పేజీలు

17, సెప్టెంబర్ 2022, శనివారం

యేసయ్య తో శిష్యరికము!


మనలో చాల మంది, యేసు క్రీస్తు మీద విశ్వాసము కనపరచవచ్చు, ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించే వారు కూడా ఎంతో మంది ఉండవచ్చు. కానీ అయన మీద విశ్వాసము మరియు రక్షకునిగా ఆయనను అంగికరించటం మాత్రమే క్రైస్తవ జీవితం కాదు. సంపూర్ణముగా ఆయనకు శిష్యులుగా మారిపోవాలి. అనగా మనలను మనం ఉపేక్షించుకోవాలి, అయన కన్న, అయన కార్యము కన్న మనకు ఏది కూడా ఎక్కువ కాకూడదు. అన్నింటిలో ఆయనకు సంపూర్ణముగా ప్రథమస్థానం ఇవ్వవలసిందే. 

లూకా 14: "26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27.  మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు."

ఈ వచనము సరిగా అర్థం చేసుకోలేని కొంతమంది, అన్యులు మరియు విశ్వాసులు సైతం క్రీస్తును స్వార్థపరుడిగా మరియు, తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేయుమన్న వ్యక్తిగా అపార్థం చేసుకుంటారు. ఇక్కడ యేసయ్య చెపుతున్న మాటలు, అయన బోధనలకు అధిక ప్రాముఖ్యత ఇస్తూ, వాటిని పాటించాలని చెపుతున్నారు. దేవుని బలిదాన నియమం ప్రకారం దైవ కుమారుడయినా క్రీస్తు మానవాళి కోసం సిలువలో మరణించి, లేచి వారికి నరకాగ్నిని తప్పించాలని భూమి మీద శరీర దారిగా జన్మించాడు. మన శరీరంలో ఉద్బవించే పాపమును బట్టి మనం నరకాగ్నికి కాకుండా తనతో నిత్య జీవితం పొందటానికి పాటించవలసిన నియమాలు అన్నియు  అయన బోధించాడు. ప్రతి వారు, వారి పాపమును బట్టి, క్రీస్తును అంగీకరించిన విధానము బట్టి తీర్పు పొందుకుంటారు. కానీ వారి తల్లి, తండ్రి మంచితనము బట్టి ఎవరు కూడా పాప శిక్షను తప్పించుకోలేరు. 

కనుకనే క్రీస్తు ప్రతి ఒక్కరు తమ రక్షణ నిమిత్తం అయనను వెంబడించాలని అనగా అయన బోధలు పాటించాలని సూచిస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులను బట్టి, వారికి ఉన్న అభ్యంతరాలను బట్టి ఆయనను త్రోసి పుచ్చి రక్షణ కోల్పోవద్దని యేసయ్య మనలను హెచ్చరిస్తున్నాడు. తమ ప్రాణమును లెక్క చేయని వారు అయన శిష్యులనబడుతారు అంటున్నాడు యేసయ్య! ప్రాణమును ఎందుకు లెక్క చేయకూడదు? మన శరీరము పాపమునకు నిలయముగా ఉన్నది. మనలను శోధిస్తూ, అన్ని రకాల కోరికలను మనకు కలిగిస్తుంది. మనలను మనం ఎక్కువగా, ప్రేమించుకుంటే లేదా శరీరమును లొంగదీయకుంటే పాపములో పడిపోయి క్రీస్తు బోధనలు నిర్లక్యం చేసే స్థితికి వెళ్ళిపోతాము. 

అదే విధముగా "తమ సిలువను మోసుకుంటూ ఆయనను వెంబడించని వారు అయన శిష్యులుగా చెప్పబడ లేరు" అంటున్నాడు యేసయ్య. సిలువ, తగ్గింపుకు సాదృశ్యముగా ఉన్నది. అనగా ఎవరు తమను తాము తగ్గించుకొంటూ, గర్వపడకుండా, అతిశయపడకుండా మరియు ఇతరులను ద్వేషించకుండా జీవించాలన్న తపన కలిగి ఉంటారో, వారే అయన నిజమయిన శిష్యులు అని యేసుక్రీస్తుల వారు ఈ మాటలు చెపుతున్నారు. వీటిని పాటించగలము లేదా ఆ విధముగా జీవించాలన్న తపన కలిగిన వారు మాత్రమే ఆయనను అంగీకరించాలని క్రీస్తు సెలవిస్తున్నారు. లేదంటే ఆయనకు ఇష్టం లేని వేషధారులుగా లేదా నులివెచ్చని స్థితిగల వారిగా మిగిలిపోతాము.  

క్రీస్తును ద్వేషిస్తూ, క్రైస్తవులను హింసిస్తూ తిరిగిన సౌలు అనబడే పౌలు గా మారిన వ్యక్తిని గురించి మనం ఎరిగి ఉన్నాము కదా? ఈ సౌలు తన యూదా మతమందు నియమనిష్టలు కలిగి, మతపరమయిన గర్వంతో ఉండేవాడు. ఇతని అంగీకారంతో స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అటువంటి సౌలు, ఒక్కసారి క్రీస్తు దర్శనం పొందుకున్న తర్వాత వెనుకకు తిరిగి చూడలేదు. క్రీస్తును గూర్చిన సువార్త సేవ చేస్తూ, తనను తానూ తగ్గించుకొని, అల్పుడిగా ఎంచుకొని, పౌలు అని పేరు మార్చుకున్నాడు. ఎన్ని రకాల కష్టాలు ఎదురయినా, యేసు క్రీస్తు దేవుడనే సత్యమును బోధించటం ఆపలేదు. 

అటువంటి పౌలుకు అనారోగ్యం ఉంటే, దేవుడు ఆయనను స్వస్థ పరచలేదు (2 కొరింథీయులకు 12:8-9), దానిని బట్టి కూడా పౌలు గారు సంతృప్తిని వ్యక్తం చేశారు తప్ప ఎక్కడ కూడా సణుగుకొలేదు, విసుగు పడలేదు. మరియు అగబు అను ప్రవక్త యెరూషలేము లోని యూదులు తనను చంపటానికి ఆయనను అన్యులకు అప్పగిస్తారని ప్రవచనము చెప్పినప్పుడు అక్కడ ఉన్న అందరు పౌలును యెరూషలేముకు వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. అప్పుడు "ప్రభువు నామము నిమిత్తము బంధింపబడుటకు మాత్రమే కాదు చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని" చెప్పారు పౌలు గారు (అపొ. కార్యములు 21:13). అటువంటి మారుమనస్సు, సంతృప్తి, దేవుని కోసం తెగింపు మనలో ఉన్నాయా? 

యేసయ్య చెప్పే భవిష్యత్తు ప్రవచనాలు పూర్తిగా అర్థం కాకపోయినా కూడా ఆయనను  క్రీస్తుగా విశ్వసించినా శిష్యులను చూసి మనం ఏమి నేర్చుకోవాలి? యేసయ్య "నా శరీరము తినకుండా, రక్తము తాగకుండా మీకు రక్షణ లేదు" అని చెప్పగానే, అప్పటి వరకు అద్భుతాలు చూసి, అయన పెట్టిన రొట్టెలు తిని, స్వస్థతలు పొందుకొన్న జనం ఒక్కసారిగా, ఆయనను వెంబడించటం మాని వేశారు. కానీ అయన శిష్యులు మాత్రం ఆయనతోనే ఉన్నారు. ఆయనే దైవకుమారుడు, తమను కాపాడటానికి వచ్చిన క్రీస్తు అని నమ్మారు (యోహాను 6:66). కానీ మనం, పది మందిలో క్రీస్తు విశ్వాసులము అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతాము? అసలు మనం సిగ్గు ఎందుకు పడుతామో తెలుసా? సాతానుకు తెలుసు మనం క్రీస్తును జనం ముందు అంగీకరించకుంటే, క్రీస్తు తండ్రి ముందు మనలను అంగీకరించాడని, అందుకే మనం క్రీస్తును అంగీకరించకుండా, మనలో సిగ్గును రేపుతాడు. 

పేతురు అంగీకరించక పోయిన యేసయ్య క్షమించాడు కదా! అనుకోవద్దు. అప్పుడు వారికి పరిశుద్దాత్మ ఇవ్వబడలేదు, మరియు యేసయ్య, పేతురు యొక్క ఆత్మీయ గర్వమును తీసివేయటానికి, ఆ శోధనను అయన మీదికి  అనుమతించాడు. అందును బట్టి పేతురు గారు, తన ఆత్మీయ గర్వం తొలగించుకొని, దేవుని శక్తి మీద ఆధారపడి, ఎంతగానో సువార్త సేవలో వాడబడ్డారు. అందును బట్టి  తన శరీరంలో జీవించినంత కాలం, ఆఖరి సమయము వరకు సాటి వారిని ప్రేరేపిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చారు పేతురు గారు (2 పేతురు 1:13). అటువంటి వారే మిగిలిన శిష్యులు కూడా. తమ ప్రాణముల కంటే, యేసు క్రీస్తు సజీవుడు, నిజమయిన రక్షకుడు అని చెప్పటమే, దేవుని చిత్తము అని నమ్మి, హత సాక్ష్యులుగా మిగిలి పోయారు. 

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! దేవుని కోసం హత సాక్షిగా మార్చబడటం కన్న అదృష్టం ఏముంటుంది? అటువంటి పరిస్థితి వస్తే, దేవుడే మనకు తగిన కృపను, విశ్వాసమును అనుగ్రహిస్తాడు. కానీ ఏనాటికి కూడా డబ్బు సంచిని ఆశించి యేసయ్యను వెంబడించిన యూదా మాదిరి శిష్యులుగా మనం మారకూడదు. యేసయ్య రాత్రంతా ప్రార్థించి, పన్నెండు మందిని శిష్యులుగా ఎన్నుకున్నాడు (లూకా 6:12). అందులో యూదా కూడా ఒక్కడు. కానీ అతను స్వార్థంతో దేవుడు ఇచ్చిన ధన్యతను పోగొట్టుకున్నాడు. ధనం మీద వ్యామోహముతో, చివరకు క్రీస్తును అప్పగించాడు. 

అంతే కాకుండా చేసిన పాపమును బట్టి, దేవుని వద్ద పశ్చాత్తాప పడకుండా, సాతాను ప్రేరణను బట్టి, తనను తానూ నిందించుకొని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు, చివరకు సాతాను చెరలోకి వెళ్ళి పోయాడు. నీ పాపం నిన్ను వెక్కిరిస్తోందా? బలహీనమయిన ఆ క్షణాలు నిన్ను బాధిస్తున్నాయా? నిజమయిన క్రీస్తు శిష్యుడి లక్షణం, పశ్చాత్తాప పడటం! దేవుని క్షమాపణ పొందుకొని, అయన శక్తి చేత దాని నుండి విడుదల పొందుకోవటం. తిరిగి వాటి వైపు కన్నెత్తి కూడా చూడక పోవటం. అది లేదు, ఇది లేదు అని సణుగకుండా దేవుని చిత్తమును అంగికరించి, నిత్యము ఆయనలో ఆనందించటము. నిన్ను చూసి, నలుగురు క్రీస్తు శిష్యులుగా మారాలి, నీ జీవితమే ఒక సువార్త కావాలి. అటువైపు అడుగులు వేయు, నడపటానికి నిన్ను ఎన్నుకున్న ఆయనే ఉన్నాడు!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి