేసి వచ్చిన జ్వరం గుర్తుచేసి తానూ ఎంతగా భాదపడ్డాడో వివరించింది. బిడ్డకు ఇష్టమయిన మిరపకాయ బజ్జిలు హోటల్ నుండి తెప్పించి, ప్రేమతో తినిపించింది. కుమారుని ఇష్టం ఐస్ క్రీమ్ తినాలని, కానీ తల్లి భయం బిడ్డ ఎక్కడ మళ్ళి జబ్బుపడి నరకయాతన పడుతాడో అని. అందుకే  కుమారుని ఇష్టం కాదని, మరో విధముగా తృప్తి పరచింది. 

దేవుడు మన పట్ల కూడా అటువంటి ఆతురతను కలిగి ఉన్నాడు. మనం ఆత్మీయకంగా జబ్బుపడకూడదని, మనం ఆయనకు దూరంగా వెళ్ళకూడదని, కొన్ని మనకు దూరంగా ఉంచుతున్నాడు. మనం లోకంలో ఎంతగా సంపాదించిన చివరకు మిగిలేది, మనం తీసుకోని పోయేది ఏది లేదు. కానీ అన్నింటి కంటే ముఖ్యమయిన మన రక్షణను కోల్పోతే ఏమిటి లాభం (మత్తయి 16: 26)   అని యేసయ్య చెప్పిన మాటలు గుర్తున్నాయా? అయితే ఈ లోక ఆశలు మనలను విశ్వాసంలో బలహీన పరచి, దేవునికి మన పట్ల లేని ఉద్దేశ్యాలు నెరవేర్చుకోవాలని మనలను ప్రేరేపిస్తూ మన ఆత్మీయతను దెబ్బ తీస్తాయి. తద్వారా ఎవరిని ఎప్పుడు మింగుదునా అని  గర్జించు సింహం వలె తిరుగుతున్నా సాతాను కు చిక్కి , దేవునికి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది. 

బైబిల్ లో ఎంతో ప్రాముఖ్యమయిన తప్పిపోయిన కుమారుడి ఉపమానము గుర్తుందా? (లూకా 15:11-32) తండ్రి దగ్గర పని చేసుకుంటూ, వేళకు భోజనం చేయటం అతనికి నచ్చలేదు. ఇంకా ఎదో సాధించాలి, ఎన్నో అనుభవించాలి అనుకున్నాడు. తండ్రికి విరుద్ధముగా దూర దేశం ప్రయాణించి, ఇష్టానికి జీవించి, చివరకు ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేక పోయాడు. అభివృద్ధిని ఆశించటం తప్పు అని చెప్పటం ఉద్దేశ్యం కాదు, కానీ అభివృద్ధి కోసమని దేవునికి ఇష్టం లేని కార్యములు చేయటం, కుటుంబానికి చేటు చేస్తుంది. దేవుని నీతి తర తరములు ఉన్నట్లుగానే, అయన కోపం కూడా మూడు నాలుగు తరములు ఉంటుంది (నిర్గమకాండము 20:5)

మీరు అనుకున్నట్లుగానే అభివృద్ధి జరుగుతూ మీకు ధనము వచ్చి పడుతుండవచ్చు, కానీ ఆ ధనము మూలముగా మీరు దేవునికి దూరం అవుతున్నారా? మొక్కుబడిగా ప్రార్థించటం మొదలు పెట్టారా? ఎదుటి వారిని చులకనగా   చూస్తున్నారా? "నా ప్రాణమా తినుము, తాగుము మరియు  సుఖించుము" అని మిమల్ని మీరు ప్రలోభ పెట్టుకుంటున్నారా? (లూకా 12:16-21) ధనము దేవునికి వ్యతిరేకమయినది. అది మనలో గర్వం పెంచుతుంది, మనలో తగ్గింపును తగ్గిస్తుంది. కనుకనే దేవుడు మనకు కష్టాలు అనుమతించి, మనకు గర్వం దూరం చేసి, తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు. అలాగని, మన అవసరాలు తీర్చకుండా ఉంటాడా? తప్పిపోయిన కుమారుడు, తండ్రి దగ్గర తిండి లేక వెళ్ళిపోలేదు, మరేదో కావాలని, అన్ని అనుభవించాలని దురాశతో వెళ్ళిపోయాడు. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలనుకుంటున్నామా? 

కుష్టు నయం చేసుకున్న నయమాను, ఎలీషాకు లోబడి కానుకలు ఇస్తుంటే, "అందులో ఒక్కటి కూడా  నాకు అవసరంలేదని" తిప్పి పంపాడు. కానీ అయన సేవకుడయినా  గేహజీ మాత్రం, ఎలీషాపై మనసులో నొచ్చుకొని, నయమాను రథం వెంబడి పరుగు పెట్టి, అబద్దం ఆడి, నయమాను నుండి వెండిని, మరియు విలువయిన వస్త్రములు గైకొన్నాడు కదా (2 రాజులు 5:20-27). ఇక్కడ గేహజీ తినటానికి లేక ఆశపడలేదు, కానీ ఇంకా సుఖముగా జీవించాలని, తన పిల్లలు అసలు ఏ కష్టాలు పడకూడదని, దేవునికి విరుద్ధముగా ప్రవర్తించి, తన తర తరములను  కుష్టుకు బలి చేసాడు. కష్టాలు వద్దనుకుని మరి ఎక్కువ కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అతనే కనుక దేవునికి అనుకూలముగా ఉంటె, ఏలీయా తర్వాత ఎలీషా వలే నాలుగింతల ఆశీర్వాదం పొందుకొని దేవుని ప్రవక్త వలే కొనసాగే వాడేమో కదా? 

1 పేతురు 3: " 17. దేవుని చిత్త మాలాగున్నయెడల కీడుచేసి శ్రమపడుటకంటె మేలుచేసి శ్రమపడుటయే బహు మంచిది."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! పేతురు గారు తన మొదటి పత్రికలో ఏమని రాస్తున్నారో చూడండి! దేవుని చిత్తానుసారముగా మనము కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే మేలు!  అది ఎంతో మంచిది. ఇక్కడ గేహజీ శ్రమలు పడకూడదని దేవుని దృష్టిలో కీడు చేసి అంతకన్నా ఎక్కువ శ్రమలు తెచ్చుకున్నాడు, తనకు తన కుటుంబానికి తగరగని నష్టం చేశాడు. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా దేవుడు మనలను కష్టాల గుండా నడిపిస్తూ, మన విశ్వాసమును, బంగారము వలె శుద్ధి చేస్తున్నాడు (1 పేతురు 1:7). ఈ శ్రమల కొలిమిలో మనలో ఆత్మీయ మాలిన్యం సాంతం తొలగిపోయి, శుద్ధమయిన వారిగా మారుతున్నాము. తద్వారా మన రక్షకుడయినా క్రీస్తు ప్రత్యక్ష మయినపుడు, అయన మెప్పుకు, ఘనతకు మరియు మహిమకు  పాత్రులుగా మారుతున్నాము. 

కష్టాలు కొని తెచ్చుకోమని చెప్పటం లేదు. వాటికి ఎదురు వెళ్ళి ఇది దేవుని చిత్తమని చెప్పమనటం లేదు. కానీ శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడి, దేవుడు మనలను విరిగి నలిగిన వారిగా మార్చాలనుకున్నపుడు అయన చిత్తము నుండి తొలగిపోయి, మన విశ్వాస పరిమళాలు బయటకు రాకుండా కఠినులుగా ఉండిపోవద్దు. ఆనాడు మరియ చేతిలో అత్తరు బుడ్డి పగిలిన తర్వాతనే కదా ఆ గదిలో పరిమళం నిండుకుంది (యోహాను 12:3). మన విశ్వాస పూరితమయిన, విరిగి నలిగిన హృదయపు ప్రార్థనలు కూడా దేవునికి ఇష్టమయిన పరిమళము. వాటిని వద్దనుకుని, దేవునికి ఇష్టంలేని వారిగా, మిగిలి పోతామా? (2 కొరింథీయులకు 2:15, ఎఫెసీయులకు 5:1-2)

దేవుని చిత్తమయితే మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకూ దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి