పేజీలు

4, డిసెంబర్ 2022, ఆదివారం

పక్కవారితో ఉండే ప్రమాదము!


క్రీస్తు విశ్వాసులుగా మారిన తర్వాత, ప్రతి రోజు మన విశ్వాసమును మెరుగు పరుచుకుంటూ ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి. ఈ క్రమములో మనకు సాతాను ద్వారా ఎన్నో రకముల శోధనలు కలిగే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యమయినది, పక్క వారితో స్నేహము. వీరు అన్యులు కావలసిన అవసరం లేదు. వీరు కూడా క్రైస్తవులుగా చెలామణి అవుతుంటారు, కానీ వీరి ఆత్మీయ జీవితం మనలను శోదించేదిగా ఉంటుంది. లోకపు అలవాట్లు పాటిస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ మనలను కూడా అటువైపు లాగే వారిగా ఉంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యముగా కొత్తగా విశ్వాసములోకి వస్తున్న కుటుంబము లేదా వ్యక్తి  వీరికి దూరముగా ఉండకపోతే  తిరిగి లోకములోకి జారిపోయే అవకాశం ఉంది. 

2 థెస్సలొనీకయులకు 3: "6. సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము."

అపొస్తలుడయినా పౌలు గారు థెస్సలొనీయ సంఘమునకు రాసిన రెండవ పత్రికలో ఈ వచనము ఏమని చెపుతుంది చూడండి. దేవుని వాక్యము చెప్పినట్లు కాకుండా అనగా క్రమముగా జీవించకుండా, ఇష్టాను సారముగా  అనగా లోక రీతిగా ప్రవర్తించే సహోదరుని నుండి దూరముగా వెళ్లిపోవాలని చెపుతుంది. వీరు మాటకు ముందు, వెనుక దేవునికి స్తోత్రం అని చెపుతారు, సంఘములో  గొప్పగా ప్రార్థిస్తారు. కానీ దేవుని వాక్యమును ఎంత మాత్రము పాటించారు. రోడ్డు మీదికి రాగానే చెడ్డ మాటలు మాట్లాడుతారు. మరియు ఇతరుల గురించి అదే పనిగా గుసగుసలాడుతారు. 

ఇటువంటి వారిని బట్టి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతె మనం కూడా వారిలాగే మారిపోయి, అదే  క్రైస్తవ విశ్వాసం అనుకుని వెనుకపడే అవకాశం ఉంది. క్రీస్తు విశ్వాసులుగా మనము నూతన సృష్టిగా చేయబడాలి,  నిత్యమూ శరీరనుసారము కాకుండా దేవుని  వాక్యానుసారముగా జీవించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నములో ఇటువంటి శరీరనుసారముగా జీవించే వారితో సాంగత్యము మనలను కూడా శోధించే అవకాశం ఉంది. తద్వారా మన ఆత్మీయ పరుగులో వెనుక పడిపోతాము. కనుక అట్టి వారిని నుండి దూరముగా తొలగిపొండి. 

1 కొరింథీయులకు 5: "11. ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్ర హారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను."

కొరింథీ సంఘమునకు పౌలు గారు రాసిన మొదటి పత్రికలో, ఇతరుల మీద వ్యామోహం అనగా  సినిమా తారలు లేదా ఇతర స్త్రీ, పురుషుల మీద వ్యామోహం ఉన్నవాడు,  డబ్బు మీద వ్యామోహం కలవాడు, విగ్రహారాధకుడు అనగా దేవుని కంటే ఇతరమయిన  విషయాలను ఎక్కువగా ప్రేమించే వాడు, ఇతరులను దుర్భాషలాడు వాడు, త్రాగుబోతు, ఇతరులను  మోసం చేసేవాడు  సహోదరుడయినను అనగా సాటి విశ్వాసి అయినా కూడా అట్టి వారి నుండి దూరముగా తొలగి పోవటమే కాకుండా, కలిసి భోజనము కూడా  చేయరాదని దేవుని వాక్యము చెపుతుంది. వీరి  ప్రవర్తన మనలను శోధించి మన ఆత్మీయతను  బలహీన పరుస్తుంది. 

మనలో చాల మంది ఎదుటి వారిని మార్చాలి, లేదా వారిని ఉద్దరించాలి అన్న ఆత్రము కలిగి  ఉంటారు. ముఖ్యముగా కొత్త విశ్వాసులు అటువంటి ఆలోచనలకూ దూరముగా ఉండాలి. వారిని గురించి  భారం ఉంటె ప్రార్థించండి, మరియు సంఘ పెద్దలకు చెప్పి ప్రేమ పూర్వకముగా గద్దించండి. వారు క్రీస్తుతో పూర్తిగా అనుసంధానం  చేయబడని వారుగా ఉన్నారు. కనుక వారితో వాదనకు దిగి మీ విశ్వాసమును ప్రశ్నార్థకం చేసుకోకండి. ఇలాంటి వారికి వాక్యము బహుగా తెలిసి ఉన్నట్లయితే, వారు వక్రీకరించే వాక్యమును బట్టి మీరు మోసపోయే అవకాశం ఉంది. కనుక వీరికి దూరముగా వెళ్లిపోవటమే మీ ఆత్మీయతకు క్షేమము. 

1 సమూయేలు: 2: "17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. 18.  బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను."

ఇక్కడ ఏలీ కుమారులు దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ ఇతర విశ్వాసులను శోదిస్తూ ఉన్నారు మరియు దేవుని ఆగ్రహమునకు కారణముగా మారారు. అదే స్థలములో సమూయేలు ఏలీ యొక్క శిష్యరికములో యాజకులు ధరించే ఏఫోదును ధరించి దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటీ? సమూయేలు ఏనాడూ కూడా ఏలీ కుమారులను హెచ్చరించాలని చూడలేదు, కనీసం ఏలీ కి ఫిర్యాదు కూడా చేయలేదు. దేవుని  మందిరములో పడుకొనే వాడు. తన కన్న పెద్దవారు, తన గురువు కుమారులు అయినా వారు ఎంత చెడ్డగా ప్రవర్తించిన కూడా సమూయేలు ప్రభావితం కాలేదు. 

కొన్ని సార్లయినా వారు సమూయేలు ను అతి భక్తి పరుడు అని లేదా మరో రకముగా హేళన చేసే ఉంటారు కదా! సమూయేలు వారి మాటలకూ, చేష్టలకు లొంగిపోలేదు, వారి చెడ్డ కార్యాలలో పాలు పంచుకోలేదు. నిత్యమూ దేవుని సన్నిధిలో గడుపుతూ, ఏలీ కి దేవుని పరిచర్యలో సహాయపడుతూ దేవునికి ఇష్టమయిన ప్రవక్తగా ఎదిగాడు. పక్కనున్న నులి వెచ్చని విశ్వాసులను చూసి, వారు బాగానే ఉన్నారు కదా, ఇది చేస్తే ఏమౌతుంది, ఈ ఒక్కసారికి పర్వాలేదు లే అనుకుని వారు చేసే అక్రమ కార్యములు, వాక్య విరుద్దమయిన పనులలో వారితో కూడి విశ్వాసంలో వెనుకపడొద్దు. అదే విధముగా ఎవరో కొందరు సంఘ పెద్దలు వాక్యమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారని, మీ కన్న పాత విశ్వాసులు క్రమము లేకుండా ఉన్నారని వారిని బట్టి ఆ స్థాయికి పడిపోవద్దు. మన మాదిరి మన రక్షకుడయినా క్రీస్తు మాత్రమే! 

మత్తయి 5: "13. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు."

ప్రియమయిన సహోదరి, సహోదరుడా! కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పిన ఈ మాటలు ఒక్కసారి చూడండి. మనము లోకమునకు ఉప్పుగా ఉన్నాము. ఉప్పు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది! ముఖ్యముగా ప్రతి వంటను రుచిగా మారుస్తుంది. మనం ఎవరికయినా పరిచయం అయితే వారి జీవితంలో మనం రుచిగా మారాలి, కానీ ఇబ్బందిగా ఉండకూడదు (సామెతలు 25:17).  అలాగే ఉప్పు పదార్దములు పాడు కాకుండా కూడా ఉపయోగపడుతుంది. మనలను బట్టి మన పక్కవారు మంచి విషయాలు నేర్చుకోవాలి, కానీ మనలను బట్టి చెడి పోకూడదు, లేదా శోధించ బడకూడదు. ఉప్పు వంటి లక్షణాలు మనకు అలవాడాలంటే, దేవుని వాక్యము పాటించటమే మార్గము. 

యేసయ్య తనను అనుసరించమని చెప్పాడు తప్ప తనను విశ్వసించినా వారిని కాదు. కనుక మన పక్కవారిని బట్టి, వారి సూటి పోటీ, హేళన కరమయిన మాటలను బట్టి దేవుని పై మీకు ఉన్న ప్రేమను  తగ్గించుకోకండి. మిమల్ని హేళన చేసిన  వారికి మీకంటే  ఎక్కువగా వాక్యం  తెలిసి ఉండవచ్చు. కానీ వారి ప్రవర్తన వాక్యాను సారం ఉందా? లేదంటే, వారి నుండి తొలగిపోవటమే మీ ఆత్మీయతకు క్షేమము. దేవుని ప్రేమ మన లో లేని  నాడు  క్రీస్తు విశ్వాసులైన మనలను అన్యులు సైతం అసహ్యించుకొని, క్రీస్తుకు దూరముగా, సువార్తకు వ్యతిరేకముగా మారిపోయే అవకాశం ఉంది. దేవుడు మనలను రక్షించుకున్నది, అయన ప్రేమను మనం లోకానికి  చూపటానికే కానీ,  లోకము పట్ల  అనగా లోక  రీతుల పట్ల మన ప్రేమను  చూపటానికి కాదు. అంతే కాకుండా దేవుడు నిన్ను లెక్క అడిగేది నీ జీవితమును బట్టి కానీ పక్కవారిని బట్టి కాదు కదా!

దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము! అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక! ఆమెన్ !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి