దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి, నిత్యమూ అయన మన పాపములను క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు అని ఎన్నో మారులు మనము నేర్చుకున్నాము. అయితే కొన్ని సార్లు దేవుడు తన చిత్తానుసారముగా మనుష్యులకు గుడ్డితనమును, అనగా మోసపుచ్చే ఆత్మను పంపిస్తాడు, ఆవిధముగా తమ రక్షణ విషయములో వారు తప్పి పోయి, తమ హృదయ వాంఛలను బట్టి వారి ఆత్మ తీర్పుకు లోనవుతుంది. పరిశుద్దాత్మ దేవుడు నిత్యమూ, క్రీస్తు స్వభావమునకు విరుద్దమయిన ప్రతి లక్షణమును మనలో నుండి తొలగించటానికి, లేదా మనం పాటించకుండా ఉండటానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మన శరీర ఆశలను బట్టి, లేదా దేవుని కృపను అలుసుగా తీసుకోవటాని బట్టి మనం ఉద్దేశ్య పూర్వకముగా పాపం చేస్తుంటే, దేవుడు మన హృదయములకు కాఠిన్యం ఆవరింప జేస్తాడు అని దేవుని వాక్యం చెపుతోంది.
కీర్తనలు 81: "11. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. 12. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని."
మన దేవుడు నిన్న, నేడు, రేపు ఏక రీతిగా ఉన్నాడు. తరములు మారిన కూడా అయన స్వభావము నిత్యమూ ఒకే రీతిగా ఉంటుంది. అయన ప్రేమ మరియు క్షమా గుణము ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి (హెబ్రీయులకు 13:8). ప్రస్తుతం క్రీస్తు మనకు అనుగ్రహించిన పరిశుద్దాత్మ దేవుడు ఎలాగయితే మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడో, ఆనాటి ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు మోషేను తోడుగా అనుగ్రహించాడు, తర్వాత ధర్మ శాస్త్రమును అటుపైన ప్రవక్తల ద్వారా వారిని నడిపించాలని చూశాడు. కానీ వారు దేవుని మాటను లెక్క చేయలేదు, కాబట్టి దేవుడు వారి హృదయాలకు కాఠిన్యం ఆవరింప చేశాడు. ఆవిధముగా వారు నశించి పోయి, దేవునికి వారి పట్ల ఉన్న ఉద్దేశ్యాలను కోల్పోయారు.
చాల మంది విశ్వాసులు జీవితం చాల చిన్నది, బ్రతికి ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి కదా, రసజ్ఞత లేని జీవితం నిరర్థకం అనే సూక్తులు పాటిస్తూ, లోకం నుండి వేరు కావటానికి ఇష్టపడరు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దీవెనకు నమ్మకత్వము చూపించాలి, ప్రతి బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వహించాలి. కలిగిన ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ విధముగా దేవుడు మనకు హృదయానందము అనుగ్రహిస్తాడు (ప్రసంగి 5:20). ఇతరులను బట్టి వ్యసన పడు వారికి తృప్తి కరువయి దేవునికి కృతజ్ఞత చెల్లించని స్థితిలోకి వెళ్ళి పోతారు.
ఇశ్రాయేలు వారు నిత్యమూ దేవుని మీద సణుగుకొంటూ, మోషేతో వాదనకు దిగి దేవుని ఆగ్రహానికి గురయినారు. దేవుడు వారు కోరుకున్నది అనుగ్రహించాడు కానీ వారి ప్రాణములకు క్షిణత కలుగ జేశాడు అని దేవుని వాక్యం చెపుతోంది (కీర్తనలు 106: 13-15). మనకు ఆశీర్వాదాలు కలుగుతున్నంత మాత్రాన మనం దేవుని నడిపింపులో ఉన్నాము అనుకోవటానికి లేదు. మన హృదయ వ్యసనమును బట్టి దేవుడు మనం కోరుకున్నది ఇస్తాడు, కానీ మన విషయంలో అయన ఉద్దేశ్యాలు నెరవేరటం లేదని మనం గ్రహించాలి. దేవుని ఉద్దేశ్యాలు మనలో నెరవేరని నాడు, మనం లోక రీతులను అనుసరిస్తూ, సర్వ శరీర క్రియలను జరిగిస్తున్నాము. అటువంటి వారి రక్షణ విషయములో దేవుడు మోసపుచ్చే ఆత్మను పంపిస్తాడు అని దేవుని వాక్యం చెపుతోంది (2 థెస్సలొనీకయులకు 2: 10-12).
2 దినవృత్తాంతములు 18: "22. యెహోవా నీ ప్రవక్తలగు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించి యున్నాడని చెప్పెను."
ఈ మాటలు దేవుని నిజమయిన ప్రవక్త అయినా మీకాయా, ఇశ్రాయేలు రాజయిన అహాబు, యూదా రాజయిన యెహోషాపాతుతో కలిసి శత్రువుల మీదకి యుద్దానికి సిద్దపడినప్పుడు, దేవుడు అతని అబద్ద ప్రవక్తల మీదికి మోసపుచ్చే ఆత్మను ప్రవేశపెట్టి, అతణ్ణి యుద్దానికి వెళ్ళే లాగా చేసి, అతను యుద్ధంలో చనిపోయేలా చేయబోతున్నాడని చెపుతున్న సందర్భం లోనివి. అహాబు రాజు దేవునికి ఎంతగానో విరుద్ధముగా ప్రవర్తించాడు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించిన కూడా, అన్య దేవతలను పూజించటం మానలేదు. అలాగే తన రాజ్యములో ప్రజలను విగ్రహారాధన చేసే విధముగా ప్రోత్సహించాడు, లేదంటే ప్రజలను హింసించాడు. అప్పుడు దేవుడు తన ప్రజలయిన ఇశ్రాయేలు జనమును కాపాడటానికి అతన్ని నశింప చేయాలనుకున్నాడు. అందుకు దేవుడు అతని ప్రవక్తల మీదికి, మోసపుచ్చే ఆత్మను పంపి, అతన్ని యుద్దానికి వెళ్ళేలాగా ప్రోత్సహింప జేశాడు.
అయితే దేవునికి నమ్మకముగా ఉన్న యూదా రాజు యెహోషాపాతు, నిజమయిన దేవుని ప్రవక్త అయినా మీకాయాను పిలిపించి దేవుని ప్రవచనం అడిగించమన్నప్పుడు, అహాబు రాజు యొక్క అధికారులు, మీకాయాను కూడా ఆ అబద్ధపు ప్రవక్తలు చెప్పిన మాటలనే చెప్పమన్నారు. అతను కూడా అలాగే చెప్పాడు. కానీ యెహోషాపాతు రెట్టించి ఆడినప్పుడు, అహాబు యుద్దములో చనిపోతాడు అని నిజం చెప్పాడు. అప్పుడు అహాబు రాజు ఆగ్రహం చెంది మీకాయాను బందించి యుద్దానికి వెళ్ళాడు, ఆ యుద్దములో, నిమిత్త మాత్రమూ చేత చనిపోయాడు.
ప్రియమయిన సహోదరి, సహోదరుడా! ఇక్కడ చెడ్డవాడయినా అహాబు రాజు దేవుడు ఎన్ని సార్లు హెచ్చరించిన కూడా దేవుని ప్రేమను అలుసుగా తీసుకున్నాడు. ఉద్దేశ్య పూర్వకముగా దేవుణ్ణి తృణీకరించాడు. పాపం చేసిన స్థితిలోకి దావీదు కూడా వెళ్ళాడు, కానీ వెంటనే పాపములు ఒప్పుకొని, దేవుని క్షమాపణ కోసం ఎంతగానో తపించాడు. కనుకనే దేవుడు దావీదును క్షమించాడు. కానీ అహాబు గర్వంగా ప్రవర్తించాడు, దేవుణ్ణి క్షమాపణ అడుగ లేదు. అంతే కాకుండా నిజం చెప్పాలనుకున్నా దేవుని నిజమయిన ప్రవక్త మీకాయాను తనకు నచ్చింది చెప్పమని బలవంతం చేశాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు అని నిరూపించటానికి యెహోషాపాతు రెట్టించి అడిగినప్పుడు, మీకాయా నిజం చెప్పిన కూడా అహాబు దేవుని వైపు తిరగలేదు సరికదా నిజం చెప్పిన మీకాయాను బంధించాడు.
మనం కూడా చాల సార్లు మనకు నచ్చిందే వినటానికి, నమ్మటానికి ఆసక్తిని చూపిస్తాము. ఎవరయినా కఠినమయినవి చెప్పినప్పుడు కోపం తెచ్చుకుంటాము. మన దేవుడు ప్రేమ కలిగిన వాడే, అనంతమయిన క్షమాపణ కలిగిన వాడే. కానీ మనము నిత్యమూ ఆత్మీయముగా ఎదగాలని ఎదురు చూస్తున్నాడు. తుచ్చమయిన ఆశలను వదిలి, శరీర క్రియలను విసర్జించి, ఆత్మ ఫలములు పొందాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుని ఉద్దేశ్యాలు అర్థం చేసుకోకుండా, ఉద్దేశ్య పూర్వకముగా పాపం లో పడిపోతూ, కేవలం నామమాత్రపు విశ్వాసముతో కొనసాగే వారిని దేవుడు మోసానికి అప్పగిస్తాడు. వారు తాము దేవునిలో ఉన్నాము అనుకుంటారు, కానీ సాతాను చేతిలో బందీలుగా కొనసాగుతారు.
కేవలము మన చెవులకు ఇంపైన మాటలు మాత్రమే వినకుండా, సంపూర్ణ సువార్తను వినటానికి ఆసక్తిని చూపించాలి (2 తిమోతి 4:3-4). ఆ సంపూర్ణ సువార్త కేవలము దేవుని ప్రేమను మాత్రమే భోదించదు కానీ పాపపు జీవితమును వదిలి మారు మనసు పొందుకోవటాన్ని కూడా బోధిస్తుంది. ప్రతి శ్రమలో, దీవెనలో దేవుని యందు ఆనందించటాన్ని, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాటాన్ని బోధిస్తుంది. బైబిల్ లో దేవుని ప్రేమను, క్షమా గుణమును అలుసుగా తీసుకోని, ఆయన ఉద్దేశ్యాలు తప్పి పోయి ఎంతో మంది నశించి పోయారు. వారి కంటే మన మేమి గొప్పవారం కాదు కదా?
దేవుని చిత్తమయితే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసు కుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉందును గాక! ఆమెన్ !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి